ఇక ఒక మాట పరమాత్మునికి ఆప్తులైన వారి మనసులలో ఏమున్నదో గమనించుదాము.
మిగతది మరొకసారి............
శ్రీకృష్ణావతరణము – శ్రీకృష్ణావతారము
(శ్రీకృష్ణ జననము కాదు)- చివరి భాగము
బ్రహ్మదేవుడు పరమాత్ముని ఈ విధముగా ప్రార్థించుచున్నాడు. ఇంతకాలానికి నాసృష్టి యగు మానవలోకములో జన్మింపబోవుచున్నావు. శ్రీరామునిగా పునర్వసు నక్షత్రములో భూమిపైకి వచ్చినావు. ఈసారయినా నా జన్మ నక్షత్రమగు ‘రోహిణి’ లో నీవు జన్మించాకూదడా! అనుకొన్నాడు. చంద్రుడు,”స్వామీ రామునిగా సూర్య వంశములో జన్మించినావు. ఇప్పుడు నీవు నాదగు చంద్రవంశములో జన్మింపబోవుచున్నావు. నాకు ఇష్టమగు భార్య రోహిణి అని నీకు తెలుసు కదా! నీవెందుకు ‘రోహిణి’ నక్షత్రములో పుట్టి మాకు ప్రసన్నత చేకూర్చ కూడదు అని అనుకొన్నాడట. ఇక బలరాముని గర్భమున దాల్చిన రోహిణి జగన్నాథుని అంశ అయితే నా గర్భమున వున్నది కానీ జగన్నాధుడు లేడే అని చింతించినదై, పోనీ కనీసము తాను నా పేరుగలిగిన నక్షత్రములో ఉదయించ గూడదా అని తలపోసినదట. పరమాత్మ అందరి కోరికలూ తీరుస్తూ రోహిణీ నక్షత్రములో పుట్టినాడట.
ఇక స్వామితల్లి గర్భమునుండి బయలుపడునపుడు, ఆ తల్లికి, తానుప్రసవింప బోవుచున్నాను అన్న స్పృహ లేదట. సాయంసమయమున తూర్పునుండి చంద్రుడు ఏచడీచప్పుడు లేకుండా బయల్పడుతాడో అంత సులభముగా ఉద్భావించినాడట దేవకీ దేవికి ఆ పురుషోత్తముడు. ఆయన అవతరించబోవు సమయమున భూదేవి తన కుమారుడైన మంగళుని చంకనబెట్టుకొని ఎదురు వచ్చిందట. (ఇక్కడ రెండు మాటలు చెప్పుకోవాలి. గృహస్తు పొరుగు వూరికి వెళ్ళునపుడు ఇల్లాలు బిడ్డను ఎత్తుకొని ఎదురు వచ్చుట శుభసూచకము. అంగారక గ్రహమునకు మంగళ, భూమిపుత్ర అన్న పేర్లున్నాయి. సైన్సు పరముగా కూడా అగారక గ్రహము ఎప్పుడో విడిపోయిన భూమి శకలమే అని చెప్పినారు. దీనిని Symbolic గా తీసుకోవాలి కానీ అన్యథా కాదు. ఇంకొక అంతరార్థము ఏమిటంటే పరమాత్మ ఆగమన సమయములో భూమి మంగళకరముగా, మంగళమయమై, మంగళయుతముగా ఒప్పారుచున్నది అని గ్రహించవలెను). తమ తీరమున విహరించబోతున్నాడని, యమునాది నదులన్నీ ఉత్సాహముతో ఉరకలు వేస్తున్నాయట. దేవ దుందుభులు మ్రోగగా, మేఘములు ‘భగవాన్’ ‘ఆవిర్భవ’ ‘ఆవిర్భవ’ ‘ఆవిర్భవ’ అని అతి మందముగా గర్జన చేస్తూవున్నవట. ఇటువంటి ఆహ్లాద సమయములో అర్ధరాత్రి సమయములో ‘సమవద్భూతే జాయమానే జనార్దనే’ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుటకు దైవ స్వరూపిణియైన దేవకీ దేవి గర్భము ద్వారా భూమి పై వెలసినాడు స్వామి. అందుకే భూమిపై శ్రీకృష్ణ పరమాత్మ వెలయుటకు ‘ఆవిరాశీత్’ అంటే ఆవిర్భవించినాడు అన్న పదాన్ని వాడుతారు వ్యాసులవారు.
