Wednesday, 22 January 2020

మన మహర్షులు చెప్పిన సంస్కృతి వాక్యములు


మన మహర్షులు చెప్పిన సంస్కృతి వాక్యములు
మనది సనాతన ధర్మము. ఆది అన్నది తెలియని అనాది ధర్మము. దార్శనికులు ఆకాశము (Eather)   నుండి తాము గ్రహించినవి మరియు అట్టి విషయములను గుర్తు ఉంచుకొని దానికి తమ విజ్ఞానమును జోడించి చెప్పినవి. మనకు ఏ 2000 సంవత్సరముల క్రితమో, 1500 సంవత్సరముల క్రితమో నిర్దేశింపబడిన మత గ్రంధములలో చేర్చిన మాటలు మనకు శిరౌధార్యములు కావు.  J.K. Sheindlin’s "The People vs Muhammad"? అన్న  ఆంగ్ల పుస్తకము చదివితే ఆ ప్రవక్త మతవిధానము అర్థమవుతుంది. అదేవిధముగా 'Inconsistencies and Contradictions in the Bible' compiled by Donald Morgan చదివితే  ఆ మతగ్రంధము లోని విషయములు మనకు అవగతమౌతాయి.  ఏదిఏమయినా మన పూర్వులు లక్షల సంసంవత్సరముల పూర్వము చెప్పిన మాటలు నేటికీ శిరౌధార్యములు. అందుకే వారు చెప్పిన ఈ నీతివాక్యములను క్రోడీకరించి మనకు  నీతి శాస్త్రము పేరుతో అందించినారు. నిజానికి మనము Quotations అన్న పేరుతో ఎవరెవరో పాశ్చాత్యులు చెప్పిన మాటలు తాటికాయలంత అక్షరాలతో ఒక వాక్యముగానో రెండు మూడు వాక్యములుగానో ప్రచురించుతూ వుంటారు. నిజానికి అటువంటి సాహిత్యము మన నీతిశాస్త్రములలో కోకొల్లలు. అదికూడా ఎక్కువగా రెండు  రెండు పాదములు కలిగిన శ్లోకరూపములోనే! అసలు శాస్త్రము అంటేనే శాసించేది అని అర్థము. అది తెలుసుకొని మనము పాటించితే చాలు. ఆ అనర్ఘ రత్నములను కమ్మలలో కడియాలలో పొదుగ నక్కర లేదు. యథాతథముగా గ్రహించితే చాలు. అవి ఎంత చీకటిలోనైనా ప్రకాశించు శక్తి కల్గినవి. అటువంటి కొన్ని  సార్థకముగా మీ ముందు ఉంచుచున్నాను.ఇప్పుడు  అటువంటి అనేకానేక శ్లోకముల నుండి ఒకటి మీ ముందుంచుచున్నాను. మన పూర్వుల గొప్పదనము తెలుసుకొనుటకైనా చదవండి. అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా మీముందు ఉంచుతాను.
ఇంటికి ఏతెంచిన వారిని ఆంగ్లములో Guests అని మాత్రమె అంటాము. అదే మన సంస్కృతి లో మన సంస్కృతములో వారిని రెండు విధములుగా వర్గీకరించినాము. 1. అతిథి 2. అభ్యాగతి
అతిథి అంటే ఆ వ్యక్తి యొక్క రాకను గూర్చి మనకు తెలియకుండానే వచ్చేవాడు. అభ్యాగతి అంటే తన రాకను తెలిపి వచ్చేవాడు. ఈ క్రింది శ్లోకము ఇరువురికీ వర్తించుతుంది.
వాచం దద్యాత్ మనో దద్యాత్ చక్షుర్ దద్యాత్
ఉత్థాయచ ఆసనం దద్యాత్ ఏషాధర్మ సనాతనః
ఇంటి లోనికి అడుగు పెట్టబోయే అతిథి అభ్యాగతికి ఆసనమునుంచి లేచి నిలబడి రండి రండి అని ఎంతో ఆదరపూర్వకముగానూ, మనఃపూర్వకముగానూ, ఆహ్వానించుచూ, ఆప్యాయతతో కూడిన దృష్టి ఆ వ్యక్తిపైనుంచి, ఆహ్వానించవలసియుంటుంది. ఇది మన సనాతన ధర్మవాక్యము.
  మరి ఈ పద్ధతిని  త్రికరణ శుద్ధితో పాటిస్తున్నామా! నాటికి నేటికి కల తేడా నేను వ్రాసిన ఈ క్రింది పద్యముల ద్వారా ఒకసారి గమనించండి.
నేటి దుస్థితి
అతిధి ఇల్లు త్రొక్కి అరుదెంచినంతనే
కూరుచుండగజేసి కుశలమడిగి
దాహమిచ్చి యతని తగిన మర్యాదతో
గౌరవించె గృహస్తు గాంచ నాడు   
నేటి మర్యాద ఒకపరి తిలకించండి.
గెస్టులు వచ్చిన గెట్టిన్ను ప్లీజంచు
గ్లాట్టుమీట్ యూ చెప్పి కదలనీక
కాఫి చేతికియిచ్చి గాసిప్పు మాట్లాడి
పంపుచుందురు నేడు ‘బాయి’ జెప్పి
అతిథి సేవల గాంచగా అగ్ని చేరె
కాలమైపోయె  మంచిదౌ కాలమంత
చట్టుబండగ అయిపోవ సాంప్రదాయ 
మేమి మిగిలెను మనకింక ఎంచిజూడ
స్వస్తి. కసారి ఇంకొక శ్లోకము.
విలువైన మాట -2
కో లాభః? గుణి సంగమః, కిం సుఖం? ప్రాజ్ఞతరై సంగతి:
కా హాని? సమయచ్యుతి, నిపుణతా కా?ధర్మ తత్వే రతి:
కిం శూరః?విజితేంద్రియ:;ప్రియతమా కా?సువ్రతా. కిం ధనం?
విద్యా,
 కిం సుఖం?మప్రవాస గమనం రాజ్యం కిం?మాజ్ఞా ఫలం. 
అర్థము:-- మనకు లాభం కలిగించేది సద్గుణాలు కలిగిన సజ్జనుల సాంగత్యము. ఇబ్బంది కలిగించే విషయం ప్రాజ్ఞులు కాని పామరుల సాంగత్యం, విలువైన సమయాన్ని వృథాగా గడపటం అనేది మనకు హాని కలిగిస్తుంది.(సమయము చాలా విలువైనది దాన్ని వృథాగా గడప కూడదు). నైపుణ్యం సిద్ధించాలంటే  
ధర్మాన్ని
 గురించి తెలుసుకోవాలనే ఆసక్తి . జితేంద్రియత కలిగియుండవలెను. వాడే శూరుడనబడతాడు. అనుకూలవతి యైన భార్యయే ప్రియతమురాలు. విద్యయే నిజమైన ధనం. సుఖమంటే ఏమిటి?

విదేశాలకు పోకుండా స్వదేశం లోనే వుండి వున్న దానితో తృప్తి పడి జీవించటం. నీ ఆదేశం మేరవరకు చెల్లుబాటవుతుందో అంతవరకే నీ రాజ్యం.
Meaning in English:- Meaning in English:- Friendship with the virtuous is beneficial for character building. It is always the best to keep away from selfish and greedy. Spending time in gossips is suicidal. Time will never wait for us. To become an expert in following the righteous path learn about the dos and don'ts from the right guru (Here Guru need not be a teacher, anybody who can lead you in the right direction.). Here, control over the sensory organs is to be perfected. That will make you remain undeterred by the circumstances. The thickest friend is wife, they should always endure to be the admixture of milk and water.  Knowledge and Education form the real wealth. Happiness is that which comes only by contentment and not by going abroad for earning wealth. Your kingdom is only up to that extent till which, your word is final.

స్వస్తి.

విలువైన మాట-3
సత్యానుసారిణీ లక్ష్మీః కీర్తిస్త్యాగానుసారిణీ
 అభ్యాససారిణీ విద్యా బుద్ధిః కర్మానుసారిణీ
 - సుభాషితరత్నభాణ్డాగారము
 సన్మార్గపు సంపాదన తోనే సతతము లక్ష్మి మనల నంటిపెట్టుకొని  యుంటుంది.కీర్తి ఎల్లపుడూ త్యాగము తోడుతే వుంటుంది. విద్య అభ్యాసమును అనుసరించి ఉంటుంది..బుద్ధి ఎల్లవేళలా కర్మను అనుసరిస్తుంది.
 పైన చెప్పినదంతా నిజమేకదా. వక్ర మార్గముల ద్వారా సంపాదించే సంపాదన క్షణ భంగురము. సంపాదకునికి లేక అతని సంసారమునకు ఏవిధమైన ఆపదైనా సంభవించి అతని ద్రవ్యము హరించి పోవచ్చును. సత్య పథమే సంపాదనకు మార్గము. కీర్తి త్యాగాన్ని అనుసరిస్తుంది.దదీచి,శిబి,బలి కర్ణాది మహనీయులు తమ త్యాగనిరతి చేతనే చిరంజీవులైనారు. అభ్యాసము కూసు విద్య అన్న పెద్దల మాట ఉందనే వుంది. అభ్యాసము నేర్చుకోవటముతో సరిపోదు. దానిని యోగ్యులకు పంచవలె. అప్పుడే ఆ విద్యకు సార్థకత. ఇక బుద్ధి ఎప్పుడూ మన పురాకృత సంచిత కర్మల పైనే ఆధారపడి యుంటుంది.

