Monday, 31 May 2021

సౌభరి మహర్షి

 

సౌభరి మహర్షి

బ్రహ్మదేవుని పౌత్రుడగు ఘోరుని పౌత్రుడు సౌభరి మహర్షి. సౌభరి మహాతపస్వియగు కణ్వుని కుమారుడు. సౌభరి మహర్షి మహామాన్యులగు మహర్షులలో ఋగ్వేద వినియోగమునకు చెందినవారలగు బ్రహ్మ, అంగీర, ఘోర, కణ్వ, సౌభారులలో ఒకడు. ఈతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో తెలియవస్తుంది.

సౌభరి మహర్షిని గూర్చి మనకు శ్రీమద్ భాగవతం 9 వ స్కంధములో తెలియవస్తుంది. విశ్వనాథ చక్రవర్తి టి హకురా గారి ప్రకారము, సూర్య వంశపు రాజగు మాంధాత మధుర రాజ్యమును పరిపాలించే కాలములో తపస్సంపన్నుడగు ఈ మహర్షి, మధురకు సమీపములోని అరణ్యములో తపమాచరించుకొనేవాడు. ఈయన అత్యంత ఆయుష్మంతుడు. త్రేతా ద్వాపరములలో ఈయన ఉనికి తెలియవస్తూవుంది. ఆ ఋషి అడవులలో కఠోర తపమాచరించుకొను సమయమును ఇంద్రుడు,  ఆయన ఒకవేళ స్వర్గాధిపత్యమునకు ఈ తపమాచారించుచున్నాడేమోనని సందేహించి, ఆయన తపోభంగమునకై   దేవకాంతలను బంపి నృత్యగీత గోష్ఠులను ఏర్పాటు చెయించినాడు. చెక్కు చెదరలేదు మహర్షి. ఆ పిమ్మట ఇంద్రుడు ఎన్నోవిధములగు ప్రకృతి భీభత్సములను సృష్టించినాడు. సౌభరి ఋషి ఆ కడగళ్ళకు కూడా తలవంచలేదు. భూతలము అంతరాయముల నిలయమని భావించి  ఆయన తాను నేర్చిన జలస్తంభన విద్యతో,యమునా నదిలో లోతుగా మునిగి తపస్సాధనకు గడంగినాడు. అక్కడ  భూమిపై కలుగు ప్రళయములు సంభవించవు కదా! విషయమును అర్థము చేసుకొన్న ఇంద్రుడు ఆపైనెపుడూ ఆయనను పరీక్షించలేదు.  

ఒక సమయంలో, ఆయన తపోనిష్ఠ లేనపుడు, అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపపై పడినది. అక్కడ ఆయన ఒక విషయమును  గమనించినాడు.

ఈ నీటిలో పెద్ద చేపలు, చిన్న చేపలూ పక్కపక్కనే తిరుగుతూ వున్నాయి. పెద్ద చేప చిన్న చేపను మింగటము ‘మాత్స్య న్యాయము’ అంటారు. మరి ఈ చిన్న చేపలు పెద్ద చేపలకు భయపడి దూరముగా వెళ్ళిపోవుట లేదు. తమ పని తాము చేసుకొంటూనే ఉన్నాయి. కావున సాధకుడనైన నేను ఇంద్రుని వంటివారు ఎన్ని ఆటంకములను అప్సరసల ద్వారా కానీ ఇంకేవిధముగానైనా కానీ ఏర్పరచినా కూడా తన సాధనలో తానుంటే అవేమీ చేయలేవుకదా! అన్న ఆలోచన వచ్చింది. తన తపఃశక్తితో దేవకాంతలను మించిన నాట్యకత్తెలగు సుందరీమణులను సృష్టించుకొని సుందర హర్మ్యమును నీటిలోనే నిర్మింపజేసి, అకుంఠిత తపస్సునకు పూనుకొన్నాడు.

ఒక సందర్భమున జరిగిన ఈ విషయమును చూడండి. దానిని తెలుపుతూ, నారాయణీయములో చెప్పబడిన ఈ శ్లోకమును ఒకపరి తిలకించండి. .

త్వత్పెవోత్కః సౌభారిర్నామ పూర్వం కాళింద్యంతర్వా ద్వాదశాబ్దం తపస్యన్ l

మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తారక్ష్యం సాక్షాద్ధైక్షతాగ్రే కదా చిత్ ll

నీకు పరమ భక్తుడగు సౌభరి మహర్షి యమునా నదిలో జలస్తంభన విద్య సాయముతో తపస్సు చేసిన 12 సంవత్సరములలోని ఒక రోజు , ఎంతో ఆనందముగా అన్యోన్యముగా సంచరించుచున్న మీనముల పంక్తులను చూస్తూ సంతసించు సమయములో గరుత్మంతుడు అచట చేరి తినుటకు ఒక చేపను నోట కరచుకొన్నది చూచి మహర్షి యమునలో చేపలను గరుత్మంతుడు తిన ప్రయత్నించితే అతను మరణించును అని శపించినాడు.

కాళీయుడు ఒకసారి గరుత్మంతునికి చెందవలసిన హవిస్సులు తాను తినుటతో  ఆగ్రహావేశాములకు లోనయిన గరుత్మంతుడు కోపించి కాళీయుని విసరి వేసినాడు. ఆ విసరిన వేగామునకు కాళీయుడు వచ్చి యమునలో పడినాడు. ఒక విధముగా సౌభరి మహర్షి గరుత్మంతునికి ఇచ్చిన శాపము కాళీయునికి ఈ విధముగా మేలు చేసింది.

 

వేరొక సందర్భమున తన తపస్సుకు కాస్త విరామమునిచ్చి నీటిపైకి వచ్చి చేపల చలనమును చూడ దోడగినాడు. ఒక చేపల కుటుంబము ఆయన కంటబడింది. తనలో, అది చూసి చూసి వివాహేచ్ఛ కలిగింది.

ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చి,  మాంధాత వద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకొనవలెననును తలంపు కలిగినది కావున ఆయనకున్న ఏబది కన్యకలలో ఒకరిని ఇవ్వమని అడిగినాడు.

శుష్కించిన శరీరం కలిగిన సౌభరి మహర్షిని తన పుత్రికలు వరించరు అన్న నమ్మకంతో, తన పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారిని ఇచ్చి వివాహం చేస్తాను  అని సౌభరికి మాంధాత చెప్పినాడు. మాంధాత మనస్సులోని ఆలోచనను గమనించిన సౌభరి మహర్షి తన శరీరమును యౌవ్వనప్రాయముతో అలంకరించుకుని నవ మన్మధుడై అంతఃపురమున ఏరాజు వద్దకు వెళ్ళినాడు. అతనిని చూసిన మాంధాతయొక్క 50 మంది పుత్రికలూ అతనిని వరించినారు.

