Monday, 19 September 2022

గీతా వాక్యము

 

గీతా వాక్యము

https://cherukuramamohanrao.blogspot.com/2022/09/6-40.html

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే

హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।।6 - 40 ।।

పృథ పుత్రా,(పృథ అన్నది కుంతీదేవికి మరోకపేరు) శుభ కార్యాలలో నిమగ్నమైన సాధకుడు ఇహలోకంలో గాని ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని వినాశనానికి గురికాడు; నా మిత్రమా, మంచి చేసేవాడు, చెడుచేత ఎప్పటికీ జయించబడడు.

తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తుంది. నిజానికి తాత అన్న సంస్కృత శబ్దమునకునాయనతండ్రిఅని అర్థము. పెద్దలు గురువులు తమకన్నా చిన్నవారినితండ్రీ’ ‘నాయనాఅని సంబోధిస్తారు కదా! దీనర్థం "పుత్రుడా" అని. అందుకే గురుస్థానములో ఉన్న పరమాత్మ అర్జునుని తాత’ అని సంబోధించినాడు. ఆయన తన మార్గము లో ఉన్న వారి బాగోగులను తనే చూసుకుంటాడు అని చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించినాడు. వారు అత్యంత పవిత్రమైన కార్యములో నిమగ్నమై ఉన్నారు కదా!. మరియు "మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." మాటకు అర్థము కష్టాలు రావనికాదు, అటువంటివి ఏవి కలిగినా భగవానుడు సహకరించి తన భక్తులను కాపాడుతాడు. ఈ విషయమును ధృవపరుస్తూ జరిగిన నా జీవిత అనుభవము తెలియజేస్తాను. నన్ను నా శ్రీమతిని బంగళూరు విమానాశ్రయము చేర్చుటకు నా బావమరదులు తేరు (Car) లో పిలుచుకుపోతున్నారు. నా చిన్న బావమరిది చోదకుని (Driver) స్థానమును ఆక్రమించినాడు. బండి సుమారగు దూరము పోయినతరువాత అనుకోని రీతిలో వేగముగా వస్తూవున్న బండిని కట్టె ఊతతో నడిచే ఒక ముసలి ఆవిడ ఎంత వేగముగా దాటుకొన్నదో చూసినవారు చెప్పుటకు మాటలు అందవు. ఆంగ్లములో ఒక సామెత ఉన్నది A stitch in time saves nine’ అని. కానీ ఆ Stitch వేసిన వాడు పరమాత్మ. ఆ ముదుసలిని, నా మరుదులిద్దరిని, మాయిద్దరిని,  బండిని, మా ప్రయాణమును, దారిలో జరుగు రాకపోకలను, రక్షకభట చెరను తప్పించింది. చిత్త శుద్ధితో ఆయనను నమ్మినవారికి కీడు జరగదు. అసలు ఏమి జరిగినా ఆయనే దిక్కు అన్న అచంచల విశ్వాసము మనలో అత్యంత అవసరము.ఇహపర సాధనకు భక్తునకు భగవంతుడే తోడునీడయై ఉంటాడు అన్నఈ శ్లోకార్థము ఇప్పుడు ఈ ఉదంతములో రుజువయ్యినది కదా!

భగవంతుడు వేద రూపములో మనకు ధర్మమును ఉపదేశించినాడు. సాధారణంగా మనుష్యుల్ని వేధించే ప్రశ్న ఒకటి ఉంది. భగవంతుడు మనకు ప్రత్యక్షమవుతాడా? అతడు మన ఎదుట వచ్చి మనకేమయినా చెప్తాడా? మరి భగవంతుని అనుగ్రహము అంటే ఏమిటి?" అన్నది ప్రశ్న. ప్రశ్నకు కొందరు ఆధునికులు చెప్పే తప్పుడు సమాధానము ఏమిటంటే "ఇదంతా సామాన్య జనులను మోసం చేయ కల్పించిన కథగా కనబడుతుంది" అని వారి సమాధానము. భగవంతుని అనుగ్రహము ఎలా ఉంటుందో మన ప్రాచీనులు ఒక తగిన సమాధానం చెప్పారు.

దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ |

యం హి రక్షితుమిచ్ఛంతి బుద్ధ్యా సంయోజయంతి తమ్ ||

***భగవంతుని అనుగ్రహం అంటే అతడు ఒక కర్ర చేతితో పట్టుకొని పశువుల కాపరి పశువుల్ని తోలుకొని వెళ్లినట్లు జనం చుట్టూ తిరుగుతాడని అర్ధం కాదు, దాని అర్ధం ఏమనగా భగవంతుడు మనకు మంచిపని చేసే బుద్ధి పుట్టిస్తాడు. మనం పని చేసినా అది బుద్ది ప్రేరణ చేతనే జరుగుతుంది. ప్రేరణ ఫలానా పని చెయ్యాలనే కోరికవల్ల కలుగుతుంది. అలాంటి ప్రేరణ లేకపోతే ఎవ్వడూ ఏపనీ చెయ్యడు. పని చెయ్యాలనే కోరిక, ప్రేరణ ఎక్కడ నుండి వస్తాయి అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఒకటే. అవి భగవంతుని నుండే వస్తాయి. భగవంతుని ప్రేరణ లేకపోతే మనం మంచి పనులు చెయ్యాలనే బుద్ధి ఎలా కలుగుతుంది?

"పనులు చేయడానికి ప్రేరణ భగవంతుని నుండే వచ్చే పక్షంలో మంచి పనులు మాత్రమే చేయడానికి ప్రేరణ రావాలి కానీ, అలాంటప్పుడు చెడ్డ పనులు చెయ్యాలనే ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది" అని కొందరు ప్రశ్నిస్తుంటారు. దీనికి సమాధానం ఏమనగా, చెడ్డ పనులు చేయడానికి ప్రేరణ కూడా భగవంతుని నుండే వస్తుంది. అయితే భగవంతుడు మన చేత చెడ్డ పనులు చేయించాలనుకొంటాడా? అలాంటి భగవంతుడు ఏం భగవంతుడు? మన చేత అంత ఉన్నత స్థానంమీద ఉంచబడి, మన నుండి ఆరాధనలు అందుకొంటున్న భగవంతుడు మన చేత చెడ్డ పనులు చేయిస్తాడా అని ఒక ప్రశ్న. దీనికి శాస్త్రాలలో ఉన్న సమాధానం ఇది. నువ్వు పూర్వజన్మలో ఏవేవో పాపాలు చేసి ఉంటావు. వాటి ఫలాన్ని నువ్వే అనుభవించవలసి ఉంది. అందుచేత భగవంతుడు నీచేత పాప ఫలాన్ని అనుభవించడానికి దారితీసే పనులు చేయిస్తాడు. అందుచేత విషయంలో భగవంతుని బాధ్యత ఏదీ లేదు. ఆయనను దూషించడానికి అవకాశమేలేదు.

పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం జన్మల చక్రం అనాది కాలం నుంచి తిరుగుతూ వస్తుంది. సంసారం అనాది అనే విషయాన్ని శ్రీవేదవ్యాసులు బ్రహ్మ సూత్రాలలోనూ, శ్రీభగవత్పాదులు సూత్రాలకు వ్రాసిన భాష్యంలోనూ స్పష్టంగా చెప్పి ఉన్నారు. అందుచేత అనాదియైన సంసారంలో ప్రతి ఒక్కడు తన పూర్వజన్మలకర్మ ఫలితాలను అనుభవించాలని చెప్పడంలో దోషం ఏమీ లేదు. అశాస్త్రీయం ఏదీ లేదు.

