Wednesday, 3 January 2018

షడ్దర్శనములు

షడ్దర్శనములు
దర్శనము అన్న మాటకు అర్థము ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఉదాహరణ మూలముగా విశధపరుస్తాను. మొదటి సారిగా తిరుమల కొండకు స్వామీ దర్శనమునకు పోయినాము అనుకొందాము. ఎక్కడలేని తపన, ఆతురతతో కొండకుపోయి కాలకృత్యములు స్నానాదికములు ముగించుకొని దర్శన శాలలలో కూర్చున్నాము. స్వామిని చూడవలెనన్న ఉత్కంఠత పెరిగి పోతూ వుంది. మన వంతు రాగానే కదిలి కదిలి దేవుని విగ్రహమునకు చేరువైనాము. అంతలో స్వామీ నైవేద్యమునకు సమయమైనదని విగ్రహానికి తెర వేసినారు. ఉత్సుకత ఇంకా పెరిగిపోయినది. ఇంతలో తెర తీసినారు. వేంకటాచలపతి దర్శనము నేత్రపర్వముగా జరిగినది. అంటే ఆత్మానుభూతియొక్క ఆవిష్కరణమే  దర్శనము.
జిజ్ఞాస, తపన ఎక్కువై ఎప్పుడు వస్తు స్వరూపమును చూడగలుగుచున్నామో అప్పుడు మనకు ఆ విగ్రహము, మూర్తి, వస్తువు, విషయము యొక్క దర్శనము  కలిగినది అని అర్థము . అదేవిధముగా ఋషులు అనబడు మహనీయులయిన మన వైజ్ఞానికులు patent ల కొరకు ప్రాకులాడకుండా నిస్వార్థముగా మనకందించిన 'ప్రకృతిపురుష' విజ్ఞానమును దర్శనములు అన్నారు. ఎవరి అనుభవములు వారివి కాబట్టి వారి వారి అనుభవములను ఈ దర్శనముల రూపములలో తెలియజేసినారు.
ఇవి 6.
1. న్యాయ 2. వైశేషిక 3. శాంఖ్య 4. యోగ 5. పూర్వ మీమాంస 6. ఉత్తర మీమాంస.
ఇవి 6 అయినా ఇందు చర్చింపబడిన అంశములు స్థూలముగా 4 మాత్రమే.
అవి 1. పరబ్రహ్మ గుణతత్వము 2. జీవాత్మ విశ్లేషణము 3. జగజ్జననము 4. మోక్ష సంప్రాప్తము. ఇక ఇప్పుడు నాకు తెలిసినమేరకు ఒక్కొక్క దర్శనమును గూర్చి వివరించుతాను.
మిగతది రేపు.......
న్యాయ దర్శనము: మనము ఏదయినా ఒక విషయమును ప్రతిపాదించితే దాని నిరూపణకు ప్రమాణ ప్రమేయములు అవసరము. ప్రమ అంటే వాస్తవము ఋజువు అని అర్థము.  ప్రమాణము అంటే మనము ప్రతిపాదించిన విషయ నిరూపణకు ఆధారము చూపుట. ప్రమేయము అనగా అందలి వస్తువు, అంటే ఆ అంశము లేకుండా ప్రతిపాదన నిరూపించ వీలుకాదు. న్యాయశాస్త్రమును మనకు అందించినవాడు గౌతమమహర్షి. ఆధునిక న్యాశాస్త్రమునకు ఇది ఆది పునాది.
మన పూర్వుల ప్రతిభాసంపత్తి  ఈ న్యాయ నిర్ణయమునకు ఏర్పరచిన సాధన సంపత్తి అమూల్యము అసమానము మరియు అద్భుతము. ఈ అంగములు వారి ఊహాపటిమను నిరూపిస్తాయి.
మిగిలినది రేపు......
షడ్దర్శనములు -- 3

గౌతముడు న్యాయ ప్రతిష్ఠకు నాలుగు ప్రధాన ప్రమాణములను ఏర్పాటు చేసినాడు. అవి 1. ప్రత్యక్ష 2. అనుమాన 3. ఉపమాన 4. శబ్ద . ఇక సూక్ష్మముగా ఒక్కొక్క ప్రమాణమును గూర్చి తెలుసుకొందాము.
1. ప్రత్యక్షము: (1) చక్షురాది ఇంద్రియ గోచరమగునది. (2) స్వయంగా తెలుసుకొన్న అనుభవం. రసరూపగంధాదులను గుర్తించే ఇంద్రియాల ద్వారానే    పదార్థ జ్ఞానం తెలుసుకొనే పద్ధతి ప్రత్యక్ష ప్రమాణం. ఇందులోనూ నాలుగు విధానాలు ఉన్నాయి,. అవి : ఘట ప్రత్యక్షం, ఘటత్వ ప్రత్యక్షం, ఘట రూప ప్రత్యక్షం, ఘటరూపత్వ ప్రత్యక్షం. ఘటాన్ని కంటితో స్వతహాగా మొదటిసారి చూడటము, ఘట ప్రత్యక్షం. దీనినే సంయోగం అని కూడా అంటారు. ఒకప్పుడు ఘటాన్ని చూసిన అనుభవం వల్ల ఫలానా వస్తువు ఘటమనిఅనుకోవడం ఘటత్వ ప్రత్యక్షం. దీనిని సమవేతం అని కూడా అంటారు. శంఖానికి వలె పైభాగం సన్నగా మెడవలె ఉంటుంది కనుక రూపము యధాతథము కాకపోయినా ఘటము యొక్క పోలికను కలిగిన పాత్రను కూజా అనుకోవడం ఘట రూప ప్రత్యక్షం. దీనిని కూడా సంయోగం అంటారు. గతంలో ఘటరూపత్వ వివరం తెలిసిన అనుభవం చేత తెలియడం ఘటరూపత్వ ప్రత్యక్షం. దీనిని కూడా సమవేతం అంటారు. ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అనుసరించేవారు పరబ్రహ్మాన్ని ఒప్పుకోరు. కానీ ఇది అసంపూర్ణమౌతుంది.
2. అనుమానము: ఒక గతానుభవమును ఆలంబనగా తీసుకొని, ప్రస్తుతములో, ఆ గత విషయమునకు ముందుగా ఏర్పడిన స్థితి నేడు కూడా ఏర్పడుటచే, ఇక ఇట్లు అగును అని తలపోయుట అనుమానము.ఉదాహరణమునకు క్రమ్మిన కారు మేఘముల జూచి వర్షాగమనమును ఊహించుట.
3. ఉపమానము: పదార్థ జ్ఞాన నిరూపణలో ఉపయోగించే పద్ధతి. ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం రెండూ ఇందులో కలుస్తాయి. అలాగే ఉపమానం ఉపమేయం రెండూ ఇందులో ఉపయోగపడతాయి. అందువల్ల దీనిని ఉభయాత్మకం అని కూడా అంటారు. తెలుగు వాచకము రామాయణ గ్రంథము వున్నాయని అనుకొందాము. స్థూలముగా రెండూ పుస్తకములే! రామాయణ గ్రంధమును, వెంటనే మస్తిష్కమునకు స్ఫురింపక పోవుటచేత, పుస్తకము అనవచ్చు, కానీ తెలుగువాచకమును గ్రంధము అనము. అంటే ఉపమానమునకు రెండు యోగ్య వస్తువులు అవసరము. అర్థములేని పోలికలతో ఉపమానమును సాధించలేము. ఈ ప్రామాణిక ఉపమానములను  మూడు విధములగా విభజించుట జరిగినది. 1. గుణోపమము, 2. కర్మోపమము, 3. ప్రయోజనోపమము.
4. శబ్దప్రమాణము: అంటే వేదములలో చెప్పబడిన ప్రమాణము. ఈ నాలుగు మాత్రమే తార్కికులు అంగీకరించు ప్రమాణములు. అర్తాపత్తి, అనుపలబ్ధి, సంభవము,ఐతిహ్యము అన్న వి కూడా ప్రమాణములుగా చెబుతారు గానీ తార్కికులు అంగీకరించరు.
గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.
ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాన్నిఃశ్రేయ సాధిగమః న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి : ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి మరియు నిగ్రహ స్థానం. ఈ ప్రమాణములు జ్ఞాన సాధనములు. విసహాయ విస్తారణ అధికమైతే పాఠకుని అవగాహనకు ఆటంకమేర్పడు నాన్న ఆలోచనచే ఈ విషయమును ఇచ్చట నిలుపుచున్నాను.
వైశేషిక దర్శనము: సృష్టికర్త అంటూ ఎవరూ లేరని, సృష్టి సమస్తము అణువుల కలయికవల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త కణాద మహర్షి. ఈ దర్శనము ఈశ్వరుడిని అంగీకరించకపోయినా వేద ప్రమాణ్యాన్ని, ఆత్మను, పునర్జన్మను, కర్మ సిద్ధాంతాన్ని, మోక్ష సిద్ధిని అంగీకరిస్తుంది. కణాద దర్శనంలో పది అధ్యాయాలున్నాయి. ప్రతీ అధ్యాయంలో రెండేసి ఆహ్నికాలు, మొత్తం 370 సూత్రాలు ఉన్నాయి.
వైశేషిక దర్శనముయొక్క  ఆధారంగానే "అణువైశేషిక సిద్ధాంతము"ను  కణాదుడు ప్రతిపాదించినాడు.
కణాదుడు తన "అణువైశేషిక సిద్ధాంతం" లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించినాడు.
1. అయస్కాంతం సూదులను ఆకర్షించడం
2. మొక్కలలో జల ప్రసరణ
3. జడ పదార్థం అయిన అయస్కాంతం సూక్ష్మ శక్తుల్ని ప్రసారం చెయ్యడానికి అధారం కావడం.
4. అన్ని రకాల వేడిమికీ సూర్యగోళంలో ఉండే అగ్ని మాత్రమే కారణం.
5. అణువు పరిమాణానికి కూడా ఈ సూర్యగోళము యొక్క వేడిమే కారణం. 6. భూమి అణువుల్లో ఉండే ఆకర్షించే గుణమే భూమి చూపించే గురుత్వాకర్షణ శక్తికి కారణం. 7. వస్తువుల చలన స్వభావనికి మూలకారణము "శక్తివ్యయము" లేదా "పునఃచలన ప్రసారము" 8. అణు విఘటన/అణు విచ్ఛేదన జరిగితే విశ్వ ప్రళయము. 9. కాంతి కిరణములు, ఉష్ణ కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసారం చెందడం వల్ల ఆ కిరణాలు అన్ని వైపులకూ అత్యంత వేగంతో దూసుకు పోగలుగుతాయి. 10. దేశ కాలాల సాపేక్షత విశ్వం - ఆరు స్థితులు
కణాదుడు సిద్ధాంతం ప్రకారం విశ్వం మొత్తం ఆరు స్థితులలో ఏర్పడి యుంది. అవి 1. ద్రవ్య పదార్థం 2. గుణస్వభావం లేదా గుణధర్మం 3. కర్మ 4. సామాన్య ధర్మం 5. విశేషధర్మం 6. సమ్యవపదార్థాలు. ఈ సమ్యవ పదార్థాలను తిరిగి 9 సహజ లక్షణాలుగా విభజించినాడు.
1. భూమి 2. జలం 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశం 6. కాలం 7. అంతరిక్షం 8. మనస్సు 9. ఆత్మ.
ప్రపంచ భౌతిక శాస్త్ర దృక్పథాన్ని సమూలంగా మార్చి వేయ గలిగిన ప్రభావవంతమైన అణు సిద్ధాంతాన్ని క్రీస్తు శతాబ్దాలకు పూర్వమే ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిన కణాదుని  సిద్ధాంతము ప్రకారము మనస్సు, ఆత్మ రెండూ ద్రవ్యాలే. జీవిత చరమాంకము  వరకూ భౌతిక అణు పదార్థాల శైలీ విన్యాసాల మీద అనేక పరిశోధనలు చేసిన కణాదుడు సకల ప్రపంచమునకు అరాధ్యుడు.
వైషేశికమున ప్రశస్త పాదుని యోగాదానమును గూర్చి కూడా తెలుసుకోనవలసి యున్నది. ప్రశస్త పాదుడు పదార్ధముల తత్వజ్ఞానమే మోక్షకారణమని వచించెను. తచ్చ ఈశ్వరనోదనాభి వ్యక్తాత్ ధర్మామేవ '- అత్మజ్ఞానమ ఈశ్వరప్రేరిత ధర్మమునుండి జనించునది అని చెప్పినారు. ఇక్కడ ధర్మ శబ్దమునకు నిష్కామ కర్మ అని నిర్వచింపవచ్చును. మహేశ్వరునికి సంహారేచ్చ జన్మించినపుడు పరమాణు పుంజ సంఘాతమున (Big bang/Collision) ) జనించిన శరీరేంద్రియాదుల క్రమముగా విశ్లిష్టమై (dis-joined, disunited), వినిష్టమై (destroy) పోవును. అప్పుడు చతుర్విధ పరమాణువులు (atoms) మాత్రమే మిగిలియుండును. అవి
ఏతే భూతభౌతికాః పదార్థాః పార్థివాది చతుర్విధ ఖర - స్నేహో - ష్ణే - రణ స్వభావ - పరమాణు సంఘాత రూపా ఏవ - న చ కార్యం నామ స్వావయవపుంజా దతిరిక్తం భవతి - అవయవ సంస్థానభేదా త్తద్గతసంఖ్యాభేదా చ్చ కార్య భేదసిద్ధిః - స్వావయవభూత తన్తుపుంజవ్యతిరేకేణ పటోనామ నాస్తి - ఏవం తత్తద్వస్త్వవయవభూత పరమాణునమదాయ ఏవ భూత భౌతిక లక్షణం బాహ్యం అని చెప్పబడినవి. విశ్లేషణ దిగువన చూడగలము.