అతని తపః శక్తి తో వారంతా అత్యంత అనుకులమయిన భవనములు, భోగములు సమకూర్చుకున్నారు. ఎంతో వైభవమైన వస్త్రములు, తినుబండారములు, ఉద్యానవనములు ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు.

కొంతకాలం తరువాత సౌభరి మహర్షికి ఏకాంతంలో అతని ఈ పరిస్థితికి రాకముందు తాను ఎంత నిష్ఠగా తపస్సు చేసేవాడో గుర్తుకు వచ్చినది. ఒకనాడు, ఒక్కసారి సంసారముతో ఉన్న ఒక చేపల కుటుంబమును చుసిన తను ఇంతకాలము 50 మంది భార్యలతో, 5000 మంది బిడ్డలతో కాలక్షేపం చేయుట తప్పు అనిపించినది. కనుక వానప్రస్థఆశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్లి తపస్సు ప్రారంభించినాడు. అతని భార్యలు కూడా అతనిని అనుసరించినారు. అది నిర్జన కీకారణ్యము. అచట గురుకులమును గూడా ఏర్పరచి శిష్యులను విద్యావంతుల జేయదొడగినాడు. ‘విద్యాతురాణాం న సుఖం న నిద్రా’ అనికదా పెద్దల వాక్కు. అందుకే విద్యార్థులు కష్టమైనా ఆయన వద్ద విద్య నేర్చుకొనుటకు పుష్కలముగా వచ్చినారు.

మిగిలినది రేపు.....

సౌభరి మహర్షి - 2

ద్వాపరయుగము చివరిలో ధర్మరాజు  అశ్వమేధయాగ దీక్ష లో ఉన్నపుడు యాగాశ్వము వెంట అర్జనుడు పోవుట తటస్తించినది. శ్రీరిష్ణుని మాయచే అర్జునుడు గుఱ్ఱము మరుఇయు పరివారముతో సౌభరి మహర్షియున్న అటవీ ప్రాంతమునకు పోవుట తటస్తించినది. ఆ ప్రాంతములో ఉండే చండీశిలకు అతుక్కు పోయింది. అర్జునుడు సౌభరి ఋష్యాశ్రమమునకు వెళ్లి తనను పర్చయము చేసుకొని ఘర్మ రాజును గూర్చి చెప్పి, గుఱ్ఱము చండి శిలకు అతుక్కుపోయిన విషయము కూడా చెప్పిన పిదప, ఈ యాగమును ఎవరు చేయమని చెప్పినారు అని అడిగినాడు మహర్షి. అర్జునుడు శ్రీకృష్ణుడు చేయమన్నట్లు చెప్పినాడు. సౌభరి మహర్షి వెంటనే పరమాత్మ నీతో వచ్చినాడా అని అడిగినాడు. అందుకు అర్జునుడు అవును వెనకాల ఉన్నాడు అని చెప్పినాడు. ‘మరి పరమాత్మ తానే ప్రక్కన ఉంటూ మిమ్ము ఈ యజ్ఞమును చేయమన్నాడు అన్న విషయమును గూర్చి మీరు ఆలోచించినారా? అసలు ఈ యజ్ఞమునకు కర్తలు మీరు కాదు ఆ పరమాత్మయే కర్త. ప్రతిఫలాపేక్షతో కానీ, ఇంత మహా యాగమును చేస్తున్నామన్న అహంకారముతో కానీ చేయవద్దు. ఆయన పాదమును వీడవద్దు. ఈమాట ఆయన నాతో చెప్పించుటకే నిన్ను ఇచ్చటికి పంపినాడు. ఆయన లీలలు అంత సులభముగా అంతుపట్టవు’ అని తెలిపి తన మంత్రం శక్తితో యాగాశ్వమును విడిపించి పరమాత్మ దర్శనముతో అత్యంత సంతోషాంతరంగుడైనాడు.

ఈ విధముగా, తన తప్పులను తానూ తెలుసుకొని, మరణ సమయంలో అగ్ని ప్రవేశము చేసి, తపోదీక్షతో కలుషములను కడగివైచుకొని భగవంతుని అకుంఠితపదమునుచేరుకొన్నాడు. విశ్వనాథ చక్రవర్తి ఠాకుర్ గారు  సౌభరి ముని తన వైష్ణవ అపరాధ కారణంగా పడిపోయినాడని వ్యాఖ్యానించినాడు. ఎందుకంటే, గరుత్మంతుడు చేపను తినాలని అనుకున్నప్పుడు, సౌభరి ముని గరుడునికి  ప్రకృతి విరుద్ధమగు శాపము ఇచ్చి గొప్ప నేరం చేసినాడు. ఈ అపరాధ కారణంగా, సౌభరి ముని తన తపఃశక్తిని కొంత కోల్పోవలసి వచ్చింది. సౌభరి మునికి సంబంధించిన ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇది. సౌభరి రిషి గొప్ప యోగి. ఆయన బఃవృచ(बह्वृच) అంటే ఋగ్వేదము ఆయనకు కరతలామలకము అని అర్థము. ఆయన అపార వేద సాధకుడు కాబట్టి తన పాండిత్యమును మరియు తపస్సును భౌతిక సంపద కోసం కొంత ఖర్చు చేసినాడు, ఈయన పేరుతో ఒక ఋగ్వేద సంహిత కూడా ఉన్నది. కానీ ఇది జీవితానికి పరిపూర్ణత కాదు అని తెలుసుకొనుటకు ఆలసించినాడు. కానీ కాలాంతరములో ఆ వాస్తవము తెలుసుకొన్నవాడై, అడవిని తిరిగి చేరి  అనితరసాధ్యమగు తపోనిష్ఠతో పరమపదమును సాధించినాడు. జీవితపు ఆధ్యాత్మిక విలువ తెలియని వారు, బాహ్య భౌతిక సంపదతో సంతృప్తి చెందవచ్చు, కాని ఆత్మ-తత్వ విచారమును ఎరుకలోనికి తెచ్చుకోన్నవారు ఐహిక సుఖములను తృణప్రాయముగానెంచి ఆముష్మికమును సాధించుతారు.  సౌభరి ముని జీవితం మరియు కార్యకలాపాల నుండి మనం పొందగల సూచన ఇది.

ఇక్కడ ఇంకొక ముఖ్యమగు విషయమును తెలుపుతాను. ఇది పురాణములు అబద్ధములు అను కొందరు భారతీయ ధర్మద్వేషులకు ఒక చురక వంటిది. సౌహరి మహర్షి ఇంచుమించు ద్వాపర యుగాంతము వరకు జీవించినాడు అనుటకు ఈ క్రింది యదార్థమును మనసు పెట్టి చదవండి.

