Tuesday, 16 January 2018

సంస్కృత భాషా చాటువులు

పొడుపు పద్య భాషా చిత్రము

పొడుపు పద్యాలు చాలా విధాలు చూచినాము.
ఇపుడు పొడుపులో భాషాచిత్రము చూద్దాము.
ఈ శ్లోకమును గమనించండి.
కిమస్తి యమునాంతరే? కిం వదంతి విటం వేశ్యా?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యాం ఏకమేవ ఉత్తరం వద!
యమునా నదిలోపల ఏమున్నది?
విటునితో వేశ్యలు ఏమందురు?
ఆంధ్ర- సంస్కృత భాషలకు సరిపడే విధంగా ఒకే సమాధానం చెప్పండి.
సమాధానం - నీలంజలం
1. కిమస్తి యమునాంతరే?
యమునా నదిలోపల ఏమున్నది? - నీలం జలం
2. కిం వదంతి విటం వేశ్యా?
విటునితో వేశ్యలు ఏమందురు? - నీ లంజలం
ఎంత చమత్కారంగా ఉందో కదా సమాధానము.
సంస్కృత చాటువు -- నపుంసకము
మనము సంస్కృత చాటువులను గూర్చి అపుడపుడు చర్చించుకొంటూనే ఉన్నాము. ఆ వరుసలో ఈ చాటువును కూడా ఒకసారి గమనించండి.
ఒక ప్రేమికుడు సంస్కృత వ్యాకరణకర్త యగు పాణిని ఈ విధముగా దుయ్యబట్టుతున్నాడు
నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః |
తత్తు తత్రైవ రమతే హతాః పాణినా వయమ్||
మనస్సు నపుంసకలింగానికి చెందిన మాట అని పాణినిమహాశయుడు తన వ్యాకరణంలో చెప్పినాడు. ఆ మాట నమ్మి నా మనస్సును నా ప్రేయసివద్దకు రాయభారము పంపినాను. ఆ నపుంసక మనసు నాకుమేలుచెయ్యడానికి బదులు నా ప్రియురాలితోనే నిలచిపోయి నా కొంప ముంచింది. పాణినిమహాశయులు ఈ విధముగా  నా కొంప ముంచి  పుణ్యం మూట కట్టుకుంటాడని ఊహించలేక పోయినాను.  
తన బాధనుగూడా ఆ ప్రియుడు ఎంత చమత్కారముతో చెప్పినాడో చూడండి.
అదీ సంస్కృతముయోక్క గొప్పదనము.

చెరుకు రామ మోహన్ రావు
శివాయ విష్ణురూపాయ - ఒక సంస్కృత చాటువు

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేI
శివశ్చ హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంII
 యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణుమయః శివఃI
యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషిII
 అని చెప్పుచున్నది మనకు వేదార్థము. ఈ శ్లోకములు చాలా మందికి తెలిసే వుంటాయి. ఈశ్వరునికి కాలుడు అని ఒకపేరు. పైగా ఆయన లయుడు. తమోగుణ ప్రతీక అంటారు ఆయనను. కానీ ఆయన శరీరము అంతా తెలుపే. దానికి తోడూ తెల్లనైన భస్మము ధరిస్తాడు. వెండికొండలో ఉంటాడు. స్వచ్ఛమైన చంద్రుని కలిగియుంటాడు. ఆయన వాహనము నంది తెలుపు. ఎప్పుడూ చల్లదనము కలిగియుంటాడు. అభిషేక ప్రియుడు. ఈవిధముగా అన్నీ సత్వగుణ ప్రధానములగు గుణములనే కలిగియుంటాడు. మరి విష్ణువో సత్వగుణ ప్రధానుడు. కానీ ఆయన నలుపు. ఆయన పవళించే ఆదిశేషుడు నలుపు. ఆయన వాహనము గరుత్మంతుడు నలుపు. ఆయన స్థితి నిరత నిద్ర.
మనము కాస్త పరిశీలనాత్మకముగా ఆలోచించితే శివుని స్వరూప స్థితిగతులు సత్వగుణ సూచకములు. కానీ ఆయన లయ కర్త. మరి విష్ణువో బాహ్యలక్షణములన్నీ తామసికములు కానీ కర్తవ్యము మాత్రము దుష్ట శిక్షణ లోక రక్షణ. ఈ విధమగు ఆలోచన చేస్తే వారిది అభేద వ్యాజ్యము అని మనకు అర్థమైపోతుంది.
ఈ చాటువు గమనించండి. ఎంత చక్కగా మనకు ఆ అర్థము సార్థకమౌతుందో అర్థమౌతుంది.
వాసుదేవ ఇతి వామదేవ ఇతి ఆస్తి కల్పక మహీరుహద్వయం
యద్యపీహ సుమభేద సంభవః  నాస్తి తత్ర ఫలభేద సంభవః
వాసుదేవుడు అంటే విష్ణువు. వాసుదేవుని కొడుకైనందువల్ల వాసుదేవుడైనాడు కృష్ణుడు. మరి విష్ణువుకు మున్డునున్దియే వాసుదేవుడను నామము కలదు. ఆయన భూభారత. అందుచే భూమినుండి లభ్యమయ్యే వసువులకు కూడా ఆయనే నాథుడు. అందుకే వాసుదేవుడు. ఇక వామదేవుడు అంటే శివుడు. వామదేవ శబ్దానికి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. సులభమైన అర్థమును గ్రహించుదాము. మనము తూర్పును చూస్తూ నిలబడి ధ్యానాదులు చేయవలెను. అప్పుడు మన ఎడమచేయి ఈశాన్యమును చూపిస్తుంది. అక్కడ వున్నవాడు వామదేవుడు. 'వామము' అంటే ఎడమ అని అర్థము. శివునికి ఎడమవైపు పార్వతివుంటుంది. ఆమెకు దేవుడు అంటే ఆమె భర్త.

ఇక విషయానికి వస్తాము.
పై శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే 'వాసుదేవుడు' 'వామదేవుడు' అనునవి రెండు కల్పవృక్షములట. ఆ వృక్షములకు పూవులు వేరట కానీ ఫలమేమో ఒకటేనట. ఇది చోద్యము కాదా! ఇందులో వున్న నిగూఢార్థమును తెలుసుకొంటే ఆశ్చర్యపోతారు. వాసుదేవ లో 'సు' వామదేవ లో 'మ' అంటే సు-మ మాత్రమె తేడా. (సుమము అంటే పూవే కదా!). మిగతా అంతా ఒకటే. ఇరువురిలో ఎవరిని ఆరాధించినా ఫలమొకటే! ఎంత గొప్ప సందేశమును ఎంత చమత్కారముగా చెప్పినారో చూడండి. శంకరులవారు ఉపదేశించినది ఈ అద్వైతమే!
స్వస్తి
అణోరణీయాన్ మహతోమహీయాన్
“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,
హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” 
హాస్యానికి
ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార
భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి
ఆనందించండి.

“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”
పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారట.
ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.


మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి వదిలి వేసారు. వారి భావానికి తగిన విధంగా నేను పూరిస్తాను చిత్తగించండి.” అని పలికి, సరస్వతీ మాతను మనసులో ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం - - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. చూసారా! కాళిదాస కవితావైభావం. మరొక్కసారి పైశ్లోకం చదివి ఆనందించండి.
చమత్కార శ్లోకము
 లక్ష్మీ దేవికీ, పార్వతీదేవి కీ మధ్య సాగిన ఈ సరస సంభాషణను సాదరముగా చదవండి.
శ్లోll భిక్షార్థీ ప్రయాతః సుతను?బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?
జానే బృందావనాన్తే,క్వ చ స మృగ శిశు:? నైవ జానే వరాహం
బాలే,కశ్చిన్న దృష్ట:? జరట వృష పతి:?గోపా ఏవాస్య వేత్తా
లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కాన్యయో త్రాయతాం వః
లక్ష్మీ దేవి చుట్టపు చూపుగా కైలాసానికి వెళ్ళిందట. పార్వతి ఆమెను సాదరముగా తోడుకోనివచ్చి ఉచితాసీనురాలిని చేసి కుశలప్రశ్నలు అడిగింది. పిచ్చాపాటి మాట్లాడుకోన్నతరువాట సరసము శ్రుతిమించి లక్ష్మీదేవి  ఎగతాళిగా పార్వతీ నీ భర్త భిక్ష మడుక్కునేందుకు ఎక్కడికి వెళ్ళినాడు?పార్వతి గడుసుగా బలిచక్రవర్తి యాగానికి వెళ్ళాడు సుందరీ అన్నది.
ఈ రోజు మీ తైతక్కలు ఎక్కడ ? అన్నది  లక్ష్మి , పార్వతి వెంటనే బృందావన ప్రాంతం లో అనుకుంటాను అన్నది. మీ అందాల మృగ శిశువు (వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు కదా!) ఎక్కడ?అన్నది లక్ష్మి ఎగతాళిగా, అందుకు పార్వతి ఈ వరాహాల (విష్ణువు వరాహావతారం) సంగతి నాకేం తెలుస్తుంది అన్నది.  మీ ముసలి ఎద్దు ఏదీ  కనపడదే? అన్నది లక్ష్మి. ఎద్దులూ,ఆవుల విషయం  ఆవులు కాచే వాడికే తెలియాలి. ఇలా ఎకసక్కాలాడుకునే లక్ష్మీ,పార్వాతులు మిమ్మల్ని కాపాడుదురు గాక.

ఎంత సుందరమైన భాష ఎంత సుందరమైన భావము. ఇంతటి గొప్ప భాషను చేయి జార్చుకొన్నందుకు మనము సిగ్గుపడవలెనేమో!
భోజనం దేహి రాజేంద్రా.....
కాళీదాసుకు, భోజుని ఆస్థానానికి సబంధించినదే మరోచాటుశ్లోకం. ధారానగరమునకు దగ్గరలోని ఒక అగ్రహారములో పేదబ్రాహ్మణ దంపతులుంటారు.  తాను పెద్దకవినని బడాయి పోతూ వుంటాడు ఆబ్రాహ్మడు భార్యతో! ఆమె వినివిని వేసారి 'పేదరికమునకు తోడుగా గంపెడు పిల్లలున్నారు కదా మనకు కుటుంబ పోషణతో సతమతమౌతున్నారుకదా,  మీరెందుకు భోజునిఆస్థానమునకు పోయి మీకు తోచిన కవిత్వము ఏదయినా చెప్పి ఆయన వద్దనుండి బహుమతులను గ్రహించుక రాగూడదాఅంది. బ్రాహ్మడు బిక్కమోగమువేసినాడు కానీ ఎట్లయితే అట్లావుతుందని మేకపోతు గాంభీర్యమును ప్రదర్శిస్తూ భార్యతో "అలాగే" అన్నాడు.అతడు ధారానగరము చేరుసరికి సాయంకాలమైపోవుటతో నగరములోని ఒక సత్రములో బసచేసినా డతను.
 భోజనము ముగించుకొని సత్రములోని గుడ్డిదీపము ముందు కూర్చొని కవితా రచన చేయ మొదలు పెట్టినాడు. ఎట్టకేలకు, కట్టకడపటికి, తుట్టతుదకు, చిట్టచివరకుఒకపాదమువ్రాయగాలిగినాడు. అదికూడాఏమిటంటే
 “ భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం" అని. అంటే రాజా నాకు పప్పు నెయ్యితో కూడిన అన్నము పెట్టించమన్నాడు. దానివల్ల ఆబ్రాహ్మణుడు ఈక్రింది శ్లోకాన్ని రుజువుచేసినాడు.
అలంకార ప్రియో  విష్ణుః అభిషేక ప్రియో శివః
నమస్కార ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః
 అర్థము నేను విశదపరచ  నక్కర  లేదు. తరువాత వ్రాయుటకు  చేతగాక  ఆ తాళపత్రమును  తలక్రింద  పెట్టుకొని  నిద్రకు  ఉపక్రమించినాడు.
 ఆ కాలములో రాజు మారువేషములో పరాయి వూర్లనుడి శత్రుదేశపు గూఢచారు లేవరైనా దేశములో ప్రవేశించినారా అని ముఖ్యముగా సత్రములు చావిళ్ళు  చూసేవారు. ఆ రోజు రాజుతోబాతూ కాళీదాసు కుడా వున్నాడు. రాజు గమనించకుండా ముందుకు సాగినాడు కానీ కాళీదాసు బ్రాహ్మణుని తలక్రింద గాలికి రెపరెపలాడే తాళ పత్రమును చూసి అందులో ఏమి వ్రాయబడి ఉన్నదో అన్న సంశాయముతో మీలాగా అచ్చోటికి వెళ్లి ఆ తాలపత్రమును దీసి చదివినాడు. కాళీదాసుకు బ్రాహ్మణుని బాధ అర్థమైనది.
 ఆటను వెంటనే "మాహిషంచ శరశ్చంద్రః చంద్రికా ధవళం దధి” అనగా శరదృతువులోని పండువెన్నెల ధవళ కాంతితో నొప్పారే బర్రె పెరుగుతో కూడినదై వుంటే మిక్కిలిసంతోషమని పూర్తిచేసి ఆ బ్రాహ్మణుని తలక్రింద పెట్టి తన  దారిన  రాజుతో గూడా చక్కగా వెళ్ళిపొయినాడు.
 తెల్లవారి లేచి తన స్త్నాన సంధ్యాదులను ముగించుకొని తాళపత్రాన్ని చూస్తే అది పూర్తి చేయబడివుంది. సంతోషముతో ఎగిరి గంతేసి బిరబిరా భోజరాజువద్దకు  బయలుదేరినాడు  బాపడు, ఎవరు పూర్తి చేసియుండవచ్చు అన్న ఆలోచనే లేకుండా! . ఆస్థానమునకు వెళ్లి తన ప్రవర చెప్పుకొని (Introduction ) తన పద్యము విన్నవించినాడు. రాజు రెండవపాదము విని మురిసి మైమరచి ఇది మా కాళీదాసు రచనను బోలివుంది దానికి అక్షర లక్షలు గ్రహించామన్నాడు. బ్రాహ్మణుడు విషయము అర్థము చేసుకొన్నవాడై కృతజ్ఞతా పూర్వకమైన చూపును కాళిదాసునివైపు  సారించి అశ్రునయనాలతో అక్కడ  నుండి  కదిలినాడు.
 ఆ కాళీ వరప్రసాదుని కనికరము అటువంటిది.