తమసోమా జ్యోతిర్గమయ.
స్వస్తి.
ఒకసారి దుర్యోధనుని సభలో ఉన్న జ్ఞానులందరూ దుర్యోధనుని తో  'నీవు చేస్తున్నది తప్పు, ఈపనివల్ల నీవు చెడిపోతావు, మా మాట విను' అని చెప్పినారు . అంటే ఆయనన్నాడు:
జానామి ధర్మం నచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః
కేనాతి దేవేన  హృదిః స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి
 'నాకు ఇది మంచి అని తెలిసినా నా చిత్తవృత్తి దానిని పాటించనివ్వదు. నాకు ఇది చెడ్డని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను. నాలో ఉండే పరమాత్మ నా బుద్ధిని ఏవిధముగా ప్రచోదనము చేస్తే ఆ విధముగా నడచుకొంటాను.' అని అంటాడు. ఇందులో మనము చూడవలసిన అంశములు రెండు ఉన్నాయి. ఒకటి మహాభారతములోని దుష్ట పాత్రధారిగా దుర్యోధనుని మనము తలచుటాము. నిజానికి ఆయన, ఒక్క పాండవుల విషయములో తప్ప, తన ఏలుబడిలోనున్న సమస్త భూమండలమునూ స్వర్గ తుల్యముగా పరిపాలించినాడు. ఆయనకు అటు హిమాలయములో ఇటు కేరళలో ఆలయాలు కూడా ఉన్నాయి.
పైన చెప్పిన రెండు అంశములలో ఒకటి అరమరిక లేకుండా తనమనసును తేటతెల్లము చేయుట. కానీ ఇందులో తను చేసే తప్పుడు పనిని ఆత్మ నిర్దేశముగా చిత్రీకరించినాడు. ఎంతయినా అభిమాన ధనుడు కదా సుయోధనుడు. కానీ నిజానికి ఆత్మ ద్వంద్వాతీతము. బుద్ధి మాత్రమే చపలము. అది ప్ర్రారబ్ధసంచితకర్మల ఫలముననుసరించి ప్రవర్తించుచుంటుంది. ఏది ఏమయినా తన తప్పును ఒప్పుకొనే స్వభావము ద్వాపరము, కల్యుగా ప్రారంభమున కొంత కాలము ఉన్నట్లు ఆధారపూర్వకముగా తెలియవస్తూ వుంది. ధృతరాష్ట్రుడు కూడా తానూ పాండవుల పట్ల పక్షపాత దృష్టినే అవలబించినట్లు విదురునితో చెబుతూ అది తన బలహీనతని, దానిని అధిగమించలేక పోతున్నానని తన తప్పు ఒప్పుకొంటాడు. ఇది మనము మనకైన వారితో వ్యవ్యవహరించవలసిన విధానము. నేడు భర్తకు తెలియని రహస్యాలు భార్యవడ్డ ఎన్నో, అదే విధముగా భార్యకు తెలియని రహస్యాలు భర్త వద్ద ఎన్నో!
రెండవ విషయము ఏమిటంటే తనది తప్పుడు నిర్ణయమైనా దానికే తాను కట్టుబడినాడు. తన ప్రాణ హితులు, కర్తవ్య పరులు, ధర్మ మార్గానుచారులు చివరివరకూ తనను వీడలేదు. ప్రాణమును తృణముగా ఎంచి అతనికి బాసటగా నిలచినారు. ఇదికాక తనకు అండగా నిలచినది పదకొండు అక్షోహిణీల సైన్యము. ఇది మొత్తము తనను సమర్థించిన రాజులది. భగవంతుడగు కృష్ణుడు పాండవ పక్షాన ఉండి, ధర్మరాజు ధర్మమూర్తియై యుండికూడా వారి బలగము ఏడు అక్షౌహిణీలే!
ఇక్కడ నేను చెప్పవచ్చినది ఏమిటంటే మనము కనీసము కొందరినైన మన అత్యంత ఆప్తులుగా గుర్తించి వారితో మనము మనసు విప్పి మాట్లాడుకొంటూ వుంటే మనసు ఎంతో తేలిక పడుటయే కాకుండా అది ఆరోగ్యమునకు అధికముగా దోహదము చేస్తుంది. మనము(మనస్సు) బాగుంటే మనము(WE) బాగుంటాము.

చెడుగును వీడి  ధర్మమును ఆశ్రయించితే మనము పాండవులమే!
స్వస్తి.
కేచిదజ్ఞానతోనష్టాః కేచి నష్టాః ప్రమాదతఃl
కేచిత్‌. జ్ఞానావలేపేన కేచిన్నష్టాఃవినాశితాః
'కేచిదజ్ఞానతోనష్టాః' తెలియక చెడువారు కొందరు, 'కేచి నష్టాః ప్రమాదతః' తెలిసియుండియు ప్రమాదవశమున చెడువారు మరికొందరు 'కేచిత్‌. జ్ఞానావలేపేన' కొందరు, తెలిసి తెలియని. అల్పమైన జ్ఞానముచే చెడుచుందురు. కేచిన్నష్టాఃవినాశితాః' వేరొకకొందరు, చెడినవారిచే, చెఱుపబడుచుందురు. యీ రీతిని అజ్ఞానముచే, ప్రమాదముచే అల్పజ్ఞానముచే, చెడినవారినిచూచుటచే, అనగా చెడిపోవుటయే విధిగ యేర్పడుచున్న యీ తరుణమున జ్ఞానులైన పెద్దలెల్లరు, మన సనాతన థర్మప్రబోధమెంతేని చేయదగు తరుణ మాసన్నమైయున్నది. ఇట్టి సమయమున మన విధ్యుక్త థర్మమే యెరుంగ నేరనిచో మన సంతతిని ధర్మ భ్రష్టులను జేసినవారమగుదుము. ఇందుకుతోడు పరంపరగా వచ్చు వేద విద్యాభ్యాస మడుగంటుటయు సంస్కృత భాషా పరిచయము సన్నగిల్లుటయు, మహర్షుల దివ్యబోధనలను మహామహిమలను నెఱుగనేరకపోవుటయు తటస్థించుచున్నది. ఇది పండితులు పెద్దలు తలిదండ్రులు కళ్ళు తెరచి గాంచవలసిన సమయము. భావి భారతీయులకు సంస్కారసంపదనందివ్వకపోతే మననేరమెన్నటికీ క్షమార్హముకాదు.

స్వస్తి.
ఋగ్వేదంలోని అరణ్య దేవతను గూర్చిన శ్లోకము
ఆంజన గంధీమ్ సురభీమ్ బహ్వన్నమ్ ఆకృషి ఫలామ్
ప్రా అహమ్ మృగానామ్ మాతరమ్ అరణ్యానీమ్ ఆశంశిషామ్”
భావం: సుగంధము వెదజల్లే కాటుకకు ఉపయోగించే అంజనగంధి, సౌరభము నలుదిశలా  వ్యాపింపజేసేది, పుష్కలముగా పలువిధముల ఆహారమును ప్రసాదించేది, కృషిచేయకనే ఫలమిచ్చే శక్తిగలిగినది, మృగాలకు తల్లి అయిన అరణ్యమాతకు  మ్రొక్కుచున్నాను.

ఎంత గొప్ప భావనాయో చూడండి. ప్రకృతిలోని ప్రతి వస్తువు మనకు దైవ సమానము, నమస్కార యోగ్యము, కృతజ్ఞతా భాజనము అని నొక్కి వక్కాణించుచున్నది మన ధర్మము.

సుశీలో మాతృ పుణ్యేన పితృ పుణ్యేన బుద్ధిమాన్l

ధార్మికో పూర్వ పుణ్యేన స్వీయ పుణ్యేన భాగ్యవాన్ll

-నీతి శాస్త్రము

సంతానమునకు సౌశీల్యము అన్నది స్వంత తల్లిద్వారా సంక్రమిస్తుంది. బుద్ధి, జ్ఞానము, విచక్షణ తత్సంబంధ తదితరములు తండ్రి ద్వారా సంక్రమించుతాయి. దాన ధర్మ గుణములు పూర్వపుణ్య వశమున లబించుతాయి. భాగ్యము అంటే ముఖ్యముగా సిరి, సంపద, ఐశ్వర్యములు

తన పుణ్యకార్యముల బట్టియే లభించుతాయి.

తల్లి ద్వారా పొందవలసిన సౌశీల్యము అన్న అ ఒక్క గుణమును తల్లిద్వారా పొందితే నిజానికి మిగతా గుణములన్నీ లేగ తల్లి ఆవును అనుసరించినట్లు వెంట వస్తాయి. అందుకే మాతృదేవో భావ అని తల్లికి పెద్దపీట వేసినారు మన ఋషులు.
ఆర్యవాక్కు

‘కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం’
ఇది ఆర్యవాక్కు. ఈ వాకును ఆదర్శముగా తీసుకొని ఒక్కసారి జగద్గురు ఆది శంకరాచార్య విరచిత వివేక చూడామణిలోని ఈ బోధన గ్రహించితే నిజముగానే మనము మనకు, మన సమాజానికి, మన దేశానికి,జగత్ కళ్యాణమునకు దోహదము చేసినవారమౌతాము. చూడామణిలోని ఆ బోధన ఇది.
లేడి శబ్దానికి లొంగి , ఏనుగు స్పర్శసుఖానికి లొంగి, దీపంపురుగు రూపానికి లొంగి, చేప రసానికి లొంగి, తుమ్మెద పుష్పాలలోని మకరంధం యొక్క రుచికి లొంగి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి. ఒక్క ఇంద్రియానికి లొంగే అవి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటే పంచేంద్రియాలకు లొంగే మానవుడి గతి ఏమిటని శంకరాచార్యులవారు వివేకచూడామణిలో ప్రశ్నించిచుతారు. ఇంద్రియద్వారాల వద్దనే విషయాలను అడ్డుకోగలిగే శక్తిని సమకూర్చుకొంటే ఇక మనిషికి అధోగతి కలిగే అవకాశము ఎక్కడిది.
స్వస్తి.
కోపము - తాపము
క్రోధో వైశ్వానరో దేవో ఆశా వైతరిణీ నది
విద్యా కామదుఘాః దేనుః సంతుష్టిః నందనం వనం
తన క్రోధమగ్ని గాంచగ
తన ఆశే వైతరిణిని  తప్పక చేర్చున్
తన విద్య కామధేనువు
తనతృప్తే నందనమ్ము తలవగ రామా!
కోపము అగ్ని వంటిది. అది తననూ కాల్చుకొంటుంది పరులనూ నిర్దాక్షిణ్యముగా కాల్చివేస్తుంది. ఇక ఆశ వైతరిణీ నది వంటిది. ఈ వతరినీ నదిని గూర్చి ఒక్కమాట చెప్పుకొందాము. ఇది వంద యోజనాల వెడల్పు ఉంటుంది. చిక్కని రక్తముచీము కూడా. భయంకర  జలచరాలుఒక్క క్షణం కూడా భరించలేని దుర్వాసన కలిగియుంటుంది.  ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి   తను చేసిన  పాపాలకు ఫలితం అందులో మునిగి అనుభవించవలసిందే. అందుకనే తమ వారి కోసం భువిపై వారిపేరు మీద గోదానం చేస్తారు.  గోదానం చేస్తే వైతరిణి  నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో  శ్రీమహావిష్ణువు స్వయంగా  గరుత్మంతుడికి  తెలియజెప్పినాడు. విద్య పాలిచ్చే పాడియావు వంటిది. తన సంతృప్తే నందనవనము. ఎంతటి నీతి వాక్యములో గమనించండి.
కోపము తాపము గూర్చును
తాపము తనతోడ తెచ్చు తక్కిన చెడుగున్
పాపమునవి సమకూర్చును
కోపము గమనింప నరక కూపము రామా!
కృతఘ్నుడు
బ్రహ్మఘ్నేచ సురాపేచ స్తేనే భగ్న వ్రతే తథాl
నిష్కృతిర్విహితా బుద్ధిః కృతఘ్నే నాస్తి నిష్కృతిఃll
బ్రహ్మహత్య చేయువారికి, త్రాగుబోతులకు, దొంగలకు, వ్రతభంగము చేయువారికి, సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానమును తెలిపిరి, కానీ కృతఘ్నులను ఉద్ధరించుటకు ఎటువంటి నిష్కృతిని తెలుపలేదు. కృతఘ్నతకు మించిన పాపమే లేదు. చేసిన మేలు మరచినవాడు ఒక పూజకు పనికిరాని పూవు. తినుటకు పనికిరాని పండు. దుర్గంధభూయిష్టమైన వాయువు.
ఉత్తములు-అధములు
నమంతి ఫలితా వృక్షాః  నమంతి విబుధాజనాః l
శుష్క కాష్టాని మూర్ఖాచ భిద్యన్తే s నల సర్వదాll