జాగరణ్ సమన్వయకర్త యగు కమల్ మొరార్కర్ ఆర్ధిక సహయోగముతో, వ్రజ బృందావన్ (మధుర): మహర్షి సౌభరి ధ్యాన ప్రదేశమగు  సునరఖ్ కు చెందిన రామ్‌తాల్ కుండ్ భక్తుల ఆకర్షణ కేంద్రంగా మార్చినారు. అసలు ఎన్నో వేలసంవత్సరముల క్రితమే భూమిలోనికి కూరుకు పోయిన ఈ గుండమునకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పునరుజ్జీవనము కలిగించి సందర్శనాయోగ్యము చేసినారు.

సుమారు 2700 సంవత్సరాల పురాతనమైన ఈ కొలను యొక్క నిర్మాణాన్ని చూసి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయినారు. ఆ కోలనుకు వాడిన ఇటుకలు ప్రస్తుతపు ఇటుకల కన్నా చాలా రెట్లు పెద్దవి రియు ఆ కొలను పునాదిలో  రెండు అంగుళాల మందపాటి ఇనుప పలక కనుగొనబడింది, ఇది పురాతన నిర్మాణానికి అద్భుతమైన నమూనా.

బ్రజ్ ఫౌండేషన్ 2011 లో రామ్‌తాల్ కుండ్‌కు  పునర్వైభవమును సంతరింప  ప్రారంభించింది. సంస్థ ప్రతినిధి మన్సుఖ్ మాట్లాడుతూ, సుమారు ఆరు సంవత్సరముల కాలము మేము చేసిన ప్రయత్నములు ఫలించినాయి. సౌభరి ప్రార్థనా స్థలాన్ని అందంగా మార్చడానికి అన్నివిధములా శ్రద్ధాళువులు ప్రయత్నిస్తున్నారు.

భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుండము చుట్టూ కూర్చునుటకు బెంచీలు, విడిదికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినారు.

మహర్షి సౌభరి యొక్క యజ్ఞశాల యందు పురావస్తు అవశేషములకు మూలములు దెబ్బతినకుండా ఆధునీకరించుట జరిగినది. ఇది భారతీయ శాశ్వతమైన సంస్కృతి గురించి ఒక ఆలోచనను ఇస్తుంది.

ఈ విషయమును ప్రత్యేకముగా ఎందుకు వ్రాసినానంటే, ఈ భారత భూమి పసి ఇంకా కొందరు డబ్బును తృణప్రాయముగా చూసే మహనీయులు, ఈషణ్మాత్రపు స్వలభోపెక్ష లేకుండా, పేరుకు ప్రాకులాడకుండా 10వేల చందాయిచ్చి లక్ష రూపాయల ప్రకటనలు చేసుకోకుండా, వాడు తలపీట్టిన పని వాడే చేసుకొనీ, డబ్బు వాని వాడా ఉన్నదికదా అని నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా ఉడుతా భక్తిగా తోచిన సహాయముచేసి తమవంతు బాధ్యతను తీర్చుకొనే పైన తెలిపినటువంటి మహానుభావులకు నమస్కరిస్తూ ఈ రచనను ఇచ్చట ముగిస్తున్నాను.

స్వస్తి.


Sunday, 16 May 2021

మాతృపంచకం - తెనుగున పద్యానువాదము

 


మాతృపంచకం

https://cherukuramamohanrao.blogspot.com/2021/05/blog-post.html

నాపై నమ్మకముతో శంకరులవారి ‘మాతృపంచకము’ను పద్యరూపమున తెనిగించు అదృష్టమును నాకు కలిగించిన వేదమూర్తులు శ్రీయుత రేమెళ్ళ అవధాన్లు గారికి మనఃపూర్వక  కృతజ్ఞతలు. వారి అభిమానము ఆజన్మాంతము నాకు ప్రాతఃస్మరణీయము. నా రచనను ఎంతగానో మెచ్చుకొన్న వారికి మనఃపూర్వక ధన్యవాదములు మరొకమారు సమర్పించుకోనుచున్నాను.

జగద్గురు శంకరాచార్య విరచిత 'మాతృపంచకము' ను నేను అనువదించిన తెలుగు పద్య సహితముగా మీ ముందు ఉంచుచున్నాను. 

https://cherukuramamohanrao.blogspot.com/2021/05/blog-post.html

మాతృపంచకం

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిరం సుతత్వమ్

ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః

దదామ్యహం తండులమేవ శుష్కమ్.

నామాణిక్యమ నాదు రత్నమ సదా నా కొంగు బంగారమా

నా మార్తాండ యటంచు ఎంతొ ధృతితో నన్నాదరింపంగ నే

నేమాత్రమ్ము నుపావృతమ్ము ఎదియున్ నీకివ్వలేదెప్పుడున్

ఓ మాతా ఇపుడివ్వ వచ్చితి యవల్  ఓ ముష్టి శుష్కాదృశల్

ఉపావృతము=తిరిగి ఇచ్చుట,

తా:– అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి అని, నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన యవలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతి కాలే యదవోచ ఉచ్చై :

కృష్ణేతి గోవింద హరే ముకుందే

త్యహో జనన్యై రచితోయమంజలిః.

ఎంతో బాధ భరించుచున్ కుములుచున్ ఏడ్పేమి రానీయకన్

అంతా గొంతుకలోనె మింగుచును నీవమ్మా హరా భార్గవీ

కాంతానాథ యటంచు నొప్పి పడుచున్ కన్నావు నీపాదముల్

ఎంతో దాంతము తోడ నింపి మదిలో ఇంపారగా మ్రొక్కెదన్

తా:–పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను “అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా

నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ

ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః

దాతుం నిష్కృతి మున్నతోపి తనయ: తస్యై జనన్యై నమః

శూలను పొందుచుండియును శుష్క శరీరివి యయ్యు నన్ను నీ

చేలము తోడ జుట్టుచును చెంత పరుండగ జేసి ఎంతయో

తాలిమి తోడ నా మలము తక్షణ రీతిన శుద్ధిచేసితీ

లాలన నిల్చె నామదిన లాతము వీడి నమస్కరించెదన్

అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా! ఎవరూ అలాంటి బాధను భరించలేరు. ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.

 

4. గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా

యతిసముచితవేషం ప్రారుదో త్వం సముచ్చె:

గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం

సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః

నీ కలలోన నేను ఒక నీమపు భిక్షువు నౌచు కన్పడన్

నీకగు బాధనంతయును నిర్గతిచేయక ఆతురాన నా

కాకరువైన గుర్కులము గాంచగ వచ్చిన నిన్నుజూచుచున్

శోకము పొంగె ఛాత్రులకు శుభ్ర కృపామతి నీకు మ్రొక్కెదన్

తా:–కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.

