Monday, 3 September 2018

నా దక్షిణ కర్నాటక యాత్ర


నా దక్షిణ కర్నాటక యాత్ర
1.   ఉపోద్ఘాతము
కర్నాటకలో కోస్తా సహా పలు జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుంగభద్ర, కేఆర్ఎస్ సహా ఇతర డ్యామ్ లన్నీ పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగినాయి. ప్రసిద్ధ శ్రీ శృంగేరి శారదా పీఠంలోకి వరద నీరు చేరింది. దీంతో ఆలయంలో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయంలోకి వరద నీరు రావడంతో నిత్యకైంకర్యాలకు ఆటంకం ఏర్పడింది. కుక్కె సుబ్రమణ్యలో కుమారధార నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఉత్తర కర్నాటకలో కృష్ణానది ఆయకట్టు ప్రదేశంలో భారీ వర్షం కురిసింది.

   కేరళను ఆనుకుని ఉన్న దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమంగళూరు, కొడగు తదితర జిల్లాలో వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 'మలెనాడు' ప్రాంతంలోని శివమెగ్గ, కరావళి, దావణగెరె జిల్లాల్లో వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రమాదకర ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. తీవ్ర వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన జిల్లాలకు రూ. 200 కోట్లు విడుదల చేస్తామని సీఎం కుమార స్వామి తెలిపారు.
      ఇది వార్తా పత్రికలు తెల్పిన ఒక వాస్తవము. ఈ ఉధృతము, 2౦18 ఆగస్టు 11 వ తేదీ నుండి మొదలయి 17 వతేదీ వరకు ఆయా ప్రాంతములను అతలాకుతలము చేసినది. ఈ సమయములో నేను నా శ్రీమతి నా చిన్న కుమార్తెతో ఈ ప్రాంతములో 15 వ తేదీ వరకూ తీర్థయాత్ర జరిపినాను.
తీర్థయాత్రా విశేషాలు మరియు నాకు తెలిసిన మేరకు స్థల పురాణము తెలుపుట నా ఉద్దేశ్యము. దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతములకు వెడలదలచినవారు  నా అనుభవము ఉపయోగపడవలెనన్నది నా ఆలోచన.
 హైదరాబాదు నా నివాస నగరము. 10 తేదీన 9గం. 5ని. కు కాచిగూడానుండి బంగళూరు- యశ్వన్తపుర ఎక్స్ ప్రెస్ లో బంగలూరికి బయలుదేరినాము. బయలుదేరుటకు ముందే హైదరాబాదులోని శృంగేరి పీఠము వారితోనూ నేరుగా శృంగేరి పీఠము వారితోనూ Mobile లో మాట్లాడినాను. శృంగేరి నుండి నాకు కావలసిన లేక నేనడిగిన సందేహాలకు సమాధానము లభించింది. హైదరాబాదు నుండి మంగళూరికి పోయి ఆచటినుండి శృంగేరి చేరుట ఒక ఉపాయము. షిమోగా పోయి శృంగేరి చేరుట వేరొక మార్గము. ఈ రెండు కాకుండా బంగళూరు వరకు రైలులో పోయి ఆచటినుండి కారులో హాసన్, చికమగలూరు మీదుగా శృంగేరి చేరుట ఒక విధాయకము. హాసన్ కు రైలు స్టేషను వున్నా రైళ్ళు తక్కువ. అందుచే రోడ్డు, కారు శ్రేయస్కరము అని తలచినాను.
కారు బాడుగకు తీసుకోనవలసినది కర్ణాటకలో కాబట్టి అక్కడ వున్న ఇద్దరు ముగ్గురు స్నేహితుల ద్వారా ప్రయత్నము చేసినాను కానీ ఫలించలేదు. తాను చిత్తూరు నివాసియైనా, నాకు పుత్ర సమానుడగు శ్రీను బెంగళూరు లో CAB మాట్లాడినాడు, నా నిబంధనలు షరతులు మరియు ఆర్థిక వనరునకు అనుకూలముగా! ఆ CAB యజమానితో గానీ చోదకుని(DRIVER) తో గానీ ఎటువంటి సమస్య లేకుండా తిరిగీ బంగళూరు చేరేవరకు మా ప్రయాణము జరిగిపోయినది. 
బంగళూరులో రైలు దిగగానే, మా కాలకృత్యములు ముగించుకొని, driver కొరకు 2౦ నిమిషములు చూపెట్టుకోవలసి వచ్చింది. ఆ సమయములో జరిగిన ఒక సహృదయుని వల్ల నాకు జరిగిన సంఘటన చెప్పకపోతే నేను ఆయన మంచితనమును మరుగుపరచినట్లవుతుంది. నేను హైదరాబాదు నుండి బయలుదేరిన వెంటనే మరువకుండా తనకు చరవాణి లో తెలియజేయమన్న ఆసహృదయుని పేరు T.V.సుబ్బారావు గారు. ఆయన Station లో నన్ను కలియుటకు వస్తానన్నారు. నేను వద్దని బ్రతిమాలినా ఆయన వినలేదు. ఆయన చెప్పిన ప్రకారమే తెలియజేసినాను. నేను, నా శ్రీమతి, నా కుమార్తె బంగళూరు యశ్వంతపుర Station లో దిగిన వెంటనే, అధికమగు జనసమ్మర్దమును లెక్కచేయక 13 కి.మీ. దూరములో ఉన్న బసవనగుడి నుండి, ఆయనకు 75, 76 సంవత్సరముల వయసున్నా తన సతీమణితో కలిసి CAB లో వచ్చి నన్ను కలిసినారు. నేను ఎంతగా నోచ్చుకోన్నానో ఆ దంపతులు తీసుకొన్న శ్రమకు. నాతో ఆయన గడిపిన 5 నిముసములలో కనీసము కాఫీ అయినా వారిరువురికీ ఇప్పించలేకపోయినాను కానీ ఆయన మాత్రము నన్ను అక్కడికక్కడే, నాకంత యోగ్యత లేకున్నా, దుశ్శాలువతో సత్కరించి, నాకు Pen Set Box బహుకరించి దారిలో తినుటకు Snacks Pockets రెండు మా అమ్మాయి చేతిలోవుంచినారు, ఇవి కాదని నాకు ఒక అపురూపమయిన Key Chain కూడా ఇచ్చినారు. తొందరలో నా భార్యకు రవికెలబట్ట తమ చేసంచిలో ఉంచుకొనుటకు మరచినారు, అందుచే తనకు ఇవ్వలేక పోయినారు. ఒక సహృదయుని గూర్చి చెప్పే అవకాశము కలిగినప్పుడు చెప్పకపోతే అది ఆత్మవంచనతో సమానము అన్న మనస్తత్వము కలిగినవాడనౌటచె వారు నాపై చూపిన ఆదరమును మీతో పంచుకొన్నాను. అంతే వెంటనే వారిరువురూ శెలవు తీసుకొని బయలుదేరినారు. మా ప్రతీక్ష సారధికై కొనసాగినది మరికొంతసేపు. ఆతను వచ్చిన వెంటనే మా యాత్ర మొదలయినది. మొదటి మజిలీ హాసన్ జిల్లాకు చెందిన హలేబేడు బేలూరు.
మిగిలినది మళ్ళీ..........
నా దక్షిణ కర్నాటక యాత్ర
2 వ భాగము
హళేబీడు
హళేబీడు ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. ఈ రెండూ జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి దగ్గరగా వున్న చిన్న పట్టణములు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం. దీనికి పూర్వం, ద్వారసముద్ర, దొరసముద్ర(ద్వార సముద్రకు అపభ్రంశము కావచ్చు.)  అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని అర్థము. వరంగలును గెలిచిన తరువాత అల్లుద్దీన్ ఖిల్జీ పనుపున అతని అతిముఖ్యానుచరుడు, సేనాధిపతి యగు మాలిక్ కాఫర్ యొక్క సేనలు హొయసాల రాజ్యం మీదికి దండయాత్రకు వెళ్ళినాయి. 1311లో హొయసాల రాజధాని "ద్వారసముద్ర"ను ముట్టడించి రాజు వీరబల్లాల-3 ను తను ఓడించుటజరిగినది. వీరబల్లాలుడు కప్పము కట్టుటకు అగీకరించి డిల్లీకి సామంతుడిగా మారటం జరిగింది. ఈదాడిలో చిన్నాభిన్నమై శిధిలమై పోయిన ద్వారసముద్రనే ప్రస్తుతము  "హళైబేడు" అంటున్నారు. హళేబేడు (బేడు= వీడు= ఆవాసము) అంటే కన్నడములో శిధిల నగరము అని అర్ధము. అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు హళైబేడు, బేలూరు గుడుల గోడలకు తాపడమొనర్చిన శిల్పములలో చూడవచ్చును. అసలు బ్రహ్మదేవుడే జక్కన రూపములో ఈ శిల్పములను చేక్కినాదేమో అనిపిస్తుంది. ఈ శిల్పములను ద్వంసముచేసిన వాడుకూడా ఒక మనిషే అన్న తలంపు మన మదిలో మెదిలితే శిగ్గుతో తలవంచుకోనవలసి వస్తుంది. మాలిక్ కాఫర్ నాశనము చేసిన ఆ శిల్పములను ఆరీతిలో మలచ గలవారు కనిపించక హోయసలేశ్వరాలయము యొక్క శిధిల కుడ్యములను రాళ్ళతో కప్పిపుచ్చినారు.  అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది. హోయసల రాజధానిగా మొదట్లో బేలూరు తరవాత దానిని హలేబీడు ఉండినవి. హాసన్ నుండి బయలుదేరినపుడు ముందు హలేబేడు వస్తుంది కావున దానిని గూర్చి వ్రాసినాను.
ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. హోయ -సాల అనే  రెండు మాటలు కలిసి హోయసల అయింది. సాలుడు అన్నది సామ్రాజ్య స్థాపకుని పేరు. హోయ అంటే కన్నడములో కొట్టు అని అర్థము. ఈ రాజ్య మూల పురుషుడు సాలుడు ఇక్కడ సింహాన్ని ఒంటిచేతితో ఎదుర్కొని సంహరించినాడట .అప్పటినుండి వారి వంశనామము హోయసలగా మార్చుకొన్నారు. వీరు దేవగిరికి చెందిన సేన యాదవుల కు చెందిన వారు. అవక్ర పరాక్రమంతో చాళుక్య, చోళ పాండ్యులను ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించినారు. ఈ 12-13 శతాబ్దముల మధ్యకాలములో  ఇచ్చట ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించినాడు. ఈ నిర్మాణంలో తన మంత్రివర్యుడు కేతనమల్ల తన శక్తి యుక్తులతో ఒక మహత్తరమగు శిల్పిని జక్కన రూపములో ఏర్పాటు చేయుటకుగానీ, అతనికి వలయు సాధనసామాగ్రి, అతడు ఎన్నుకొన్న తగిన సహాయకులను సమకూర్చుతకుగానీ ఎంతయో తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా సహకరించినాడని చెప్పుకొంటారు. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తి కావటం జరిగింది.
ఇక్కడ ప్రధానాలయము హొయసలేశ్వరాలయము. ఇది ద్వికూటాలయము. ఇందులో రాజు పేరున ఒకటి, రాణి శాంతలదేవి పేరున మరొకటి, రెండు శివలింగాలను ప్రతిష్ఠించినారు. ఈ రెంటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు పెద్ద నందులను ఏర్పాటు చేసినారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలోని అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవని అంటారు. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయము లోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పములు, పశుపక్ష్య నర్తకీ సముదాయములు  బహు సుందరముగా తీర్చిదిద్దబడినాయి. ఈ దేవాలయాల నిర్మాణమునకు నల్లని బలపపు రాయిని (Chlorotic Schist )  ఉపయోగించినారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి వస్తుప్రదర్శనశాల, దానికి దగ్గరగా ఒక పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఇక బెలూరును గురించి కొంత తెలుసుకొందాము. ఈ శిల్పాలకు ప్రాణము పోస్తే ఎక్కడికి పరుగెత్తి పోతాయోనని శిల్పబ్రహ్మ జక్కనాచార్యుడు ఆపనిచేయలేదనిపిస్తుంది. అట్లు చేసియుంటే ఆయన అప్రతిహత ప్రతిభ మనకు చూసే అదృష్టము కలిగియుండదు.
అమరశిల్పి  జక్కన అనేదానికంటే అపరబ్రహ్మ జక్కన అంటే ఎంత బాగుంటుందో!  సృష్టి చెప్పలేనంత గొప్పదే కానీ ప్రత్యేకముగా ఒక దృశ్యము చూసినప్పుడు అది ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇది అక్కడ వుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ జక్కన శిల్పములో ఇది ఇక్కడ ఉండుటచేత ఎంత సౌందర్యము సంతరించుకున్నదో అనిపిస్తుంది. ఆయన శిలపమును చేక్కేసమయాన చిన్న పొరబాటు జరిగినా ఒక ప్రక్క శిల్పమునకు ఒదిగిన శిల వృధా అవుతుంది, ఆయన పడిన కష్టము బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  ఒక చిన్న జాబు వ్రాయాలంటే ఎన్నో కోయ్ట్టివేతల, కాగితమును నలిపి పారవేయదాలు కొల్లలుగా వుంటాయి. మరి అట్టి శిల్పములు అరా అంగుళము తావు వదలకుండా, వందలు వేలు తాను మలచి, తన పర్యవేక్షణలో మలిపించుట అంటే అద్భుతమే కాదు అసాధారణము. ఒక లతాంగి ముఖ్యముగా ముకుర(అద్దము) సుందరి శిల్పము వర్ణించుటకు ఏ  అల్లసాని పెద్దనో, రామరాజ భూషణుడో, ముక్కుతిమ్మనో కావలెనేమో! శిల్పసుందరి చికురము ( వెంట్రుక) కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే, బ్రహ్మ కూడా శివ కేశవులవలె జక్కనగా అవతారమును దాల్చినాడనవలసివస్తుంది. మన పాఠ్యాంశములుగా ఎందఱో పాశ్యాత్య చిత్ర, శిల్పకారులను గూర్చి చదివినాము, మన పిల్లలతో కూడా చదివిస్తున్నాము. మరి జక్కన వంటి ముఖ్యముగా దక్షిణ భారతమున దేవాలయ శిల్పములను, తిండి నిద్రలు మాని అజరామరము చేసిన వారిని, మనపిల్లలకు, కాదు కాదు మనకెంతవరకు తెలుసు, మన ప్రభుత్వములకు ఎంత తెలుసు. స్వతంత్రమువచ్చి 7౦ సంవత్సరములు దాటినా ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వ నాయకులు వున్నారా! ఎటూ ఎంతటి విలువైన ఆహారము తిన్నా కడుపులో ఉండదని తెలిసీ అదే కావాల్నుకొంటారు కానీ వారికి కళాభిజ్ఞత ఈషణ్మాత్రము కూడా లేదు. నిజముగా ఇది శిగ్గుపడవలసిన విషయము.
జక్కన్నాను గూర్చి మరికాస్త బేలూరులో చర్చించుకొందాము.
ఇక మెల్లగా బేలూరికి పయనించుదాము.