భారతదేశ వినీలాకాశములో సంస్కృతము, కవిత్వము  సూర్యచంద్రులు. ఆవెలుగులే మనకు లేకపోతే భారత భూమిపై వేలుతురేలేదు. అందునా భోజకాళీదాస కథలు కవనభవన సోపానములు. చదవండి. మన సంస్కృత సంస్కృతిని తెలుసుకొండి.
కాళిదాసు – భోజుడు
సంస్కృతము బాల్యములో నేర్చుకొనే అవకాశము లేకపోయినవాళ్ళు, ఆ భాష ప్రాశస్త్యమును, భగవత్ సాక్షాత్కారము పొంది మహాకావ్యములను రచించిన కాళిదాసాది మహాకవుల గొప్పదనమును, అలంకార సమలంకృతమై యొప్పారు కావ్య వైచిత్రిని తెలుసుకొనవలెనంటే ఆదిగా ఆ భాషపై మక్కువను ఏర్పరచుకోవలసి యుంటుంది. అట్టి జిజ్ఞాసకు ఉపాధే భోజ కాళీదాసు కథలు.ఉడుతా భక్తిగా, నేను పండితుని గాకున్నా, పాఠకులలో  ఒక తపనను కలిగించు నెపముతో అప్పుడప్పుడు భోజ కాళీదాస కథలను అందిస్తూ వస్తూవున్నాను. అందులోని ఒక భాగమే ఈ కథ.
ఒకనాడు భోజరాజు కొలువు దీరి యుండగా,ఒక సన్యాసి  వచ్చి ఆయనను ఆశీర్వదించినాడు. రాజు ఆయనతో స్వామీ! కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించినారు. నిత్య ఉపవాసాలతో కృశించి ఏమిసాధించదలచుకొన్నారు. నేను చెప్పబోవు ఈ మాట మీకు తెలియనిదికాదు .
అగ్నిహోత్రం గావాలంబం సన్యాసం పలపైత్రుకంI
దేవేరాచ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్II
కలియుగములో అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసము, సన్యాసము, తద్దినములందు మాంస వినియోగము, కట్టుకొన్న భార్యకు సంతాన లేమి (అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము చేసుకోనుటగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు అని విశదముగా తెలిపినారు కదా మరి మీరెందుకు పాటించుచున్నట్లు? అని అడిగినాడు.
 పైపెచ్చు “గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.” అనికూడా అన్నాడు.
అందులకా యువసన్యాసి “రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది ఏముంటుంది? ‘లోకో భిన్న రుచి’ అన్న నానుడి తమకు తెలియనిది కాదు.
ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాలుగు గుణములు పశువులలోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్య గుణము. మనుష్యులో ధర్మమనునది విశేష గుణము. ధర్మాచరణలేని మనుష్యుడు అపుడు పశువుతో సమానము కాదా! ఈ ధర్మమూ అతని వృత్తి ప్రవృత్తులబట్టి మారుతూ వుంటుంది. రాజధర్మము వేరు మరియు యిచ్ఛాపూర్వక సన్యాసమును స్వీకరించిన సన్యాసి ధర్మమూ వేరు.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవలసి యున్నది. విద్యవలననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనగలడు. తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును కూడా పొందగలడు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నరయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ అని కఠోపనిషత్తు 3-9
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగలడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషులని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతయని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి. దానిని సాధించుటయే ధ్యేయముగా నేను ఈ సన్యాసాశ్రమమును స్వీకరించినాను. నన్ను సరియగు రీతిలో అర్థము చేసుకోనగలరని నానమ్మకము. దయతో ఈ మాటను కూడా ఆలకించండి:
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహ-శాంతి:ప్రియా గేహినీ
వృత్తి: వన్యలతాఫలై: నివసనం,వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నివ్వృతి:
తేషాం యిందు కళావతంస యామినాం మొక్షేపి నో నః స్పృహాII
లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే మా ఇళ్ళు, శాంతికామిని శాంతిగామిని మా ఇల్లాలు, అడవులలో తీగెలతో,పండ్లతో సహవాసమే మా జీవన విధానము. చెట్టు పట్టలే మాకు వస్త్రాలు, సద్వచన ప్రవాహ స్నాతులము అంటే మంచి మాటలు అనుగంగా తరంగముల నోలలాడువారము , ఇటువంటి నిరంతర సుఖసౌఖ్యములు గల్గిన  మాకు నిజానికయితే స్వర్గము పై కూడా  కాంక్ష ఉండదు. బ్రహ్మైక్యమే మా ధ్యేయము అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము కావలసి వస్తే   
చెప్పండి అని విధేయతతో అడిగినాడు. అప్పుడు అతడు “రాజా! ఇంతగా సాదు సాంగత్యము పై అభిలాష చూపే మీ తీయనైన మాటలు తలదాల్చి ఒక్క కోరిక కోరుతాను.నేను సాటి సన్యాసగణముతో  కాశీయాత్రకువెళుతున్నాను. దయచేసి మీ సభలోని పండితులను భార్యా సమేతంగా మాతో పాటు యాత్రకు పంపించండి. త్రోవ పొడుగునా శ్రమ తెలియకుండా పండిత గోష్టులు జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.” అన్నాడు ఆ సన్యాసి. రాజు అందుకు వల్లె యనగా  రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళినారు, ఒక్క కాళిదాసు తప్ప. మీరు ఎందుకు వెళ్ళలేదు? అని రాజు కాళిదాసును అడిగినాడు. కాళిదాసు ఈ విధముగా బదులిచ్చినాడు.
 తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో దూర వర్తినఃI
యస్య గౌరీశ్వర: చిత్తే / తీర్థం,భోజ పరం హి సఃII
భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారు, ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజునకు మనసులో ఒకప్రక్క ఎదో కినుక ఉన్నది. కానీ తెలియబరచలేదు బాహాటంగా!
కొద్దిరోజుల తర్వాత భోజరాజు బయటి దేశముల నుండి వచ్చిన పండిత సదస్సును ఏర్పాటుచేసి వారికి భూరి సంపదలను దానము చేసినాడు. కాళిదాసును మీ నుండి కూడా కవనమును వినగోరుచున్నామన, కాళిదాసు ఈ విధముగా పలికినాడు.

మేరౌ, మందర కందరాసు, హిమవత్సానౌ.మహేంద్రాచలేI
కైలాసస్య శిలా తలేషు, లయ ప్ర్రాగ్భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గణైః: వుద్గీయ మానం యశఃII
చారణులనే దివ్య గాయకుల బృందాల చేత, నీ కీర్తి గురించి  మేరు మంధర పర్వతపు గుహలలో,హిమాలయ మలయ పర్వత శిఖరాగ్రముల మీదా, సహ్యాద్రి మీదనేగాక  అనేకానేక ప్రదేశములయందు, కొనియాడబడుతున్న నీ కీర్తి వినబడినది.