ప్రళయానంతరము జీవుని భోగాదృష్టముల పూరణకై మహేశ్వరునకు మరల సృష్టినొనర్ప ఇచ్చకలుగును. అప్పుడు మొట్టమొదట వాయుపరమాణువున అదృష్ట వశత: స్పందనము కలుగును. అప్పుడు వాయు పరమాణువుల సంయోగమువలన వాయువు ఉత్పన్నమై ఆకాశమున ప్రహహించుచుండును. ఇట్లే తైజస (radioisotopes), జలీయ (water), పార్ధివ పరమాణువుల నుండి స్థూల భూతములు (Planets) జనించును. తరువాత మహేశ్వరుని సంకల్పవశమున బ్రహ్మాండము (Universe) సృష్టియగును. బ్రహ్మకూడా ఉధవించి మిగిలనవి సృష్టించును.
సాంఖ్యదర్శనము: ఇది కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడింది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అన్న మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధించడం జరుగుతుంది.
ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబంచడండిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంథం.
సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును
ప్రత్యక్ష ప్రమాణములు : మనకు ఇంద్రియాల ద్వారా తెలిసేది. (ఉదా:స్వయంగా చూసింది, విన్నది, స్పృశించింది. వీటిలో మళ్ళీ విభాగాలున్నాయి.
 నిర్వికల్ప ప్రమాణాలు: ఇంద్రియాల ద్వారా గ్రహించింది, కాని అర్ధము 
కానిది. (ఉదా: ఒక పసిపిల్లవాడు ఒక ఎగిరే విమానమును చూస్తాడు కాని వాడికి దాన్ని గురించి ఏమీ తెలియకపోవచ్చును. అది ఒక ఖేచరమా లేక యంత్ర సాధనమా అన్న 
విచక్షణ లేకపోవచ్చును.)
సవికల్ప ప్రమాణములు: ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం 
చేసుకొన్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుసుకున్నది. ఇది సరై జ్ఞానానికి ఆధారం. అంటే ఇక్కడ ఆ బాలుడు అది పక్షి కాదు. మానవ నిర్మిత నిర్జీవ యంత్రము, 
కానీ దీనికి కూడా ఎగురగల సామర్థ్యము వుంటుంది అని అవగాహన 
చేసుకోగలుగుతాడు.
అనుమాన ప్రమాణాలు: ఇట్లు కావచ్చు లేక అట్లు  కావచ్చును అని 
ఊహించేది. ప్రత్యక్ష ప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని 
ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం. 
(ఉదా: పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం)
శబ్ద ప్రమాణం: ఇతరులు  చెప్పగా విన్న విషయాలు.
"పురుషుడు", "ప్రకృతి" అనునవి రెండు విభిన్నమైన అంశాలు అన్నది 
సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో 
ఏదో ఒకదానికి చెందుతాయి.
పురుషుడు:
అంతటా వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార ఆత్మ తత్వం. అంతటా ఉంది. 
ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో చెప్పజాలనిది. 
(వేదాంతమున "బ్రహ్మము" కూడా ఈ విధముగనే వర్ణించబడినది.) 
పురుషునకు
ఏవిధమైన మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ
సృజింపడు.
·         ప్రకృతి:
సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉంది. 
 ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.
·         ఈశ్వరుడు
కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. 
కారణం :
ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు అని అంటాడు గనుక, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణము అని చెప్పడం అసంబద్ధమని 
అంటాడు. తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగ 
సిద్ధాంతములలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టటం జరిగింది. సాంఖ్యవాదం ప్రకారం సృష్టికి పురుషుడు, ప్రకృతి - రెండూ కారణములే.పురుషుడు "ఆత్మ"కు
చైతన్యమునకు మూలము.ప్రకృతి "పదార్ధము"నకు, పరిణామమునకు
 మూలములు.
సృష్టి సిద్ధాంతం
సాంఖ్యం "సత్కార్యవాదము"ను సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణము, ఫలితము కలిసి ఉంటాయి. ఉన్నదేదీ నశించదు. లేనిదేదీ ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. 
అందుకు కారణంలో ఫలితం అంతర్లీనంగా ఉంటుంది. వీరి 
 "ప్రకృతి పరిణామ వాదం" ప్రకారం మూల ప్రకృతి అన్నిటికీ కారణం. 
అదే క్రమంగా విభజితమై వివిధ పదార్ధాలుగా పరిణామం చెందుతుంది. 
చివరికి అన్నీ మళ్ళీ అవిభాజిత మూల ప్రకృతిలో లీనమౌతాయి. ఈ విధముగా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తాయి.
వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు గుణములు
(తత్వములు) గా విభజితమౌతుంది.ఆ గుణాలమధ్య ఉన్న మధనక్రియ పరిణామానికి మూలకారణం.ఇందుకు 
మూడు ముఖ్యమైన తత్వాలు .
·         సత్వము - సమతుల్యతను పెంపొందించే గుణము.
·         రజస్సు - వృద్ధిని, ప్రయత్నాన్ని పెంపొందిస్తుంది.
·         తమస్సు - అలసత్వాన్ని పెంచుతుంది. ప్రయత్నాన్ని నిరోధిస్తుంది.
సృష్టిలో అన్ని జీవులలో ఈ గుణాల వలన ఉత్పన్నమయ్యే లక్షణాలు:
·      ప్రకృతి, మహత్, అహంకారము, మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు
  పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు పంచ మహాభూతములు.
ఈ గుణాల చేత ఏర్పడు అనుపాత నిష్పత్తుల   బట్టి జీవుల, పదార్ధముల 
లక్షణాలు మారుతాయి.పరిణామం జరుగుతుంది.సాంఖ్య సిద్ధాంతములు 
పతంజలి యోగసూత్రములలోను, మహాభారతములోను, యోగవాసిష్టము
లోను విస్తృతంగా ప్రస్తావించబడినాయి. అన్ని జీవులలోను ఆత్మ 
పురుషునియొక్క  స్వరూపము. మనసు, బుద్ధి, అహంకారములనునవి 
ప్రకృతి లక్షణములు.
మోక్షము
అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పురుషుడు" (అనగా జీవాత్మ) శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణములు, మనసు, అహంకారము, మహాత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.
ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉంది. అద్వైత వేదాంతం ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్థం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా
 వేరువేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.
పాశ్చాత్య తత్వాలలో సాంఖ్యం
పాశ్చాత్య తత్వశాస్త్రంలో "కార్టీజియన్ సిద్ధాంతం" ప్రకారం శరీరం, మనసు అనేవి వేరు వేరు పదార్ధాలు. ఇది సాంఖ్యానికి కాస్త దగ్గరగా అనిపించినా కొన్ని ముఖ్యమైన భేదాలను గమనించాలి. పాశ్చాత్య తత్వ శాస్త్రంలో
"శరీరము" అనేది భౌతిక పదార్థం. "మనసు" కనిపించని చైతన్యం. కాని సాంఖ్యంలో శరీరము, మనసు, అహంకారమూ కూడా ప్రకృతి లక్షణాలే. "జీవుడు" లేదా "ఆత్మ" అనేది మరింత అంతర్గతంగా ఉండేది
అనవచ్చును.
(వివరణ: పాశ్చాత్య తత్వం ప్రకారం కన్నులు శరీరంలో భాగం. చూసేది మనసు. సాంఖ్యం ప్రకారం కన్నులు,
చూసేది కూడా శరీరమే. అలా చూసేదానికి "సాక్షి" మాత్రమే ఆత్మ)
యోగము: అంటే కలయిక అన్న అర్థాన్ని చెప్పుకొంటాము.జీవాత్మ పరమాత్మను కలియుట యోగము అంటారు. ఈ విషయమై ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాముఉదాహరణకు ఒక ఖాళీ సీసా ఉన్నది. దానిలోని ఖాళీ స్థలము ఆకాశమే! సీసా బయట ఎటూ ఆకాశము ఉందనే వున్నది. అంటే తన లోపల, బయట ఉన్నఆకాశమును సీసా వేరు పరుస్తూ వున్నదన్నమాట. సీసా పగిలితే లోపల, బయట ఉన్న  ఆకాశము కలిసిపోయినట్లు మనము గుర్తిస్తాము. నిజమునకు ఆకాశము ఎప్పుడు విడగొట్టబడలేదు. తాత్కాలికముగా సీసా వలన  వేరుచేయబడినట్లు గోచరించిన ఆకాశము ఒక్కటే అని గుర్తించుటయే సాక్షాత్కార జ్ఞానము లేక యోగము.
 నిజమునకు ఉన్నది బ్రహ్మము  ఒక్కటే. అదే అనేక నామరూపములతో గోచరిస్తున్నది. ఉపాధులలో ఉన్న చైతన్యము, ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము వేరు, వేరుగా మనము భావిస్తూ ఉంటాము.  చైతన్యము సర్వవ్యాపకము.  మనలో ఉన్న చైతన్యమును నేను గా భావించి, నేను బ్రహ్మముయందు ఐక్యము చెందవలెను ,అందుకు సాధన చేయువలెను అని భావిస్తాము. నిజమునకు ఉన్నది బ్రహ్మము ఒక్కటే, నేను అనునది లేనే లేదు. ఉపాధి వలన తాత్కాలికముగా వేరు పరచబడినట్లు గోచరించినను, ఉన్నది ఒక్కటియే అని భిన్నత్వములో ఏకత్వమును గుర్తించుటయే  సాక్షాత్కార జ్ఞానము లేక యోగము.  
దీనినిబట్టి మనము గ్రహించ వలసినది ఏమిటంటే నిజమునకు యోగములో జరుగునది రెండు వేరువేరు వస్తువులు లేక పదార్దముల కలయిక కాదు, కలిసే ఆరెండూ ఒక్కటే!.
పూర్వ మీమాంసా దర్శనం: మీమాంస రెండు విధాలగా విభజింపబడింది. అవి పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. కర్మకాండకు సంబంధించిన పూర్వ భాగాన్ని పూర్వమీమాంస అని పిలువటం జరిగింది. జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తర భాగాన్ని అంటే బ్రహ్మసూత్ర దర్శనాన్ని ఉత్తరమీమాంస అని అనటం జరిగింది. వివేచనా వితర్క, విచికిత్సల సంయోగమే మీమాంస.
పూర్వమీమాంస కర్త జైమిని . జైమిని సూత్రాలు కర్మకాండను, యజ్ఞ యాగాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ముఖ్యోద్ధేశ్యంగా రచించబడ్డాయని ఒక అభిప్రాయం. మీమాంసా దర్శనములో 2500 సూత్రాలున్నాయి. ఇవి 12 అధ్యాయాలుగా, 60 పాదాలుగా ఉన్నాయి.
"అథాతో ధర్మజిజ్ఞాసా" అని జైమిని పూర్వమీమాంసా సూత్రాలు ప్రారంభమవుతాయి. అంటే "ఇప్పుడు ధర్మాన్ని గురించి వివేచన చేద్దాము" అని అర్థం. పూర్వమీమాంస ధర్మోద్ధరణకు ఉద్ధేశించిన దర్శనం. ధర్మం అంటే వేదధర్మం. అంటే యజ్ఞయాగాది కర్మకాండ. అందుచేత దీనికి కర్మ మీమాంస, ధర్మ మీమాంస అనే పేర్లు కూడా ఉన్నాయి.
యజ్ఞ కర్మకాండకు ఆధారం బ్రాహ్మణాలు . ఏ యజ్ఞాలను ఏ విధంగా చేయాలి, ఏ కర్మలను ఏ క్రమంలో చేయాలి మొదలైన అనేక విషయాలపై సందేహాలు బయలుదేరినప్పుడు వాటిపై వివిధ సందర్భాలలో చర్చలు జరిగేవి. ఆ చర్చలపై ఆధారపడి వాటి సారాంశాన్ని సూత్రాల రూపంలో మీమాంస దర్శనంగా జైమిని క్రోడీకరించినాడు.
ఉత్తర మీమాంస: 
వ్యాస విరచితమైన బ్రహ్మ సూత్రములే షడ్దర్శనాలలో ఆఖరిదైన 
ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము. బాదరాయణునిచే 
సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని 
వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ, బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మ సూత్రాలని పేరు వచ్చింది.
శరీరి (శరీర పరివృతుడైన జీవాత్మ) గురించి మీమాంసించడం వలన శారీరక మీమాంస అని కూడా అంటారు. అందుకే బ్రహ్మసూత్రాలకు శంకరుడు వ్రాసిన భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ సూత్రములను
వ్రాసినది బాదరయణుడు అని ఆదిశంకరుడు స్పస్టముగ వ్రాసినా 
బాదరయణుడు మరియు వ్యాసుడు ఒకరే అను విషయములో కచ్చితమైన 
ఆధారములు లేవు. ఇందులో జైన, బౌద్ధ మతములను పరామర్సించుట 
చేతఆ మతములు మన దేశములో ప్రచారమైన తర్వాత ఈ గ్రంథము రచించి యుండవచ్చునని తెలియవచ్చుచున్నది. బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ప్రతీ అధ్యాయంలో నాలుగు పాదాలు, ప్రతి పాదంలో కొన్ని అధికరణాల చొప్పున మొత్తం 192 అధికరణాలు, ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి. శంకరునితోపాటు రామానుజుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు మొదలైనవారు కూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించడం జరిగింది.
ఇందలి ప్రథమమున గల నాలుగు సూత్రములు మాత్రము బహు మిక్కిలిగా గురువులు తమ శిష్యులకు బోధింతురు.వీటిని "చతుస్సూత్రి" అని అంటారు.
దీనితో పాటు శంకరులవారి అధ్యాస భాష్యము చాల ముఖ్యమైనది. 
అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో 
అవగతము చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును గ్రహించుట బహు 
సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల మాటలు, సారమైన 
విషయము, వివిధములైన అర్ధములు దానియందుండ వలయును. 
అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు. 
సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.
నేను వేదాంత పండితుడను గాను. ఆ మాటకు వస్తే పండితుడను కూడా 
కాను. నేను నికరముగా అర్థము చేసుకొన్న దానిలో నాకు తోచిన 
ముఖ్యాంశములను మీ ముందుంచే ఉత్సాహమే నన్ను ఈ పనికి 
పురికొల్పినది. దాసరి తప్పులు దండముతోసరి.
స్వస్తి.

