Tuesday, 23 July 2019
ఆచరణ యోగ్యములు
Sunday, 23 June 2019
సూతపౌరాణికుడు
సూతపౌరాణికుడు - 2
“విలోమజోఽపి ధన్యోఽస్మి య న్మాం పృచ్చథ సత్తమాః” “నాబోటి విలోమజాతుడిని చెప్పమని అడిగినారే, ఓ మహాత్ములారా! నా జన్మ ధన్యమయింది”. తర్వాతి కాలములో బ్రాహ్మణులు కూడా ఆయన పాండిత్యాని కి ముగ్ధులై ఆయన గోస్వామితను అంగీకరించి, ఆయనను ద్విజునిగానే పరిగణించినట్లు కనబడుట జరిగినట్లగుపడుతుంది. అందుకే గర్గసంహితా కారుడు “సూతాః పౌరాణికాః ప్రోక్తాః” అని మెచ్చుకొన్నాడు. అగ్నిపురాణమైతే ఆయన విద్యావివేకాతిశయాన్ని మరీ మరీ ప్రశంసించింది:
“పృషదాజ్యసముత్పన్నః సూతః పౌరాణికో ద్విజః
వక్తా వేదశాస్త్రాణాం త్రికాలానలధర్మవిత్”
– అని ఆయన వైదుష్యాన్ని తలకెత్తింది.
సంస్కృతంలో “పృషదాజ్యసముత్పన్నః” అంటే ఏమిటి? పృషత్ అంటే బ్రహ్మబిందువు. పృషదాజ్యమంటే యజ్ఞవేళ హవిస్సును మంత్రించేందుకు
ముంచే పవిత్రమైన నేయి. ఆ యజ్ఞగుండంలో పుట్టినవాడు పృషదాజ్యసముత్పన్నుడు. ఆ
పృషదాజ్యసముత్పన్నునికి సూతుడని ఎందుకు పేరువచ్చింది? అంటే, అందుకు మరియొక కథ ఈ విధముగా తెలియవస్తూ వుంది.
స్వాయంభువ మనువు కాలంలో జన్మించిన
చాక్షుష మనువుకు మనుమడైన అంగుని కొడుకు వేనరాజు. రాజ్యానికి వచ్చినతరువాత వేనుడు
వేదశాస్త్రాల పట్ల అవిధేయుడైనాడు. పాపములు చేయుట మొదలుపెట్టినాడు. మదాంధత తలను
దాటిన అతని అకృత్యాలను చూసి సహింపలేక మునులు దర్భలను దివ్యాస్త్రాలుగా మంత్రించి
అతని శరీరంలో నాటారు. అతను మరణించిన వెంటనే మృతకళేబరంలోని తొడ భాగాన్ని అరణిగా
(యజ్ఞంలో అగ్నిని మథించేందుకు వాడే కొయ్యసాధనం) చేసుకొని, ప్రాణోత్సర్గమంత్రములతో అతనిలోని పాపాలన్నిటినీ ఒక
ప్రాణమయతనువుగా బయటికి తీసి, దానిని అడవులకు పంపివేశారు. పాపాపనోదనము అంటే పాప
సంహారము, జరిగిన తరువాత
మునులు ఆ కళేబరంలోని కుడి భుజమును తిరిగీ మథించినారు. ఆ దక్షిణ భుజాస్తంభారణి నుంచి సత్త్వగుణోపేతుడు, ధర్మశీలుడు, అజేయ పరాక్రమశాలి అయిన పృథు చక్రవర్తి సద్యోయౌవనుడై
ఉద్భవించాడు. అతని పాలనలో ధరణి సస్యశ్యామలమయింది.
పాతకకృత్యాల మూలాన ప్రాభవాన్ని కోల్పోయిన లోకంలో
మళ్ళీ ధర్మతేజాన్ని వెలుగొందజేయాలని పృథు చక్రవర్తి పృథుపైతామహం అనే మహాయజ్ఞాన్ని
సంకల్పించాడు. సర్వసమర్థులైన ఋత్విజులను ఆహ్వానించి, తానే యజమానుడై వేదోక్తమంత్రాలతో శాస్త్రోదితక్రమాన యజ్ఞాన్ని అనుష్ఠించినాడు.
ఆ శుభతరుణాన క్రతుహోమంలో ఆహుతిగా సమర్పించిన మంత్రాల
మహిమ వల్ల యజ్ఞవేదిక నుంచి “సూత”, “మాగధ” నామాలతో శిశువులిద్దరు జన్మించారు. మునులు ఆ పసివాళ్ళ
చూడచక్కని రూపానికి, ప్రసన్నమైన తేజానికి, వీణ మీటినట్లున్న వారి కంఠస్వరానికి ముగ్ధులై, వారిని మనసారా ఆశీర్వదించారు. “విశ్వశ్రేయాన్ని కోరి పృథువు నిర్వహించిన మహాయజ్ఞంలో
ఆవిర్భవించే మహావకాశం మీకు కలిగింది. ఏతత్పుణ్యఫలంగా చిరంజీవులై వర్ధిల్లండి.