మిగిలినది మళ్ళీ ......... 
నా దక్షిణ కర్నాటక యాత్ర 
3వ భాగము
బేలూరు 
బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. ఈ బేలూరు హోయసల రాజుల మొదటి రాజధాని. ఇక్కడ ప్రధానంగా చూడతగినది చెన్నకేశవాలయము. దీనిని కూడా విష్ణువర్ధనుడు నిర్మించినట్లే చెప్పుకొంటారు. క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవమత ప్రాశస్త్య ప్రచారానికై రామానుజాచార్యులవారి  ప్రబోధానుసారము ఈ కట్టడము నిర్మింపబడినదని కూడా చెప్పుకొంటారు. ఆలయ మధ్య భాగములో నరసింహస్వామి స్థంభం వుంది. దీనిపై రామాయణమహాభారతాది  అనేక పురాణేతిహాస గాధలు చెక్కబడి వున్నాయిఅంతంత కథలను శిలలపై చెక్కుట తప్పక ఒక అసాధారణ విషయము. ఈ స్థంభము అప్పట్లో దానంతట అదే భ్రమించేవిధముగా (To Rotate) (బహుశ Ball Bearings సహాయముతోనేమో!) అమర్చబడి వుండేదని చెబుతారునాటి కాలానికి ఇది ఒక అభియాంత్రిక  అద్భుతము (Engineering marvel) అని అనక తప్పదు.  తర్వాత దానిని పురావస్తు శాఖ (Archaeology Department) వారు ఆపివేయుట జరిగిసదని చెబుతారు.
ఆలయము వెలుపలి గోడల పైన 644   ఏనుగులు   చెక్కినారు.  ఆ తీరు తెన్ను చూడ ముచ్చటగా వుంటుంది. అవి చిన్నగా వుంటాయి, మరి అంత నిశితముగా అన్ని ఏనుగులను మలచుటకు ఎన్ని రోజులు పట్టిందో! బహుశ ఈ కాలము వారు ఎన్నిరోజులు పట్టినా అన్ని చేయలేరేమో! .తూర్పున వున్న ద్వారం వద్ద రతీమన్మధ విగ్రహములు అతి సుందరంగా వున్నాయి. లోపల వున్న నలభై ఎనిమిది శిల్ప కళా వైభవం తో ఉన్న రాతి స్తంభాలున్నాయి .వాటి సౌందర్యం వర్ణనాతీతమే! మండపము యొక్క పైకప్పు మీద కూడా గొప్పప కళావైభవము దర్శన మిస్తుంది. నిజానికి  సురేంద్ర సభను చూస్తున్నామా అనిపిస్తుంది. ఈ శిల్పముల నగిషీలు ఉలితో చెక్కుటకు సాధ్యమా అన్న సందేహము మనకు కలుగక మానదు. .ఈ స్తంభాల మీద 42 సాల భంజికలు అంటే మదనికలు  వివిధ భంగిమలతో మనసును దోచేస్తాయి. బయట చెక్కిన ముకుర(అద్దము) సుందరి శిల్పము యొక్క ముఖ వర్చస్సు వర్ణించుటకు కృష్ణరాయని అష్టదిగ్గజములే దిగిరావలసి వస్తుందేమో!  ,మొహినీభస్మాసుర చిత్రము  శిల్పి ఊహలకు ప్రతిబింబము. .గజాసుర సంహార దృశ్యము, గరుడ పంఖములు, వామనావతారము, కైలాసమును కదలించే రావణుడు, దుర్గా దేవి, మహిసాసుర మర్దనము, వరాహావతారము, భైరవ మూర్తి, ఆదిత్యరధము, శిల్ప చాతుర్యమునకు పరాకాష్ట. ఇంత సుందర, సునిశిత, సున్నిత, సూక్ష్మ శిల్పకళ నభూతో నభవిష్యతి. చెక్కడం ప్రపంచం లో లేనే లేదు జక్కనాచార్యునికి, ఆయన కుమారుడు ఢంకనకు, ,వారికి సహకరించిన ఇతర స్థపతుల అప్రమేయ కౌశలమునకు తార్కాణము. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద హోయసల రాజ్య చిహ్నమగు,  సాల మహారాజు సింహమును చంపు శిల్పము అత్యంత మనోహరము.

గోడలలో గాలి వెలుతురూ, లోపలికి రావటానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కినారు. .విష్ణు వర్ధన మహారాజు, అతని రాణి శాంతలా దేవి విగ్రహాలను జీవకళ ఉత్తిపదేవిధముగా చెక్కినారు. రంగ మంటపం లో ఆలయ నాట్యకత్తెలు నృత్యం చేసే వారు. 

 ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన కప్పే చెన్నగ రాయ విగ్రహాన్ని రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది . అంటే కప్ప చెన్న  కేశవ ఆలయము అని అర్థము. దీనిలో గణపతి ,సరస్వతి ,లక్ష్మి నాయణ, చాముండేశ్వరి ,వేణుగోపాల విగ్రహాలు వున్నాయి. అత్యంత ప్రతిభావంతుడగు శిల్పి జక్కనా చార్యుడు పెళ్ళయిన 6 నెలలకే తన శిల్పకళా నైపుణ్యమునకు తగిన గుర్తింపు కొరకు ఎంతగానో వెదుకుతూ 18 సంవత్సరముల తన స్వగ్రామము కైదలకు దగ్గరగావున్న ఈ చోటికి వచ్చినాడు. శిల్పకళలో అత్యంత ప్రతిభావంతుడగు అతని కుమారుడు దంకనా చార్యుడు ఒకవైపు పని మరొకవైపు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వస్తాడు. ఒకరికొకరు తెలియదు. జక్కన చేక్కుచున్న చెన్న కేశవ విగ్రహములో లోపము ఉందంటాడు తనయుడు. తండ్రి యగు జక్కన లోపము చూపిస్తే కుడి చేయి నరుక్కుంటానని శపథం చేస్తాడు. విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించినారు . .గంధం అంతా ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం తడి అట్లే నిలిచింది. ఉలి సూత్తె సహాయముతో అక్కడ తోలిచితే అందులో ఒక తొర్ర దానిలో ఒక ప్రాణం తో వున్న  కప్ప బయట పడింది. ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు. అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు. దేవుడు కలలో కన్పించి స్వగ్రామమునకు  రమ్మన్నాడట. తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞ గా చెన్నకేశవ ఆలయాన్ని అక్కడ కట్టించి స్వామి విగ్రహమును అక్కడ కొత్తగా చెక్కి ప్రతిష్ఠ గావించినారు. అప్పుడు జక్కనకు చేయి మళ్ళీ వచ్చిందట.
నా శక్తి వంచన లేకుండా నేను ఎంత వర్ణించినా ఆ కట్టడముల శోభ కళ్ళారా చూచినగాని తనివి తీరదు. అంతటి అపురూప శిల్పసంపదకు ప్రాణము పోసిన జక్కన చిత్రపఠము లేకపోవుట నాకు మనమున నాటిన అలుగు.
అక్కడనుండి మా ప్రయాణము శృంగేరి వైపునకు సాగింది. వర్షము మా వెన్నంటియే వుండినది. అధికము అల్పము అన్న తేడా తప్పించితే వాన ఆగినదీ లేదు, అదిలేక మేము సాగినదీ లేదు. బేలూరు నుండి శ్రుంగేరికి 1౦౦ కిలోమీటర్ల దూరము. ఈ పర్వతము త్రేతాయుగమున ఋష్యశృంగుని ఆవాసమగుటచే ఋష్యశృంగగిరి, శృంగగిరి ఆపై శృంగేరి అయినది. మారథము వానను కలుపుకొని శృంగేరి వైపునకు దారి తీసినది.
మిగిలినది మళ్ళీ.......
నా దక్షిణ కర్నాటక యాత్ర
4 వ భాగము
శ్రీ శృంగేరి శారదా పీఠము.   
      జగద్గురువులగు శ్రీ ఆది శంకరాచార్యులవారు తమ శిష్యులతో ఒకసారి తుంగానది తీరములో  సంచరిస్తూవుండగా  ఒక కప్ప ప్రసవించుతూ ఎండ వేడిమిని భరించలేక అలమటిస్తుండగా, ఒక పాము పడగవిప్పి నీడ పట్టి కప్పకు ఉపశమనము కలిగిస్తున్న దృశ్యమును చూసిన శంకరులు  విస్మయము చెంది తన యోగ దృష్టిచే అచ్చట ఋష్యశృంగులవారు తపమాచారించినదిగా గుర్తించి ఆదిగా, అచట దక్షిణామ్నాయ పీఠమును ప్రతిష్ఠించినారు.
      శంకరులతో వేదాంతవాదములో ఓడిపోయిన, వేయిమంది శిష్యులను కలుగుటచే  మండన పట్టమును బొందిన, మిశ్రులవారు శంకరులకు శిష్యులై అనుసరించినారు. పతితోడనే తన గతి కొనసాగించినది ఆయన సతీమణి మరియు విద్వన్మణి అపర శారదాదేవి యగు ఉభయభారతీదేవి. శృంగేరిని పీఠస్థాపనకు తగిన స్థలముగా ఎప్పుడయితే నిర్ణయించినారో అప్పుడే విశ్వరూపాచార్యులను పేరుగలిగి మండన మిశ్రులుగా ప్రఖ్యాతిగాంచి  తనకన్నా చాలా పెద్దవారైన మహానుభావుని, సురేశ్వరాచార్య నామముతో పీఠమునకు అధిపతిని జేయుటయేగాక అచట వ్యాఖ్యాన సింహాసనమును ఏర్పరచి వారినందు అధిష్ఠీంపజేసినారు. వాణీ అవతార మూర్తి యగు ఉభాయభారతీదేవి బ్రహ్మలోకమునకుబోవ సంకల్పింప ఆమెను వేడుకొని శృంగేరిలో దారువుతో చేయించిన విగ్రహమున ఆవాహనము చేసి శారదాదేవి పేరుతో ప్రతిష్టిచుటయేగాక పీఠాదిపతుల పట్టమున భారతీ నామమును సంకలనము చేసినారు. దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదమును  ఈ  పీఠమునకు ప్రదాన వేదముగా నిర్ణయించి, ప్రదత్తమైన  శ్రీ చంద్రమౌళీశ్వర స్పటిక లింగాన్నీ, శ్రీ రత్నగర్బ గణపతి విగ్రహాన్నీ, మహా మేరు యంత్రాన్నీ నిత్య పూజ కోసం శ్రీ శంకరులు అనుగ్రహించినారు. ఈ  పీఠాన్ని స్థాపించిన తరువాత, తూర్పున కాలభైరవుడు, పడమర ఆంజనేయ స్వామి, ఉత్తరాన కాళికాంబ, దక్షిణాన వన దుర్గాంబలను శృంగేరీ క్షేత్ర రక్షణకై క్షేత్ర పాలకులుగా శ్రీ శంకరులు ప్రతిష్టించుట జరిగినది.
12వ శతాబ్దమున మహమ్మదీయ ప్రాబల్యము అధికమగు తరుణమున విద్యా (శంకర) తీర్థులవారు పీఠమును అలంకరించుట జరిగినది. సాయణాచార్యులవారును, మాధవాచార్యులు అనగా  విద్యా (శంకర) తీర్థుల వారి తదనంతరము విద్యారణ్యులుగా ఖ్యాతిజేంది శృంగేరి పీఠమును అధిష్ఠించిన  వారును వారి సహోదరులు. విద్యాతీర్థులవారి ఆశీర్వాదముతోనే విద్యారణ్యులవారు విద్యానగరము(విజయనగరము)ను స్థాపించుట జరిగినది. సాయణులు, సన్యసించిన తమ సోదరుల సహాయముతో  వేదభాష్యము వ్రాసిన మహనీయులు. ఈ భాష్యమే నాటికీ నేటికీ ఏనాటికయినా జిజ్ఞాసువుల కరదీపిక. విద్యాతీర్థులవారి తదనంతరము విద్యారణ్యులు పీఠాధిపతులుగా ఉన్నపుడు అమ్మ కళలను పొందుపరచి శారదాదేవి విగ్రహమును పైడితోనూ, రాతితోనూ జేయించి ప్రతిష్ఠించినారు. విద్యాతీర్థ భారతులవారి సమాధి స్థానమే శృంగేరిలో శ్రీచక్రాకారముననున్న విద్యాశంకరాలయము. ఈ దేవాలయము యొక్క వెలుపలి భాగము కర్నాటక శైలినోనూ లోన ద్రావిడ శైలిలోనూ నిర్మింపబడినది. ఎట్టయినా వేదికపై పూర్వాభిముఖముగా నిర్మితమైన ఈ ఆలయమునకు 6 ద్వారములున్నవి. దేవస్థాన పశ్చిమార్ధ భాగమున గర్భగృహమున్నది. పూర్వార్ధ మంటపమున, 12 రాశులకు ప్రతీకలుగా 12 స్తంభములు, ఆయా రాశులలో సూర్యుడు వుండు సమయమున ఆయా స్థంభముపై మిహిర కిరణములు పడులాగున నిర్మింపబడినాయి. ఇది నాటి కట్టడ నిర్మాతల విజ్ఞాన వైశిష్ట్యము.
ఇక్కడ ఇంకా శ్రీ పార్శ్వనాతస్వామి బాసడి (దిగంబర జైనము) వారిదేవాలయము, శిరిమనే జలపాతము, తూర్పున కాలభైరవ దేవాలయము, పశ్చిమమున కెరె ఆంజనేయ స్వామి దేవాలయము, ఉత్తరమున కాళికాంబ దేవాలయము, పశ్చిమమున దుర్గాంబ దేవాలయము దర్శనీయ స్థలాలు. ఇవి కాక చెప్పారా ఆంజనేయ దేవాలయం, కిగ్గా, మల్లికార్జున దేవాలయం, మళయాళ బ్రహ్మ దేవాలయం, తోరణ గణపతి దేవాలయంనరసింహ వనం, తుంగా నది శృంగేరిలో చూడవలసిన ఇతర ఆకర్షణీయ స్థలములు. ఇక్కడ నరసింహవనమును గూర్చి ఒకమాట చెప్పవలసి వస్తుంది.
నరసింహ వనము తుంగా నది ఉత్తర తీరములో ఉన్నది. ఇరవయ్యో శతాబ్దం పూర్వభాగంలో ఈ ప్రదేశమంతా దట్టమయిన వృక్షాలతో వనములా ఊండేది. అప్పుడు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవనృసింహభారతీ మహాస్వామివారు తరచూ ఆ వనానికి వెళ్ళి ఒక బండరాయిపై ఆసీనులై ధ్యాననిమగ్నులయ్యేవారు. అప్పటి శ్రీ మఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆ ప్రాంతములో ఒక చిన్న కుటీరము నిర్మించి జగద్గురువులు ఉండేందుకు సౌకర్యాన్ని కలిగించారు.

       కాలక్రమేణా ఆ ప్రదేశం అభివృద్ధి చెందింది. అప్పటి చిన్న నిర్మాణం విస్తరించి శ్రీసచ్చిదానంద విలాస్ పేరిట జగద్గురువుల ఆశ్రమముగా పరిణామం చెందినది. కాగా నానాటికీ భక్తుల రద్ధీ అధికము కావడముతో దాని పక్కనే ఇటీవల గురునివాస్ అనే అతి పెద్ద పూజాప్రాంగణము నిర్మించారు. ఈ భవనము శ్రీ చంద్రమౌళీశ్వరుల పూజా సన్నిధిగా జద్గురువుల నివాస ప్రదేశముగా విరాజిల్లుతోంది. నరసింహవనములో పీఠం యొక్క ముప్పయి మూడు, ముప్పయి నాలుగు, ముప్పయి అయిదవ జగద్గురువార్యుల మహా సమాధి అధిష్ఠానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వేద పాఠశాల కూడా మహా స్వామి వారి ఆధ్వర్యములో నడుపబడుచున్నది. 

తిరిగీ నా అనుభవమునుగూర్చి తెలుపవలెనంటే 11వ తేదీ రాత్రి 9గం. 30ని. చేరి మఠము  వారిచే నిర్వహింపబడు విడిది లో నేను, నా శ్రీమతి, నా కుమార్తె ముగ్గురికిగానూ, రూ.35౦ కి గది తీసుకొని భోజనాడులను ముగించుకొని విశ్రమించినాము. గదులు మఠము యొక్క సిబ్బందిచే ఎంతో చక్కగా నిర్వహింపబడుతూ వున్నాయి.ఉధృతమైన వర్షము మమ్ము విడువలేదు. గొడుగులు లేకుండానే తప్ప తడుస్తూ దర్శనీయస్థలములన్నీచూసినాము. వట్టి చేతులతో పోలేక నేను హైదరాబాదులోనే భారతీతీర్థ స్వామి చరణారవిందములకు సమర్పించుటకు ఒక పంచ పద్యరత్న మాలను మరియు వారు విష్ణువు పై వ్రాసిన గరుడగమన తవ..... సంస్కృత గీతమును అనుకరిస్తూ, వారి అనుగ్రహము నా మదిలో మెదలగా సంస్కృతము రాని నేను వారిపై గీతమును వ్రాసి ఆ ప్రతుల్ని Laminate చేయించి తీసుకుపోయి వారికి సమర్పించగా ఆరోజు వేలసంఖ్యలో భక్తజనులున్ననూ, మాకు, వయసు కారణమేమో, ప్రత్యేకముగా ప్రవేశము కల్పించి నాపేరు గట్టిగా చదివి, ఆ రెండు పత్రములలో నేను వ్రాసినది వివరముగా చదువుతానని ఆశ్వాసనము ఆ మహానీయులొసంగుట నాకు మరపురాని అనుభూతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా బిడ్డను దీవించుట మాపాలిటి అవధిలేని ఆనంద హేతువు. వారిని మహా సన్నిధానము అనుట అక్కడి ఆనవాయితీ. శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరులవారిని సన్నిధానము అంటారు. వారు సభాప్రాంగణమునకు వచ్చేవరకు వేదపండితుడు నిర్వహించే శివాభిషేకమును చూస్తూ వుండిపోయినాము. వారిదర్శనము మరియు ఆశీర్వాదమును పొంది, వర్షము మరీ ఉధృతమయినందువల్ల ఆటోలో గది చేరుకొని అక్కడినుండి మా CAB లో దర్శనీయస్తలములన్నీ చూసి భోజనాదులు ముగించుకొని స్వస్థానము చేరినాము.
   ఇక్కడ ఒక విషయము చెప్పవలసియున్నది. ఇది నాపాలికి ఒక అద్భుతమైన అనుభవము.

జగద్గురు బారతీ తీర్థు లవారు క్రమము తప్పకుండా ప్రదోషకాలములో మహాన్యాసపూర్వక నమకచమక సంయుక్తముగా చంద్రమౌళీశ్వర అభిషేకము స్వయముగాచేస్తారు. మేము యాత్రకు బయలుదేరునపుడే ఆ ఆరాధన చూసి తరువాతి రోజు వేకువనే దైనందిన చర్యలు ముగించుకొని బయలుదేరవలెనన్నది ప్రణాళిక.  గడిచేరిన తరువాత ఎందుకో నా మదిలో ఇక బయలుదేరమని చెప్పినట్లు ఒక అంతర్వాణి వినిపించింది. ఆమాటే నా శ్రీమతితో, అమ్మాయితో చెప్పినాను. అప్పుడేమీ అనలేదు కానీ హైదరాబాదు వచ్చి ఇల్లు చేరినతరువాత నా ఇల్లాలు శృంగేరిలో, అనుకొన్న రీతిగా కాకుండా మీరు బయలుదేరుదామని అనుటతో నాకు నొప్పి కలిగింది కానీ మీ మాటను త్రోసిపుచ్చలేక సరే అన్నాను కానీ మీరు చెప్పుట మన యాత్రకు ఎంతో మేలుజేసినది అని చెప్పినది. వెంటనే బయలుదేరవలేనన్న ఆ మెరుపే మేరువక వుండివుంటే శృంగేరిలో మేము బయలుదేరుతూనే వచ్చిన వరదకు ఎరయై అక్కడే ఉండిపోవలసి వచ్చేది. మిగిలిన క్షేత్రములు చూడకనే వెనుదిరిగి రావలసివచ్చియుండేది. వానను చూసి ఒడలు జలదరించింది. కన్ను పోడుచుకొన్నా ఎదురుగా ఏముంది అన్నది కనిపించనంతటి వాన. కారు vipers ఎంత త్వరగా పనిచేసినా ఎదురుగా ఏమి వస్తూవుంది అని తెలుసుకోలేని స్థితి. చాల నెమ్మదిగా కారును నడిన్చినాడు మా సారథి. మేము బయలుదేరి కొంత దూరము పోయిన తరువాత, నీరు శారదా మాత గర్భగుడిలోని వచ్చినాయని photo నామిత్రుడు పంపినది చూసి అచ్చెరువందినాము. అసలు గుడికి స్వాములవారలు నివసించే నరసింహవనమునకు భారతీ తీర్థులవారి గురువగు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థులవారు శారదామాత దేవాలయమునుండి వేసిన వంతెన పైకి నీళ్ళు వచ్చినాయని మాకు తెలిసింది. అంతా గురువుగారి కరుణ, భగవంతుని అనుగ్రహము.
మిగతది మరొక పర్యాయము..........
నా దక్షిణ కర్నాటక యాత్ర