Tuesday, 2 January 2018

భీష్మోపదేశము


భీష్మోపదేశము

ధర్మరాజు అందరి అనుమతి పొంది భీష్మునితో " పితామహా ! ధర్మార్ధ కామాలలో రాజధర్మం గొప్పది. ఏనుగుకు అంకుశం ఎలాగో, గుర్రానికి పగ్గములు ఎలాగో మానవ మనుగడకు రాజధర్మం అత్యావశ్యం. మా పూర్వులు ఆచరించిన రాజధర్మమును ఆచరించక పోతే అరాచకం పెరుగుతుంది, ధర్మం నశిస్తుంది. ఈ ప్రజలు చేసే పాపాలను రాజధర్మంతోనే అణచి వేయడం ధర్మంతుంది. ధర్మం తెలిసిన ప్రజలు రాజును ధర్మస్వరూపంగా అనుకుంటారు. కనుక రాజుకు రాజధర్మములు తెలుకొన వలసిన అవసరం ఉంది. రాజు రాజధర్మం తప్పితే రాజ్యంలో అరాచకం పెరుగి ధర్మం తగ్గుతుంది. కనుక రాజు ప్రజలు చేసే పాపాలను రాజధర్మంతోనే అణిచివేయాలి. ప్రజలు రాజును ధర్మస్వరూపుడిగా ఆరాధిస్తారు కనుక రాజు రాజధర్మం ఎరిగి పాలన చేయడం అవశ్యం కనుక మీరు నాకు రాజధర్మ సూక్ష్మాలను ఎరిగించండి " అని అడిగాడు.భీష్ముడు " తనకు మేలు జరగాలని కోరుకునే రాజు ముందుగా ఏ దేవతలను పూజించాలి. ఏ పనికైనా దైవబలం అవసరం. కనుక మానవ ప్రయత్నంతో పైన చెప్పిన రెండింటినీ చేయాలి. మానవ ప్రయత్నం చేసే రాజుకు దైవసాయం ఉంటుంది. ప్రయత్నం విఫలమైనా రాజు కలత నొందక అది దైవనిర్ణయం అని భావించాలి. రాజుకు శాంతి, దాంతి, విజితాత్మ, శీలం మొదలైన సుగుణములు ఉండాలి. ఇవి ఉన్న రాజుకు సమస్త సంపదలు సమకూడుతాయి. రాజు సత్యసంధత కలిగి విజ్ఞత, మంచి నడనవడి కలిగి రాజ్య పాలన చేస్తూ దండనీతిని జాగరూకతతో అమలు చేస్తే కీర్తిమంతుడు కాగలడు. రాతి నుండి ఇనుము పుడుతుంది, అదే ఇనుముతో రాతిని కొడితే రాయి విరుగుతుంది, నీటి నుండి అగ్ని పుడుతుంది కాని అగ్నితో నీటిని కాల్చాలనుకుంటే అది ఆరిపోతుంది. బ్రాహ్మణుడి వలన రాజు తయారు ఔతాడు. ఆ రాజే బ్రాహ్మణుడిని అవమానిస్తే రాజు నాశనం కాక తప్పదని. నీవు మనసులో పెట్టుకోవాలి. బ్రాహ్మణులు వేదస్వరూపులు కనుక వారిని గౌరవించి ఆదరించు. బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతడూ దండనార్హుడే. శుక్రనీతిలో " యుద్ధ సమయంలో అస్త్ర శస్త్ర సహితుడై తన మీదకు వచ్చే బ్రాహ్మణుడిని వధించడం రాజుకు పరమధర్మం. కాని గురువు భార్యను కోరిన వాడిని, పసి పిల్లలను చంపినవాడిని, సాటి బ్రాహ్మణుడిని చంపినవాడిని, రాజద్రోహం చేసిన వాడిని చంపక దేశభహిష్కరణ చేయాలి " అని చెప్పాడు.

రాజప్రవర్తన

బృహస్పతి రాజ ప్రవర్తన గురించి " రాజు దుర్గరక్షణలో అప్రమత్తతతో వ్యవహరించి చతురంగబలముతో రక్షించాలి. రాజు బ్రాహ్మణులను, వైశ్యులను, క్షత్రియులను వర్ణవివక్షణ లేక సమానంగా చూడాలి. రాజు దయతో వ్యవహరించాలి కాని మెతకదనం చూప కూడదు. మృదుప్రవర్తన వలన రాజు ప్రజలలో చులకన ఔతాడు. అప్పుడు ప్రజలు రాజుతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించి ఆటలాడుతారు. అలాగే రాజు కౄరత్వం ప్రదర్శించ కూడదు. ప్రజలు భయభ్రాంతులు ఔతారు. కనుక అతిమృదుస్వభావం చూపక, అతికౄరత్వం చూపక దయ దండన సమపాళ్ళలో రంగరించాలి. ఇది రాజధర్మంలో ప్రధానమైనది. రాజు తన కోపతాపములు ప్రజల ముందు ప్రదర్శించక సంయమనం వహించాలి. రాజు గంభీరంగా ఉండాలి కాని తనక్రింది ఉద్యోగులతో ప్రజలతో పరిహాసాలు పరాచకాలు ఆడకూడదు. అలా చేస్తే రాజును లెక్క చేయక రాజుకు హానికలిగించే పనులుచేసి రాచరికానికి ముప్పు తీసుకు రాగల ప్రమాదం ఉంది. రాజు ఉద్యోగులతో దయతో గంభీరంగా వ్యవహరించాలి. రాజ్యముకు రాజ్యపాలన కలిగించే వారికి అపకారము తలపెట్టిన వారిపట్ల మెతకదనం వహించక కఠినత్వం వహించాలి. రాజు వారిని వెంటనే వదిలించుకోవాలి. గర్వాంధుడై తన కర్తవ్యం మరచి ప్రవర్తించే వాడిని రాజు వదిలించుకోవాలి కాని భరించ కండా ఉండటమే రాజధర్మం " మరుత్తుకు చెప్పాడు. కనుక ధర్మరాజా ! తప్పు చేసిన వాడు గురువైనా, సుతుడైనా, మిత్రుడైనా మన్నించక కఠినంగా శిక్షించాలి. ప్రజలను బాధిస్తున్న అసమంజసుడిని వదిలి వేసిన సగరుడు, బ్రాహ్మణులను బాధిస్తున్న కుమారుడు శ్వేతకేతువును వదిలి వేసినఉద్దాలకుడు మనకు ఈ విషయంలో ఆదర్శ మూర్తులు. రాజు సత్యము, ధర్మము, క్షమాగుణం కలిగి పాలన సాగించి ప్రజలను సంతోష పెట్టాలి. రాజు తనకు కీడు సంభవించగలదని భావిస్తే వైదికకర్మల ద్వారా వాటిని నివారించాలి. రాజు చతుర్వర్ణాలను సమంగా ఆదరించాలి. తనను పొగిడే వారిని దూరంగా ఉంచాలి. అవినీతిని అంత మొందించి వారి ధనమును బాధితులకు పంచాలి. ఎవరిని అతిగా నమ్మకూడదు, అలాగని ఎవరి మీద అవిశ్వాసం చూపక విచక్షణతో వ్యవహరించాలి.

అంతఃకలహం[మార్చు]

ధర్మజా ! రాజుకు అంతఃశత్రువులు ఎక్కడినుండో పుట్టుకు రారు. అతడి ప్రజల నుండి వస్తారు. అది నివారించాలంటే ధర్మనిరతులైన వారిని, అర్ధశాస్త్రంలో నిపుణులను, స్థిరచిత్తులను, రాజాజ్ఞను గౌరవించే వారిని, ఉత్తమ కులతిలకులను, నీతిమంతులను తన కొలువులో చేర్చుకుని పాలన సాగించాలి. అటువంటి రాజు పాలనలో ప్రజలు సంతోషంతో కపటంలేక పుత్రులవలె మెలగుతారు. రాజు అత్యంత పరాక్రమ వంతుడై ఉండాలి. లేని ఎడల ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించ లేడు. అని శుక్రాచార్యుడు చెప్పాడు. పరాక్రమ హీనుడు, ప్రజలను రక్షించ లేని రాజు చదువుకోని ఋత్విక్కు వంటి వాడు. అని మనువు చెప్పాడు. ప్రజా సంరక్షణయే పరమ ధర్మమని ఇంద్రుడు భరద్వాజుడు చెప్పారు. రాజైన వాడు ఎప్పుడూ ఉత్సాహవంతుడై ఉండాలి. న్యాయమార్గమున కాని, అన్యాయ మార్గమున కాని శత్రువును వధించాలి. అల్పుడని వదిలి వేసిన శత్రువు బలిష్టుడై విషంకక్కే అపాయం ఉంది. కనుక శత్రుసంహారం రాజ్యానికి శ్రేయోదాయకం. ఎన్ని అండ్డంకులు వచ్చినా రాజురాజ్యాన్ని అన్యాక్రాంతం చెయ్యకూడదు " అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి సూర్యాస్తమయం అయ్యింది కనుక శ్రీకృష్ణుడుధర్మరాజాదులు, మహా మునులు భీష్ముడి వద్ద శలవు తీసుకుని వెళ్ళారు.

నీతి శాస్త్రం


బ్రహ్మరచించిన నీతిశాస్త్రం
మరునాడు ఉదయయం శ్రీకృష్ణుడు ధర్మరాజు మహామునులు భీష్ముని వద్దకు వచ్చి చుట్టూ కూర్చున్నారు. ధర్మరాజు చేతులు జోడించి " పితామహా ! మామూలు మానవులకు రాజులకు భేదం లేదుకదా ! ఇద్దరికీ చావు పుట్టుక వ్యాధులు ఉన్నాయి. ఇద్దరికీ తలా , చేతులు, కాళ్ళు సమానమే కదా ! ఇద్దరికీ చావు పుట్టుక వ్యాధులు సమానమే! అలాంటప్పుడు రాజు ప్రజలను తనవశంలో ఎలా ఉంచుకోగలడు ? ఎలా రక్షించగలడు ? ఎలా దండించగలడు ? రాజు దేవుడితో సమానం ఎలా కాగలడు ? దయచేసి వివరించండి " అని అడిగాడు. అందుకు భీష్ముడు " ధర్మనందనా ! కృతయుగంలో ధర్మము చక్కగా ఉంది. ప్రజంతా ధర్మబద్ధులై ప్రవర్తించారు. అందుకని ప్రజలకు ఎవరి రక్షణా అవసరం లేక పోయింది. తరువాత క్రమంగా ప్రజలలో ఇది నాది అది నీది అనే భావం పెరిగి స్వార్ధం పెరిగి లోభత్వం ప్రవేశించింది. క్రమంగా ధర్మం క్షీణించి ప్రజలు అకృత్యముకు పాల్పడసాగారు. క్రమంగా కోరికలు ప్రబలి ఒకరిమీద ఒకరికి మదం, మాత్సర్యం, ద్వేషం పెరిగింది. వేదాలు చదవడం మానివేసారు. అధర్మం రాజ్యమేల సాగింది. అప్పుడు దేవేంద్రాదులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి " దేవా ! మానవ లోకంలో వేదాధ్యాయం సన్నగిల్లింది. యజ్ఞయాగములు చేయడం వదిలారు. ధర్మం క్షీణించింది " అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు నవ్వి " నేను దానికి తగిన ప్రతిక్రియ చేస్తాను కలత చెందవద్దు " అని చెప్పాడు.