అప్పుడు భోజుడు సంతోషముతో పులకరించిన శరీరము కలిగినవాడై, కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని నేను వినగలిగే వాడిని కాదు కదా! అని తలచుతూ, నిర్మొహమాటముగా మనసులోకలిగిన తన తప్పిదమును కాళిదాసు కు మనవి చేసుకొన్నాడు. ఎంతటి సౌశీల్యమో చూడండి. కవనములో ఎంతటి సౌందర్యమో చూడండి. భాష భావానికి ఎంతగా ఒదిగిపోతూవుందో  చూడండి. సంస్కృతముతో జీవితమునే సంస్కృతము చేసుకొందాము.

స్వస్తి.


Monday, 15 January 2018

ఇదీ ఉపపాండవుల కథ (క్లుప్తముగా)

మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత ఉపపాండవులకు కనిపించదు. 

పాండువులకు ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన 

అభిమన్యుడు, ఘటోత్కచుని వంటి వీరులకు దక్కిన ప్రాధాన్యతా ఉండదు. 

అయినంత మాత్రాన వీళ్లు తక్కువవాళ్లని కాదు. పరాక్రమంలో 

పాండవులంతటివారే! 

కురుక్షేత్ర సంగ్రామంలో తమ వీరత్వాన్ని రుచిచూపినవారే! అలాంటి ఈ 

ఉపపాండవుల గురించి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.

అసలు వీరి జన్మ వృత్తాంతము ఒకసారి గమనించుదాము. హరిశ్చంద్రుని 

సత్యసంధతను పరీక్షించేందుకు, విశ్వామిత్రుడు అతడి కుటుంబాన్ని నానా కష్టాలూ 

పెట్టిన కథ తెలిసిందే! వారి నుంచి సకల సంపదలూ తీసుకోవడమే 

కాకుండా, రాజ్యం నుంచి కూడా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. విశ్వామిత్రుని 

కరకుదనాన్ని ముల్లోకాలూ ముక్కున వేలేసుకుని చూస్తుండిపోతాయి. కానీ 

దేవలోకం నుండి   ఇదంతా గమనిస్తున్న  ‘విశ్వేదేవతలు’  అయిదుగురు  మాత్రం, విశ్వామిత్రుని వంటి 

మహర్షికి ఇట్టి ప్రవర్తన  తగదంటూ వారించ ప్రయత్నిస్తారు. అహం దెబ్బతిన్న 

విశ్వామిత్రడు వారిని మర్త్యులు అనగా మనుష్య జన్మమెత్తమని పించుతాడు.  వారు " 
మహర్షీ మా బుద్ధికి తోచిన మంచిమాట చెప్పుటలో తప్పేమి" యని అడుగగా తన 

తొందరపాటుతనమునకు చింతించిణ వాడై "నా శాపము అప్రతిహతము కానీ 

మీరు భవ బంధములలకు తగుల్కొనక సద్వంశ సంజాతులై జన్మించి తిరిగీ 

మీలోకనకు చేరుకొంటారు" అని శాప విమోచన మార్గమును తెలియజేస్తాడు. 

ఆవిధముగా ఉపపాండవులు ఉద్భవించుట జరుగుతుంది. ద్రౌపది కి ధర్మరాజునకూ 

పుట్టినవాడు ప్రతివింధ్యుడు. వింధ్యపర్వతానికి సాటి అయినవాడు కాబట్టి ఇతనికి 

ఈ పేరు వచ్చిందట. ఇతనికే శ్రుతవింధ్యుడని కూడా పేరు ఉంది. ధర్మరాజు 

తనయుడు కాబట్టి, ఆయన తరువాత హస్తినాపురాన్ని ఏలే అర్హత కలిగినవాడు. 

కురక్షేత్ర సంగ్రామంలో చిత్రసేనుడనే వీరుని సంహరించినాడు.

ఇక ఉపపాండవులలో రెండోవాడు నకులునికీ, ద్రౌపదికీ పుట్టిన శతానీకుడు. 

పాండురాజునకు కుంతి వలన కలిగిన మొదటి సంతానమగు ధర్మజుని కి 

పుత్రోదయము జరిగిన పిమ్మట ధర్మబద్ధముగా ఆ గౌరవము రెండవ భార్య యగు 

మాద్రి పెద్ద కుమారుడైన నకులునితో తన రెండో బిడ్డను పొందేందుకు సిద్ధపడింది. 

అందుకని శతానీకుడు ఉపపాండవులలో రెండోవాడయినాడు. అవక్ర పరాక్రముడగు 

నాతడు దుష్టద్యుమ్నుని  సేనకు నాయకత్వం వహించినాడు.

భీమసేనునికీ, ద్రౌపదికీ జన్మించిన శ్రుతసోముడు ఒకానొక సందర్భంలో 

ద్రోణునీ, అశ్వత్థామను నిలువరిస్తాడు ఈతడు. భీమసేనుడు సహస్ర సంఖ్యాకమైన 

సోమయాగములు చేయగా పుట్టినవాడు కనుక అతనికి “శ్రుతసోముడు” అను పేరు 

సార్థకమయ్యింది

అగ్ని దేవతా నక్షత్రమైన కృత్తికా నక్షత్రమున పుట్టినాడు కనుకు సహదేవుడు

తన కుమారునికి అగ్ని దేవత నామాంతరమైన “శ్రుతసేన” అని  తన కుమారునికి

పెట్టినాడు


అర్జునుడు ఒక మహాత్కార్యమును సాధించి తిరిగి ఇన్ద్రప్రస్థమునకు చేరి

కీర్తించబడే సమయమున పుట్టినాడు కనుక అతనికి“శ్రుతకీర్తి” అను పేరు

సార్థకమయ్యింది. ఉపపాండవులందరిలోకీ చిన్నవాడు కాబట్టి, చాలా గారాబంగా 

పెరిగినవాడు ఈతడు. అయితే విశ్వామిత్రుడు సూచించినట్లుగానే, ఈ 

ఉపపాండవులంతా ఎలాంటి భవబంధాలలోనూ చిక్కుకోకుండా అర్థాంతరంగా 

చనిపోతారుఅశ్వత్థామ చేతిలో.

కురుక్షేత్ర సంగ్రామం ముగింపుకి వచ్చేసరికి మహామహాయోధులంతా 

కుప్పకూలిపోతారు. ఇక కౌరవుల గురువైన ద్రోణాచార్యుని కూడా పాండవులు 

హతమారుస్తారు. అయితే ద్రోణునికి అబద్ధం చెప్పి, ఆయనతో అస్త్ర సన్యాసం 

చేయించి... పాండవులు ఆయనను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారన్న ఆవేశంతో 

రగిలిపోతాడు ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ. తన పగకు ప్రతీకారంగా 

పాండవులను సమూలంగా నాశనం చేస్తానని బయలుదేరతాడు. పాండవులను 

ఎలాగైనా చంపాలన్న కసితో ఉన్న అశ్వత్థామ యుద్ధనీతిని సైతం కాదని రాత్రివేళ 

వారిని చంపాలనుకుంటాడు. ఆ ఆవేశంలో చీకటివేళ పాండవుల గుడారంలోకి 

ప్రవేశించి అక్కడ నిద్రస్తున్న అయిదుగురినీ నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. కానీ ఆ 

చీకటిమాటున అశ్వత్థామ చేతిలో హతులైనవారు పాండవులు కాదు 

ఉపపాండవులు అన్న సత్యాని ఆలస్యంగా గ్రహిస్తాడు. ఈ విధముగా 

మహాభారతంలో ఉపపాండవుల కథ ముగుస్తుంది. ఉపపాండవులను 

అకారణంగా, అధర్మంగా పొట్టన పెట్టుకున్నందుకు చిరకాలం రోగాలతో 

జీవచ్ఛవంగా బతకమన్న కృష్ణుని శాపాన్ని పొందుతాడు అశ్వత్థామ.