5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా

స్వధా వా నో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధినా

న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మనూ

రకాలే సంప్రాప్తిః మయి కురు దయాం మాతురతులామ్

కాలము మీరె నీకు మరి కాలము మీరెను నాదు రాకలో

జాలము చేత నే జలము చల్లగ పోయగనైతి నోటిలో

కీలక తారకమ్ము చెవి కెక్కగ చేయగనైతి నే స్వధన్

మేలిమి తర్పణాన మది మెచ్చగ దత్తము చేయనైతి నన్

తాలిమితోడ నీవు దయ తప్పక కావుము మాతృదేవతా!

తా:–అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి “స్వధా ను” యివ్వలేదు. ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితోనూ సమానము కాని నీ దయ చూపించుము తల్లీ!

Sunday, 11 April 2021

శుభకృత్ నామ ఉగాది సందేశము

శుభకృత్ నామ ఉగాది సందేశము

https://cherukuramamohanrao.blogspot.com/2021/04/blog-post_11.html

దయతో ఈ సందేశమును ‘శుభకృత్’ ఇస్తూ ఉన్నట్లుగా గుర్తించండి. నాకు సందేశమునిచ్చే సామర్థ్యము లేదు.

ప్లవ లేక ప్లవనము అనగా తేలుట. నీటిలోతేలే తెప్పను ‘ప్లవ’అంటారు. 'కరోనా' అన్న కాలకూట విషపు కడలినుండి ప్లవ మనలను 'శుభకృత్' అన్న ఒడ్డునకు చేర్చింది. ఆ ఒడ్డు యొక్క పేరే 'శుభకృత్' కాబట్టి అది మనకు అంతా మేలే చేస్తుంది. శుభకృత్ అంటేనే శుభములు చేకూర్చేది.  కావున మంచికి చేయవలసిన ప్రయత్నములు మనము చేస్తే శుభకృత్ నిర్ద్వందముగా మనకు శుభముల సమకూర్చుతుంది.

పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. శుభకృత్ నామ సంవత్సరం అందరికీ నిరంతరం జయకరం, శుభకరం కావాలి. పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. దేశంలో, ప్రపంచంలో పాడి పంటలు, వర్షాలు, పాలకులు, పరిపాలన గురించిన రాబోయే సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వింటాము. రాజు, మంత్రి, సేనాని, మొత్తం పరిపాలక మండలి ఎలా ఉంటుంది? దేశపు పరిపాలకమండలిని మనం ఎన్నుకుంటాము. ప్రజా ప్రభుత్వములో మన ఎన్నికకు తగినవారు మనని పాలిస్తారు. అలాగే సృష్టిలో సృష్టికర్తయైన ఈశ్వరుడు, అనేక దేవతలు, గ్రహాలు. వీని స్థితిగతులు పంచాంగము ఇస్తుంది. 

ఈశ్వరుడే కాల స్వరూపము. కాలోస్మి అని చెప్పినవాడు ఆయన. ఆయన పరివారంలోని 

దేవతలు పాలకులు. ప్రజలు తమ పుణ్య పాప కర్మలతో ఫలాలను వ్యక్తులుగా, 

సమూహంగా తామే తెచ్చుకుంటారు. దేవతలు కేవలము కర్మ ఫలాలను ఇచ్చే 

ఉద్యోగులు. వారి కంటే మన సమీపవర్తులు గ్రహాలు. మన సూర్యమండలంలో 

భూమివలెనే గ్రహాలు కూడా మనతోపాటు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. కర్మను బట్టి 

ఫలములను ఇవ్వడం వారి ఉద్యోగ విధి. అందుచేత శనికి శాంతి చేయించే ముందు, 

ఈశ్వరుని పూజించాలి. జీవుల కర్మను బట్టి ఫలములను నిర్ణయించేవాడు దైవము (విధి). 

నేను సత్కర్మలేచేస్తాను. ధర్మమునే సర్వకాలములలో ఆచరిస్తాను అనేవానికి శుభాలే 

వస్తాయి. అతడు స్వతంత్రుడు. ఈశ్వరుని ప్రత్యేకం ప్రార్థించవలసిన పనేలేదు. కాని 

ఈశ్వరుడు సృష్టిలో జీవులకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వివేకము, పుణ్యపాపాలు 

చేయడానికి స్వేచ్చ ఇచ్సినాడు. పాపకర్మలమీద ఆసక్తి, చేసే స్వేచ్చ ఇవ్వడం వలన 

మనుష్యుడు పాపంచేస్తూనే , నాకు శిక్షలేకుండా చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. 

వివేకం, సద్బుద్ధి (discretion) ఉంటే పాపాలు చేయకుండా ఉంటాము. 

భగవంతుని పశ్చాత్తాపంతో వేడుకుంటే ఆయన కర్మ ఫలాలను నియంత్రింపగలడు. వేద 

పురాణ గాథలు ఇవి చెబుతాయి. మనం సామాన్యులం. మన జీవితకాలమంతా 

సంసారంలోనే గడచిపోతుంది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ సమస్యలు, 

దీనితోనే కాలమంతా గడిపిన మనం, మనకోసము, మన ఉత్తరగతుల కోసం 

ఏమిచేసుకుంటున్నాము? మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రమేనా? దీనిలో సారం 

ఏమున్నది? ఈ శుభేచ్ఛవచ్చినప్పుడు మనకు మార్గంకావాలి. పురాణాలు మనకు 

పెద్దమిత్రుడు. మార్గం చూపించేందుకు గురువు కావాలి. మనుష్యరూపంలో 

ఉండక్కరలేదు. ఆ జగద్గురువైన శ్రీకృష్ణునే గురువుగా భావించవచ్చును. ఆయన చెప్పిన 

భగవద్గీతవంటి ఆప్తవాక్యము మరొకటిలేదు.

ఇక్కడ కాలాన్ని గురించి ఆలోచించాలి. మంచికాలం, చెడు కాలం ఏమిటి? భీష్ముడు 49 

రాత్రులు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ ఎందుకు 

నిరీక్షించినాడు? అతడు అష్టవసువులలో ఒకడు. శాపవశాన భూమిపై జన్మించినాడు. 

అతనికి స్వచ్ఛంద మరణమనే వరం ఉన్నది. ధర్మం బాగా తెలిసినవాడు. అందుకే 

అంపశయ్యను ప్రాయశ్చిత్త వేదిక గా మార్చుకున్నాడు. అధర్మము కొన్ని విషయాలలో 

చేసినాడు. అధర్మం వైపు నిలచి యుద్ధంచేసినాడు. ధర్మాత్ములైన పాండవుల సేనలో 

అధికభాగాన్ని తానే నాశనం చేసినాడు. 180 సంవత్సరాల వృద్ధుడు. ద్రౌపదిని నిండు 

సభలో అవమానిస్తే తన క్షాత్రధర్మం నిర్వర్తించలేదు. దుర్యోధనుని కొలువులో 

ఉన్నామనేది కుంటి సాకే. అలాగే ద్రోణుడు. ఉత్తమ బ్రాహ్మణుడే. తపశ్శాలి. 