5 వ భాగము
గోకర్ణము
మా ప్రయాణము శృంగేరి నుండి దాదాపు 26౦ కిలోమీటర్ల దూరములోనున్న గోకర్ణమునకు కొనసాగినది. సాయంకాలము ఒక 3 గంటల సమయములో బయలుదేరి ఉంటాము. కుండపోత వర్షము. దారి కళ్ళు పోడుచుకొంతెగాని కనిపించుట లేదు. ఆ పరమేశ్వరుడే Driver ను ఆవహించి బండిని నడిపించినాడా అని మాకు అనిపించింది. కారును డ్రయివరు 20 కిలోమీటర్ల స్పీడుతో కూడా తోలవలసి వచ్చింది. కొన్నిచోట్ల కాసేపు నిలుపుకొనుట కూడా తటస్తించినది. గోకర్ణము చేరు సమయమునకు రాత్రి 11 గంటలయినది. Lodging దొరకలేదు. ఒక Lodge లో ఖాళీ ఉండినది కానీ అది రెండవ అంతస్తులో! Lift లేదు. నిరాశతో బయటికి వస్తూవుంటే Bicycle పై ఒక వ్యక్తి కనిపించి తాను బస చూపించుతానని మమ్ము ఒక ఇంటికి తీసుకొని పోయినాడు. అతనికి 5౦ రూపాయలు ఇచ్చినాము. ఇంటికి 5౦౦ రూపాయలు అన్నారు. సంతోషముగా ఇచ్చి రాత్రికి పడుకొని నిదురపోయి తెల్లవారి నిత్యనైమిత్తిక కార్యములను ముగించుకొని, మా Luggage కారులో సర్దుకొని, వినాయక మహాబలేశ్వరుల దర్శనమునకు పోయినాము. వర్షము మాపై ఏమాత్రమూ కరుణించలేదు.
గోకర్ణం ఒక గొప్ప శైవ క్షేత్రము గా చాలా ప్రసిద్ది చెందింది . ఇక్కడి స్వామి మహా బలేశ్వరుడు . అమ్మవారు తామ్రగౌరి గా పిలవబడుతుంది . ఇది సిద్ధి క్షేత్రము గా ప్రసిద్ది చెందినది అని పూర్వీకులు చెపుతున్నారు . రావణాసురుని తల్లి కైకసి, రావణుడు, తపస్సు, ఆత్మలింగము, పరమేశ్వరుడువిఘ్నేశ్వరుడు, ఆత్మ లింగ భూపతనము అను క్రమములో జరిగిన, ఈ కథ భూకైలాస్ పేరుతో N.Tరామారావు నాయకునిగా వచ్చియుండినది. T.V. లలో అందరూ చూసియే వుంటారు కావున విస్తరించలేదు.
ఇక్కడ వెలిసిన పరమేశ్వరుని ఆత్మలింగమునకు పడమర ముఖము గా చక్కని ఆలయము నిర్మించినారు . ఈ ఆలయములో ని స్వామి పేరు మహాబలేశ్వరుడు . రావణుని వంటి మహాబలవంతుడు కూడా ఈ ఆత్మలింగాన్ని పైకి ఎత్తలేకపోయినందువల్ల స్వామికి మహాబలేశ్వరుడు అనే పేరు వచ్చింది . ఆలయములో వున్న లింగము యొక్క సగభాగము భూమి లో దిగబడి వున్నది మిగతా సగభాగము భూమి కి పైన వున్నది . భూమికి సగభాగము పై కి వున్న లింగము చుట్టూ అంటే నాల్గు వైపులా కప్పి వేస్తూ ఒక దాని మీద ఒకటిగా రాళ్ళు పేర్చుకుంటూ వచ్చినారు. అన్నిటి కన్నా పైన వుండే రాయి ఆవు చెవి ఆకారము ను కలిగి వుంటుంది.  ఆ రంద్రము లో చెయ్యి పెట్టి చూస్తే లోపలి లింగము యొక్క శిరోభాగము చేతికి తగులుతుంది . ఈ గోకర్ణ ము లాగా వుండే రంద్రము ఉన్న రాయి సుమారు నాలుగు అడుగుల చదరంగము వుంటుంది . భక్తులు ఆ రాయి చుట్టూ కూర్చొని స్వయము గా అభిషేకము చేస్తారు .

 60 సంవత్సరములకొకమారు ఆత్మ లింగము చుట్టూ ఉన్న రాళ్ళను తొలగొంచి పిఠము దగ్గరనుండి పై వరకు  వుండే సంపూర్ణ లింగాన్ని అందరూ దర్శించుకునేట్లు చేస్తారు . ఈ సమయము లో ఇక్కడ గొప్ప ఉత్సవము జరుగుతుంది . దేశము నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వొస్తారు .

ఆలయములోనికి ప్రవేశించగనే కుడి చేతి వైపు వినాయకుని ఆలయము ఉంది రావణాసురుడు మొట్టికాయ కొట్టినట్లు వినాయకుడి విగ్రహము మాడు పైన బొప్పెలు కట్టినట్లుగా ఒక గుంట వుంటుంది . గణపతిని అందరూ తాకి అభిషేకము స్వయము గా చేయవచ్చు . భక్తులు ఆ బొప్పెలకు వెన్నరాస్తారు . ఇక్కడ పట్టగణపతి కేతకి గణపతి అనే మరో రెండు ఆలయములు వున్నాయి .
ముందుగా వినాయకుని దర్శించుకొని ఆతరువాత ప్రాధాన ఆలయములోని మహా బలేశ్వరుడిని దర్శించుకోవడము ఇక్కడి ఆనవాయితీ . దాని పక్కనే పార్వతి దేవి ఆలయము కలదు . ఆత్మలింగము లో ఉన్న పరమేశ్వరుడు ఈ క్షేత్రము లో ఉన్నట్లు తెలుసుకొని ఆయనను వెదుక్కుంటూ పార్వతి దేవి ఇక్కడికి వచ్చినదని చెబుతారు. ఆరోజులలో ఈ ప్రాంతమును తామ్ర పర్వతము అని పిలిచేవారట . అందువలన ఈ అమ్మవారిని తామ్ర గౌరి అని పిలుస్తునారు .ఇక్కడ భద్రకాళి ఆలయము కోటితీర్దము కూడా వున్నాయి .

గోకర్ణ ప్రాంతములో నాగలింగపుష్పములుగా పిలువబడే  పుష్పములు ఎక్కువ గా దొరుకుతాయి . శివపూజకు వీనినే ఉపయోగించుతారు . భూకైలాసము గా ప్రసిద్దిపొందిన ఈ పుణ్య తీర్థమున గల మహా బలేశ్వరునికోటితీర్దములో స్నానమాచర్తించిఓపిక గలవారు  సముద్ర స్నానము చేసి స్వామిని దర్శిస్తారు.
పరమేశ్వరుని అనుగ్రహముతో జనసంమర్దము విపరీతముగా వున్నా, అచటి అర్చకులు మాకు CUE నియమము పాటింపజేయకుండా తాము తోడుగా వచ్చి దర్శనము చేయించినారు. పరమేశ్వరుడు వారికి సదా శుభములను చేకూర్చవలెెనని వేడుకొనుట తప్ప నేను చేయగలిగినది నాకేదీ కనిపించలేదు.

గోకర్ణమునందు సముద్రతీరము తప్పక చూడతగినదని విన్నాను కానీ వర్శమువల్ల అచటికి పోలేదు.
తరువాత స్వామి సన్నిధానమునకు దగ్గరగావున్న ఒక చిన్న హోటలులో అల్పాహారము కాఫీ ముగించుకొన్నాము. ఎంతో పరిశుభ్రముగానూ అత్మీయతతోనూ అడిగినది తినుటకు ఇచ్చిన ఆ మహిళా సిబ్బందిని మరువలేము. Cash Counter లో తప్ప ఆహోటలు అంతా మహిళలచేతనే నడుపబడుతుంది. ఉదయము 9 గంటలకల్లా మహాబలేశ్వరుని మనసారా నమస్కరించుకొని గోకర్ణమునుండి దాదాపు 7౦కిలోమీటర్ల దూరములో వుండే మృడేశ్వరమునకు మా ప్రయాణమును కొనసాగించినాము. దారిలో కీరదోస కాయలను ఎక్కువగా కొని ఉంచుకొన్నాము. లావులో అవి సన్నని సొరకాయ ను పోలినా పై బొప్పి చాలా పలుచన. కాయ చాలా లేతగా వుండి ఎంతో రుచికరముగా వుంటుంది. మేము దీనినే భోజనముగా మా యాత్రలో వాడుకొన్నాము.
మృడేశ్వరము లేక మరుడేశ్వరమును గూర్చి వేరొక సారి......
                     6వ భాగము
                   మురుడేశ్వరము
భూతేశః ఖణ్డ పరశుర్గిరీశోర్గిరిశోమృడఃl
మృత్యుంజయః కృత్తివాసాః పినాకీ ప్రమదాధిపఃll (అమరకోశము)
మృడ అంటే ఆనందము, ముదము, సంతోషము మొదలగు అర్థములు కలవు. అట్టి ఆనందమునకు అధిపతి కాబట్టి ఆపరమేశ్వరుడు మృడ అన్న నామమును కలిగియున్నాడు. అట్టి ఆనందమునకు అధిపతియై మృడేశ్వరుడైనాడు. మృడ అన్న శబ్దమే రానురానూ మురుడ అయినది అని తలచుచున్నాను. మురుడ అన్న మాటకు వస్త్రము అన్న అర్థము కన్నడములో వున్నదని చదివినాను.
రావణుడు గొనితెచ్చుచున్న ఆత్మలింగమును వినాయకుడు క్రింద ఉంచగా ఆ లింగమును పెకలింపబూని దానిపై గల వస్త్రమును విసరితే ఇచ్చటపడినందుచేత ఇచ్చటి శివలింగము మురుడేశ్వర లింగముగా ఖ్యాతినందిందని స్థల పురాణము. నాకేమో మృడేశ్వర అన్నదే సవ్యముగా తోచుతుంది.
అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి  కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్‌ తాలూకాలో ఉన్నది.
ఈ క్షేత్రము చుట్టూ మూడువైపులా అరేబియా సముద్రము  ఉన్నది.  ప్రపంచంలోనే అతి పొడవైన శివుని శిలావిగ్రహం ఇచట కలదు. ఆధారాల ప్రకారము  ఈ విగ్రహమును ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహముగా చెప్పుకొంటారు. 123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టిందని చెబుతారు. శివమొగ్గకు చెందిన కాశీనాథ్ఆయన కుమారుడు శ్రీధర్ఇతర శిల్పుల సహాయ సహకారములతో, R.N. షెట్టి అన్న వదాన్యుడు కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించినారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.ఈ దేవాలయము కందుక పర్వతముపైనున్నది. ఈ దేవాలయపు గాలి గోపురము 18 (కొందరు 20 అంతస్తులు అంటారు. నాకు 18 మాత్రమే తెలియవచ్చినవి.) అంతస్తులనుకలిగియున్నది. పై అంతస్తు చేరుటకు Lift సౌఖర్యము కలదు. పైనుండి సముద్రము మరియు దేవాలయ పరిసరములు చూచుటకు ఎంతో హృద్యముగా వుంటాయి. Lift లో పై అంతస్తు చేరుటకుట్ తలకు రూ.10\= Ticket కొనవలసి వుంటుంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులా అన్నట్లు ద్వారమునకు ఇరువైపులా రెండు ఏనుగులు వున్నాయి. దేవాలయ గర్భగుడి మాత్రము స్థాపత్య ఆగమ శాస్త్రానుసారముగా పూర్వమునుండి, అపూర్వ శోభలతో దనరారుచున్నది.
ఇచట కూడా మమ్ము నేరుమార్గములో తీసుకుపోయి దర్శనము చేయించినారు. మా వయసు, వారి మనసు మాకు సహకరించినవి.