ఇపుడు ఛాందోగ్యోపనిషత్తులోని, చిన్నదయినా రుజువర్తనను నిర్దేశించి ధర్మపథము వైపు నడుపు, ఒక కథను విందాము. ఒకసారి బ్రహ్మదేవుడు దేవ మానవ దానవ కూటములను తాను చేయబోవు ఉపదేశార్థమై రమ్మన్నాడు. మూడు వర్గములవారూ చెప్పినదే తడవుగా వచ్చి నిలచినారు. ఉపదేశము తృటిలో ముగిసింది. బ్రహ్మ దేవుడు 'దదద' అని మూడుమార్లని సభచాలించి వెళ్లిపోయినాడు. మూడు వర్గముల వారు కూడా తమ తమ నెలవులకు దీర్ఘ ఆలోచనా చిత్తులై వెడలినారు.

స్థావరము చేరి దేవతలు బృహస్పతిని తమ సందేహ నివృత్తికై ఆశ్రయించగా ఆయన ‘దేవతలుగా మీకు అన్ని సౌఖ్యములూ అమరినాయి. దుఃఖమన్నది మీ చాయలకు రాదు. అందుచే మీలో అహంకారము తావుచేసుకొంటుంది. అందుచేత మీకు ‘దామ్యత’ అనగా మిమ్ముమీరు నిగ్రహించుకొనుట అవసరము.

అదేవిధముగా మానవులు శ్రీరామునికే గురువైన వశిష్ఠుని వద్దకు పోయి తమ సందేహమును విన్నవించుకొన్నారు. ఆయన  వారితో ఈవిధముగా అన్నాడు. “ మీకు పరమాత్మ కష్టసుఖాలనిచ్చినాడు. కానీ యోచన చేయగల బుద్ధిని ప్రసాదించినాడు. సుఖమయ జీవితము గడుపుటకు వలయు సంపద సమకూర్చుకొను వనరులను ఒసంగినాడు, అనగా ఐశ్వర్యమును సమకూర్చినాడు. కానీ మీలో స్వార్థము అసూయ పిశినారితనము ప్రబలి సాటిమనిషికి సాయము చేయరు. కావున మీకు ‘దత్త’అనగా విరాళము గా నొసగుట అన్న గుణము, అవసరము. అసలు సంస్కృతపదమగు ‘దత్త’ కు అర్థము ఉదార గుణము. పరుల కష్టమును, పరుల అవసరమును తమ అవసరముగా భావించి చేతనయిన సహాయము చేయుట. ఇది మీరు పాటించవలసినది. ఈ విధముగా పాటించుతూ కొంతకాలము తరువాత మరుల రండి అని చెప్పినాడు. సరే యంచు వారు తమ నిజవాసములకు వెడలినారు.

ఇక రాక్షసులు కూడా తమ గురువగు శుక్రాచార్యుని వద్దకు పోయి తమ యొక్క ‘ద’ కు అర్థము అడిగినారు. అందుకు శుక్రాచార్యుడు “మీలో కౄరత, కర్కశత్వము, నిర్దాక్షిణ్యత ఎక్కువ. దయ, జాలి, సానుభూతి అన్నవి మీలో మృగ్యము. అందుకే మీరు ;దయధ్వం’ అనగా దయాగుణమును పెంచుకోవాలి అని చెప్పినాడు.

కొంత కాలము తరువాత వశిష్ఠులవారు చెప్పినట్లు మనుజ సమూహము ఆయన వద్దకు వెళ్ళినారు. ఆయన వారలనుద్దేశించి విధముగా చెప్పదొడగినాడుదేవతలకు రాక్షసులకు భిన్నముగా, భగవంతుడు మీలో ఇటు సుగుణములు అటు దుర్గుణములు ఒసంగినాడు. ఒకప్రక్క దయ మరొక ప్రక్క దానవత్వము కూడా ఇచ్చినాడు. కానీ మీలో తర్కించుకొనుటకు గానూ బుద్ధి అన్నదానిని ఏర్పాటు చేసినాడు. బుద్ధి మంచిని గూర్చీ ఆలోచించవచ్చు చెడుగును గూర్చీ ఆలోచించవచ్చు. నిర్ణయము మీ మీదే అధారాడుతుంది. అందువల్ల మీకు మూడులు అన్వయమౌతాయి. ఇప్పుడు కొంతమేరకన్నా దానగుణమును అలవాటు చేసుకొనియుంటారని తలచి మీకు ఉపదేశము చేయుచున్నాను. సరయిన అవగాహనతో మీరు మంచిని పెంచండి, మానవతను ఉంచండి, అహంకారమునకు అడ్డుకట్ట వేయండి. దయకు దాక్షిణ్యమునకు పెద్దపీట వేయండి, అహంకారమును దరికి రానీయకండి. మీకు శుభము కలుగుతుంది, పోయిరండి అని చెప్పినాడు.

