ఆత్మ – అహంకారమమకారము – మానావమానము
https://cherukuramamohanrao.blogspot.com/2022/06/blog-post.html
బృహదారణ్యకోపనిషత్తును
గూర్చి మాట్లాడుకొనునపుడు శరీరాంతర్గతమగు ఆత్మయే పరమాత్మ అని చెప్పుకొన్నాము. మహా చైతన్య పదార్థమైన ఈ ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు
అంతా ఆత్మచైతన్యము ద్వారానే ముందుకు నడుస్తోంది. జీవికి శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు, సర్వ శారీరక సుఖాలు. ఇవన్నీ
ఆత్మ వల్లనే తెలుస్తున్నాయి. నిజానికి ఈ అనుభూతులు ప్రాణానికి సంబంధించినవే అయినా, ఈ అనుభవాలకు ఆధారం ఆత్మ మాత్రమే! మెలకువలోనూ, స్వప్నావస్థలోనూ, సుషుప్తిలోనూ జాగృతంగా ఉండి జీవికి సంభవించే అనుభవాల సమాహారాన్ని
ఎప్పటికప్పుడు గ్రహించి, తిరిగి జ్ఞాపకం చేయగలిగే నిరంతర చేతనా శక్తి హృదయకుహరంలో
స్థితమై ఉన్న ఆత్మ. ‘హృదయమునకు దగ్గరగా నీలి రంగులో జ్వలించుచున్న జ్వాల శిఖరమున
అణుమాత్రముగా ప్రకాశించుచునా పరమాత్మయే ఆత్మ. జీవికి ఆత్మ జీవులకు పరమాత్మ. అది
చలనం లేనిది. కానీ మనసు కన్నా వేగవంతమైనది. ఆత్మ ఒకచోట స్థిరంగా ఉంటూనే అన్నిటినీ
అధిగమించి ముందుకూ వెళ్ళగలుగుతుంది వెనకలకూ రాగలుగుతుంది. ముందునకైనా
వెనకలికైనా దాని వేగమును అందుకొనజాలవు. మరి పరమాత్మే సృష్టించిన ఏ వస్తువైనా పరమాత్మను
అధిగమించలేవు కదా!
ఆత్మ ఇంద్రియాలకు పూర్తిగా
అతీతమైనది. ఇంద్రియములద్వారా మనము ఆత్మను గ్రహించలేమన్నది వాస్తవము. మనకు ఉన్న ఏ
ఉపకరణమయినా తనకు నిర్దేశించిన పని మాత్రమే చేయగలుగుతుంది. అవయవ లోపము ఉన్నపుడే
దాని బాధ్యతను ఉన్న అంగము స్వీకరించవలసి వస్తుంది. ఆంతరిక లోకంలోని సత్యాలను సందర్శించలేవు.
ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేవు.
శరీరమునకు ఉన్న బాహ్యాంగములు బాహిరమగు వస్తు సముచ్చయమును గమనించగలవు, దృశ్యములను చూడగలవు అవసరమగునపుడు తత్సంబంధిత అంగములతో
స్పందించనూగలవు.
ఆత్మ భూత, భవిష్యత్తులకు అతీతము కానీ వానికదియే అధిపతి.
ఆత్మస్వరూపుణ్ణి వర్ణిస్తూ
‘‘బొటనవేలి పరిమాణం కలిగి, భూత, వర్తమాన. భవితవ్యాలకు అధిపతిగా వెలిగే పురుషునిగా
చెప్పవచ్చును. ఇక్కడ పురుషుడు అన్న శబ్దము నపుంసక లింగము. ‘ఆత్మ పొగబారని నిర్మల
తేజోమయ జ్యోతి’గా వర్ణించుతుంది కఠోపనిషత్తు. ఆత్మ జన్మించదు, మరణించదు. ఈ లోకాన ఆవిర్భవించిన లేదా జన్మించిన ప్రతి
వస్తువూ అనిత్యం. కాబట్టి వాటిలో షడ్భావ వికారాలు ఉంటాయి. ఆ ఆరూ మానవుని పరిణామ
దశలు. అవి జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, పరిక్షీయతే, వినశ్యతి
అనునవి. అంటే సూక్ష్మ (పుట్టుక), స్థూల
(పెరుగుదల) , మహిమ (మరింతగా పెరగడం లేక బలపడడం), రూప పరివర్తన (రూపంలో మార్పు రావడం), రూపక్షీణము (వార్ధక్యము), నాశనం
(మరణించుట). ఇవన్నీ బాహ్య పరిణామములు. వీటిలో ఏ భావ వికారాలకూ లోనుకానిది ఆత్మ.
