Friday, 14 September 2018

మదాలస and Gabriella Burnel

మదాలసోపదేశము.

https://cherukuramamohanrao.blogspot.com/2018/09/blog-post_14.html

Gabriella Burnell

I can say it to be an enigmatic experience when I listened to an enchanting voice of a lady who looked more Godly in her attire and expression and rendition of the Shlokas in Sanskrit in an Indian Music Tune, I started searching for her name in Google and at last I could get a little information about her. She is Gabriella Burnel.
Gabriella Burnel is a Sanskrit scholar and an accomplished musician and musical theatre performer. After studying Sanskrit at Oxford, she completed a Masters in Drama at Goldsmith University in 2010. She has since written musicals for off-West End theatres in London and performed with the band Gabriella and The Planets. She has also launched “Bespoke Song for you”, a web-based service which offers a personalized song-writing service. It was through her website that The Song of Madālasā was commissioned.

As a four-year-old growing up in London, Gabriella Burnell was introduced to Sanskrit by her parents. Having travelled to India as tourists, the couple had developed a deep appreciation for Indian culture and wanted their daughter to pick up the ancient divine language of the country. Starting with learning the language at St James School in London as a child, Gabriella went on to earn a degree in Sanskrit from Oxford University, pursuing it alongside music.  

 

Today, she is a renowned performing artist whose music is steeped in Sanskrit verses. So immersed is she in the world of the divine language of India that Gabriella has even changed her name to Gaiea Sanskrit. ‘Gaiea’ in Sanskrit means ‘to be sung’, she says.  


She is well-known as a composer and performer of poems and hymns drawn from the Sanskrit tradition. Early in 2016, she set to music a hymn in praise of Adi Sankara which she also performed at a Teacher’s Day event in the London School of Economic Science.
Anybody can hear her rendering the shlokas in the following link.

 

https://www.youtube.com/watch?v=uDd3iupKUyI
మదాలస

మార్కండేయ పురాణము రాశిలో చిన్నది వాశిలో పెద్దది. మార్కండేయ పురాణములో చెప్పిన  దుర్గాసప్తశతి చాలా ప్రత్యేకత గలది. ఇందు మహాకాళి-మహాలక్ష్మి-మహాసరస్వతీ రూపిణియైన దేవి యొక్క మాహాత్మ్యమును 136 అధ్యాయములలో విస్తారముగా ప్రతిపాదింపబడినది. మన్వంతర వర్ణనం కూడా విస్తృతంగా కలిగిన పురాణం ఇది. కొన్ని వైదిక కర్మల ద్వారా అభీష్టఫలాలను ఏ విధంగా పొందవచ్చునో కొన్ని ఉపాఖ్యానాల ద్వారా విశదీకరించబడింది. అనేక విషయాలు మార్కండేయ పురాణం నుంచి దేవీ భాగవంలోకి స్వీకరించబడినాయి. మార్కండేయ పురాణంలో 136 అధ్యాయాలు ఉన్నాయి. దీని శ్లోక శంఖ్య 9,000. కానీ ఇప్పుడు లభ్యమవుతున్న మార్కండేయ పురాణంలో కేవలం 6,900 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి.
ఈ పురాణమును విజ్ఞాన మకుటముగా భావించితే మదాలస చరిత్రము అందు పొదిగిన అమూల్య మణి. ఈ పురాణము నందలి వైశిష్ఠ్యము వల్లనే  పర్గీటర్ చేత ఆంగ్లమునకు ఇది అనువదించట జరిగినది. ఇందలి కొన్ని అధ్యాయములు జర్మన్ భాష లోనికి కూడా అనువదింపబడినా వారు సంస్కృత పాఠమును యధాతధముగా గ్రహించి భావార్థ విశ్లేషణ మాత్రము వారి జర్మన్ భాషలో చదువుకొంటారు. ముఖ్యముగా మదాలస తన కుమారులకు ఊయలలో ఉండగానే చేసిన జ్ఞానోపదేశమును ప్రతి తల్లిదండ్రీ చదివి తమ పిల్లలచేత రోజూ కంఠపాఠమగువరకూ చెప్పించవలసిన బాధ్యత ఎంతో వున్నది.
ఈ మధ్య కాలములో నేను కొందరు మిత్రులతో మాటలాడు నపుడు తాము వేదాంత మార్గమును అవలంబించినట్లు చెప్పుట వినుచున్నాను. నాకు వారి సంభాషణమునందలి ఆంతర్యము సుబోధకము కాలేదు. వేదాంతము అన్నది ఒక కూడలి. అక్కడ నిలుచుకొని చూస్తే శ్రీకృష్ణుడు ఏర్పరచిన పద్దెనిమిది దారులు కనిపిస్తాయి. మొదటిది విశాదయోగమే! అది అనుభవించితే తప్పక మిగిలిన 17 మార్గములలో ఒకటి మనము ఎన్నుకొనవచ్చు. కానీ ఆశ్చర్యమైన విషయము ఏమిటంటే ఆదారుల గమ్యము ఒకటే! కలియుగమున అవతరించిన ఏ గురువయినా, బాబా అయినా, స్వామీ అయినా తానూ నమ్మి పయనించి భగవత్ సాయుజ్యమును పొందిన మార్గమును తన భక్తులకు ఉపదేశించవలసిందే కానీ తానే కనుగొన్న మార్గమని ఎదో చెప్పుట ఆత్మ వంచనే! పైగా ‘అహం బ్రహ్మాస్మి’ అన్న వేదవాక్యమును సాధించి, తమలో దైవత్వమును ఆవిష్కరించుకొన్న భగవాన్ రమణాదులు అద్వైతమును తమ అనుభూతిలోనికి తెచ్చుకొనిరేగానీ అన్యథా కాదు. ఈ జన్మకు నాలాంటివారు చేయగలిగినదల్లా  మనసును విషయ వాంఛలపై పోవనీక భగవంతుని తలచుకొంటూ తగిన గురువుకి ఎదురు చూడటము. ఈ జన్మలో జరిగితే మన అదృష్టము లేదంటే వచ్చేజన్మమునకై వేచియుంటూ అప్పుడయినా ఒక సద్గురు శిష్యునిగా జీవితమును చరితార్థము చేసుకోనగలుగు విధమున పరమాత్మను ప్రార్థించుటయే మనము చేయగలిగిన పని. ఈ జన్మముననే పరమాత్మ తత్వమును తమ అనుభవములోనికి  తెచ్చుకొన్న 18, 19, శతాబ్దపు మహనీయులలో మహావతార్ బాబా, లాహిరీ మహాశయులు, స్వామీ యుక్తేశ్వర్ గిరి, తెలుగువారయిన త్రైలింగ స్వామి గారు ప్రముఖులు. వీరుకాక ఇంకా అనేకులు గురువును ఆశ్రయించి తత్వమరసినవారు గలరు. అందుకే మనము కోరుకో వలసిందీ, కోరుకోగలిగిందీ ఒక్కటే:
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే! (1272 వ పద్యము)
ఈ పద్యము భాగవతములోని దశమస్కంధములో సుదాముడు అను పూలమాలలను కట్టే భక్తుని ఇంటికి బలరామ కృష్ణులు పోయినపుడు సుదాముడు శ్రీ కృష్ణునితో ఈ మాట అంటాడు. ఇది మనము ఆచరించ తగినది. ఆ దేవునికి ఎప్పుడు దయగలిగితే అప్పుడు తానే అయినా వస్తాడు లేకుంటే తన ప్రతినిధిని గురువు రూపములో పంపుతాడు.
ఇక మార్కండేయ పురాణము, మదాలస చరితమునకు వస్తాము. మదాలస దుంధుడను(పాతాళకేతుడు) రాక్షసునిచేత బంధింపబడితే ఋతధ్వజుడనురాజు, గాలవముని అనుగ్రహముచే నొసంగబడిన కువలయాశ్వము నెక్కి కువలయాశ్వుడై   వానిని చంపి ఆమెను చేబడతాడు. పాతాళకేతుని తమ్ముడు తాళకేతుడు ఋతధ్వజుననిపై పగబూనుతాడు.
   కువలయాశ్వుడు ఒకనాడు జనపదాలను రక్షించాలని గుర్రంపై బయలుదేరాడు. మార్గమధ్యమున తాళకేతుడు మునిరూపంలో ఎదురుపడి తాను చేయబోయే యజ్ఞానికి సహాయం కావాలనీ,కువలయాశ్వుని మెడలోని హారం ఇవ్వగలిగితే యజ్ఞం పరిపుష్టిగా జరుగుతుందనీ ప్రాధేయపడతాడు. అడిగినదే తడవుగా కువలయాశ్వుడు తన మెడలోని హారాన్ని తీసి ఇచ్చేస్తాడు. తాళకేతుడు తాను వచ్చే వరకు తన ఆశ్రమాన్ని కనిపెట్టుకొని ఉండవలసినదిగా కువలయాశ్వుని ఒప్పిస్తాడు. అక్కడ మునిరూపంలోని తాళకేతుని మాట విని ఆశ్రమ పరిరక్షణలో ఉంటే, ఇక్కడ తాళకేతుడు రాక్షసమాయతో కువలయాశ్వుని నగరానికి వెళ్ళి తానిచ్చిన హారాన్ని చూపించి కువలయాశ్వుడు చనిపోయాడని ప్రచారం చేస్తాడు. మదాలస ఆ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడుస్తుంది.
తాళకేతుడు ఏమీ ఎరుగనట్టు ఆశ్రమంలోని కువలయాశ్వుని చేరి ధన్యవాదాలు తెల్పి సెలవు తీసుకుంటాడు. కువలయాశ్వుడూ తన పనిని పరిపూర్తి చేయడానికి జనపదాలకు వెళ్ళి వారం రోజుల తర్వాత నగరానికి తిరిగివస్తాడు. విషయం తెలుసుకొని అదంతా రాక్షసమాయని అర్థం చేసుకుంటాడు. కానీ తన ప్రాణానికి ప్రాణమైన మదాలస లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక విరక్తిలోకి వెళ్ళిపోతాడు కువలయాశ్వుడు.
అశ్వతరుడనే నాగేంద్రుని పుత్రులు కువలయాశ్వుని  ప్రాణ స్నేహితులు.
మంచివ్యక్తి, సర్వసమర్థత గల చక్రవర్తి, ప్రజాబంధువు అయిన తమ స్నేహితుడు కువలయాశ్వుని పరిస్థితిని చూసి తట్టుకోలేక నాగపుత్రులు  తమ తండ్రిని చేరి విషయం వివరిస్తారు. లోకంలో మంచివారికి అన్యాయం జరుగరాదనీ, యత్నిస్తే సాధ్యంకానిది లేదనీ వారితో చెప్పి ఆశ్వతరుడు  సరస్వతీ దేవిని మెప్పించి గానం నేర్చుకొని, శివునికై తపస్సు చేసి తన సామగాన గరిమచే మదాలసకు పునర్జన్మ కలిగేలా వరమును పొందుతాడు. ఆవిధముగా మదాలస అశ్వతరునికే పరిపూర్ణ జవ్వనియగు కూతురిగా జన్మిస్తుంది. ఆమెను,  కువలయాశ్వునికి పునర్వివాహం చేస్తాడు.
కాలాంతరములో వారికిఒక కొడుకు కలిగితే విక్రాంతుడు అన్న పేరు పెడతాడు రాజు. ఆమె నవ్వి ఊరకుంటుంది. ఊయలలో ఉండగానే అతనికి వేదాంతము నేర్పుతుంది తల్లి. బాలుడు నడవదొడగిన వెంటనే సన్యాసము స్వీకరించి అడవులకు వెళ్ళిపోతాడు. మరొకసారి కొడుకు పుడితే అతనికి సుబాహు అన్న పేరు పెడతాడు. అతనూ అంతే. మళ్ళీ కొంత కాలానికి ఒక కొడుకు పుడతాడు. అప్పుడు కూడా ఆ బాలునికి రాజే శతృమర్దనుడు అని పేరు పెడతాడు. అప్పుడూ ఆమె నవ్వుతుంది. ఆ బాలుడూ సన్యాసమునే ఆశ్రయించుతాడు.
    అంటే వారికి కలిగిన మువ్వురు కుమారులకూ ఊయలలోనే వేదాంతము నేర్పి విరాగులను చేస్తుంది ఆ తపోవంతురాలు. వారు పిన్నవయసులోనే ఐహిక వాంఛల నొదిలి తపోభూములకు వెళ్ళిపోతారు. ఈ ముగ్గురికీ రాజే పేరుపెట్టి ఉంటాడు. ఈ చివరి బాలునికి ఆమెను పెరుపెట్టమంటాడు రాజు. ఆమె అతనికి అలర్కుడు అని పేరు పెడుతుంది. అలర్కుడు అంటే విరగ పూచిన తన పూవులచేతనే  అలంకరిపబడిన తెల్ల జిల్లేడు చేట్టువంటి వాడు అని అర్థము. ఇదేమి పేరంటే భర్త పెట్టిన మూడుపేర్లు అర్థవంతమయినవి కావు అని ఈ విధముగా తెలుపుతుంది. మొదటివాని పేరు విక్రాంతుడు. అంటే విశేషమయిన క్రాంతి గలవాడు. క్రాంతి అంటే వెలుగు, మార్పు, చైతన్యము. ఈ పేరు శరీరానికి అనుకొంటే అది తనకు తానుగా ఏమీ చేయలేదు. దానిని బుద్ధి ప్రచోదితము చేస్తుంది, మరి బుద్ధి కర్మానుసారిణి. ఇక ఆత్మకు క్రాంతి ఉందా అంటే దానికి ఎటువంటి సంకోచ వ్యాకోచములు లేవు. మరి ఆపేరు దేహానికీ చెల్లదు, ఆత్మకూ చెల్లదు. రెండవ పేరు సుబాహు. మంచి బాహువులు కలవాడు.బుద్ధి కదిలించితే కదిలేవి, కావున అవి పరతంత్రములు. వానికి మంచేమిటి చేడ్డేమిటి. 
ఇక మూడవ పేరు శతృమర్ధనుడు. శరీరము జడమయినపుడు శత్రువులు ఎక్కడనుండి వస్తారు. ఇక ఆత్మకు శత్రువులు లేరు మిత్రువులూ లేరు. కావున మీరు పెట్టిన పేర్లు అర్థవంతములు కావు అని తెల్పినది.
మరి అలర్కుడు అంటే శరీరము ఆత్మ శుద్ధములై, బుద్ధములై సూర్యుని సమానముగా వెలుగులు విరజిమ్ముతూ సార్థక నామదేయుడౌతాడని చెబుతుందిరాజు కోరికపై ఆ బాలునికి ఏలికకు కావలసిన విధులను నేర్పి యుక్తవయసున రాజును చేసి భర్తను గూడి వానప్రస్థమునకు వెళుతుంది. వెళ్ళబోతూ కుమారునికి ఒక ఉంగరమునిచ్చి నీకు దుఃఖము కల్గినపుడు దాని మూత తీసి అందున్న చుట్టబడిన రేకులోని విషయమును చదువుకొమ్మంటుంది. ఆ స్థితి అతనికి కలిగిన వెంటనే అమ్మ మాట గుర్తుకొచ్చి చూసి దత్తాత్రేయుని ఆశ్రయించి ఆయన శిష్యుడైపోతాడు.