అంతటి మహనీయుడు చెప్పినది ఆచరించమనితప్ప నేను నామాటగా వేరేమి చెప్పగలను. ఆయన ఉపదేశము మనకందరకూ శిరౌధార్యము.

స్వస్తి.

 

Saturday, 10 September 2022

ద్రోణాచార్యుడు – ఏకలవ్యుడు – అపప్రథ

 

ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు అపప్రథ

https://cherukuramamohanrao.blogspot.com/2022/09/blog-post_10.html

నన్నయ రాసిన 'మహాభారతం ,ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని 231 వ వచనం నుండి 245 వ పద్యం దాకా ఏకలవ్యుడి కధ సాగింది.

ద్రోణాచార్యులవారు, తన శిష్యగణముతో వేటకుక్కను తీసుకొని వెళుతున్నపుడు,  హద్దుమీరి మొరుగుచున్న కుక్క నోటిని మూయించిన ఏకలవ్యునితో నీవు ఎవరు అని అడిగినపుడు “మగధనరేశ్వరుడగు జరాసంధుని ప్రధాన సేనాపతియగు హిరణ్యధన్వుని కుమారుడను’ అని జవాబు చెబుతాడు.

ఇక్కడ తర్కబద్ధమైన ఒక ఆలోచన మీ ముందు ఉంచుతాను. 1. నేటి కుహనా మేధావులు తలచుచున్నట్లు దళితుడైన హిరణ్యధన్వుని జరాసంధుడు, తన మహాసేనాధిపతిగా చేసేనా! లేక 2. హిరణ్యధన్వుడు ఉచ్ఛవర్ణుడని ఒప్పుకొంటారా!

భారత్ అంటే Spiritual pursuit of the light of knowledge.

ఏతద్దేశే ప్రసూతస్య సకాశా తత్రజన్మన l

స్వ స్వ చరిత్రం శిక్షేణం పృథివ్యాం సర్వ మానవాఃll

దేశ విదేశములనుండి విధ్యార్థులు తమ తమ చరిత్ర తెలుసుకొనుటకు మన దేశపు నాటి విద్యాలయములకు వచ్చేవారు.