తరువాత బ్రహ్మదేవుడు నీతి శాస్త్రమును రచించాడు. ఆ నీతి శాస్త్రంలో రాజు, మంత్రి, దుర్గం, కోశాగారం, వార్తా సేకరణ, దండనీతి, మిత్రులు, శత్రువులు, ఉదాశీనుడు, సంధిచేసుకోవడం, రాజతంత్రములు, ధర్మం, అర్ధం, కామము, మోక్షం అనే నాలుగు పురుషార్ధములు పొందుపరిచాడు. ఆ నీతిశాస్త్రం లక్ష అధ్యాయములు కలిగి ఉంది. ఆ నీతిశాస్త్రం లోకములకు ఆచరణయోగ్యమై నిర్మలంగా ఉండడానికి తోడ్పడుతుందని భావించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి నొసటి నుండి ఆది అంతం లేనివాడు, ఈ విశ్వమునకు కర్త అయిన వాడు , సర్వభూతములలో తానై ఉన్నవాడు, సనాతనుడు, వికృతం, విశాలం అయిన కన్నులు కల వాడు అయిన శివుడు విశాలాక్షుడు అనే పేరుతో ఆవిర్భవించాడు.విశాలాక్షుడు బ్రహ్మ రచించిన లక్ష అధ్యాయములు గల నీతి శాస్త్రమును ఆ మూలాగ్రం చదివాడు. ఈ నీతి శాసత్రం చదవడానికి మానవుల బుద్ధి ఆయుస్షు, బుద్ధి సరి పోదు అని అనుకున్నాడు. అందు వలన ఆ నీతిశాస్త్రమును పదివేల అధ్యాయములకు కుదించి, వైశాలాక్షము' అనే నీతిశాస్త్రము రచించాడు. ఆ తరువాత ఆ నీతిశాస్త్రం మహేంద్రుడు చదివాడు. మహేంద్రుడు దానిని అయిదు వేల అధ్యాయములకు కుదించాడు. ఆ తరువాత బృహస్పతి అందరికీ అర్ధం అయ్యేలా మూడు వేల అధ్యాయములకు కుదించాడు. దానిని శుక్రుడువేయి అధ్యాయములకు కుదించాడు. అదే శుక్రనీతి. కాల క్రమేణా మునులు దానిని చిన్న చిన్న గ్రంధాలుగా రచించారు. ఇలా నీతిశాస్త్రం వివిధ మార్పులు చెందింది. దేవతలు ఆ తరువాత విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి నీతిశాస్త్ర పరిణామమును వివరించి దానిని అమలు చేయడానికి ఒక సమర్ధుడిని నిర్ధేశించండి అని వేడుకున్నారు.

ప్రధమ ప్రజాపాలకుడు

దేవతల కోరికను మన్నించి విష్ణుమూర్తి తన తేజస్సుతో ఒక మానసపుత్రుడిని పుట్టించాడు. అతడి పేరు విరజుడువిష్ణువు అతడిని రాజును చేసాడు. కాని అతడు రాజ్యపాలన పట్ల విముఖత వహించి తన కుమారుడైన కర్ధముడికి రాజ్యమును అప్పగించి తాను తపమాచరించడానికి వెళ్ళాడు. కర్ధముడు కూడా రాజ్యపాలన పట్ల విముఖత వహించి తన కుమారుడైన అనంగుడికి రాజ్యమును అప్పగించి తప మాచరించ డానికి వెళ్ళాడు.అనంగుడు నీతి శాస్త్రమును అనుసరించి దండనీతిని ఉపయోగించి రాజ్యపాలన సాంగించాడు. అతడి తరువాత అతడి కుమారుడైన నీతికి పట్టాభిషేకం చేసాడు. నీతిమృత్యువు కుమార్తె సునీధను వివాహం చేసుకున్నాడు. వారికి వేనుడు అనే కుమారుడు కలిగాడు. అతడు రాగద్వేషములకు లోనై ప్రజాకంటకుడై మహామునుల హోకారం చేత హతుడయ్యాడు. మహామునులు తరువాత పాలకుడి కొరకు అతడి తొడను దర్భలతో మధించారు. తొడ నుండి ఒక వికృతాకారుడు అయిన అశుచి అనే కుమారుడు జన్మించాడు. మునులు వాడిని చూసి నిరాశపడి " నిషీద నిషీద " ("కూర్చో కూర్చో") అని అన్నారు. అందు వలన అతడు నిషాధు డయ్యాడు. మునులు అతడిని అడవులకు పంపాడు. నిషాధుడి సంతతి నిషాధులై వింధ్యపర్వత శ్రేణులలో అత్యంత క్రూరులై సంచరించ సాగారు. తరువాత మునులు వేనుడి కుడి భుజాన్ని మధించారు. అప్పుడు అతడి భుజం నుండి ప్రకాశించే కవచంతో, ధనుర్భాణాలతో, వేదవేదాంగ, ధనుర్వేద పారంగతుడైన మహాపురుషుడు జన్మించాడు. నీతి శాస్త్రంలో చెప్పబడిన దండనీతి ఆ మహా పురుషుడిని ఆశ్రయించింది. ఆ మహాపురుషుడు మునులకు నమస్కరించి " మహా మునులారా ! నన్ను ఎందుకు సృష్టించారు " అని అడిగాడు. మునులు " ఓ మహాపురుషా ! నీ పేరు వైన్యుడు నీవు అహంకారం, క్రోధం, మోహ, లోభం విడిచి నీతి శాస్త్రమును అనుసరించి ధర్మ రక్షణ చేస్తూ ఈ లోకాన్ని పాలించు. నీ ఇష్టా ఇష్టములకు అతీతంగా ప్రజలను రక్షించు. నీతి శాస్త్రమును అనుసరించి ధర్మమును రక్షించి, వేద వేదాంగములను రక్షించి, వర్ణ సంకరమును అరికట్టు. బ్రాహ్మణులను, నీతిమంతులను రక్షించు " అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ వైన్యుడు " మహామునులారా ! నేను బ్రాహ్మణుల సహాయంతో మీరు చెప్పిన కార్యములు నెరవేర్చ గలను " అని పలికాడు. అందుకు మహామునులు సంతోషపడి వైన్యుడికి బ్రాహ్మణులను మంత్రులుగా నియమించి ఆ మహామునులు వైన్యుడిని సకల భూమండలానికి పట్టాభిషిక్తుడను అయ్యాను. శుక్రుడిని పురోహితుడిగా నియమించారు. వాల ఖిల్యులలో సారస్వతులను మంత్రులుగా నియమించాడు. గర్గుడిని జ్యోతిష్యుడుగా నియమించారు. ఇంద్రుడు, కుబేరుడు అత్యధిక సంపదలను ఇచ్చారు. వైన్యుడు ఈ భూమండలానికి రాజై నీతిశాస్త్రము చెప్పిన రీతిగా దండనీతిని అమలు చేస్తూ రాజ్యపాలన చేయసాగాడు. వైన్యుడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు.

క్షత్రియుడు

ధర్మరాజా ! ప్రజలను, బ్రాహ్మణులను రక్షించాడు కనుక క్షత్రియుడయ్యాడు, ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాజు అయ్యాడు. వైన్యుడి సంతతి వారు క్షత్రియులయ్యారు. రాజరికం వహించి దండ నీతిని అమలు చేస్తూ రాజులయ్యారు. కనుక రాజులంతా విష్ణువు అంశలే. ప్రజారక్షణ చేస్తూ పాలించే వాడు విష్ణాంశ సంభూతులు. అందు వలన రాజుల చేతిలో ప్రజా రక్షణాశక్తి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఫాలభాగం నుండి ఉద్భవించిన లక్ష్మి (సిరి)ధర్మమును ఆశ్రయించి అతడికి భార్య అయి అర్ధము అనే కుమారుడిని కన్నది. అందువలన ధర్మము, సిరి, అర్ధము రాజును ఆశ్రయించుకుని ఉంటాయి. ధర్మరాజా ! అందుకని రాజు సామాన్యుడు కాదు. అతడు పుణ్యాత్ముడు. అతడు స్వర్గలోకముకు పోవడానికి అర్హుడు. దండనీతిని అమలు చేస్తూ ప్రజాపాలన చేయడానికి స్వర్గం నుండి ఈ భూమి మీదకు విష్ణాంశ సంభూతుడు. కనుక వర్ణాశ్రమ ధర్మాలు, అచారవ్యవహారాలు, వేదములు, పురాణములు, ఇతిహాసములు రాజుల ఆధీనంలో ఉంటాయి. విష్ణుమహిమ వలన రాజు సౌందర్యము, శౌర్యము, చతురత మొదలైన సుగుణములు కలిగి ఉంటాడని ప్రజలు అనుకుంటారు. అందుకే రాజు దేవతలతో సమానుడని ప్రజలు అనుకుంటారు. ధర్మరాజా ! నీకు ఇంకా సందేహాలు ఉంటే అడుగు " అని చెప్పాడు భీష్ముడు.

చతుర్వర్ణాలు

భీష్ముడి మాటలకు బదులుగా ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు వర్ణాశ్రమములు - వాటిని ఆచరించు విధానములు, ఈ ప్రపంచంలో అనుసరించు రాజధర్మములు వివరించండి " అని కోరాడు. భీష్ముడు " ధర్మనందనా ! కోపం లేకుండా ఉండడం, సత్యం పలుకడం, తన భార్య యందు అనురక్తుడై ఉండటం, రాజ్యమునకు సంబంధించిన రహస్యములను కాపాడడం, పరుల ఎడ ద్రోహచింతన లేకుండుట మొదలైన ఉత్తమగుణములు రాజు పాటించాలి. బ్రాహ్మణుడికి ఇంద్రియ నిగ్రహం అత్యంత అవశ్యం. బ్రాహ్మణుడు రోజూ వేధాధ్యయనం చేయాలి. కరుణ, శాంతస్వభావం కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు చెడు ప్రవర్తన విడనాడాలి. బ్రాహ్మణుడికి లభించిన సంపదను తన సంతానం కొరకు పరుల కొరకు వినియోగించాలి. క్షత్రియధర్మం ఏమంటే అతడు యజ్ఞ యాగాదులు చేయ్యడం, వేదాధ్యయనం చెయ్యడం, దుర్మార్గులను కఠినంగా శిక్షించడం, ప్రజలను అనురాగంతో పాలించడం, యుద్ధంలో పరాక్రమం చూపడం క్షత్రియధర్మం. అన్నిటికంటే యుద్ధం చెయ్యడం క్షత్రియుడికి పరమ ధర్మం. వైశ్యధర్మములు చెప్తాను. వైశ్యుడు వేదాధ్యయనం చేయాలి, యజ్ఞ యాగములు చెయ్యాలి, న్యాయంగా ధనార్జన చెయ్యాలి. ధనం కూడబెట్టాలి. పశు పోషణ, రక్షణ చేయాలి. ఇది వైశ్యుడు పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. పైన చెప్పిన మూడు వర్ణాలకు కావలసిన కార్య సహాయం చేయడం శూద్రధర్మం. శూద్రుడు రాజానుమతితో ధనసంపాదన చేయ వచ్చు. కాని దాన, ధర్మాలు చెయ్యడానికి రాజానుమతి లేకుండా చెయ్య వచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు యజ్ఞ యాగాదులు పరమ ధర్మం.

ఆశ్రమ ధర్మాలు

తరువాత భీష్ముడుఆశ్రమ ధర్మాలు చెప్పసాగాడు " ధర్మజా ! బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారి గురుశుశ్రూష చెయ్యడం, ఆగమ శాస్త్రములు అభ్యసించడం, బాహ్య అలంకారముల మీద ఆసక్తి విడవడం, బిక్షుక వృత్తితో జీవించడం, ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషం కాని చూపక పోవడం, ఎప్పుడూ మంచి పనులు మాత్రమే చెయ్యడం బ్రహ్మచారి ఆచరించ తగిన ధర్మాలు. గృహస్థు తన భార్య మీద మాత్రమే అనురక్తుడై ఉండాలి. కరుణ, సత్యనిష్ఠ, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవకార్యములు, పితృ కార్యములు శ్రద్ధతో నిర్వహించడం, నిత్యాగ్ని హోత్రం చెయ్యడం, అతిథులను ఆదరించడం గృహస్థాశ్రమ ధర్మాలు. ఒంటరిగాకాని భార్యతోగాని అడవులకు వెళ్ళడం, మానావమానములను వదలడం, ఇంద్రియ నిగ్రహం పాటించడం, జడధారియై వేదాధ్యయనం చెయ్యడం, సజ్జనులతో గోష్టి సల్పడం వానప్రస్థాశ్రమ ధర్మం. సన్యాసి ఒక ప్రదేశంలో ఉండడు. ఆకలి వేసినప్పుడు దొరికింది తింటాడు. రాత్రి సమయం అయినప్పుడు ఎక్కడైనా నిద్రిస్తాడు. సన్యాసి అగ్నికార్యములు చేయ వలసిన అవసరంలేదు. తనకు తానుగా ఏమీ కోరక ఇచ్చినది పుచ్చుకొనుట, ఇంద్రియ నిగ్రహం పాటించుట, వినయంతో ప్రవర్తించుట సన్యాసి ఆచరించ వలసిన ధర్మాలు. ఈ నాలుగు ఆశ్రమాలు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఆచరించ వచ్చు. శూద్రుడు మొదటి మూడు ఆశ్రమాలను ఆచరించ వచ్చు కాని సన్యాసం స్వీకరించ రాదు. ధర్మ పరుడైన బ్రాహ్మణుడు యజ్ఞ యాగములలో దానమును స్వీకరించడానికి అర్హుడు. అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన రాజు కీర్తిమంతుడు ఔతాడు. రాజు ప్రజల చేత ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఆచరింపజేసి సిద్ధి పొందుతాడు. సకల ధ్రర్మములు రాజధర్మానికి లోబడి ఉంటాయి. రాజు దండ నీతిని విస్మరిస్తే య్జ్ఞయాగములకు విజ్ఞం కలుగుతుంది. ప్రజలకు కీడు కలుగుతుంది. రాజు దండనీతిని అమలు పరుస్తూ ప్రజలను దయతో పాలిస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. ధర్మాలలో కెల్లా రాజ ధర్మం గొప్పది. రాజధర్మమును ఆచరించు రాజు దైవసమానుడు.