నేను ఈ విషయమును గూర్చి ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే  నా మిత్రులు B నాగ సుబ్బారెడ్డి , K P శ్రీనాథ బాబుగార్లు ఒక విదేశ యువతి ఆలపించిన మార్కండేయ పురాణములో మదాలస తన సంతానమునుద్దేశించి తెలిపిన బ్రహ్మజ్ఞానమును WhatsApp లో నాకు పంపియుండినారు. ఆ స్త్రీ యొక్క భక్తి, గౌరవము, ఏకాగ్రత, సంస్కృత భాషాభినివేశము, సనాతన ధర్మమును గూర్చి తెలుసుకొను జిజ్ఞాస నన్నెంతగానో ఆకట్టుకొనింది. మనలో ఎంతమంది ఆమె దారిలో పయనించుచున్నామని ఆత్మ విమర్శన చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతనోవుంది. అసమగ్రమైన అన్య మతములను పట్టుకొని ఊగులాడకుండా, Maria Wirth వ్రాసినటువంటి    PLEASE HINDUS, DON’T SAY: “ALL RELIGIONS ARE THE SAME” అన్న వ్యాసమును చదివితే మనము ఎంతటి అంధకారములో ఉన్నామో, ఏ మహా సముద్రపు అట్టడుగున ఉన్నామో, అర్థమౌతుంది. ఇకనైనా కళ్ళు తెరచి పెద్దలు మనకు వారసత్వములో ఇచ్చిన సాహితీ సంపదను ఉపయోగించ పూనుకొందాము. సంస్కృతము నేర్చుకొందాము. మన ధర్మమును కాపాడుకొందాము.
https://youtu.be/uDd3iupKUyI (Use Ctrl+Mouse click)
ఇక పై ఛాయాచిత్రము లో ఆ తల్లి పాడే గీతము, గీతార్థము క్రింద పొందు పరచినాను: 

శుద్ధోసి బుద్ధోసి నిరంజనోsసి
సంసారమాయా పరివర్జితోsసి
సంసార స్వప్నా త్యజ మోహ నిద్రాఁ
మదాలసోల్లాపమువాచ పుత్రం
ఓ మదాలసానువర్తియౌ పుత్రుడా! నావచనములనాలకించుము. నీవు ఎప్పటికీ కల్మషరహితుడవైన శుద్ధ ఆత్మవు. నీవే నిత్యసత్యమైన ఆత్మవు. నీవు ప్రాకృతిక మాయామోహములకు అతీతునివి. అంటే స్వప్న సమములగు భ్రమలు బంధాలు వదిలి నీ శుద్ధాత్మను పరమాత్మకు అనుసంధించమని మహావేదాంతి మదాలస తన పసికందుతో చెబుతూవుంది.  
శుద్ధోsసి రేతాత్త న తేsస్తి నామ
కృతం హి తత్కల్పనయాధునైవ l
పంచాత్మకం దేహ మిదం న తోsస్తి
నైవాస్య త్వం రోదిషి కస్య హేతోః ll
నీవు శుద్ధమయిన ఆత్మవు. నీవు అనామకునివి అంటే నీకు ఒక ప్రత్యేకమయిన పేరు లేదు.
నీవు ఈ భూమిపైకి వచ్చిన పిదప ఏ పేరుతో పిలువబడుచున్నావో  అది ఒక కల్పిత నామము. అసలు నీ నామకరణమునకు నీవు కర్తవు కాదు. నీ తలిదండ్రులు  తమకు నచ్చిన పేరు నీకు పెట్టుకొంటున్నారు. దాని ఔచిత్యము ఒక విధముగా వారికే తెలియదు. బాహిరముగా కనిపించే శరీరము పంచాభూతాత్మకమైనది. దానిపై నీ ఆధిపత్యము లేదు. దానికీ నీపై ఆధిపత్యము లేదు.మరి నీకిక దుఃఖమెందులకు? 
న వా భవాన్ రోదితి వై స్వజన్మా
శబ్దోsయమాసాధ్య మహీశ సూనం l
వికల్ప్యమానా వివిధైర్గుణైస్తే
గుణాశ్చ భౌతాః సకలేంద్రియేషు ll
ఓ రాజకుమారా! నీవు నీ జన్మమును గూర్చి ఏడ్వ తగదు. ఆ రోదనవల్ల కలిగే శబ్దమే నీకు అన్వయింపబడిన ఒక మాయ. ఇక నీలో కలిగిన గుణములంటావా అవి నీవి కాదు. అవి నీ ఇంద్రియములకు చెందినవి. 
భూతాని భూతైః పరిదుర్బలాని
వృద్ధిం సమాయాంతి యథేహ పుంసః l
అన్నాంబుపానాది భిరేవ తస్మాత్
న తోస్తి వృద్ధిర్ న చ తోస్తి హానిః ll
నీ శరీరమునకు చెందిన ఇంద్రియములు అనేవి నీవి కావు. వాని అనుభూతి వానిదే! అన్నపానాది క్రియలచే కలిగే వృద్ధిహీనతలు నీకు అంటుట లేదు. అసలు వృద్ధిహీనతలన్నవి నీకు అంటవు. 
త్వం కంచుకే శీర్యమానో నిజోస్మిన్
తస్మిశ్చ దేహే మూఢతా మా వ్రజేతాఃl
శుభాశ్శుభౌః కర్మభిర్దేహమేతత్
మదాదిభిః కంచుకస్తే పినద్ధః ll
ఇక దేహము అన్నది నీయొక్క పై తొడుగు మాత్రమే. అది జీర్ణమూ కాక తప్పదు, శీర్ణమూ కాక తప్పదు. దీనిపై నీవు ఎట్టి పరిస్థితిలోకూడా మోహము పెంచుకొనవలసిన అవసరమే లేదు. నీయొక్క పాపపుణ్య కర్మ ఫలమే నీ దేహము. కామ క్రోధాది అరిషడ్వర్గ పరివేష్ఠితము అది. నీవు అది కాదు అన్నది సత్వరము గుర్తెరుంగుము.  

తాతేతి కించిత్ తనయేతి కించిత్
అంబేతి కించిద్ధయితేతి కించిత్l
మమేతి కించి న్న మమేతి కించిత్
త్వం భూతసంఘం  బహుమా నయేథా ll
తండ్రి ఎవరు, తనయుడెవరు, తల్లి ఎవరు, పత్ని ఎవరు, 'నేను' ఏమిటి, 'నేను కాదు' ఏమిటి, ఇదంతా ఈ భూత సముదాయ స్వరూపము. నీవు కాదు అన్నది గుర్తించు. 
దుఃఖాని దుఃఖోపశమాయభోగాన్
సుఖాయ జానాతి విమూఢ చేతాః l
తాన్యేవ దుఃఖానిపునః సుఖాని
జానాతి విద్వా న్న విమూఢ చేతాః ll
దుఃఖోపశమనము కొరకు భోగములను అనుభవించుతున్నావు. కానీ అవీ దుఃఖభాజకములే నని గ్రహించ లేకుండా వున్నావు. సుఖము దుఃఖము అనునవి ఒక వృత్త పరిధిని అంటియున్న రెండు భిన్న బిందువులు. ఆ వలయాకార మార్గములో ఒక బిందువును తాకితే రెండవదానిని కూడా తాకి తీరవలసిందే! విమూఢచిత్తులు కాని విద్వాంసులు ఈ సూక్ష్మమును గ్రహించగలుగుతారు.  
హాసోsస్థి సందర్శన మక్షియుగ్మం
అత్యుజ్వలం యత్కలుషం వసాయాః
కుచాది పీనం పిశితం పనం తత్
స్థానం రతేః కింనరకం న యోషిత్
శరీరము త్వక్మాంసరక్తాదులను ( అంటే చర్మము, మాంసము రక్తములను) కలిగియున్న అస్థిపంజరము. స్త్రీపురుషులిరువురిలోనూ ఇది సహజము. మరి  చిరునవ్వునకు, అవయవ సౌష్ఠవమునకు, కలుషము నిండిన ఉజ్వలమగు కంటి చూపునకు, మాంసభరితమగు కుచములకు ఆకారమైన స్త్రీలు నరక గతికి నాజూకు మార్గములు కారా! అందుచేత 'మమ' అన్నది మరచి అది నీవు కాదని తెలుసుకో!
యానాంక్షితౌ తత్ర గతశ్చ దేహో
దేహేsపిచాన్యః పురుషో నివిష్ఠః l
మమత్వ ముర్వ్యా న తథా యథాస్వే
దేహేతి మాత్రం చ విమూఢతైషా ll

జీవిత శకటములో జీవివయిన నీవు ఉచితాసనముపై కూర్చొనివున్నావు. ఆత్మ నీలో పరివిష్ఠితమయి వుంది. జీవి తన మాయామోహమూర్ఖత్వముచే శరీరము తనది అనుకొనుచున్నాడు. ఆత్మకు స్వపరభేదములు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు అంటవు. నీది  అనుకొనునది నీది కాదు. అసలు నీవనుకొను నీవే నీవు కానపుడు ఆ రథము నీదెట్లవుతుంది. ఆ నిరవగాహన నీ మూర్ఖత్వమునకు సంకేతము.
పుట్టిన బిడ్డకు అంతటి చిన్నవయసులోనే ఇంత వేదాంతము చెబితే అర్థమౌతుందా అన్నది కొందరి సందేహము కావచ్చు. అంతటి లేత వయసులో ఏమి చెప్పినా, అంటే అది మంచయినా చేడ్డయినా వారి హృదయములకు హత్తుకొని పోతుంది. ఇది మనపూర్వులు ఏనాడో చెప్పిన సత్యము. అమెరికా సైంటిస్టులు ఈనాడు ఒప్పుకొన్న సత్యము. శంఖము నుండి నీరు చేతిలో పడింది కాబట్టి తీర్థమయ్యింది. మనము నమ్మి పిల్లలకు మంచి చెబుదాము. దేశమునకు స్వస్థత చేకూర్చుదాము.
  స్వస్తి. 

Thursday, 13 September 2018

ఓం శాంతిః శాంతిః శాంతిః


ఓం శాంతిః శాంతిః శాంతిః
https://cherukuramamohanrao.blogspot.com/2018/09/blog-post_13.html
నిదుర లేచినది మొదలు నిదుర పోయేవరకూ ఎదోవిధమైన సమస్య, ఏదో ఒక కలత. మనసుకు ప్రశాంతత కలిగితే కలత తీరుతుంది అలత తీరుతుంది. ఇవి తీరడానికి మందునాశ్రయించే వారు కొందరయితే విందునాశ్రయించే వారు కొందరు, పొందునాశ్రయించే వారు మరి కొందరు. సమస్య అన్నది ఒక వెలిగించిన Gas Stove లాంటిది. దానిని, పని ముగిసిన వెంటనే Off చేస్తే  Stove పదికాలాల పాటు పనిచేస్తుంది. నిరంతరమూ అది మండుతూనే వుంటే అది Stove కే కాదు. ఇంటికి కూడా చేటే! మరి ఈ విషయమును త్వరగా తెలుసుకొంటే దానిని తగిన విధముగా ఉపయోగించుకొనగలుగుతాము.  అది ఇంకా ఎక్కువగా మండితే మన సమస్య తీరుతుంది అస్నుకొంటే అది భ్రమే. కాలే Stove మీద kirosine పోసినా, ఒక Paint పోసినా, నూనె పోసినా కొంప మునిగే అవకాశము వుంటుంది. అటువంటిదే మందు, విందు పొందు. కావున ఇవి మన సమస్యలు తీర్చవు.
మరి మనము విద్య అధికముగానే గడించుతున్నాముకదా!  సమస్యలు లేకుండా గానీ, సమస్యలు రాకుండాగానీ ఎందుకు చేసుకో లేకుండా ఉన్నాము. జవాబు తెలుసుకొనుటకు ముందు విద్య అవిద్య అంటే ఏమిటో చూస్తాము.
విద్య అనగా జ్ఞానము, అది లేకపోవుట అవిద్య అన్నది సాధారణార్థము. కానీ నిజానికి మనము గడించేది కేవలము అవిద్య. అందుకే అవిద్య అన్న మాటకు వ్యుత్పత్తి ఈ విధముగా వుంది. 'వేత్తుం న శక్యా అవిద్యాః' అంటే ఎటుదిరిగీ తెలుసుకొనుటకు వీలుకానిది అవిద్య. ఏమి తెలుసుకొనుటకు అన్నమాటకు ‘పరమాత్ముని ఉనికిని’ అన్నది జవాబు.
పరమాత్మ స్వరూప స్వభావములను సంపూర్ణముగా ఎరుగుట సాధ్యపడని వారి తెలివితేటలు లేక జ్ఞానము అన్నవి అవిద్యగా చెప్పబడుతాయి. ఈశావాస్యోపనిషత్తు ఈవిధముగా చేబుతూవుంది.
విద్యాంచావిద్యాంచ యస్తద్వేదో భయగుమ్ సహl
అవిద్యయా మృత్యుంతీర్వా విద్యాయామమృతమశ్నుతేll   ( ఈశావాస్య 11 వ మంత్రము)
యః = ఎవరైతే
విద్యాంచ = విద్య(మరియు) ( ఆత్మ జ్ఞానము బ్రహ్మ తత్వము తెలుపునట్టిదే విద్య మిగిలినదంతా అవిద్య)
అవిద్యాంచ = అవిద్యలన్న (మనము పాఠశాల, కళాశాలలకు పోయి చదివేది అవిద్య.)
తత్ = ఆ
ఉభయగుం = రెండింటినీ
సహా = కలిపి
వేదో =  తెలుసుకొనునో (అతను)
అవిద్యయా = (తన) దైనిక కర్మానుష్ఠానములచేత
మృత్యుం = మృత్యువును
తీర్వా = అధిగమించును లేక దాటును
విద్యాయాం = (పైన తెలుపబడిన) విద్య వలన 
అమృతం = అమరత్వమును
అశ్నుతే = పొందును
అంటే రెండూ కావలసినదే కానీ అవిద్య మృత్యువు దాటే మార్గమే చెబుతుంది. విద్య అమృతత్వమును సిద్ధింపజేస్తుంది.

వేదాంత పరిభాష అన్న గ్రంధమును వ్రాసిన మహనీయుడు  ధర్మరాజ అధ్వరి, అవిద్యను గూర్చి ఈవిధముగా చెబుతున్నాడు.
 యదవిద్య విలాసేన భూతభౌతిక సృష్టయః
 తన్నోమి పరమాత్మానం సచ్చితానంద విగ్రహం
పరమాత్మ మొట్టమొదట శక్తిని సృష్టించినాడట. ఆమె తన మాయచే ఈ జగత్తును సృష్టి చేస్తూ వుంది.  ‘తన్నోమి పరమాత్మానం సచ్చితానందవిగ్రహం’ కానీ ఆమె దృష్టి మొత్తము సచ్చితానందవిగ్రహము వైపే వుంటుంది. కావున మనము ఆ మాయలో పడగూడదు.
మరి మొదటికే మోసముగా వుండే స్థితిలో మరి సమస్య తీరేదెట్ల? మనసు నిష్కల్మషముగా చేసుకొంటే బుద్ధికి పరిష్కారమార్గములు తోచే అవకాశము వుంటుంది. దానికి దైవప్రార్థన అవసరము. దానికి తగిన పూజనో పునస్కారమో ధ్యానమో ఎదో ఒకటి అవసరము. ఇవి సమస్యలు వచ్చినపుడు చేసే దానికంటే  లేకున్నపుడు చేస్తే ఇంకా మంచిదే! అందుకే కబీర్ దాసు అంటాడు:
దుఃఖ్ మేఁ సుమిరన్ సబ్ కరేఁ సుఖ్ మేఁ కరైన కోయ్
జొ సుఖ్ మేఁ సుమిరన్ కరే తో దుఃఖ్ కాహే కో హొయ్
ఓ దేవుడా! 
‘కష్ట నష్టాలలో నిన్ను తలతురు
సుఖము సంతోషమున్నపుడూ మరతురు
సుఖములో నిను తలచేవారు దుఃఖించరు
అన్న ఈ చిన్న మర్మాన్ని మరచుతారు’
కాబట్టి ఆ ధ్యానము అవసరము. కానీ రోజంతా ధ్యానములోనే గడపలేము. అందుకే మన పూజ, వ్రతము ధ్యానము ముగిసిన వెంటనే ‘ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః అని మూడు మార్లు చెబుతాము. మరి మూడే ఎందుకు అన్నది ఇప్పుడు చూస్తాము.