తమద్భుతం బాలకం అంబుజేక్షణం
చతుర్భుజం శంఖగాదాయుదాయుధం
శ్రీ వత్స లక్ష్మం గళ శోభి కౌస్తుభం
పీతాంబరం సాంద్ర పయోద సౌభగం
మహార్హ వైఢూర్య కిరీట కుండలా
త్విషా పరిష్వక్త సహస్ర కుంతలం
ఉద్దామ కాన్చ్యంగద కంకణాదిభిః
విరోచామానం వసుదేవ ఐక్షత (వ్యాస భాగవతము)
జలధరదేహు నాజానుచతుర్బాహు;
సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ;
గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు;
శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండలప్రభాయుత కుంతలలలాటు;
వైడూర్యమణిగణ వరకిరీటు
బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది
యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె. (పోతన తెలుగు భాగవతము)
భగవానుడు ‘ఆవిరాశీత్’ అనంటే ఆవిర్భావించినాడు అని చెప్పుకున్నాము. ఆవిర్భావము వుంటే తిరోభావము వుంటుంది. అంటే అనుకున్నచోట వెలయుట, తిరిగీ ఎక్కడనుండి వచ్చినాడో అక్కడికే పోవుట. జననము జరిగితే మరణము ఉంటుంది. ‘పునరపి జననం పునరపి మరణము’ ఆవిర్భావము అటువంటిది కాదు.
ఇక్కడ, వ్యాసులవారు వ్రాసిన శ్లోకము ‘తం’ తో మొదలవుతుంది. ఆ ‘తత్’ అన్నది బ్రహ్మ వాచకము. మరి ఆవిర్భావించినవాడు పరబ్రహ్మమే కదా!
ఆ బాలుని దివ్యరూపమును చూసిన అదృష్టము వసుదేవునికి దక్కినది. స్వామి ఎట్లున్నాడు అంటే, అతడు నీలమేఘమును బోలు దేహము కలిగి ఉన్నాడు; ఆజానుబాహువుడై నాలుగు చేతులలో గద శంఖం చక్రం పద్మములను కలిగి యున్నాడు. తామరరేకుల వంటి కళ్ళతో , విశాల వక్షము తో విరాజిల్లుచున్నాడు. కంఠ కౌస్తుభమణి కాంతులను వేదజక్కుతూ వుంది; అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది; కర్ణకుండలముల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి; వైడూర్య మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు; పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు.; అతడు భక్తులందరిని రక్షించే వాడు; సృష్టిలోని సుగుణాల పోగు; అత్యంత కరుణామయుడు; అట్టి పరమాత్మను గాంచి వసుదేవుడు ఉప్పొంగిపోయినాడు. ఆయన నోటినుండి ‘అద్భుతం బాలకం’ అన్న శబ్దము వచ్చింది.
