Thursday, 2 August 2018

పాహి భారతీ తీర్థ - తవ చరణం – మమ శరణం


                                           పాహి భారతీ తీర్థ - తవ చరణం – మమ  శరణం                    

                                                                                                       వేదవదన శ్రిత భక్త కరుణ మమ

                                                                                      దురిత దమన అను నిత్యం
                                                                          దురిత దమన అను నిత్యం
                                                                             భవ తాపహర గురుదేవ
                                                                             మమ పాపహర గురుదేవ
                                              1. జ్ఞాన కుసుమ వని శాస్త్ర దివ్య ఖని
                                 ఆర్ద్ర హృదయ సదన
                                 ఆర్ద్ర హృదయ సదన
                                       భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                                                                2. రాగ నేత్ర యతి పాణి వేత్ర ఘన
                                                                        సాంప్రదాయ  సూత్ర
                                                                      సాంప్రదాయ సూత్ర
                                                                            భవ తాపహర గురుదేవ
     
                                                                                                                      మమ పాపహరా గురుదేవ 

                                       3. చారుగుణగణ చపల హారణ
                              శారదేందు కిరణ
                              శారదేందు కిరణ
                                      భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                                                           4. భస్మ ధారణ పాప దారణ
                                                                           భక్త వంద్య చరణ శరణం
                                                                 భక్తవంద్య చరణ
                                                                         భవ తాపహర గురుదేవ
                                                                          మమ పాపహర గురుదేవ
                                       5. చంద్ర శీర్షధర చారు శారద
                                      నిత్యపూజ నిరత స్వామి
                                పాహి భారతీ తీర్థ
                                      భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                   గురుదేవ పాదాంఘ్రి రేణువు - చెరుకు రామ మోహన్ రావు











Friday, 29 June 2018

కాంచీ పురాధిదేవతలు


కాంచీ పురాధిదేవతలు
వారించి మహిమచే వాంఛితాల  వరద
వరదరాజులు బ్రోచు '' '' '' యనుచు
కామాక్షి కన్నులు కామకోటిని జేర్చు
కామకోటిని జేర్చు కడలియడుగు
ఏకామ్రనాథుని ఎన్ని మదిన గొల్వ
కొల్వ వీలేలేని కోర్కెలడచు
కామకోటి సుపీఠ కరుణా సుధా ధారి
దారి చూపు తనదు దరినిజేర్చ
అన్న చెల్లి బావ ఆదిశంకర పీఠ
పీఠమయ్యి కంచి పేరు గాంచ
కాంచ పుడమి తల్లి కటికినయ్యెను కాంచి
కాంచి నిలుప భక్తి కలుగ ముక్తి
నేను వ్రాసిన ఈ పద్యము 'సీసము' అన్నది నేను తెలుపనవసరము లేదు. ఇందు నేను ముక్తపదగ్రస్తము
అన్న అలంకారమును ఉపయోగించినాను. అది కామాక్షీదేవి అనుగ్రహము.
మొదటి పాదము 'వరద' తో అంతమయితే తరువార్హి పాదము వరద తో మొదలయ్యింది.
అదేవిధముగా మూడవ పాదము 'కామకోటిని జేర్చు' తో ముగిస్తే నాలుగవ పాదము దానితోనే మొదలయ్యింది.
ఈ విధముగా పద్యము సాగుతుంది. ఇందు ఒక పాదము చివర ఉపయోగించిన పదము
రెండవ పాదము యొక్క ప్రారంభములో ఉపయోగించినా అర్థము అన్వయము వేరుగా వుంటుంది.
పద్యము ఆసాంతము ఈవిధంగానే సాగుతుంది. మూక కవికే మాటలు ప్రసాదించి 'మూక పంచ శతి' వ్రాయంచిన తల్లి సరస్వతీ దేవిని నా తలపులయందుంచి వ్రాయినందుకు ఆ తల్లులకు శత సహస్రానేక సాష్టాంగ దండప్రణమములు.
ఇక భావమును మీముందుంచే ప్రయత్నము చేస్తాను.
తమిళములో '' అంటే 'రా' అని, తెలుగులో '' అన్నా '' అన్నా '' అన్నా రమ్మనియే అర్థము .
కంచి వరదరాజ స్వామిని వరద అని అంటేచాలు వచ్చి మనకోర్కెలు తీర్చేటంత దయాళువు ఆయన.
కోటి కోటి కోరికలున్న మన కోరికలను దీర్చి కామకోటిని చేర్చే తల్లి కామాక్షి కి మ్రొక్కితే చాలు. మన అభీష్టము సిద్ధించుతుంది. ఇక్కడ 'కామ కోటి' అన్న మాటను ఒకసారి మనము విశ్లేషించుకోవలసి వుంటుంది.
చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. కోటి అన్న మాటకు మరియొక అర్థము ఏమిటంటే కొన కొస  అని. కాబట్టి కామకోటి అంటే కామమునకు కొన అంటే మోక్షము అని అర్థము. అమ్మకు ఒక్కసారి నమస్కరించితే కోట్ల కొలది మన కామితాభీష్టములను తీర్చుటయే గాక జన్మాంతమున మోక్షమును ప్రాప్తింపజేస్తుంది.
ఇక కామాక్షీ నాథుడగు ఏకామ్రనాథుని కొలిస్తే, కొలుచుటకు వీలేలేని కోర్కెలను అణచుతాడు.
కామకోటి పీఠ కరుణా సుధాధారి అంటే కంచి కామకోటి పీఠ అధిష్టాన దేవతయగు చంద్రమౌళీశ్వరుడు
ఇంకొక విధముగా అన్వయించుకోదలిస్తే నడిచే దేవుడగు చంద్రశేఖర యతీంద్రులు తనవద్దకు చేర్చుకొంటాడు అని అనుకోవచ్చు.