పంచ మహాభూతములను మరియు వానిచే ఏర్పడిన వస్తువులు కలుగజేసే వనరులు మన బుద్ధి చాంచల్యము అన్నీ పైన చెప్పిన శక్తి యగు  ఆమె విలాసమే! ఈ జీవుడు ఆమెకు కట్టుబడి ఉన్నంతవరకూ అశాంతితో జీవించవలసిందే!
అందువల్ల నిరంతరమూ తాపత్రయమును అనుభవించుతూ ఉండవలసిందే! 
మనము ఉండే అగోచర స్థితిని తాపము, బాధ, కష్టము, ఇబ్బంది, ఇడుము, సమస్య అని ఏ పేరుతో నైనా పిలువవచ్చు. వీనిని మన ద్రష్టలు మూడు విధములుగా విభజించినారు. వీనికి కర్త మాత్రము ఆ మహా శక్తే! ఆ మూడే
1.     ఆధ్యాత్మికము 2. ఆధిభౌతికము 3. ఆధ్యాత్మికము
1.     ఆధ్యాత్మిక అంటే ఆది+ఆత్మిక . అంటే ఆత్మ సంబంధమైనది అంటే ఆంగ్లములో Related to self అని అర్థము. ఇక్కడ ఆత్మ అంటే తనయొక్క అని అర్థము. తన శరీరమునకు సంబంధించిన సమస్యలు. ఉద్రేకము, భయము, కోపము, తాపము, అవమానము, సోమరితనము, శారీరిక బాధ, మానసిక బాధ, కపటము, ఆశ  వీనికి ఒక శాంతి, ఇవన్నీ ఆధ్యాత్మికములే!
2.     ఇక రెండవది. ఇది శారీరికమైనదికాదు. నీచుట్టూ వున్న ప్రకృతివల్ల ఏర్పడే సమస్యలు. ఆంగ్లములో చెప్పవలసి వస్తే Environmental Problems. ముఖ్యముగా పంచ మహాభూతములవల్ల ఏర్పడే ఉపద్రవములు, ఇవి కాక ఇంకా తన శత్రువులవల్ల, చోరులవల్ల, మృగ కీటకముల వల్ల, ఏర్పడునవి. అంటే ఈ విధమయిన బాధలకు కొన్ని జాగ్రత్తలు తీసుకొనుటవల్ల కొంత జాగరూకత పెంచుకొనవచ్చును.
3.     ఇక మూడవది ఆధిదైవికము External Compulsions meaning Instantanious problems. తుఫాను, ఉప్పెన , వరద, కరువు, గ్రహాబలము, మనకు తెలియకనే వచ్చేవి, ఇవన్నీ మనము దైవ ప్రార్థన చేయుట చేత మాత్రమే చిత్తశాంతిని చేకూర్చుకోగలుగుతాము.
అసలు ఈ మూడూ మన జోలికి రాకుండా వుండుటకే మనము ‘ఓం శాంతి శ్శాంతిశ్శాంతిః’ అని చెప్పుట. మనకొక దిక్కు వుంటే ధైర్యము వుంటుంది. ఆ దిక్కే భగవంతుడు. అందుకే ఆయనను ఈ తాపత్రయములు లేకుండా చేయమని మనము మన ప్రార్థన తరువాత
‘ఓం శాంతి శ్శాంతిశ్శాంతిః’ అని చెప్పవలసి వుంటుంది.
స్వస్తి.

Monday, 3 September 2018

అక్షరాలతో అంకెల సంబంధం

అక్షరాలతో అంకెల సంబంధం

ఆర్యభట్టు గణిత ఖగోళ శాస్త్రజ్ఞుల తలమానికము. ఈయన వ్రాసిన 123శ్లోకముల ఆర్యభటీయము గణిత ఖగోళ శాస్త్రజ్ఞుల కల్పతరువు.  ఈ చిన్న పొత్తము నాలుగు భాగములుగా విభజింపబడినది. మొదటిది గీతికా పాదము. రెండవది గణిత పాదము. మూడవది కాలక్రియా పాదము. నాలుగవది గోళ పాదము.
మొదటి పాదంలో అతి పెద్ద సంఖ్యలను రెండు లేక మూడక్షరాలలో చెప్పుకునే విధానము, జ్యా'ల పట్టిక (Sine Tables) ఉన్నాయి. కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాల సంవత్సరాల పరిమాణము మొదలగు అంశములను గూర్చి వివరింపబడినది. వానిని చందస్సులో ఇమిడ్చి ధారణలో ఉంచుకునే విధముగా వ్రాసి జిజ్ఞాసువులకు ఎనలేని ఉపకారము చేసినారు. త్రికోణమితి (Trigonometry) లో పైన తెలిపిన జ్యా'ల (Sine Tables) ను  గణన చేసిన పట్టిక ఒకేశ్లోకంలో ఈయబడినది. రెండవ పాదంలో క్షేత్ర గణితము, సంఖ్యాక్రమాలు (progressions), శంకుచ్ఛాయలు, సమీకరణాల సాధన 
ఉన్నాయి. (శఙ్క్వాదిచ్ఛాయా ప్రమాణేన, కాలం కథయతి). (Sun Dial). మూడవ పాదంలో గ్రహాల స్థితి గతుల నిర్ణయం, తిథి వారాలు, మొదలైనవి ఉన్నాయి. నాలుగవ పాదం పూర్తిగా ఖగోళశాస్త్రం. భచక్రం, ఖగోళం, గ్రహాల కక్ష్యలు, విషువత్తులు (equinoxes), గ్రహణాలు మొదలైనవి ఉన్నాయి. ఒక చిన్న వాస్తవము గమనించండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగు చున్నది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుట లేదు అని యదార్ధం చెప్పినా బైబిలు కు వ్యతిరేకంగా ఉందని కోపర్నికస్, గెలీలియోల వంటి శాస్త్రజ్ఞులను హింసించి, అదే మాట అన్నందుకు బ్రూనో అనబడే శాస్త్రజ్ఞుని ఆరు సంవత్సరాలు  జైల్లో పెట్టి, అతి కిరాతంగా హింసించి, చివరకు సజీవ దహనం చేసిన ఘనత నాటి వాటికన్ చర్చిది.

ఇప్పుడు గీతికా పాదము అనగా మొదటి పాదములో పెద్ద పెద్ద అంకెలను ఎంతో సులభముగా అక్షరాలలో తెలిపే విధానము
 చూద్దాము. ముందు ఒక్క  వాస్తవమును గమనించండి. రోమనులు అక్షరములనే అంకెలుగా వాడుతారు. వారికి లేదు. 9 వ్రాయవలెనంటే 10కి ఒకటి తక్కువ అన్న అర్థము వచ్చేవిధముగా IX అని వ్రాస్తారు. అదే 11 వ్రాయవలసి వస్తే పది పైన ఒకటి
అని
 XI వ్రాస్తారు. అప్పటికి English పుట్టనే లేదు. కానీ మనవారు నాటికే గణితములో ఎంతో ప్రగతి సాధించి ఉండినారు. 0’ ఆర్యభట్టు కనుగొన్నాడని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెబుతారు.  కానీ ఆయన వేదములో ఉన్నదే తెలిపినానన్నాడు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
 l
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
ll
 
ఈశావాస్యోపనిషత్తు ఈ శాంతి మంత్రముతోనే ఆరంభమౌతుంది.
పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది. అంతేకదా! నాటి మహనీయులు ఉన్నమాట
 ఉన్నట్లు చెప్పుట తప్ప పాశ్చాత్యుల లాగా గ్రంధ లేక భావ చౌర్యము (Plagiarism) చేయలేదు. అట్లని ఆర్యభటుడు ఏమీ కనిపెట్టలేదా అంటే ఇదో ఇదే ఋజువు. అంకెలను అతిసులువుగా సంస్కృత అక్షరములతో ఎట్లు తెలుపవచ్చునో మనకు 
తెలియజేసిన మహానుభావుడు. సంస్కృత అక్షరములు అని ఎందుకు వాడినానంటే భారతీయ భాషలన్నీ సంస్కృత అక్షర
 వర్గములనే పాటించుతాయి. లిపి వేరువేరుగా ఉండవచ్చును.

పైన తెలిపిన పద్ధతిని చక్కగా ఉపయోగించిన ప్రాచీన గణిత
, ఖగోళ, జ్యోతిష శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు. చాలా పెద్దసంఖ్యలను రెండు అక్షరాలతో దశాంశ పద్ధతిలో ఎలా చెప్పాలో తన ఆర్యభటీయం లో వివరించినాడు.
ఆర్యభటీయంలోని ఈ  విఖ్యాత సంస్కృత శ్లోకమును చూడండి.
మఖి భఖి ఫఖి ధఖి ణఖి ఞఖి
l
నఖి హస్ఝ స్కకి కిష్గ శ్ఘకి కిఘ్వ
 l
ఘ్లకి కిగ్ర హక్య ధకి కిచ
l
స్గ ఝశ న్వ క్ల ప్త ఫ ఛ కలార్ధజ్యాః
ll
 (12)
సంస్కృత నిఘంటువుచూస్తే కలా
,
 అర్ధ, జ్యా అన్నపదాలకు అర్థాలు దొరుకుతాయి. దీని భావమేమిటో చూద్దాము.
ఈ క్రింద తెలిపినవి ఆయన మనకందజేసిన ఆయా అక్షరముల విలువలు
ఈ క్రింది పట్టిక ఆ విలువలను సూచిస్తుంది.
 1  6  11  16  21                  30       80
 2  7  12  17  22                 40           90
 3  8  13  18  23                 50           100
 4  9  14  19  24             60
 5  10  15  20  25           70
అదేవిధంగా
 ^ to the power of ను సూచిస్తుంది.
అ=
100^0; ఇ=100^1;ఉ=100^2;ఋ=100^3;ఌ=100^4;…;ఔ=100^8

ఇప్పుడు మఖి అన్న ఒక సులభమైన పదమును తీసుకొని దాని విలువ సాధించుతాము.
మ=
 25, ఖి = (2x100)=200, మ+ఖి = 225.
ఇప్పుడు
ఖ్యు= ఖ+య+ఉ = (2+30)x10,000 {100^2=10,000) }= 3,20,000
అదేవిధముగా ఘృ= 4
x
100^3= 40,00,000
ఖ్యుఘృ = ఖ్యు+ఘృ =
 3,20,000 + 40,00,000 = 43,20,000 = ఒక మహాయుగములోని సంవత్సరాలు.
కృత
, త్రేత,ద్వాపార, కలి యుగముల  కాల ప్రమాణములను కూడితే   17,,28,౦౦౦+12,96,౦౦౦+8,64,౦౦౦+4,32,౦౦౦ 
=
 43,2,౦౦౦
ఇది ఆర్యభటుని గొప్పదనము.
భారతీయ జ్యోతిశ్శాస్త్రంలో ప్రథమ గ్రంధంగా చెప్పబడేది సూర్యసిద్ధాంతం. దీనిని రెవరెండ్ బర్జెస్ అనేఆయన
 అనువదించినాడు. దీని కర్త యెవరో ఇదమిత్థంగా తెలియదు. మొదట మయాసురునిచేత రచింపబడినదని ఐతిహ్యం. ఆయన సూర్యుని ఉపాసించి ఈజ్ఞానముపొందానని చెబుతాడు. మయుడంటే భారతంలో మయసభ కట్టిన వాస్తు శిల్పి. మయ శబ్దము ఒక జాతిని తెలుపుతుందని నా ఉద్దేశ్యము. మయసభ నిర్మాణము తరువాత మయుడు తన పరిజనముతో ఎచటికో వెడలిపోయినాడని భారతము తెలుపుతుంది. కొందరు పరిశోధకుల  ప్రకారము వీరు MEXICO లో స్థిరపడినారని చెబుతారు. 

కానీ కొన్ని శతాబ్దముల తరువాత వారు ఎచటికి పోయినారు అచట ఒక్కరుగూడా లేకుండా అన్నది అంతుపట్టని విషయము.
 త్రిపురాసురులకు నిర్మించిన అత్యంత పెద్ద విమానము మాయ నిర్మితమే. కానీ భారతములోని మయుడు ఈ మయుడు వేరువేరు కావచ్చును. ఈ MEXICO లో అత్యంత ఆశ్చర్యజనకమైన అతి పురాతనమైన కట్టడములు విమానాశ్రయాలు ఇప్పటికీ 
వున్నాయి. నేను ఎందుకు చెప్పవచ్చినానంటే మనకు తెలియనిది లేదనుకొన కూడదు. అట్లని తెలిసినదంతాకూడా
 నిజమేననుకొనగూడదు.
భారతంలోదేవతలు
, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, అవతారపురుషులు, 
మహర్షులు కథలో ముఖ్య పాత్రలు వహిస్తారు. 
ఆధునికులు వీరిని వారి వారిలోకాలనుండి భూమిమీదకు దింపి మానవ పాత్రలుగానే విమర్శించడం మొదలుపెడతారు. ఇపుడు చరిత్రకందే సూర్య సిద్దాంతంలో మొదటి మూడు శ్లోకాలు ఇలా ఉన్నాయి.
అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే
సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణేనమః 1
అల్పావిశిష్టే తు కృతే మయో నామ మహాసురః
రహస్యం పరమం పుణ్యం జిజ్ఞాసుర్ జ్ఞానముత్తమం 2
వేదాంగ మగ్ర్య మఖిలం జ్యోతిషం గతికారణం
ఆరాధయన్ వివస్వన్తమ్ తపస్తేసే సుదుశ్చరమ్ 3
ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ మంగళాచరణ శ్లోకాలను వదలివేసి గణిత శాస్త్ర విషయాలు మాత్రమే ముఖ్యమనుకుంటారు. మరి రాక్షసులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, కల్పిత గాధలయితే అమిత ప్రజ్ఞా దురీనుడు శాస్త్రజ్ఞుడు అయిన ఆర్యభటుడు  వీరి ప్రస్తాపన ప్రార్థనా శ్లోకములలో తెచ్చియుండడు కదా! వానిని  ప్రస్తుతము ఉన్నస్థాయిలో విజ్ఞాన శాస్త్రానికి అందని విషయములుగా భావించుకొన వచ్చును. అసలు, కావలసినవి తీసుకొని మిగతావి వదలిపెట్టుటవల్ల కాల క్రమేణ సూర్య సిద్దాంతం లో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి ప్రతి చాలా తరువాతదని పరిశోధకుల అభిప్రాయము. 
భవిష్యత్తు ఏమి చేస్తుందో చూద్దాము.


నా దక్షిణ కర్నాటక యాత్ర


నా దక్షిణ కర్నాటక యాత్ర
1.   ఉపోద్ఘాతము
కర్నాటకలో కోస్తా సహా పలు జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుంగభద్ర, కేఆర్ఎస్ సహా ఇతర డ్యామ్ లన్నీ పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగినాయి. ప్రసిద్ధ శ్రీ శృంగేరి శారదా పీఠంలోకి వరద నీరు చేరింది. దీంతో ఆలయంలో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయంలోకి వరద నీరు రావడంతో నిత్యకైంకర్యాలకు ఆటంకం ఏర్పడింది. కుక్కె సుబ్రమణ్యలో కుమారధార నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఉత్తర కర్నాటకలో కృష్ణానది ఆయకట్టు ప్రదేశంలో భారీ వర్షం కురిసింది.