మహనీయుడు, పండితశ్రేష్టుడునగు వంశీధర శర్మగారు సంస్కృతమున తమ భాగవత వ్యాఖ్యానమగు ‘శ్రీమద్భాగవతలీలా కల్పద్రుమములో’ ఈ విధముగా తెలుపుతారు. 'అత్' అన్న అవ్యమునకు ఆశ్చర్యము అన్నది అర్థము. భూతం అంటే నిండినది. ‘అదిత్ ఆశ్చర్యే ఇతి అద్భుతమ్’ అది అద్భుతం అన్న మాటకు అర్థము. ఇక ‘బాలకం’ అన్నమాటకు అర్థము చూస్తాము. ‘బాలకం’ అన్న మాటను యధాతధముగా తీసుకొంటే అద్భుతమైన బాలుడు పుట్టినాడు అని. మరి బాలురు పుడతారు గానీ వృద్ధులు పుట్టరుగదా అంటే వంశీధర శర్మ గారి జవాబు ఇది. ‘క’ అంటే బ్రహ్మ(ఏకాక్షర నిఘంటువు) ‘బాల’ బాలునిగా కల్గిన పరమాత్ముడు పుట్టినాడు అందుచేత అద్భుతము. ఇంకొక అర్థము, బాల అంటే గోపబాలురకు ‘కం’ అంటే సుఖము అంటే ఆనందము ఎవరివల్ల కలుగుతుందో ఆ బాలకుడు పుట్టినాడు. ‘బాలస్య కం సుఖం తస్మాత్...’ అంటే త్రేతాయుగములో పరమాత్మ అంశారూపమగు ఆది శేషుడు పరమాత్ముడగు శ్రీరామచంద్రునికి తమ్ముని రూపములో పుట్టినాడుకదా, తత్ ఋణ విముక్తి కొరకై ఇప్పుడు అదే ఆదిశేషుడు బలరాముడిగా వెలయగా ఆయనకు తమ్ముడి రూపములు ప్రభవించి తనకు జేష్ఠుడు అన్న ‘కం’ సుఖము నిచ్చి ఋణము తీర్చుకొన్నాడు, కావున ‘బాలకం’. ‘బాల’ అంటే గోపా బాలికలకు ‘కం’ సుఖమునిచ్చుటకు ఉద్భావించినాడు కసవున బాలకం’. ఇంకా ‘బా’ అంటే నర్మదా నదియందు సంచరించువాడగు పరమశివునకు సదా ఆనందమును కలిగించువాడు కావున ‘బాలకం’. ఇవన్నీ కాకుండా నాలుగు భుజములతోనూ, చేతులలో శంఖచక్రగదా పద్మములతోనూ, పీతాంబరమును ధరించియు అగుపించినాడు, మరి ఇది అద్భుతమే కదా! చూడండి మహా పురుషులకు మాత్రమే మహా పురుషుల రచనలు అంతరార్థముతో సహా అర్థమౌతాయి. ఏ రంగు కలిగిన శరీరము అంటే ‘సాంద్ర పయోద సౌభగం’ నీలమేఘశ్యాముడై అలరారుచున్నాడు. బ్రహ్మాండమగు జుట్టు, తలకు కిరీటము, వెల కట్టుటకు సాధ్యముగాని ఆభరణములు కలిగి ప్రకాశించు చున్నాడు. మరి అద్భుతము గాక వేరేమిటి. ఆ సమయయములో వాసుదేవుడు తాను చెరసాలలో వున్నా మాటను గూడా మరచి బ్రాహ్మణునికి 10 వెల గోవులు దానమిచ్చునట్లు సంకల్పించుకొన్నాడట. ఆ సమయములో దేవకీదేవి స్పృహలోనికి వచ్చి బాలుని ఆపాద మస్తకమూ వీక్షించింది. ఇక్కడ ‘వీక్షత’ అన్న పదమును వ్యాస భగవానులు వాడుతారు. ‘విశేషేన ఈక్షణం కృత్వా’ అంటే ఎంతో శ్రద్ధతో పరికించి చూసిందట. అది తల్లికీ తండ్రికీ తేడా!