ఇక అచ్చటి నుండి కొల్లూరు బయలుదెరినాము. కుండపోత వర్షము మమ్ము విడువకుండా వెన్నంటినది.
వేరోకసారి కొల్లూరిని గూర్చి..............
                     7వ భాగము
                       కొల్లూరు
త్రేతాయుగంలో శక్తిస్వరూపిణి జగన్మాత సౌపర్ణికా నది ఒడ్డున కోడచాద్రి పై మూకాంబికాదేవి అవతరించింది. కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరుకు 135 కి.మీల దూరంలో 3880 అడుగుల ఎత్తులో వున్న కోడచాద్రి పై పరశురాముడు ప్రతిష్ఠించారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మహామహితామూర్తి అయిన మూకాంబికాదేవిని దర్శించడానికి భక్తులు ఆ పర్వత శిఖరాన్ని ఎక్కలేకపోతున్నారని ఆదిశంకరాచార్యులు కొండ క్రిందిభాగంలో మూకాంబకాదేవిని పునఃప్రతిష్ఠ చేశారని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. శ్రీరామునికీ రావణాసురుడికి జరుగుతున్న యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్న సమయంలో ఆ పర్వతంపై వున్న ఔషధీయుక్తమగువనమూలికలు కొన్ని కొల్లూరు కొండ ప్రాంతంలో పడినట్లు స్థలపురాణము. ఈ కారణంగా ఈ ప్రాంతమంతా వనమూలికల సువాసనతో నిండి వుంటుంది. మహారణ్యపురం అనే నామంతో వున్న ఈ ప్రాంతంలో కోలమహర్షి తపస్సు చేసి శివుడిని మెప్పించినాడట. స్వామీ సతీ సమేతముగా ప్రత్యక్షముకాగా మహర్షి సదా పూజలందుకొనే విధముగా ఇరువురు అచట నిలువవలేనన్నాదట. అంత స్వామీ స్వయంగా రూపుదిద్దిన పార్దివలింగాన్ని, మధ్యలో ఒక బంగారు రేఖ వుండులాగున (అర్ధనారీశ్వర తత్వము) కోల మహర్షికి ఆ స్వామి ప్రసాదించినాడట. ఆ కారణంగా ఈ ప్రాంతానికి కోలపురం అనే పేరు సార్థకమైంది. కాలక్రమేణా కోలపురము కొల్లూరుగా మారింది. కోల మహర్షి తపస్సుచేస్తున్న సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఆ మహర్షిని వేధిస్తూ తపోభంగం చేస్తుండటంవలన ఆ మహర్షి కోరిక మేరకు జగన్మాత మూకాంబికాదేవిగా అవతరించి మూకాసురుడిని వధించింది. ఆ తరువాత మహర్షి కోరికతో ఆ జగన్మాత అక్కడే వుండిపోయింది. ఈ మహాశక్తి దుర్గాదేవి అవతారం శంఖ చక్రాలతో సింహంపై కూర్చున్నట్లుగా కనిపించుతుంది.
మూకాంబికా దేవి ఆలయం కోడచాద్రి శిఖరం క్రింద ఉంటుంది. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని (ఐదు లోహాల మిశ్రమము) ఆది శంకరాచార్యులవారు ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ప్రతిష్ఠించినారని అంటారు. మూకాంబికాదేవి మొదట కోడచాద్రి శిఖరం (3880') మీద ఉండేదనిసామాన్య ప్రజానీకానికి కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతోశంకరాచార్య ఆ దేవాలయాన్ని కోలూరు లో తిరిగి స్థాపించినారని ప్రజలు నమ్ముతారు.
 ఈ అమ్మవారితోపాటు పార్దివ లింగాన్ని శంకరాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అమ్మవారికి ముందుభాగంలో పాదాల దగ్గర శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించినారు శంకరులవారు. మాత రూపాన్ని మనసులో పదిలపరచుకొన్న శంకరులవారు పంచలోహములతో ఆమె విగ్రహాన్ని రూపొందించి శ్రీచక్రం దగ్గర ఉంచినారు. నిత్య పూజాభిషేకములు ఆ పంచలోహ విగ్రహమునకు చేస్తు ఉంటారు.
నాడు శంకరులవారు ఏర్పరచిన పూజాభిషేకములు నేటికీ అదేవిధంగా జరుగుతున్నాయి. ఆదిశంకరాచార్యులు పూజలు చేసిన ఈ ఆలయంలో ఎంతో మహిమ వుందనిఇక్కడ అమ్మవారిని దర్శించి ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఈఅరణ్య ప్రాంతములో ప్రవహించే అగ్నితీర్ధ సౌపర్ణిక అనే రెండు నదులు కోడచాద్రి  నుండి దిగుతున్నాయి. కాలభైరవ మరియు ఉమామహేశ్వర ఆలయాల మధ్య ఉన్న ప్రాంతము సౌపర్ణిక నది యొక్క మూలము. తన తల్లి వినుత యొక్క కష్టములను పోగొట్టమని దేవిని ప్రార్థిస్తూ సుపర్ణుడు (గరుత్మంతుడు) ఈ నది ఒడ్డునే తపస్సు చేసినాడని పురాణాలు చెబుతున్నాయి.  తన జ్ఞాపకార్థము గరుత్మంతుడు ఆనదికి  తన పేరు పెట్టవలని కోరితేదేవి తధాస్తు అనుటతో అప్పటినుండి సౌపర్ణిక అన్న పేరు ఆ నదికి వచ్చింది. అతను తపస్సు చేసిన స్థలము "గరుడ గుహ" అని పిలవబడే ఒక చిన్న గుహగా ఈ నాటికి కూడా ఉంది. ఇక్కడ నీరు ఎంతో స్వచ్ఛంగా వుంటాయి. భక్తులు ఇచట స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తారు. పండుగ రోజులలో ఈ ఆలయంలో ప్రత్యేకముగా పూజలు జరుగుతుంటాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సుబ్రహ్మణ్యశ్రీ పార్థివేశ్వరశ్రీ పంచముఖ గణాధిపశ్రీ చంద్రమౌళీశ్వరశ్రీ ప్రాణలింగేశ్వరశ్రీ నంజుండేశ్వరశ్రీ ఆంజనేయసుబ్రహ్మణ్యవీరభద్రశ్రీ వెంకటరమణశ్రీ తులసి గోపాలకృష్ణలు మొదలగుఇతర దేవతలు కూడా కోలువైయున్నారు   పది చేతులతో ఆయుధాలు ఉన్న అభయ వినాయక విగ్రహము మనకు ఎంతో ఆశ్చర్యజనకమైన సిశాయము. ఆదిశంకరాచార్యుల విగ్రహం ఎంతో ప్రకాశవంతంగా ఆ స్వామి తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఈ ఆలయంలో రోజుకు మూడు సార్లు ఉదయంమధ్యాహ్నంరాత్రి మహానివేదన హారతి ఇస్తారు. ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు ప్రతిరోజూ జరుగుతుంటాయి. సమీపమునగల కోల మహర్షి ఆశ్రమదర్శనమునకు అనువుగా బస్సు సౌకర్యం కూడా వుంది. ప్రకృతి అందాలతో ప్రతినిత్యం భక్తుల సందడితో దేదీప్యమానంగా ప్రకాశించే ఈ ఆలయంలో మూకాంబికాదేవి దర్శనము భక్తులకు ఆ జగన్మాత వరప్రసాదము.
ఈ దేవాలయానికి,  అమ్మవారి రెండు బంగారు దేవతా విగ్రహాలు ఉన్నాయి. అసలు విగ్రహము ఎకారనముచేతనో పోవడంతోరాణీ చెన్నమ్మ దానికి బదులుగా బహుకరించిన విగ్రహము ఉంచబడింది. తరువాత ఆ పోయిన విగ్రహం దొరకడంతోఇప్పుడు రెండు విగ్రహాలు మనకు దేవాలయములో దర్శనమిస్తూవున్నాయి.
K.J. ఏసుదాసు దేవీ మూకాంబిక పరమభక్తుడు. తన పుట్టినరోజుకు ప్రతి ఏడూ ఇచ్చటికి వస్తూవుంటాడు. 2010 జనవరి 10ఆదివారం నాడుఅయన తన 70వ జన్మదిన సందర్భముగా ఈ ఆలయములో ఒక సంగీతార్చన (సాంప్రదాయక భక్తిగీతాలు)  కార్యక్రమాన్ని 70 గాయకులతో అమ్మవారి ముందు  నిర్వహించినాడు.
అక్కడినుండి దాదాపు 8౦కి.మీ. దూరములో వుండే ఉడుపికి మేమూ, వాన ప్రయాణము కొనసాగించినాము


8వ భాగము - ఉడుపి
  ప్రాంతము పేరు ఉడుపి, ఉడిపి కాదు. స్ధానిక చరిత్ర ప్రకారం చంద్రుడు 27 నక్షత్రాల పేర్లుగల దక్షుని కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కానీ రోహిణికి ఎక్కువగా ఆకర్షితుడై మిగిలిన భార్యల ఎడల నిర్లక్ష్యముతో ఉండుటవలనదక్షుని శాపంచే చంద్రుడు వ్యాధిగ్రస్తుడై క్షీణింపసాగినాడు. చంద్రుడుఅతని భార్యలు కలసి శాప విమోచనకై ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినారు అన్నది స్థల పురాణము. ఇప్పటికీ ఈ లింగాన్ని ఉడుపిలో చూడవచ్చు. సంస్కృతంలో ఉడు అంటే వెన్నెల, తారకలుఅంటే అధిపతి, అధీశుడు, భర్త అని అర్థము. కావున ఉడుప అంటే చంద్రుడు. ఆయన తపమాచరించిన స్థలమగుటచే ఈ ప్రాంతమును ఉడుపి అన్నారు. కాలాంతరములో రూపాంతరముచెంది ఉడిపి అయినది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. ఈ ప్రాంతమునకు దగ్గరగా శివళ్ళి అన్న జనావాసము ఉండేది. రానురానూ వాణిజ్య వ్యవసాయ రంగములందు అధికమగు అభివృద్ధి వలననూ, జన సంఖ్య పెరుగుట చేతనూ చుట్టుపక్కల మరికొన్ని జనావాసములు కలియుట చేతనూ ఉడిపి అన్న పేరుతో నగరమై, శ్రీకృష్ణ ధామమై, విద్యానిలయమై, విద్యాలయ ప్రాంగానమై ప్రసిద్ధికెక్కినది. ఉడిపి నారికేళ వృక్షములకు, పోకచెట్లకు, ముంతమామిడికి  పెట్టింది పేరు.
వేరొక కథనము ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అనిదానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి ప్రాంతము, అద్వైత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలము. పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహమును ప్రతిష్ఠించి మఠమును స్థాపించినారు. దీనికి సంబంధించిన కథను ఈ విధముగా చెప్పుకొంటారు. ఒకసారి తీవ్రమైన తుఫాను తాకిడికి ఉడిపి సమీపమున సముద్రములో ఒకనావ మునిగిపోవుతరి మహిమాన్వితులగు మధ్వాచార్యులవారు దానిని రక్షించగా, ఆ నావికుడు ఆచార్యులవారిని ఆ నావికుని పరిధిలోవున్న ఏ వస్తువయినాకూడా కోరుకోమ్మన్నాడట. ఆ ఓడ సామాగ్రిలో కలసిపోయిన చందనము మూటను కోరినారు ఆచార్యులవారు. అందు శ్రీకృష్ణ విగ్రహము కలదని తన దివ్య దృష్టిచే తెలుసుకొన్నారు కాబట్టి. ఆ తరువాత ఆ విగ్రహమును ఆగమ శాస్త్రానుసారముగా ఆయన ప్రతిష్ఠించినారట.
ఉడుపి శ్రీకృష్ణ దేవాలయమును గురించి ఒక స్ధానిక కథనము ప్రకారము, 16వ శతాబ్దములో నిమ్న కులమునకు చెందిన కనకదాసు అను భక్తుడు కృష్ణ దర్శనము కోరి దేవాలయమునకు వస్తే, అతడిని దేవాలయంలోనికి అనుమతినివ్వలేదని దానికిగాను కనకదాసు దేవాలయమునకు ఉన్న చిన్న కిటికీ నుండి లోపలికి చూసినాడనిఅయితే అతనికి శ్రీకృష్ణుడి వీపు భాగం మాత్రం కనపడిందనిఅప్పుడు శ్రీకృష్ణుడు తానే కనక దాసు వైపునకు తిరిగి ఆయనకు దర్శనము కలుగాజేసినాడట.
ఇక్కడికి దగ్గరలో ఉన్న యల్లూరులో మరో శివాలయం ఉంది. ఇది సుమారు వేయి సంవత్సరాల పురాతనమైనదని చెపుతారు. ప్రతి సంవత్సరములక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయంఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. కనకదాసుకు దర్శనమిచ్చిన కిటికీ కాబట్టి దీనిని కనకణ కిండె అంటారు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు)వామభాగాన గరుడ దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికీ, పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు
    ఉడిపి నుండి 3 కిలోమీటర్ల దూరంలో మణిపాల్ నెలకొని ఉంది. పూర్వము ఈమణిపాల్షివల్లీ గ్రామ పంచాయితీ క్రింద ఉండేది. ఈ పేరు మణిపాల్‌గా ఆంగ్లీకరించుటకు మున్ను, మన్ను పల్లా వుండేది. తుళు భాషలో మన్ను అనగా మట్టి మరియు పల్లా అనగా (గుంత) చెరువు అని అర్థం. మట్టిచెరువు అని అర్థము. వైద్యుడుబ్యాంకర్విద్యావేత్తపారిశ్రామికవేత్త మరియు పరోపకారి అయిన Dr.T.M.A. పాయ్ ఒక బంజరు భూమిగా ఉండిపోయిన కొండను విశ్వవిద్యాలయముగా రూపుదిద్ది, మణిపాల్ ను  పట్టణముగా 1950వ దశకంలో రూపొందించి  ప్రాముఖ్యతను సంతరింపజేసినాడు.
జన్మలో ఒకసారి ఉడిపి దర్శనము తప్పక చేసుకొని తరించ దలచుతారు భక్తులు.