   కేరళను ఆనుకుని ఉన్న దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమంగళూరు, కొడగు తదితర జిల్లాలో వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 'మలెనాడు' ప్రాంతంలోని శివమెగ్గ, కరావళి, దావణగెరె జిల్లాల్లో వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రమాదకర ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. తీవ్ర వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన జిల్లాలకు రూ. 200 కోట్లు విడుదల చేస్తామని సీఎం కుమార స్వామి తెలిపారు.
      ఇది వార్తా పత్రికలు తెల్పిన ఒక వాస్తవము. ఈ ఉధృతము, 2౦18 ఆగస్టు 11 వ తేదీ నుండి మొదలయి 17 వతేదీ వరకు ఆయా ప్రాంతములను అతలాకుతలము చేసినది. ఈ సమయములో నేను నా శ్రీమతి నా చిన్న కుమార్తెతో ఈ ప్రాంతములో 15 వ తేదీ వరకూ తీర్థయాత్ర జరిపినాను.
తీర్థయాత్రా విశేషాలు మరియు నాకు తెలిసిన మేరకు స్థల పురాణము తెలుపుట నా ఉద్దేశ్యము. దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతములకు వెడలదలచినవారు  నా అనుభవము ఉపయోగపడవలెనన్నది నా ఆలోచన.
 హైదరాబాదు నా నివాస నగరము. 10 తేదీన 9గం. 5ని. కు కాచిగూడానుండి బంగళూరు- యశ్వన్తపుర ఎక్స్ ప్రెస్ లో బంగలూరికి బయలుదేరినాము. బయలుదేరుటకు ముందే హైదరాబాదులోని శృంగేరి పీఠము వారితోనూ నేరుగా శృంగేరి పీఠము వారితోనూ Mobile లో మాట్లాడినాను. శృంగేరి నుండి నాకు కావలసిన లేక నేనడిగిన సందేహాలకు సమాధానము లభించింది. హైదరాబాదు నుండి మంగళూరికి పోయి ఆచటినుండి శృంగేరి చేరుట ఒక ఉపాయము. షిమోగా పోయి శృంగేరి చేరుట వేరొక మార్గము. ఈ రెండు కాకుండా బంగళూరు వరకు రైలులో పోయి ఆచటినుండి కారులో హాసన్, చికమగలూరు మీదుగా శృంగేరి చేరుట ఒక విధాయకము. హాసన్ కు రైలు స్టేషను వున్నా రైళ్ళు తక్కువ. అందుచే రోడ్డు, కారు శ్రేయస్కరము అని తలచినాను.
కారు బాడుగకు తీసుకోనవలసినది కర్ణాటకలో కాబట్టి అక్కడ వున్న ఇద్దరు ముగ్గురు స్నేహితుల ద్వారా ప్రయత్నము చేసినాను కానీ ఫలించలేదు. తాను చిత్తూరు నివాసియైనా, నాకు పుత్ర సమానుడగు శ్రీను బెంగళూరు లో CAB మాట్లాడినాడు, నా నిబంధనలు షరతులు మరియు ఆర్థిక వనరునకు అనుకూలముగా! ఆ CAB యజమానితో గానీ చోదకుని(DRIVER) తో గానీ ఎటువంటి సమస్య లేకుండా తిరిగీ బంగళూరు చేరేవరకు మా ప్రయాణము జరిగిపోయినది. 
బంగళూరులో రైలు దిగగానే, మా కాలకృత్యములు ముగించుకొని, driver కొరకు 2౦ నిమిషములు చూపెట్టుకోవలసి వచ్చింది. ఆ సమయములో జరిగిన ఒక సహృదయుని వల్ల నాకు జరిగిన సంఘటన చెప్పకపోతే నేను ఆయన మంచితనమును మరుగుపరచినట్లవుతుంది. నేను హైదరాబాదు నుండి బయలుదేరిన వెంటనే మరువకుండా తనకు చరవాణి లో తెలియజేయమన్న ఆసహృదయుని పేరు T.V.సుబ్బారావు గారు. ఆయన Station లో నన్ను కలియుటకు వస్తానన్నారు. నేను వద్దని బ్రతిమాలినా ఆయన వినలేదు. ఆయన చెప్పిన ప్రకారమే తెలియజేసినాను. నేను, నా శ్రీమతి, నా కుమార్తె బంగళూరు యశ్వంతపుర Station లో దిగిన వెంటనే, అధికమగు జనసమ్మర్దమును లెక్కచేయక 13 కి.మీ. దూరములో ఉన్న బసవనగుడి నుండి, ఆయనకు 75, 76 సంవత్సరముల వయసున్నా తన సతీమణితో కలిసి CAB లో వచ్చి నన్ను కలిసినారు. నేను ఎంతగా నోచ్చుకోన్నానో ఆ దంపతులు తీసుకొన్న శ్రమకు. నాతో ఆయన గడిపిన 5 నిముసములలో కనీసము కాఫీ అయినా వారిరువురికీ ఇప్పించలేకపోయినాను కానీ ఆయన మాత్రము నన్ను అక్కడికక్కడే, నాకంత యోగ్యత లేకున్నా, దుశ్శాలువతో సత్కరించి, నాకు Pen Set Box బహుకరించి దారిలో తినుటకు Snacks Pockets రెండు మా అమ్మాయి చేతిలోవుంచినారు, ఇవి కాదని నాకు ఒక అపురూపమయిన Key Chain కూడా ఇచ్చినారు. తొందరలో నా భార్యకు రవికెలబట్ట తమ చేసంచిలో ఉంచుకొనుటకు మరచినారు, అందుచే తనకు ఇవ్వలేక పోయినారు. ఒక సహృదయుని గూర్చి చెప్పే అవకాశము కలిగినప్పుడు చెప్పకపోతే అది ఆత్మవంచనతో సమానము అన్న మనస్తత్వము కలిగినవాడనౌటచె వారు నాపై చూపిన ఆదరమును మీతో పంచుకొన్నాను. అంతే వెంటనే వారిరువురూ శెలవు తీసుకొని బయలుదేరినారు. మా ప్రతీక్ష సారధికై కొనసాగినది మరికొంతసేపు. ఆతను వచ్చిన వెంటనే మా యాత్ర మొదలయినది. మొదటి మజిలీ హాసన్ జిల్లాకు చెందిన హలేబేడు బేలూరు.
మిగిలినది మళ్ళీ..........
నా దక్షిణ కర్నాటక యాత్ర
2 వ భాగము
హళేబీడు
హళేబీడు ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. ఈ రెండూ జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి దగ్గరగా వున్న చిన్న పట్టణములు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం. దీనికి పూర్వం, ద్వారసముద్ర, దొరసముద్ర(ద్వార సముద్రకు అపభ్రంశము కావచ్చు.)  అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని అర్థము. వరంగలును గెలిచిన తరువాత అల్లుద్దీన్ ఖిల్జీ పనుపున అతని అతిముఖ్యానుచరుడు, సేనాధిపతి యగు మాలిక్ కాఫర్ యొక్క సేనలు హొయసాల రాజ్యం మీదికి దండయాత్రకు వెళ్ళినాయి. 1311లో హొయసాల రాజధాని "ద్వారసముద్ర"ను ముట్టడించి రాజు వీరబల్లాల-3 ను తను ఓడించుటజరిగినది. వీరబల్లాలుడు కప్పము కట్టుటకు అగీకరించి డిల్లీకి సామంతుడిగా మారటం జరిగింది. ఈదాడిలో చిన్నాభిన్నమై శిధిలమై పోయిన ద్వారసముద్రనే ప్రస్తుతము  "హళైబేడు" అంటున్నారు. హళేబేడు (బేడు= వీడు= ఆవాసము) అంటే కన్నడములో శిధిల నగరము అని అర్ధము. అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు హళైబేడు, బేలూరు గుడుల గోడలకు తాపడమొనర్చిన శిల్పములలో చూడవచ్చును. అసలు బ్రహ్మదేవుడే జక్కన రూపములో ఈ శిల్పములను చేక్కినాదేమో అనిపిస్తుంది. ఈ శిల్పములను ద్వంసముచేసిన వాడుకూడా ఒక మనిషే అన్న తలంపు మన మదిలో మెదిలితే శిగ్గుతో తలవంచుకోనవలసి వస్తుంది. మాలిక్ కాఫర్ నాశనము చేసిన ఆ శిల్పములను ఆరీతిలో మలచ గలవారు కనిపించక హోయసలేశ్వరాలయము యొక్క శిధిల కుడ్యములను రాళ్ళతో కప్పిపుచ్చినారు.  అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది. హోయసల రాజధానిగా మొదట్లో బేలూరు తరవాత దానిని హలేబీడు ఉండినవి. హాసన్ నుండి బయలుదేరినపుడు ముందు హలేబేడు వస్తుంది కావున దానిని గూర్చి వ్రాసినాను.
ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. హోయ -సాల అనే  రెండు మాటలు కలిసి హోయసల అయింది. సాలుడు అన్నది సామ్రాజ్య స్థాపకుని పేరు. హోయ అంటే కన్నడములో కొట్టు అని అర్థము. ఈ రాజ్య మూల పురుషుడు సాలుడు ఇక్కడ సింహాన్ని ఒంటిచేతితో ఎదుర్కొని సంహరించినాడట .అప్పటినుండి వారి వంశనామము హోయసలగా మార్చుకొన్నారు. వీరు దేవగిరికి చెందిన సేన యాదవుల కు చెందిన వారు. అవక్ర పరాక్రమంతో చాళుక్య, చోళ పాండ్యులను ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించినారు. ఈ 12-13 శతాబ్దముల మధ్యకాలములో  ఇచ్చట ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించినాడు. ఈ నిర్మాణంలో తన మంత్రివర్యుడు కేతనమల్ల తన శక్తి యుక్తులతో ఒక మహత్తరమగు శిల్పిని జక్కన రూపములో ఏర్పాటు చేయుటకుగానీ, అతనికి వలయు సాధనసామాగ్రి, అతడు ఎన్నుకొన్న తగిన సహాయకులను సమకూర్చుతకుగానీ ఎంతయో తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా సహకరించినాడని చెప్పుకొంటారు. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తి కావటం జరిగింది.
ఇక్కడ ప్రధానాలయము హొయసలేశ్వరాలయము. ఇది ద్వికూటాలయము. ఇందులో రాజు పేరున ఒకటి, రాణి శాంతలదేవి పేరున మరొకటి, రెండు శివలింగాలను ప్రతిష్ఠించినారు. ఈ రెంటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు పెద్ద నందులను ఏర్పాటు చేసినారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలోని అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవని అంటారు. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయము లోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పములు, పశుపక్ష్య నర్తకీ సముదాయములు  బహు సుందరముగా తీర్చిదిద్దబడినాయి. ఈ దేవాలయాల నిర్మాణమునకు నల్లని బలపపు రాయిని (Chlorotic Schist )  ఉపయోగించినారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి వస్తుప్రదర్శనశాల, దానికి దగ్గరగా ఒక పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఇక బెలూరును గురించి కొంత తెలుసుకొందాము. ఈ శిల్పాలకు ప్రాణము పోస్తే ఎక్కడికి పరుగెత్తి పోతాయోనని శిల్పబ్రహ్మ జక్కనాచార్యుడు ఆపనిచేయలేదనిపిస్తుంది. అట్లు చేసియుంటే ఆయన అప్రతిహత ప్రతిభ మనకు చూసే అదృష్టము కలిగియుండదు.
అమరశిల్పి  జక్కన అనేదానికంటే అపరబ్రహ్మ జక్కన అంటే ఎంత బాగుంటుందో!  సృష్టి చెప్పలేనంత గొప్పదే కానీ ప్రత్యేకముగా ఒక దృశ్యము చూసినప్పుడు అది ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇది అక్కడ వుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ జక్కన శిల్పములో ఇది ఇక్కడ ఉండుటచేత ఎంత సౌందర్యము సంతరించుకున్నదో అనిపిస్తుంది. ఆయన శిలపమును చేక్కేసమయాన చిన్న పొరబాటు జరిగినా ఒక ప్రక్క శిల్పమునకు ఒదిగిన శిల వృధా అవుతుంది, ఆయన పడిన కష్టము బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  ఒక చిన్న జాబు వ్రాయాలంటే ఎన్నో కోయ్ట్టివేతల, కాగితమును నలిపి పారవేయదాలు కొల్లలుగా వుంటాయి. మరి అట్టి శిల్పములు అరా అంగుళము తావు వదలకుండా, వందలు వేలు తాను మలచి, తన పర్యవేక్షణలో మలిపించుట అంటే అద్భుతమే కాదు అసాధారణము. ఒక లతాంగి ముఖ్యముగా ముకుర(అద్దము) సుందరి శిల్పము వర్ణించుటకు ఏ  అల్లసాని పెద్దనో, రామరాజ భూషణుడో, ముక్కుతిమ్మనో కావలెనేమో! శిల్పసుందరి చికురము ( వెంట్రుక) కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే, బ్రహ్మ కూడా శివ కేశవులవలె జక్కనగా అవతారమును దాల్చినాడనవలసివస్తుంది. మన పాఠ్యాంశములుగా ఎందఱో పాశ్యాత్య చిత్ర, శిల్పకారులను గూర్చి చదివినాము, మన పిల్లలతో కూడా చదివిస్తున్నాము. మరి జక్కన వంటి ముఖ్యముగా దక్షిణ భారతమున దేవాలయ శిల్పములను, తిండి నిద్రలు మాని అజరామరము చేసిన వారిని, మనపిల్లలకు, కాదు కాదు మనకెంతవరకు తెలుసు, మన ప్రభుత్వములకు ఎంత తెలుసు. స్వతంత్రమువచ్చి 7౦ సంవత్సరములు దాటినా ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వ నాయకులు వున్నారా! ఎటూ ఎంతటి విలువైన ఆహారము తిన్నా కడుపులో ఉండదని తెలిసీ అదే కావాల్నుకొంటారు కానీ వారికి కళాభిజ్ఞత ఈషణ్మాత్రము కూడా లేదు. నిజముగా ఇది శిగ్గుపడవలసిన విషయము.
జక్కన్నాను గూర్చి మరికాస్త బేలూరులో చర్చించుకొందాము.
ఇక మెల్లగా బేలూరికి పయనించుదాము.

మిగిలినది మళ్ళీ ......... 
నా దక్షిణ కర్నాటక యాత్ర 
3వ భాగము
బేలూరు 
బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. ఈ బేలూరు హోయసల రాజుల మొదటి రాజధాని. ఇక్కడ ప్రధానంగా చూడతగినది చెన్నకేశవాలయము. దీనిని కూడా విష్ణువర్ధనుడు నిర్మించినట్లే చెప్పుకొంటారు. క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవమత ప్రాశస్త్య ప్రచారానికై రామానుజాచార్యులవారి  ప్రబోధానుసారము ఈ కట్టడము నిర్మింపబడినదని కూడా చెప్పుకొంటారు. ఆలయ మధ్య భాగములో నరసింహస్వామి స్థంభం వుంది. దీనిపై రామాయణమహాభారతాది  అనేక పురాణేతిహాస గాధలు చెక్కబడి వున్నాయిఅంతంత కథలను శిలలపై చెక్కుట తప్పక ఒక అసాధారణ విషయము. ఈ స్థంభము అప్పట్లో దానంతట అదే భ్రమించేవిధముగా (To Rotate) (బహుశ Ball Bearings సహాయముతోనేమో!) అమర్చబడి వుండేదని చెబుతారునాటి కాలానికి ఇది ఒక అభియాంత్రిక  అద్భుతము (Engineering marvel) అని అనక తప్పదు.  తర్వాత దానిని పురావస్తు శాఖ (Archaeology Department) వారు ఆపివేయుట జరిగిసదని చెబుతారు.
ఆలయము వెలుపలి గోడల పైన 644   ఏనుగులు   చెక్కినారు.  ఆ తీరు తెన్ను చూడ ముచ్చటగా వుంటుంది. అవి చిన్నగా వుంటాయి, మరి అంత నిశితముగా అన్ని ఏనుగులను మలచుటకు ఎన్ని రోజులు పట్టిందో! బహుశ ఈ కాలము వారు ఎన్నిరోజులు పట్టినా అన్ని చేయలేరేమో! .తూర్పున వున్న ద్వారం వద్ద రతీమన్మధ విగ్రహములు అతి సుందరంగా వున్నాయి. లోపల వున్న నలభై ఎనిమిది శిల్ప కళా వైభవం తో ఉన్న రాతి స్తంభాలున్నాయి .వాటి సౌందర్యం వర్ణనాతీతమే! మండపము యొక్క పైకప్పు మీద కూడా గొప్పప కళావైభవము దర్శన మిస్తుంది. నిజానికి  సురేంద్ర సభను చూస్తున్నామా అనిపిస్తుంది. ఈ శిల్పముల నగిషీలు ఉలితో చెక్కుటకు సాధ్యమా అన్న సందేహము మనకు కలుగక మానదు. .ఈ స్తంభాల మీద 42 సాల భంజికలు అంటే మదనికలు  వివిధ భంగిమలతో మనసును దోచేస్తాయి. బయట చెక్కిన ముకుర(అద్దము) సుందరి శిల్పము యొక్క ముఖ వర్చస్సు వర్ణించుటకు కృష్ణరాయని అష్టదిగ్గజములే దిగిరావలసి వస్తుందేమో!  ,మొహినీభస్మాసుర చిత్రము  శిల్పి ఊహలకు ప్రతిబింబము. .గజాసుర సంహార దృశ్యము, గరుడ పంఖములు, వామనావతారము, కైలాసమును కదలించే రావణుడు, దుర్గా దేవి, మహిసాసుర మర్దనము, వరాహావతారము, భైరవ మూర్తి, ఆదిత్యరధము, శిల్ప చాతుర్యమునకు పరాకాష్ట. ఇంత సుందర, సునిశిత, సున్నిత, సూక్ష్మ శిల్పకళ నభూతో నభవిష్యతి. చెక్కడం ప్రపంచం లో లేనే లేదు జక్కనాచార్యునికి, ఆయన కుమారుడు ఢంకనకు, ,వారికి సహకరించిన ఇతర స్థపతుల అప్రమేయ కౌశలమునకు తార్కాణము. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద హోయసల రాజ్య చిహ్నమగు,  సాల మహారాజు సింహమును చంపు శిల్పము అత్యంత మనోహరము.