ఫలించిన వృక్షములు తమ మధురమైన ఫలములను వాడుకొమ్మని వంగి నమస్కరించుచుంటాయి . జ్ఞానులు అహంకరించక ఎంతో సాధువర్తనులై  వంగి నమస్కరిస్తారు . మూర్ఖులు ఎండు కట్టెలలాంటివారు. కాల్చుటకు తప్ప వేరెందుకూ పనికిరారు .
పండ్లనిచ్చు చెట్టు పాంథులాకలి దీర్చు
కట్టెలిచ్చు మోడు కాలబెట్ట
విజ్ఞులజ్ఞులిట్లు వివరమ్మునెరుగుమా
రామమోహనుక్తి రమ్యసూక్తి!
ఈ దిగువన కనబరచిన శ్లోకము యొక్క ఒకటిన్నర పాదము నాకు దొరకనందువల్ల ఆ ఒకటిన్నర పాదము నిన్న పూరించినాను. అనుకోకుండా ఈ రోజున అసలు శ్లోకమును శ్రీ దావణగిరే సుబ్రహ్మణ్యము గారు whatsap లో ఎవరో సమీకరించి పంపినది పంచినారు. ఆ పాఠమును ఈ దిగువన తెలియజేయుచున్నాను.
అసమర్తస్య సాధూనాం నిర్ధనస్య జితేన్ద్రియః
వార్ధక్యో దేవతా భక్తిః వృద్ధ నారీ పతీవ్రతాll
పైశ్లోకములో అన్వయము సరిగా కుదిరినట్లు నాకనిపించలేదు. పైగా అది 'వృద్ధా నారీ' అని ఉండవలెను. ఈ కారణములచేత నేను వ్రాసినది  తుడిచివేయక అట్లేవుంచి మీకు అందజేయుచున్నాను.
నాతండ్రి వాడుతూ ఉండిన 'వృద్ధానారీ పతీవ్రతా' అన్న సామెతను తీసుకొని మిగతా 1 1\2 శ్లోకభాగము నేను పూరించుకొన్నాను.
అంధస్య సుందరీ కుబ్జా ఛాత్రైక సహితోగురుఃl
యోగీ భవతిః షండః  వృద్ధానారీ పతివ్రతాll

తన ముందు అనాకారినుంచినా ఆమెను అందకత్తెగానే భావించుతాడు గుడ్డివాడయిన ఒకడు. తనవద్ద ఒకేఒక శిష్యుడున్నా తనను గురువుగానే భావించుతాడు వేరొకడు. తాను విషయవాంఛలు లేని పరమయోగిగా భావించుతాడు నపుంసకుడైన మరియొకడు. అదేవిధముగా వెలయాలి జీవితమును గడిపి ముసలిదయిన తరువాత తనను తాను పతివ్రత అని చెప్పుకొంటుంది ఒక స్త్రీ. ఇది నేటి సమాజ స్థితికి దర్పణము. 
పాలు-నేయి-మార్పు-మనిషి

ज्येष्ठत्वं जन्मना नैव गुणैर्ज्येष्ठत्वमुच्यते
गुणाद्गुरुत्वमायाति दुग्धं दधि घृतं क्रमात्
జ్యేష్ఠత్వం జన్మనా నైవ గుణైర్జ్యేష్ఠత్వముచ్యతే
గుణాద్గురుత్వమాయాతి దుగ్ధం దధి ఘృతం క్రమాత్
ముందు పుట్టినంత మాత్రాన అధికారము హస్తగతము కాదు. దానికి ప్రావీణ్యత అవసరము.ప్రావీణ్యత అన్నది నిష్ఠురత,నియమ బద్ధత,నిర్భయత,నిరాడంబరత మొదలైనవి కలిగిన యెడల వస్తుంది.
ఈ విషయము మనము పాలను చూస్తే అర్థము చేసుకొనవచ్చును.పాలు అట్లే ఉండిపోతే పనికిరాకుండా పోతాయి. కాచి తోడు పెడితే పెరుగౌతుంది. పెరుగును చిలికితే వెన్న వెన్నను వేడిచేస్తే  నేయి వస్తాయి. కావున పరివర్తన తోనే మనిషి శ్రేష్ఠ, శ్రేష్ఠతర,శ్రేష్ఠతముడు కాగలుగుతాడు.
పాలనటులె యుంచ పనికి రాక చెడును
పేరబెట్టి దాని పెరుగు చేసి 
వెన్నతీసి వేడి పెట్టిన నేయొచ్చు
మంచి కొరకు మార మనిషి యగును.

న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే

భావేహి విద్యతే దేవో తస్మాత్‌ భావోహి కారణం

భగవంతుడు కొయ్యబొమ్మలోనో, రాతి విగ్రహంలోనో, మృణ్మయ మూర్తి లోనో లేడు.. ఆయన మన భావనలో ఉన్నాడు.  అందువల్ల భావమే ప్రధానము. అర్థం. అదెలాగని అనుకొంటారేమోఒక వ్యక్తి తల్లి వద్దకు, భార్య చెంతకు, కూతురు దగ్గరికి పోయినప్పుడు మనసులో కలిగిన భావ భేదం మనకు అనుభవైక వేద్యమే! అందుకే ‘యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ’ అన్నారు పెద్దలు. ఎక్కడ మనకు ఎటువంటి భావన ఉంటుందో అటువంటి ఫలితాన్నే పొందుతాం. ఒక రోగి.. ‘ఇక నా ఆరోగ్యం క్షీణించింది. నన్ను కాపాడేవాడే లేడు’ అని దిగులుగా ఉన్న సమయంలో ‘సమర్థుడైన వైద్యుడు విదేశామునుంది వచ్చినాడు’ అనగానే రోగిలో చిగురించిన అశ అతనిని సగము ఆరోగ్యవంతుని చేస్తుంది. ఇటువంటి విషయములు మన అనుభవములో ఎన్నో చూస్తూనే ఉంటాము.

 ‘భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు’ అనే భావన తో ప్రహ్లాదుడు అడుగడుగునా భగవంతుని రక్షణ పొందితే,. ‘నేనే గొప్పవాడిని. నన్ను మించినవాడెవడూ లేడు. అనే అసత్యమైన భావనతో ఉన్నందుననే, హిరణ్యకశపుడు మట్టికరచినాడు..

నీతి మాట

శుకవత్ భాషణం కుర్యాత్ అజవత్ భోజనం తథాl

కాకవత్ మైధునం కుర్యాత్  గజవత్ స్నానమాచారేత్ll

మన పూర్వీకులు నీతి వాక్యోపదేశమును శాస్త్రముగా పరిగణించినారు. శాస్త్రము అంటే ‘ఇది ఈ విధముగానే చేయి’ అని నిర్దేశించుట. ఆ ఆదేశమును పాతిన్చావలసినదే కానీ అన్యథా తలపోయరాదు.

పై శ్లోక భావమును ఒకసారి గమనించండి.

చిలుక వలె మాట్లాడవలేనట. అంటే మనమాట చిలుక పలుకు వలె ముద్దుగా ముచ్చటగా ఉండవలెనట. అంటే చిలుకను అనుకరించుట (To Mimic) కాదు. చిలుక మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో ఆవిధముగా మాట్లాడవలెను అని అర్థము. మేకవలె తినవలెనట. మేక శాఖాహారి మరియు భయము అధికముగా కలిగినది. ఆకులలములు నోటితో చప్పున లాగి బాగా నమిలి మ్రింగుతుంది. కొన్ని జంతువుల వలె నెమరు వేయదు. కావున మనకూడా ఆహారమును బాగా నమిలి మ్రింగావ్లేనైని అర్థము అందుకే

అక్రోధనేన శుచినా నిర్మలేన బ్రహ్మాత్మనాl

సుఖాసీన కరం కృత్వా సదామౌనేన భోక్తవ్యంll

అంటే మనసు కోపముతో నింపుకుండా, శుచి శుభ్రతలను పాటించుతూ, పరిశుద్ధమైన మనస్సుతో, పరమాత్మను హృదయములో నిలుపుకొని సుఖాసీనుడై మౌనమును పాటించుతూ సుఖముగా భుజింపవలెను. ఎంతటి గొప్పమాట చెప్పినారో చూడండి. దూరదర్శనములు చూస్తూ తింటే అవి ఆరోగ్య దుర్దర్శనములౌతాయి. ఇక ‘కాకవాత్ మిధునం కుర్యాత్’ అంటే శృంగారములో పాల్గొనుటకు కాకి ఎఆన్థమును మాత్రమె కోరుకొంటుంది. చెదలుపట్టిన నేటి సమాజమువలె నడివీధులలో చుంబనాది శృంగార లీలలలో పాల్గొనవు. మనము కాకిని హీనముగా చూస్తాము కానీ మనము కాకికన్నా హీనమన్న విషయమును గుర్తెరుగము. ఇక స్నానము ఎనుగువలె ఎంతో నిదానముగా, బుద్ధిజీవులము కాబట్టి నీళ్ళలోనే కాకుండా,భగవధ్యానములో కూడా మునుగుతూ బాహిరమగు శుభ్రతకు కావలసిన విధముగా స్నానమును ఆచరించవలెను. ఇది నీరే దొరకని కాలము కాబట్టి ఇపుడు ఆయా పరిస్థితులకు అనుకూలముగా మనము స్నానము విషయములో సర్దుకోవలసి ఉంటుంది.