ఆ శిశువును తడిమి కాళ్ళుతాకి నమస్కరించ దలచిందట. కానీ ‘ కంసాత్ భీతా ...... శుచిస్మిత’ అంటారు వ్యాసులవారు. మొదట కంసుడు ఇంతటి భువనమోహనుని ఏమిచేస్తాద్ఫో అని భయపడిందట కానీ ఆయన నిర్మలమైన మోము చూసి ఈ కంసుడు నా బాలుని ఏమి చేస్తాడని తానూ చిరునవ్వు నవ్వుకొనిందట. పరిపరి విధముల ఆమె స్వామిని ధ్యానించి స్వామిని తమ పూర్వజన్మ వృత్తాంతమును, పరమాత్ముడే తనకు బిడ్డయైన విధమును అడిగిందట. అప్పుడు ఆయన దేవకీ మాతకు, ఆ దంపతుల పూర్వజన్మ వృత్తాంతమును ఈ విధముగా ఎరింగించినాడు. (telugubhaagavathamu.org – భాగవత గణనాధ్యాయి శ్రీయుతులు వులవపల్లి సాంబశివరావు గారి కృషిఫలము)
అని యిట్లు దేవకీదేవి విన్నవించిన నీశ్వరుం డిట్లనియె; “నవ్వా! నీవు తొల్లి స్వాయంభువ మన్వంతరంబున పృశ్ని యను పరమపతివ్రతవు; వసుదేవుఁడు సుతపుఁ డను ప్రజాపతి; మీ రిరువురును సృష్టికాలంబున బ్రహ్మపంపునం, బెంపున నింద్రియంబులం జయించి తెంపున వాన గాలి యెండ మంచులకు సైరించి యేకలములై యాకలములు దిని యే కలంకంబును లేక వేండ్రంబుగఁ బండ్రెండువేల దివ్యవర్షంబులు తపంబులఁ జేసిన నెపంబున మీ రూపంబులు మెఱయ యోజనాజపంబులు జేసి, డాసి, పేర్చి, యర్చింప మీకు నాకుఁ గలరూపుఁ జూపి యేను "దిరంబులగు వరంబులు వేఁడుఁ" డనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డయడ్డంబున దుర్దమం బగు నపవర్గంబుఁ గోరక నా యీడు కొడుకు నడిగిన మెచ్చి యట్ల వరం బిచ్చి మీ కేను "పృశ్నిగర్భుం" డను నర్భకుండ నయితి; మఱియును.
అదితియుఁ గశ్యపుఁ డనగా
విదితుల రగు మీకుఁ గుఱుచవేషంబున నే
నుదయించితి "వామనుఁ" డన
ద్రిదశేంద్రానుజుడనై ద్వితీయభవమునన్
ఇప్పుడు మూఁడవ బామున
దప్పక మీ కిరువురకునుఁ దనయుఁడ నైతిం
జెప్పితిఁ బూర్వము మీయం
దెప్పటికిని లేదు జన్మమిటపై నాకున్
అంటే పృశ్ని సుతపులుగానూ, అదితి కశ్యపులుగానూ, దేవకీ వసుదేవులు గానూ స్వామీ తల్లిదండ్రులాయి తమ కోర్కె తీర్చుకొన్నారట.
ఆమె పరమాత్మ తో స్వామీ నీ మాయాతీత విగ్రహమును ఉపసంహరించుకొని మా చర్మ చక్షువులకు సాధారణ బాలకునిగా కనిపించమని వేడుకొన్నదట. పరమాత్మ మాయను కల్పించి తాను సాధారణ బాలకుడై విరాజిల్లజొచ్చినాడు.
అత్తరి, వసుదేవుడు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వ్రేపల్లెకు బయలుదేరుతాడు. తనకు పరమాత్మ, కాబోయే భర్త అని తలచుకొంటూ యమునా వసుదేవునికి దారి ఇస్తుంది. యమునా నదికి యమునా అధిదేవత. వీరికి వయో పరిమితులుండవు. ఇక శ్రీకృష్ణుడు బాలకుని రూపమును ధరించినాడు అంతే కావున ఆయనకు వయసు కారణము కానేరదు. ఈ మొహావేశాలు అన్నీ మానవులమగు మనము మన పరిభాషలో అర్థమగుటకు చెప్పుకోనుచున్నాము. ఈ పెళ్ళిళ్ళు, ప్రియురాళ్ళు, గోపికలు అన్నీ సంకేతములే! ఆ పరమాత్మ మాయావిలాసములే! వ్రేపల్లెలో నందుని ఇంటికి వచ్చినప్పుడు యశోద ప్రసవ వేదనతో తనకు పుట్టిన శిశువు మగ పిల్లవాడో, ఆడ పిల్లో తెలియని స్థితిలో అచేతనంగా పడి ఉంటుంది. ఆ సమయములోనే వసుదేవుడు తన బిడ్డను అక్కడ ఉంచి యశోదకు పుట్టిన ఆడ పిల్లను తీసుకొని తిరిగి మధురకు వెళ్ళిపోతాడు. ఆమెకు స్పృహ వచ్చేసరికి నీలమేఘచాయతో అసమాన తేజస్సు తో మెరిసిపోతున్న బాలుడు కనుపిస్తాడు. ఆశిశువు ఏడుపు ఆమెకు ప్రణవనాదంలా వినిపిస్తుంది. పూర్వజన్మ స్మృతి వస్తుంది. ఆపాదాలు ఎన్నడో తాను చూచినవని తెలుస్తుంది. పాదాలకు నమస్కారం చేస్తుంది. మళ్ళీ యోగమాయలో పడి తనకు జన్మించిన శిశువే అని భావిస్తుంది. శ్రీ కృష్ణుని బాల్యలీలలన్నిటిలో ఈ యోగభూమిక స్పష్టంగా కనిపిస్తుంది.