గోడలలో గాలి వెలుతురూ, లోపలికి రావటానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కినారు. .విష్ణు వర్ధన మహారాజు, అతని రాణి శాంతలా దేవి విగ్రహాలను జీవకళ ఉత్తిపదేవిధముగా చెక్కినారు. రంగ మంటపం లో ఆలయ నాట్యకత్తెలు నృత్యం చేసే వారు. 

 ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన కప్పే చెన్నగ రాయ విగ్రహాన్ని రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది . అంటే కప్ప చెన్న  కేశవ ఆలయము అని అర్థము. దీనిలో గణపతి ,సరస్వతి ,లక్ష్మి నాయణ, చాముండేశ్వరి ,వేణుగోపాల విగ్రహాలు వున్నాయి. అత్యంత ప్రతిభావంతుడగు శిల్పి జక్కనా చార్యుడు పెళ్ళయిన 6 నెలలకే తన శిల్పకళా నైపుణ్యమునకు తగిన గుర్తింపు కొరకు ఎంతగానో వెదుకుతూ 18 సంవత్సరముల తన స్వగ్రామము కైదలకు దగ్గరగావున్న ఈ చోటికి వచ్చినాడు. శిల్పకళలో అత్యంత ప్రతిభావంతుడగు అతని కుమారుడు దంకనా చార్యుడు ఒకవైపు పని మరొకవైపు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వస్తాడు. ఒకరికొకరు తెలియదు. జక్కన చేక్కుచున్న చెన్న కేశవ విగ్రహములో లోపము ఉందంటాడు తనయుడు. తండ్రి యగు జక్కన లోపము చూపిస్తే కుడి చేయి నరుక్కుంటానని శపథం చేస్తాడు. విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించినారు . .గంధం అంతా ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం తడి అట్లే నిలిచింది. ఉలి సూత్తె సహాయముతో అక్కడ తోలిచితే అందులో ఒక తొర్ర దానిలో ఒక ప్రాణం తో వున్న  కప్ప బయట పడింది. ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు. అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు. దేవుడు కలలో కన్పించి స్వగ్రామమునకు  రమ్మన్నాడట. తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞ గా చెన్నకేశవ ఆలయాన్ని అక్కడ కట్టించి స్వామి విగ్రహమును అక్కడ కొత్తగా చెక్కి ప్రతిష్ఠ గావించినారు. అప్పుడు జక్కనకు చేయి మళ్ళీ వచ్చిందట.
నా శక్తి వంచన లేకుండా నేను ఎంత వర్ణించినా ఆ కట్టడముల శోభ కళ్ళారా చూచినగాని తనివి తీరదు. అంతటి అపురూప శిల్పసంపదకు ప్రాణము పోసిన జక్కన చిత్రపఠము లేకపోవుట నాకు మనమున నాటిన అలుగు.
అక్కడనుండి మా ప్రయాణము శృంగేరి వైపునకు సాగింది. వర్షము మా వెన్నంటియే వుండినది. అధికము అల్పము అన్న తేడా తప్పించితే వాన ఆగినదీ లేదు, అదిలేక మేము సాగినదీ లేదు. బేలూరు నుండి శ్రుంగేరికి 1౦౦ కిలోమీటర్ల దూరము. ఈ పర్వతము త్రేతాయుగమున ఋష్యశృంగుని ఆవాసమగుటచే ఋష్యశృంగగిరి, శృంగగిరి ఆపై శృంగేరి అయినది. మారథము వానను కలుపుకొని శృంగేరి వైపునకు దారి తీసినది.
మిగిలినది మళ్ళీ.......
నా దక్షిణ కర్నాటక యాత్ర
4 వ భాగము
శ్రీ శృంగేరి శారదా పీఠము.   
      జగద్గురువులగు శ్రీ ఆది శంకరాచార్యులవారు తమ శిష్యులతో ఒకసారి తుంగానది తీరములో  సంచరిస్తూవుండగా  ఒక కప్ప ప్రసవించుతూ ఎండ వేడిమిని భరించలేక అలమటిస్తుండగా, ఒక పాము పడగవిప్పి నీడ పట్టి కప్పకు ఉపశమనము కలిగిస్తున్న దృశ్యమును చూసిన శంకరులు  విస్మయము చెంది తన యోగ దృష్టిచే అచ్చట ఋష్యశృంగులవారు తపమాచారించినదిగా గుర్తించి ఆదిగా, అచట దక్షిణామ్నాయ పీఠమును ప్రతిష్ఠించినారు.
      శంకరులతో వేదాంతవాదములో ఓడిపోయిన, వేయిమంది శిష్యులను కలుగుటచే  మండన పట్టమును బొందిన, మిశ్రులవారు శంకరులకు శిష్యులై అనుసరించినారు. పతితోడనే తన గతి కొనసాగించినది ఆయన సతీమణి మరియు విద్వన్మణి అపర శారదాదేవి యగు ఉభయభారతీదేవి. శృంగేరిని పీఠస్థాపనకు తగిన స్థలముగా ఎప్పుడయితే నిర్ణయించినారో అప్పుడే విశ్వరూపాచార్యులను పేరుగలిగి మండన మిశ్రులుగా ప్రఖ్యాతిగాంచి  తనకన్నా చాలా పెద్దవారైన మహానుభావుని, సురేశ్వరాచార్య నామముతో పీఠమునకు అధిపతిని జేయుటయేగాక అచట వ్యాఖ్యాన సింహాసనమును ఏర్పరచి వారినందు అధిష్ఠీంపజేసినారు. వాణీ అవతార మూర్తి యగు ఉభాయభారతీదేవి బ్రహ్మలోకమునకుబోవ సంకల్పింప ఆమెను వేడుకొని శృంగేరిలో దారువుతో చేయించిన విగ్రహమున ఆవాహనము చేసి శారదాదేవి పేరుతో ప్రతిష్టిచుటయేగాక పీఠాదిపతుల పట్టమున భారతీ నామమును సంకలనము చేసినారు. దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదమును  ఈ  పీఠమునకు ప్రదాన వేదముగా నిర్ణయించి, ప్రదత్తమైన  శ్రీ చంద్రమౌళీశ్వర స్పటిక లింగాన్నీ, శ్రీ రత్నగర్బ గణపతి విగ్రహాన్నీ, మహా మేరు యంత్రాన్నీ నిత్య పూజ కోసం శ్రీ శంకరులు అనుగ్రహించినారు. ఈ  పీఠాన్ని స్థాపించిన తరువాత, తూర్పున కాలభైరవుడు, పడమర ఆంజనేయ స్వామి, ఉత్తరాన కాళికాంబ, దక్షిణాన వన దుర్గాంబలను శృంగేరీ క్షేత్ర రక్షణకై క్షేత్ర పాలకులుగా శ్రీ శంకరులు ప్రతిష్టించుట జరిగినది.
12వ శతాబ్దమున మహమ్మదీయ ప్రాబల్యము అధికమగు తరుణమున విద్యా (శంకర) తీర్థులవారు పీఠమును అలంకరించుట జరిగినది. సాయణాచార్యులవారును, మాధవాచార్యులు అనగా  విద్యా (శంకర) తీర్థుల వారి తదనంతరము విద్యారణ్యులుగా ఖ్యాతిజేంది శృంగేరి పీఠమును అధిష్ఠించిన  వారును వారి సహోదరులు. విద్యాతీర్థులవారి ఆశీర్వాదముతోనే విద్యారణ్యులవారు విద్యానగరము(విజయనగరము)ను స్థాపించుట జరిగినది. సాయణులు, సన్యసించిన తమ సోదరుల సహాయముతో  వేదభాష్యము వ్రాసిన మహనీయులు. ఈ భాష్యమే నాటికీ నేటికీ ఏనాటికయినా జిజ్ఞాసువుల కరదీపిక. విద్యాతీర్థులవారి తదనంతరము విద్యారణ్యులు పీఠాధిపతులుగా ఉన్నపుడు అమ్మ కళలను పొందుపరచి శారదాదేవి విగ్రహమును పైడితోనూ, రాతితోనూ జేయించి ప్రతిష్ఠించినారు. విద్యాతీర్థ భారతులవారి సమాధి స్థానమే శృంగేరిలో శ్రీచక్రాకారముననున్న విద్యాశంకరాలయము. ఈ దేవాలయము యొక్క వెలుపలి భాగము కర్నాటక శైలినోనూ లోన ద్రావిడ శైలిలోనూ నిర్మింపబడినది. ఎట్టయినా వేదికపై పూర్వాభిముఖముగా నిర్మితమైన ఈ ఆలయమునకు 6 ద్వారములున్నవి. దేవస్థాన పశ్చిమార్ధ భాగమున గర్భగృహమున్నది. పూర్వార్ధ మంటపమున, 12 రాశులకు ప్రతీకలుగా 12 స్తంభములు, ఆయా రాశులలో సూర్యుడు వుండు సమయమున ఆయా స్థంభముపై మిహిర కిరణములు పడులాగున నిర్మింపబడినాయి. ఇది నాటి కట్టడ నిర్మాతల విజ్ఞాన వైశిష్ట్యము.
ఇక్కడ ఇంకా శ్రీ పార్శ్వనాతస్వామి బాసడి (దిగంబర జైనము) వారిదేవాలయము, శిరిమనే జలపాతము, తూర్పున కాలభైరవ దేవాలయము, పశ్చిమమున కెరె ఆంజనేయ స్వామి దేవాలయము, ఉత్తరమున కాళికాంబ దేవాలయము, పశ్చిమమున దుర్గాంబ దేవాలయము దర్శనీయ స్థలాలు. ఇవి కాక చెప్పారా ఆంజనేయ దేవాలయం, కిగ్గా, మల్లికార్జున దేవాలయం, మళయాళ బ్రహ్మ దేవాలయం, తోరణ గణపతి దేవాలయంనరసింహ వనం, తుంగా నది శృంగేరిలో చూడవలసిన ఇతర ఆకర్షణీయ స్థలములు. ఇక్కడ నరసింహవనమును గూర్చి ఒకమాట చెప్పవలసి వస్తుంది.
నరసింహ వనము తుంగా నది ఉత్తర తీరములో ఉన్నది. ఇరవయ్యో శతాబ్దం పూర్వభాగంలో ఈ ప్రదేశమంతా దట్టమయిన వృక్షాలతో వనములా ఊండేది. అప్పుడు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవనృసింహభారతీ మహాస్వామివారు తరచూ ఆ వనానికి వెళ్ళి ఒక బండరాయిపై ఆసీనులై ధ్యాననిమగ్నులయ్యేవారు. అప్పటి శ్రీ మఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆ ప్రాంతములో ఒక చిన్న కుటీరము నిర్మించి జగద్గురువులు ఉండేందుకు సౌకర్యాన్ని కలిగించారు.

       కాలక్రమేణా ఆ ప్రదేశం అభివృద్ధి చెందింది. అప్పటి చిన్న నిర్మాణం విస్తరించి శ్రీసచ్చిదానంద విలాస్ పేరిట జగద్గురువుల ఆశ్రమముగా పరిణామం చెందినది. కాగా నానాటికీ భక్తుల రద్ధీ అధికము కావడముతో దాని పక్కనే ఇటీవల గురునివాస్ అనే అతి పెద్ద పూజాప్రాంగణము నిర్మించారు. ఈ భవనము శ్రీ చంద్రమౌళీశ్వరుల పూజా సన్నిధిగా జద్గురువుల నివాస ప్రదేశముగా విరాజిల్లుతోంది. నరసింహవనములో పీఠం యొక్క ముప్పయి మూడు, ముప్పయి నాలుగు, ముప్పయి అయిదవ జగద్గురువార్యుల మహా సమాధి అధిష్ఠానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వేద పాఠశాల కూడా మహా స్వామి వారి ఆధ్వర్యములో నడుపబడుచున్నది. 

తిరిగీ నా అనుభవమునుగూర్చి తెలుపవలెనంటే 11వ తేదీ రాత్రి 9గం. 30ని. చేరి మఠము  వారిచే నిర్వహింపబడు విడిది లో నేను, నా శ్రీమతి, నా కుమార్తె ముగ్గురికిగానూ, రూ.35౦ కి గది తీసుకొని భోజనాడులను ముగించుకొని విశ్రమించినాము. గదులు మఠము యొక్క సిబ్బందిచే ఎంతో చక్కగా నిర్వహింపబడుతూ వున్నాయి.ఉధృతమైన వర్షము మమ్ము విడువలేదు. గొడుగులు లేకుండానే తప్ప తడుస్తూ దర్శనీయస్థలములన్నీచూసినాము. వట్టి చేతులతో పోలేక నేను హైదరాబాదులోనే భారతీతీర్థ స్వామి చరణారవిందములకు సమర్పించుటకు ఒక పంచ పద్యరత్న మాలను మరియు వారు విష్ణువు పై వ్రాసిన గరుడగమన తవ..... సంస్కృత గీతమును అనుకరిస్తూ, వారి అనుగ్రహము నా మదిలో మెదలగా సంస్కృతము రాని నేను వారిపై గీతమును వ్రాసి ఆ ప్రతుల్ని Laminate చేయించి తీసుకుపోయి వారికి సమర్పించగా ఆరోజు వేలసంఖ్యలో భక్తజనులున్ననూ, మాకు, వయసు కారణమేమో, ప్రత్యేకముగా ప్రవేశము కల్పించి నాపేరు గట్టిగా చదివి, ఆ రెండు పత్రములలో నేను వ్రాసినది వివరముగా చదువుతానని ఆశ్వాసనము ఆ మహానీయులొసంగుట నాకు మరపురాని అనుభూతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా బిడ్డను దీవించుట మాపాలిటి అవధిలేని ఆనంద హేతువు. వారిని మహా సన్నిధానము అనుట అక్కడి ఆనవాయితీ. శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరులవారిని సన్నిధానము అంటారు. వారు సభాప్రాంగణమునకు వచ్చేవరకు వేదపండితుడు నిర్వహించే శివాభిషేకమును చూస్తూ వుండిపోయినాము. వారిదర్శనము మరియు ఆశీర్వాదమును పొంది, వర్షము మరీ ఉధృతమయినందువల్ల ఆటోలో గది చేరుకొని అక్కడినుండి మా CAB లో దర్శనీయస్తలములన్నీ చూసి భోజనాదులు ముగించుకొని స్వస్థానము చేరినాము.
   ఇక్కడ ఒక విషయము చెప్పవలసియున్నది. ఇది నాపాలికి ఒక అద్భుతమైన అనుభవము.