పృథువు యశోగానం చేసి ధన్యాత్ములై మెలగండి” అని దీవించినారు.
ఇది విష్ణుపురాణంలో పరాశరుడు మైత్రేయునికి చెప్పిన
ఉదంతము. వాయు పురాణంలో ఇదే కథ మరికొంత వివరంగా ఉన్నది. వేనపుత్రుడు పృథువు యజ్ఞం
చేస్తుండగా, అగ్నిగుండం నుంచి సూతుడు జన్మించినాడు. దేవతలకు రాజైనందువల్ల
ఇంద్రునికి హోమమంత్రాలలో “క్షత్త్రియు”డని సంకేతం. దేవగురువైన బృహస్పతికి “బ్రాహ్మణు”డని వ్యవహారం. యజ్ఞంలో హోత పొరపాటు వల్ల
హవిస్సులను సమర్పించేటప్పుడు బృహస్పతికి ఇస్తున్నదానిలో ఇంద్రునికై ఇవ్వవలసినది
కూడా కలిసిపోయింది. ఆ కలయిక వల్ల అగ్నిగుండం నుంచి మంత్రఫలంగా సంతానోదయం జరిగింది. “సూతి” నుంచి – అంటే, సోమరసాన్ని పిండే యజ్ఞవేదిక నుంచి జన్మించినందున ఆ
శిశువుకు “సూతు”డని పేరువచ్చింది. లింగానుశాసనంలో జరిగిన వర్ణవ్యత్యయాన్ని
పురస్కరించుకొనే క్షత్త్రియ – బ్రాహ్మణీ సంగమం వల్ల కలిగిన వర్ణసంకరమని వైదిక పరిభాషలో వ్యవహరించటం జరిగిందట.
“వైన్యస్య తు పృథో ర్యజ్ఞే వర్తమానే
మహాత్మనః
సుత్యాయా మభవ త్సూతః ప్రథమం వర్ణవైకృతమ్.
ఇన్ద్రేణ హవిషా తత్ర హతిః పృక్తం బృహస్పతేః
జుహావేన్ద్రాయ దైవేన తతః సూతో వ్యజాయత.
ప్రమాదాత్ తత్ర సఞ్జజ్ఞే ప్రాయశ్చిత్తం చ కర్మసు
శిష్యహవ్యేన యత్ పృక్త మభిభూతం గురో ర్హవిః
అధరోత్తరచారేణ జజ్ఞే త ద్వర్ణవైకృతః.”
అని వాయు పురాణము 62-వ అధ్యాయంలోని కథనము.
బ్రహ్మపురాణంలోని కథకూడా విష్ణుపురాణం వంటిదే. వాయుపురాణంలో చెప్పబడిన విశేషాలకు
తోడు అందులో మరికొన్ని వివరాలున్నాయి. ఋషులు సూత – మాగధులను పృథువు యశోగానం చెయ్యమని ఆదేశించినప్పుడు వారిద్దరూ
– సద్యోజాతులు కనుక – రాజును గురించి మాకేమీ తెలియదే, మేమేమని స్తోత్రం చెయ్యగలము? అని తమ అశక్తతను వెల్లడించారట. ఋషులు వారికి
వాక్శుద్ధిని ప్రసాదించి, ఆనాటినుండి వారు ఏమని స్తోత్రం చేస్తే పృథువు ఆ
మహాకార్యాన్ని నెరవేర్చగలడని వారికి సత్యవాణిని వరంగా ఇచ్చారట. అప్పుడు వారు చేసిన
యశోగానం పూర్తయిన తరువాత రాజు సంతోషించి మాగధుని మగధ దేశానికి, సూతుని అనూప దేశానికి పంపించాడని అందులో ఉన్నది:
తస్మిన్నేవ కాలే చ యజ్ఞే పైతామహే శుభే
సూతః సుత్యాం సముత్పన్నః సౌత్యేఽహని మహామతిః.
తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోఽథ మాగధః
పృథో స్త వార్థం తౌ తత్ర సమాహూతౌ మహర్షిభిః.
తా వూచు రృషయః సర్వే స్తూయతా మేష పార్థివః
క్రమైతదనురూపం వా పాత్రం చైవ నరాధిపః.
తా వూచతు స్తదా సర్వాం స్తా నృషీన్ సూతమాగధౌ
ఆవాం దేవా నృషీంశ్చైవ ప్రీణయామః స్వకర్మభిః.
న చాస్య విద్మో వై కర్మ నామ వా లక్షణం యశః
స్తోత్రం యేనాస్య కుర్యావో రాజ్ఞ స్తేజస్వినో
ద్విజాః.
ఋషిభి స్తౌ నియుక్తౌ తు భవిష్యైః స్తూయతా మితి
యాని కర్మాణి కృతవాన్ పృథుః పశ్చా న్మహాయశాః.
తతః ప్రభృతి వై లోకే స్తవేషు మునిసత్తమాః
ఆశీర్వాదాః ప్రయుజ్యన్తే సూత మాగధ వన్దిభిః.
తయోః స్తవాన్తే సుప్రీతః పృథుః ప్రదాత్ ప్రజేశ్వరః
అనూపదేశం సూతాయ మగధాం మాగధాయ చ.”