మాంధాత

వర్ణాశ్రమ ధర్మాలు, ఆశ్రమధర్మాలు చెప్పిన భీష్ముడుధర్మరాజుతో " పూర్వం మాంధాత అనే రాజు విష్ణువును గురించి తపస్సు చేసాడు. మాంధాతకు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి తనకు నమస్కరించిన మాంధతతో " మాంధాతా ! నువ్వు విష్ణువును ప్రసన్నం చేసుకోవడం అంత సులభంకాదు. అందుకని నేను ప్రత్యక్షం అయ్యావు. నీ కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను " అని అన్నాడు. మాంధాత " మహేంద్రా ! నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగించి బిక్షుకవృత్తి మీద ఆసక్తి కలిగించు " అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు మాంధాతతో " ఓ మహారాజా ! అన్ని ధర్మములలోకి రాజధర్మం గొప్పది. రాజు కామక్రోధములు విడిచి దండనీతిని అమలు చేస్తూ రాజ్య పాలన చేయాలి. అప్పుడు రాజుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అలాంటి మహారాజైన నీకు భిక్షుక వృత్తి ఆచరణ యోగ్యం కాదు. ప్రజలను రక్షించడం, యుద్ధంలో మరణించడం క్షత్రియధర్మం. భిక్షుకవృత్తి రాజధర్మం కాదు. మానవులలో రాజు శ్రేష్టుడు అని వేదములు ఘోషిస్తున్నాయి. అన్నాడు. ధర్మబద్ధమైన దండనీతికి సాటి అయినది వేరే లేదని పెద్దలు చెప్పారు కదా ! కనుక ఓ మహారాజా ! నీవు కామక్రోధములు విడిచి పెట్టి దండనీతిని అమలు చేస్తూ రాజ్యం చెయ్యి. అంతే కాని భిక్షుకవృత్తి నీకు సరికాదు " అని మాంధాతతో ఇంద్రుడు చెప్పాడు. కనుక ధర్మనందనా ! అతిథులను, దీనులను, పేదవారిని దయతో చూడు. సంతోషమూ, అహంకారమూ, దుఃఖం నీ దరికి రానీక నిర్మలమనస్కుడవై ఉండు. స్వార్ధాన్ని విడిచి పెట్టి ప్రజా రక్షణకు పాటుపడు. అదే పరమ ధర్మం " అన్నాడు భీష్ముడు.

ప్రజాధర్మం

ధర్మరాజు భీష్ముడితో " భీష్మపితామహా ! రాజులు ఆచరించవలసిన ధర్మముల గురించి చెప్పారు. ప్రజలు ఏ ధర్మం ఆచరించి సుఖంగా జీవించగలరు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! ప్రజలు తమకు ఒక రాజును నియమించుకుని ఆయనను అభిషిక్తుడిని చేసి ఆయన పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. అలా పాలించే రాజు లేకున్న ప్రజలు ధర్మంతప్పి ఒకరి ధనమును, భార్యను ఒకరు అపహరించుతూ, ఒకరి సొత్తును ఒకరు దోచుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ప్రజా జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి రాజు కావాలి లేకున్న ప్రజాజీవితం అస్తవ్యస్థం ఔతుంది. వ్యవసాయము, వ్యాపారం, గోరక్షణ మొదలైన వృత్తులు నాశనం ఔతాయి. ఒకానొక సమయమున రాజు లేక దొంగతనం, అక్రమప్రవర్తన, దుర్మార్గం పెచ్చుమీరి ప్రజలజీవితం కల్లోలితం అయింది. అప్పుడు సాధారణ ప్రజలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమకు రాజును ప్రసాదించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి 'మనువును రాజుగా నియమించాడు. మనువు అసత్యం పలికే వారికి, దుర్మార్గులకు తాను రాజుగా ఉడలేనని చెప్పాడు. అప్పుడు ప్రజలు " పశువులలో బంగారంలో సగభాగం పన్ను కింద చెల్లిస్తాము. పండించిన పంటలో పదవభాగం ఇస్తాము. వాటితో మంచి సైన్యమును సమకూర్చుకుని నీ పరాక్రమంతో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ రాజ్యపాలన చెయ్యండి. ప్రజలంతా నీ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తాము. అధర్మ వర్తనులు నీ చేత శిక్షించబడతారు. ధర్మాత్ముల పుణ్యంలో ఆరవవంతు నీకు చెందుతుంది. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు మీరు మమ్ము రక్షించండి " అని వేడుకున్నారు. కనుక ధర్మరాజా ! రాజాజ్ఞను పాలించడం ప్రజల కర్తవ్యం. ప్రజలు రాజును దైవంలా పూజించాలి రాజు ఎప్పుడైనా ధర్మం తప్పి ప్రవర్తిస్తే ప్రజలు దానిని సహించాలి. ప్రజలు ఆ విధంగా ప్రవర్తిస్తేనే శత్రువులు కూడా రాజును చూసి భయపడతారు. ప్రజలే రాజును గౌరవించనప్పుడు శత్రువులు అతడిని అలక్ష్యం చేస్తారు. కనుక ప్రజలు రాజుపట్ల భయభక్తులు చూపడం ఉచితం. రాజుకు ఉత్తమమైన సింహాసనం, వాహనములు, మంచి నివాసగృహం, రుచికరమైన ఆహారపదార్ధములు, ఆడంబరమైన వస్త్రములు, అంగరక్షకులను సమకూర్చడం అత్యవసరం. వాటిని సమకూర్చడం ప్రజలకర్తవ్యం " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఇంకా " ధర్మజా! లోకంలో ధర్మములకు రాజు మూలము. రాజు లేని రాజ్యం నీరులేని సరస్సు వంటిది. రాజ్యపాలన లేకున్న సూర్యరశ్మి లేనట్లు ప్రజలు బాధను అనుభవిస్తారు. ప్రజలు రాజు లేకున్న తమతమ సంపదను ప్రశాంతంగా అనుభవించ లేరు. రాజు లేకున్న ప్రజలు భయాందోళనకు లోను ఔతారు. రాజు రక్షణలోనే ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వహించగలరు. రాజు శత్రువులను జయించిన సంపదను తన్నాశ్రయించిన వారికి దానం ఇస్తాడు. రాజు చారచక్షుడిగా ప్రవర్తించినప్పుడు సూర్యుడిగా ప్రవర్తించాలి. దుర్మార్గులను శిక్షించునప్పుడు యముడిలా ప్రవర్తించాలి. అందు వలన ప్రజలు రాజును దైవంలా భావించి విరాట్, సామ్రాట్ అని పిలుస్తారు. ఇంద్రియ నిగ్రహం పాటించి రాజును సేవించిన వారిని రాజు సకల సందలతో సత్కరిస్తాడు. రాజుకు ప్రజలు శరీరం వంటి వారు. ప్రజలకు రాజు ఆత్మ వంటి వాడు. ప్రజలు రాజును పూజించాలి. రాజు ప్రజలను రక్షించాలి. పై విషయాలన్నీ బృహస్పతి వసుమనుడు అను రాజుకు చెప్పాడు. వసుమనుడు వాటిని పాలిస్తూ రాజ్య పాలన చేసాడు.

రాజ్యపాలన

అప్పుడు ధర్మరాజు " పితామహా ! రాజు జనపద పాలనము, శత్రు సంహారం ఎలా చెయ్యాలో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజైన వాడు ముందు తనను తాను గెలవాలి. తరువాత శత్రువును గెలవాలి. తనను తాను గెలువని వాడు శత్రువును ఎలా గెలువగలడు ? ధర్మనందనా ! తనను తాను గెలవడము అంటే తన లోని కామ, క్రోధ, మద, మాత్సర్యములను గెలుచి జితేంద్రుడు అగుట. అరిషడ్వర్గాలను గెలిచిన రాజు శత్రువులను సహితం గెలువ గలడు. రాజు తన రాజ్యంలోని సరిహద్దులను, రాజ్యములోని జనసంచార స్థలములను, దుర్గములను, అంతఃపురములను తగిన రక్షకభటులను నియమించి రక్షించాలి. రాజు చారచక్షువుగా ప్రవర్తించాలి. రాజ్యమంతా, శత్రురాజుల వద్ద, అంతఃపురంలో చారులను నియమించి ఎప్పటికప్పుడు విషయశేకరణ చేస్తుండాలి. రాజు తాను బలహీను డైనప్పుడు ఆ విషయం శత్రురాజులు పసికట్టక ముందే మరొక బలవంతుడైన మిత్ర రాజుతో సంధి చేసుకొన వలెను. శత్రు రాజుకు కప్పం కట్టి అయినా తన రాజ్యమును రక్షించుకో వలెను. శత్రు రాజు బలహీనుడైనప్పుడు అతడు మైమరచి ఉండగా అతడి మీద దాడి చేయాలి. విషప్రయోగం చేత కాని, అగ్నిని ప్రయోగించి కాని అతడి రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయాలి. అలా అని ఎవరితో తానుగా శత్రుత్వం వహించి కయ్యానికి కాలు దువ్వ కూడదు. ముందు మంచి మాటలు చెప్పి చూడాలి. తరువాత శత్రురాజులలో విబేధాలు కల్పించి లొంగదీసుకోవాలి. ఆఖరి అస్త్రంగా యుద్ధంచేయాలి. రాజు తన ప్రజలను కన్న తండ్రి వలె పాలించాలి. ప్రజల ఆదాయంలో ఆరవ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలి. ఆదాయపు వనరులు సమృద్ధిగా లభించే ఆటవీ సంపద, గోవులూ, గనులు మొదలైన వాటిని సమర్ధులైన అధికారులను నియమించి అభివృద్ధి చేయాలి. తన రాజ్యంలో జరిగే అన్ని అభివృద్ధి పనులను రాజు ఒక కంటితో గమనిస్తూ ఉండి అభివృద్ధి సాధించాలి. రాజు తన కోటను ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉండాలి. పశువులకు గడ్డి, గుర్రములకు దాణా, ప్రజలకు కావలసిన ఆహార పదార్ధాలు, నూనెలు, నెయ్యి, ఔషధములు, యంత్రములను ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుకొనవలెను. మంచి నీటికి బావులను తవ్వించ వలెను. సమర్ధులైన వారిని సైన్యములో నియమించ వలెను. శత్రువు తన మీదకు దండెత్తి రావడం పసికట్టి వారు వచ్చు త్రోవలో వారికి వారి సైన్యముకు ఆహార పదార్ధములు, నీరు దొరకకుండా జాగరూకత వహించాలి. రాజ్యములో రాజును, మంత్రులను, జన పదములను, కోశాగారమును, దుర్గమును, మిత్రరాజులను జాగ్రత్తగా చూసుకోవాలి. రాజతంత్రమును సమర్ధవంతముగా నడపాలి. ధర్మము, అర్ధము, కామము అను పురుషార్ధములను పాటించాలి. సత్వ, తమో, రజస్సు గుణాలను సమపాళ్ళలో పాటించాలి. ప్రమాదవశాత్తు అర్ధము కామము బలహీనమైనా ధర్మము తప్పరాదని అంగీరసుడు, భరద్వాజుడు చెప్పారు. రాజైన వాడు ఇంద్రియములకు వశుడు కాక వాటిని జయించాలి. కామము చేత వశుడై వాటి చేత ప్రేరేరింపబడి జూదం, స్త్రీ సంభోగం, మద్యపానం, ధనమును విచ్చల విడిగా ఖర్చు చేయడం, ఇతరులను అనవసరంగా దండించడం, క్రోధితుడై దురుసుగా మాట్లాడడం మొదలైన గుణములను విడవాలి. వేదాధ్యనము, యజ్ఞములు, యాగములు, దాన ధర్మములు చేయాలి. తనకు తనకు హాని తలపెట్టే వారు చెప్పే కుటిలమైన మాటలను నమ్మ కూడదు. నీతిమంతులైన వారితో దైవచింతన కలిగి సుపరిపాలన సాగించాలి. దేవతలను, బ్రాహ్మణులను పూజించాలి. పితృదేవతలకు తర్పణములు క్రియలు చేయాలి. అశుభమును పారద్రోలి నిత్యం శుభమైన కార్యములు చేస్తూ రాజ్యపాలన చేయాలి. అటువంటి రాజు ఈ లోములోనే కాక పరలోకములో కూడా సిద్ధి పొందగలడు " అని భీష్ముడుచెప్పాడు.