జగద్గురు బారతీ తీర్థు లవారు క్రమము తప్పకుండా ప్రదోషకాలములో మహాన్యాసపూర్వక నమకచమక సంయుక్తముగా చంద్రమౌళీశ్వర అభిషేకము స్వయముగాచేస్తారు. మేము యాత్రకు బయలుదేరునపుడే ఆ ఆరాధన చూసి తరువాతి రోజు వేకువనే దైనందిన చర్యలు ముగించుకొని బయలుదేరవలెనన్నది ప్రణాళిక.  గడిచేరిన తరువాత ఎందుకో నా మదిలో ఇక బయలుదేరమని చెప్పినట్లు ఒక అంతర్వాణి వినిపించింది. ఆమాటే నా శ్రీమతితో, అమ్మాయితో చెప్పినాను. అప్పుడేమీ అనలేదు కానీ హైదరాబాదు వచ్చి ఇల్లు చేరినతరువాత నా ఇల్లాలు శృంగేరిలో, అనుకొన్న రీతిగా కాకుండా మీరు బయలుదేరుదామని అనుటతో నాకు నొప్పి కలిగింది కానీ మీ మాటను త్రోసిపుచ్చలేక సరే అన్నాను కానీ మీరు చెప్పుట మన యాత్రకు ఎంతో మేలుజేసినది అని చెప్పినది. వెంటనే బయలుదేరవలేనన్న ఆ మెరుపే మేరువక వుండివుంటే శృంగేరిలో మేము బయలుదేరుతూనే వచ్చిన వరదకు ఎరయై అక్కడే ఉండిపోవలసి వచ్చేది. మిగిలిన క్షేత్రములు చూడకనే వెనుదిరిగి రావలసివచ్చియుండేది. వానను చూసి ఒడలు జలదరించింది. కన్ను పోడుచుకొన్నా ఎదురుగా ఏముంది అన్నది కనిపించనంతటి వాన. కారు vipers ఎంత త్వరగా పనిచేసినా ఎదురుగా ఏమి వస్తూవుంది అని తెలుసుకోలేని స్థితి. చాల నెమ్మదిగా కారును నడిన్చినాడు మా సారథి. మేము బయలుదేరి కొంత దూరము పోయిన తరువాత, నీరు శారదా మాత గర్భగుడిలోని వచ్చినాయని photo నామిత్రుడు పంపినది చూసి అచ్చెరువందినాము. అసలు గుడికి స్వాములవారలు నివసించే నరసింహవనమునకు భారతీ తీర్థులవారి గురువగు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థులవారు శారదామాత దేవాలయమునుండి వేసిన వంతెన పైకి నీళ్ళు వచ్చినాయని మాకు తెలిసింది. అంతా గురువుగారి కరుణ, భగవంతుని అనుగ్రహము.
మిగతది మరొక పర్యాయము..........
నా దక్షిణ కర్నాటక యాత్ర

5 వ భాగము
గోకర్ణము
మా ప్రయాణము శృంగేరి నుండి దాదాపు 26౦ కిలోమీటర్ల దూరములోనున్న గోకర్ణమునకు కొనసాగినది. సాయంకాలము ఒక 3 గంటల సమయములో బయలుదేరి ఉంటాము. కుండపోత వర్షము. దారి కళ్ళు పోడుచుకొంతెగాని కనిపించుట లేదు. ఆ పరమేశ్వరుడే Driver ను ఆవహించి బండిని నడిపించినాడా అని మాకు అనిపించింది. కారును డ్రయివరు 20 కిలోమీటర్ల స్పీడుతో కూడా తోలవలసి వచ్చింది. కొన్నిచోట్ల కాసేపు నిలుపుకొనుట కూడా తటస్తించినది. గోకర్ణము చేరు సమయమునకు రాత్రి 11 గంటలయినది. Lodging దొరకలేదు. ఒక Lodge లో ఖాళీ ఉండినది కానీ అది రెండవ అంతస్తులో! Lift లేదు. నిరాశతో బయటికి వస్తూవుంటే Bicycle పై ఒక వ్యక్తి కనిపించి తాను బస చూపించుతానని మమ్ము ఒక ఇంటికి తీసుకొని పోయినాడు. అతనికి 5౦ రూపాయలు ఇచ్చినాము. ఇంటికి 5౦౦ రూపాయలు అన్నారు. సంతోషముగా ఇచ్చి రాత్రికి పడుకొని నిదురపోయి తెల్లవారి నిత్యనైమిత్తిక కార్యములను ముగించుకొని, మా Luggage కారులో సర్దుకొని, వినాయక మహాబలేశ్వరుల దర్శనమునకు పోయినాము. వర్షము మాపై ఏమాత్రమూ కరుణించలేదు.
గోకర్ణం ఒక గొప్ప శైవ క్షేత్రము గా చాలా ప్రసిద్ది చెందింది . ఇక్కడి స్వామి మహా బలేశ్వరుడు . అమ్మవారు తామ్రగౌరి గా పిలవబడుతుంది . ఇది సిద్ధి క్షేత్రము గా ప్రసిద్ది చెందినది అని పూర్వీకులు చెపుతున్నారు . రావణాసురుని తల్లి కైకసి, రావణుడు, తపస్సు, ఆత్మలింగము, పరమేశ్వరుడువిఘ్నేశ్వరుడు, ఆత్మ లింగ భూపతనము అను క్రమములో జరిగిన, ఈ కథ భూకైలాస్ పేరుతో N.Tరామారావు నాయకునిగా వచ్చియుండినది. T.V. లలో అందరూ చూసియే వుంటారు కావున విస్తరించలేదు.
ఇక్కడ వెలిసిన పరమేశ్వరుని ఆత్మలింగమునకు పడమర ముఖము గా చక్కని ఆలయము నిర్మించినారు . ఈ ఆలయములో ని స్వామి పేరు మహాబలేశ్వరుడు . రావణుని వంటి మహాబలవంతుడు కూడా ఈ ఆత్మలింగాన్ని పైకి ఎత్తలేకపోయినందువల్ల స్వామికి మహాబలేశ్వరుడు అనే పేరు వచ్చింది . ఆలయములో వున్న లింగము యొక్క సగభాగము భూమి లో దిగబడి వున్నది మిగతా సగభాగము భూమి కి పైన వున్నది . భూమికి సగభాగము పై కి వున్న లింగము చుట్టూ అంటే నాల్గు వైపులా కప్పి వేస్తూ ఒక దాని మీద ఒకటిగా రాళ్ళు పేర్చుకుంటూ వచ్చినారు. అన్నిటి కన్నా పైన వుండే రాయి ఆవు చెవి ఆకారము ను కలిగి వుంటుంది.  ఆ రంద్రము లో చెయ్యి పెట్టి చూస్తే లోపలి లింగము యొక్క శిరోభాగము చేతికి తగులుతుంది . ఈ గోకర్ణ ము లాగా వుండే రంద్రము ఉన్న రాయి సుమారు నాలుగు అడుగుల చదరంగము వుంటుంది . భక్తులు ఆ రాయి చుట్టూ కూర్చొని స్వయము గా అభిషేకము చేస్తారు .

 60 సంవత్సరములకొకమారు ఆత్మ లింగము చుట్టూ ఉన్న రాళ్ళను తొలగొంచి పిఠము దగ్గరనుండి పై వరకు  వుండే సంపూర్ణ లింగాన్ని అందరూ దర్శించుకునేట్లు చేస్తారు . ఈ సమయము లో ఇక్కడ గొప్ప ఉత్సవము జరుగుతుంది . దేశము నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వొస్తారు .

ఆలయములోనికి ప్రవేశించగనే కుడి చేతి వైపు వినాయకుని ఆలయము ఉంది రావణాసురుడు మొట్టికాయ కొట్టినట్లు వినాయకుడి విగ్రహము మాడు పైన బొప్పెలు కట్టినట్లుగా ఒక గుంట వుంటుంది . గణపతిని అందరూ తాకి అభిషేకము స్వయము గా చేయవచ్చు . భక్తులు ఆ బొప్పెలకు వెన్నరాస్తారు . ఇక్కడ పట్టగణపతి కేతకి గణపతి అనే మరో రెండు ఆలయములు వున్నాయి .
ముందుగా వినాయకుని దర్శించుకొని ఆతరువాత ప్రాధాన ఆలయములోని మహా బలేశ్వరుడిని దర్శించుకోవడము ఇక్కడి ఆనవాయితీ . దాని పక్కనే పార్వతి దేవి ఆలయము కలదు . ఆత్మలింగము లో ఉన్న పరమేశ్వరుడు ఈ క్షేత్రము లో ఉన్నట్లు తెలుసుకొని ఆయనను వెదుక్కుంటూ పార్వతి దేవి ఇక్కడికి వచ్చినదని చెబుతారు. ఆరోజులలో ఈ ప్రాంతమును తామ్ర పర్వతము అని పిలిచేవారట . అందువలన ఈ అమ్మవారిని తామ్ర గౌరి అని పిలుస్తునారు .ఇక్కడ భద్రకాళి ఆలయము కోటితీర్దము కూడా వున్నాయి .

గోకర్ణ ప్రాంతములో నాగలింగపుష్పములుగా పిలువబడే  పుష్పములు ఎక్కువ గా దొరుకుతాయి . శివపూజకు వీనినే ఉపయోగించుతారు . భూకైలాసము గా ప్రసిద్దిపొందిన ఈ పుణ్య తీర్థమున గల మహా బలేశ్వరునికోటితీర్దములో స్నానమాచర్తించిఓపిక గలవారు  సముద్ర స్నానము చేసి స్వామిని దర్శిస్తారు.
పరమేశ్వరుని అనుగ్రహముతో జనసంమర్దము విపరీతముగా వున్నా, అచటి అర్చకులు మాకు CUE నియమము పాటింపజేయకుండా తాము తోడుగా వచ్చి దర్శనము చేయించినారు. పరమేశ్వరుడు వారికి సదా శుభములను చేకూర్చవలెెనని వేడుకొనుట తప్ప నేను చేయగలిగినది నాకేదీ కనిపించలేదు.

గోకర్ణమునందు సముద్రతీరము తప్పక చూడతగినదని విన్నాను కానీ వర్శమువల్ల అచటికి పోలేదు.
తరువాత స్వామి సన్నిధానమునకు దగ్గరగావున్న ఒక చిన్న హోటలులో అల్పాహారము కాఫీ ముగించుకొన్నాము. ఎంతో పరిశుభ్రముగానూ అత్మీయతతోనూ అడిగినది తినుటకు ఇచ్చిన ఆ మహిళా సిబ్బందిని మరువలేము. Cash Counter లో తప్ప ఆహోటలు అంతా మహిళలచేతనే నడుపబడుతుంది. ఉదయము 9 గంటలకల్లా మహాబలేశ్వరుని మనసారా నమస్కరించుకొని గోకర్ణమునుండి దాదాపు 7౦కిలోమీటర్ల దూరములో వుండే మృడేశ్వరమునకు మా ప్రయాణమును కొనసాగించినాము. దారిలో కీరదోస కాయలను ఎక్కువగా కొని ఉంచుకొన్నాము. లావులో అవి సన్నని సొరకాయ ను పోలినా పై బొప్పి చాలా పలుచన. కాయ చాలా లేతగా వుండి ఎంతో రుచికరముగా వుంటుంది. మేము దీనినే భోజనముగా మా యాత్రలో వాడుకొన్నాము.
మృడేశ్వరము లేక మరుడేశ్వరమును గూర్చి వేరొక సారి......
                     6వ భాగము
                   మురుడేశ్వరము
భూతేశః ఖణ్డ పరశుర్గిరీశోర్గిరిశోమృడఃl
మృత్యుంజయః కృత్తివాసాః పినాకీ ప్రమదాధిపఃll (అమరకోశము)
మృడ అంటే ఆనందము, ముదము, సంతోషము మొదలగు అర్థములు కలవు. అట్టి ఆనందమునకు అధిపతి కాబట్టి ఆపరమేశ్వరుడు మృడ అన్న నామమును కలిగియున్నాడు. అట్టి ఆనందమునకు అధిపతియై మృడేశ్వరుడైనాడు. మృడ అన్న శబ్దమే రానురానూ మురుడ అయినది అని తలచుచున్నాను. మురుడ అన్న మాటకు వస్త్రము అన్న అర్థము కన్నడములో వున్నదని చదివినాను.
రావణుడు గొనితెచ్చుచున్న ఆత్మలింగమును వినాయకుడు క్రింద ఉంచగా ఆ లింగమును పెకలింపబూని దానిపై గల వస్త్రమును విసరితే ఇచ్చటపడినందుచేత ఇచ్చటి శివలింగము మురుడేశ్వర లింగముగా ఖ్యాతినందిందని స్థల పురాణము. నాకేమో మృడేశ్వర అన్నదే సవ్యముగా తోచుతుంది.
అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి  కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్‌ తాలూకాలో ఉన్నది.
ఈ క్షేత్రము చుట్టూ మూడువైపులా అరేబియా సముద్రము  ఉన్నది.  ప్రపంచంలోనే అతి పొడవైన శివుని శిలావిగ్రహం ఇచట కలదు. ఆధారాల ప్రకారము  ఈ విగ్రహమును ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహముగా చెప్పుకొంటారు. 123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టిందని చెబుతారు. శివమొగ్గకు చెందిన కాశీనాథ్ఆయన కుమారుడు శ్రీధర్ఇతర శిల్పుల సహాయ సహకారములతో, R.N. షెట్టి అన్న వదాన్యుడు కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించినారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.ఈ దేవాలయము కందుక పర్వతముపైనున్నది. ఈ దేవాలయపు గాలి గోపురము 18 (కొందరు 20 అంతస్తులు అంటారు. నాకు 18 మాత్రమే తెలియవచ్చినవి.) అంతస్తులనుకలిగియున్నది. పై అంతస్తు చేరుటకు Lift సౌఖర్యము కలదు. పైనుండి సముద్రము మరియు దేవాలయ పరిసరములు చూచుటకు ఎంతో హృద్యముగా వుంటాయి. Lift లో పై అంతస్తు చేరుటకుట్ తలకు రూ.10\= Ticket కొనవలసి వుంటుంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులా అన్నట్లు ద్వారమునకు ఇరువైపులా రెండు ఏనుగులు వున్నాయి. దేవాలయ గర్భగుడి మాత్రము స్థాపత్య ఆగమ శాస్త్రానుసారముగా పూర్వమునుండి, అపూర్వ శోభలతో దనరారుచున్నది.
ఇచట కూడా మమ్ము నేరుమార్గములో తీసుకుపోయి దర్శనము చేయించినారు. మా వయసు, వారి మనసు మాకు సహకరించినవి.