కావున అన్న (వరదరాజస్వామి విష్ణువు అవతారము .) అంటే నారాయణుడు. ఆయన సహోదరి అమ్మవారు. అందుకే ఆమెను నారాయణి అంటారు. నారాయణునిగా పరమాత్మకున్న లక్షణాలన్నీ శక్తిస్వరూపిణియగు శ్రీమాత అంటే కామాక్షీ దేవికి ఉంటాయి. ఆ తల్లి భార్తయగు ఏకామ్రనాథుడు ఆవిధముగా వరదరాజస్వామికి బావయగుతాడు. కంచి లో మొదట వెలసినది వరదరాజులవారే!
ఆ విధముగా వారు మువ్వురికేకాక చంద్రమౌళీశ్వర, (చంద్రశేఖర సంయమీంద్రుల) పీఠమునకు  పీఠమై (నెలవై) పేరుగాంచిన కంచి భూమికి వఢ్యాణమై
(కాంచి అంటే వఢ్యాణము ఆని అర్థము) చెెలగగా  అట్టి కంచిని గాంచి అంటే చూచి (తిలకించి) భక్తి నిలిపిన ముక్తి కలుగును.

Sunday, 27 May 2018

ఏకనాథుడు (సంత్ ఏకనాథ్)


ఏకనాథుడు (సంత్ ఏకనాథ్)
https://cherukuramamohanrao.blogspot.com/2018/05/blog-post_27.html
ఏకనాథుడు (సంత్ ఏకనాథ్) వార్కరీ సాంప్రదాయానికి చెందిన మరాఠీ పండితుడు మరియు కవి. విఠోబాను ఆరాధించాడు. మరాఠీ సాహిత్యంలో ముందు తరము వారైన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు మొదలైన వారికీ, తరువాతి తరం వారైన తుకారాం, సమర్థ రామదాసుకీ ఒక వారధిగా నిలిచిన వాడు. ఆయన 16వ శతాబ్దం చివరిలో జీవించినట్లు ఒక అంచనా .  పైథన్ లోని 'ఏకవీర' వీరి కులదైవము. ఈయన భాగవత పురాణాన్ని ఏకనాథ భాగవతం పేరుతోనూ, రామాయణాన్ని  భావార్థ రామాయణము అన్న  పేరుతోను  మరాఠీలో వ్రాసినాడు. ఈయన శ్రీకృష్ణునికి పరమ భక్తుడు. రామునికీ అంతే. ఈయన ఉ మూలము అద్వైతమే! శంకరాచార్యుడు సంస్కృతంలో రాసిన 14 శ్లోకాల హస్తామలకం అనే రచనను 764 పద్యాలతో మరాఠీ లో ఆయన తిరగవ్రాసినాడు.