స్వస్తి

Sunday, 14 January 2018

శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే

శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.
ఆ పండితునకు  తెలుసు , తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని. శివకేశావాభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని.
 ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం  వ్రాసి ఇచ్చినాడు. ఆ వ్యక్తి చదివి నివ్వెరపోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది.
గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో నః॥
ఆశ్చర్య పోయాడు చదవగానే.  ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి.
గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.
నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.
కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.
శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,
అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ,
రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.
మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.
అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే!" అని చెప్పి
 అతనికి దాని నర్తమును ఈ విధముగా వివరించినాడు. " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును,
 నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోన లేదు. న+ఆది, అంటే మొదటి అక్షరము తీసి చాడువుకోమ్మన్నాను,
అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."
గవీశపాత్రః ... లో గ తీసివేస్తే  వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,
  గరుడు ని చేతచేత గౌరవింపబడువాడు, అంటే గరుడుని వాహనుడైన విష్ణువు.
నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే  గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము   చేసిన వాడు, విష్ణువు.
కుమారతాతః .... 'కు' తీసివేస్తే మారతాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)
శశిఖండ మౌళి: ... 'శ' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలిపింఛము ధరించిన వాడు కృష్ణుడు, అనగా  విష్ణువు.
లంకేశ సంపూజిత పాద పద్మ: మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .
 క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు  పూజించు పాదపద్మములు కలవాడు,  విష్ణువు.
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ,
బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .
ఇక 'ప' తీసివేస్తే  రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .
అడిగినతడు శిగ్గుతో తలవంచుకొన్నాడు.
గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రాసాయనికాది ఏ శాస్త్రమునకైనా మహనీయులు వ్రాసిన
 రామాయణ భారత భాగవత రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము.
ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆభాషకు అనుంగు బిడ్డ అయిన ఆంధ్రము నేర్పించండి.
ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది.
 స్వస్తి