రాత్రికి మేము ఉడిపి లోనే బస చేసినాము. మఠమునకు సంబంధించినది కావున వారు మా ముగ్గురికీ, రూ.7౦౦ మాత్రమే తీసుకొన్నారు ఒక రోజుకు. తెల్లవారి కాలకృత్యములు తీర్చుకొని స్నానాదులు చేసి, ధ్యానాదులు ముగించుకొని, ఫలాహారము చేసి అచటి నుండి 1౦5 కి.మీ. దూరమున్న ధర్మస్థలకు బయలుదేరినాము. ఇన్ని పుణ్యక్షేత్రములలో మేము తడవకుండా దైవదర్శనము చేసుకొన్న ప్రదేశమే లేదు. అంతటి ఎడతెరిపిలేనివానను మనప్రాంతములలో చూడలేము. ప్రవాహాలు ఉధృతమై ప్రయాణమునకు భంగమౌతుందేమోనన్న భయము ఆవరించినా కూడా ఆసాన్థమూ దేవునిపై భారము వేసి ప్రతి క్షేత్రమునూ దర్శించుకొన్నాము. జడివానకు జడువకనే జాడబట్టి ప్రయాణము చేస్తూ పోయినాము. వర్షము యొక్క ఉధృతి పెరిగిపోయి భ్రుగుపాతము లేక భూపాతము  (Land sliding, కొండ చరియలు విరిగి పడుట) జరిగి, చెట్లు రథ్యలపై (Roads) విరిగి పడి, వాతావరణము పోగామంచుచే దట్టముగా కప్పబడి, వానలచే రోడ్లు బీటలుబారి, విరుచుకుపడి నిరంతర అంతరాయమును ఆ దినమునకు సృష్టించినాయి. ఎట్లయితేనేమి మా సారధి సరియైనవాడగుటచే సావధానముగానూ సక్రమముగానూ ధర్మస్థల చేరినాము. 
9వ భాగము - ధర్మస్థల
క్షేమముగా ధర్మస్థల చేరినాము. వాహనమును దేవస్థానము వారు చెప్పిన చోట నిలుపుకొని మేము పాదచారులమై మంజునాథస్వామి దర్శనమునకు బయలుదేరినాము. దేవాలయ ముఖద్వారము సమీపించగనే, ముఖద్వారము చేరుటకు ఎక్కవలసిన 15 మోకాటి ఎత్తు మెట్లు చూసి దిగాలుపదిపోయినాను. ఎట్టి పరిస్థితిలోకూడా  నేను నా శ్రీమతి ఎక్కలేము. అప్పుడు అక్కడవున్న Guard పిలుపు వినిపించింది. మీరు ఇటు రండి అని అన్నాడతను. అతను మమ్ము పిలిచిన చోట మెట్లు ఎక్కుటకు గ్రాది(Hand Railing, మెట్లు ఎక్కుటకు ఆపుగా చేతితో పట్టుకొని ఎక్కుటకు ఏర్పరచిన కమ్మీ)కి ఒక కుర్చీ పైవరకు ప్రాకుటకు వీలుగా అమర్చబడి వున్నది. దేవునికి ధన్యవాదములు, అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని అతని సహాయముతో మంజునాతుని దర్శనముకొరకు గుడిలో ప్రవేశించినాము. అక్కడ కూడా ఒక పుణ్యాత్ముడు మమ్ము తనవెంట దగ్గరిదారిలో తీసుకొని పోయి నేత్రపర్వముగా స్వామీ దర్శనము చేయించినాడు, దైవం మానుష రూపేణ అన్న సూక్తిని గుర్తుచేస్తూ! అంతా ముగించుకొని మేము మెట్లు ఎక్కినవిధముగానే దిగి వచ్చినాము. అక్కడ ఒక యువతి ద్వారబంధము దాటుటకు నాకు సహాయము చేసింది, బహుశ నా కుమార్తె స్వామికి నమస్కారము చేసుకొనుచుండుటవల్ల కాబోలు. లేకుంటే నాయాత్రలో నా కూతురే నా తోడుగా నిలచినది. నా శ్రీమతి తాను నడవగలుగుతుంది కానీ నాకవసరమగుచోట
 నన్ను పట్టుకొని తాను నడువలేదు. తానూ వయసులో పెద్దది కదా! నావలె సహాయము కోరకుండా తాను నడవగాలుగుతుంది. ఆయువతి పాదస్పర్శచేసి నమస్కరించి కదిలినది. ఆమె సంస్కారమునకు నమస్కారము చేయుట తప్ప ఏమి ఇచ్చుకోగలను. మనసారా దీర్ఘసుమంగళీభవ అని దీవించినాను. క్రిందికి దిగుతూనే Guard మమ్ము నిలిపి, కారు నంబరు తీసుకొని, కారు పెట్టె స్థలములో వున్న వ్యక్తికి ఫోను చేసి, మేమున్న చోటికే రప్పించినాడు. కృతజ్ఞత నిండిన కన్నులతో అతనిని దీవించి అక్కడినుండి కదిలినాము. అప్పటికి గంట ఇంచుమించుగా మధ్యాహ్నము ఒకటి అయివుంటుంది. ఇప్పుడు ధర్మస్థలను గూర్చి నేను తెలుసుకొన్నది తెలియజేస్తాను.

ధర్మస్థల
ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. ఈ ప్రసిద్ధ క్షేత్రానికి కొన్ని దేశములో వేరెక్కడా లేని ప్రత్యేకతలున్నాయి. నాకు
తెలిసిన మేరకు చెప్పే ప్రయత్నము చేస్తాను.
ధర్మస్థలలోని శివలింగము గ్రామదేవత అయిన అణ్ణప్ప దైవము చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తారు.
పర్గాడే కుటుంబాలకు అణ్ణప్ప ను తమ కులదైవముగా నెంచుతారు. పర్గాడే అన్న మాట రానురానూ హేగడే అయ్యిందిఅసలు పర్గాడే అన్నది కూడా ప్రగ్గడ అన్న ఒక బ్రాహ్మణ శాఖ నుండి ఉద్బవించినదని నా ఆలోచన, ఇందులో పోరాబాతుకూడా ఉండవచ్చు. ఈవిషయమును జగదేకవీరునికథలో రాజుపాత్రదారియగు రాజనాల తనమంత్రిని ప్రగ్గడా, బాదరాయణ ప్రగ్గడా అని పడే పడే సంభోదిస్తూవుంటాడు.

ఈ దివ్య క్షేత్రానికి 8౦౦ సంవర్త్సరముల చరిత్ర వుంది. ఈ క్షేత్రము సార్థక నామధేయము కలిగివున్నది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ క్షేత్రము దిగంబర జైన శాఖీయులచేత నడపబడుతూవుంది. గుడిలోని ప్రధాన దేవత మంజునాథ నామధేయుడగు శివుడు. ఇక్కడ శివునితోబాటుగా  అమ్మవారు (కన్నడములో అమ్మనవరు, ప్రత్యేకమైన పేరు లేదని తెలియవచ్చుచున్నది.). వున్నారు. వీరితోబాటుగా కాలరాహు, కాలకేయి, కుమారస్వామి, కన్యాకుమారి అను, ధర్మదైవములుగా పిలువబడే దేవతలు ఈ క్షేత్రము యొక్క ధర్మపరత్వమును క్షేత్రపాలకులై కాపాడుచున్నారు. ఇచ్చటినుండి ఏదయినా వస్తువు కంటికి కానరాకుండా తీసుకొని
 బయటికి దాతదలచితే వెంటనే కడుపునొప్పితో బాధపడి ఆ తీసిన వస్తువును తక్షణం ఉన్నచోటనే పెట్టివేస్తాడట. ఇచట ప్రవహించే నది పేరు నేత్రావతి.
ఈ హెగ్గడే అన్నది వంశ నామము. దీనిని కర్ణాటకలో జైనులు, బ్రాహ్మణులు, ఒక్కలింగలు, బంతు అన్న ఒక స్థానిక శాఖకు చెందినవారు ఉంచుకొంటారు. 8౦౦ల సంవత్సరముల క్రితము ధర్మస్థల అన్న పేరుకు బదులుగా మల్లమాడి అన్న పల్లెలో కుదుమ అని పిలిచేవారట. ఇక్కడ బిర్మన్న పెర్గాడే అమ్ము బల్లాల్తి అన్న జైన దంపతులు నివసించేవారు. వీరు ధర్మానికి, దయకు, పరోపకారమునకు మారుపేరై నివసించేవారు. వారిని పరీక్షించుటకు పైన తెలిపిన ధర్మదేవతలు మారురూపములవచ్చి పశ్రీక్షించి, సంతృప్తిని పొంది, కొన్ని దినముల తరువాత బిర్మన్నకు స్వప్నమున కనిపించి ధర్మదేవతలగు తాము  నెలవైయుండుటకు అది తగిన ప్రదేశముగానూ, కొలువైయుండుటకు అతని ఇల్లు తగినదిగానూ గుర్తించినామని చెప్పి తనను వేరే ఇల్లు కట్టించుకొనమని చెప్పి  వారాఇంటిలో ప్రతిష్ఠితులైనారు. వారాతనికది శ్రీ క్షేత్రమని తెలిపి తాము చెప్పినట్లే చేయమన్నారు. బిర్మన్న అటులనే చేసినాడు. ధర్మచారుడు కదా! వారు అతనికి తమ ప్రతినిధులుగా ఇద్దరు పండితులగు  అర్చకులను తమకుగానూ, అదేవిధముగా నలుగురు విద్యావంతులు తనకు శ్రేయోభిలాషులగు ఆజ్ఞానువర్తులుగానూ వుంచుకొమ్మని ఉపదేశించినారు. ఈ ధర్మదేవతలుతమ  ప్రతినిధులగు వారిరువురిచే దైవవాక్కును పలికింపజేస్తారట అవసరమగునపుడు. వీరిని  డెలాపాదిత్య మరియు మనవోలిత్యాయ అంటారు. నిరంతర పూజాది సత్కార్య అకుంఠిత సాధనకై బిర్మన్నను ఆ ధర్మదేవతలు సంపద్వరిష్టునిగా చేసినారట.
ఈ ధర్మక్షేత్రమున శివ అంటే శుభకరుడు, శంకరుడు అంటే శ్రేయస్కరుడు వుంటే ధర్మము నిరంతరమూ నిలువగలుగుతుందని ఆయన అనుచరులు సలహా ఇచ్చినారట. హెగడే కుటుంబము అట్లేయని శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు ధర్మ దేవతల పనుపున అణ్ణప్ప స్వామి శివలింగమును తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమయినాడట. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసే వేళకు హెగడే గృహానికి వెలుపల శివలింగం ప్రతిష్ఠింపబడి ఉంది. అణ్ణప్ప స్వామి మంగళూరు సమీపంలోని ఖాద్రి నుండి తెచ్చి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు అచ్చటి కథనము. ఆ తరువాత, అచ్చటి వారలకు ఆ లింగము మంగళూరు నందలి ఖాద్రి ఆలయం లోనిదని తెలిసింది. అణ్ణప్ప దైవము తిరిగీ ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతము ధర్మస్థల ప్రజలు అణ్ణప్ప దైవాన్ని గ్రామదేవత పంజుర్లిగా ఆరాధిస్తున్నారు. వేకువనే ఇంటిముందు లింగముండుట మహాద్భుతముగా నెంచి హెగడే కుటుంబమువారు శివలింగము చుట్టూ మంజునాథుని ఆలయనిర్మాణం జరిపించినారు. ధర్మస్థల దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి చెందినది. ఇది శివక్షేత్రము అని వేరేగా చెప్పనవసరము లేదు.
ఈ శైవ క్షేత్రము జైనులచే నిర్వహిమబడుతూవుంటే వైష్ణవులు దీనికి పూజారులు. ఈ క్షేత్రమునకు మరియొక ప్రత్యేకత యున్నది. 16వ శతాబ్దములో హెగ్డే కుటుంబమునకు చెందిన దేవరాజ హెగ్గడే ఉడిపి మఠాధిపతులగు వాదిరాజస్వామిని ధర్మస్థలకు ఆహ్వానించినారు. స్వామి అక్కడ శివలింగ ప్రతిష్ఠ శాస్త్రోక్తముగా జరుగని కారణమున భిక్ష స్వీకరించనన్నాడు. అప్పుడు దేవరాజ హెగ్గడే ఆయనను ప్రార్థించగా మాధ్వ పద్ధతిలో ప్రతిష్ఠ చేయించి బిక్ష గైకొన్నాడు. దీనినిబట్టి ఈ క్షేత్రము సర్వ వేదాంత మార్గములకు సరియైనకూడలిగా శోభిల్లుచున్నది. లక్ష దీపారాధన ఉత్సవము ప్రథిఎదో నేత్ర పర్వముగా జరుగుతుంది.