వాల్మీకి రామాయణము 24 వేలశ్లోకములు కలిగినదైతే వీరి రామాయణము 40 వెల శ్లోకములు కలిగియున్నది. ఈయన అపారమగు రామ భక్తుడు కూడా! ఈయనను గూర్చి ఒక చిన్న ఉదంతమును వుటంకించుతాను.
'యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రకృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనికదా ఆంజనేయ స్వామిని గూర్చి చెప్పినారు. రాముని ఎక్కడ కీర్తించుచున్నా సజల నయనుడై అవనత శిరస్కుడై, ముకుళిత హస్తుడై, తదేక ధ్యానములో ఉంటాడట ఆ రాక్షసాంతకుడు.
ఒక సందర్భములో తనరామాయణ కావ్యములో సీతమ్మను వెదకుటకై హనుమంతుడు లంకజేరి అచటి వన భవన విహారాదులను ఆశ్చర్యముగా తిలకించుచున్నాడట. ఈవిధమగు తన్మయతతో ఏకానాధుడు వ్రాస్తూవుంటే ఆంజనేయుడు అచటనే కూర్చుండి తదేకముగా ఆ రచనను పరికించుచున్నాడట. ఏకనాధుడు, తన రచనలో హనుమ ఆ లంకా పురిలో ఎచటికేగినా తెలుపు తప్ప వేరు కనబడుట లేదని వ్రాసినాడు. హనుమ ఆశ్చర్య చకితుడై ఏకనాధుని కట్టెదుట కనిపించి నాకు అంతా ఎరుపురంగులో కనబడితే నీవు తెలుపని వ్రాసినావే అని అడిగినాడట. దానికి ఆయన, నా అంతరాత్మ 'తెలుపు' అని తెలిపింది అందుకే అట్లు వ్రాసినాను అని చెప్పినాడట. పావని కూడా ఊరుకోలేదు. ఆయన వెంటనే స్వయముగా 'ఎర్రగా' వున్నట్లు చూసిన నేను చెబుతూవున్నా నీవు గ్రహించుట లేదే! అని గద్దించినాడట. వాదము పెరిగింది. ఇరువురూ రామ భక్తులగుటచే ఆ శ్రీరామచంద్రుని చేతనే  పరిష్కరింప జేసుకొన దలచినారు. రాములవారిని, వారు ప్రార్థించిన వెంటనే ఆయన ప్రత్యక్షమయి కారణము అడిగితే ఇరువురూ విషయమును వివరముగా చెప్పినారు. తప్పొప్పులను నిర్ణయించమన్నారు.  శ్రీరామచంద్రుడు  ఇరువురి దృష్టీ సరియైనదే అని తీర్పునిచ్చినాడు. ఆ తీర్పు ఇరువురికీ మింగుడుపడలేదు. అది ఎట్లు? మా ఇరువురిలో ఒకరిది మాత్రమె యదార్థము కావలెను అని ముక్తకంఠముతో అన్నారు. అందుకు శ్రీరామచంద్రుడు, హనుమంతుడు లంకాప్రవేశ సమయములో రాజసిక గుణముతో అడుగు పెట్టినాడు. తనకేంతసేపు అటు తనతండ్రి రామయ్య ఇటు తల్లి సీతమ్మ , ఇరువురినీ ఇడుముల బడదోసిన రావణుని రావణుని లంకనూ మట్టుబెట్టుటయే  తన లక్ష్యము. కావున రాజసముతో అరుణారుణ నేత్రుడైన హనుమంతునకు అంతా  రాజసవర్నమగు ఎరుపుగానే కనిపించింది అది వనమైన భావనమైనా ఆకయినా పూవయినా చెట్టయినా పుట్టయినా! పైగా అది త్రేతాయుగాపుమాట. ఎకనాతుడు కలియుగామువాడు. రసమచరిత సర్వస్వమూ ఆకళింపుజేసుకొన్న సాత్వికుడు, నిర్మలుడు, నిశ్చల భక్తి పరాయణుడు.  మరి తెలుపు సాత్వికతకు ప్రతీక. కావున ఆయన కంటికి అంతా తెలుపుగానే కనిపిస్తుంది కావున ఇరువురిదీ సబబే, సమంజసమే! అని అన్నాడట. భాస్క్తులిరువురూ ఆర్ద్రచిత్తులై స్వామికి సాష్టాంగ ప్రనామములను ఆచరించినారట.
చూచినారుకడా పరమాత్ముని భక్త వాత్సల్యము. వర్ణనలు ఎన్ని దాగినా, ఎట్లుసాగినా రాముడే నాయకుడు, రాముడే రక్షకుడు.
పైన తెలిపినది రామ పారమ్యతకు సంబంధించినది అయితే ఇపుడు చెప్పబోయేది శ్రీకృష్ణునకు సంబంధించినది. 
ఏకనాధులవారిని గూర్చి ఎన్నో ఉదంతములు ప్రచారములో వున్నాయి. అందులో ఇపుడు నేను తెలుపబోయేది ఒకటి. ఇది శ్రీ కృష్ణ సంబంధమయినది.

ఒకనాడు ఆయన తండ్రి శ్రాద్ధమున కై వివిధ రకములైన వంటకాలు చేయించినాడు. ఆ సువాసనలు వీధిలో పోతూ వున్న హరిజన బాలునికి నోరూరించినాయి. ఆ బాలుడు ఎకనాధుని వసకితి గుమ్మము వదలకుండా అక్కడే నిలుచుంది పోయినాడు. ఎదో పనిమీద లోపలినుండి గుమ్మము వద్దకు వచ్చిన ఎకనాతులవారు ఆ అబ్బయిని వివరములు అడిగినాడు. ఆ పిల్లవాడు అసలు విషయము చెబుతూనే, అతని హృదయము ఆర్ద్రతా భరితమయిపోయింది. శ్రాద్ధానికి చేసిన పిండివంటలను ఆ బాలునికి విస్తరి వేసి వడ్డించినాడు.ఆయన దృష్టిలో ఆ బాలుడు హరిజనుడు కాదడు సాక్షాత్తు హరియే! ఆ బాలకృష్ణుడే!

శ్రాద్ధ బ్రాహ్మణార్థమునకు వచ్చిన బ్రాహ్మణులు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహోదగ్రులై  ఎకనాథుతులవారిని అనరాని మాటలు అంటూ వెళ్ళిపోయినారు. అంతటితో వారు ఆగక బ్రాహ్మణ సంఘముచేత ఆయనను  వెలివేయించినారు. కానీ భక్తుడగు 
ఏకనాధుడు ఏ మాత్రమూ చింతించక తాను పరమ నిష్ఠాగరిష్ఠుడు భగవత్తత్పరుడూ    కావున ఆయన ప్రార్థనను ఆలకించి పిత్రుదేవతలే స్వయంగా వచ్చి ఆ నాటి శ్రాద్ధ కర్మలనుపూర్తి చేశి సంత్రుప్తులై ఎకనాథుని దీవించి వెడలినారట.
మరియొక ఉదంతము. ప్రతిదినమూ ఏకనాధులవారు  గోదావరి లొ స్నానంచేసి సంధ్యానుష్ఠానములు ముగించుకొని తిరిగి ఇంటికివచ్చి దేవతార్చన చేసుకొనే వారు. .ఒకరోజు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఒక కొంటెవాడు  అతనిపై తుపుక్కున ఉమ్మి నాడు. మైలపడుటచే ఏకనాధుడు కిమ్మనక మరల నదిలో స్నానం చేసి వచినాడు. మరల మరలా ఆ కుర్రడు 108 మార్లు వుమిశినాడు. ఆట్లు చేసి చేసి ఆతని నోరు ఎండిపోయింది. ఎకనాథుడు అన్నిమార్లూ ఏమాత్రము విసుగు చెందక స్నానమాచరించి వచ్చినాడు. పశ్చాత్తాప తప్తుడగు ఆ కొంటెవాడు, అన్నిమార్లు స్నానము చేసినా ఇసుమంతయూ విసుగు చూపని  ఏకనాథుని కాళ్ళపై బడి అతను క్షమాభిక్ష వేడినాడు. ఏకనాథులవారు  ఆ యువకుని లేవనెత్తి ఆలింగనము చేసికొని "నాయనా నీవు నాకు చాలా ఉపకారం చేసినావు. ఒకే దినం 108 సార్లు గోదావరిలో స్నానం చేసిన పుణ్యమును  నాకు దక్కించినావు." అని అతన్ని ఓదార్చి పంపినాడు. ఎకనాథులవారి సహనశీలతకు, క్షమా గుణానికీ జోహారు లర్పించి గ్రామవాసులంతా ఆయనకు పాదాభివందనము చేసినారు.
ఇట్టి సహనమును  'తితీక్ష'అని వివేకచూడామణి వర్ణిస్తుంది. సహనం శత్రువులను మిత్రులుగా చేస్తుంది. ఈ సహనాన్నే 'తితీక్ష'అని వివేకచూడామణి వర్ణిస్తుంది.
సహనం సర్వ దుఖానాం, అప్రతీకార పూర్వకం 
చింతా విలాపరహితం సా తితిక్షా నికాద్వాతే
సమస్త దుఃఖములను ప్రతీకారబుద్ధి తో కాక,చింత,బాధతో కాక సహనంతో అనుభవించు 
టయే తితీక్షగా నిర్వచించ బడినది.
అసలు రామాయణ భారతములలో కూడా వాల్మీకి వ్యాసులవారాలు 'క్షమయా (అనగా సహనము) నిష్ఠితాం జగత్' అని చెప్పినారు. 
సుఖదుఃఖా లను,మానావమానములను ఆగ్రహానుగ్రహములను, పై సమదృష్టిని  సాధించుటయే  సాధకునికి వుండవలిసిన సద్గుణము. 

స్వస్తి.