ఖేచర భూచర ప్రాణుల

చూచినచో తెలియనగును సుగుణములెన్నో

యోచన చేయగ మనగతి

పాచిన పులిహోర కన్నా పాచెను రామా!

స్వస్తి.

శ్లో || ఏకోదర సముద్భూతా ఏక నక్షత్ర జాతకాః |
 స భవన్తి సమాః శీలే యథా బదరకంటకాః ||  4
 అర్థము :- ఏకోదర సముద్భూతా = ఒకే తల్లి కడుపున ప్టుిన వాడును, ఏకనక్షత్ర జాతకాః = ఒకే నక్షత్రమున బ్టుినవారును, శీలే = శీలమందు, బదరకంటకాః = రేగుముల్లు, యథా = ఎట్లు, సమాః = సమానమైనవి, న భవన్తి = కానో, యట్లే వారును సమానులుగారు.
 తాత్పర్యము :- ఒకే కడుపున బ్టుిన వారుగాని, ఒకే నక్షత్రమున బ్టుినవారుగాని శీలవిషయములో సమముగా నుండరు. రేగుముండ్లు సమముగా నొకే విధముగా నుండక వంకరింకరగా నుండునో యట్లే పై జెప్పబడినవారు సమానముగా నుండరు.
 వివరణము :- అందఱు సమానముగా నుండరు. వేదవాక్యము-
 సమౌ చిద్దస్తా న సమం వినిష్టః సమ్మాతరా చిన్న సమం దుహతే |
 యమయో శ్చిన్న సమా వీర్యాణి జ్ఞాతీ చిత్సన్తౌ న సమం పృణీతః ||
(ఋ. 10-117-9)
 రెండు చేతులు సమానముగా కర్మ చేయలేవు. ఒక తల్లి కడుపున ప్టుిన రెండు దూడలు సమానముగా పాలనీయవు. కవలపిల్ల లిద్దరు సమానమైన బలశక్తులు కలవారిగా నుండరు. చుట్టఱిక మున్న్టి యిద్దఱు మనుష్యులలో నొకరివలె రెండవవాడు దానాదులచే తృప్తిపఱపలేడు
  మఱొక వేదమంత్రములో అసమానతను గూర్చి బాగుగా చెప్పబడినది-
 అక్షణ్వస్తః కర్ణవస్తః సఖాయో మనోజవేష్వనమా బభూవుః |
 ఆదఘ్నాన ఉపకక్షాన ఉ త్వా హృదా ఇవ స్నాత్వా ఉ త్వే దదృ శే ||
(ఋ. 10-71-7)
 కళ్లు, చెవులు గలిగిన స్నేహితులు జ్ఞానమునకై ప్రయత్నించు వారియొక్క మనోవేగ మొక్కిగా నుండదు. ఒకడు పుక్కిలింతలగు నీరుగల చెఱువువలెను. మఱొకరు చంకలలోతు నీరుగల చెఱువువలెను, ఇంకొకడు మునిగి స్నానము చేయుటకు తగినంత నీరుగల చెఱువువలెను విభిన్నముగా నుందురు. వేదము స్పష్టశబ్దములతోను, ఉదాహరణములతోను మనుష్యులలోని యసమానతను వర్ణించెను. పై శ్లోకము వేదము యొక్క యొక యంగమునకు ఛాయానువాదము మాత్రమే.

ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా |

పాదం సబ్రహ్మచారిభ్యాః పాదం కాలేన పచ్యతె ||

- మహాభారతము -- ఉద్యొగపర్వము

ఒక వ్యక్తి జ్ఞానమును నాలుగు పాదములుగా విభజించితే, గురుమూలముగా ఒక 

పాదము నేర్చుకొంటాడు.ఒక పాదము శిష్యునిగా స్వంత మేధస్సుతో పరిశీలన చేసి 

నేర్చుకొంటాడు. ఒక పాదము తన స్నేహితుల అభిప్రాయములను సమీకరించి 

పాలనుండి వెన్న దీసినట్లు సముపార్జన చేస్తాడు.మిగిలిన ఒక పాదము తన 

అంతరంగములో నిలుపుకొన్న పాఠమునకు , అనుభవము చేత,ఆలోచన చేత,అర్థము 

గ్రహించి ఆకళింపు చేసుకొంటాడు.
*****

వృక్షాన్ ఛిత్వాపశూన్ హత్వా కృత్వా రుదిరకర్దమం l

యద్యోవం గమ్యతే స్వర్గే నరకః కేన గమ్యతే ll

చెట్లను కూల్చివేసిన తరువాత, జంతువులను ఊచకోత కోసి నెత్తుటి బురదను సృష్టించి స్వర్గము సాధిస్తే, మరి నరకము ఎవరి కొరకు ఉన్నట్లు?

 పుట్లుగ పాపకార్యముల పూర్తిగ జేసియు దీక్షతోడుతన్

చెట్లను కొట్టి జంతువుల ఛేదన చేయుచు రక్త కర్దమం

బట్లొనరంగ జేసి మరి  అందరు స్వర్గము చేరిపోవుచో 

అట్లొనరించియున్ నరక మందున ఎందుకు  జేరరందరున్

ఇక్కడ ఒక వాస్తవమైన కథ చెప్పుకొందాము. చిన్న పిల్లవాడు ఒక వనము లోని ఒక చెట్టు వద్దకు రోజూ వస్తూ ఉంటాడు. చెట్టుకు ఎంతో ముచ్చట వేసి ఆ పిల్లవాడు, వాని స్నేహితులు ఆడుకొనుటకు రోజూ అందమైన తన  ఆకులు నిచ్చేది. బాలుడు కొంచెము పెరిగిన తరువాత  చెట్టు తన కొమ్మలకు ఊయల కట్టుకోనిచ్చి, వారు ఊగుతూ వుంటే సంతోషించేది. ఆ బాలుడు మరికాస్త పెద్దయినతరువాత స్నేహితులతో కూడి ఆడుకొని అలసిపోతే ఆకలి తీరడానికి పళ్ళు సేద తీరడానికి నీడ ఇచ్చేది.. బాలుడు పెద్దయ్యాక, ఇంటిని నిర్మించుకొనుటకు అతని కోరికపై కావలసినంత కలపనిచ్చింది. వంటచరకు కావాలంటే కొమ్మలు నరికి తీసుక పొమ్మని చెప్పేది. చివరకు చెట్టుకు మిగిలినది బోదె మాత్రమే! పొరుగూరికి పోయి ఆదారిలో తిరిగి అలసి సొలసి  వస్తున్న అతనిని చూసి మాకు నెలకు ఒరిగిపోయి కూర్చొని సేద తీర్చుకొమ్మంది. చెట్టు మళ్ళీ లేచి నిలబడలేదు.  అప్పటికి గాని చెట్టు యొక్క గొప్పదనము ఆ, ఒకనాటి  బాలునికి అర్థము కాలేదు. ఆ చెట్టు కోసము అప్పటికీ, ఎప్పటికీ తానివ్వగలిగినదల్లా చేరెడు కన్నీళ్ళే!  

జంతువుల ఊచకోత గురించి ఎంత చెప్పినా తక్కువే! తనకు మేలుచేసే ప్రకృతిని తానూ నరుకుతూ పొతే తనకు కాక పోయినా తన తరువాతి తరాలకు నిలువ నీడ కూడా ఉండదు. వనాలుంటే చేట్లుంటాయి, మృగాలుంటాయి, అందుచేత ప్రకృతి సమతుల్యము ఉంటుంది.  మనిషి ఇది ఎంత తొందరగా గ్రహించి తమ తమ ఊర్ల ఎటి ఒడ్డున చెట్లు పెంచితే భావి తరాలకు ఎంతో మేలుజేసిన వారవుతారు.

 స్వర్గము నరకము పైన ఉన్నవో లేవో తెలియదు కానీ వానిని, ఏది కావాలంటే అది, భూమి పైనే ప్రతిష్ఠించుకోగల సామర్థ్యము మానవునికి ఉన్నది. తన ఇష్టమును పటిష్టము  చేసుకొనే బాధ్యత తనదే!
******************************************************

యథా కాష్ఠంచ కాష్ఠంచ సమేయాతాం మహార్ణవే l 
సమేత్య పి  వ్యపేయాతామ్ కాలమాసాధ్య కించనః ll 
వాల్మీకి రామాయణము 

యథా కాష్ఠంచ కాష్ఠంచ సమేయాతాం మహోదధౌ l 
సమేత్య చ వ్ పేయాతామ్ తద్వద్ భూత సమాగమఃll 
వ్యాస మహాభారతము 
పై రెండు శ్లోకములు ఒకపరి గమనించితే మన పూర్వుల గొప్పదనము తెలుస్తుంది. మొదటి శ్లోకము త్రేతాయుగములో వాల్మీకి మహర్షి వ్రాసినది. రెండవది ద్వాపరాయుగములో వ్యాసమహర్షి వ్రాసినది. ఎక్కడో ఒక రెండు సమానార్థక పదాలు తప్ప ఇంచు మించు రెండు శ్లోకమలు ఒకటే!  మరి వ్యాసుడు వాల్మీకి భావనను అనుకరించినాదా అంటే మహాభారతము వంటి ఒక ఉద్గ్రంధమును రచించిన మహనీయుడు ఒక శ్లోకమును లేక భావమును స్తేయకృతము (Theft)
చేస్తాయడంటే నమ్మదగిన మాట కానే కాదు. కాబట్టీ మనము అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే  మహానీయులగు మనపూర్వులు తమ గ్రంధములలో ఎమాత్రము వీలు దొరికినా లోక కళ్యాణార్థము ఏడూక్య సూక్తి చెబుతారు. అటువంటి సూక్తులలో ఇది ఒకటి. 
ఇక ఈ సూక్తి సారాంశమును చదువండి.

రెండు దుంగలు విశాలమైన సముద్రము లో కలుస్తాయి. అలల  తాకిడికి అవి విడిపోయినట్లుగా, ఇద్దరు వ్యక్తులు తమ ప్రమేయము లేకునాదనే కలుస్తారు. ఆ తర్వాత కాలచక్రము  యొక్క దీశానిర్దేశముతో వారు  విడిపోతారు. దీనిని దైవఘటన అంటారు. కానీ ఇక్కడ మానవుల మధ్యన ఒక వెసలుబాటు ఉన్నది. నచ్చితే తాము బ్రతికినంత కాలమూ అన్యోన్యముగా ఉంటారు నచ్చకుoటే ె అలా యొక్క తాకిదీ లేకుండానే విడిపోతారు. ఏది ఏమయినా అవసానముబ్ వరకూనో  ఆశువుగానో విడిపోవటము మాత్రము తథ్యము. ఇది గమనించి మంచిని పంచుదాము. మంచిని పెంచుదాము. 
స్వస్తి. 