Sunday, 7 January 2018

భాగవత శ్రవణము మరియు పఠనము

భాగవత శ్రవణము మరియు పఠనము

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన.
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పరతు.
భాగవతమును  గూర్చి సమగ్రముగా సంపూర్ణముగా తెలుసుకొని దానిని గూర్చి పలుకుట ఈశ్వరునకైనను, బ్రహ్మకైనను,సాధ్యము కాని విషయము. అట్టి భాగవతమును నేను కని విని ఎరిగిన మేరకు తెలిపెదను అంటున్నాడు రామపాద సేవాంకితుడు పరమ భక్తాగ్రేసర చక్రవర్తి పోతనామాత్యుడు.
అసలు ఒక మంచి విషయము చెప్పవలెనంటే ఒక మంచి శ్రోత లేక పాఠకుడు కావలెను. అప్పుడు ధన్యత ఇరువైపులా చేకూరుతుంది. అందుకే పెద్దలు భాగవత శ్రవణమును పెళ్ళితో పోల్చినారు. , అది లిఖిత పూర్వకము కావచ్చు లేక వాచక రూపము కూడా కావచ్చు, పరమాత్మ పాదాంకితుడగు వ్యక్తి యొక్క ప్రవచనమే ‘అనుగ్రహము'. 'అనుగ్రహోహి వరః ప్రోక్తః' అన్నారు ఆర్యులు. ఈ 'అనుగ్రహము' వరుడు. మరి వధువు ఎవరు. వేరెవరో కాదు ఆలకించే వ్యక్తి యొక్క భక్తి. ఆ వ్యక్తి ఎంత భగవద్విధేయుడై వుంటేనో అతనిలో అటలమగు, అచంచలమగు భక్తి బహిర్గతమౌతుంది. ఆ 'భక్తి ' ఈ పెళ్ళిలో వధువు. మరి ఈ వధూవరులు భార్యాభార్తలయితే వారి సంతానమెట్లుంటుంది అంటే, కుమారుడు 'జ్ఞాన ప్రబోధుడు' అగుతాడట. మరి ఒకే సంతానమా అంటే ఒక కుమార్తె కూడా కలుగుతుందట. ఆమెయే 'శ్రద్ధ'. మరి అటువంటి సంతానము గల సంసార,మునకు ఏమి కొదవ ఉండగలదు. వీరిరువురు ఒకేచోట వుంటే వారు చేసే కార్యము ఉత్సవమే! అసలు ఉత్సవము అంటే ఏమిటో తెలుసుకొందాము. ఉత్ అన్న ధాతువుకు ఉత్కృష్టము అని అర్థము. సవము అంటే యజ్ఞము అని అర్థము. అంటే ఈ భాగవత ప్రవచనమే ఒక అత్యుత్కృష్ఠమగు యజ్ఞము. భాగవతము రెండు పర్యాయములు వినవలెనట. మొదటి సారి భక్తి కలుగుటకు రెండవసారి భక్తితో కూడి వినుటకు. అప్పుడే అది ముక్తి మార్గము పై నీకున్న శక్తి , ఆసక్తిని కలిగిన వ్యక్తిగా గుర్తించుతుంది.
అసలు భాగవతము వింటే కలిగేదేమిటి? ఒరిగేదేమిటి? దానికి జవాబు 'భాగవతము' అన్న పేరే చెబుతుంది. 'భకారము' భక్తిని, ‘గ కారము’ జ్ఞానమును, ‘వకారము’ వైరాగ్యమును, ‘త కారము’ తత్వమును, ‘మాకారము’ మోక్షమును మనకు అందించుచున్నవి. అంటే ఒక్క భాగవతము చదివినా, వినినా జీవాత్మను పరమాత్మలో ఐక్యము చేసుకొనవచ్చును. కానీ దీనికి కావలసినది సత్వ సిద్ధి, తత్వసిద్ధి. ఆ నిశ్చల తత్వము అన్నది మనకు ఏర్పడితే జీవన్ముక్తి దానంతట అదే లభించుతుంది. అందుకే గుర్వష్టకములో జగద్గురువు శంకరులవారు ఈ విధంగా చెబుతారు.
శరీరం సురూపం తథా వా కలత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! 
అందమైన శరీరము, రూపవంతురాలగు భార్య, ఎంతో చిత్రమైన గొప్పదైన కీర్తి, మేరు సమానమైన ధనము ఉన్నా, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము? ఇక్కడ మనకు గురువు భాగవతమే, అసలు ‘హరేరంఘ్రి పద్మే’ అనే పాఠాంతరము కూడా వున్నది. శ్రీ కృష్ణపరమాత్ముడు ఎట్లయినా జగద్గురువే ! అందుకే వ్యాసులవారు పద్మ పురాణములో శ్రీ కృష్ణులవారిని గూర్చి ఈ విధముగా చెబుతారు.
సచ్చితానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే
తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ నమోనమః
ఇక్కడ పురాణము అన్న మాటకు అర్థము ఒకసారి చెప్పుకొందాము. పురా అంటే ప్రాచీన అణ అంటే తెలుపుట, చెప్పుట అన్న అర్థముతో పురాణము సృష్ట్యాది జరిగిన చరిత్రగా భావించ వచ్చు. ఆధ్యాత్మికముగా ఈ మాటకు ఇంకొక అద్భుతమయిన అర్థమును అన్వయించుకొనవచ్చును.
పురా అంటే మనసులు అణ అంటే జీవింపజేసేది. ‘పురాణి అన్తఃకరణాని ఆణయతేతి  జీవయతేతి పురాణం’ కావున మనసులు జీవించుట అంటే మనసులకు ఒక నిలకడ ఏర్పడుట. అప్పుదేకదా అవి జీవింప గలుగుతాయి. ఈ నిలకడే నిశ్చలత. ఈ నిశ్చలతే జీవన్ముక్తికి సోపానము. ఆ నిశ్చలతను ప్రసాదించేదే భాగవతము.
ఈ భాగవతకల్పవృక్షమునకు ‘కృష్ణ మూలము’ శుకాలాపాభిరామమ్ము’ కలిగియుండుటచే భాగవతము జగద్దితమైనది. ఇక్కడ ‘కృష్ణుడు మూలము అన్నది ప్రసిద్ధార్థమయితే కృష్ణద్వైపాయనుడు మూలము, అంటే మరి వ్రాసింది ఆయనే కదా!, అన్నది అంతర్లీనమగు అర్థము. ఇప్పుడు విశ్వ శ్రేయస్సుకై భాగవత ప్రాచుర్యమును నేల నాలుగు చేరగులకూ వ్యాపింపజేసిన ఆ మహనీయులను గూర్చి రెండు మాటలు చెప్పుకొందాము.
శుక మహర్షి తల్లి గర్భములో 12 సంవత్సరములు వుండినాడట. తల్లి పేరు వీతాదేవి అని పెద్దలచే విన్నట్లు జ్ఞాపకము. శుకబ్రహ్మను గూర్చి పద్మ పురాణము, స్కాందపురాణము ఆదిగాగల పురాణములలో వింటాము. నవమాసములు దాటిన పిమ్మట వ్యాసులవారు కుమారుని బయటికి రమ్మంటే నేను రాను అన్నాడట శుకమహర్షి. నింపాదిగా గర్భస్థ శిశువుకే వేదాది విద్యలు బోధించ సాగినాడు వేదవ్యాసుడు. గర్భములోనే శుకునికి 12 సంవత్సరములు గడచిపొయినాయి. అప్పుడయినా వస్తాడనే ఆశతో కుమారుని బయటికి రమ్మని పిలచినాడట తండ్రి. కుమారుడు నేను బయటికి వస్తే నన్ను మాయ ఆవరించుతుంది రాను అన్నాడట పుత్రుడు. వ్యాసులవారు ఎంతో బ్రతిమాలితే శ్రీ కృష్ణుడు నాకు ఆశ్వాసనమునిస్తే వస్తానన్నాడట. వ్యాసులవారు కృష్ణ పరమాత్మను పిలుచుకవచ్చి అదేవిధముగా చెప్పించినాడు. తల్లి గర్భము నుండి బయటికి  వచ్చిన శుకుడు 16 సంవత్సరముల బాలకునిగా ద్యోతకమౌతూ వున్నాడు. తల్లిదండ్రులకు శ్రీ కృష్ణునికి నమస్కరించి అడవులకు బయలుదేరినాడు. ఆయన వెంట 4 వేదములను విభజించి, అనేకానేక పురాణములను వ్రాసి, (అందులో ముఖ్యమయినవి 18) 555 బ్రహ్మసూత్రములను వ్రాసి జయమను పేర మహాభారత ఇతిహాసమును వ్రాసి, ఇంకా ఎన్నెన్నో శాస్త్రములు వ్రాసి వైరాగ్య సంపన్నుడయిన వ్యాస మహర్షి పుత్రుని చూచినవెంటనే వ్యామోహ చిత్తుడై  "పుత్రా" అని పిలచినాడట. ఆత్మారాముడయిన శుకుడు భవబంధ గ్రధితుడు కాదు. ఆత్మా ఆరాముడు అంటే ఆత్మ యందే రమించేవాడు అంటే బ్రహ్మజ్ఞాని అని ఒక అర్థమైతే ఇంకొక అర్థములో ఆత్మయందే ఆరామము అంటే విశ్రమించేవాడు అంటే తత్వగ్రాహి. వేరొక అర్థములో   ‘ఆత్మాహి రాధికా ప్రోక్తా’ అంటే రాధా దేవికి ఆత్మ అన్న పేరున్నది కావున ఆమె ఆత్మలో రమించేవాడట.
రాధ ఆత్మలో శ్రీకృష్ణుడు ఒకడూ, శుకరూపమున నుండ పుత్రసమముగా పెంచిన శుకుడు కలకాలమూ నిలిచి యుంటారట. అసలు చిలుక రూపములోనున్న శుకునికి ‘కృష్ణ’ మంత్రమునుపదేశించినది రాధయట. ఈ కథ ఉత్తర భారతమున అమిత ప్రచారములోనున్నది. అటువంటి శుకునకు ఆ పిలుపు ఏవిధమయిన ప్రభావమునూ చూపలేక పోయింది. అడవిలో దట్టమయిన చెట్లకు ఒకవైపు శుకుడు మరొకవైపు వ్యాసుడు నిలిచి వున్నారు. వ్యాసుని ‘పుత్రా’ అన్న పదేపదే పిలుపునకు ఆ చెట్ల చేత శుకుడు జవాబును ఇప్పించుతూవున్నాడా అన్నట్లుందట. వ్యాసులవారి అనుభూతి, అనుభవమునకు ‘ మేము ఏ విత్తనమునుండి భూమిపయికి వచ్చినామో దానిని తండ్రీ అనుట లేదు, మా వల్ల కలిగిన మొక్కను పుత్రా పుత్రీ అని పిలుచుట లేదు. స్థావరములగు మాకే ఇంత వైరాగ్యముంటే మరి నీ కథ ఏమి’ అని అడిగినట్లు వుండినదట. ఇదంతా బ్రహ్మస్వరూపుడగు శుకుని చేయిదమని సూతమహాముని తన గురువు గరిమనుగూర్చి ఘనముగా తెలియజేసినాడు.