Saturday, 26 May 2018

భక్త అంబరీష

భక్త అంబరీష
https://cherukuramamohanrao.blogspot.com/2018/05/blog-post_26.html
అంబరీషుని చరితము సామాన్యముగా అందరికీ అంతో ఇంతో ఎంతోకొంత తెలిసియే వుంటుంది. భాగవతము చెరుకుగడ వంటిది. ఎంత నమిలినా ఎదో మధురిమ నాలుకకు తగులుతూనే వుంటుంది. అందుకే తిరిగీ ఒక పర్యాయము ఆ భాగవతోత్తముని చరిత్ర పునశ్చరణ చేసుకొందామన్న తలంపుతో తిరిగీ తెలుపవచ్చినాను.
అంబరీషుడు, నేను మే 23 న వ్రాసిన 'నాభాగ మహారాజు' కుమారుడు. ఈయన చరిత భాగవతము యొక్క నవమస్కందములో వస్తుంది. ఈయన అంబరీష చక్రవర్తిగా అందు అభివర్ణింపబడినాడు. అకుంఠిత వైకుంఠ నాథ భక్తుడు. 'నా స్పృశాత్ బ్రహ్మజాపోపి యన్నతః ప్రతిహతః క్వచిత్' అని భాగవతము తెలుపు చున్నది. అంటే ఈయన అపార విష్ణుభక్తుడగుటచే బ్రాహ్మణ శాపము కూడా ఆయనను ఏమీ చేయలేక పోయినది.
అసలు 'అంబరీషుడు' అన్న మాటకు అర్థము తెలుసుకొందాము.
'అంబాదికం రీశం నష్వరమితి జ్ఞానం యస్యాసు అంబరీషః' అని మహానీయులగు వంశీధర శర్మ గారు కొన్ని శతాబ్దముల క్రితము తమ వ్యాఖ్యానములో  వివరించినాడు. అంటే తల్లిదండ్రి ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమలు అన్న భవబంధములు నశ్వరము అంటే నశించేవిగా గుర్తించి తామరాకు నీటిబొట్టు చందముగా జీవితము సాగించినాడు తాను చక్రవర్తి అయివుండికూడా!  
అదే మహానుభావుడు చెప్పిన ఇంకా రెండర్థములను తెలుసుకొందాము.
అంబర అంటే ఆకాశము, ఇక్కడ ఆకాశమంత అన్న అన్వయమును తీసుకొనవలెను. ఈశ అనగా విస్తృతమైన జ్ఞానము. యస్యసః అంటే ఎవరికయితే వుందో! అంటే ఇప్పుడు మొత్తము కలిపితే ఆకాశమంత విస్తృతమైన జ్ఞానము ఎవరికైతే వుందో ఆయన అంబరీషుడు.
అం అంటే విష్ణువు. అచ్చులలో అకారమును నేను అని శ్రీ మహావిష్ణువే చెప్పు కొన్నాడు. ఏకాక్షర నిఘంటువును పరికించితే ఈ అర్థమును తెలుసుకొనవచ్చును. పరం అంటే పరమోత్కృష్ఠుడు అని ఈశ అంటే జ్ఞానము కలిగిన వాడు.
చూచినారా ఒక వ్యక్తి పేరుకు ఆయన గునగానములకు ఎంతటి సమన్వయముంటుందో మన పురాణములలో!
అట్టి అంబరీషుడు ఎట్టివాడనిన
చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద
పలుకులు హరిగుణపఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద
శ్రవములు హరికథాశ్రవణమంద
చూపులు గోవింద రూపవీక్షణమంద
శిరము కేశవ నమస్కృతుల యంద
పదము లీశ్వరగేహపరిసర్పణములంద
కామంబు చక్రికైంకర్యమంద

