Tuesday, 15 November 2022

మంత్రాలయము, గండి ఆంజనేయ క్షేత్రము, సర్ థామస్ మన్రో

 

మంత్రాలయము, గండి ఆంజనేయ క్షేత్రము, సర్ థామస్ మన్రో 

https://cherukuramamohanrao.blogspot.com/2022/11/blog-post.html

మొదట తెలిపిన రెండు క్షేత్రాలకన్నా ముందు అతి క్లుప్తముగా సర్ థామస్ మన్రో ను గూర్చి తెలుసుకొందాము. ఆపై  మంత్రాలయ రాఘవేంద్ర మహిమతో గండి ఆంజనేయ క్షేత్రముతో గల సంబంధమును గూర్చి తెలుసుకొందాము.

సర్ థామస్ మన్రో 27 మే, 1761-6 జూలై, 1827, స్కాట్లాండు లో జన్మించినాడు. ఈయన తండ్రి అలెగ్జాండర్ మన్రో గ్లాస్గో నగరంలో పేరుపొందిన వ్యాపారి. ఈయన తల్లి మార్గరెట్ స్కార్క్.  

థామస్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఇతడు 1789 సంవత్సరంలో మద్రాసు పదాతి దళంలో కాడెట్ గా చేరినాడు.

ఇతడు హైదర్ఆలీ తోను (1780-1783) తరువాత టిప్పు సుల్తాన్ తోను (1790-1792) తలపడి వారి రాజ్య పతనమునకు కారకుడైనాడు. టిప్పు సుల్తాన్ పతనం తరువాత రాయలసీమ ప్రధాన కలక్టర్ గా నియమించబడినాడు.

మన్రో తన సైన్యంతో 1800-1807 మధ్య కాలంలో తిరుగుబాటుదారులను నిర్ధాక్షిణ్యంగా అణచివేసినాడు. రాయలసీమ తరతరాలుగా అనావృష్టికి గురియైన ప్రాంతం. ప్రకృతి వైపరీత్యానికి తోడుగా, పిండారీల దోపిడులు, పాళెగాండ్ర దురాగతాలు సీమ ప్రజలను నానా యాతనలకు గురిచేసేవి. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని, సీమలో శాంతిభద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో. 1792లో జరిగిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి నిజాం పాలనలోనికి వచ్చినాయి. నిజాం పాలనలో అరాచకం మరింత పెరిగింది. పాలెగాళ్ళ అక్రమాలకు అంతులేకపోయింది. కడపజిల్లాలోని వేముల పాళెగాడు తనను తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. కొరవలు (కురబలు), యానాదులు, బేడర్లు, ఎరుకలు గ్రామాలపైబడి దోచుకోసాగినారు. అట్టి పరిస్థితులలో 12-10-1800న దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా మన్రో నియమింపబడినాడు. అతని క్రింద నలుగురు సబ్ కలెక్టర్లు వుండేవారు. ఆదవాని, హర్పనహళ్ళి, కడప, కంబంలలో వీరి కార్యాలయాలూ వుండేవి. మన్రోకు సహాయంగా మేజర్ జనరల్ డుగాల్డ్ క్యాంబెల్ నాయకత్వంలో ప్రధాన కేంద్రాలలో సైనిక దళాలుండేవి. అనంతపురం డివిజన్ మాత్రం మన్రో అధీనంలో వుండేది.

సిద్ధవటంలో వున్న కడప జిల్లా కార్యాలయము 1812లో కడపకు మార్చబడింది. 1828లో కంభం, దూపాడు, కోయిల కుంట్ల ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి కర్నూలు జిల్లాలో కలిపినాడు. 1911లో మదనపల్లె, వాయిల్పాడు ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి చిత్తూరు జిల్లాగా ఏర్పాటు చేసినాఆ కాలంలో రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళుండేవారు. వారిలో కడప జిల్లాలోని వేముల, చిట్వేలి, పోరుమామిళ్ళు, నరసాపురం, అప్పిరెడ్దిపల్లి, ఉప్పులూరు, కమలాపురం పాలెగాళ్ళు ముఖ్యులు. వీరు నిరంకుశులు. గ్రామాలను దోచుకునేవారు. బందిపోట్లుగా వారి అనుచరులుండేవారు. హైదరాలి, నిజాం, గోల్కొండ నవాబులు కూడా వారిని అరికట్టలేకపోయినారు. మన్రో తీవ్ర చర్యలతో వీరి ఆట కట్టించిననాడు. పాలెగాళ్ళను, కావలి వాళ్ళను కఠినంగా శిక్షించినాడు.

అరాచకంగా వున్న రాయలసీమ జిల్లాల్లో జిల్లా కోర్టులు, పోలీసు యంత్రాంగాలు ఏర్పాటు చేసినాడు. మన్రో కఠినచర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. పాలనాపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టినాడు.

1813 లో ఛార్టర్ చట్టానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ ముందు సాక్ష్యమిస్తూ, భారతదేశ సంస్కృతిని అనుసరించటం వల్ల ఇంగ్లండు లాభపడుతుందన్నాడు. భారతీయులు తయారుచేయు వస్తువుల నాణ్యత, ఐరోపాతో సమానమైనదన్నాడు. భారతీయ ప్రజల పట్ల, మేధావుల పట్ల, చేతి వృత్తుల వారిపట్ల ఆయనకు ఎంతో గౌరవముండేది.

భారతీయులు తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలో పాఠశాలలు నెలకొల్పినాడు. 1805 నాటికే మన్రో తెలుగు వ్రాయను, చదవనూ నేర్చుకొన్నాడు. రాయలసీమ రైతులతో ఆయన తెలుగులో మాట్లాడేవాడు. తన క్రింది అధికారులు కూడా విధిగా తెలుగులోనే వ్యవహరించాలని ఆదేశించినాడు. సి.పి.బ్రౌన్ ఆయన మాటలనెంతగానో గౌరవించేవాడు. గౌరవించుటయే కాదు ఆయన  ఆలోచనలను ఆచరణలోపెట్టి ఆంధ్రభాషకు తొలి తెలుగు నిఘంటువును, వేమన పద్య సంకలనమును, ఎన్నో తాళపత్ర గ్రంధపు నకళ్ళను ఆంధ్రులకు బహూకరించినాడు.

 థామస్ మన్రో రైతుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించినాడు. రైతువారీ విధానమును ప్రవేశపెట్టి తరతరాల నుండి పాలెగాండ్ర దోపిడీకి గురై అనేక ఇబ్బందుల పాలైన రైతులను ఆదుకున్నాడు. క్రీ.శ. 1804 లో కడప జిల్లాకు వరదలు వచ్చినప్పుడు చెరువులను, కాలువలను సకాలంలో మరమ్మత్తు చేయించి పుష్కలంగా పంటలు పండే ఏర్పాటుచేసినాడు. 1807లో మన్రో తన పదవికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివెళ్ళినాడు.

మన్రో1820 జూన్ 8 వ తేదీన మద్రాసు గవర్నరుగా తిరిగివచ్చాడు. అతడు పాలించిన ఏడు సంవత్సరాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేశాడు. ఇతడు  కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కలరా వ్యాధి సోకి 1827, జూలై 6వ తేదీన మరణించినాడు.

బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశస్వామి వారికి కానుకగా ఇచ్చినాడు. దీనినే మన్రోగంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు.

తాడిపత్రి లోని చింతల రాయస్వామి ఆలయ ఆస్థాన మంటపాన్ని, కళ్యాణ మంటపాన్ని మరమ్మత్తు చేయించినాడు. ఆలయంలో సక్రమంగా పూజలు జరిపే ఏర్పాటు చేయించినాడు. రాయదుర్గము లోని  ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించి ఆలయానికి మాన్యాలిచ్చినాడు.

ఇక ఇపుడు మన్రో గారికి మంత్రాలయానికి, కడప జిల్లాలోని గండి క్షేత్రానికి గల సంబంధమును ఒక పర్యాయము తిలకించుదాము.

మరోసారి మంత్రాలయమున జరిగిన అద్భుథమును౭ గూర్చి తెలుసుకొందాము. 

సర్ థామస్ మన్రో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లాకు చెందిన మంత్రాలయ గ్రామము ప్రసిద్ధ ద్వైత సాంప్రదాయానువర్తియగు రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న పుణ్యభూమి. 1800లో సర్ థామస్ మున్రో బళ్లారి కలెక్టర్‌గా ఉన్నప్పుడు, మద్రాసు ప్రభుత్వము మఠము మరియు మంత్రాలయ(మంచాల) గ్రామం నుండి వార్షిక శిస్తును సేకరించాలని ఆదేశించినా. ఈ ఉత్తర్వును రెవెన్యూ అధికారులకు అసాధ్యమగుటచే సర్ థామస్ మున్రోను నియమిస్తే, ఆయన విచారణ నిమిత్తం మఠాన్ని సందర్శించుట జరిగినది.

ఆయన రాఘవేంద్రునిపై భక్తి వినయములతో, తన టోపీ మరియు బూట్లు తొలగించి పవిత్ర ప్రాంగణంలోకి ప్రవేశించి శ్రీ రాఘవేంద్రస్వామికి నమమస్కరించి సమక్షమున నిలచినాడు. శ్రీ రాఘవేంద్రుడు  బృందావనం నుండి ఉద్భవించి, మన్రోకు మాత్రమే దర్శనమిస్తూ, దానమును  గురించి కొంతసేపు మాట్లాడినారు.

మంత్రాక్షతలు పొందిన మన్రోకు మాత్రమే యతిరాజు కనిపించేవాడు. ఆ మహనీయుని సంభాషణ మన్రోకు మాత్రమే వినిపించేది. కలెక్టర్ మన్రో వెనక్కి వెళ్లి మఠానికి, గ్రామానికి అనుకూలంగా ఉత్తర్వు జారీ చేసినాదు.

ఈ నోటిఫికేషన్ మద్రాసు ప్రభుత్వ గెజిట్‌లో చాప్టర్ XI మరియు పేజీ 213లో “మంచాలి ఆదోని తాలూకా” అనే శీర్షికతో ప్రచురించబడింది. ఈ వాస్తవము ఇప్పటికీ సెయింట్ జార్జ్ ఫోర్ట్(మద్రాసు) మరియు మంత్రాలయంలో భద్రపరచబడి ఉన్నది.

మూలం: శ్రీ రాఘవేంద్ర స్వామి కథ (మంత్రాలయం)

గండి ఆంజనేయ క్షేత్రము, సర్ థామస్ మన్రో 

గండి క్షేత్రము కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లె మండలమునకు చెందిన పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమునందలి వీరాంజనేయ చిత్రమును శ్రీరాములవారు తన అమ్ము ములికి తో చెక్కినట్లు ఐతిహ్యము.

పవిత్రమగు గండి క్షేత్ర మహాత్మ్యము మా పెద్దలు ఎంతో గొప్పగా చెప్పుకొనేవారు. ఈ దేవాలయము పాపాఘ్ని నది ఒడ్డున వెలసియుంది. నదికి కుడి ఒడ్డున  సుందర సురుచిర శోభలనందిస్తున్న ప్రకృతి. అందులోని భాగముగా  ప్రశాంత వాతావరణములో  వీరాంజనేయ దేవాలయం ఉంది. ఈ స్వామి విగ్రహము మరియు ఆలయము ఎలా ఏర్పడినవి అన్న పురాణం వినుటకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

త్రేతాయుగమున శ్రీ రామచంద్రుడు సీతమ్మను  వెతుకుతూ దక్షిణం వైపు వెళ్ళుచుండగా ఈ ప్రదేశమునకు వచ్చుట జరిగినది. అందమైన ఆహ్లాదమైన ఆ వాతావరణములో తనవైన పిల్ల తెమ్మెరలచే సేద తీర్చుకొంటూ వున్న వాయుదేవుడు శ్రీరాముని గాంచిఅవధి మీరిన ఆనందముతో ఎంతో నమ్రతను పాటించుతూ,  తన ఆతిథ్యమును స్వీకరించమని కోరగాశ్రీ రాముడు ‘నేను లంక నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళుసమయమున స్వీకరించగలనుఇపుడు సీతా వియోగబాధితునిగా స్వీకరించలే’నని చెప్పినాడు.

శ్రీరాముడు రావణసంహారము గావించి  సీతాలక్ష్మణ ఆంజనేయ సుగ్రీవాది సమస్త వానర మూకతో  పుష్పకవిమానారూఢుడైవచ్చుచున్నాడని విని వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతము పలికేందుకు  ఈ గండి ప్రదేశమును సిద్ధము చేసిలోయకు ఇటు అటు ఉన్న కొండ శిఖరములకు కాంచన పుష్ప పత్రయుక్తమగుతోరణమును కట్టిరాముడు దానిగుండా వచ్చులాగున తగినవిధముగా ఏర్పాటు చేసినాడు. బహుశ అచట విడిది చేసిన సమయములో శ్రీ రాముడు వాయుపుత్రుని చిత్రమును గీచియుండవచ్చును. ఆవిధముగా శ్రీరాముడు వాయుదేవునకు గూడా ప్రియమును చేకూర్చినాడు.కలియుగములో కూడా నిస్వార్థులై, అకళంకులై, భగవంతునిపై విశ్వాసం ఉన్నవారికి ఇది కనిపిస్తుంది అన్నది మా పూర్వులనుండి విన్నది. ఈ జన్మలో తమ కర్మలను సంపూర్ణంగా మరియు నిజంగా చేసిన వారు తమ చివరి రోజుల్లో బంగారు తోరణాన్ని చూస్తే ధన్యులని నమ్ముతారు. ఈ కాంచన పత్ర పుష్ప ప్రాలంబమును (బంగారు పత్రీ పూవులచేత తయారుచేయబడిన దండను) దర్శించిన వారికి పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు. సర్ మున్రో మద్రాసు ప్రెసిడెన్సీలో దత్తమండలం కలెక్టర్‌గా ఉన్నప్పుడుఈ బంగారు తోరణాన్ని కళ్ళారా చూసినాడు. ఈ అరుదైన సంఘటన కడప గెజిట్‌లో నమోదు చేయబడింది మరియు సర్ మన్రో డైరీలో కూడా నమోదు చేయబడింది. ఈ విషయమును గెజిట్ లోని ఈ క్రింది పుటలో యథాతథముగా ఆంగ్లములో చదువవచ్చును.అతి క్లుప్తముగా అందలి సారాంశమును తెలియజేస్తాను.మన్రో కు పదోన్నతి కలిగినపుడు బ్రిటీషు ప్రభుత్వము క్రొత్త అధికారి ఈయనను శమితుని (To be relieved) చేసేవరకూ యథాస్థానములోనే ఉండగోరినారు. ఊరక ఉండలేక తానూ అత్యంత ఆదరమునకునోచుకొన్న రాయలసీమ ప్రాంతము చూచుటకు చివరిసారిగా బయలుదేరి గండి కనుమ పాపాఘ్ని గుండా దాటుతూ వుండగా అత్యద్భుతమైన వసివాడని సువర్ణ పత్రపుష్పతోరణము రెండు కొండల శిఖరాగ్రములకు కట్టబడియుండుట చూసి అచ్చెరవందినాడు. కానీ అది తనకు మాత్రమే అగుపించిందని తెలుసుకొని ఆ విషయమును తన సేవకులతో చెబితే అది గాంచిన వ్యక్తి  భగవంతునికి ప్రియతముడౌతాడు అనిచెప్పగా తానూ అర్థముచేసుకొని సంతసించినాడు. ఈ ఉదంతమును కడప గెజిట్ లోతెలియబరచినయా ప్రతి యొక్క నకలును మీ ముందుంచుచున్నాను. ఆ ప్రయాణములో ఆయన గుత్తి వద్ద కలరాతో మరణించినాడు.