ఉపపాండవులను నిద్రలో ఉండగా చంపిన అశ్వత్థామ ఆయన పుత్రుడు. అతడు 

చిరంజీవి అయినా కర్మ ఫలము అనుభవించక  తప్పదు కాబట్టి భగవంతుడే అతని 

నొసటి మణిని పెకలించి ఆరనిగాయమును కలిగించి అనవరతమూ ఆ కర్మ ఫలమును 

అనుభవింపజేయుచున్నాడు. పెద్దల, పాలకుల, ఉన్నత వర్గాల వారు వివిధ కారణముల 

మూలముగా చేసే పాపాలు సంఘాన్ని నాశనం చేస్తాయి. దేశానికి అరిష్టం. ఇది 

కలియుగము కదా! అసలు నాదృష్టిలో కలిపురుషుడు ఒకడే అయినా ఆయన అనేక 

నాయకుల రూపములో అనునిత్యమూ మనకు తన చేయిదములతో దర్శనమిచ్చుచునే 

యున్నాడు. కలిలో ధర్మము కలికమునకు కూడా కనబడనిరోజులు వస్తాయేమో!

ప్లవ నామ సంవత్సర పంచాంగ ఫలితములను ఎవరికి ఇష్టమగు పంచాంగమును చూసి 

వారు వారు తెలుసుకొనవచ్చును. అందువల్ల నేను ఆ విషయము జోలికి పోవుట లేదు.

మనము కోరుకొనవలసినదల్లా పరివర్తన. ఏవిధమైన పరివర్తన అంటే మనకు వేదము 

తెలియజేసిన పరివర్తన అదే:

అసతోమా సద్గమయ అంటే అసత్తు అనగా ఏది నిత్యమూ శాశ్వతము ఆచరణ 

యోగ్యము కాదో ఆ స్థితి నుండి ఏది సత్యము శాశ్వతము అనుష్ఠానయోగ్యము అయినదో ఆదారిన నడుద్దాము.

తమసోమా జ్యోతిర్గమయ, ఇక్కడ తమస్సు అంటే చీకటి అని మాత్రమే కాదు అర్థము అజ్ఞానములో మనము ఉన్నంతకాలము అంధకారములో ఉన్నట్లే. మరి వెలుగు ఎట్లు కనిపించుతుంది. అది మనము నడిచే దారినిబట్టి ఉంటుంది. అందుకే మొదటనే చెప్పుకొన్నాము కదా  అసత్ నుండి సత్ వైపునకు నడిపించమని పరమాత్ముని వేడుకొన్నాము కదా ఆ బాధ్యత ఆయనదే! అప్పుడే చీకటిలోనుండి వెలుగు లోనికి అడుగు పెట్టగలుగుతాము.  కానీ ఆయనకు గుర్తు చేసే బాధ్యత మాత్రం మనదే! అడగనిదే అమ్మయినా పెట్టాడు అన్న నానుడి మనకు ఎరుకనే కదా!

ఇక మృత్యోర్మా అమృతం గమయ అంటే ఎప్పుడయితే మన ప్రయాణము చీకటి నుండి వెలుగునకు సిద్ధపరుపబడినదో నశించే జీవిత తత్వమును దాటి అనశ్వరమగు పదమును చేరుటకు సిద్ధమయినట్లే! ఈ మర్త్యగుణమును దాటుకొని అమరత్వము వైపు నడక ప్రారంభించినట్లే!

భగవంతుని మన నాయకునిగా చేసుకొని ఆ కోరిక కోరుదాము. అచంచల ధర్మమార్గమున గతి తప్పక తాను నడుస్తూ మనల నడిపించగల ఏకైక నాయకుడు ఆయనే!

ఓం శాంతిః శాంతిః శాంతిః

స్వస్తి.

Wednesday, 7 April 2021

ఉగాది -శుభకృత్

 

సంవత్సరాది లేక ఉగాది

  https://cherukuramamohanrao.blogspot.com/2021/04/blog-post.html

సదాశయులకు, సత్వ సంపన్నమగు భారతీయ ధర్మ పరిరక్షకులకు, మనకు అత్యంత 

విజ్ఞాన సంపదను వారసత్వముగా ఇచ్చిన మన ఋషివరేణ్యులను నిరంతరమూ 

కృతజ్ఞతాపూర్వకముగా భక్తితో కొలుచు మహానుభావులందరకూ, వారి సకల 

కుటుంబ సభ్యులకు  మనఃపూర్వక 'శుభకృత్ నామ సంవత్సర' శుభాకాంక్షలు 


పూర్వము అంటే మేము పిల్లవాళ్ళగా ఉన్న రోజులలో ఉగాదిని సంవత్సరాదిగా కూడా 

ఉచ్చరించేవారము. ఇఒప్పుడు ఉగాది అని మాత్రమే అంటున్నారు. పండుగ క్రొత్త 

సంవత్సరమునకు మొదటి రోజు చేస్తాము కాబట్టి దానిని సంవత్సరాది అని 

పిలిచేవారు. ఉగాది అన్నపుడు అర్థము ఇంకా లోతునకు పోతుంది. కావున ఉగాది 

అన్న పదము కడుంగడు సమంజసము అన్నది నా తలపు. ఈ ఉగాదిని గూర్చి కాస్త 

ఈ పండుగకు ముందు ముచ్చటించు కొందాము. ఉగాది శోభను వన వధూటికి 

వసంతునికి(మన్మధునికి) పెళ్లి జరిగే శుభాదినముగా ఊహించుకొంటూ నేను 

వ్రాసిన ఈ పద్యముతో చదువ ప్రారంభించండి. కఠిన పదములకు అర్థములు కూడా తెలియజేసినాను. నా ఉద్దేశ్యము తెలుగు లోతయిన భాష అని తెల్పుట. నా పాండిత్యమును వెలిబుచ్చుట కాదు.

ద్విజ కలరవము వాదిత్ర  నాదము గూర్చ

                              నికర పిక రవాల నెలవు గాగ

ఘన పుష్ప రజమేమొ గంధంపు పొడి గాగ

                              విరివి సత్ఫలశ్రేణి విందు గాగ

తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ

                            అరుణ పుష్పోత్కర మగ్ని గాగ

చూత శాఖములేమొ సూపార్థములు గాగ

                          స్రవ పుష్పరస మేమొ సర్పి గాగ   

తనకు సద్వన వధూటికి దనర జమిలి

పాణిగ్రహణము కై దాను బయలుదేరె

చిలుక   తత్తడి   రౌతు   రాచిలుక  పైన

కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ

ద్విజ= పక్షులు (రెండు మార్లు జన్మనెత్తునవి)

వాదిత్రములు= వాద్యములు

నికరము = శ్రేష్ఠము

ఘన పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి

విరవి = మిక్కుటమైన , అతిశయించిన

ధూమ మేఘము = దట్టమైన పొగ

అరుణ పుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి

చూత శాఖములు = మామిడి కాయలు ఆకు కూరలు  (ద్వంద్వ సమాసము)

సూపార్థము = పప్పునకు వలసినవి

స్రవ పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధువు

సర్పి = నేయి

జమిలి = జంట

దనర = కలుగగా

చిలుక తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు (మన్మధుడు)

 సౌందర్యము వెల్లివిరియుచున్న వన వధూటిని పెల్లియాడుటకు మన్మధుడు తన 

చిలుకవాహనము పై బయలుదేరినాడట.