సంగ మచ్యుతజన తనుసంగమంద
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలమంద
రసనఁ దులసీదళములంద, రతులు పుణ్య
సంగతుల యంద యా రాజచంద్రమునకు.
అంబరీషునికి సదా మనసు ఎల్లపుడూ,  మధురిపుడు అనగా మధు అను రాక్షసుని సంహరించినవాడు మధుసూదనుడు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క  శ్రీ  (శుభకరమైన) పాదాల మీద మాత్రమే, మాటలు హరి గుణగాన సంకీర్తనములు పై మాత్రమే, చేతులు వైష్ణవాలయాలను శుభ్రపరచుట యందు మాత్రమే, చెవులు విష్ణుకథలు వినుటకు మాత్రమే, చూపులు గోవిందుని వివిధ రూపములను సందర్శించుట మీద మాత్రమే, తల కేశవుని ఎదుట అవనత శిరస్కుడై నమస్కరించుటకు మాత్రమే, కాళ్లు పరాత్పరునికి జేయు  ప్రదక్షిణలకు మాత్రమే, కలిగే ప్రతి కోరికా చక్రిసేవకు మాత్రమే,  సాంగత్యము హరిభక్తులతో మాత్రమే,  ఆఘ్రాణించేది విష్ణుభక్తుల పాదపద్మములను మాత్రమే, రుచి తులసీదళాలపై మాత్రమే,; ఆసక్తి పుణ్యవిషయాలపై, మాత్రమే  వుండేది. ఎంతటి మహానీయుడో గమనించండి. అట్టి మహాహానుభావుని చరిత్రను విన్నా మనము ధన్యులమే కదా!
ఆయన భక్తి తత్పరతకు అవ్యయానందభరితుడై అంబరీషుని అనుదినమూ శ్రీమహావిష్ణువు కోగిలించుకొనేవాడట. శ్రీవిష్ణు వక్షస్థల స్థితయైన శ్రీదేవి పాదముల స్పర్శ అంబరీషునికి కలుగుటచే ఆ దినమునకు బొక్కసమునుండి అయిన ఖర్చు బంగారు నాణెములుగా వర్షించేదట. అంటే ఆ చక్రవర్తికి ప్రజల నుండి పన్నులు వసూలు చేసే భాసరము వుండేదికాదన్నమాట. నేటి తార్కికులు ఈ మాటను నమ్మక పోవచ్చు. కానీ ఆ మహనీయుని భక్తిని,  సాధించుట వదిలిపెట్టండి, కోలువగలిగే యోగ్యత వున్నదా అన్నది వారు హృదయ పరిశీలన చేసుకోవలసిన విషయము. మనకు లేనిది ఎవరికీ ఉండదు అన్న భ్రమను ఉంచుకొనుట తప్పుకదా! అంతటి తో ఆగక నా రాచతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును, నిఖిలజగదవక్రంబును నగు చక్రంబు నిచ్చి చనియె అని వ్యాసునిమాటగా మన పోతన చెప్పినాడు.
మాసానాం మార్గశీర్షోహం అన్న భగవానుని మాటననుసరించి మార్గశిర ఏకాదశి మొదలు కార్తీక ఏకాదశి వరకు వ్రతమాచరించి బ్రాహ్మణ, ఋషి, మునివరులకు సంతృప్తిగా దానములోసంగి షడ్రసోపేతమయిన భోజనము పెట్టించి సంతృప్తులను చేసిన పిదప తానూ ద్వాదశి ఘడియలు పూర్తియగు లోపుననే దీక్ష విరమించదలచుకొన్న సమయములో
దుర్వాసో మహాముని తన శిష్యబృందముతో అచటికి వచ్చినాడు. అంబరీషుడు ఎదురేగి సకలమర్యాదలను జరిపి భొజనమునకు ఆహ్వానించినాడు. కాళిందీ నదికిబోయి స్నానమాచరించి మాధ్యాహ్నిక సంధ్య ముగించుకొని వచ్చెదనని చెపీ శిష్య పరివారముతో బయలుదేరి వెడలినాడు. ద్వాదశి ఘడియలు ముగిసి త్రయోదశి వస్తే వ్రతనిష్ఠ భంగమయి పాపము పొందవలసి వస్తుందన్న భయముతో అక్కడవున్న ఋషి మునుల సలహానదిగినాడు. వారు వారు అభక్షితం ఆపోశితం నాశితమం అంటే నీరు త్రావుటచే వ్రాతఫలమూ దక్కుతుంది ఆహారము తినకున్దానూ వున్నట్లవుతుంది అని సలహా ఇచ్చినారు. అందుకు సంతసించి మూడు ఉద్ధరుణుల (అతి చిన్న గుంత గలిగిన స్పూను) తులసి తీర్థమును తీసుకొన్నాడు. నదినుండి తిరిగివచ్చి విషయము తెలుసుకోన్నవాడై క్రుచ్ఛ అన్న భూతమును సృష్టించి దానిచే అసువులు బాయమని అంబరీషుని శపించినాడు. అంతే ఆయన విష్ణు చక్రము అంబరీషునికి రక్షణ అన్న విషయమును మరచుటచే అది ముందు కృచ్ఛను తెగటాతార్చి  తాపసిని వెంబడించింది. పరుగెత్తి పరుగెత్తి అలసినవాడై ఆయన బ్రహ్మ లోకమున బ్రహ్మను కైలాసమున శివుని శరణుజొచ్చినా వారు విష్ణువే కాపాడగలడని సలహా ఇచ్చినారు. విష్ణువు చెంతకుపోయి అర్థించితే తానూ భక్త పరాదీనుదానని తెలుపుతూ అంబరీషునే శరణు జొచ్చమని  ఆదేశించినాడు. అంతటి తపస్సంపంనుడు వెళ్లి అంబరీషుని పాదములపై పడినాడు. ఆయన సుదర్శనమును పరిపరి విధముల ప్రార్థించి దానిని ఉపశమింపజేసి,  సజలనయనుడై మునిపుంగవుని లేవనెత్తి ఆయన పాదములపై బడి తనను మన్నించమని కోరినాడు. అంతట దుర్వాసో మహాముని ఇదంతా అంబరీషుని భక్తి తత్పరత లోకమునకు చాటుటకే అన్న రహస్యమును వెల్లడించి భోజనముచేసి ఆయనను ఆశీర్వదించి తనదారిన శిష్యగణముతో మరలినాడు. ఇక్కడ కూడా లౌకికులు మహర్షి క్రిందబడినా పైచేయినాదే అని తన లోపమును కప్పిపుచ్చుకోన్నాదనుతకు అవకాశము వున్నది. కానీ మనము తెలుసుకోనవలసినది ఏమిటంటే ఆయా యుగములలో వారు అనృతమునాడి యెరుగరు. అందునా ఆయన మునివరేణ్యుడు. ఆ వాస్తవమును తెలుసుకొంటే అనుమానములకు తావు ఉండదు. ఆవిధముగా వ్రతము సఫలమైన తరువాత రాజ్య భారమును తనయులకప్పగించి విష్ణురూప పరివేష్టిత హృదయుడై వైకుంఠమునుజేర కానలకేగి తపమాచరించి హరి అనుగ్రహముచే వైకుంఠము చేరినాడు.
 ఈ యంబరీషు చరితముఁ
దీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం
డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా!