దిగంబర జైన సిద్ధాంత వేదికగా భాసిల్లిన ధర్మస్థలలో ఎన్నోశాతాబ్దములనాటి శ్రీ చంద్రనాథస్వామి బాసాది గారి పేరున నిలచిన జైన మందిరము తప్పక చూడతగినది. శిలాఫలకముపై స్వామివారి బోధనలు గానవచ్చును. ఇవి సంఘటితముగా అందరూ ఆచరింపతగినవి.

ధర్మస్థల ధర్మస్థానము వారు ఉచితముగా బస ఒకరోజుకు ఏర్పాటుచేస్తారు. భోజనము ఉచితముగా లభిస్తుంది. ధర్మస్థలకు ఒకరోజుకు సుమారుగా 10,000 భక్తులు వస్తుంటారు. అలయదర్శనానికి వచ్చే ప్రతివెయ్యిమందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు. భోజనశాల పేరు 'అన్నపూర్ణ'. ఆధునిక పరికరాలతో కూడిన ఈవంటశాలలో రుచుకరమైన భోజనం పరిశుద్ధంగా తయారు చేయబడుతుంది. అన్నదానం చేసేసమయంలలో ఆలయనిర్వాహకులు పేదధనిక భేదాలు చూడరు. భక్తులు Cue లోనిలిచే శ్రమకోర్చి మరీ భోజనము చేస్తారు.
ధర్మస్థల లోనూ మరియు అనేక పరిసర ప్రాంతములలోనూ విద్యానిలయములనేర్పరచి, పేదలకు ఉచిత విద్యాసౌఖర్యములనోసంగుతూ, యోగ, సంస్కృతము, మన సంస్కృతి తోబాటు ఆధునిక విద్యనూ కూడా అందజేస్తున్నారు. ఈ ప్రణాళికకు మూలపురుషుడు స్వర్గస్త మంజయ్య హెగ్గడే గారు.
ఆయుర్దానము అన్న పేరుతో ఆలోపతి, ఆయుర్వేదనా, ప్రకృతివైద్యము తోడుగా యోగ, సూర్యనమస్కారములు అన్నింటినీ ఉడిపి, హాసన్ మొదలగు వివిధ ప్రాంతములలో ఏర్పాటుచేసినారు.  అభాయదానమను పేరుతో సామూహిక వివాహములను కుల విచక్షణ లేకుండా దంపతులకు మంగళసూత్రము, బట్టలు ఇచ్చుట ఇక్కడి ఆనవాయితీ.
ధర్మస్థల నిస్వార్ధసేవకు నికరమైన చిహ్నంగా నిలిచియున్నది.
మెల్లగా కారు కుకే సుబ్రమణ్యకు బయలుదేరినది. కారులోపలినుండి ఎదురుగా ఏ వాహనము వస్తూవున్నది అన్నది కనిపించుటలేదు. భూపాతములు దారిలో అక్కడక్కడ కనిపిస్తూ వచ్చినవి. తన సామర్థ్యముతో, భగవంతుని అనుగ్రహముతో బండిని తోలి కుకే వైపునకు బండి త్రిప్పినాడు. కారు ఒక గజమయినా కదలినదో లేదో మాకు ఒక కారు ఎదురయినది. ఆ కారు సారధి నిలిపి మా డ్రైవర్ తో మీరు కుకే పోతూవుంటే వెనుదిరగండి. ఈరోజంతా నిలచినా కూడా మీరు పోలేరు. అందుకే మేము తిరిగివస్తున్నాము అన్నాడు. మావాడు వెంటనే ముగ్గురూ నలుగురు తన సహచర సారధులకు ఫోనే చేసి ఆ మాట నిజమని తెలుసుకొని వెనుదిరిగినాడు. మరి స్వామీ సంద్రశనము మాకు రాసిపెట్టబడి ఉందోలేదో తెలియదు. మాకుమాత్రము ఆ సమయములో దేవుడే మేము కష్టపడకుండా ఉండేందుకే ఆ కారువానితో చెప్పించినాదనిపించింది. కొంత దూరము కష్టము తో ప్రయాణము చేసిన మీదట వాహనములు మాకేడురుగా ఒక వెయ్యికి తక్కువలేకుండా నిలిచియున్నాయి. కారణము తెలుసుకొంటే Land Sliding, Earth Moving, Trees Falling, Two Three Vehicle Accidents on the opposite side అని ఒకతను ఆంగ్లములో చెప్పినాడు. ఆ స్థితిని దాటుటకు తప్పక 7,8 గంటలు పట్టేదే! కానీ మా సారధి వివిధ విధములగు ఉపాయములతో ఒక 3 గంటలలోనే గండము గట్టేక్కించినాడు. రాత్రి 11 గంటలు బంగాలురు చేరుకొన్నాము. మా పెద్దమ్మాయి భర్త తన పర్చయాల ద్వారా ఒక మంచి Lodge 8౦౦ రూపాయలకే ముగ్గురికీ ఏర్పాటు చేయించినాడు. శయ్య ముగ్గురికీ చక్కగా అమరుతతో హాయిగా నిద్రపోయి కార్యక్రములు ముగించుకొని హైదరాబాదుకు తిరోన్ముఖులమై క్షేమముగా వచ్చిచేరినాము.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయా
సర్వే బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
అంతా సుఖించాలి అంతా వ్యాధిరహితులు కావాలి అందరూ శుభాలను చూడాలి
 ఏ ఒక్కడూ దుఃఖంచే బాధించబడరాదుఈ మహదాశయముతో ఈ రచన ముగిస్తున్నాను.
సర్వేపి స్సుఖిన స్సంతు సర్వే  సంతు  నిరామయాl 
సర్వేే బధ్నాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ll
అపౌత్రః పుత్రిణస్సంతు పుత్రిణఃసంతు పౌత్రిణఃl
అధనాః సాధనా స్సంతు జీవంతు శరదశ్శతంll
స్వస్తి
https://cherukuramamohanrao.blogspot.com/2018/09/blog-post.html