‘స విద్యాయా విముక్తయే’ విద్య ఒక్కటే విముక్తి ప్రసాదించుతుంది అన్నది మన పూర్వుల నిశ్చితాభిప్రాయము. నేటి విద్యాధనుల అభిప్రాయమది కాదు. ధనార్జన జనార్దనుడు. ధనసాధనకే నేటి విద్య పరిమితము. సంస్కృతి, మానవ సంబంధాలు, మానవతా విలువలు పూర్వుల గొప్పదనాలు ఏవీ అవసరము లేదు. ధనము సంపాదించుటకు చరిత్రను, ముఖ్యముగా రామాయణ భారతములను, వక్రీకరించి ఎందఱో సినీ ప్రముఖులు ఆకాశమే అంచుగా ధనార్జన చేసినారు. మరి వారు భూమి వదిలే కాలానికి డబ్బును వెంట తీసుకుపోయే వసతి కలుగుతుందేమో నా ఊహకు అందని విషయము. అటువంటి చలన చిత్రములలో ‘ఏకలవ్య’ ఒకటి. అందు ఏకలవ్యుడు ఆటవికుడు. ఆయనకు ఒక ప్రేమిక ఆమెతో సరసాలు ఒక ఎత్తు. అశేష ధనుర్విద్యాపారంగాతుడు, నియమ నిష్ఠాగరిష్ఠుడు, నీతి వర్తనుడు, ప్రభు విధేయుడు, మరియు వేదమూర్తి యగు బ్రాహ్మణుడు నగు ద్రోణాచార్యుడు ఎకలవ్యునితో ధర్మపన్నాలు వల్లే వేయిన్చుకొంటాడు. అక్కడ నిజానికి కారణము ఏకలవ్యుడు కాదు. ఆ పాత్రధారి యగు ప్రఖ్యాత నటుడు. ధర్మ సూక్ష్మము ఇక్కడ పనిచేయదు.  ఈ చలన చిత్రమునకు మరి భారతము ఆధారమే కదా! మరి ఏకలవ్యుని పాత్రధారి పోరాబాతుననైనా తన తండ్రి ని గూర్చి అనగా, మగధనరేశ్వరుడగు జరాసంధుని ప్రధాన సేనాపతియగు హిరణ్యధన్వుని కుమారుని నేను అని చెప్పుకొంటాడా! అట్లు చెబితే ఆ చిత్రము మొదటి రోజుకు మించి తెరపై కనిపించదు. నేటి విద్యాదికునికి అట్టి చలన చిత్ర కథలే తమ భారత ఇతిహాస పరిజ్ఞానమునకు ఆలంబనము. అప్పుడు అంతటి ద్రోణాచార్యుడయినా వారి దృష్టిలో కళంకితుడే!

ఇంకొకమాట ‘ధర్మ సంస్థాపన కొరకు జరిగినది మహా భారత యుద్ధము. తానెప్పుడూ ధర్మమూ యొక్క పక్షమని చెప్పినాడు శ్రీ కృష్ణభగవానుడు. జరాసంధుడు కృష్ణుని శత్రువు మరియు భీముని చేత వధింపబడినవాడు. కావున అతని సంతానము వారి సైనాధ్యక్షుడు ఆయన కుమారుడు ఏకలవ్యుడు పాండవులకు విరోధులే! అంటే వారు అధర్మమునకు బాసటగా నిలచినారు. ముందుచూపు కలిగినవాదగుటచే ఏకలవ్యుని బొటనవ్రేలు గురుదక్షిణగా తీసుకొన్నాడు. అందులో అతని దోసమూ లేదు స్వార్థమూ లేదు. కేవలము మృచ్ఛ ప్రతిమను గురువుగా భావించినా గురుదక్షిణ నొసగిన ఏకలవ్యుడు కూడా మనకు గౌరవ పాత్రుడు. నాటి కాలమున శస్త్ర విద్య అందరికీ నేర్చుకొన దగినదే కానీ అస్త్రవిద్య మంత్రయుక్తము కావున అది బ్రాహ్మలకు రాజులకు మాత్రమే విహితము. అందుకే కదా కర్ణుడు తానూ బ్రాహ్మణుడనని మోసగించి పరశురామునివడ్డ అస్త్రవిద్య నేర్చుకొని భంగపడినాడు.   

కావున ధర్మాధర్మ విచక్షణ లేకుడా వితండ వితర్క కుతర్కములు చేయరాదన్నది నా మదిలోని మాట.

 

స్వస్తి.

Thursday, 8 September 2022

కాలభైరవుడు

 

కాలభైరవుడు

https://cherukuramamohanrao.blogspot.com/2022/09/blog-post.html

కాలభైరవుడిని పరమేశ్వరునియొక్క  పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు దుష్టశిక్షకునిగా, భూత ప్రేతాది గ్రహపీడల్ని తొలగించే దేవునిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు.

భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా
...అంటుంది శతరుద్రసంహిత. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని ఎంతగానో కొనియాడుతాయి. అసలు భైరవుని స్మరించుకొనుటకు శివ మాయను ముందు ఛేదింవలసియుంటుంది. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోము. అసలు కాశీలోని కాలభైరవుని దర్శించినతరువాత విశ్వనాథుని దర్శించవలసియుంటుంది. మనము అది చేయనే చేయము. ఈ విధముగా మనము కాలభైరవుని మొదట చూడకపోవుటకు కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయ అను మబ్బు తెర తొలగిననాడు పరమేశ్వరుడి పూర్ణాంశ మయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుని ఆలయాలున్నాయి.

శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగి నేరుగా బ్రహ్మ లోకమునకు వెళ్తారు. బ్రహ్మ చుట్టూ శివమాయ ఆవరించి తన మనసులోని అహంకారము పెల్లుబికి నేనే ఆ మహాతత్వాన్ని అంటాడు, అదేవిధముగా సంశయము తీరక వారు విష్ణువు వద్దకు చేరగా ఆయన కూడా శివమాయా మోహితుడై తానే ఆ తత్వము అంటాడు. బ్రహ్మ విష్ణువుల నడుమ ఎవరు గొప్ప అన్న ఈ వివాదము పరమేశ్వరుడే తీర్చగలడని ఆ ఇరువురూ మహర్షులతో కలిసి శివుని వద్దకు వెళ్లగా, ఋషులు యజుర్వేద అంతర్గతమగు పురుష సూక్తమును భక్తి ప్రపత్తులతో  ఉచ్చరించగా, దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షమయినాడు.

ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహోదగ్రుడై అప్రయత్నముగానే  భృకుటి ముడి వేసినాడు. అందులోనుండి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించినాడు. అతడే కాలభైరవుడు. భయము కలిగించే రీతిలో, భయంకరంగా అరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ‘భయ రవుడు’ అయినాడు. కాల అన్న శబ్దము నలుపును సూచించుతుంది. కాలము విలయమునకు ప్రతీక. మరణించినవానిని ‘కాలమైనాడు’ అంటాము. ఆ విధముగా ఆయన లయకారకుడు. తామసగుణ సంపన్నుడు. అందుకే కాలభైరవుడు. పాపాలను పరిహరించేవానిగా ‘పాపభక్షు’ డయినాడు. శివుని ఆదేశానుసారము తన చిటికెన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికినది మొదలు,  ఆ తల కిందపడిపోకుండా భైరవుడి వ్రేలికి అంటుకుపోయింది. బ్రహ్మ విష్ణువులను ఆవరించిన మాయ అణగారినది. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేక పోయినాడు. ముల్లోకాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం ఊడిపడింది. దీంతో కాలభైరవుడు ఎంతగానో ఆనందించి విశ్వేశ్వరుని ఎంతగానో నుతించినాడు. అరమేశ్వరుడుకూడా ప్రసన్నుడై ఆయనకు కాశీనగర క్షేత్రపాలక పట్టమును ప్రసాదించినాడు.

ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే, కాలాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.

పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రపాలకుడు. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఉజ్జయిని లో కూడా కాలభైరవునికి మద్యమే నైవేద్యముగా సమర్పించుతారు.

కాశీ లోనిమణికర్ణికాఘాట్‌ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్‌ (శ్మశాన)బాబాగా కొలుస్తారు. ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైరవుడూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ అన్నవి కాలభైరవుని అష్టవిధ రూపములు. ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతారు. ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఈ స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును ముందుగా చెప్పి అయన దర్శనము చేయవలెను.

తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమl

భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసిll

కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. ‘కొందరు భైరవాశ్వములు..’ అని శ్రీనాథుడు చెప్పనే చెప్పినాడు కదా! కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. భైరవుడు, కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుని  నుండి ఆవిర్భవించినవాడే. తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.

మిగిలినది రేపు........