మహనీయుడయా మన్రో

ఆహమన్నది లేక తాను అన్యుండైనన్

ఇహసుఖము తుహినమనుకొని

గహనంబగు మోక్షపదము గాంచెను రామా!  (గహనము = చొచ్చుట మిక్కిలి కష్టమైనది)

మహనీయుల చరిత్ర విన్నా చదివినా మనసుకు  ఎనలేని ప్రశాంతత లభిస్తుంది.

స్వస్తి. 



Wednesday, 19 October 2022

 

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయము

https://cherukuramamohanrao.blogspot.com/2022/10/blog-post.html

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయము

https://cherukuramamohanrao.blogspot.com/2022/10/blog-post.html

బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది డ్డున ఉంది. ఈ ఆలయము తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ. దూరములో ఉన్నది.  ఈ ఆలయము 1490 మరియు 1509 మధ్య నిర్మించబడియుండవచ్చునని  అంచనా! బ్రిటిష్ పాలనా కాలము వరకు ఈ ప్రాంతము ఎన్నియో ఉడుదుడుకులకు గురియైనది. జిల్లాలో ముస్లిం సైన్యాలు కొల్లగొట్టని అతి కొద్ది దేవాలయాలలో ఇదియును ఒకటి. వారి దాష్టికమునకు గురికాని గుడి బహు అరుదు. లింగము ప్రతిష్ఠించబడిన ప్రదేశంలో గర్భగుడిలోకి నీరు ఎల్లప్పుడూ ధారగా పడుతూ  ఉండే ఈ చోద్యము చూచి తీరవలసినదే! ఇటువంటి అద్భుతములకు నిలయము ఈ భారత భూమి మాత్రమే! తురుష్కులు బహుశ ఎంత ప్రయత్నించినా స్వభావ సిద్ధమగు ఈ అపురూప వాస్తవమును రూపుమాపలేకపోయినారు. ఈ జలధార కారణముగానే  ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజుల సైన్యాధ్యక్షుడు  రామలింగ నాయుడు నిర్మించినారని చెబుతారు. ఆలయాన్ని నిర్మించడానికి శిల్పి ఎల్లంచారిని వారణాసి నుండి తీసుకువచ్చినట్లు వినిస్మృతులు(Records) సూచిస్తున్నాయి. పురాణాల ప్రకారంఋషి పరశురాముడు నివసించిన మరియు ధ్యానం చేసిన ప్రదేశముగా చెప్పబడినది.

ఈ శివలింగము నిస్సందేహముగా స్వయంభూలింగమే! పరశురాముని కాలమునకే ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నదంటే ఇది అత్యంత ప్రాచీనమైనదని చెప్పవచ్చును.  ఈ దేవాలయము అనగా ఈ స్వయంభూలింగము ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకము. అందమైన శిల్పకళా నిలయము ఈ దేవాలయము.  జిల్లా కేంద్రమగు అనంతపురమునకు 57కిలోమీటర్ల దూరంలో కర్నూలుకడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా తాడిపత్రి ఉంది.

ఆ ఆలయ విశేషాలను గూర్చి కాస్త తెలుసుకుందాం. ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన లింగముగా చెబుతారు కానీ ఇది రామేశ్వర లింగము వలె సికతముతో అనగా ఇసుకతో చేసినది కాదు. రాములవారు శిల్పులను రప్పించి నీటి ధారకు అనుకూలమగు లింగ ప్రతిష్ఠ చేయించుటకు, ఆయనకు అయోధ్య చేర సమయము చాలదు. పైపెచ్చు ఈ లింగము విలక్షణముగా ఉండుటచే ఇది రాములవారి ప్రతిష్ఠ కాకపోవచ్చును.  రాములవారు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణములలో చెప్పబడి లేదు. రాములవారు పరమేశ్వరుని లింగమును హనుమద్లక్ష్మణసీతా సహితముగా దర్శనము చేసుకొని యుంటే యుండ వచ్చును.

విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవమిస్తారు. వారి పరిపాలనా కాలంలో ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే ఉంది. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుని దర్శించినపుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ కుడ్యముల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు. పైన తెల్పిన శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో బాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాలలో ఉన్నట్లుగా కాకుండా, ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది. అలాగే ఏడాదిలో 365 రోజులు జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినానీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ బుగ్గ ఊరుతూనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.

పేరుకు పరమశివుడి దేవాలయమే అయినా ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయం పెన్నానది పడమటి తీరంలో ఉంది. ఆ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార గోపురాలున్నాయి. శిథిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడిప్రక్కన గోపురంలో భాగంగానే కోదండ రామ స్వామి ఆలయము, ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారంతో రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగి ఉంది. వీరభద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది. ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదకు ప్రాణం పోసీనారు. కొంత ఖజురహో శైలిని మరికొంత హంపీ శిల్పకళను చూడవచ్చు ఇచ్చట. ఈ దేవాలయమునకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.

ఇక్కడ మండపం నాలుగు స్థంభాలమీద నిర్మించబడిప్రతి స్థంభం తిరిగి నాలుగు చిన్న స్థంభాలమీద నిర్మించబడి వున్నది. పెన్నా నదీతీరంలో వెలసిన ఈ దేవాలయం వెనుకన స్మశానం ఉంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించటం అరిష్టమని పండితులు చెప్పటంతో మాహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసీనారు. ఇక్కడ శివుడు స్వయంభువు అని ముందే చెప్పుకొన్నాము.