పూదేనెన్ దనివార గ్రోలి  విలసామోదమ్ములై తుమ్మెదల్

మాధుర్యంబుగ ఝుంకృతుల్ సల్పుచున్ మత్తెక్కి నర్తించెడిన్

రోధస్యంతము పిక్కటిల్ల వనినారొహించి క్రొమ్మావులన్

తాదాత్మ్యమ్మున శారికల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్

కలయో వైష్ణవ మాయయో యనగ కాంక్షాళిన్ సదా తీర్చుచున్

ఇలపై శోభన సౌమనస్యములు ఇంపారంగ పారంగ సం

తులతన్ తత్పర రీతిగన్ శుభకృతుల్ శోభిల్లగా పాడుచున్

తలపోయన్ శుభకృత్ వరించె నిను తాదాత్మ్యంబు పెంపొందగన్  

కవిత్వమును ఇక్కడ నిల్పి కాస్త ఉగాదిని గూర్చి తెలుసుకొందాము. మొదట ఈ 

శ్లోకమును గమనించండి.

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం   న్యాయేన మార్గేణ మహీం మహీశాం

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లొకాస్సమస్తా      స్సుఖినోభవంతు

ఇది ఉగాది నాడు తప్పక మనన చేసుకొనవలసిన శ్లోకము. న్యాయము ధర్మము 

సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము 

శుభము సుఖము ను కాంక్షించిన వారు.

మరి ఈ శ్లోకములో గో బ్రాహ్మణ జాతులు సుఖముగా వుంటే చాలని కదా 

చెప్పుచున్నాయి మిగత వారిని గూర్చిన ఊసు ఎత్తలేదు కాబట్టి వారందరూ 

ఏమయినా ఫరవాలేదా! అన్నది అందరికీ వచ్చే అనుమానము.  ఒక శ్లోకము  రెండు 

చిన్న పంక్తులు కలిగియుంటాయి. వాటి భావమును పదముల మాధ్యమముతో గ్రహించరాదు. అందు గల గూడార్థమును మనము గ్రహించ వలసి యున్నది. ప్రజలు కలకాలము చల్లగా పాలింపబడవలెను. న్యాయ మార్గములో రాజులు భూమిని ఏల వలెను . గోవులకు బ్రాహ్మణులకు శుభము సర్వదా సమకూరవలెను. సమస్త లోకములు సుఖముగా ఉండవలెను.

అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగుంటే ఆలోచనెందుకు అంటే గోవులకు 

బ్రాహ్మణులకు  ఈ శ్లోకములో ప్రత్యేకముగా పెద్ద పీట వేసినారు. పోనీ గోవులు 

సుఖముగా వుండవలసినదే! వానిని తల్లితో పోల్చినారు కాబట్టి. మరి బ్రాహ్మణులు 

ఎందుకు. మిగతా వాళ్ళు ఏమయినా ఫరవాలేదా! అన్న సందేహము నేటి పాఠక 

శ్రేణిలో తల ఎత్తక మానదు. గోవులు  తమ నుండి, తాము ఇవ్వగలిగిన  ప్రతి 

వస్తువును  పుష్కలముగా ఇవ్వగలవు. ఎప్పుడు అవి పుష్కలముగా ఉంటాయో 

యజ్ఞయాగాదులు నిరాఘాటముగా కొనసాగుతాయి. వానిని నిరాఘాటముగా 

కొనసాగించేటందుకు బ్రాహ్మణ సంతతి అవసరము. అందువల్ల యజ్ఞయాగాదులు 

నిరంతరాయముగా వారు జరిపితే సకాల వర్షములు కురుస్తాయి. సకాల వర్షములు 

కురిస్తే పంటలు బాగా పండుతాయి.  పంటలు బాగా పండితే ప్రజలు సుఖిస్తారు. 

వారు సుఖిస్తే లోకమంతా సుఖముగా వుంటుంది. అంతా తమతమ నిత్య విధులను 

కర్మలను, సక్రమముగా నిర్వహించుతూ వుంటే సమస్త లోకములూ చల్లగా 

వుంటాయి. మరి ఇందులో బ్రాహణ శబ్దముండుటలో అనర్థమేమి వుంది. ఈ శాంతి పాఠము ఇక్కడ ఆగలేదు . ఈ శ్లోకములు వినండి.

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ!

దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!

ఇందులో ఏమి చెప్పబడినదో గమనించండి. సకాలమునకు వర్షములు కురవాలి. ఈ 

భూమి కలకాలమూ ధనధాన్య సంవృద్ధ యై వుండాలి. దేశము క్షోభరహితమై 

వుండాలి. సత్వ గుణసంపన్నులై  బ్రతికినంతకాలము తమ అనుష్ఠానములతో లోక 

కల్యాణమును అంటే సకల ప్రజల హితమును కాంక్షించే  బ్రాహ్మణులు నిర్భయముగా 

సంచరింతురు గాక! ఇక అదే శాంతిపాఠము లోని ఈ రెండు శ్లోకములు గూడా 

చూడండి.

 అపుత్రా: పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణ: |

అధనా స్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్ ||

ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. సంతు లేని వారికి సంతానము కలుగు గాక! 

వారికి తిరిగీ సంతు కలుగు గాక! నిర్భాగ్యులకు సౌభాగ్యము చేకూరు గాక! నూరు 

సంవత్సరములు సుఖముగా శుభముగా, సౌభాగ్యముతో  జీవింతురు గాక! ఈ చివరి 

శ్లోకము చూడండి:

సర్వేపిః సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్

అందరూ సుఖముగా వుందురు గాక! ఎవ్వరికీ రోగ బాధలు లేకుండు గాక! అందరూ 

కలకాలము మంచిని మాత్రమే చూచెదరు గాక! ఎవరికీ దుఃఖము అన్న అనుభూతి 

కూడా కలగకూడదు అనేది సనాతనధర్మం యొక్క ఆశయం. అసలు సమస్త ప్రజలు 

సమస్త జీవ జంతువులు ‘శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే’  సుఖముగా వుండవలె 

నన్నారు. అని అన్నారు. ఇది వేద వాక్యము. ఇటువంటి విశ్వహిత మతము దుర్భిణి 

పెట్టి వెదకినా ప్రపంచములో వేరెక్కడా దొరుకదు. కావున ఎక్కడ ఏమి చెప్పవలేనో 

అదే చెప్పినారు మన ఋషులు. పక్షపాటాము, వలపక్రము, తిరస్కార భావము కలిగి 

ఖలోక్తులనాడువారు కారు నాటి ఋషివరేణ్యులు.