Sunday, 26 August 2018

సర్వదృగ్వ్యాసః


సర్వదృగ్వ్యాసః
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణము సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకము. స్తోత్రము యొక్క ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకము "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడటయే కాకుండా తరతమ భేదములు లేకుండా చాతుర్వర్ణములవారూ ఆచరింపబడతగినది అని చెప్పబడినది.  క్రీ.పూ. 6వ శతాబ్దమునకు చెందిన అద్వైత స్థాపకులగు జగద్గురువులాది శంకరులు తాము వ్రాసిన అనేకానేక భాష్యములలో మొదటిగా  వ్రాసినది విష్ణుసహస్రనామమునకే!
భారతము ఇతి-హాఁ-సమ్ అంటే జరిగినది, చరిత్ర అని అర్థము. దీనిని జరిగినది జరిగినట్లుగా వివరించినది వేదవ్యాసులవారు. వేదాలను క్రమబద్ధము చేసి లోకమునకు అందించినందుకు ఆయనకు యావత్తు ప్రపంచమే ఋణపడివుంది. అందుకే ఆయనను;
ఆచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః భగవాన్ బాదరాయణః
త్రిమూర్తిస్వరూపమని చెప్పినారు. భారతమున ‘విష్ణుసహస్రనామము’ వంటి కొన్ని విషయములు యధాతధముగా భారతములోని ఆయా  వ్యక్తులు చెప్పినవి తీసుకొనుట జరిగినది అన్న వాస్తవమును నడిచే దేవునిగా పరిగణింపబడుచున్న శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాములవారు ఒకానోకసారి తమ అనుగ్రహ భాషణములో చెప్పిన ఈ విషయము వల్ల తేటతెల్లమగుచున్నది. నకులుడు ఒక అత్యంత శుద్ధ స్పటికమును తన మెడలో ధరించేవాడట. స్పటికము దానియొక్క శుద్ధతనుబట్టి మాటలను గ్రహించి కోరినపుడు తెలియబరచే గుణము ఉంటుందట. భీష్ముని ఉపదేశ సమయమున అచటనే వున్న నకులునివల్ల ఈ మహత్తర నామావళి  మానవాళికి అందినది అని వారు తెలియజేసినారు.
ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసించుతారు.
క్రీ.పూ. 6వ శతాబ్దములో ఆది శంకరాచార్యులు రచించిన విష్ణుసహస్రనామ భాష్యము అన్నింటికన్నా  ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, ప్రాధాన్యతనిచ్చి వ్యాఖ్యానించినారు.
ఈ సహస్రానామావళిలో కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు) ; శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు) ; కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు) ; పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడినాయి. మొత్తము 90 నామములు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని వారు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలను వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించినారు. తరువాత ఈ విష్ణుసహస్రనామమునకు భాష్యములు వ్రాసిన వారంతా ఇదే పంథాను అనుసరించినారు.
శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని తమ భజగోవింద శ్లోకములలో చెప్పి, ఈ రెండు పవిత్ర వచనములకు ఎంతో ప్రాముఖ్యతను సంతరింపజేసినారు.
వెయ్యి నామములు గలిగిన ఈ స్తోత్రములో దివిస్పృక్ సర్వదృగ్వ్యాసఃఅన్నది 572వ నామము. ఇది 61వ శ్లోకములో వస్తుంది. 61వ శ్లోకము ఈ విధముగా వుంటుంది.
61. సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|  
     దివస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||
ఈ శ్లోకములో కనిపించే సర్వదృగ్వ్యాసః అన్న పదాన్ని తీసుకొని శంకరులవారు ఏమేమి అర్థములను తెలియజేసినారో తెలుసుకొందాము.
సర్వ దృశాం, సర్వ జ్ఞానానాం విస్తారకత్వాత్ వ్యాసః,  అథవా సర్వాత్ సర్వాచ సాదృక్
చేతి సర్వ ద్రుక్. సర్వాకారం జ్ఞాతం. సర్వస్య ద్రుష్టిత్వాద్వా సర్వదృక్. ఋగ్వేదాది విభాగేన చతుర్థా వేదం వ్యస్తాః కృతః.
ఇంతచేసిన ఆ మహానుభావుడు చేయ పూనుకొన్నప్పుడు ఏడు కోట్ల మంత్రములు లభ్యమయినాయట. ‘అనంతోవై వేదాః’ అన్నది మనకు తెలిసిన విషయము. ఈ అనంతమగు వేదము మనకు అందించని విషయము లేదు. కానీ ఈ అనంత వేదసంపద లో  అధికాధికము   మృగ్యమైనట్లు  మనకు తెలియుచున్నది. అనంతము నుండి ఆయన కాలమునకే 7 కోట్ల మంత్రములు దొరకినాయంటే ఈనాటి పరిస్థితి మనము ఊహించుకోవచ్చు. యుగము మారేకొద్దీ మానవుని గ్రహణ శక్తి తగ్గిపోతూ వచ్చింది. ఎవరయినా తాము నేర్చుకోన్నంత, తమకు తెలిసినంత మాత్రమే కదా చెప్పగలుగుతారు.
భారత యుద్ధము 52౦౦ సంవతసరముల కాలమున జరిగినదని పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించినారు. దానికి ఒక మూడువందల సంవత్సరములకు పూర్వము వేదవిభజన జరిగి ఉండవచ్చు అని ఊహించుకొంటే అప్పటికి మిగిలిన మంత్రములు 7 కోట్లు. మిగతా మంత్రరాశి అంతా పరిపరి విధముల కొన్ని లక్షల సంవత్సరముల కాలములో కనుమరుగై ఉండవచ్చును. ఇక మిగిలినవయినా లోకానికి అందించవలెనన్న తలంపుతో వేదవాక్య లక్షణములను ఆధారముగా చేసుకొని విభజన తలపెట్టినారు వ్యాసులవారు. ఈ వేదమంత్రములలో కొన్నింటిని   ఋక్కులు అంటారు. కొన్నింటిని యజుస్సులు అంటారు. మరికొన్నింటిని సామములు అంటారు.
ఋక్‌ పాదబద్ధా, గీతంతు సామ, గద్యం యజుర్మంత్రః అన్నది శాస్త్రము. ఋగ్వేదము చందోబద్ధమగు శ్లోకరూపములో వుంటుంది. యజుర్వేద మంత్రములకు కూడా ఛందస్సు వున్నా అవి గద్య రూపములో వుంటాయి. ఇక సామవేదము సంగీత భరితము. అధర్వణ వేదము ఋగ్యజుస్సామముల లోని కొన్ని ముఖ్యమగు మంత్రములు కలిగియుంటుంది. అందుకే మనకు పురాణములలో 3 వేదముల ప్రసక్తి విరివిగా వస్తూ వుంటుంది. కొన్ని మంత్రములు అన్ని వేదములలో కూడా వస్తాయి. ఇన్ని విషయముల నెరిగి ఆయన వేదం విభజనకు ఉపక్రమించినారు. 'సర్వదృశానాం సర్వజ్ఞానానాం'  అంటే అర్థమిది.  అందుకే వ్యాసాయ విష్ణురూపాయ అన్నారు. ఆయన విష్ణువే కాబట్టి ఆపని చేయగలిగినాడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు సర్వదృగ్వ్యాసః అయినాడు. 
ఇక సర్వాచ సాదృక్ అన్న విషయమును విశ్లేషించుదాము. దృక్ అన్న మాటకు చూపు అని అర్థము. శ్రీమదాంధ్ర మహా భాగవతమున ప్రహ్లాద చరిత్రలో 'కంజాక్షునకు గాని కాయంబు కాయమే' అన్న పద్యములో 'కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక' అన్న పాదము వస్తుంది. పరమాత్ముని చూచేది చూపు కానీ కామ వాంఛతో చూసే చూపు కలిగిన కన్నులు గులకరాళ్ళ ను కలిగిన గూళ్ళుగాక మరేమిటి? అందులోనే ఇంకొకమాట 'కమలాక్షు నర్చించు కరములు కరములు' అన్న పద్యములో 'సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు.' ఇటువంటి ఒకమాట మనకు ‘మనుధర్మ శాత్రములోకూడా వినిపిస్తుంది ‘ వేదఃచక్షుస్సనాతనం’ కళ్ళు అంటే చూపు అంటే  అది వేదము అని. కావున పరమాత్మను వేదము అన్న కళ్ళద్వారా చూడవలెనని అర్థము. అట్లని అందరూ వేదము నేర్చుకొనవలెనని కాదు. అది అంత సులభమూ కాదు. ఒక వేదపండితుడు, ఒక వేదాధ్యయన పరుడు, సామాన్యులమైన మనకు దీపము వంటి వాడు. ఆ వెలుగులో మనము మనకు వలసినది వెదుకుకొన వచ్చును. రఘువంశములోని 4వ అధ్యాయములో కాళీదాసు కూడా ‘చక్షుస్మత్తా’ అని వాడుతాడు. వేదాధ్యనము చేసినది చూపు కానీ అన్యధాకాదు అని. అందుకే వేదము చదువని, తమ నిర్ణీతమైన పనులచే  చదువనవకాశములేని వారంతా ఎంతో ఉత్సాహముగా పురాణ కాలక్షేపమునకు హరికతలకూ సాయంసంధ్యలలో  పోయేవారు. పరమాత్మ వ్యాసుని రూపమున వేదములందలి సమస్త జ్ఞానమునూ చూడగాలిగినాడు. అందుచేత కూడా ఆయన జ్ఞానదృక్ వ్యాసః అయినాడు.
మరియొక విశ్లేషణ చూద్దాము. వ్యాసులవారి కాలమునకు సప్తకోటి మంత్రములు మాత్రమే మిగిలియుండినవని మనము ముందుగానే చెప్పుకొన్నాము. ఆ మంత్రములను నాలుగు వేదములుగా ఆయన విభజించినారు. ఇది ఉజ్జాయింపుగా ఒక 24౦౦,25౦౦ B.C. నాడు జరిగి ఉండవచ్చు. ఒకవేళ 24౦౦ B.C. తీసుకొన్నా అంతవరకూ 7కోట్ల మంత్రములు ఉనట్లే! మహర్షియగు ఆ మహనీయుడు రాబోయే కలికాలపు మనుజుల మేధస్సును అంచనావేసి ఈ మంత్రములను విభజించియుంటాడు. వారు తమ శిష్యులగు పైలునకు ఋగ్వేదమును, వైశంపాయనునికి యజుర్వేదమును, జైమినికి సామవేదమును, సుమంతునకు అధర్వణ వేదమును పంచియిచ్చి వానిని లోకమున గురు శిష్య పరంపరగా విస్తృతపరచమన్నారు. ఈ విషయమును భాగవతములోని ద్వాదశ స్కంధములో మనము గ్రహించ వచ్చును. కలియుగము ప్రారంభమయిన ఇంచుమించుగా ఒక,  5౦ సంవత్సరములకే ప్రజల జ్ఞాపకశక్తి క్షీణించిపోయినదట. ఆవిధముగా తరిగిపోయిన ఆ వేదశాఖలలోని రుగ్వేదమును 21 శాఖలుగానూ, యజుర్వేదమును 1౦1  (85+16) శాఖలుగానూ, సామవేదమును 1౦౦౦ శాఖలుగానూ  అధర్వణ వేదమును 9 శాఖలుగానూ విభాజించినారట.అంటే మోత్హము 7 కోట్లకు గానూ మిగిలిన మంత్రములు 11౩1. ఈ విధమగు విభజనను గూర్చి మనకు చెప్పిన మహనీయులు జగద్గురు ఆదిశంకరులవారు. దీనికి ముందు ఈ విషయమును పతంజలి మహర్షి తన సంస్కృత వ్యాకరణ మహాభాష్యములో చెప్పినట్లు కానవచ్చుచున్నది. కానీ పతంజలి మహర్షి కాల నిర్ధారణము  ఇంతవరకూ జరుగలేదు. అత్యంత బాధా కరమగు విషయమేమిటంటే స్వాతంత్ర్యమునకు మునుపు విదేశీ పాలనలో ఈ 1131శాఖలు ఇంకా సన్నగిల్లి, ఇప్పుడు కేవలము 7 అధ్యయనము జరుగుతూ వున్నదని, 6 (స్వరరహిత గ్రంథస్థశాఖలు) వారి అవిరళ కృషివల్ల లభ్యమయినాయని, ఈ విషయమై ఎక్కడలేని శ్రమకోర్చి కూర్చిన   మాన్యులు రేమేళ్ల అవధానులవారు బాధాతప్త హృదయముతో వారిని నేను కలిసినపుడు వారు చెప్పినమాట.  మరి మిగతవి ఏ విధముగా మాయమైనాయి అంటే ఎన్నో గురుశిష్య పరంపరలను నిర్దాక్షిణ్యముగా చంపివేయుట చేత? 1131 కి 7  అనుకొంటే 1% కూడాకాదు లేక 13 అనుకొన్నా అతి కష్టము మీద 1%.  ఆ మిగిలిన  వానిలో  2 పరిష్కరింపబడలేదు ఆ కార్యము కొరకై నియుక్తులయిన మహా వేదపండితుల చేత. వీటిని పరిరక్షించుకొనుటకు ఇంచుమించు 25 సంవత్సరముల క్రితము వేద భారతి సంస్థను నెలకొల్పి, 1992-97 మధ్యకాలమున రాష్ట్రపతిగా పనిజేసిన దయాళువగు శంకర్ దయాళ్ శర్మ గారు వేదములపై ఉన్న గౌరవముచే, శ్రీయుతులు అవధానుల వారి నిర్విరామ కృషిని గుర్తించి, నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ బైరాన్ సింగ్ షెకావత్  గారి సహాయ సహకారములతో ముద్రింపజేయించినారు. ఇతర ఏ రాష్ట్రమునుండి వారికి స్పందన లభించలేదు. అది గ్రంధ రూపములో 2010 కి వెలుగు చూడగలిగింది. ఆ గ్రంధరాజము 2 అడుగుల పొడవు 11/2 అడుగు వెడల్పు 6 అంగుళముల మందము, 4౦౦౦ పుటలు, 20 KG ల బరువు వుంది.
తిరిగీ విషయములోనికి వస్తే వ్యాసులవారు ఈ అనంత వేదరాశిలోని మిగిలిన మంత్రములను 4 వేదములుగా విభజించిన తరువాత ఋగ్వేదము  21 భాగములుగా విభజింపబడినది. యజుర్వేదము 101 శాఖలుగా విభజింపబడినది. సామవేదము 1౦౦౦ శాఖలుగా విభజింపబడినది , అధర్వణవేదము 9 శాఖలుగా విభజింపబడినది. ఇవికాక పురాణ ఉప పురాణ ఇతిహాసములను రచించినాడు. అందుకే ఆయన పరబ్రహ్మ కాక వేరెవరని ముందే చెప్పుకొన్నాము. యజుర్వేదములోని తైత్తిరీయశాఖలోని 82 పన్నములలో  ఒక పన్నము అరుణము. ఈ విశ్వమును గూర్చి అందులో, నేటి Scientists ఇప్పటికి కనుగొన్నవి , ఇంకా కనుగోనవలసినవీ, ఎన్నియో విషయములు వున్నవి. అణువు మొదలు అజుని(పరబ్రహ్మ) వరకు అన్నీ వున్నవి. అంతటి మహానీయుడు వేదవ్యాసుడు. అట్టి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అవతారము కావుననే, విష్ణుసహస్ర నామావళిలో ‘విశ్వదృగ్వ్యాసః’ అన్న నామము చేరినది.
శ్రీ వేదవ్యాస స్తుతి
కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం
వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం
అచతుర్వదనో బ్రహ్మో ద్విబాహురపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః
వేదాంత వాక్య కుసుమాని సమాని చారు
జగ్రంథ సూత్రనిచయేన మనోహరేణ
మోక్షార్థిలోకహితకామనయా మునిర్యః
తం బాదరాయణమహం ప్రణమామి భక్త్యా
స్వస్తి.

Thursday, 2 August 2018

పాహి భారతీ తీర్థ - తవ చరణం – మమ శరణం


                                           పాహి భారతీ తీర్థ - తవ చరణం – మమ  శరణం                    

                                                                                                       వేదవదన శ్రిత భక్త కరుణ మమ

                                                                                      దురిత దమన అను నిత్యం
                                                                          దురిత దమన అను నిత్యం
                                                                             భవ తాపహర గురుదేవ
                                                                             మమ పాపహర గురుదేవ
                                              1. జ్ఞాన కుసుమ వని శాస్త్ర దివ్య ఖని
                                 ఆర్ద్ర హృదయ సదన
                                 ఆర్ద్ర హృదయ సదన
                                       భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                                                                2. రాగ నేత్ర యతి పాణి వేత్ర ఘన
                                                                        సాంప్రదాయ  సూత్ర
                                                                      సాంప్రదాయ సూత్ర
                                                                            భవ తాపహర గురుదేవ
     
                                                                                                                      మమ పాపహరా గురుదేవ 

                                       3. చారుగుణగణ చపల హారణ
                              శారదేందు కిరణ
                              శారదేందు కిరణ
                                      భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                                                           4. భస్మ ధారణ పాప దారణ
                                                                           భక్త వంద్య చరణ శరణం
                                                                 భక్తవంద్య చరణ
                                                                         భవ తాపహర గురుదేవ
                                                                          మమ పాపహర గురుదేవ
                                       5. చంద్ర శీర్షధర చారు శారద
                                      నిత్యపూజ నిరత స్వామి
                                పాహి భారతీ తీర్థ
                                      భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                   గురుదేవ పాదాంఘ్రి రేణువు - చెరుకు రామ మోహన్ రావు