ఇక అచ్చటి నుండి కొల్లూరు బయలుదెరినాము. కుండపోత వర్షము మమ్ము విడువకుండా వెన్నంటినది.
వేరోకసారి కొల్లూరిని గూర్చి..............
                     7వ భాగము
                       కొల్లూరు
త్రేతాయుగంలో శక్తిస్వరూపిణి జగన్మాత సౌపర్ణికా నది ఒడ్డున కోడచాద్రి పై మూకాంబికాదేవి అవతరించింది. కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరుకు 135 కి.మీల దూరంలో 3880 అడుగుల ఎత్తులో వున్న కోడచాద్రి పై పరశురాముడు ప్రతిష్ఠించారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మహామహితామూర్తి అయిన మూకాంబికాదేవిని దర్శించడానికి భక్తులు ఆ పర్వత శిఖరాన్ని ఎక్కలేకపోతున్నారని ఆదిశంకరాచార్యులు కొండ క్రిందిభాగంలో మూకాంబకాదేవిని పునఃప్రతిష్ఠ చేశారని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. శ్రీరామునికీ రావణాసురుడికి జరుగుతున్న యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్న సమయంలో ఆ పర్వతంపై వున్న ఔషధీయుక్తమగువనమూలికలు కొన్ని కొల్లూరు కొండ ప్రాంతంలో పడినట్లు స్థలపురాణము. ఈ కారణంగా ఈ ప్రాంతమంతా వనమూలికల సువాసనతో నిండి వుంటుంది. మహారణ్యపురం అనే నామంతో వున్న ఈ ప్రాంతంలో కోలమహర్షి తపస్సు చేసి శివుడిని మెప్పించినాడట. స్వామీ సతీ సమేతముగా ప్రత్యక్షముకాగా మహర్షి సదా పూజలందుకొనే విధముగా ఇరువురు అచట నిలువవలేనన్నాదట. అంత స్వామీ స్వయంగా రూపుదిద్దిన పార్దివలింగాన్ని, మధ్యలో ఒక బంగారు రేఖ వుండులాగున (అర్ధనారీశ్వర తత్వము) కోల మహర్షికి ఆ స్వామి ప్రసాదించినాడట. ఆ కారణంగా ఈ ప్రాంతానికి కోలపురం అనే పేరు సార్థకమైంది. కాలక్రమేణా కోలపురము కొల్లూరుగా మారింది. కోల మహర్షి తపస్సుచేస్తున్న సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఆ మహర్షిని వేధిస్తూ తపోభంగం చేస్తుండటంవలన ఆ మహర్షి కోరిక మేరకు జగన్మాత మూకాంబికాదేవిగా అవతరించి మూకాసురుడిని వధించింది. ఆ తరువాత మహర్షి కోరికతో ఆ జగన్మాత అక్కడే వుండిపోయింది. ఈ మహాశక్తి దుర్గాదేవి అవతారం శంఖ చక్రాలతో సింహంపై కూర్చున్నట్లుగా కనిపించుతుంది.
మూకాంబికా దేవి ఆలయం కోడచాద్రి శిఖరం క్రింద ఉంటుంది. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని (ఐదు లోహాల మిశ్రమము) ఆది శంకరాచార్యులవారు ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ప్రతిష్ఠించినారని అంటారు. మూకాంబికాదేవి మొదట కోడచాద్రి శిఖరం (3880') మీద ఉండేదనిసామాన్య ప్రజానీకానికి కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతోశంకరాచార్య ఆ దేవాలయాన్ని కోలూరు లో తిరిగి స్థాపించినారని ప్రజలు నమ్ముతారు.
 ఈ అమ్మవారితోపాటు పార్దివ లింగాన్ని శంకరాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అమ్మవారికి ముందుభాగంలో పాదాల దగ్గర శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించినారు శంకరులవారు. మాత రూపాన్ని మనసులో పదిలపరచుకొన్న శంకరులవారు పంచలోహములతో ఆమె విగ్రహాన్ని రూపొందించి శ్రీచక్రం దగ్గర ఉంచినారు. నిత్య పూజాభిషేకములు ఆ పంచలోహ విగ్రహమునకు చేస్తు ఉంటారు.
నాడు శంకరులవారు ఏర్పరచిన పూజాభిషేకములు నేటికీ అదేవిధంగా జరుగుతున్నాయి. ఆదిశంకరాచార్యులు పూజలు చేసిన ఈ ఆలయంలో ఎంతో మహిమ వుందనిఇక్కడ అమ్మవారిని దర్శించి ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఈఅరణ్య ప్రాంతములో ప్రవహించే అగ్నితీర్ధ సౌపర్ణిక అనే రెండు నదులు కోడచాద్రి  నుండి దిగుతున్నాయి. కాలభైరవ మరియు ఉమామహేశ్వర ఆలయాల మధ్య ఉన్న ప్రాంతము సౌపర్ణిక నది యొక్క మూలము. తన తల్లి వినుత యొక్క కష్టములను పోగొట్టమని దేవిని ప్రార్థిస్తూ సుపర్ణుడు (గరుత్మంతుడు) ఈ నది ఒడ్డునే తపస్సు చేసినాడని పురాణాలు చెబుతున్నాయి.  తన జ్ఞాపకార్థము గరుత్మంతుడు ఆనదికి  తన పేరు పెట్టవలని కోరితేదేవి తధాస్తు అనుటతో అప్పటినుండి సౌపర్ణిక అన్న పేరు ఆ నదికి వచ్చింది. అతను తపస్సు చేసిన స్థలము "గరుడ గుహ" అని పిలవబడే ఒక చిన్న గుహగా ఈ నాటికి కూడా ఉంది. ఇక్కడ నీరు ఎంతో స్వచ్ఛంగా వుంటాయి. భక్తులు ఇచట స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తారు. పండుగ రోజులలో ఈ ఆలయంలో ప్రత్యేకముగా పూజలు జరుగుతుంటాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సుబ్రహ్మణ్యశ్రీ పార్థివేశ్వరశ్రీ పంచముఖ గణాధిపశ్రీ చంద్రమౌళీశ్వరశ్రీ ప్రాణలింగేశ్వరశ్రీ నంజుండేశ్వరశ్రీ ఆంజనేయసుబ్రహ్మణ్యవీరభద్రశ్రీ వెంకటరమణశ్రీ తులసి గోపాలకృష్ణలు మొదలగుఇతర దేవతలు కూడా కోలువైయున్నారు   పది చేతులతో ఆయుధాలు ఉన్న అభయ వినాయక విగ్రహము మనకు ఎంతో ఆశ్చర్యజనకమైన సిశాయము. ఆదిశంకరాచార్యుల విగ్రహం ఎంతో ప్రకాశవంతంగా ఆ స్వామి తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఈ ఆలయంలో రోజుకు మూడు సార్లు ఉదయంమధ్యాహ్నంరాత్రి మహానివేదన హారతి ఇస్తారు. ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు ప్రతిరోజూ జరుగుతుంటాయి. సమీపమునగల కోల మహర్షి ఆశ్రమదర్శనమునకు అనువుగా బస్సు సౌకర్యం కూడా వుంది. ప్రకృతి అందాలతో ప్రతినిత్యం భక్తుల సందడితో దేదీప్యమానంగా ప్రకాశించే ఈ ఆలయంలో మూకాంబికాదేవి దర్శనము భక్తులకు ఆ జగన్మాత వరప్రసాదము.
ఈ దేవాలయానికి,  అమ్మవారి రెండు బంగారు దేవతా విగ్రహాలు ఉన్నాయి. అసలు విగ్రహము ఎకారనముచేతనో పోవడంతోరాణీ చెన్నమ్మ దానికి బదులుగా బహుకరించిన విగ్రహము ఉంచబడింది. తరువాత ఆ పోయిన విగ్రహం దొరకడంతోఇప్పుడు రెండు విగ్రహాలు మనకు దేవాలయములో దర్శనమిస్తూవున్నాయి.
K.J. ఏసుదాసు దేవీ మూకాంబిక పరమభక్తుడు. తన పుట్టినరోజుకు ప్రతి ఏడూ ఇచ్చటికి వస్తూవుంటాడు. 2010 జనవరి 10ఆదివారం నాడుఅయన తన 70వ జన్మదిన సందర్భముగా ఈ ఆలయములో ఒక సంగీతార్చన (సాంప్రదాయక భక్తిగీతాలు)  కార్యక్రమాన్ని 70 గాయకులతో అమ్మవారి ముందు  నిర్వహించినాడు.
అక్కడినుండి దాదాపు 8౦కి.మీ. దూరములో వుండే ఉడుపికి మేమూ, వాన ప్రయాణము కొనసాగించినాము


8వ భాగము - ఉడుపి
  ప్రాంతము పేరు ఉడుపి, ఉడిపి కాదు. స్ధానిక చరిత్ర ప్రకారం చంద్రుడు 27 నక్షత్రాల పేర్లుగల దక్షుని కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కానీ రోహిణికి ఎక్కువగా ఆకర్షితుడై మిగిలిన భార్యల ఎడల నిర్లక్ష్యముతో ఉండుటవలనదక్షుని శాపంచే చంద్రుడు వ్యాధిగ్రస్తుడై క్షీణింపసాగినాడు. చంద్రుడుఅతని భార్యలు కలసి శాప విమోచనకై ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినారు అన్నది స్థల పురాణము. ఇప్పటికీ ఈ లింగాన్ని ఉడుపిలో చూడవచ్చు. సంస్కృతంలో ఉడు అంటే వెన్నెల, తారకలుఅంటే అధిపతి, అధీశుడు, భర్త అని అర్థము. కావున ఉడుప అంటే చంద్రుడు. ఆయన తపమాచరించిన స్థలమగుటచే ఈ ప్రాంతమును ఉడుపి అన్నారు. కాలాంతరములో రూపాంతరముచెంది ఉడిపి అయినది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. ఈ ప్రాంతమునకు దగ్గరగా శివళ్ళి అన్న జనావాసము ఉండేది. రానురానూ వాణిజ్య వ్యవసాయ రంగములందు అధికమగు అభివృద్ధి వలననూ, జన సంఖ్య పెరుగుట చేతనూ చుట్టుపక్కల మరికొన్ని జనావాసములు కలియుట చేతనూ ఉడిపి అన్న పేరుతో నగరమై, శ్రీకృష్ణ ధామమై, విద్యానిలయమై, విద్యాలయ ప్రాంగానమై ప్రసిద్ధికెక్కినది. ఉడిపి నారికేళ వృక్షములకు, పోకచెట్లకు, ముంతమామిడికి  పెట్టింది పేరు.
వేరొక కథనము ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అనిదానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి ప్రాంతము, అద్వైత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలము. పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహమును ప్రతిష్ఠించి మఠమును స్థాపించినారు. దీనికి సంబంధించిన కథను ఈ విధముగా చెప్పుకొంటారు. ఒకసారి తీవ్రమైన తుఫాను తాకిడికి ఉడిపి సమీపమున సముద్రములో ఒకనావ మునిగిపోవుతరి మహిమాన్వితులగు మధ్వాచార్యులవారు దానిని రక్షించగా, ఆ నావికుడు ఆచార్యులవారిని ఆ నావికుని పరిధిలోవున్న ఏ వస్తువయినాకూడా కోరుకోమ్మన్నాడట. ఆ ఓడ సామాగ్రిలో కలసిపోయిన చందనము మూటను కోరినారు ఆచార్యులవారు. అందు శ్రీకృష్ణ విగ్రహము కలదని తన దివ్య దృష్టిచే తెలుసుకొన్నారు కాబట్టి. ఆ తరువాత ఆ విగ్రహమును ఆగమ శాస్త్రానుసారముగా ఆయన ప్రతిష్ఠించినారట.
ఉడుపి శ్రీకృష్ణ దేవాలయమును గురించి ఒక స్ధానిక కథనము ప్రకారము, 16వ శతాబ్దములో నిమ్న కులమునకు చెందిన కనకదాసు అను భక్తుడు కృష్ణ దర్శనము కోరి దేవాలయమునకు వస్తే, అతడిని దేవాలయంలోనికి అనుమతినివ్వలేదని దానికిగాను కనకదాసు దేవాలయమునకు ఉన్న చిన్న కిటికీ నుండి లోపలికి చూసినాడనిఅయితే అతనికి శ్రీకృష్ణుడి వీపు భాగం మాత్రం కనపడిందనిఅప్పుడు శ్రీకృష్ణుడు తానే కనక దాసు వైపునకు తిరిగి ఆయనకు దర్శనము కలుగాజేసినాడట.
ఇక్కడికి దగ్గరలో ఉన్న యల్లూరులో మరో శివాలయం ఉంది. ఇది సుమారు వేయి సంవత్సరాల పురాతనమైనదని చెపుతారు. ప్రతి సంవత్సరములక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయంఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. కనకదాసుకు దర్శనమిచ్చిన కిటికీ కాబట్టి దీనిని కనకణ కిండె అంటారు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు)వామభాగాన గరుడ దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికీ, పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు
    ఉడిపి నుండి 3 కిలోమీటర్ల దూరంలో మణిపాల్ నెలకొని ఉంది. పూర్వము ఈమణిపాల్షివల్లీ గ్రామ పంచాయితీ క్రింద ఉండేది. ఈ పేరు మణిపాల్‌గా ఆంగ్లీకరించుటకు మున్ను, మన్ను పల్లా వుండేది. తుళు భాషలో మన్ను అనగా మట్టి మరియు పల్లా అనగా (గుంత) చెరువు అని అర్థం. మట్టిచెరువు అని అర్థము. వైద్యుడుబ్యాంకర్విద్యావేత్తపారిశ్రామికవేత్త మరియు పరోపకారి అయిన Dr.T.M.A. పాయ్ ఒక బంజరు భూమిగా ఉండిపోయిన కొండను విశ్వవిద్యాలయముగా రూపుదిద్ది, మణిపాల్ ను  పట్టణముగా 1950వ దశకంలో రూపొందించి  ప్రాముఖ్యతను సంతరింపజేసినాడు.
జన్మలో ఒకసారి ఉడిపి దర్శనము తప్పక చేసుకొని తరించ దలచుతారు భక్తులు.

రాత్రికి మేము ఉడిపి లోనే బస చేసినాము. మఠమునకు సంబంధించినది కావున వారు మా ముగ్గురికీ, రూ.7౦౦ మాత్రమే తీసుకొన్నారు ఒక రోజుకు. తెల్లవారి కాలకృత్యములు తీర్చుకొని స్నానాదులు చేసి, ధ్యానాదులు ముగించుకొని, ఫలాహారము చేసి అచటి నుండి 1౦5 కి.మీ. దూరమున్న ధర్మస్థలకు బయలుదేరినాము. ఇన్ని పుణ్యక్షేత్రములలో మేము తడవకుండా దైవదర్శనము చేసుకొన్న ప్రదేశమే లేదు. అంతటి ఎడతెరిపిలేనివానను మనప్రాంతములలో చూడలేము. ప్రవాహాలు ఉధృతమై ప్రయాణమునకు భంగమౌతుందేమోనన్న భయము ఆవరించినా కూడా ఆసాన్థమూ దేవునిపై భారము వేసి ప్రతి క్షేత్రమునూ దర్శించుకొన్నాము. జడివానకు జడువకనే జాడబట్టి ప్రయాణము చేస్తూ పోయినాము. వర్షము యొక్క ఉధృతి పెరిగిపోయి భ్రుగుపాతము లేక భూపాతము  (Land sliding, కొండ చరియలు విరిగి పడుట) జరిగి, చెట్లు రథ్యలపై (Roads) విరిగి పడి, వాతావరణము పోగామంచుచే దట్టముగా కప్పబడి, వానలచే రోడ్లు బీటలుబారి, విరుచుకుపడి నిరంతర అంతరాయమును ఆ దినమునకు సృష్టించినాయి. ఎట్లయితేనేమి మా సారధి సరియైనవాడగుటచే సావధానముగానూ సక్రమముగానూ ధర్మస్థల చేరినాము. 
9వ భాగము - ధర్మస్థల
క్షేమముగా ధర్మస్థల చేరినాము. వాహనమును దేవస్థానము వారు చెప్పిన చోట నిలుపుకొని మేము పాదచారులమై మంజునాథస్వామి దర్శనమునకు బయలుదేరినాము. దేవాలయ ముఖద్వారము సమీపించగనే, ముఖద్వారము చేరుటకు ఎక్కవలసిన 15 మోకాటి ఎత్తు మెట్లు చూసి దిగాలుపదిపోయినాను. ఎట్టి పరిస్థితిలోకూడా  నేను నా శ్రీమతి ఎక్కలేము. అప్పుడు అక్కడవున్న Guard పిలుపు వినిపించింది. మీరు ఇటు రండి అని అన్నాడతను. అతను మమ్ము పిలిచిన చోట మెట్లు ఎక్కుటకు గ్రాది(Hand Railing, మెట్లు ఎక్కుటకు ఆపుగా చేతితో పట్టుకొని ఎక్కుటకు ఏర్పరచిన కమ్మీ)కి ఒక కుర్చీ పైవరకు ప్రాకుటకు వీలుగా అమర్చబడి వున్నది. దేవునికి ధన్యవాదములు, అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని అతని సహాయముతో మంజునాతుని దర్శనముకొరకు గుడిలో ప్రవేశించినాము. అక్కడ కూడా ఒక పుణ్యాత్ముడు మమ్ము తనవెంట దగ్గరిదారిలో తీసుకొని పోయి నేత్రపర్వముగా స్వామీ దర్శనము చేయించినాడు, దైవం మానుష రూపేణ అన్న సూక్తిని గుర్తుచేస్తూ! అంతా ముగించుకొని మేము మెట్లు ఎక్కినవిధముగానే దిగి వచ్చినాము. అక్కడ ఒక యువతి ద్వారబంధము దాటుటకు నాకు సహాయము చేసింది, బహుశ నా కుమార్తె స్వామికి నమస్కారము చేసుకొనుచుండుటవల్ల కాబోలు. లేకుంటే నాయాత్రలో నా కూతురే నా తోడుగా నిలచినది. నా శ్రీమతి తాను నడవగలుగుతుంది కానీ నాకవసరమగుచోట
 నన్ను పట్టుకొని తాను నడువలేదు. తానూ వయసులో పెద్దది కదా! నావలె సహాయము కోరకుండా తాను నడవగాలుగుతుంది. ఆయువతి పాదస్పర్శచేసి నమస్కరించి కదిలినది. ఆమె సంస్కారమునకు నమస్కారము చేయుట తప్ప ఏమి ఇచ్చుకోగలను. మనసారా దీర్ఘసుమంగళీభవ అని దీవించినాను. క్రిందికి దిగుతూనే Guard మమ్ము నిలిపి, కారు నంబరు తీసుకొని, కారు పెట్టె స్థలములో వున్న వ్యక్తికి ఫోను చేసి, మేమున్న చోటికే రప్పించినాడు. కృతజ్ఞత నిండిన కన్నులతో అతనిని దీవించి అక్కడినుండి కదిలినాము. అప్పటికి గంట ఇంచుమించుగా మధ్యాహ్నము ఒకటి అయివుంటుంది. ఇప్పుడు ధర్మస్థలను గూర్చి నేను తెలుసుకొన్నది తెలియజేస్తాను.