అది సూక్ష్మమైన అణువుకన్నా సూక్ష్మమైనది. బ్రహ్మాండము కన్నా పెద్దది. ఆత్మను గూర్చి పరమాత్మ భగవద్గీతలోని రెండవ అధ్యాయములోని
సాంఖ్య యోగములోని 22, 23వ శ్లోకములుగా ఆత్మను గూర్చి ఈ విధముగా తెలుపుతాడు:
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2 - 22 ।।
ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో
అదే విధముగా జీవాత్మ, మరణ సమయములో పాత శరీరమును
వీడి కొత్త శరీరమును స్వీకరించును.
పునర్జన్మ ఉంటుందని
నిరూపించటానికి 'న్యాయ దర్శన' మన్న గ్రంధము ఈ
క్రింది వాదన ని చెపుతోంది.
జాతస్య హర్షభయశోక
సంప్రతిపత్తేః (3.1.18)
చిన్న శిశువును గమనిస్తే, ఏ పత్యేకమైన కారణం లేకుండానే, ఒక్కోసారి నవ్వుతూ వుంటుంది, ఒక్కొక్కపరి ఏడుస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఎదో ఆలోచనలో ఉన్నట్లు ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శనము' ప్రకారము, ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ
భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ, అ శిశువు
పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ వాసనలు మనసులో బలంగా ముద్రింపబడటం చేత అవి గత జన్మ
స్మృతులను తుడిచివేస్తాయి.
మిగిలినది మరోమారు....
ఆత్మ –
అహంకారమమకారము – మానావమానము – 2
'న్యాయ దర్శనము' పునర్జన్మ కు
మద్దతుగా ఇంకొక వాదనను పేర్కొంటుంది. ‘స్తన్యాభిలాషాత్ (3.1.21)’ అప్పుడే పుట్టిన శిశువుకు ఎలాంటి భాష తెలియదు. మరి
అలాంటప్పుడు, తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ, అప్పుడే
పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు, పొదుగుల నుండి
కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు
ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.
అందువలన, సహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము
పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.
ఇక 23వ శ్లోకమును
గమనించుదాము.
నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న
శోషయతి మారుతః ।। 2 - 23 ।।
ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి అరిపోవునట్లు చేయలేదు. ఆత్మ యొక్క లక్షణం అయిన
చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా
స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా, గాలి ఆత్మను ఎండబెట్టలేదు, నీరు తడపలేదు లేదా అగ్ని కాల్చలేదు అని
వ్యక్తపరుస్తున్నాడు.
ఆత్మ ఇంద్రియగోచరం కానిది.
అంతేకాదు, అచింత్యమైనది. అంటే మన మనసులోని ఆలోచనలకు అందనిది. ప్రతి
ఒక్క చలనానికి అనగా కదలికకు అచంచలమైనదొకటి హేతువాయి తీరవలసినదే! రైలు
పరుగెత్తాలంటే కదలకుండా ఉండే పట్టాలు అవసరం. చలనచిత్రము చూడాలంటే దానికి స్థిరమైన
తెర ఆధారంగా ఉండి తీరాలి. లోకంలో సంభవించే చలనాలన్నిటికీ కారణభూతమైనది ప్రాణం.
తెరమీది చలచిత్రమును చలింపజేయు పనిచేయడానికి ఆధారంగా నిలిచేది ప్రక్షేపకము (Projector). ఇది చలన చిత్రమునకు ఆత్మ.
దృగ్గోచకాని ఆత్మను వర్ణిస్తూ ‘‘చేరి కానరానివాడు... చింతింపరానివాడు, భారపు వికారాల పాయనివాడీ ఆత్మ’’ అంటారు అన్నమాచార్య.
ఆత్మతత్త్వం వర్ణించడం సాధ్యంకానంత అనంతత్వంతో భాసిస్తుంది. ఆత్మ సర్వవ్యాపకమైనది.
మహాచైతన్య పదార్థమైన ఆత్మనే హృదయాంతరికలోకాన వసించే అంతర్యామిగా మనం భావన
చెయ్యాలి.
ఇక మానావమానాలను గూర్చి
విశ్లేషించుకొందాము.