అట్టి శుకబ్రహ్మ పరీక్షిత్తునకు భాగవత కథ ప్రారంభించి చెబితే దానిని సూతులవారు నైమిశారణ్యములో శౌనకాది మునులకు తెలుపుటతో లోకవ్యాప్తమయినది. శ్రోత ముందు నేను నాది అన్న అహంకారమును వీడి నిర్మల నిష్కల్మష హృదయులై ఆశీనుడు కాగలిగితే కథకుడు సాత్వికుడై, భగవత్ప్రేరితుడై, స్థిరచిత్తుడై వుండినపుడు కథామృతమును గ్రోలుటకు తగిన రంగము సిద్ధమవుతుందట. దానికితోడు చెట్ల నీడ, స్వచ్చ వాయువు, స్వేచ్ఛా వాయువు కూడా, తోడ్పాటు అయినందువల్ల అచటి వాతావరణము అత్యంత రామణీయకమై, ఆహ్లాద జనకమై శోభిల్లుతుందట. శుకుని మహనీయత తెలుసుకున్నాము. సూతుని మహిత, ప్రాధాన్యత తెలుసుకొందాము.
సూతుడు అంటే బ్రాహ్మణ వర్ణమునకు చెందిన పురుషునికీ క్షత్రియ వర్ణమునకు సంబంధించిన స్త్రీకి కలిగిన సంతానము ‘సూతులు’ అనబడుతారు. ఒక పురాణ కథనము ప్రకారము ఈయన ఇంద్ర హవిస్సు, బృహస్పతి హవిస్సుల కలయికచే జన్మించినాడు అని చెబుతారు. అందువల్ల ఆయనకు యజ్ఞ సంభవుడు అన్న పేరు కూడా వుంది. బృహస్పతి బ్రాహ్మణుడు, ఇంద్రుడు అన్నది పదవి. దానికి 1౦౦ యజ్ఞములు చేసి యోగ్యత సంపాదించుతారు భోమన్దలముఇను ఏలిన రాజులు.  పైఉగా ఇంద్రుడు దేవతల రాజు అగుటచే వారి సంతానముగా ఆయన సూతుడైనాడని తెలియవస్తూవుంది. ఆయన లౌకికముగానే మనము సూతుడని అనుకొన్నా అయన ఆత్మజ్ఞాని. ఆయన అన్నివిధములా బ్రాహ్మణుడు కాకపోయినా పూజనీయుడు. అందుకే శౌనకుడు సూతునికన్నా పెద్దవాడు, ఋగ్వేద ప్రవాచకుడు, ధర్మసారమునెరిగినవాడు, అయినా కూడా సూతుని వద్ద ఎంతయో విధేయతను చూపి భాగవత కథా సారామృతము కోరుతాడు. అది కర్ణరసాయనము కావలెనంటాడు. ‘కర్ణ రసాస్వాద కుశలః’ అన్న మాట వినిపిస్తుంది కావ్యములో! ఇక్కడ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పుకొనవలసి వస్తుంది. అసలు సూతముని శౌనకాది మహర్షులు చేసే యజ్ఞమునకు పిలువనిదే ఎట్లు వచ్చినాడు. సత్కార్యమునకు సత్పురుషులు పోవుట భగవత్ప్రేరితము. దానికి పిలుపుండదు.  మరి శౌనకుడు సూతుని గౌరవించెనే అంటే ఆయన భక్తి జ్ఞాన వైరాగ్య సారమును ఆకళింపుచేసుకొని ఆత్మానందమున ఓలలాడు వాడు. అది తెలిసినవాడు కావున శౌనకుడు ఆయనకు అంత మర్యాద సలిపినాడు. ఇక కర్ణ రసాయనము అని ఎందుకు వాడబడిందంటే
ఈ లోకములో జరిగే అనేక అన్యాయ అత్యాచార, అశ్లీల వార్తా శ్రవణముచే చెవుల వినికిడి నీరసించి పోయింది. మరి రసాయనము అంటే మందుకదా! Ear Drops. పడితే చెవులు మళ్ళీ మొదటికొస్తాయి.
అందుకని అటువంటి కథ కావలెనన్నారు. చూచినారా! కావ్ఈ యములో ఒక్క వ్యర్థమగు మాట కూడా దొరలదు. పైగా కాయ రసము కావలెనట. అంతా వింటే ఎంత జ్ఞాపకముతుందో అన్న సందేహము. రసమయితే ఎంతో ఆనందము ఆహ్లాదము మరియు సులభముగా ఆరిపోతుంది. ఆ కథలు కూడా భక్తిజ్ఞాన వైరాగ్య భరితములై వుండవలేనట. ఇన్ని కోరికలకూ సరిపోయేది భాగవతమేనని ఒక్క తృటిలో సూతులవారు శెలవిచ్చినారు. శౌనకులవారు ఇంకొక మాట కూడా అంటారు. ‘ఇహ ఘోరే కలౌ’ అన్నారు కావున అది కూడా లేకుండా చేయవలెనని ప్రతిపాదించుతారు. కలి పాపభూయిష్టమని అనుకొంటాము కానీ అందు ఒక సౌలభ్యము వుంది. అసలు కలి అన్న మాటకు వ్యుత్పత్తి ఈ విధముగా కూడా తీసుకొనవచ్చును.’కం సుఖం లాతి అనుఘృణ్ణాతి దదాతీతి కలిః’ ‘క’ అంటే సుఖము ‘ల’ అంటే తెచ్చేది. ‘కలౌ నామ సంకీర్తనం’ అని అన్నారుకదా! మరి ఇంతకన్నా సులువౌ మార్గము ఉండదు కదా! ఈ విషయములు పెద్దలద్వారా తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను.
సూతులవారు వెంటనే సర్వ భవరోగ సంజీవిని ‘భాగవతము’ అని తెలియజేస్తాడు. దీనిని తాను తన గురువయిన శుకయోగీంద్రులవారి ద్వారా విన్నానని చెబుతూ ఇది సప్తాహము అంటే 7 దినములలో ముగించవలసిన కథ అంటాడు.
మనమంతా ‘అసురులము.’ ‘అసు’ అంటే ప్రాణములు ‘ర’ అంటే ‘రతి’ ‘ఆసక్తి’ ‘ఇష్టము’. కావున మనము అసురులమే కదా! శారీరిక సుఖములకొరకే కదా మన తాపత్రయమంతా! చిట్టా శుద్ధితో విన్నవానికి సంసార భయనాశనం- భక్త్యోగ వర్ధనం- సావధానతయం  ఈ మూడు గుణములు మనకు అబ్బితే ఇక మన నడవడికలోగానీ భక్తి తత్పరతలోకానీ సహనశీలతోగానీ కొదువ ఏముంటుంది. భగవంతునికి చేరువగుటకు ఇంతకన్నా కావలిసింది ఏముంటుంది. అందుకే భాగవతమును గూర్చి ఈ మాట చెబుతారు ‘కాళవ్యాళ ముఖాగ్రాసత్రాస నిరాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం’ అని. కాలమనే వ్యాళము అంటే భయంకర సర్పము కబలిప వచ్చినచో దానికి నిరాశను కలిగించేదే భాగవతము అని. పైగా అది భక్తి శాస్త్రము. ఇది ఇంతే అని శాసిస్తుంది. కావున అనుసరించుట తప్ప అడ్డ ప్రశ్నలు వేసే అవకాశము లేదు. సూతుడు శౌనకుని ప్రశ్నకు సమాధానముగా తొల్లి బ్రహ్మజ్ఞాన సంపన్నులు, బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినవారు, అదే బ్రహ్మ యొక్క తోడనుండి పుట్టిన వాడు నారదుడు. ఈయనది భక్తి మార్గము. లోకములో ఈయన కలహా భోజనుడను అపప్రథ వుంది.  ఒక్క మాటలో చెప్పవలెనంటే న+అరం+ద అంటే క్లేశము కలుగని జ్ఞాన బోధ చేసేవాడు అని అర్థము. అంతటి భక్తి తత్పరుడు బ్రహ్మజ్ఞాన తత్పరులగు సన చతుష్టయము నుండి భాగవతమును విన్నాడు.  ‘సన’ అంటేనే వేదము వేదము అంటేనే జ్ఞానము. మహనీయుల నామములు ఎంత అర్తవంతమైనవో గమనించండి. అట్టి భాగవతమును స్వయముగా, తండ్రికే చెట్ల ద్వారా జ్ఞానముపదేశించి తండ్రితో గూడక కాననలకేగిన శుకుడు 7 దినములు ఎక్కడికీ కదలకుండా పరీక్షిత్తుకు ఈ భాగవత కథ తెలియజేసినాడు. ఇక్కడ ఇంకొక మర్మము వుంది. ఇటు శుకుడు అటు పరీక్షిత్తు ఇరువురూ భూమిపైకి శ్రీకృష్ణునిచే కొనిరాబడినవారే! శుకులవారిది చిలుక రూపము. మనము అడిగినది పలుకుతుంది. అందుకు అక్షరము ఎక్కువ ఉండదు అక్షరము తక్కువ ఉండదు. మరి చిలుక అంతే కదా! పైగా భాగవతము
అట్టి భాగవతము వినుటకు శ్రోతలుగా కానీ, పాఠకులుగా కానీ కావలసినది తదేక ధ్యాస ధ్యానములు. ఒక తృష్ణ తపన ఇవి కలిగియుంటేనే భాగవతము వినుటకు చదువుటకు అర్హులు. అదేవిధముగా చెప్పువారు కూడా నిష్ఫలాపేక్షతో ఏకాగ్రతతో చెప్పవలెను. కృష్ణావతారము చాలించిన పిదప దేవగణము శ్రీకృష్ణుని స్వస్తానమునకు రమ్మంటే భక్తి అమృత సాగరము అది భాగవతములో మ్వుంది నేను అక్ల్కడనే వుంటానన్నాడట. అందువల్ల భగవంతుని ముందు కూర్చొని నిష్కల్మష హృదయుడై ప్రవచనకారుడు చెప్ప వలసి వుంటుంది. నాకు తెలిసినదానిలో జ్ఞాపకము ఉన్నంత మీ ముందుంచినాను. అందువల్ల మీరు భాగవతము వినదలచినా, చదువదలచినా ఎదో ప్రోద్దుబోని నవలల కథ విన్నట్లు, చదివినట్లు వెళ్ళకండి.
హా కృష్ణాచ్యుత! హా కృపాజలనిధే! హా పాండవానాం సఖే!
క్వాసిక్వాసి సుయోధనాదపహృతాం హా రక్ష మామాతురాం
ఇత్యుక్తోక్షయ వస్త్ర రక్షిత తనుః యో పాలయత్ ద్రౌపదీం
ఆర్తత్రాణ పరాయనాస్సా భగవాన్ నారాయనోమే గతిః