దండనీతి

తరువాత ధర్మరాజు " పితామహా ! రాజు దండనీతిని ఎలా అమలుచేయాలో తెలియచెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! కృతయుగం నుండి రాజు దండనీతిని ధర్మమైన పద్ధతిలో అమలు చేస్తున్నాడు. రాజు దండనీతిని ధర్మబద్ధంగా ఆచరించడం వలన ధర్మనిరతి పెరుగుతుంది. మనం చేసే కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి. ఋతువులు చక్కగా శుభం చేకూరుస్తాయి. ప్రజల జీవితకాలం పెరుగుతుంది. దున్నకుండానే భూమి ఫలసాయం అందిస్తుంది. తరువాత వచ్చిన త్రేతాయుగంలో ధర్మం క్షీణిస్తూ వచ్చి మూడు పాదాలతో నడుస్తుంది. ప్రజలు దానితోనే సంతృప్తి పడతారు. ఇక ద్వాపరయుగంలో రాజు ధర్మాన్ని రెండు పాదాలతో మాత్రమే నడుపుతాడు. ప్రజలు దానితో సంతృప్తి పడతారు. ఇక రాబోవు కలి యుగంలో రాజులో ధర్మాచరణ మీద శ్రద్ధ క్షీణిస్తుంది. ప్రజలలో అధర్మం పెరుగుతుంది. వర్ణాశ్రమధర్మాలు గతి తప్పుతాయి. ఇదంతా కాలగతిలో జరిగే మార్పులను అనుసరించి జరుగుతుంది కాని రాజైన వాడు రాజు ధర్మాన్ని కృతయుగంలో లాగా ఆచరించిన ధర్మంవర్ధిల్లి నాలుగు పాదములతో నడుస్తుంది. లేకున్న కాలగతిలో క్రమక్రమంగా క్షీణిస్తుంది. రాజు ప్రజలు చేసే తప్పులను జాగ్రత్తగా పశీలించాలి. ఎవరైనా తనను తాను పొగొడుతున్నాడంటే అతడికి మదము, అహంకారం, లోభము, దుర్మార్గం ఎక్కువగా ఉంటుందని తెలుసు కోవాలి. అవి లేని వాడు తనను తాను పొగుడుకొనడు. సజ్జనుడైన రాజు నియమ నిబద్ధంగా జీవిస్తాడు. అతడికి పరాక్రమం ఉంటుంది కాని గర్వం ఉండదు. అతడు పరస్త్రీని కోరడు, కోపించడు, సామంతులను ధనం కొరకు వేధించడు. రాజుకు వేదవేదాంగ పారతుడైన పురోహితుడు అవసరం. పురోహితుడు ఎప్పుడూ పురంలో ఉంటూ పురం క్షేమం కోరుతూ రాజును సక్రమ మార్గంలో నడిపించాలి. సామంత రాజుల నుండి కప్పం, కానుకలు స్వీకరించే పనిని రాజు దయ, కరుణ, చతురత కలిగిన మంత్రులకు అప్పగించాలి. రాజు పన్నుల కొరకు ప్రజలను పీడించడం ఆవు పొదుగును కోయడంతో సమానం. తోటమాలి చెట్ల నుండి పండ్లు కోసినంత సున్నితంగా రాజు ప్రజల నుండి పన్నులను వసూలు చేయాలి. ముందు ప్రజలకు అవసరమైన సౌకర్యములు, రక్షణ కల్పించిన తరువాత ప్రజల నుండి పన్నులు గ్రహించాలి. అది రాజుకు ముఖ్యమైన బాధ్యత. ఎన్ని యజ్ఞ, యాగములు దానితో సరి తూగవు.

బ్రాహ్మణ క్షత్రియులు

తిరిగి భీష్ముడు " ధర్మనందనా ! ఇలాదేవికి పురూరవుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఈ భూమినంతా పాలించాడు. అతడు ఒక నాడు వాయువును " భూమి బ్రాహ్మణ, క్షత్రియులలో ఎవరి సంపదగా విరాజిల్లుతుంది " అని అడిగాడు. వాయుదేవుడు " బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఉత్కృష్టమైన ముఖం నుండి జన్మించిన బ్రాహ్మణుడు ఈ భూమి మీద ఉన్న సకలసంపదలను అనుభవించుటకు వాటిని దానం చేయుటకు అర్హుడు. దండనీతిని అమలుచేయుటకు క్షత్రియుడిని, సహజంగా శాంతి కాముకుడైన బ్రాహ్మణుడిని అతడి పురోహితుడిగా నియమించాడు. అటువంటి పురోహితుడికి సకల సంపదలను సమకూర్చి అతడి అడుగు జాడలలో రాజ్యపాలన చేయు రాజు ఈ లోకంలో పరలోకంలో సుఖసంతోషాలు పొందగలడు. ప్రజల యొక్క భయమును పోగొట్టి రక్షించడమే రాజు యొక్క పరమధర్మం " అని వాయుదేవుడు పురూరవునికి చెప్పాడు " అనిభీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

బ్రాహ్మణ ధర్మం

తరువాత భీష్ముడు " ధర్మనందనా ! పూర్వం శుక్రాచార్యుడు పురోహితుడికి చెప్పిన మాటలు నేను నీకు చెప్తాను. రాజు పురోహితుడి ఆధ్వర్యంతో యజ్ఞ, యాగాదులు చేసి దేవతలను, గరుడ, గంధర్వ, విద్యార్ధులను తృప్తిపరచవలెను. పురోహితుడు లేని రాజ్యాన్ని రాక్షసులు, పిశాచాలు పీడిస్తాయి. రాజుకు అను దినము కలిగే అశుభములను పురోహితుడు శాంతి హోమములతో రక్షించి శత్రు రాజులను పురోహితుడు మంత్ర తంత్రములతో నాశనం చేస్తారు. కనుక ధర్మనందనా ! నీవు ఉత్తముడైన పురోహితుడిని నియమించి రాజ్యపాలన చెయ్యి " అన్నాడుభీష్ముడు. కాని పరిశుద్ధుడు కాని పురోహితుడు రాజుకు హాని కలిగించి తానూ నాశనం ఔతాడు. కనుక రాజు బుద్ధిమంతుడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు అయిన బ్రాహ్మణుడిని నియమించుకోవాలి. సకల కార్యములలో రాజు, పురో హితుడు ఒకే మాట మీద నిలిచి ఆ కార్యమును నిర్వర్తించాలి. ధర్మనందనా ! దీని గురించి ఒక ఇతిహాసం చెప్తాను విను. బ్రాహ్మణుడికి క్షత్రియుడికి ఉన్న సంబంధం గురించి కశ్యప ప్రజాపతి ఇలుడికి ఇలా చెప్పాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడి నుండి పుట్టాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడి వలన నియమించ బడతాడు. కనుక బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఒకరి మీద ఒకరు ఆధార పడి జీవిస్తారు. రాజు పురోహితుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటే ప్రజలు వారిని గౌరవిస్తారు. అధర్మం ప్రజ్వరిల్లుతుంది. రాజు పురోహితుల మధ్య సఖ్యత లేకున్న రుద్రుడు ఆగ్రహిస్తాడు. రుద్రుడు ఆగ్రహిస్తే ప్రపంచం సర్వనాశనం ఔతుంది.

ముచికుందుడు

భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు " కుబేరుడు పురోహితుడు ఎలా ఉండాలన్న విషయం ముచికుందుడు తో ఇలా చెప్పాడు. పూర్వకాలంలో ముచికుందుడు అనేరాజు రాజ్య కాంక్షతో కుబేరుడి మీద దండెత్తాడు. కుబేరుడు తన సైన్యమును పంపి ముచికుందుడిని ఓడించాడు. ముచికుందునికి కోపం వచ్చి తన ఓటమికి కారణం పురోహితుడని అనుకుని అతడిని నిందించాడు. ముచికుందుడి పురోహితుడు ముచికుందుడి చేత హోమములు, పూజలు, తపస్సు చేయించి తన మంత్రశక్తితో ముచికుందుడి సైన్యాలకు బలపరాక్రమాలను చేకూర్చాడు. ముచికుందుడు తిరిగి తన సైన్యముతో కుబేరుడి మీదకు దండెత్తాడు. అప్పుడు కుబేరుడు ముచికుందుడితో " నీవు నీ పురోహితుడి మంత్రశక్తితో, తపో బలంతో నా మీద యుద్ధానికి వచ్చావు కాని నీ స్వశక్తితో రాలేదు " అని అవహేళన చేసాడు. అప్పుడు ముచికుందుడు కుబేరునితో " బ్రాహ్మణుడు, క్షత్రియుడు వేరు వేరు కాదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు అని " ఆ బ్రహ్మ అనుగ్రహించాడు. మారు మాటాడక నాతో యుద్ధానికి రా " అన్నాడు. కుబేరుడు " నీతో నేను యుద్ధం చేయను. నీకు కావలసింది నా రాజ్యమే కదా ! దానిని తీసుకో " అన్నాడు. ముచికుందుడు " నీ దయాబిక్షతో వచ్చే రాజ్యం నాకు వద్దు. నిన్ను జయించి నీ రాజ్యం తీసుకుంటాను " అన్నాడు. ముచికుందుడి పరాక్రమానికి సంతోషించిన కుబేరుడు " నేను ఓడాను " అని అంగీకరించాడు. ముచికుందుడు సంతోషించి ఈ సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు. కనుక ధర్మనందనా ! నీవు ఎల్లప్పుడూ ఈ ప్రజలకు అభయ హస్తమిచ్చి, రక్షించి ఈ భూమిని పాలించుటయే రాజధర్మం " అని భీష్ముడు చెప్పాడు.

బ్రాహ్మలను దండించే విధానం

ధర్మరాజుభీష్ముడితో " పితామహా ! బ్రాహ్మణులు మొదలైన వారు తమ తమ వృత్తి ధర్మములు కుల ధర్మములు విడిచి ప్రవర్తించిన ఏమి చేయవలెను. వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఆపదలు సంభవించిన సమయంలో ఏ కులము వారైనా తమ తమ కుల ధర్మములను విడిచి ప్రవర్తించిన వారికి ఏ పాపం అంటదు. కాని క్షత్రియుడు పట్టవలసిన కత్తి బ్రాహ్మణుడు పడితే అతడు తన బ్రాహ్మణత్వం కోల్పోయి క్షత్రియుడౌతాడు. అలాగే బ్రాహ్మణుడు తన కులధర్మం వదిలి వైశ్యధర్మమైన వ్యాపారం చేపడితే అతడు వైశ్యుడు ఔతాడు. అలాగే బ్రాహ్మణుడు ధనార్జన నిమిత్తం ఒకరికి ఊడిగం చేసిన అతడు శూద్రుడు ఔతాడు. ఇలాగే తక్కిన వారు కూడా వారి ధర్మం వీడి పరధర్మం ఆచరించిన కులహీనులు ఔతారు. అటువంటి వారు మరలా తమతమ కర్మలను ఆచరించుటకు అర్హులు కారు. రాజు ఈ విషయములు అన్ని తెలుసుకుని ఎవరూ తమ ధర్మం తప్పకుండా చూడాలి. ప్రజలు సంపాదించుకున్న పుణ్యములో కాని పాపములో కాని నాలుగవ వంతు రాజుకు చేరుతుంది. కనుక వర్ణాశ్రమ ధర్మములు తప్పి చరించిన పాపములో నాల్గవవంతు రాజుకు చేరుతుంది కనుక రాజు అనుభవించాలి " అన్నాడు.

ధర్మరాజు సందేహ నివృత్తి

ధర్మరాజు " పితామహా ! నాకు రాజ్యము చేపట్టాలని కాని రాజ్యసుఖములు అనుభవించాలని కాని లేదు. కాని నేను రాజ్య పాలన చేపట్టి ధర్మరక్షణ, ప్రజారక్షణ నిర్వర్తించగలనా ! అని సందేహం కలుగుతుంది. ఈ రాజ్యం పాప భూయిష్టం. పైగా ప్రజల మీద దండనీతి ప్రయోగించి వారి ఆగ్రహానికి గురి కావాలి. అందుకని ఈ రాజ్యభారం నాకు అక్కరలేదు. మరలా అడవులకు వెడతాను " అన్నాడు. భీష్ముడు నవ్వి " ధర్మనందనా ! క్షత్రియుడవైన నీవు వైరాగ్యం కోరుకునుట రాజధర్మం కాదు. నీ మనసు చాలాసున్నితం. ఇది క్షత్రియలక్షణం కాదు. నీకు బుద్ధిమతి చెప్పుటకు నీ తండ్రి పాండురాజు కాని నీ తాత విచిత్రవీర్యుడు కాని, నీ ముత్తాత శంతనమహారాజు లేడు కనుక నామాట విను. ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వము కేకయరాజు వేదాధ్యనం కొరకు అడవులకు వెళ్ళాడు. అక్కడ అతడిని ఒక రాక్షసుడు పట్టుకున్నాడు. కేకయరాజుకు ఆ రాక్షసుడిని ఎదిరించే బలం లేదు. కేకయరాజు రాక్షసుడితో " ఓ దానవేంద్రా ! నా రాజ్యంలో దొంగతనం లేదు, అక్రమ సంబంధాలు లేవు. నా రాజ్యంలో బ్రాహ్మణులు వేదాధ్యయనం, యజ్ఞయాగములు నిరంతరం చేస్తుంటారు. రాజులు బ్రాహ్మణులను ఆరాధిస్తుంటారు. జనయాగాదులు చేస్తున్నారు. వైశ్యులు గోరక్షణ వ్యాపారం చేస్తూ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. పై మూడు జాతులను సేవిస్తూ శూద్రులు జీవనం సాగిస్తున్నారు. ఈ రాజ్యాంలో నాలుగు వర్ణాలు తమధర్మం చక్కగా పాటిస్తున్నారు. నేను నా ప్ర్తజలు ఏం పాపం చేస్తున్నామని నన్ను ఇలా నిర్బంధిస్తున్నావు " అని నిలదీసాడు. కేకయరాజు మాటలకు ఆ రాక్షసుడు సంతోషపడి రాజును ప్రశంశించి విడిచి పెట్టాడు. కనుక ధర్మరాజా ! కేకయ రాజు లాగా రాజు ధర్మం తప్పక రాజ్యపాలన చేసిన అతడికి ఏ పాపం అంటదు " అన్నాడు.