నేను ఈ వ్యాసమును శ్రీకృష్ణావతరణముతో నిలుపుతున్నాను. ఇక అవతార విశేషములు మళ్ళీ భగవంతుని ప్రచోదనము జరిగితే చేపడతాను. నా శక్తికి ఇది కొన్ని నెలల శ్రమ. అయినా నా శక్తిలో ఎటువంటి లోపమూ నేను చేయలేదన్న సంతృప్తి. చదువరులకు భగవంతుడు సదా సర్వవిధముల కాపాదవలేనని వేడుకొంటూ కృష్ణాష్టకమును ధ్యాన పుష్పమును సమర్పించుకొంటున్నాను.
శ్రీ కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం
కుటిలాలక సమ్యుక్తం పూర్ణ చంద్రభాననం
విలసత్కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం
మందార గంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం
రుక్మిణీ కేళిసంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
~ ఇతి శ్రీ కృష్ణావతరణం సంపూర్ణం ~
ఉపసంహారము:
యశోదకు పుట్టిన స్త్రీశిశువును వసుదేవుడు తీసుకొని వెళ్ళినా, వ్రేపల్లెలో, బృందావనంలో శ్రీకృష్ణుడెప్పుడూ యోగమాయా సమావృతుడయ్యే ఉన్నాడు. ఆయనను కొలిచిన గోపికలలో
వ్యత్యాసము వున్నా వారికి ఎరుక రాలేదు. కారణం వాళ్ళు యోగమాయా పరివ్రుతులవటమే! కృష్ణావతారంలో భగవంతుని సేవించిన జీవులలో మూడు రకాల జీవులున్నారు. త్రేతాయుగంలో మునులుగా జన్మించి, తపస్సులలో శ్రీరాముని దర్శించి, ఆయన సాన్నిహిత్యంకోరినవారు, ద్వాపరంలో గోపికలుగా జన్మించినారు. భగవంతుని తత్త్వము వేదములచేత తెలియబడుతుంది కాబట్టి శ్రుతులు గోపికలుగా అవతరించినాయి. అప్సరసలు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు జన్మించినారు. అందుకే వారు లక్ష్మీదేవిని సోదరిగా భావిస్తారు. వారుకూడా భగవంతుని సేవించడానికి గోపికలుగా జన్మించినారు.
శ్రీకృష్ణుని వంశీనాదం ఊరిలోనున్నఈ మూడు రకముల గోపికలకు కూడా వినిపించింది. వారంతా యమునా తీరానికి చేరారు. చిత్తమంతా శ్రీకృష్ణునే నింపుకున్నవారికి సంసారబంధాలు అడ్దురాలేదు. ఒకేరాత్రి వారికి రాసలీల అనుభవం జరిగినది. శ్రీకృష్ణుడు వారికి తన బాల్యములో పదకొండు సంవత్సరాలు మధురరసాన్నీ, భక్తి రసాన్ని, వారి వారి పురాకృత పుణ్యవిశేషం కొద్దీ, వారి వారి తారతమ్యాలతో కూడిన ఉపాధుల ప్రకారం పంచి ఇచ్చినాడు. రాసలీల తరువాత కృష్ణుడు వాళ్ళ చిత్తములో స్థిరముగా ఉండిపోయినాడు. ఆయన మాత్రము బృందావనము వదలి వెళ్ళి పోయినాడు. ఆపై ఎన్నడూ తిరిగి రాలేదు.