కాలభైరవుడు 2

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. వారణాసి లో కాలభైరవాలయాన్ని దర్శించిన తదుపరి మాత్రమే  విశ్వేశ్వరుని దర్శించి కాశి యాత్ర సఫలము చేసుకోనవలసియుంటుంది..

 ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణాలు ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు

‘ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌’

అని తమ దేవతార్చనలో చెప్పుకొంటారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవముగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.

కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే మొత్తము క్షేత్రానికి కాపలాదారు. రక్షించే కాపలాదారు. గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు. ఇది ఆనవాయితీ.

కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేప్పుడు కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.

కాల భైరవాష్టమి పరమ పవిత్రమైన రోజు. ఆరోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు.

ఈ కాలభైరవ పూజ అన్ని వర్గాలవారు చేయవచ్చును. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని, చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. శనివారం, మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించుట ఆచారము. కాలభైరవ పుజను సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. దీనిని ప్రదోష పూజ అంటారు.  కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.

ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది. రాహువుకు అధిపతి. రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని పఠించితే ఆయా అరిష్టాలనుండి వెంటనే విముక్తులౌతారు.

 మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవునిగా దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.

ఢిల్లీలో పురానా ఖిల్లా వెనక గోడకు దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు. రాజసూయయాగము పాండవులు చేయునపుడు నిర్విఘ్నంగా కొనసాగుటకు కాలభైరవుని తెచ్చి ప్రతిష్ఠించమంటే   ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చినట్లు చెబుతారు.  

తమిళనాడు లోని అరయలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో భైరవుడున్నాడు. అలాగే కారైకుడి, చోళపురం, అధియమాన్‌ కోట్టై, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.

భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.

మిగతది రేపు..........

కాలభైరవుడు 3(చివరి భాగము)

కాలభైరవాష్టకం - తాత్పర్య సహితం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం

వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్

నారదాదియోగిబృందవందితం దిగంబరం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన, సర్పమును యజ్ఞోపవీతము గా కలిగిన వాడు, చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు, దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడు, నారదాది మునులచే పూజించ బడిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చువాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

శూలటంకపాశదండపాణిమాదికారణం

శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

తాత్పర్యము: శూలము, టంకము(టంకము అన్న మాటకు నాణెము అన్న అర్థము కాకుండా ఉలి అన్న అర్థము కూడా ఉన్నది.), పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడునల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేని వాడు, ఆదిదేవుడు, నాశము లేనివాడు,సంపూర్ణ ఆరోగ్య దార్ఢ్యములు కలిగినవాడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన తాండవప్రియుడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం

భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్

వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తి ముక్తి దాయకుడుప్రాశస్త సౌందర్య విగ్రహుడు, శివుని రూపమైన వాడు (స్థిరమైన వాడు), భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, హృద్యమగు చిరు గజ్జెల మోత కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం

కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్

స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

తాత్పర్యము: ధర్మమనే సేతువును పాలించేవాడు అనగా భక్తునికీ భగవంతునికీ అనుసంధానమైనవాడు , అధర్మ మార్గములను నాశనము చేసే అధినాధుడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడుబంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడునిత్యుడు, అద్వితీయుడు, ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించే వాడు, అత్యంత భయంకరమైన తన కోరల ద్వారా పాతకముల తెగటార్చి, తద్వారా మోక్షమును కలిగించే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం

దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథకాలభైరవం భజే

 బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడుసర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమ, మహిమ,గరిమ,లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము  అనునవి అష్ట సిద్ధులు)కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం

కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

సకల భూత సంఘ నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు, కాశీ పుర వాసుల మంచి చెడును విచారించే వాడు, నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

           ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్

శోకమోహదైన్యలోభకోపతాపనాశనం

ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం

శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్

 అనంతమైన జ్ఞాన మూలమైన, సత్కార్యముల ఫలమును పెంచే, శోకము, మోహము, దారిద్ర్యము, కామము, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం పఠించే  వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును.

ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.

స్వస్తి.