న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖమును కలుగజేయవలెనని కాంక్షించినారు.

వారు ఏర్పరచిన 'యుగాది' రాను- రాను "ఉగాది" అయిన దంటారు. సృష్ట్యాదిని 

యుగాది  అన్నారని అప్పటినుండి కాలమును అణిమ (మైక్రో) మహిమ (మాక్రో) ల 

వరకు నిర్దుష్ఠము గా విభజించిన మహనీయులు వారు.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయము చెప్పు కొనవలసి వున్నది. పై మాటను 

యథాతథముగా గ్రహించినా కూడా ఇచట వేరొక విశ్లేషణ కూడా 

చెప్పుకోనవలసియుంటుంది. ఉత్+గ+ఆది=ఉగాది. ఉత్ అంటె నక్షత్రము. గ అంటె 

గమనము ఆది అంటె ఆరంభము. భూమి నుండి మనము చూచినప్పుడు 

నక్షత్రములు భ్రమించుచున్నటులనే కనపడును. దీనిని తెలుగులో సాపేక్ష చలనమని 

అంగ్లములో relative motion అని అంటారు. కావున నక్షత్ర మరియు గ్రహ 

చలనారంభమే ఉగాది అని తెలియనగును.

ఉగాది చైత్ర శుధ్ధ పాడ్యమి ఉదయంతో ప్రారంభమౌతుంది. చంద్రుడు ఆ నెలలోని 

పున్నమికి చిత్రా నక్షత్రమునకు దగ్గరౌతాడు కావున అది చైత్ర మాసమైంది. మనము 

ఆంద్ర దేశములో అమావాస్యతో అంతమయ్యే నెలను వాడుకలో ఉంచుకొన్నాము. 

పున్నమితో అంతమయ్యే నెలను తమ ఆచారముగా కలిగిన వారు కూడా ఉన్నారు. 

బహుశ ఆ కారణము చేతనే పున్నమికి చంద్రునికి దగ్గరయిన నక్షత్రము పేరుతో ఆ 

రాబోవు మాసము ఏర్పడియుండవచ్చును.

అసలు దీనికి ఇంకొక అన్వర్థము కూడా వున్నది. "చత్రస్యభావహ ఇతి చైత్రం " 

అంటారు. అంటె ఏ కాలమైనా పనికి వచ్చే గొడుగు లాగా మనలను కాపాడుతుందని 

ఒక అర్థమైతే అన్ని ఋతువులనూ తన గొడుగు కింద అంటే control లో 

వుంచుకొని ప్రజలకు వలయు విధంగా అందిస్తుందని కూడా అన్వయము.

మొదటి నెల చైత్ర మైతే  మొదటి సంవత్సరం 'ప్రభవ'. "ప్రకర్షేణ ఇతి ప్రభవః" 

అంటారు పెద్దలు. ప్రకర్ష అంటే 'మేలు' అని అర్థం. మన 60 సంవత్సరాల 

కాలమానం లో  'ప్రభవ' మొదటిదైతే  'అక్షయ' చివరిది. అంటె ఈ మేలు కలకాలం 

తరిగి పోకుండా కరిగి పోకుండా వుండాలని కోరుతున్నారు మన కాల వ్యవస్థ 

నిర్ణయించిన ఆ మహానుభావులు. అక్షయము అంటే క్షయము కానిది అనియే కదా 

అర్థము. అంటే కాల చక్రము తిరుగుతూనే ఉంటుంది కావున చివరి సంవత్సరము 

'అక్షయమైకాల చక్రములోని మొదటి సంవత్సరముము ‘ప్రభవ’ గా ప్రభావించుతూ 

వుంది.

ఇది తెలుసా: ఈ 60 సంవత్సరములకూ పేర్లున్నయి. ఇది శుభకృత్ నామ సంవత్సరము. 

ఈ సంవత్సరములో  పుట్టి తిరిగి 60 సంవత్సరముల తరువాతి వచ్చే శుభకృత్

చూచిన వాళ్ళు షష్ట్యబ్ద పూర్తి జరుపుకుంటారు.

కాల విభజన ఆధారంగా ఏర్పడిన పండుగ ఉగాది కనుక కాల ప్రమాణాన్ని పన్నెండు 

విభాగాలుగా చేసి మనం అనుసరిస్తున్నాం. వీటినే నిమేషం, కళ, కాష్ట, ముహూర్తం

జాము, దినం, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరాలుగా 

ప్రాచీనులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల సముదాయాన్ని యుగంగా పేర్కొన్నారు. 

యుగాల విభజనను పరిశీలిస్తే నవగ్రహాలు ప్రదక్షిణం చేసే కాలాన్ని పూర్ణ సంఖ్యగా 

గణించి 432 కోట్ల సంవత్సరాలను ఒక కల్పముగా పేర్కొన్నారు. ఈ 

కల్పములో1000వ వంతును ఒక మహా యుగ మన్నారు. మహాయుగాన్ని తిరిగి 

నాలుగు యుగాలుగా విభజించినారు.

17, 28,000(4,32,000X4) సంవత్సరాల కాల ప్రమాణాన్ని కృతయుగము గాను

12, 96,000(4,32,000X3) సంవత్సరాల కాల ప్రమాణాన్ని త్రేతాయుగం గానూ, 8

64,000(4,32,00000X2) సంవత్సరాల కాల ప్రమాణాన్ని ద్వాపర యుగము 

గాను4,32,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కలియుగము గానూ పేర్కొన్నారు.

మామూలుగా మన పెద్దలు, ధర్మము కృతయుగమున 4 పాదములతోనూ, 

త్రేతాయుగమున 3 పాదములతోనూ, ద్వాపర యుగమున 2 పాదములతోనూ, 

కలియుగమున ఒక పాదముతోనూ నడుస్తుందని. ఈ మాటకు పైన చెప్పినది 

శాస్త్రీయమైన అన్వయము.