బ్రాహ్మణ వృత్తి

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! రాజాశ్రయం దొరకని బ్రాహ్మణుడు కష్టకాలంలో ఎలా జీవించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మజా ! బ్రాహ్మణుడు తన వృత్తి ధర్మంలో జీవించడం దుర్భరం అయినప్పుడు ఆపద్ధర్మంగా వైశ్య వృత్తిని స్వీకరించ వచ్చు. కాని ఎక్కువ ధనాశతో ఉప్పు, నువ్వులు, మాంసం, ఆవు, ఎద్దు, అన్నము, నెయ్యి, మధ్యము, నూనెలు మొదలైన వ్యాపారాలు చేయరాదు " అని చెప్పాడు. " పితామహా ! యజ్ఞములు ఏ విధంగా ఆచరించాలి " అని ఆడిగాడు. ధర్మనందనా ! యజ్ఞములు శ్రద్ధ ముఖ్యము, మిధ్యాచారంగా యజ్ఞములు చేయకూడదు. వేదములను అపహాస్యం చేయ కూడదు. యజ్ఞ యాగాదులలో బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించి తృప్తిపరచ వలెను. యజ్ఞయాగాదుల కంటే తపస్సు అధికమైనది. తప్పస్సు వలన ప్రసన్నత, అహింస, సత్యం పలకడం, దయ కలిగి ఉండడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అలవడుతుంది . ధర్మరాజు " పితామహా ! రాజు ఎలాంటి స్నేహితులను నమ్మాలి ? నమ్మకమైన స్నేహితులు లేని రాజు రాజ ధర్మమును నెరవేర్చ లేడు కదా ! అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజు ఎవరినీ అతిగా నమ్మ కూడదు. అలాగని ఎవరినీ నమ్మకుండా నమ్మకుండా ఉండ కూడదు. నమ్మీ నమ్మనట్లు ఉండి కార్యం సాధించాలి. రాజుకు ఎల్లప్పుడూ మేలు చేసే వాడే నిజమైన స్నేహితుడు. అతడి స్నేహం వలన రాజుకు సమస్త శుభములు సమకూరుతాయి. ఎప్పుడూ అప్రమత్తుడై ఉండే మిత్రుడి వలన తలచిన కార్యం సఫలం ఔతుంది, పాపచింతన లేక సుఖదుఃఖములు సమంగా ఎంచి కృషి చేసే స్నేహితుడిని రాజు సముచితంగా గౌరవించాలి. అటువంటి మిత్రుడిని మంత్రిగా చేసుకొనిన అతడు కామ, క్రోధ, మోహ వశుడు కాక తన విద్యుక్త ధర్మములు చక్కగా నెరవేర్చ గలడు. రాజుకు అన్నదమ్ములు అవసరం ఎంతో ఉంది. వారు మంచి వారు కాకున్నా రాజు వారిని గౌరవించాలి. బంధు మిత్రులు అన్నదమ్ముల వలన రాజుకు బలం పెరుగుతుంది. అటువంటి రాజు వైపు శత్రువులు కన్నెత్తి కూడా చూడ లేరు. అంగ బలం లేని రాజును శత్రువులు చులకన చేస్తారు. బంధు మిత్రులతో, అన్నదమ్ములతో బేధాభిప్రాయాలు ఉన్నా రాజు వాటిని బయటకు చూపక గంభీరంగా ఉండి అందరితో కలిసి ఉండడం రాజుకు క్షేమకరం. కొంత మంది రాజును పైపైన పొగడుతూ లోపల అతడికి వ్యతిరేకంగా నడుచు కుంటారు. అటువంటి వారు రాజుకు ఎటువంటి హాని అయినా తలపెట్టగలరు. అటువంటి వారిని గుర్తించి రాజు వారిని నాశనం చేయుట క్షేమకరం " అన్నాడు.

రాజు ధనార్జన[

 ధర్మరాజు " పితామహా ! రాజు ధనార్జన ఎలా చేయాలో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజుకు ధనార్జన చేయు వ్యక్తి ఎంతో అవసరం. అలాంటి వ్యక్తిని ప్రజలు సహించరు కనుక అతడిని రక్షించవలసిన బాధ్యత రాజుది.దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కాలకవృక్షీయుడు అనే ముని ఉండే వాడు. ఆ ముని ఒక కాకిని ఒక పాంజరంలో పెట్టి అది త్రికాల వేది అని అందరికీ చెప్పే వాడు. ఆ కాకిని తీసుకుని ఆ ముని కోసల దేశాధీశుడైన క్షేమదర్శి వద్దకు వెళ్ళి " మహారాజా ! నీవు ధనార్జన పట్ల ఏమరుపాటుగా ఉన్నావు. అందు వలన నీకు ఆపద రానున్నది. ఈ కాకి నీ రాజ్యంలోని దొంగలను పట్టి ఇస్తుంది " అని చెప్పాడు. రాజు అతడిని సాదరంగా ఆదరించి తన మందిరంలో విడిది చేయించాడు. ఆ రోజు కొందరు రాజోద్యోగులు ఆ కాకిని పట్టుకుని చంపేసారు. మరునాడు కాలకవృక్షీయుడు ఆ విషయం రాజుకు చెపుతూ " రాజా నా పేరు కాలకవృక్షీయుడు. నేను నీ తండ్రికి మంచి మిత్రుడను. మీ తండ్రి గారు మరణించిన తరువాత ఈ రాజ్యంలోఉండ లేక తపసు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను. నీ తండ్రి గారి తరువాత నీవు రాజువు అయ్యావు. నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నీ రాజ్యం అంతా తిరిగాను. నీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి అధముల కుయుక్తి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని తెలుసు కున్నాను. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. నాతో తీసుకు వచ్చిన కాకి సాధారణమైనది. దానికి ఎలాంటి మహిమలు లేవు. కాని మహిమలు ఉన్నట్లు అందరిని నమ్మిఆంచాను. అది నిజం బయట పెడుతుందన్న భయంతో దానిని ఆ దుర్మార్గులు చంపారు. కనుక అంతఃపురంలోనే అన్యాయం జరుగుతుంని అర్ధం ఔతుంది. ముందు నన్ను నమ్మనట్లు నటించి నన్ను వెళ్ళగొట్టు. తరువాత ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికి విరోధములు కల్పించి వారిని శిక్షించు. ఆ రాజు అతడి మాట ప్రకారం దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేసాడు. కనుక మిత్రుడు అలా ఉండాలి " అని చెప్పాడు.
ధర్మరాజు " పితామహా ! మంత్రి ఎలా ఉండాలి ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మంత్రి అనే వాడు జ్ఞానవంతుడై ఉండాలి. పుర జనులకు బంధువుగా మెలిగే వాడుగా ఉండాలి. కార్యశూరుడై ఉండాలి. ధైర్యవంతుడు, శౌర్యవంతుడై ఉండాలి. కౄరత్వం లేకుండా పరిశుద్ధమైన మనసుకలవాడై ఉండాలి. రాజు పట్ల భక్తి శ్రద్ధలు, అనురాగమూ కలిగి ఉండాలి. సుఖము, దుఃఖంలను సమానంగా చూసేవాడై ఉండాలి. తన చెమటను నెత్తురుగా భావించి పని చేయాలి. ఏ సందర్భంలోనైనా రాజు తన మీద నేరం మోపి , ఆగ్రహించి తిట్టినా కోపించక రాజుతో సంబంధ బాంధవ్యాలను చెడనీయక నిజానిజాలు రాజుకు ఎరుకపరిచే ప్రయత్నం చేయాలి. తనలోని లోపములు కప్పి పుచ్చుకుంటూ ఇతరుల లోపాలను కనిపెట్టి తగురీతిన ప్రవర్తించాలి. పైలక్షణాలు కలవాడే మంత్రిగా ఉండడానికి అర్హుడు. రాజు కూడా మంత్రులను ఆదరించి మృదుమధురమైన వాక్కులతో, చిరునవ్వుతో సంతోషం కలిగించాలి. కేవలం దానధర్మం చేసినందు వలన, ప్రియంగా మాట్లాడినందువలన మాత్రమే ప్రజలకు సంతోషం కలుగదు. రాజు ఎదుటి వారి మనసెరిగి పొందికగా మాట్లాడి వారిని నొప్పించక ప్రవర్తించాలి.

పాపపరిహారం

ధర్మరాజు భీష్మునితో " పితామహా ! ప్రజలమధ్య వివాదములు పరిష్కరించే సమయంలో రాజుకు పాపం అంట కుండా ఉండే విధం చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజుకు తీర్పు చెప్పే సమయంలో స్వచ్ఛత, నిజాయితీ, నిష్పక్షపాతం ఎంతో అవసరం. ఆ తీర్పులు ధర్మబద్ధమై ఉండాలి. తీర్పులు చెప్పేసమయంలో నిత్య సత్యవ్రతులైన బ్రాహ్మణుల సహాయం తీసుకోవాలి. ఇరు పక్షముల వాదనలు శ్రద్ధగా ఓపికగా విని న్యాబద్ధమైన, ధర్మబద్ధమైన తీర్పును చెప్పాలి. ధనవంతులకు ఒక మాదిరి పేద వారికి ఒక మాదిరి తీర్పులు చెప్పకూడదు. నేరముకు తగిన శిక్షలు విధించాలి. రాజులు తీర్పులు చెప్పటంలో పక్షపాతం వహించిన ప్రజలు వివాదములు రాజు దృష్టికి తీసుకు రావాలి. ఉరి శిక్ష విధించడం, నేరస్తుల ఆస్తులు జప్తు చేయడం, కారాగారంలో బంధించడం వంటి శిక్షలు విధించే సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఇతర రాజుల వద్ద నుండి దూతలు వచ్చిన సమయంలో వారు తమ రాజులు పంపిన వర్తమానం ఉన్నది ఉన్నట్లు చెప్పినప్పుడు రాజు దూతమీద ఆగ్రహించ కూడదు. దూతను చంపుట మహా పాపం, నరకం సంప్రాప్తమౌతుంది. ఇక దూతకు ఉండ వలసిన లక్షణములు చెప్తాను విను. దూత ఉత్తమ కులజుడై ఉండాలి. మంచి శీలవంతుడై ఉండాలి. చెప్పదలచిన సందేశం లౌక్యంగా, నేర్పుతో కార్యం సిద్ధించేలా పొందికగా చెప్పాలి. దూతకు కార్యదక్షత సమయస్పూర్తి ఉండాలి. ఇక సైన్యాధ్యక్షుడికి కావలసిన లక్షణాలు విను. సైన్యాధ్యక్షుడికి దుర్భేద్యమైన వ్యూహములు పన్నేనేర్పు ఉండాలి. యుద్ధముకు కావలసిన యంత్రముల తయారీలో నేర్పు, ఆయుధప్రయోగంలో నేర్పు, యుద్ధంచేయుటలో నేర్పు ఉండాలి. రాజు ఎవరినీ అతిగా నమ్మ కూడదు. తన కుమారులనైనా అతిగా నమ్మితే తన సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉంది. రాజు అందరినీ నమ్మినట్లే నటించాలి కాని ఎవరినీ నమ్మ కూడదు. అదియే రాజధర్మం " అని చెప్పాడు.

రాజధాని

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! రాజధాని ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగా ఉంటుంది ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! కోటచుట్టూ లోతైన కందకం ఉండాలి. విశాలమైన వీధులు, రెండు వైపులా గృహములు, దుకాణములు ఉండాలి. దుకాణాలలో సమస్త వస్తువులూ లభించాలి. రాజధానిలో సమస్త ధాన్యములు, ఆహారపదార్ధములు సమృద్ధిగా ఉండాలి. నెయ్యి, అన్ని రకాల నూనెలు, ద్రవ్యములు నిలువ ఉంచాలి. పురరక్షణకు ఆయుధాగారములు, అందు సకలవిధ ఆయుధసామాగ్రి, యంత్రములు, రణవిశారదులైన యోధులు ఉండాలి. ప్రజ్ఞావంతులైన పండితులు, విలాసినులు, పరిచారికలు, పరిజనం ఉండాలి. అలాంటి పురంలో ఉన్న ప్రజలకు వారి ఆస్తులకు, రత్నములకు, బంగారముకు, పదార్ధములకు, బంధుమిత్రులకు రక్షణ కల్పించడం రాజుబాధ్యత. రాజు తన రాజ్యంలోని ముఖ్యపట్టణాలలో విశ్వాసవంతులైన ఉన్నతోద్యోగులను, న్యాయాధికారులను మంచి జీతములు ఇచ్చి నియమించి వర్ణాశ్రమ ధర్మాలకు విఘాతం కలుగకుండా రాజ్యపాలన సాగించాలి. రాజు తన రాజ్యములో చోరభయం, దుండగులభయం, జారుల భయం లేకుండా ప్రజలను పాలించ వలెను. రాజు తన రాజ్యంలో పశుసంపదను వృద్ధి చేయాలి. వాణిజ్యం, పశుసంపద, వ్యవసాయం వృద్ధి పొందునట్లు తగిన చర్యలు తీసుకోవాలి. రాజు తన రాజ్యంలో పన్నులు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వసూలు చేయాలి. అధికంగా వసూలు చేస్తే దూడకు పాలు వదలకుండా పాలు మొత్తంగా పితికి దూడ మరణానికి కారకులైనట్లు ఔతుంది. కనుక , వ్యాపారషుల మీద, రైతుల మీద, సామంతరాజుల మీద సముచిత పన్నులు విధించి ధానాగారం నింపాలి. ధర్మనందనా ! ధనాగారం నింపడానికి రాజు ధర్మమార్గం అనుసరించాలి. కపటోపాయంతో అధికంగా రాజు ధనం సేకరించడం మంచిది కాదు. ఆ ధనమును అర్హులైన వారికి దానం చేసినప్పుడే ధనసంపాదనకు సార్ధకత లభిస్తుంది. ధర్మనందనా ! పైన చెప్పినట్లు నడుచుకుంటే ప్రజలు సుఖిస్తారు, ధనాగారం నిండుగా ఉంటుంది. యుద్ధంలో శత్రుసంహారం చెయ్యి. శాంతిగా ఉన్నప్పుడు యజ్ఞ యాగాదులు చెయ్యి.

మాంధాత[మార్చు]

ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు మాంధాతకు ఉతధ్యుడు చెప్పిన మాటలు చెప్తాను " రాజు ధర్మరక్షణకే జన్మించాడు కనుక రోషం, క్రోధం, కామము వదిలి ధర్మనిరతుడు కావాలి. ఎందుకంటే ధర్మము వలన ప్రజలు వృద్ధి చెందుతారు. ధర్మం బ్రాహ్మణుల నుండి జనించింది కనుక రాజు బ్రాహ్మణులను గౌరవించి ఆదరించాలి. సంపదకలుగగానే అహంకారం వస్తుంది. దేవతలైనా మునీశ్వరులైనా అహంకారంతో నశిస్తారు. కనుక రాజు అహంకారి, పరస్త్రీ కాముకుడు కాకూడదు. ధర్మం తప్పిన రాజ్యంలో వర్షాలు కురవవు. వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. రాజు పరాక్రమం నశిస్తుంది. రాజును బంధుమిత్రులు వదిలి వేస్తారు. ప్రజలు దీనత్వం పొందుతారు. శత్రువులు దండెత్తుతారు. కనుక రాజు ధర్మవర్తనుడైన బంధుమిత్రులతో సుఖిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు " అని చెప్పాడు " అని భీష్ముడు చెప్పాడు.

రాజు వృద్ధి చెందుట

ధర్మరాజు " పితామహా ! రాజు ధర్మమార్గంలో ఎలా వృద్ధి చెందగలడు. భీష్ముడు "ధర్మనందనా ! పూర్వం కోసలాధీశుడు వసుమనుడు అనే రాజుకు వామదేవుడు అనే ముని ఇలా చెప్పాడు " రాజుకు ధనసంపాదన కంటే ధర్మనిరతి ఎంతో ముఖ్యం. దాని వలన, శాశ్వతకీర్తి సకల సిద్ధులు లభిస్తాయి. ధనసంపాదనకు అధర్మంగా ప్రవర్తిస్తే ఆ సంపాదన నిలువదు. అంతే కాక అతడికి అపకీర్తి, నరకము ప్రాప్తిస్తాయి. రాజుకు అత్యధిక సంపాదన కావాలంటే ఇంకా ఇంకా ధర్మనిరతి కావాలి. రాజు తన సైన్యమును ఎప్పుడూ సంతృప్తి పరచాలి. శత్రువులు దండెత్తినప్పుడు అది ఎంతో సహకరిస్తుంది. రాజుకు ఎప్పుడూ పరాయి దేశముల మీదకు దండెత్తి వారి సంపదలను హరించాలన్న కోరిక ఉండకూడదు. రాజు ఇరుగు పొరుగు రాజులతో సఖ్యతగా ఉండి తన రాజ్యమును వీలైనంత శత్రురహితం చెయ్యాలి. శత్రురాజులు దండెత్తినా సాధ్యమైనంత వరకూ ఉపాయంతో పరిష్కరించాలి కాని యుద్ధానికి పాలడరాదు. తన సైన్యంలో అంతఃకలహాలు చెలరేగినప్పుడు వారితో యుద్ధముకు దిగక సంధి కొరకు ప్రయత్నించాలి. సామ, దాన, బేధ, దండోపాయాలతో ప్రయత్నించి విఫలమైన శుక్రనీతిని ప్రదర్శించాలి. అంటే ముల్లును ముల్లుతోటే తీయాలి అన్నట్లు శత్రువును ఉపేక్షించాలి " అన్నాడు.

యుద్ధనీతి

ధర్మరాజు " పితామహా ! యుద్ధ సమయంలో అనుసరించ వలసిన నీతి ఏమిటి? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! యుద్ధంలో సమాన నీతిని శత్రువు పట్ల ప్రదర్శించాలి. శత్రువు చతురంగబలంతో వస్తే రాజు చతురంగబలంతో యుద్ధం చేయాలి. శత్రువు ఒంటరిగా వస్తే ఒంటరిగా పోరాడాలి. శత్రువు మాయోపాయాలు, కపటోపాయాలు ఉపయోగిస్తే నీవూ అదే ఉపాయాలు ప్రయోగించాలి. వెను తిరిగి పోతున్న వారిని , ప్రమాదంలో ఉన్న వారిని, కత్తి, ధనస్సు విరిగిన వారిని, గుర్రము మీద నుండి పడిన వారిని, మరొకరితో యుద్ధం చేస్తున్న వారిని, శరణుజొచ్చిన వారిని చంపరాదు. శత్రువును అధర్మ మార్గంలో చంపడం కంటే ధర్మమార్గంలో మరణించడం మేలు. రాజెప్పుడు పడక మీద చావడం కంటే యుద్ధంలోచావడమే ఉత్తమం. విషపూరిత ఆయుధమును ప్రయోగించిన వాడు నరకానికి పోతాడు. శత్రువు మీదకు దండెత్తి అతడి పట్టణం ముట్టడించి, ప్రజలను హింసించడం మహాపాపం. రాజుకు అంతటి కాఠిన్యం తగదు. బ్రాహ్మణుల ఇళ్ళను దేవాలయాలను దోచుకోకూడదు " అని చెప్పాడు.

పరిహారం

ధర్మరాజు "పితామహా ! అందుకే రాజధర్మం కంటే మహాపాపం మరొకటి లేదు కదా ! ఎలాగైనా రాజుకు అధోగతి తప్పదు కదా ! " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీవు చెప్పినది నిజమే అయినా ఇందుకు పరిహారం ఉంది. తనను శరణుజొచ్చిన వారిని రక్షించి ఆదరించడం, యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేయించడం. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడం, బ్రాహ్మణులను ఆదరించడం, యజ్ఞయాగాదులు చెయ్యడం వంటి కార్యములతో పరిహారం చేసుకోవచ్చు. రాజు ధర్మపాలన చేస్తే ఉత్తమ గతులుప్రాప్తిస్తాయి " అని చెప్పాడు.

వీరులకు ఉత్తమ లోక ప్రాప్తి

ధర్మరాజు " పితామహా యుద్ధంలో వీర మరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి ? " అని అడిగాడు. భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు " ధర్మనందనా ! పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణానంతరం స్వర్గలోకం వెళ్ళాడు. స్వర్గలోకంలో తన దగ్గర పరిచారకుడు సుదేవుడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగడం చూసి దేవేంద్రుడిని చూసి " దేవేంద్రా ! నా దగ్గర పరిచారకుడు ఎటు వంటి యజ్ఞయాగములు చెయ్యకనే ఎలా నా కంటే అధికంగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు " అని అడిగాడు. ఇంద్రుడు " సుదేవుడిని గురించి ఇలా చెప్పాడు " పూర్వం శృతశృంగుడు అనే రాక్షసునికి సదముడు, వదముడు, దముడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చెయ్యడానికి పంపుతూ " వస్తే విజయంతో రా లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు " అని చెప్పావు. వారి గురించి చారుల వలన తెలుసుకున్న సుదేవుడు వారి మాయోపాయములను గురించి తెలుసుకుని వారిని జయించడం సాధ్యం కాని పని అని తలచి సైన్యమును వెనుకకు పంపి శివుని స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై " మహావీరా! నీ వంటి వాడికి ఇది తగదు. ఎందుకిలా చేస్తున్నావు " అని అడిగాడు. సుదేవుడు " శంకరా ! శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకుని జననష్టం కావడం ఇష్ట పడక ఇలా చేసాను " అన్నాడు. అప్పుడు శివుడు అతడికి దివ్యరధమును, దివ్యధనస్సును, దివ్యమైన అంబుల పొదిని ఇచ్చి ఏ మాత్రం కాలు కింద పెట్టకుండా శత్రుసంహారం చెయ్యమని చెప్పాడు. సుదేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు, దముడిని యుద్ధంలో సంహరించాడు. సోదరుల మరణానికి కోపోద్రేకుడైన విదముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరచి రధము దిగి విదముడిని ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరిక్కుని ఇద్దరూ చని పోయారు. రాక్షససైన్యం చెదిరి పోయింది నీకు విజయం చేకూరింది. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా వీర మరణానికి సాటి రావు " అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని " భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మనందనా ! ఒక సారి జనకుడికి ప్రత్యర్ధుడికి యుద్ధం సంభవించింది. అప్పుడు జనకుడు తన సైన్యముతో " మహా వీరులారా ! మీకు వీరమరణం చెందిన వారికి ప్రాప్తించే సకల సుఖాలకు స్థానమైన స్వర్గం కావాలా ! లేక పిరికి వారికి కలిగే నరకం కావాలా !"అని అడిగాడు. జనకుని అంతర్యం తెలుసుకున్న వీరులు ప్రాణాలకు తెగించి పోరాడి జనకునికి విజయం సాధించి పెట్టారు. కనుక ధర్మనందనా ! వీరుడికి స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి " అని భీష్ముడు చెప్పాడు.

Sunday, 31 December 2017

ఇది మన సాంప్రదాయమా!

ఇది మన సాంప్రదాయమా!
అది ప్రభుత్వ ఉత్తరువై,ఆంగ్లేయ కేలెండరును పాటించినంత మాత్రాన వారి ఆచార వ్యహారాలు పాటించనవసరము లేదన్నది నా అభిప్రాయము. మతముల పేరుతో వ్యవహరించే రెండు సమాజములు అన్యులను తమ మతములో కలుపుకొనుటకు ఎన్నో ప్రలోభములను చూపుతూ వుంటే, మన ధర్మము మనది అని నాబోంట్లు చెప్పినా , వినక ఆచరించే వారు ఆచరించగా, అది సరియైనదే అని అనవసర సానుభూతి చూపే స్వధర్మానుచారులు ఎందఱో వున్నారు. అట్టి ఉదార చరితులకు ఈ పద్యము అంకితము.
 అరుపులు కేకలున్ మరియు నర్థము పర్థములేని వాగుడున్
తురగమునెక్కి తూలుచును దూరుచునన్యుల నర్ధరాత్రమున్
మెరుపులవోలు భామినులు మేనికి వస్త్రము లేక చిందులన్

పరువును వీడి త్రొక్క బహుబాగని మెచ్చుటె న్యూయియర్సు డే!

Sunday, 24 December 2017

తోటకము


ఛందో గ్రంథములలో రంగనాథుని తోటకములివి రెండు కానవచ్చినవి.
బాలబోధ చ్ఛందస్సులో -
తోటకము.
ఉపవాసము లెల్లను నుండుట నీ
కృప వచ్చుటకా యది రిత్త సుమీ
యపవిత్రునిఁ బుల్లని యంబలికై
సుపవిత్రునిఁ జేయుట సుద్ది గదే. 229

హనుమచ్ఛందస్సులో -
తోటకము.
చెలువార గజాజిన చేలముతో
గళనీలిమతో నహి కంకణుఁడై
తలఁ జంద్రకళం గల దైవము మా
కులదైవము దైవత కోటులలో\న్‌.

శివ పంచకము
జనజీవన దాతగు చంద్రధరా
పిలుపే వినవేల పినాకకరా
కలుషాత్ముడ హీనుడ కావగరా
చెడనీయక నీదరి చేర్చు హరా
నిను కొల్వగ చేయగ నీ స్మరణం
హర నామది నీకగు ఆవరణం
నెలవన్నది నాకిక నీ చరణం
హర నీ స్తుతి నాకగు ఆభరణం
శివ శంభు మయస్కర శీత శిరా
భవబంధ విమోచన భాగ్యకరా
కవిగాయక వందిత కావ్య వరా
వరదాభయ, వారణ వస్త్ర ధరా
అధిపాధిప నీ స్తుతి ఆభరణం
శోభాన్వితమల్లది శుభకరణం
ఉత్పాటక పాతక ఉపకరణం
చేర్చేను శుభప్రద శివచరణం
పరిపాలిత కింకర భావ హరా
పరిపూజిత పావనజన నికరా
హసవదన నిశానిశ అధరధరా
వృషభధ్వజ కరుణా వృష్టికరా







Tuesday, 12 December 2017

మరువలేవదేల



మరువలేవదేల
నా జ్ఞాపకాలతోన నీకంట నీరేలా
మదిన చిచ్చదేలా నను మరువలేవదేల
వాడియున్న మల్ల మాల తలనయుంచ నేలా
మనసులో గతాన్ని మరువలేవదేల
                                
                                 నా గమ్యమే వేరు నీ బాట వేరూ
                                 దిశలు వేరు వేరింక కలుపువారు లేరు
                                 అడవిలోన నేనుంటే నగరి నీది బాలా
                                 మరులు గొనగనేల మరువలేవదేల

పిగిలియున్న నా మనసు పలికెనిట్లు లేమా
చేరలేను నీ దరికి నాది ముళ్ళ సీమా
ఆకసాన నీవుంటే నాదునెలవు నేల
కలువలేము బెలా మరచిపోవదేల


చెరుకు రామ మోహన్ రావు

Friday, 8 December 2017

ఆత్మ నివేదన -- దైవమా చాలు ఈ జీవితం

ఆత్మ నివేదన -- దైవమా చాలు ఈ జీవితం
దైవమా చాలు ఈ జీవితం
లోకమంతా ఉదాసీనమే
కలిగియుండేది వ్యాపారమే
        వెలుగు విరజిమ్మెను, చీకటులు క్రమ్మెను
                       ఆశ అడుగంటగా ఆశయము కృంగెను
                      చూపులెడబాసెను, బాధలెదనిండెను
              గుండె బరువెక్కెను, తెల్పుమిది నీకు తగు కార్యమే
ఉన్న సంతోషమును నిల్పుకోనైతిని
జీవినేగాని జీవించ లేనైతిని
ఊపిరులు లాగినా ఊరకెట్లుందును
ఈర్ష్యతో సుఖమును, నీవు కబళింపగా న్యాయమే