అని బ్రహ్మపురాణంలోని 4-వ అధ్యాయంలో ఉన్నది. అనూప దేశం అంటే
నేటి నర్మదా నదీతీర ప్రాంతం. ఆ పక్షాన సూతుడు నర్మదాతీరనివాసి అని; పురాణప్రవచనార్థమో, యాగసందర్శనకో అక్కడినుంచి నైమిశారణ్యానికి వస్తూ పోతూ ఉండేవాడని – ఊహించటము కూడా సబబే అవుతుంది. పద్మ పురాణం (2:36 అధ్యాయం, 5:1 అధ్యాయం) బ్రహ్మాండ పురాణం (2:36 అధ్యాయం) కూడా ఈ సూత జన్మవృత్తాంతాన్ని ఇదే విధంగా
ప్రస్తావించినాయి. వేదాధికారం లేని సూతునికి ఈ ప్రకారం అలౌకికావతారమూ, ద్విజత్వాంగీకారమూ సిద్ధించిన తర్వాత ఇతరసూతులతో ఈయన విడిపడినట్లున్నది.
అర్థశాస్త్రంలో కౌటిల్యుడు, “వైశ్యా న్మాగధౌ వైదేహకౌ.
క్షత్త్రియాత్ సూతః. పౌరాణిక స్త్వన్యః సూతో; మాగధశ్చ బ్రహ్మక్షత్త్రా ద్విశేషతః” (అర్థ. 3-7) అని పౌరాణిక సూతుడు క్షత్రియ – బ్రాహ్మణీ సుతుడైన సూతుడు కాడని ఒక విశేషనిర్ణయాన్ని
చెప్పటము జరిగింది. కూర్మ పురాణం మరొక్క అడుగు ముందుకువేసి, యజ్ఞకుండంలో ఆవిర్భవించిన సూతుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే అని, ఆయన సర్వశాస్త్రకోవిదుడని, ధర్మవేత్త అని ప్రశంసించింది:
“నియోగాద్బ్రాహ్మణః సార్ధం దేవేన్ద్రేణ
మహౌజసా
వేనపుత్త్రస్య వితతే పురా పైతామహే మఖే.
సూతః పౌరాణికో యజ్ఞే మాయారూపః స్వయం హరిః
ప్రవక్తా సర్వశాస్త్రాణాం ధర్మజ్ఞో గురువత్సలః.”
అన్నది. నైమిశారణ్యంలోని మునులు కూర్మపురాణం
వినిపించమని సూతుని ప్రార్థించినపుడు “నీవు పురాణసంహితను చెప్పటానికి మనుష్యరూపంలో
దిగివచ్చిన సాక్షాత్పురుషోత్తముడివి” అనే అన్నారు.
త్వం హి స్వాయంభువే యజ్ఞే సుత్యాహే వితతే సతి
సంభూతః సంహితాం వక్తుం స్వాంశేన పురుషోత్తమః.
అని.
కథ చెప్పే వ్యక్తి గొప్పదనాన్ని బట్టి కథకు
ప్రామాణికత వస్తుందని వారికి తెలుసు. ఇంచుక సత్యమైన కల్పిత కథకు ప్రబంధము అని
అర్థము. కావున పాలు నీరు కలిసిన తీరయిన ప్రబంధమునుండి పాలను అనగా వాస్థవాలను
మనకందించిన మహనీయునికి మనసారా ఒకసారి నమస్కరిద్దాము.
స్వస్తి.
Thursday, 13 June 2019
శ్రీ కృష్ణ తత్వము
శ్రీ కృష్ణ చరిత దాదాపు అన్ని పురాణాలలోనూ కనిపించుతుందని పెద్దల వద్ద విన్నాను. అసలు హరివంశము పేరున భారతములో కూడా వస్తుంది. అసలు ఆ గోపబాలుని పేరుతోనే గోపాల తాపనియోపనిషత్తు వుంది. ఆయన తత్త్వము అందులో మనకు విస్తారముగా గోచరిస్తుంది. ఇక వ్యాస భాగవతము మూలమైనా ఆంధ్ర మహా భాగవతమును ‘తెనుగున్ జేసెద మత్ పురాకృత శుభాధిక్యమ్ము తానేట్టిదో’ అంటూ పోతన భాగవతమును తెనిగించినాడు కానీ ఆయన, మన పూర్వ పుణ్య వశమున తెలుగు నేలపై జన్మించి, తెలుగు వారిని ఉద్ధరించదలచి ఈ కావ్యమును మనకందించినాడనిపిస్తుంది. అందులోని దశమ స్కందము చాలు మనము తరించడానికి. అసలు దీనిని ఆయనే కల్పతరువన్నాడు. ఈ పద్యమును గమనించండి.
జ్జ్వలవృంత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించినాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సంll)
వీడి యున్న తుఱుము విరులు రాలఁ
గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ
గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి.
ఉరికిన నోర్వక నుదరంబులో నున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు దోతెంచి చనుదెంచు రయమున
బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు సింగంబు కరణి మెరసి
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు