Monday, 21 March 2016

మన్మధ పూజ

మన్మధ పూజ 

మరునకు ధూప మాశుగ విమానికి దీపము సన్నివేదనం   
బురు సుమ ధన్వికిన్ పరిమళోదక పానము  భృంగి మౌర్వికిన్
 విరివి నివాళి నిస్సదృశ విక్రమశాలికి నిర్జితారికిన్
తరుణ సుమాంజలుల్ దగు ప్రదక్షిణముల్ ప్రణతుల్  నమస్కృతుల్

ఇది మన్మధునికి ఆచరించుచున్న పూజ. ఫాల్గుణ పౌర్ణమిని ‘హోలీ’ హోళీ’ యనియే కాక ‘కాముని పున్నమి’ అని కూడా అంటారు. నేను సమర్పించిన ఈ పూజా కుసుమమునకు భావము దిగువన తెలియబరచుచున్నాను.
మరునికి అనగా మన్మధునికి ధూపము సమర్పించుచున్నాను. ఆశుగవిమాని  అంటే ఆకాశము లో ఎగిరే వాహనము అనగా చిలుక ను  విమానముగా కలిగినవానికి దీపము సమర్పించుచున్నాను. ఉరు అంటే గొప్పదగు శ్రేష్ఠమగు పూల బాణములు గలిగిన వానికి నైవేద్యము సమర్పించుచున్నాను. . భృంగ మౌర్వి అంటే తుమ్మెదల బారును అల్లెత్రాడుగా గలిగిన వానికి సువాసనా భరితమైన పానీయమును సమర్పించుచున్నాను. మాలో చెడ్డ కోరికలకు తావివ్వక సత్కామ వాంఛలను కలిగించమని వేడికోలు.


చెరుకు రామ మోహన్ రావు