భాగవతములోనే కాకుండా భారతములోకూడా శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తాడు. ఈ రెంటినీ సమన్వయించుకొంటే కృష్ణుడు భగవంతునిగానే కాదు ఒక యోగిగా, ఒక గురువుగా(భగవద్గీత), ఒక యోధునిగా, ఒక సలహాదారునిగా, ఒక మిత్రునిగా, ఒక శ్రేయోభిలాషిగా దర్శనమిస్తాడు.
కృష్ణుడు కంసుణ్నీ చంపివేసి, చెరసాలకు వెళ్లి తలితండ్రులైన దేవకీ వసుదేవులను, మాతామహుడు, మాతామహి యగు ఉగ్రసేన పద్మావతి దంపతులను విడుదల చేసినాడు.
అప్పుడు ఉగ్రసేనుడు కృష్ణునికి రాజ్యమును కట్టబెడతానంటే ఆయన 'మా తండ్రిగారివలె నేనునూ సింహాసనానికి దూరంగా వుండదలిచినాను. మీరే పాలించండి' అని అటాడు కృష్ణుడు తాతగారితో. తాతగారిని సింహాసనం ఎక్కించినా రాజకీయ సుస్థిరత ఏర్పడు వరకూ మధురలోనే వుండి అచట కంసుని మూలముగా అస్తవ్యస్తమైన పాలనా వ్యవస్థను చక్కబరచి అక్కడే ఉండిపోవ నిశ్చయించుకుంటాడు కృష్ణుడు. కంససంహారం తర్వాత అతని భార్యలు తమ తండ్రి జరాసంధ చక్రవర్తి వద్దకు వెళ్లిపోతారు. అల్లుని చంపిరన్న కోపముతో జరాసంధుడు దండెత్తిరావచ్చు, సామంతరాజుల్లో కంసవిధేయులు వుండవచ్చు, అసలు అంతఃపుర భృత్యగణములోకూడా కంసుని మనుషులు వుండి తమ శత్రువులకు సహాయము చేయవచ్చు. ఈ ఇబ్బందులను చక్కబెట్టుటకు నందునికి నచ్చజెప్పి మధురలోనే వుండిపోతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు సింహాసనం మీద కూర్చుని రాజుగా పాలన చేయకపోయినా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ యుద్ధాలు చేసినాడు. సినిమాల్లో కృష్ణుడు అనగానే వేణువుతో కనబడతాడు కాబట్టి, అది వాయించడం తప్ప అతనికి వేరే ఏదీ రాదని అనుకోకూడదు. కృష్ణుడు అనేక ఆయుధాలతో యుద్ధాలు చేసినాడు. జరాసంధుడితో అనేకమార్లు యుద్ధము చేసినాడు. అంతేకాదు ఖాండవవన దహన సమయంలో కూడా యుద్ధము చేసినాడు. అసలు శమంతకోపాఖ్యానంలో జాంబవంతుడితో అన్ని రకాల ఆయుధాలతో అలసిపోయేవరకూ యుద్ధము చేసినాడు. అర్జున, సుయోధనులతో 'కురుక్షేత్రంలో ఆయుధాలు చేపట్ట' నని చెప్పుటయే ఆయన మహాయోధుడని తెలియవస్తుంది.
స్వస్తి
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు - సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు - సర్వేషాం మంగళం భవతు
సర్వేసంతు సుఖినః - సర్వేసంతు నిరామయా
సర్వేభద్రాణి పశ్యంతు మాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు
సర్వేజనా స్సుఖినో భవంతు
సర్వం సమస్త సన్మంగళాని భవంతుI