అందుకే  నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపినా దోషం ఉండదన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్ధంభంముఖమండపంకళ్యాణ

మండపంఅంతరాళంగర్భగుడి అనే ప్రధాన విభాగాలున్నాయి. ఇంకా ఇదే ఆవరణలో కుడివైపున వీరభద్ర చండీ ఆలయాలు కళ్యాణమండపంరామాలయం పార్వతీ దేవి ఆలయాలున్నాయి. ముఖమండపంలోని స్ధంభాలను తాకితే సప్తస్వరాలు ప్రతిధ్యనిస్తాయంటారు. మండపాలపై రాతిపుష్పాలుఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహంసూర్యచంద్రులుకత్తి కనిపిస్తాయి. కుడ్యాలపై నాట్యకారిణల నృత్యభంగిమలు కనువిందు చేస్తాయి. మరియు శ్రీమహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలచినారు శిల్పులు. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫాల్గుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

పెన్నకు నీధనుస్సునకు పెద్ద నిబంధము కానవచ్చులే

ఎన్నగ నీ పినాకమది ఏర్పడె చూడ పినాకినౌచు తా

తిన్నగచేర పెన్న దగు తీరము లందున తిష్ఠ వేయుచున్

మన్నన పొందినావుభవ  మాకగు కామన లెల్ల తీర్చుచున్

పెన్నా తీరమున కొన్ని దేవాలయాలు: రామ తీర్థంసోమశిలఘటిక సిద్దేశ్వరంనెల్లూరు మూలస్థానేశ్వర ఆలయముదానవులపాడు

దేవుని కడప,నందలూరు.పుష్పగిరిఈ విధముగా చెప్పుకొంటూ పోతే చెంతాడే అవుతుంది. ప్రతి శివాలయమూ భక్త జన సందోహముతో రద్దీగానే ఉంటుంది.

స్వస్తి.   


Sunday, 16 October 2022

భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము -ఒక విమర్శ

 

భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము -ఒక విమర్శ

https://cherukuramamohanrao.blogspot.com/2022/10/1-14.html

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ

మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 1 - 14 ।।

ఆ తరువాత, పాండవ సైన్యం మధ్య లోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథం లో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు.

కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన తరువాత, శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు, అద్భుతమైన రథంలో కూర్చొని వుండి, భయ రహితులై, తమ తమ శంఖాలని శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది.

సంజయుడు శ్రీ కృష్ణుడికి 'మాధవ' అన్న పేరు వాడినాడు. 'మా' - సౌభాగ్య దేవతను సూచిస్తుంది; 'ధవ' - అంటే భర్త. శ్రీ కృష్ణుడు తన విష్ణు మూర్తి రూపంలో, అదృష్ట/సౌభాగ్య దేవత అయిన లక్ష్మీ దేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో యుద్ధం లో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం అంతర్లీనముగా సూచిస్తున్నది.

పాండవులు అంటే పాండు రాజు కుమారులు అని. ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా 'పాండవ' అని సంబోధించవచ్చు. ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది. అతను కూర్చున్న అద్భుతమైన రథం అగ్ని దేవుడు ప్రసాదించినది. మరి ఆగమని దేవుని రథము అంటే ఎంతో ప్రకాశవంతమైనది అని కదా అర్థము. దానికితోడు లక్ష్మీ దేవికే భర్త కావున ఎంతో వెలుగు జిలుగులు కలిగిఉ ఉంటాడు వెంటనున్న అర్జునుడు పాండవుడు. అత్యంత ప్రకాశమైన వాడు మరియు స్వచ్ఛమైన వాడు. తెల్లని గుర్రాలు పూన్చబడిన బ్రహ్మాండమైన రథము. అంటే ఆర్థము పాండవులకు రాబోవు వైభవమును చాటుచున్నది.

‘శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ’ అన్నది శ్లోకములోని మొదటి పాదము. తరువాత శ్లోకములోని రెండవ పాదము ‘మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః’. ఇందులో ‘మాధవః’ అన్న పదము ప్రత్యేకతను కలిగి ఉన్నది.

 శుద్ధలక్ష్మిః, మోక్ష లక్ష్మీ, జయలక్ష్మీ,సరస్వతీl

 శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాll

అని శ్రీ సూక్తములోని లక్ష్మీ స్తవము తెలియజేస్తూ ఉన్నది ‘మా’ అన్న మాటకు ‘లక్ష్మి’ అని అర్థము.

‘లక్ష్మి పద్మాలయా పద్మా , కమలా , శ్రీహరి , ప్రియా l

ఇందిరా లోకమాతా మా రమా మంగళ దేవతా ll

భార్గవి లోక జనని క్షీరసాగర కన్యకాl  అని అమరకోశము. కావున ‘మాధవుడు మాధ్యందిన మార్తాండుడు, పున్నమి వెన్నెలరేని పోలిక అర్జునుడు. రథమును గూర్చి మరికాస్త విశ్లేషించుకొందాము. 

 అర్జునుని  రథములో మధ్యన జ్వాలాయమాన ప్రభాసాంగుడై అర్జునుడు రథియై రథము మధ్యన కూర్చొని భాసిల్లుచున్నాడు. క్రింద సారథియై శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మచారునివైన నీకు ఈ ప్రపంచమునే జయింపజేసి ఇప్పించగలనన్నట్లు కూర్చుని యున్నాడు, యుధా మన్యువు ఉత్తమౌజసుడు అన్న, దుష్టద్యుమ్నునికి తమ్ముని వరుసయగు మహారథులు కుడిఎడమల చక్ర రక్షకులుగా ఉన్నారు. తేరి టెక్కమున ఆంజనేయస్వామి యున్నాడు. ఇంతటి మహద్వైభవము కలిగిన రథము ఈ జగతిన     వేరెక్కడ ఉంటుంది.

 

కఠోపనిషత్తు లో పై విషయమును, ఒక రథము ఉదాహరణ తీసుకొని ఆ ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడిన విషయాలను తెలుసుకొందాము.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తుl

బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చl

ఇంద్రియాణి హయానా హుర్విషయాంస్తేషు గోచరాన్ ।

ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణఃll (1.3.3-4)

పై కఠోపనిషత్ శ్లోకము ఈ విధముగా చెబుతూ వుంది.  ఐదు గుర్రాలను పూన్చిన ఒక రథం ఉంది; ఆ గుఱ్ఱాలకు పగ్గాలు కట్టబడి ఉన్నాయి; ఆ పగ్గాల కొసలు  రథ సారథి చేతిలో ఉన్నాయి; ఆ రథము మధ్యలో రథి లేక రథికుడు కూర్చొని ఉన్నాడు. అతడు  సారధికి దిశా నిర్దేశం చేస్తే  సారధి పగ్గాలతో గుఱ్ఱాలకు దిశా నిర్దేశం చేయగలడు. కానీ, ఈ విషయంలో, రథికుడు నిద్రపోతున్నాడు, మరి సారధికి చెప్పేదెవరు. మరి సారధి గుఱ్ఱాలకు ఏమి చెప్పగలడు. చెప్పేవాడు లేకుంటే గుఱ్ఱాలు గూడా ఏమి చేయగలవు.