ధర్మస్థల
ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. ఈ ప్రసిద్ధ క్షేత్రానికి కొన్ని దేశములో వేరెక్కడా లేని ప్రత్యేకతలున్నాయి. నాకు
తెలిసిన మేరకు చెప్పే ప్రయత్నము చేస్తాను.
ధర్మస్థలలోని శివలింగము గ్రామదేవత అయిన అణ్ణప్ప దైవము చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తారు.
పర్గాడే కుటుంబాలకు అణ్ణప్ప ను తమ కులదైవముగా నెంచుతారు. పర్గాడే అన్న మాట రానురానూ హేగడే అయ్యిందిఅసలు పర్గాడే అన్నది కూడా ప్రగ్గడ అన్న ఒక బ్రాహ్మణ శాఖ నుండి ఉద్బవించినదని నా ఆలోచన, ఇందులో పోరాబాతుకూడా ఉండవచ్చు. ఈవిషయమును జగదేకవీరునికథలో రాజుపాత్రదారియగు రాజనాల తనమంత్రిని ప్రగ్గడా, బాదరాయణ ప్రగ్గడా అని పడే పడే సంభోదిస్తూవుంటాడు.

ఈ దివ్య క్షేత్రానికి 8౦౦ సంవర్త్సరముల చరిత్ర వుంది. ఈ క్షేత్రము సార్థక నామధేయము కలిగివున్నది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ క్షేత్రము దిగంబర జైన శాఖీయులచేత నడపబడుతూవుంది. గుడిలోని ప్రధాన దేవత మంజునాథ నామధేయుడగు శివుడు. ఇక్కడ శివునితోబాటుగా  అమ్మవారు (కన్నడములో అమ్మనవరు, ప్రత్యేకమైన పేరు లేదని తెలియవచ్చుచున్నది.). వున్నారు. వీరితోబాటుగా కాలరాహు, కాలకేయి, కుమారస్వామి, కన్యాకుమారి అను, ధర్మదైవములుగా పిలువబడే దేవతలు ఈ క్షేత్రము యొక్క ధర్మపరత్వమును క్షేత్రపాలకులై కాపాడుచున్నారు. ఇచ్చటినుండి ఏదయినా వస్తువు కంటికి కానరాకుండా తీసుకొని
 బయటికి దాతదలచితే వెంటనే కడుపునొప్పితో బాధపడి ఆ తీసిన వస్తువును తక్షణం ఉన్నచోటనే పెట్టివేస్తాడట. ఇచట ప్రవహించే నది పేరు నేత్రావతి.
ఈ హెగ్గడే అన్నది వంశ నామము. దీనిని కర్ణాటకలో జైనులు, బ్రాహ్మణులు, ఒక్కలింగలు, బంతు అన్న ఒక స్థానిక శాఖకు చెందినవారు ఉంచుకొంటారు. 8౦౦ల సంవత్సరముల క్రితము ధర్మస్థల అన్న పేరుకు బదులుగా మల్లమాడి అన్న పల్లెలో కుదుమ అని పిలిచేవారట. ఇక్కడ బిర్మన్న పెర్గాడే అమ్ము బల్లాల్తి అన్న జైన దంపతులు నివసించేవారు. వీరు ధర్మానికి, దయకు, పరోపకారమునకు మారుపేరై నివసించేవారు. వారిని పరీక్షించుటకు పైన తెలిపిన ధర్మదేవతలు మారురూపములవచ్చి పశ్రీక్షించి, సంతృప్తిని పొంది, కొన్ని దినముల తరువాత బిర్మన్నకు స్వప్నమున కనిపించి ధర్మదేవతలగు తాము  నెలవైయుండుటకు అది తగిన ప్రదేశముగానూ, కొలువైయుండుటకు అతని ఇల్లు తగినదిగానూ గుర్తించినామని చెప్పి తనను వేరే ఇల్లు కట్టించుకొనమని చెప్పి  వారాఇంటిలో ప్రతిష్ఠితులైనారు. వారాతనికది శ్రీ క్షేత్రమని తెలిపి తాము చెప్పినట్లే చేయమన్నారు. బిర్మన్న అటులనే చేసినాడు. ధర్మచారుడు కదా! వారు అతనికి తమ ప్రతినిధులుగా ఇద్దరు పండితులగు  అర్చకులను తమకుగానూ, అదేవిధముగా నలుగురు విద్యావంతులు తనకు శ్రేయోభిలాషులగు ఆజ్ఞానువర్తులుగానూ వుంచుకొమ్మని ఉపదేశించినారు. ఈ ధర్మదేవతలుతమ  ప్రతినిధులగు వారిరువురిచే దైవవాక్కును పలికింపజేస్తారట అవసరమగునపుడు. వీరిని  డెలాపాదిత్య మరియు మనవోలిత్యాయ అంటారు. నిరంతర పూజాది సత్కార్య అకుంఠిత సాధనకై బిర్మన్నను ఆ ధర్మదేవతలు సంపద్వరిష్టునిగా చేసినారట.
ఈ ధర్మక్షేత్రమున శివ అంటే శుభకరుడు, శంకరుడు అంటే శ్రేయస్కరుడు వుంటే ధర్మము నిరంతరమూ నిలువగలుగుతుందని ఆయన అనుచరులు సలహా ఇచ్చినారట. హెగడే కుటుంబము అట్లేయని శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు ధర్మ దేవతల పనుపున అణ్ణప్ప స్వామి శివలింగమును తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమయినాడట. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసే వేళకు హెగడే గృహానికి వెలుపల శివలింగం ప్రతిష్ఠింపబడి ఉంది. అణ్ణప్ప స్వామి మంగళూరు సమీపంలోని ఖాద్రి నుండి తెచ్చి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు అచ్చటి కథనము. ఆ తరువాత, అచ్చటి వారలకు ఆ లింగము మంగళూరు నందలి ఖాద్రి ఆలయం లోనిదని తెలిసింది. అణ్ణప్ప దైవము తిరిగీ ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతము ధర్మస్థల ప్రజలు అణ్ణప్ప దైవాన్ని గ్రామదేవత పంజుర్లిగా ఆరాధిస్తున్నారు. వేకువనే ఇంటిముందు లింగముండుట మహాద్భుతముగా నెంచి హెగడే కుటుంబమువారు శివలింగము చుట్టూ మంజునాథుని ఆలయనిర్మాణం జరిపించినారు. ధర్మస్థల దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి చెందినది. ఇది శివక్షేత్రము అని వేరేగా చెప్పనవసరము లేదు.
ఈ శైవ క్షేత్రము జైనులచే నిర్వహిమబడుతూవుంటే వైష్ణవులు దీనికి పూజారులు. ఈ క్షేత్రమునకు మరియొక ప్రత్యేకత యున్నది. 16వ శతాబ్దములో హెగ్డే కుటుంబమునకు చెందిన దేవరాజ హెగ్గడే ఉడిపి మఠాధిపతులగు వాదిరాజస్వామిని ధర్మస్థలకు ఆహ్వానించినారు. స్వామి అక్కడ శివలింగ ప్రతిష్ఠ శాస్త్రోక్తముగా జరుగని కారణమున భిక్ష స్వీకరించనన్నాడు. అప్పుడు దేవరాజ హెగ్గడే ఆయనను ప్రార్థించగా మాధ్వ పద్ధతిలో ప్రతిష్ఠ చేయించి బిక్ష గైకొన్నాడు. దీనినిబట్టి ఈ క్షేత్రము సర్వ వేదాంత మార్గములకు సరియైనకూడలిగా శోభిల్లుచున్నది. లక్ష దీపారాధన ఉత్సవము ప్రథిఎదో నేత్ర పర్వముగా జరుగుతుంది.


దిగంబర జైన సిద్ధాంత వేదికగా భాసిల్లిన ధర్మస్థలలో ఎన్నోశాతాబ్దములనాటి శ్రీ చంద్రనాథస్వామి బాసాది గారి పేరున నిలచిన జైన మందిరము తప్పక చూడతగినది. శిలాఫలకముపై స్వామివారి బోధనలు గానవచ్చును. ఇవి సంఘటితముగా అందరూ ఆచరింపతగినవి.

ధర్మస్థల ధర్మస్థానము వారు ఉచితముగా బస ఒకరోజుకు ఏర్పాటుచేస్తారు. భోజనము ఉచితముగా లభిస్తుంది. ధర్మస్థలకు ఒకరోజుకు సుమారుగా 10,000 భక్తులు వస్తుంటారు. అలయదర్శనానికి వచ్చే ప్రతివెయ్యిమందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు. భోజనశాల పేరు 'అన్నపూర్ణ'. ఆధునిక పరికరాలతో కూడిన ఈవంటశాలలో రుచుకరమైన భోజనం పరిశుద్ధంగా తయారు చేయబడుతుంది. అన్నదానం చేసేసమయంలలో ఆలయనిర్వాహకులు పేదధనిక భేదాలు చూడరు. భక్తులు Cue లోనిలిచే శ్రమకోర్చి మరీ భోజనము చేస్తారు.
ధర్మస్థల లోనూ మరియు అనేక పరిసర ప్రాంతములలోనూ విద్యానిలయములనేర్పరచి, పేదలకు ఉచిత విద్యాసౌఖర్యములనోసంగుతూ, యోగ, సంస్కృతము, మన సంస్కృతి తోబాటు ఆధునిక విద్యనూ కూడా అందజేస్తున్నారు. ఈ ప్రణాళికకు మూలపురుషుడు స్వర్గస్త మంజయ్య హెగ్గడే గారు.
ఆయుర్దానము అన్న పేరుతో ఆలోపతి, ఆయుర్వేదనా, ప్రకృతివైద్యము తోడుగా యోగ, సూర్యనమస్కారములు అన్నింటినీ ఉడిపి, హాసన్ మొదలగు వివిధ ప్రాంతములలో ఏర్పాటుచేసినారు.  అభాయదానమను పేరుతో సామూహిక వివాహములను కుల విచక్షణ లేకుండా దంపతులకు మంగళసూత్రము, బట్టలు ఇచ్చుట ఇక్కడి ఆనవాయితీ.
ధర్మస్థల నిస్వార్ధసేవకు నికరమైన చిహ్నంగా నిలిచియున్నది.
మెల్లగా కారు కుకే సుబ్రమణ్యకు బయలుదేరినది. కారులోపలినుండి ఎదురుగా ఏ వాహనము వస్తూవున్నది అన్నది కనిపించుటలేదు. భూపాతములు దారిలో అక్కడక్కడ కనిపిస్తూ వచ్చినవి. తన సామర్థ్యముతో, భగవంతుని అనుగ్రహముతో బండిని తోలి కుకే వైపునకు బండి త్రిప్పినాడు. కారు ఒక గజమయినా కదలినదో లేదో మాకు ఒక కారు ఎదురయినది. ఆ కారు సారధి నిలిపి మా డ్రైవర్ తో మీరు కుకే పోతూవుంటే వెనుదిరగండి. ఈరోజంతా నిలచినా కూడా మీరు పోలేరు. అందుకే మేము తిరిగివస్తున్నాము అన్నాడు. మావాడు వెంటనే ముగ్గురూ నలుగురు తన సహచర సారధులకు ఫోనే చేసి ఆ మాట నిజమని తెలుసుకొని వెనుదిరిగినాడు. మరి స్వామీ సంద్రశనము మాకు రాసిపెట్టబడి ఉందోలేదో తెలియదు. మాకుమాత్రము ఆ సమయములో దేవుడే మేము కష్టపడకుండా ఉండేందుకే ఆ కారువానితో చెప్పించినాదనిపించింది. కొంత దూరము కష్టము తో ప్రయాణము చేసిన మీదట వాహనములు మాకేడురుగా ఒక వెయ్యికి తక్కువలేకుండా నిలిచియున్నాయి. కారణము తెలుసుకొంటే Land Sliding, Earth Moving, Trees Falling, Two Three Vehicle Accidents on the opposite side అని ఒకతను ఆంగ్లములో చెప్పినాడు. ఆ స్థితిని దాటుటకు తప్పక 7,8 గంటలు పట్టేదే! కానీ మా సారధి వివిధ విధములగు ఉపాయములతో ఒక 3 గంటలలోనే గండము గట్టేక్కించినాడు. రాత్రి 11 గంటలు బంగాలురు చేరుకొన్నాము. మా పెద్దమ్మాయి భర్త తన పర్చయాల ద్వారా ఒక మంచి Lodge 8౦౦ రూపాయలకే ముగ్గురికీ ఏర్పాటు చేయించినాడు. శయ్య ముగ్గురికీ చక్కగా అమరుతతో హాయిగా నిద్రపోయి కార్యక్రములు ముగించుకొని హైదరాబాదుకు తిరోన్ముఖులమై క్షేమముగా వచ్చిచేరినాము.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయా
సర్వే బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
అంతా సుఖించాలి అంతా వ్యాధిరహితులు కావాలి అందరూ శుభాలను చూడాలి
 ఏ ఒక్కడూ దుఃఖంచే బాధించబడరాదుఈ మహదాశయముతో ఈ రచన ముగిస్తున్నాను.
సర్వేపి స్సుఖిన స్సంతు సర్వే  సంతు  నిరామయాl 
సర్వేే బధ్నాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ll
అపౌత్రః పుత్రిణస్సంతు పుత్రిణఃసంతు పౌత్రిణఃl
అధనాః సాధనా స్సంతు జీవంతు శరదశ్శతంll
స్వస్తి
https://cherukuramamohanrao.blogspot.com/2018/09/blog-post.html