ఓ పరీక్షిన్మహారాజా! ఈ అంబరీషుని కథను ఆసక్తితో విన్న వారు, చదివిన వారు గొప్ప జ్ఞానవైభోగాలు పొంది పుణ్యాత్ములు అవుతారు అని శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్పినాడు.
కావున పాఠకులు తదేకముగా చదివి పరమాత్ముని భక్తి తత్పరులగుడురుగాక అని ఆ మహావిష్ణువును ప్రార్థించుతూ శెలవు తీసుకోనుచున్నాను.
స్వస్తి.

Thursday, 24 May 2018

మధుర (మధురాధిపతేరఖిలం మధురమ్.)


                                 మధుర
అధరం మధురం వదనం మధురం - నయనం మధురం హసితం మధురమ్,
హృదయం మధురం గమనం మధురమ్ - మధురాధిపతేరఖిలం మధురమ్.
మధురాధిపతేరఖిలం మధురమ్.
 ఇది వల్లభాచార్య విరచితమని, అందలి 8 శ్లోకములలో ఇది మొదటిదని, అందరకూ తెలిసినదే! వల్లభాచార్యులను గూర్చి మునుపు సవిస్తారముగా వ్రాసియుండినాను. మధురాధిప లోని 'మధురా' అన్న పదములో 'ధు' తీసివేస్తే 'మరా' మిగులుతుంది. వాల్మీకి మహర్షి 'మారా మారా' అంటేనేకదా 'రామ రామ' అయినది. కావున ఇక్కడ 'మరా' తిప్పిచదివితే 'రామ' అవుతుంది. మరి మనిషి తన జీవితకాలములో ఒక్కసారయినా 'రామ' అనకుంటే ఆ 'మధుర' లోవుందే మధ్యాక్షరము ఆవ్యక్తిని 'ధూ' 'ధూ' ధూ' అంటుందట. కావున మధురమగు ఆ 'రామ నామమును' ఒక్కసారయినా తలవండి.
స్వస్తి.

పరమేశ్వరుడు భక్త పరాధీనుడు (విద్యాపతి మిశ్రుని కథ)