స్వస్తి.

సంక్రాంతి పర్వము

సంక్రాంతి పర్వము
https://cherukuramamohanrao.blogspot.com/2018/01/blog-post_7.html
తీర్చివేసి భయము భ్రాంతి
రైతు కళ్ళలోన కాంతి 
సగటుమనిషిలోన శాంతి
తెచ్చునదే సంక్రాంతి 
మకర సంక్రమణము ఆసన్నమైనది. పల్లెల్లో, ఒక మోస్తరు పెద్ద ఊర్లలో కూడా మారోజుల్లో ఎంతో వేడుకతో జరిపే వారు. వీధులు పూర్తిగా ఆవు పేడతో అలుకబడినాయా అన్నట్లు ఉండేవి. పిండి అంటే ముగ్గులు బియ్యపుపిండితో వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారుచేసి అందులో గుమ్మడి పూవులు కానీ బంతిపూవులు కానీ కుచ్చేవారు. నేడు పల్లెలలో అదే విధముగా జరుగుతూ వుందో లేదు తెలియదు. పట్నవాసులు  తమతమ వీధివారలతో కలిసి ముగ్గులు గొబ్బిళ్ళు పెట్టె వేడుక సామూహికంగా చేస్తే మన సంస్కృతిని పునః ప్రతిష్ఠ చేసినవారవుతారని నా ఆశ. అందుకే సంక్రాంతి ఎందుకు చేయవలెను అన్న విషయముపై కాక నలుగురు సంఘటితమయ్యే విషయమును గూర్చి తెలుపుచున్నాను.
ముగ్గులు రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో ఆవు పేడతో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం.  చుక్కలు నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరిగే వంకర గీతలు ఖగోళ చలనములకు  సంకేతం.  ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (Static Force),చుక్కలు గతిశక్తి (Dynamic Force)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర  ప్రతీకలని తత్త్వవేత్తలు అంటారు. ఇంకొక విషయమేమిటంటే ముగ్గు పరమాణు నిర్మాణమునకు  ప్రతీక. పరాత్పరుడు "అణోరనీయాన్ - మహతో మహీయాన్" . ఆయన అణువునకు లోన అణువుగా ఉంటాడు. బయట అంతట వ్యాపించి బయటి వాటి కంటే గొప్ప వాడై ఉంటాడు. కావున ఈ ముగ్గులు పరమాత్మ తత్వమునకు ప్రతీక. జీవ కారుణ్య చిత్తముతో పరిశీలించిన పిపీలికాది  (చీమలవంటి) ప్రాణులకు 
ఆహారమును సమకూర్చినవారమవుతాము. విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, ముగ్గులు వేయటం కద్దు. ఇదే విధముగా రాశులకు, నవగ్రహాలుకూ సంకేతాలుగా వేస్తారు. ఉత్తరాయణ సూర్యగమన సంకేతముగా రథము ముగ్గును
వేస్తారు. రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్యస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు అని గోపి+ఇళ్ళు గొబ్బిళ్ళని చెబుతూవుంటారు. సంధి ఈ విధముగా ఉండవచ్చునని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు చెప్పియుండినారు. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తారు. గుమ్మడి సూర్యుని ప్రతీకగా దానము ఇస్తారు. సూర్యుని తోలికిరణములకు ప్రతీకగా గుమ్మడి పూవులను గొబ్బెమ్మలకు అలంకరించుతారు.
పొంగలి 
కొత్త బియ్యము కొత్త బెల్లము తో ఆరుబయట పొయ్యిలో పొంగు వచ్చేవరకు ఉడికించి ఆ పొంగు కొంత జారి పొయ్యిలో పడేసమయమున ప్రకృతికి నైవేద్యము చేయుచున్నట్లు భావించి పొంగులో పొంగులు అని అరచేవారు పూర్వము. మన పల్లెలలో ఇంకా జరుపుచున్నారేమో నాకుతెలియాడు గానీ తమిళనాడులో, మద్రాసు వంటి పట్టణములలో కూడా నేటికీ ఈ సాంప్రదాయమును పాటించుతారు. 
ఇంత సంస్కతిని కల్గిన ఈ పండగను పట్టణములలో కూడా అన్యోన్యతతో కూడి ఆనందముగా జరుపుతాము.

స్వస్తి.