Wednesday, 15 January 2020

అమాయక ఏకాదశి


అమాయక ఏకాదశి

అమాయక ఏకాదశి ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారేమో, నా ఉద్దేశ్యము అమాయకుడు పాటించిన ఏకాదశి, అని అన్వయించుకొండి. యీతని కథ ఒకసారయినా చదవండి.
అనగా అనగా ఒక గ్రామము. ఆ గ్రామములో ఒక ఉమ్మడి కుటుంబము. ఆ ఉమ్మడి కుటుంబము యొక్క సభ్యుడే మన కథా నాయకుడు. పేరు హరిదాసు.
ఇంటికి సంబంధించిన అతిచిన్న పనిని ఆయఇంటి ఒక పసిబాలుడైనా చేస్తాడు కానీ మన హరిదాసు ఆమాత్రము పనికూడా చేయడు. చదు వుకోకున్నా తోచిన మాటలు పాటలు పాటలున జేసి సంగీతము నేర్వకున్నా తోచిన రాగాలు కట్టి ఆ విష్ణుని గూర్చి పాడుట మాత్రమే ఆతడు చేసే పని. ఆతనితో విసిగివేసారిన ఇంటి పెద్దలు ఆతనిని ఏదయినా ఆశ్రమము చేరి వాళ్ళు పెట్టేది తింటూ తనదైన రీతిలో కాలము గడుపుకొమ్మన్నారు. చేసేది లేక ఆశ్రమాల వేటలో పడి నాడు మన హరిదాసు.
చివరకు హరిదాసుకు నచ్చిన ఒక ఆశ్రమము కనిపించింది. స్వతహాగా తిండిపోతయిన అతడు ఆ ఆశ్రమములో ఉండే గురుశిష్యులు పుష్టిగా ఉండటం చూసి అదే తనకు సరియయిన గూడని నిర్ధారించుకోన్నాడు. ఎట్లయితేనేం గురువు కరుణతో గూటిలో చేరిపోయినాడు.
చేరిన రోజు శుక్ల ద్వాదశి. షడ్రసోపేతమైన భోజనము చేసినాడు. ఇంటికంటే ఇదే మేలనుకొన్నాడు. ,కళ్ళు మూసి తెరచే ,లోపలే 15 రోజులు గడచిపోయినాయి. బహు,ళ ఏకాదశి వచ్చింది. పెట్టిందితినడము, గురుబోధ వినడము, నోటికి వచ్చిన పాట అనడముతో అప్పటివరకూ జరిగిపోయింది. హరిదాసు, లేచినాడు కానీ పోయిలో పోయిలో పిల్లి,లేవ లేదు. హరిదాసు కడుపును ఆకలి పెనుభూతమై ఆవరించింది. దాసు గురువువద్దకు జేరి కారణమడిగినాడు. ఎకాదశి ఉపావాస దినము కాబట్టి వంటవండరు ఉండదు అన్నాడు ఆయన. అది లేకుండా నేనుండలేను 
అన్నాడు దాసు. దయ దలచిన గురువు ఒక మనిషికి తగిన బియ్యము పప్పు ఉప్పు మొదలైనవి ఇవ్వమని ఖాద్యసామాగ్రి సంరక్షకునికి చెప్పి  ఇప్పించి ఆశ్రమమునకు కొంత దూరములో ఉన్న మైదానమునకు పోయి వండుకొని తినమన్నాడు.
దాసు గురువు చెప్పిన విధముగానే, మొదటి సారి చేస్తున్నా , కష్టపడి వంట చేసినాడు.  అన్నము అడుగు అంటింది అంటే మాడింది. పప్పు కూరలలో ఉప్పు కారము సరిగా వేసియుండడు. వంట ముగిసినవెంటనే దేవుడు గుర్తుకొచ్చినాడు. పాటను కూడా ఈవిధముగా వెంటనే అందుకొన్నాడు:
 నీల గగన ఘన శ్యామా, వినుమా 
మనసా మ్రొక్కితి కనుమా
నా నైవేద్యము గొనుమా
దరిని జేరి ఇక తినుమా
భక్తిపారవశ్యముతో హరిదాసు పాడిన ఆ పాటకు సమ్మోహితుడై ఆరగింప వచ్చినాడు నిజంగానే ఆ పరమాత్ముడు.
హరిదాసు ఆవిధముగా ఊహించుకోలేదు. రోజూ ఆశ్రమములో తాను పాడిన  పాటకు బదులుగా ఏవో మంత్రాలూ చెప్పి దేవునికి,వండిన పదార్థములు చూపి తామే తింటారు. తనకు మంత్రాలు రావు కాబట్టి పాట పాడి ముగించి తిందామనుకొన్నాడు. కానీ ఇక్కడ దేవుడే వచ్చి అంతా తిని తిని బాగుంది అన్న ఖితాబునిచ్చి వెళ్ళిపోయినాడు. పాపం దాసుకు విధిలేని పరిస్థితిలో అది బలవంతపు ఉపవాసము  అయ్యింది. ఈడుపు కాళ్ళు ఏడుపు ముఖంతో ఆశ్రమము చేరుకొన్నాడు దాసు. జరిగినది గురువుతో చెప్పి తలా మోకాళ్ళకు ఆనించి కూర్చుండిపోయినాడు ఆరోజుకు. గురువు కూడా, వీనికి ఇచ్చింది  చాలక ఈమాదిరి చెబుతున్నాడని తలచి ఊరకుండిపోయినాడు.
మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఈసారి హరిదాసు ఇద్దరికి తగినంత ఇవ్వమన్నాడు. గురువు ఎందుకు అంటే నాకూ హరికి అని సమాధానము చెప్పినాడు. గురువు వీనికి ఇచ్చిన స్వయంపాకము  చాలనందువల్ల అడుగుతున్నాడని  తలచి ఆవిధముగానే ఇచ్చిపంపినాడు. దాసు యధావిధిగా వంటచేసి పాట అందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, వినుమా 
మనసా మ్రొక్కితి కనుమా
నా నైవేద్యము గొనుమా
దరిని జేరి ఇక తినుమా
ఈసారి విష్ణువు లక్ష్మీసమేతుడై వచ్చి చేసినది ఆరగించిపోయినాడు. మనవానికి ఈసారీ కడుపు ఖాళీ అయిపోయింది . వెళ్లి విషయము గురువుతోచెప్పి కాళ్ళు కడుపులు పెట్టుకొని పడుకొన్నాడు. గురువుకు సందేహమైతే కలిగింది కానీ మిన్నకున్నాడు.
మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఈసారి హరిదాసు ముగ్గురికి తగినంత ఇవ్వమన్నాడు. గురువు ఎందుకు అంటే నాకూ హరికి లక్ష్మికి అని సమాధానము చెప్పినాడు. గురువుకు సందేహమైతే ఉంది కానీ  చూద్దాము ఈసారి ఏమంటాడో వెళ్లివచ్చిన తరువాత అని తలచి  ఆవిధముగానే ఇచ్చిపంపినాడు. దాసు యధావిధిగా వంటచేసి పాట అందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, ఇదిగో
 నా నైవేద్యము గొనుమా
రమా సహితముగ జనుమా
ఈ నైవేద్యము తినుమా

ఈసారి విష్ణువు లక్ష్మీసమేతుడై గరుత్మంతునిపై వచ్చి చేసినది ఆరగించిపోయినాడు. మనవానికి ఈసారీ కడుపు ఖాళీ అయిపోయింది . వెళ్లి విషయము గురువుతోచెప్పి కళ్ళు మూసుకొని  పడుకొన్నాడు. గురువుకు సందేహము  ప్రబలమయ్యింది.
మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఈసారి దాసు ఐదుగురికి తగినంత ఇవ్వమన్నాడు. గురువు ఎందుకు అంటే నాకూ హరికి లక్ష్మికి గరుత్మంతునికి కాకుండా ఇంకా ఎవరో ఒక క్రొత్త వ్యక్తినిపిలుచుక వస్తాడు అని సమాధానము చెప్పినాడు. గురువుకు సందేహము  ప్రబలమయ్యింది కానీ ఈఒక్కసారి  చూద్దాము  ఏమంటాడో వెళ్లివచ్చిన తరువాత అని తలచి,  అడిగిన విధముగానే ఇచ్చిపంపినాడు. దాసు యధావిధిగా వంటచేసి పాట అందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, వినుమా
 నా నైవేద్యము గొనుమా
గరుడ సేవగొని లక్ష్మి తోడ నిటు జనుమా
నైవేద్యము నిక ఆరగించుమాa