పరమేశ్వరుడు భక్త పరాధీనుడు (విద్యాపతి మిశ్రుని కథ)
 పూర్వము అనగా ఒక 5,6 వందల సంవత్సరముల క్రితము వంగదేశమున విద్యాపతి మిశ్రుడు అన్న ఒక మహా పండిత,కవి, గాయకుడుండేవాడు. తానూ తన సతీసమేతముగా దైనందిన గృహ కృత్యములు ముగిసిన పిదప పరమేశ్వరుని పాదసేవానురక్తులై నిరంతరమూ నిత్య జీవితమును గడిపేవారు. ముఖ్యముగా మిశ్రులవారు పరమశివునిపై పరమ భక్తిప్రపత్తులతో అనేకానేక కీర్తనలను రచించుటయేగాక తదేక ధ్యాన తత్పరుడై, నిష్కల్మష భక్తితో తను వ్రాసిన గీతములను నోరారా, తనివిదీర ఆలపించేవాడు. పరమేశ్వరుడు ఆ గానరస గంగా ప్రవాహములో తన్మయుడై ఒలలాడజొచ్చినాడు. రానురానూ శంభునికి కైలాసమువీది మిశ్రుని గృహములోనే చెంతనవుండి మరీ గానామృతమును గ్రోలవలెనను తలంపుతో  వారి ఇంటికి ఒక పనివాని వేషములో వచ్చి ఆ దంపతుల నెంతగానో బ్రతిమాలి పనికి కుదురుకొని మిశ్రులవారి నీడగా వెన్నంటి ఆయన గీతములోని ప్రతి అక్షరము సంగీతమయమై శొభిల్లుచుండ విని పులకించి పోసాగినాడు. అట్లని యజమానులు చెప్పిన పనులు చేయుటలేదా అంటే, వారు చెప్పుటకు ముందే అన్ని పనులూ చేసి విద్యాపతిగారిని అనుసరించేవాడు.
ఒకానొకరోజు విద్యాపతి మిశ్రులు పొరుగు వూరికి పోవుట సంభవించినది. ఎండతీవ్రత అత్యధికముగా ఉండుటచే యజమానికి ఛత్ర ఛాయనందజేయుటకు సేవక రూపములో వున్నా శంకరుడు కూడా వద్దన్నా వినకుండా బయలుదేరినాడు. అసలు విషయము తెలియని మిశ్రులవారు ఆ అక్భిమానమును త్రోసిపుచ్చలేకపోయినారు. దారిన బడగానే పాతనండుకొన్నారు మిశ్రులవారు. గాన సుధ జాలువారుతూనే వుంది. తత్పరుడైన శివుడు తన్మయుడై వింటూ గొడుగు యజమానికి పట్టి నడుస్తూనే వున్నాడు. నడువగా నడువగా వారు ఒక నిర్జల ప్రాంతమున ప్రవేశించినారు. మిశ్రులవారికి దాహమై ఆమాట సేవకునితో తెలిపినాడు. కానీ ఆప్రాంతములో నేరేదోరుకడు అనికూడా హెచ్చరించినాడు. సేవకుని రూపములో వున్నశివుడు ప్రయత్నించుతానంటూ మరచెంబు పట్టుకొని కొంతదూరము పోయి యజామాని చూచుతలేదని గ్రహించి తన కాలి బొటనవ్రేలితో భూమిని గట్టిగా నొక్కినాడు. గంగాపతికి నీటికి కొదవా! తీయని చల్లని జలధార పైకి ఉబికి వచ్చినది. చేబుకు పట్టి ఆనీటిని యజమానికి ఇచ్చినాడు. దాహార్తి అధికముగాగాలిగిన మిశ్రులు అమృత తుల్యమగు ఆ నీటిని త్రావిన పిదప అనుమాన మానసుడై ఇచట ఎటువంటి జలాశయమూలేదే ఇంత మధురమైన నీరు ఎక్కడిదని నిగ్గదీసినాడు తన ఛద్మ వేషధారియైన అనుచరుని. ఇక నిజాము దాచాలేనని తెలుసుకొని పరమేషుడు ఆయనకు ప్రత్యక్షమై విషయమును చెప్పి తానూ అంతర్హితుడౌతానన్నాడు.  మిశ్రులవారు ఆయనను బ్రతిమాలగా, తన రహస్యము బయల్పడనంతవరకూ ఉంటానని మాట ఇచ్చుతచే పని ముగించుకొని ఇరువురూ ఇల్లుచేరినారు. తిరుగు ప్రయాణములో గొడుగు పట్టుకొనుట మిశ్రులవారి వంతయినది.
ఇంటికి వచ్చినదిమొదలు మిశ్రులవారి పత్ని తమ భృత్యునికి ఏపని చెప్పినా విద్యాపతి గారే చేయ మొదలిదినారు. ఎక్కడికీ సహించలేక ఆమె భర్తను' పనివానిని పనిచ్యనీకుండా మీరే పనిచేయుటకు పనివాదేందుకు' అని చీవాట్లు పెట్టింది. ఖిన్నుదయినా విద్యాపతి మిశ్రులవారు నిజాము చెప్పక తప్పలేదు. అంతట శివుడు నిజరూపముదాల్చి తానూ అంతర్దానమండుచున్నట్లు మిశ్రులతో చెప్పినారు. దంపతులిరువురూ ఆయన కాళ్ళపైబడి క్షమాపణ కోరుకోగా వారిని జీవితము ముగిసిన పిదప శివసాయుజ్యము చెర వరమోసంగి అంతర్ధానమందినాడు.
ఇటువంటి మహానీయులేందరో ఈ పుణ్యభూమి హారానికి మణులై ప్రకాశించినారు.  అట్టి భూమిపై పుట్టినందుకు మనమూ మనవంతు భక్తి విధేయతలతో భగవంతుని ప్రార్థించుదాము.
స్వస్తి.