కాసేపు శ్రీకృష్ణార్జునులను మరచి రథము, రథికుడు, పగ్గముల గుఱ్ఱములు సారథిని గూర్చి ఆలోచించుదాము.

ఈ ఉపమానం లో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు. ఈ ఐదు ఇంద్రియాలు రెండు రకములు. అవి కర్మేంద్రియ పంచకం: వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ

జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, .ఘ్రాణం = ముక్కు, పగ్గాలు మనస్సు; రథ సారధి బుద్ధి; వెనుక కూర్చున్న రథికుడు శరీరి. ఇంద్రియములు (గుర్రాలు) భోగాలను కోరుతాయి. మనస్సు (పగ్గాలు) ఇంద్రియములపై (గుర్రాలపై) నియంత్రణ చేయలేకపోతూ ఉంది. బుద్ది (సారధి) లాగవలసిన పగ్గాలు (మనస్సు) గుఱ్ఱముల లాగుడుచే వివశమైపోపోతున్నాడు. కాబట్టి భౌతికంగా బద్ధుడైఉన్న స్థితిలో, అయోమయానికి గురియై ఉన్న శరీరి, బుద్ధిని సరియైన దిశలో నడిపించలేక పోతున్నాడు. అప్పుడు, రథము పోకడను ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను శరీరి అనుభవిస్తూ ఉన్నాడు. కానీ సంతృప్తిని పొందలేక మాయాజాల వంచితుడై ఎదో నిర్వేదమునకు గురియై ఉన్నాడు. అట్టివాడు సుఖదుఃఖాలకు అతీతమై సాక్షీభూతమైయొప్పు జీవాత్మ లేక అంతరాత్మకు ఏమి సమాధానమునివ్వగలడు. ఈ రథంలో కూర్చునిఉన్న శారీరి అనగా రథికుడు భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. మనసుకు శాంతీ లేదు. ఆకారణముగా అంతరాత్మ అనిర్వచనీయమగు ఆనందమును పొందలేదు.

కానీ, జీవి లేక శరీరి తను ఉన్నతమగు స్వభావముతో మసలగలిగితే, బుద్ధి అప్పుడు, తక్కువ స్థాయి అస్థిత్వాలయిన మనస్సు, ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది. అప్పుడే రథం శాశ్వత ఆనందము దిశగా కదులుతుంది. ఈ విధంగా, తక్కువ స్థాయి స్వరూపాన్ని (ఇంద్రియములు, మనస్సు, బుద్ధి) నియంత్రించటానికి ఉన్నతమైన ఆత్మ (జీవాత్మ)ను జాగృతము  చేసుకొంటే రాతియగు శరీరి సకల సల్లక్షణ నిదానమై నిలువగలుగుతాడు. పై భగవద్గీత శ్లోకములో ఆత్మా రూపియై శరీరములో వెలసితున్న పరమాత్మ బుద్ధిని అనగా సారధిని నియంత్రించుచున్నాడు. ‘ధీయోయోనః ప్రచోదయాత్’ అనియె కదా మనము పరమాత్మను సంధ్యావందనములో ప్రతిదినమూ వేడుకొనేది.   

వాస్తవానికి పై భగవద్గీత శ్లోకమునకు ఇప్పుడు మనము చెప్పుకొన్న ఈ కఠోపనిషత్తు శ్లోకము ఎంతగా అతికినట్లు సరిపోతుందో చూడండి. ఇక్కడ శరీరి అనగా రథికుడు అర్జనుడు. సారధియగు బుద్ధి స్వయంగా పరమాత్మ చే ప్రచోదితమగుచున్నది. ఆయన మనస్సును నియంత్రించుతూ దానివలన పంచేంద్రియాలను కట్టడి చేస్తూ శరీరి యగు అర్జునుని ధర్మము తెలిపి కార్యమునకు ఉన్ముఖుని చేస్తున్నాడు. అశ్వములు తెల్లనివి. అనగా స్వచ్ఛతకు చిహ్నము. రథమా విశాలమైనది. అది శరీరము. రాబోవు సామ్రాజ్యమునకు ప్రతీకగా కూడా ఊహించుకొనవచ్చును. మనము ఇపుడు దానిని శరీరముగానే భావించుదాము. సారధి సకల సంపత్స్వరూపమైన లక్ష్మీ దేవి భర్త. అనగా ఆయన బుద్ధిని ఆవహించియున్నాడు  ఇక గెలుపునకు ధర్మ సంస్థాపనకు అడ్డమేమి ఉంటుంది.

మిగిలినది మరొక మారు.......

భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము -ఒక విమర్శ 2

 

కఠోపనిషత్తు తృతీయ వల్లి లోని 5, 6 శ్లోకములను చూడండి.

యస్త్వవిజ్ఞావాన్ భవత్య యుక్తేన మనసా సదా ।

తస్యేన్ద్రియాణ్యవశ్యాని దుశష్టాశ్వా  ఇవ సారథేః ॥ 5

యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా ।

తస్యేన్ద్రియాణి వశ్యాని సదాశ్వా ఇవ సారథేll6

ఎక్కడ విజ్ఞాన హీనుడైన సారధి ఉంటాడో, యుక్తము గాని కళ్ళెములు  లేక పగ్గములు ఉంటాయో, వశము గాని గుఱ్ఱములుంటాయో, ఆ రథికుడు సాధించదలచినదేదీ సాధించలేడు. అదే విజ్ఞానవంతుడగు సారధి, యుక్తమగు కళ్ళెములు, వశము లోనున్న గుఱ్ఱములుంటాయో, ఆరథికునికి

రథమునకు సంబంధించిన ఏ పనయినా హస్తామలకమే!

మరి రథికుకుడగు అర్జునునికి అన్నీ అమరినట్లేకదా! మరి విజయము కరతలామలకమే కదా!

మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుఃఅని తమ తమ శంఖములగు పాంచజన్యము, దేవదత్తములను పూరించినారు అని బహువచనములో చెప్పబడినది. మరి ఇంతవరకూ రథికుని గూర్చి ఏకవచనములో చెప్పి ఇప్పుడు బహువచనములో చెప్పబడుతూ ఉన్నది ఎందుకు?

ఈ విషయమును ఒకపరి గమనింతము.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా

 సమానం వృక్షం పరిషస్యజాతే,

తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్య

నశ్నన్నన్యో అభిచాకశీతి.

 

 ఒక చెట్టును రెండు పక్షులు ఆశ్రయించి ఉన్నాయి. ఆ రెండు పక్షుల్లో ఒకటి ఆ చెట్టు ఫలాల్ని ఆరగిస్తూ ఉన్నది. రెండవ పక్షి ఆ ఫలాల్ని ఆస్వాదించకుండా, జరుగుతున్న దానినంతటినీ చూస్తూ ఉన్నది. ఈ చెట్టు- రెండు పక్షులు అన్న ఉదాహరణ ద్వారా శ్వేతాశ్వతరో పనిషత్తు జీవేశ్వరుల స్థితిగతులను అభివర్ణించింది.

ఈ విశ్లేషణనొకపరి గమనించండి.