ఈసారి విష్ణువు లక్ష్మీసమేతుడై గరుత్మంతునిపై వస్తూ నారద తుంబురలతో సహావచ్చినాడు. చేసినది మొత్తం ఆరగించిపోయినాడు. మనవానికి ఈసారీ కూడా మనవాని నోటిలో వెలక్కాయ పడింది. వెళ్లి విషయము గురువుతోచెప్పి కళ్ళు మూసుకొని  ఒక మూలకు కూర్చున్నాడు. గురువు ఈసారి  సందేహము  తీర్చుకొని తీరవలెనని నిశ్చయించుకున్నాడు. 
మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఈసారి దాసు గురువు వద్దకువెళ్ళి “మొత్తము ఉన్న తిండి సామాగ్రి అంతా ఇవ్వమన్నాడు. గరువు మొదలే హరిదాసును పరీక్షింప దలచినాడు కాబట్టి సామాగ్రి అంతా ఇచ్చి అతనిని పంపి తాను ముఖ్యమైన శంష్యులను తీసుకొని నెమ్మదిగా బయలుదేరినాడు.
తాను చేరవలసిన స్థలము చేరుకొని వండకుండానే విష్ణువును ఒకేసారి మొత్తము పరివారముతో రమ్మని పాటనందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, వినుమా
 నా నైవేద్యము గొనుమా
సపరివారముగ జనుమా
వంట చేసుకొని తినుమా
దాసు కోరినట్లే, ఆశ్చర్యమును అణచుకొని పరివారముతో వచ్చినాడు. రండురండని దాసు పరివారసమేతుడైన విష్ణువునాహ్వానించి, నేను ఒక్కడినీ మీకు వండి వడ్డించలేను. మీరే ఉన్న వస్తువులతో కావలసినది చేసుకొని, మీరు తిని నాకూ ఇంత పెట్టండి అన్నాడు.
మహావిష్ణువు దాసు యొక్క అమలిన భక్తికి అచ్చరువంది తనపరివారముతో తగినవిధముగా నడచుకొని తరువాతి రోజు సూర్యోదయమునకల్లావంట ముగిసే విధముగా చూడమని చెప్పి లక్ష్మీ సహితుడై తాను హరిదాసుతో కూర్చొని ఎన్నో పాటలు పాడించుకొన్నాడు. తానెన్నో కబుర్లు చెబుతూ తెల్లవారజేసినాడు.
తట్లోహరిదాసుకు అప్పటికి కాని అర్థము కాలేదు, తనతో ఏకాదశి అంతా పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగనీకుండా మహావిష్ణువు జాగారము చేయించినాడని.తాను కాల కృత్యములను తీర్చుకొని విష్ణువు ప్రక్కనే వేసిన అరటియాకు చెంత కూర్చుని భోజనమునకు సిద్ధమయినాడు. పరివార సభ్యులు వడ్డించగా సుష్టుగ తిన్నాడు.
ఇదంతా ముందురోజే వచ్చి శిష్యగణముతో రహస్యముగా కూర్చున్న గురువుకు, దాసు పాటలు పాడింది, భోజనము చేసిందీ తప్ప ఏమీ తెలియలేదు.
శిష్యుని తాదాత్మ్యమును తదేక భక్తిని, తన్మయతను, అన్నింటినీ మించి ఆతని అమాయక అచంచల భక్తిని చూసి అతని ముందు మోకరిల్లినాడు. ఆశ్చర్యంగా “నీవు వంట చేయకుండానే నీ విస్తట్లో షడ్రసోపేతమగు ఆహారము పరాత్పరుని అనుగ్రహము లేకుండా చేరదు. పైగా ఏకాదశి నాడు తిండి నిద్రలేకండా హరిగుణగానము చేస్తూ ఉండిపోయినావు. నాకు అర్థము కానినిన్ను ది ఏమిటంటే నీవు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు వినిపించింది. ఎవరితోన్నది నాకు అర్థముకాలేదు. చెప్పగలవా” అని అడిగినాడు. అప్పుడు హరిదాసు తన ప్రక్కన చూపించి ఇదిగో లక్ష్మీ సమేతుడౌ ఈశ్రీహరి సన్నిధిలోనే మాటలతో పాటలతో గడిపినాను” అన్నాడు.
అప్పుడు గురువు “నేనెంత మంద భాగ్యుడను, ఒక మహా భక్తుని నాకు శిష్యునిగా చేసుకొన్నానే, నా పూజలో ఎన్నెన్ని లోపములుండినాయో ఏమో అందుకే ఎదుట ఉండికూడా ఆ లక్ష్మీనారాయణుడు నకగుపించలేదు. అప్పుడిక ఈ కన్నులతో నాకేమి పని” అని కన్నులు పొడుచుకోబోయినాడు. అప్పుడు హరిదాసు ఆయనను ఆపి పరమాతముని సతీసమేతముగా కనిపింప వేడుకొన్నాడు. అప్పుడు గురువు “స్వామీ నిన్ను చూచిన కన్నులతో ఇతరము చూడను, నీలో ఐక్యము గావించుకో” అని అభ్యర్థించినాడు. భక్త జన వాంఛిత ఫల దాతయైన పరాత్పరుడు తథాస్తు అని హరిదాసు వంక తిరిగి “నీవు నీ అచంచల భక్తి భావమును నీ గీతముల ద్వారా లోకమును ప్రభావితము చేసి ధర్మనిరతులుగా పరివర్తనము గావించి తగిన సమయమున నా సాయుజ్యము చేరెదవు” అని వరమొసంగి మహాలక్ష్మీ యుతుడై పరివార సహితముగా అంతర్ధానమందినాడు.
స్వస్తి.

Sunday, 12 January 2020

మకర సంక్రాంతి - నువ్వుల ఉండ లేక నువ్వుల లడ్డు


మకర సంక్రాంతి  
నువ్వుల ఉండ లేక నువ్వుల లడ్డు
https://cherukuramamohanrao.blogspot.com/2020/01/blog-post.html
మకరసంక్రాంతి పర్వదినమున నువ్వుల లడ్డు ఆరగించుట కొన్ని ప్రాంతముల సాంప్రదాయము. ముఖ్యముగా దీనిని నువ్వులు బెల్లము తో చేస్తారు చక్కెరతో కాకుండా! నువ్వులకు వెచ్చదనమునిచ్చే గుణము వుంది. బెల్లమునకు అవాంఛిత వార్ధక్యము రాకుండా కాపాడుతూ ముఖ్యముగా రోగ నిరోధక శక్తిని కలిగించుతుంది. ఈ ఋతువులో ఈ రెండూ ముఖ్యము కదా! అందుకే ఈ నువ్వులుండ. అటువంటి నువ్వులుండను గూర్చి, సంక్రాంతికి సంబంధించిన ఎంత చక్కని సందేశమిస్తున్నాడో చూడండి ఈ అజ్ఞాత కవి.
'అందుకే ధర్మో రక్షతి రక్షితః' అన్నారు పెద్దలు. ఆహార వ్యవహారములు ధర్మములోని భాగములే! ఆంగ్లేయ నాగరికత, భాషకు నాంది ఏ 10 వ శాతాబ్దములోనో పడినది. జర్మన్ గిరిజన భాష దీనికి మూలమని చెప్పుకొంటారు. మన సంస్కృతి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినది. 1776 వరకు ఉనికే లేని US, అప్పుడే కన్ను తెరచింది. వాస్తవానికి అకుంఠిత తపోదీక్షలో మ్రగ్గి తమ జ్ఞాన నేత్రముచే దర్శించి నిస్వార్థబుద్ధితో మనకందించినారు, Patents కొరకు ప్రాకులాడే US మరియు పాశ్చాత్యుల వలె కాకుండా! కావున ఆ సాంప్రదాయాల జోలికి, మంచి ఉంటె తప్ప పోవద్దు. దేనికయినా ఉండాలి హద్దు. అదే ఎప్పటికీ ముద్దు.
ఇపుడు ఈ శ్లోకాన్ని మనసు పెట్టి భావముతో సహా చదవండి.
తిలవత్ స్నిగ్ధం మనోస్తు వాణ్యాం గుడవన్మాధుర్యం
తిలగుడలడ్డుకవత్ సంబంధేస్తు సువృత్తత్త్వం |
అస్తు విచారే శుభసంక్రమణం మఞ్గళాయ యశసే
కల్యాణీ సఞ్క్రాంతిరస్తు వః సదాహమాశంసే ||
--అజ్ఞాత సూక్తి
నూవులు ఎంతో స్నిగ్ధంగా నునుపుగా వుంటాయి. కవి, మనసును అంతటి స్నిగ్ధతకు పోలుస్తున్నాడు. మాటలలోని తీయదనాన్ని బెల్లము తో పోలుస్తున్నాడు.ఆ రెండిటిని కలిపి చేసిన లడ్డు లోని మాధుర్యము అనుభవైకవేద్యము. ఆ రెండింటి కలయిక అంటే మనసు మాటల కలయిక వలన కలిగే సౌభాగ్యము వర్ణనాతీతము. అట్టి సౌభాగ్యమును, సంక్రాంతి మనకు పొందజేయవలయునని కవి ఆశించుచున్నాడు. పేరే తెలుపని ఆ మహనీయుని మనోభావము ఎంత కమనీయమైనదో చూడండి.

మకర రాశి లో సూర్యుడు ప్రవేశించే వేళను మకర సంక్రాంతి అంటాము. సమ్యక్ క్రాంతి ఇతి సంక్రాంతి అంటే సుగమముగా ప్రవేశిచుట అని అన్వయించుకొనవచ్చును. కొన్ని ప్రాంతాలలో ముఖ్యముగా తమిళనాడులో రవి చారమును బట్టియే మాసము మొదలవుతుంది. కావున సంక్రాంతి ప్రతిసంవత్సరము దాదాపు జనవరి 14, 15 వ తేదీలలో  ఒక రోజు వస్తుంది.
సంక్రాంతి సంబరాలకు పేరు. ఆ సమయానికి పంటలు ఇంటికి వస్తాయి. కొత్త బట్టలు, కొత్త ధాన్యము కొంగ్రొత్త సంతోషముతో పల్లెసీమలలోని ప్రతి గడప కళకళలాడుతూ వుంటుంది. ఆ సమయములో కొత్త నూవులు, బెల్లము దంచి ఆ రెంటినీ కలిపి ఉండలు చేస్తారు. దానిని 'చిమ్మిలి' అనుట కూడా కద్దు. దాని గుణము ఏమిటంటే అది తినడానికి ఆనందము తిన్న పిదప ఆరోగ్యము కలిగిస్తుంది.
ఎంత చక్కటి అన్వయమో . మరి ఈ సంక్రాంతి నుండి మనసును మాటను నూవులు బెల్లము లాగా కలిపి ఆనందము ఆరోగ్యమయమైన భవితకు బాట వేస్తారు కదా !స్వస్తి.