అలాగే 70 మహాయుగాలను ఒక మన్వంతరంగా, 14 మన్వంతరాలను ఒక 

కల్పముగానూ పేర్కొన్నారు. ఇలా విభజించిన కాల ప్రమాణంలో ఒక కల్పము కాలం 

బ్రహ్మకు ఒక పగలు గానూ, మరో కల్పము  రాత్రి కాలము  గాను ఉంటాయని 

పురాణ ప్రశస్తి. ఇలా పరిశీలిస్తే  కృతయుగము కార్తీక శుద్ధ నవమి నాడు

త్రేతాయుగము వైశాఖ శుద్ధ తదియ నాడు ద్వాపరయుగం వైశాఖ శుద్ధ తదియ 

నాడు, కలియుగము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి అన్నది విజ్ఞుల 

వాక్కు . కృతయుగంలో నాలుగు పాదాలలోనూ, త్రేతాయుగంలో మూడు 

పాదాలలోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలలోనూ, కృతయుగంలో ఒక 

పాదంలోనూ ధర్మం నడుస్తుంది అని ముందే పైన చెప్పుట జరిగింది.

కృష్ణ యజుర్వేద తైత్తరీయ బ్రాహ్మణము పదవ ప్రకరణము పాఠములోని నాల్గవ 

అనువాకము

''యుగంభవేత్‌ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం'' అని 

చెబుతున్నది. దీని ప్రకారం ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు 

సంవత్సరాలను ఒక యుగముగా పేర్కొంటే 12యుగాలు అవుతున్నాయి.  అసలు 

సూర్యుడు చంద్రుడు మకర రాశి లో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి కలుస్తారు.  

కలయికను యుగము అంటారు.  అందువల్ల ఈ ప్రకారముగా 60 సంవత్సరముల 

కాలములో 12 యుగములు వచ్చును. వేదాంగమైన జ్యోతిష్య భాష్యములో 

యుగంలోని సంవత్సరాలను విశదీకరిస్తూ విద్యారణ్యుడు ''సంవత్సరోసి

పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి'' అని భాష్యం చెప్పినాడు.

అంటే ప్రతి యుగంలోని ఐదు సంత్సరములను వరుసగా సంవత్సరము

పరివత్సరము, ఇద వత్సరము, అను వత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో పిలుస్తారు. 

ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే తదుపరి యుగానికి సంబంధించి మొదటి 

సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా సూర్యుని చుట్టూ బృహస్పతి 

భ్రమణ కాలము 12 సంవత్సరములు అది ఒక యుగము అవుతుంది. అప్పుడు ఈ 

వర్ష సముచ్చయమునకు 5 యుగాలు ఏర్పడుతాయి. దానినే పుష్కరము అంటారు. 

సూర్య చంద్ర బృహస్పతుల కలయిక 865  బృహస్పతి సంవత్సరములకు ఒకసారి 

జరుగుతుంది. అట్టివి 5 గడిస్తే ఒక  కల్పము అంటారు.

మనం శ్వేతవరాహకల్పము లోని ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలోని 28వ 

మహాయుగము నందలి కలియుగ ప్రథమ పాదములోని 5123 సంవత్సరములు 

గడిచినవి. ఇక ప్లవ నామ సంవత్సరమును గూర్చి మీరు పంచాంగము నుండి 

తెలుసుకొనగలరు కావున ఆ విషయమును మీకే వదలి పెట్టినాను.

ఉగాది పండుగ నాడు మనం సాంప్రదాయ సిద్ధమైన కొన్ని ఆచారాలను పాటించడం 

కూడా పరిపాటిగా వస్తున్నది. అందులో ఒకటి వేప పువ్వు పచ్చడి సేవించడము. వేప 

పువ్వు పచ్చడి సేవించడాన్ని 'నింబ కుసుమ భక్షణం'' అనే పేరుతో ''ధర్మసింధు'' 

వర్ణించింది.

''అబ్దాదౌ నింబ కుసుమం! శర్కరామ్ల ఘృతైద్యుతమ్‌

''భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్య దాయకమ్‌''

అంటే సంవత్సరారంభమున మొదటి ఝాము నందు వేప పువ్వు, పంచదార అంటే 

నిజానికి పటికబెల్లము లేక బెల్లము కూడా సముచితమే!, కానీ మనము కాఫీ లోకి 

వాడే చక్కర మాత్రము కాదు, చింతపండు, నెయ్యి తదితరాలను తీసుకుంటే ఆ 

సంవత్సరమంతా సౌఖ్యంగా ఉండును అని అర్థం. ఈ పచ్చడి తినడం వలన త్రి 

దోషములు (వాత, పిత్త, కఫములు) నశించి శరీర తత్త్వములో మార్పు వస్తుంది.

శాస్త్రీయంగా చూస్తే హేమంత రుతువులో శరీరంలో ఏర్పడిన కఫము వసంతంలో 

సూర్యుని వేడికి కరిగి శరీర మంతటా వ్యాపించి రోగాలు కలిగించును. ఈ రకంగా 

ఏర్పడిన రోగాలలో మశూచి ఒకటి. ఇది ఎక్కువగా వసంత రుతువులో వచ్చు వ్యాధి 

కాబట్టి దీనికి 'వసంత సంభవా' అనే పేరు కూడా వున్నది. శరీరానికి మేలు చేకూర్చి 

మశూచి రాకుండా చేసే శక్తి వేపపువ్వుకు ఉండుట వలన ఈ ఋతువునందు వేప 

పువ్వు తినుట ఆచారమైంది. వాస్తవానికి వసంత రుతువు పూర్తయ్యే వరకూ వేప 

పువ్వు తినాల్సి వుంది. కనీసం శ్రీరామనవమి వరకు తినాలి. కాలక్రమమున ఈ ఆచారం అడుగంటి ఉగాది ఒక్కరోజునే అది సూర్యోదయం తరువాతనే వేపపువ్వు పచ్చడి తీసుకుంటున్నారు. సూర్యోదయానికి ముందుగానే తలస్నాన మాచరించి వేపపువ్వు పచ్చడి తినడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

పాపపు పనులకు, భూత ప్రేత పిశాచములకు  ఆలవాలమౌ అర్ఢరాత్రి సంబరాలు 

మానివేసి ,రాలిపోయే కాలములో క్రొత్త సంవత్సర వేడుకలు చేసుకొనే హీన 

సాంప్రదాయానికి ఆనకట్ట కట్టి వసంతముతో మొదలయ్యే ఉగాదిని 

జరుపుకుందాము.

స్వస్తి.    

   VN Rao

I can't refrain myself from commenting "Excellent"! Many don't know the importance of 'సంవత్సరాది'. Well explained sir. Best regards & respects🙏🙏🙏

· Reply · 6h

Cheruku Ramamohanrao

I honestly thank you very much for taking out a little time and going through the article.

· Reply · 5h

VN Rao

Cheruku Ramamohanrao Sir, I am too happy to carry your article to my family members including grand-children. All are delighted. After going through your earlier article, we arranged tutor to teach Telugu to our grandchildren. That's why it is said "knowledge is divine". The impact of passing it onto future generations, will be a great service to our society & nation.

· Reply · 4h

It is a great job Sir. I am happy I could hand over the mantle to a responsible and thus a right person who committed himself to carry it on to the posterity. God Bless You and All Your Family Members Sir,

 · Reply · 22h