 చెట్టు అంటే మానవదేహం. ఆ చెట్టును ఆశ్రయిం చిన రెండు పక్షుల్లో ఒకటి జీవుడు, రెండవది ఈశ్వ రుడు. జీవుడు ఈ దేహంతో ఉంటూ కర్మఫలాల్ని అను భవిస్తూ, సుఖదుఃఖాలకు లోనవుతూ ఉన్నాడు. ఈశ్వ రుడు ఈ దేహంలో ఉంటూనే, కర్మల, కర్మఫలాల సంపర్కం లేక, సుఖదుఃఖాలకు లోనుకాక, కేవలం సాక్షి స్వరూపంగా సర్వాన్ని దర్శిస్తున్నాడు.

 

 ఖాదిత్య దీపితే కుడ్యే దర్పణాదిత్య దీప్తివత్,

 

 కూటస్థ భాసితో దేహో ధీస్థ జీవేన భాస్యతే.

 

 ఇదే విషయాన్ని విద్యారణ్యస్వామి ‘వేదాంత పంచ దశి’లో ఒక మైదానంలోని గోడను తీసుకొని చెప్పారు. ఆ గోడపై ఎట్టి కప్పూలేదు. ఆకాశంలోని సూర్యుని కాంతి సరాసరి ఆ గోడపై ప్రసరిస్తోంది. ఆ గోడకు ఎదురుగా ఎన్నో అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాల్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అద్దాల నేకం. ప్రతిబింబాలనేకం. అద్దా ల్లోని సూర్య ప్రతిబింబాల నుంచి బయల్పడిన కాంతివలయాలెన్నో ఆ గోడపై పడుతున్నాయి. ఇప్పుడు గోడపై రెండు ప్రకాశాలున్నాయి. ఒకటి గగనంలోని సూర్య ప్రకాశం. రెండవది దర్పణాల్లోని సూర్య ప్రతిబింబాల ప్రకాశం. ఈ రెంటికీ ఆధారం సూర్యుడే. తేడా అల్లా, మొదటి ప్రకాశం సరాసరి సూర్యుని నుంచి గోడపై పడుతున్నది. రెండవ ప్రకాశం సూర్యుడు అద్దాల్లో ప్రతిబింబించగా, ఆ ప్రతిబింబాల నుంచి వెల్వడినది.

ఆ గోడలాగే మానవ దేహంలో రెండు చైతన్యాలు ఉన్నాయి.  మొదటిది దేహంలో ప్రకాశించే పరబ్రహ్మ చైతన్యం. రెండవది బుద్ధి అన్న దర్పణాల్లో పరబ్రహ్మ అన్న సూర్యుడు ప్రతిబింబంగా, ఆ ప్రతిబింబం నుంచి వెల్వడిన అభాస చైతన్యం. ఇదే జీవచైతన్యం. ఈ రెంటికీ ఆధారం పరబ్రహ్మ చైతన్యమే. అయినా మొదట దానికి మాధ్యమం లేదు. రెండవ దానికి బుద్ధి అనే మాధ్యమం ఉంది. బుద్ధి అన్న మాధ్యమం నుంచి వెల్వ డిన జీవ చైతన్యం అభాస చైతన్యం, బుద్ధి వాసనలకు అనుగుణంగా కర్మల్ని చేస్తూ, కర్మఫలాల్ని సుఖదుః ఖాల్ని అనుభవిస్తుంది. పరబ్రహ్మ చైతన్యం కేవలం సాక్షిగా సర్వాన్నీ దర్శిస్తూ ఉంటుంది.

పైన చెప్పిన ఆ రెండు విషయముల అనురూపమే శ్రీకృష్ణార్జునులు.

 

 బుద్ధి అన్న మాధ్యమం ద్వారా వెల్వడుతూ, ‘నేను’ గా అభివ్యక్తమయ్యే అభాస చైతన్యం, బుద్ధి వాసనలతో తాదాత్మ్యాన్ని పొంది, కర్మల్ని చేస్తూ కర్మఫలాల్ని, సుఖా ల్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే, జీవ భ్రాంతిలో మిగిలి పోతాడు. అలాకాక శరీర ఇంద్రియ మనః బుద్ధి చిత్త అహంకారాలనే తొడుగుల్లో ఉంటూనే, బుద్ధి వాసన లతో కాక, పరబ్రహ్మ చైతన్యంతో నిశ్చయాత్మకమైన తాదాత్మ్యాన్ని పొందితే, జీవన్ముక్తుడవుతాడు.

 

 జీవరూపంలో ఉన్న ఈ జీవన్ముక్తుడే, కర్మల్ని చేస్తూ కర్మఫలాన్ని పొందక, తన కర్మల ద్వారా లోకా లకు మహోపకారం చేస్తూ, మహాత్ముడై ప్రకాశిస్తాడు.

కావున ఆయతన తోడ్పాటు అంతర్బాహిరముగా పరమాత్మను కలిగిన ధనమ్జయునికి ల్భిమ్పని జయము ఏముంటుంది. అందుకే ఆయన జయుదయినాడు. ఇంకొక్క విషయము చెప్పి ఈ వ్యాసమును ఇంతటితో ముగించుతాను.

సాలు పాంచజన్యము అంటే 5 జ్ఞానేద్రియముల అధిపతి ఈ 5 జ్ఞానేంద్రియములు మనసునకు ఆధీనము. మనసునకు మరోపేరు హృషీకము. అంటే పైన తెలిపిన జ్ఞానేంద్రియములగు

త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి

ఘ్రాణం = ముక్కు అన్న ఈ 5 ను నియంత్రించే మనసును ఋషీకము అంటారు. దానిఅదిపతియే పరమాత్ముడు. ఆయన సదా అర్జునుని ఆత్మయై కొలువున్నాడు. కావున పాంచజన్యము ఋషీ కేశుడు పూరించినాదని చెప్పబడినది. ఇక దేవదత్తము ధనంజయునిచే పూరింప బడినది. ఖాండవదహన కాలమున అది దేవతామూర్తియగు అగ్నిచే ఇవ్వబడుచే దేవదత్తమయినది.

దానిని పూరించిన వాడు ధనంజయుడు. నిజానికి ఆయన సాధనంజయుడు. సమరమునకు, అది అంతః సమరము కావచ్చు, బాహ్యసమరమూ కావచ్చు., దేనికయినా తపః సంపన్నుడయిన ఆయన సర్వదా సిద్ధముగా ఉంటాడు. అందుచే ధనంజయుడైనాడు.

ఇన్నివిధముల ఆ ఒక్క శ్లోకము మహాభారత విజయమును ఆదిలోనే సూచించుచు న్నది.

స్వస్తి.  


Saturday, 1 October 2022

రామాయణ పారాయణ శ్లోకములు

 

రామాయణ  పారాయణ శ్లోకములు

(మొదటి శ్లోకము అవాల్మీకము)

https://cherukuramamohanrao.blogspot.com/2022/10/15.html

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జైః అసి ఖేట పుస్తక సుధాకుంభం కుశా ద్రిం హలం

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్

సర్వారిష్ట నివారకం శుభకరం పిగాక్ష మక్షాపహం

సీతాన్వేషణ తత్పరం కపివరం,కొటీందు సూర్య ప్రభం

లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవు సమ్మానినం

దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్స దూతం భజే

భావం ——వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతోను

అనేక అలంకారాలతో ,దివ్య కాంతి తో ,దేదీప్యమానమైన 15 నేత్రాలు ,పద్మాలవంటి హస్తాలు

ఖడ్గం,డాలు,పుస్తకం,అమృత కలశం ,అంకుశం ,పర్వతం ,నాగలి ,మంచంకోడు (ఖట్వాంగం) పాము, చెట్టు, ధరించిన వాడు , మరియు అన్నివిధములైన అరిష్టములను తొలగించే వాడు, పసుపు వన్నె కలిగిన నేత్రద్వయము కలిగిన వాడు,సీతాన్వేషణ తత్పరుడు,కపిశ్రేష్ఠుడు,కోటి సూర్య చంద్ర ప్రకాశము గల్గినవాడు , లంకాద్వీపమును భయభ్రాంతి గావించినవాడు, సుగ్రీవాది సకల సన్నిహితులచే సంమానింప బడిన వాడు . దేవేంద్రాది సకల దేవతలచే నుతిమ్పబదేడు వాడు,అగు శ్రీరాముని దూతయైన హనుమంతునికి నమస్కరించుచున్నాను.

శరణాగతుడై వచ్చిన విభీషణునికి రక్షణ ఇవ్వవలదని ఒక్క హనుమంతుడు తప్ప అందరూ

చెప్పినవారే ! కానీ రాముడు వారందరితో ఇతడు" 'రాఘవం శరణం గతః'శరణ్య శరణం గతః'

అనినాడు.నాకు ఇతడు ఇకపై మిత్రుడే, శరణాగతుడు కూడా కాదు." అని నొక్కి

వక్కాణించుతాడు. అసలు ఈ మాట చూడండి ఎంత సంస్కారవంతమైనదో!

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ

ఒక్కసారి నేనే త్రాతనని నమ్మి, నేను నీవాడను అని శరణు కోరినవాని, సర్వ భూతములనుండి కూడా రక్షణ కల్పించుట నా వ్రతము. మానవ, దేవ, దానవ, పశుపక్ష్యాది సమూహముల నుండి ఎవరైనాసరే ఏవయినా సరే నా అభయమునకు అర్హులు. అసలు ' సకృత్ +ఏవ 'అనడములోనే అసలుమర్మము దాగివుంది.ఒక్కసారి 'రక్షమాం' అని దృఢమైన నమ్మకముతో అంటే చాలుఆయన రక్షకునిగా నిలుస్తాడు. అసలది ఆయన వ్రతము. కానీ మనది 'ఏరు దాటించితే ఎంగన్న' వ్రతము. భక్తీ, యోగము, తపస్సు ఎన్నివున్నా పరమాత్మ పై అచంచల విశ్వాసము అత్యంత ప్రాముఖ్యము. ఈ శ్లోకము సర్వులకూ సర్వదా పఠనీయము. శ్రీ రాముడు ఎంతటి మహానీయుడో చూడండి.పాశ్చాత్య పుస్తకాలలో ఇటువంటి కమనీయ గుణాభిరాముడు భూతద్దము పెట్టి వెదకినా దొరకడు.

ఇంకొక ముఖ్యమైన విషయం :

ధర్మాత్మా సత్యసంధస్యరామో దాశరధిర్యధిఃl

పౌరుషేచాప్రతిద్వన్ద్వః శరైనంజహిరావణింll

ఈ మాటలనే మంత్రముగా జేసి రావణ కుమారుడైన ఇంద్రజిత్తు పైకి వదిలి అతనిని

కూల్చినాడు. అసలు ఈ మాటల సారాంశమేమి? అవి మంత్రమని మనమేవిధముగా

చెప్పగలము. చంపేది లక్ష్మణుడు చచ్చేది మేఘనాధుదనబడు ఇంద్రజిత్తు. కానీ బాణము పై

ఆవాహన చేసిన మంత్రము రామునికి సంబంధించినది. అది విశేషము. అసలు ఈ

విశేషములో గల విశేషము ఎంతో ముఖ్యమైనది ఒకటి ఉంది. ఈ శ్లోకములో మూడు

విశేషణములు రామునికి వాడబడినాయి. 1. ధర్మాత్మ 2. సత్యసంధస్య 3.పౌరుషేచ

అప్రతిద్వందః, ఈ మూడిటినీ మన మూడవ కన్నుతో ఒకసారి చూస్తాము.

1. చెట్టు చాటునుండి వాలిని చంపిన వ్యక్తీ ధర్మాత్ముడా?

2. తండ్రికి, ప్రజలకు యౌవరాజ పట్టాభిషేకమునకు ఇచ్చగించినట్లు తెలిపి తెల్లవారిన వెంటనే

అడవులకు పోవుట సత్యసంధత అనిపించుకొంటుందా?

3. ఖరునితో యుద్ధము చేయునపుడు మూడడుగులు వెనుకకు తగ్గిన రాముడు

పౌరుషమందు ఎదురులేనివాడా?

1.   పై సందేహమును వాలియే రామునితో వెలిబుచ్చినాడు. దానికి రాముడిచ్చిన జవాబు  ఒక పర్యాయము చూద్దాము. శ్రీరాముడు వాలిని సంబోధించడమే ఆయన యొక్క పరిణతిని తెలుపుతుంది. ఆయన వాలిని “వాలీ! నీవు వయసు వచ్చిన బాలుడవు. నేను  కాననలకు బయలుదేరు సమయమున భరతుడు రాజ్యము తనకు వలదని పట్టుబట్టినా, నేను తనకు నచ్చజెప్పి ‘త్వం రాజా భారత భవ స్వయం వారాణాంl  అహమపి  రాజరాట్ మృగాణాంll’ అని తెలిపినాను అందుచేత నేను ఆతని ఆదేశమును పాలించుచూ వన్యమృగ శాసకుడనైనాను. నీవే చెప్పుకొన్నట్లు నీవు మృగానివి, పైగా  రాజువైయుండి బ్రతికియున్న తమ్ముని భార్యను బలవంతముగా అనుభవించుచున్న వానివి. అందుచే దోషివి. అదికాక అగ్నిసాక్షిగా నేను సుగ్రీవ మిత్రుడను. రావణునితో  మైత్రి ఘటించిన నిన్ను నేను మిత్రునిగా చేసుకొని ధర్మమునకు కళంకము  నాపాదించలేను.  సుగ్రీవుడు నిన్ను శరణుకోరినా, రక్షించవలసిన రాజువైయుండి  కూడా  ఆతనిని ఉపేక్షించి వెడలగొట్టితివి. నీవు ఏదిఏమయినా తిర్యగ్జాతికి చెందిన  వాడవే. దూరమున ఉండుటచే నీ దృష్టి నాపై పడలేదుగానీ, నాబాణము నీ గుండెనే చీల్చినది, వీపును కాదు. కావున నాకేదోషము అంటదు” అని  శ్రీరాముడు వాలికి తెలియజేసినాడు. అప్పుడు వాలికూడా “పురుషోత్తమా నీవు ఏది పలికితివో అది వాస్తవము. నీచేత మరణించుట సంతోషదాయకము” అని అసువుల బాసినాడు. ఈ మాత్రము చాలు శ్రీరాముడు వాలి విషయములో ధర్మ పథమును వీడలేదు అనుటకు.

2.    ఇపుడు రాముని సత్య సంధత గురించి పరిశీలిద్దాము. ముందురోజు   పట్టాభిషేకానికి తండ్రివద్ద ప్రజల సమక్షములో కూడా తన సమ్మతిని తెలిపినాడు, కానీ తరువాత రోజు కైకేయి స్వార్థము దశరథుని మేధోదిగ్బంధము చేయుటచే కుమారుని   అడవులకు పంప సమ్మతిస్తాడు. అసలు నాటి ధర్మము ప్రకారము 14 సంవత్సరములు  వనవాసము చేసిన రాకుమారుడు రాజ్యాధిపతియగు అధికారమును కోల్పోతాడు.  అందుకేనా అన్నట్లు కైకేయి 

నవ పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితఃl

చీరాజిన జటాధారి రామో భవతు తాపసఃll (2-11-27)

అని అంటుంది. ఆమె అన్నట్లే దండకారణ్య నివాసము తరువాత సమయము సీతాన్వేషణకే సరిపోతుంది. తండ్రి మొదట చెప్పిన మాట యగు పట్టాభిషేకమునకు రాముడు ఒప్పుకొన్నా కైకేయి మరియు తండ్రి ద్వారా అడవులకు పోవలెనను మాట విన్న తరువాత, ఆ మాటకే కట్టుబడుతూ, ఈ విధంగా అంటాడు.

   ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితంl

   ధర్మ సంశ్రితమే తచ్ఛ పితుర్వచనముత్తమంll

   అంటే ధర్మముతో కూడిన సత్యము అత్యంత ఆచరణయోగ్యము. దశరథుడు రెండవ        పర్యాయము చెప్పిన మాటలో అట్టి ధర్మయుత సత్యము దాగి ఉన్నది కాబట్టి అదే తనకు యోగ్యమని చెబుతాడు. ఇక్కడ ఇంకొక విషయము ఉన్నది. సుమంతుడు రామలక్ష్మణ సీతలను రథమునందు కూర్చుండబెట్టుకొని పోతూవుండగా రథమును ఆపమని దశరథుడు సుమంతుని ఆదేశించుతాడు. రాముడు ఆపవలదని చెబుతూ, తిరిగీ పైన తెలిపిన శ్లోక భావార్తములో “ రథ చక్రముల సవ్వడి మూలమున వినిపించలేదని చెప్పమంటాడు” అట్లు చెప్పకుండియుంటే తన తండ్రి అసలు మాట తప్పినవాదవుతాడు. పైగా తానూ ధర్మమార్గామును వీడి రాజ్యమునకై అర్రులుచాచినట్లవుతుంది. అందుకే రాముడు ధర్మముతో కూడిన సత్యమార్గమును అనుసరించినాడు.

3.  ఇక మూడవ మాట పౌరుషేచ అప్రతిద్వందః. ఖరునితో యుద్ధము చేయునపుడు 3 అడుగులు శ్రీరామచంద్రుడు వెనుకకు తగ్గినాడు అన్న అపవాదు. ఇద్దరు యోధుల నడుమ యుద్ధము జరుగబోవు క్షణమున యోధుడు ప్రత్యాలీఢ పాదమును ముందుంచి బాణము సంధించుటకు వెనకడుగు వేస్తాడు. అంటే ఒకే చోటున ఉన్న రెండు పాదాలలో కుడిపాదముతో వెనుకడుగు వేసి ఆపై ఎడమ పాదమును కుడి పాదము వద్దకు చేర్చి తిరిగీ కుడిపాదమును వెనుకకు వేయుటతో యుద్ధమునకు సన్నద్ధమైనట్లు ప్రస్ఫుటమౌతూవుంది. కావున ఆయన ‘పౌరుషేచ అప్రతిద్వందుడైనాడు’ కానీ అన్యథా కాదు.

ఇంకొక మాట. పై మూల మంత్రములో శ్రీరామునికి ‘దాశరథి’అన్న శబ్దము ఉపయోగించబడింది. కొందరు వెకిలిగా రాముడు 'పాయస పాత్రుడు' కానీ 'దశరథ జాతుడు' కాదు కదా అని అన్నారు. దశరథుని శక్తి ఆ పాయసములో నిక్షిప్తము చేయబడినదని నా బాల్యమున ధర్మానుసారులైన పండితులు చెప్పగా విన్నాను. ఆ యాగమే ‘పుత్రకామేష్టి. దానిని గూర్చి, సమగ్రముగా జరిపించిన వశిష్ఠ మహర్షికే తెలియగలదు. రామాయణములో విడివిడిగా జరిగిన  ఈ ఉదంతముల నుటంకించిన వారికిఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

ఒకసారి పరికించండి. యుద్ధము జరిగేది లక్ష్మణ మేఘనాథుల మధ్యన. లక్ష్మణుడు బాణమును అభిమంత్రించినది రాముని పేరుపై. అప్పటికి ఉన్న యుద్ధ మంత్రములగానీ , లేక తన సుగుణ సంపదను,భాతృభక్తిని, మంత్రముగా చేసిగానీ వాడలేదు. అదిచాలు రాముడెంత గొప్పవాడు అని మనము తెలుసుకోడానికి, కువిమర్శకుల నోరు మూయించడానికి. పై శ్లోకము మంత్రము. కులాతీతమైన మంత్రము. తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ నూతన కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన శ్లోకముతోబాటూ

 సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతేl

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమll

 అన్న శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో మననము చేసుకొనేది.

 

    ఈ ఒక్క మంత్రమే అన్నింటికీ జవాబుచెప్పింది. దీనిని మూల మంత్రమంటారు. ఎందువల్లనంటే ఈ మంత్రమునభిమంత్రించి లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై వదలిన వెంటనే శిరస్త్రాణ, కుండలసహితమైన బంగారు కాంతులీను ఇంద్రజిత్తుని తల మొండెము నుండి తొడిమెను విడిచిన పండులా వేరుపడినది. ఈవిధంగా షోడశ గుణాకరుడైన రాముని గూర్చి, ఎంతైనా చెప్పుకొంటూనే పోవచ్చు.  రామాయణములో విడివిడిగా జరిగిన ఈ

ఉదంతముల నుటంకించిన వారికి ఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

పై శ్లోకము మంత్రము. కులాతీతమైన మంత్రము. తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ నూతన కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ

అన్న శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో మననము చేసుకొనేది.

ధ్యాన శ్లోకములన్నీ వరుసగా :

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితంl

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచాl

హస్తాబ్జైః అసి ఖేట పుస్తక సుధాకుంభం కుశా ద్రిం హలంl

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్l

సర్వారిష్ట నివారకం శుభకరం పిగాక్ష మక్షాపహమ్l

సీతాన్వేషణ తత్పరం కపివరం,కొటీందు సూర్య ప్రభమ్l

లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవు సమ్మానినమ్l

దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్స దూతం భజేll

ధర్మాత్మా సత్యసంధస్యరామో దాశరధిర్యధిఃl

పౌరుషేచాప్రతిద్వన్ద్వః శరైనంజహిరావణింll

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతేl

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమll

స్వస్తి.