 ముందస్తు 'సంక్రాంతి' శుభాకాంక్షలతో
చెరుకు రామ మోహన్ రావు

Tuesday, 24 December 2019

మాట - వరహాల మూట


మాట - వరహాల మూట


కొందరికి మాటలాడుట ఒక కళ, మరికొందరికి మాటలాడుట కేవలము కల. మాట నిజముగా వరహాల మూట. అభ్యసించితే ఆనందమే! అవమానము దరిజేరదు.
మాట వలన జరుగు మహిలోన కార్యముల్
మాట వలన పెరుగు మైత్రి ,కనగ
మాట నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
నా ఉద్దేశ్యంలో మాటకు ఇంత  ప్రాధాన్యత వుంది. మాటే జంత్రము(సంగీత వాద్యము)మాటే మంత్రము ,మాటే యంత్రము ,మాటే తంత్రము.
గాలికి కదిలే మీ కురులు వేయి వీణియల తంత్రులై  నా హృదయములో అనురాగామనే రాగాన్ని మీటుతున్నాయి అంటే అప్పుడు మాట జంత్రమేకదా. (జంత్రమంటే సంగీత పరికరమని ఒక అర్థము)
సరియైన సమయములో సరియైన సలహాచేప్పి సమస్యను సర్దుబాటు చేయగలిగిన నిజమైన స్నేహితుని మాట మంత్రము కాదా!
సమయానికి సాయపడే యజమాని మాట మనలను యంత్రము లాగా పనిచేయనివ్వదా!
తంత్రము అంటే ఆలోచన. నేటి ‘టెంగ్లీషు’ లో చెప్పవలసి వస్తే ‘Sketch వేయుట’ అంటారు. యుద్ధమున భీష్ముని కూలగొట్టుటకు కృష్ణుడు చేసినది ‘తంత్రమే’ కదా!
అన్నీ మాటలే. కొన్ని తేనె ఊటలు కొన్ని బంగారు గొలుసు పేటలు,  కొన్ని మంచికి బాటలు, కొన్నిహాయిని కలిగించే పాటలు,  కొన్ని అందాలీనే తోటలు, కొన్ని రక్షించే కోటలు,  కొన్ని అతి మెత్తని దూటలు (దూటను అరటి బొందె అనికూడా అంటారు),కొన్ని కష్టాలిచ్చేపూటలు, కొన్ని చెడ్డను చెరిగే చేటలు, కొన్ని ఎండిన చెట్లకు తాటలు ( అంటే చెట్టు బెరడు, Bark),కొన్ని జీవితముతో ఆడుకొనే ఆటలు,కొన్ని గాయము చేసే ఈటెలు,తుపాకి పేల్చే తూటలు, కొన్ని నీటి మూటలు,కొన్ని పదును కత్తులు, కొన్ని నక్క జిత్తులు. కొన్ని విషపు విత్తులు, కొన్ని ఆపదల గుత్తులు.  కానీ సుమతి శతక కారుడు మాటను, సత్యము అనే ఒక మేకు తో గోడకు తగిలించినాడు. అదేమిటంటే
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
అన్నాడు.  కోటకు భటులు, నాతికి అంటే స్త్రీ కి మానము, వ్రాతకోతలకు చేవ్రాలు ఎంత ముఖ్యమో మాటలకు సత్యము అంతకన్నా ముఖ్యము. మాట ఎంత విలువ కలదో చూడండి.
ధృతరాష్ట్రుడు భారతములో తన కొడుకు చర్యలు సరియైనవి కావని చెబుతూనే తనకు గల పుత్ర వ్యామోహము ఆ విధంగా చేయిస్తున్నదని బాధ పడతాడు. కర్ణుడు తాను కుంతీ పుత్రుడని తెలిసిన పిదప గూడా తన మాటకు కట్టుబడి దుర్యోధనునితో ఉండిపోతాడు. యుద్ధానికి ఆరంభములో ధర్మజునికి, తగిన సమయములో తన మరణ రహస్యము తెలిపెదనని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి భీష్ముడాతనికి తన మరణ రహస్యమును ఆ విధంగానే  తెలుపుతాడు . దుర్యోధనుడు తానూ చేసేది తప్పే అని తెలిసినా, తాను దాయాది మాత్సర్యము వీడలేనంటాడు. అంటే మంచయినా చెడ్డయినా మనపూర్వుల సత్య నిష్ఠా గరిష్ఠత మనకవగతమౌతుంది. ఇందులో మంచి వారు చెడ్డవారు అన్న తారతమ్యము లేదు.  అసలు నిజము గజము వంటిది. అందుకే మరి ఏనుగు నడుస్తూవుంటే ఎంత హుందాగా ఉంటుందో చూడండి. నిజము గజమైతే అబద్ధము అజగరము అంటే పాము. కాబట్టి పాముతో చెలగాటమెన్నటికీ మంచిది కాదు.
ఈ పద్యము చదవండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

ఇది కూడా సుమతి శతక కారుని ఇంకొక పద్యము. సక్రమముగా వినుట, లేక మనసు పెట్టి చదువుట, విన్నది ఆకళింపు చేసుకొనుట,ఆకళింపు చేసుకోన్నదాని అర్థమేరిగి ప్రవర్తించుట మనిషి కి చాలా ముఖ్యము. అంటే ఒక మాటను ఆకళింపు చేసుకోనేదానికి ఎంత అవగాహన అవసరమో అర్థము చేసుకోన గలరు. అసలు ఇవన్నీ డబ్బుతీసుకొని చెప్పే Management Science లోని భాగాలే!
నేను వ్రాసిన ఈ రెండు పద్యములను చదవండి.
మనసు మాటలోన మాటేమొ పనిలోన
పనికి పట్టుదలను పదిలపరచి
కష్ట పడెడు వాడు కడు గొప్ప వాడురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి

పాటకు పల్లవి ప్రాణము
ఆటకు ‘లయ’యౌను ప్రాణమాలోచింపన్
మనిషికి నడతే ప్రాణము
మాటకు ప్రాణమ్ము’నిజము’మరువకు రామా!


అంటే మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట. త్రికరణములు అంటే మనోవాక్కాయకర్మలు. భావము మొదట మనస్సులో కలుగుతుంది. అది వాకు ద్వారా బహిర్గతమౌతుంది. దానిని క్రియారూపమున పెట్టె కర్మమునాచరించితే మనము ఒక కార్యమును బాహ్యాభ్యన్తరశ్శుచితో చేసినట్లు. అప్పుడే మనసుకు తృప్తి,మనిషికి ఆనందము.
తల్లి తన సంతుకు మొదటి గురువు. ఒక వ్యక్తిని చూపి యితడు మీనాన్న అంటే అది ఆశిశువు తక్షణము గ్రహించుటయే కాక నాన్న అని పిలుస్తూ అనుబంధము ఏర్పరచు కోవడము జరుగుతుంది. తండ్రి వ్రేలు పట్టుకు నడుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకొన్న పిదప గురువుకు అప్పగించడం జరుగుతుంది. 'గురువు' 'teacher' కు సమానార్తకము కాదు. teacher అంటే one who teaches. అతని బాధ్యత అక్కడితో ముగుస్తూంది. 'గురుత్వ'మది కాదు.  అసలు గురుత్వము అంటే 'density',అంటే గాఢమైన అని అర్థము . పాఠము చెప్పి ఇక పోయిరమ్మనుట కాదు గురువు యొక్క బాధ్యత. శిష్యుడు తనంతవాడయ్యేవరకు తన చత్ర ఛాయా (గొడుగు నీడ)లోనే వుంచుకొంటాడు కావున వానిని ఛాత్రుడు అన్నారు. ఎంత మంచి మాటో చూడండి.అదే student అనే మాటకు one who studies అనే గదా అర్థము. కావున గురుశిష్య సంబంధమునకు teacher--student సంబంధమునకు హస్తిమశకాంతరము, అజగజ సామ్యము,పర్వత పరమాణు సారూప్యము. కావున గురువు ఏమి మాట్లాడవలె ఎట్లు మాట్లాడవలె ఎంత మాట్లాడవలె అన్నవి కూడా తన శిక్షణ లో భాగంగా చెబుతాడు. అందుకే నే నంటాను:
అమ్మ మాట సద్ది యన్నంపు మూటౌను
అయ్యా మాట చూడ అందు పెరుగు
గురువు గారి మాట గురుతుంచు లవణము
రామమోహనుక్తి రమ్య సూక్తి

మనకు నచ్చని విషయాలు సూన్నితముగా చెప్పడమనేది ఒక కళ. ఇందులో చెప్పేవానికి చెప్పించుకొనే వానికీ అవగాహన వుంటే వారి మధ్యన పొరపొచ్చులు రావు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ :
పెళ్లి పెత్తనానికి వచ్చిన అబ్బాయి యొక్క తండ్రి ఒక కుర్చీ పై కూర్చొని, మిగత నలుగురిముందు భార్యతో ఇట్లన్నాడు. ఇందూ ! రా యిలా కూర్చో. చెప్పింది ఒక మాటే అయినా అర్థాలు మాత్రము రెండు. ఒకటి నా ప్రక్కనవచ్చి కూర్చో ఐతే రెండవది మాట్లాడకుండా రాయి లాగా కూర్చోమనుట. ఇది ఆమెకు మాత్రమే అర్థమౌతుంది. ఎందుకంటే వారి మధ్యన అవగాహన వుంది కాబట్టి.
మాటకున్న ఇంకొక ప్రాధాన్యత చూస్తాము.
భర్తృహరి సుభాషితాలలో 'విద్యా దదాతి వినయం'అన్న ఒక శ్లోకాన్ని  ఈ విధమైన పద్యంగా తెనుగించినారు ఏనుగు లక్ష్మణ కవి గారు.
విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలని ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు;

మనము నేర్చుకొనే విద్య వినయప్రదానమై వుండాలి. అప్పుడే మనలపెద్దల ఆదరమును పొందే పాత్రత లభించుతుంది. పాత్రత వలన అంతా మంచే జరుగుతుంది. జిజ్ఞ్యాస, వయసు తో నిమిత్తము లేకుండా, అందరికీ ఉండవలసిందే. అడిగే పధ్ధతి ఎదుటివారికి ఆనందము కలిగించాలి. కొందరి మాటలు వింటే మొక్క బుద్ధి పుడుతుంది కొందరివి వింటే మొట్ట బుద్ది పుడుతుంది. మన మాటలో ఎపుడూ నిజము నిజాయితీ నిండి ఉండాలి,
నిండుకొని గాదు(అంటేఅయిపోవడం.  )
హనుమంతుడు మారువేషములోవెళ్లి మొదటి సారి రామలక్ష్మణులను చూసి వారిని ప్రశ్నించిన తీరును రాములవారు వాల్మీకి రామాయణము లో ఈ విధంగా మెచ్చుకొంటాడు :

నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః
న సామవేద విదుషః సక్యమేవాభ్యభాషణం

అంటే ఋగ్వేద వినీతుడు అంటే వేదమును గురువు వద్ద అధ్యనం చేసిన వాడు.యజుర్వెద ధారిణుదు అంటే ఉదాత్త అనుదాత్త స్వరాలతో షడంగ సముపెతమైన వాక్ శుధ్ధి, సందర్భోచిత సమాధానాలు కలిగిన వాడు. సామ వేద విదుషః అంటే శాస్త్ర సంగ్రహుడే కాక గాన ప్రాధాన్యమైన సామవేదం సాంగోపాంగంగా నేర్చి తన ఊహా వైదుష్యంతో శ్రోతలకు రససిద్ధి కలిగించినవాడు. మాటకు అంత  ప్రాధాన్యత వుంది. అడుగుటలో అణకువ వుండాలి.
మనకు తెలియనివి తప్పులుకావు అన్న తెనాలి రామకృష్ణు ని మాటతో ముగించుతూ నన్ను తప్పుగా తలవ వద్దని తెలుపుకొను చున్నాను . జ్ఞానము అనంతము. జ్ఞానము అసలే లేనివారు ఎవరూ వుండరు కావున అంతో ఇంతో ఎంతో కొంత అందరమూ జ్ఞానులమే.  అట్లని పరిశోధన లేక విచికిత్స చేయకుండా ఒకరిని తూలనాడుట తప్పు.
ఒకసారి రాయల ఆస్థానమునకు ప్రెగ్గడ నరసరాజు వచ్చి ఇంతవరకు వ్రాసిన కవుల కవిత్వాలలో తప్పులు క్షణంలో పడతానంటాడు కానీ రామకృష్ణుడు ఒక పద్యమిచ్చి తప్పు చూపించమంటే ఏదో ఒక పదము తప్పని చెబుతాడు ప్రెగ్గడ. రామకృష్ణుడు ఆ పదము తప్పుకాదు అని సహేతుకముగా నిరూపించుతాడు. ఆ సందర్భములో ఈ పద్యాన్ని చెబుతాడు:
తెలియనివన్ని తప్పులను దిట్ట తనాన సభాంతరంబునన్
తెలుపగా రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముపడ భాయమేరున్గాక పెద్దలైనవా
రాల నిరసింతువా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా బుసా
కావున మన విమర్శా పెదవి దాటకముందే మెదడుకు పంపి జల్లింపబడిన తరువాత (after scanning ) దాటించడము శ్రేయోదాయకము.
ఈ భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక సారి తిలకించండి .
భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్
ఇదండీ మాట యొక్క మహిమ
'అనంతో వై వేదాః' అన్నారు ఆర్యులు. అవి కల్గిన భూమిలో పుట్టినందుకు గర్విద్దాం.
మనసు పెట్టి మాట్లాడుతారని ఆశ. మనసారా చదువుతారని అత్యాశ.


ఇక విమర్శను గూర్చి ఒక్క మాట. విమర్శ అన్నది నోటికొచ్చినట్లు మాట్లాడుట కాదు. చదరంగములో పావులను ఆలోచించి కదిలించిన రీతిలో అక్షరములను ఏర్చి పేర్చి కూర్చవలె. అప్పుడే ఆమాటకు కలుగుతుంది అర్థము అడిమనకందిస్తుంది పరమార్థము. అందుకే
విమర్శ  చిరుజల్లులు కురిసినట్లుండాలి కానీ జడివాన లాగా కాదు. అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కానేకాకూడదు. హాయిగా పూల జల్లు వలె ఉండవలెను.
 ఎంత హాయిగా వుండాలనుటకు   సుమతి శతకకారుని మాటే కొలబద్ద :
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
అని అన్నాడు.
దీనిని సరదాగా నేను ఇంగ్లీషుతో కలిపి ఇట్లు చెప్పినాను (యతి ప్రాసలు చూడవద్దు, నవ్వొస్తే నవ్వుకొండి )
ఎప్పటికెయ్యది వాంటెడొ
అప్పటికా టాకు టాకి అన్యుల హార్టుల్
హర్టింపక హర్టవ్వక
ఎస్కేపై తిరుగు వాడు ఎక్స్పర్ట్ సుమతీ
కాబట్టి ఒక వ్యక్తిని 'మీకు బుద్దిలేదు' అనుటకంటే 'మీరు ఈ పని చేయుటలో బుద్ధినుపయోగిన్చినట్లు లేదు' అని అనుట ఎంత ఉభయతారకముగా ఉంటుందో గమనించండి. అందుకే మాట మహిమాన్వితమైనది.
అసలు ఈ చాటువు మాటను గూర్చి ఎంత మంచిమాట చెప్పిందో చూడండి
మాటలచేత దేవతలు మన్నన చెంది వరంబులిత్తురున్
మాటలచేత భూవరులు మన్నన చెంది పురంబులిత్తురున్
మాటలచేత భామినులు మన్నన చెంది మనంబులిత్తురా
మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్

దేవతలనుండి వరములు పొందుటకు, వారిని ముందు ప్రసన్నులను చేసుకొని పిదప మన కోరికలను నివేదించుకోనవలె. అందుకే సహస్రానామాలతో ఆష్టోత్తరాలతో ఆరాధిస్తూవుంటాము దేవతలను. అత్యంత ముఖ్యమైన ఈ చాటువు ఒక సారి చదువుదాము.
న తథా శశీ న సలిలం న చందన రసో న శీతలచ్ఛాయా
ప్రహ్లాదయతి హి పురుషం యథా మధురభాషిణీ వాణీ
మాట వరహాల మూట . నోరు మంచిదైతే వూరు మంచిదంటారు. పూర్ణచంద్ర బింబము కానీ, సమశీతల నీరము కానీ, మధురభాషణమును పోలలేవు. ఎప్పటికీ పరుషముగా మాటలాడరాదు.
అందుకే పెద్దలు
సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్
నభ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం భ్రూయాత్
ఏషా ధర్మః సనాతనః

అన్నారు. ప్రియకరమైన సత్యమును పలుకవలెను, అట్లని ప్రియము కలిగించే అబద్ధమును పలుకనేరాదు. మరి మనిషికి బాధను కూర్చే నిజామును పలుకవచ్చునా అంటే అదీ పనికిరాదు. ఇదే మన సనాతన ధర్మము. ఇంతమంచి ఉపదేశములు కలిగిన మన సంస్కృతిని, సంస్క్రుతమును విడువ వద్దు. మనకున్న అనేక శాస్త్రములలో ‘నీతి’ కూడా ఒక శాస్త్రము. శాస్త్రము అంటే శాసించేది. ఇది మారాడు. అర్థము చేసుకొని దానికి అనుగుణముగా మనము మారవలసినదే! ఇది పాశ్చాత్యుల సమయాన్ని బట్టి మారె Science కాదు.
తొందరపాటు తనముతో ఏర్పడిన ఆవేశము వలన మాటలాడే మాటలు ఇతరులను ఎంతకాలము నొప్పించుతాయో మనము ఊహించలేము . కావున కఠినమైన భావాన్ని కూడా కడుమెత్తగా చెప్పవలెను . మన మాట, తన కోరల తో చీరేసే పులి తన చంటి బిడ్డలను తన పళ్ళతో ఎంత మెత్తగా పట్టుకొని ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు పోతుందో, అంత మెత్త గా ఉండవలెను. ఇది సహజంగానూ సమకూరవచ్చు సాధన వలననూ సంభవించ వచ్చు.
ఒక చిన్న కథ చదవండి.ఒక విద్యాధికుడైన ముదుసలి వచ్చి ఒక దేశ ప్రధానిని చూడ వెళ్ళినాడు. విషయము ప్రధాని గారి కార్యదర్శి ఏర్పాటు చేసి ప్రధానికి చెప్ప మరచినాడు.ముఖ్యమైన పాత్రికేయులు మాత్రము అనుమతింపబడినారు. మాటలు చాలా సుహృద్భావ వాతావరణములో ముగిసినట్లు కనిపించినాయి. ఆ విద్యాధికుడైన ముదుసలి బయలుదేరిన వెంటనే శ్రవణ సాధనములట్లే వున్నాయని గమనించకుండా తన అనుచరులను, అసలతనిని లోనికి ఎందుకు రానిచ్చినారని గట్టిగా కేకలు వేసినాడు, తన భావము నణచుకోలేక. అంతే ,అంతా రసాభాసమే! ఆతను మళ్ళీ ఎన్నికలలో గెలుచుట జరుగలేదు.
అందుకే పెద్దలు,చంద్రుడు,చల్లని పానీయము,గంధపు పూత,హాయిని గొలిపే నీడ,సహజంగా మానవుని ఆనందపరుస్తాయి . కానీ వీటన్నిటికంటే మధురమైన సంభాషణ హృదయాన్ని ఎంత ఉల్లాస పరుస్తుందో చెబితే మాటలు చాలవు.
దీనిని సాధించ దలచినవారు ఆనన గ్రంధి (Face Book) లో వ్రాసే విమర్శ (comment) తో మొదలుపెట్టవచ్చు . చివరిగా పెద్దల మాటతో ఈ వ్యాసమును ముగించుచున్నాను.

ప్రియమైన మాటలు అందరిని దగ్గర చేస్తాయి కటువైన మాటలు దూరం చేస్తాయి

దీన్ని గురించిన ఈ శ్లోకం చూడండి-

ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యన్తి జన్తవఃl

తస్మాత్తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రతll

ఎదుటివారికి ప్రియంగా మాట్లాడటం వలన అందరూ సంతోషిస్తారు. మెచ్చుకొంటారు. అందుచేత ఓ సంఘజీవీ నీవు ప్రియంగా మాట్లాడుతూం ఉండు. మాటలకు దరిద్రం(లోటు) ఉండదుకదా  మాట్లిడితే పోయేదేముందీ - అని భావం

స్వస్తి.

Ravi Sudhakar Musunuri మంచి మాటలకు ప్రపంచంలో ఎప్పుడూ కొరత వుంటుంది. అందుకే వాటిని ఎప్పుడూ వృధా చేయద్దు.
Sadanandeeswaraiah Vallamkondu మంచి మాట చెప్పారు
VR Ganapathi మంచి మాట!!
Satyanarayana Choppakatla మీమాటలు వరాల మూటలు!
Sarada Rupakula మీరు రాసినవి అన్నీ నేను చదువుతాను. ఒక్కసారి కాదు ఇష్టం వచ్చినన్ని సార్లు. ఈ రోజు ఈ విషయాలు చదువుతుంటే మాకు తెలుగు చెప్పిన భాస్కరశాస్త్రిగారు గుర్తు వచ్చారు. మనసుకి హత్తుకొనేటట్లు చెప్పే వారు.
గురు శిష్య సంబంధం మీరు చెప్పిన విధంగా కాదు కదా teacher - student లా కూడ లేదు. చెప్పే వారికి చేవ లేదు వినేవారికి ఓర్పు లేదు. అందుకే వచ్చే జ్ఞానం లేకపోగా వెకిలిగా మారింది విద్యావ్యవస్థ.
ఉదయం నుండి నాకు ఎవరికీ శుభాకాంక్షలు చెప్పబుద్ది కాలేదు అంటే అతిశయోక్తి కాదు.
గురు పూజోత్సవ శుభాకాంక్షలు.”
Gowrishankar Gowri
Gowrishankar Gowri Mata gurinchi chala chakkaga Aneka sandarbalalo kavula matalu Teliyajesi mamulanu anandaparachinaru.Mee matalu maku mantrambulu. Meeru Bahumukhapragnasali. Namaste. Namaste.