జీవునికి ముక్తి పొందటానికి
ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల లభించేది మానవ దేహం. మానవఉపాధి లభించినప్పుడు దానిని
సద్వినియోగం చేసుకోవటమే వివేకవంతుల లక్షణం. అనుకోకుండా ఒక పదునైన చాకు దొరికితే
బుద్ధిమంతుడు కాయగూరలూ పండ్లు తరుగుటకు వాడితే,కౄరుడగు బుద్ధిహీనుడు తలలు
తరగడానికి వాడుతాడు.
జగద్గురువగు శంకరులవారు ఎంత
మంచిమాట చెప్పినారో చూడండి.
మిగిలినది మరోమారు.....
ఆత్మ – అహంకారమమకారము –
మానావమానము- ౩
మన పూర్వ కర్మానుసారంగా
మనకు లభించిన ఉపాధి ధర్మాలను పాటిస్తూ, బాధ్యతలను
నెరవేరుస్తూనే, అసలైన జ్ఞానాన్వేషణ సాగించాలి. సదసద్వివేకాన్ని వృద్ధి
చేసుకోవాలి.
ఇక్కడ ఒకమాట చెప్పి తరువాత
మానావమానములను గూర్చి ముచ్చటించుకొందాము. మనము ఈ అలియుగములోనే అత్యంత నిమ్న జాతికి
చెందిన నాయనార్లు ఆళ్వార్లూ భగవద్భక్తులై ఏకముగా కైవల్యమునే సాధించినారు. అంటే దేవుని సన్నిధి చేరుటకు వర్ణము కాదు ముఖ్యము.
జ్ఞానాదేవ తు కైవల్యమ్.
అన్నది తేటతెల్లమగుచున్నది. వేదము ప్రతి వర్ణమునకు బాధ్యత్కలను అప్పగించినది.
వానిని చిత్తశుద్ధితో పాలించుటయే ధర్మానుసరణమగును.
మన వేదములు, ఉపనిషత్తులు అని వర్ణములవారికి శ్రేయోదాయక్మగు
హితవాక్యములకు తోడుగా ఎన్నో భక్తి మార్గములను ఉపదేశించుతూ ఉండగా, వాని సారమును కాచి వడపోసిన మహనీయులు ఎన్నో స్తోత్రములు, స్తవములు సర్వ మావజాతికి సమర్పణ చేసినారు అట్టి మహానీయులబాట
మనము నడచుటకు అత్యంత ఉత్కృష్టమై యోప్పారుచున్నది. అమితమగు సారభూతముగా
జగద్గురువులగు శంకరుల వంటి వేదశాస్ర పరినిష్ఠితులైన వారు వేరు వేరు చోట్ల ఉన్న
భగవద్గీత లోని ఉపదేశములను సకల శాస్త్ర ఉపనిషత్సారమును ఒక్కటి జేసి రంగరించి
సంగ్రహించి ఈ క్రింది శ్లోక రూపములో చెప్పినారు.
యక్త్వా మమాహమితి బంధకరే
పరేద్వే
మానావమాన సదృశాః
సమదర్శినస్యా
కర్తారమన్య మవగమ్య
తదర్పితాని
కుర్వంతి కర్మ పరిపాక ఫలాని
ధన్యాః
మనకు ఈ సంసారబంధమునకు ముఖ్య
హేతువులు అహంకార మమకారములు.
ధనము విద్య వంశము, బలగము, అధికారము మొదలగునవి
అహన్కారెఅహెథువులు. నేను అనుకోనుతయే అహము. ఈ విధముగా తాలువ మొదలిడితే ఇక మన
గర్వమునకు హద్దే ఉండదు. అహంకారము పెరిగే కొద్దీ సాటి మనుషులపై తూష్ణీభావము
పెరుగుతుంది. అది పతన హేతువే కానీంయతా కాదు.
చెరుకు తీపి ఎంతొ చేకొని
యున్ననూ
చీడ పుట్టెనేని చెరుకు
చెడును
అహము చీడ సమము అది నీవు
గమనించు
రామ మొహనుక్తి రమ్య సూక్తి
మిగుల చెడుగు చేసి మీసాలు
మెలిబెట్టి
కానరారు సాటి కళ్ళముందు
అన్న నిన్ను జూడ ఆపైన
ఒకడుండు
రామ మొహనుక్తి రమ్య సూక్తి
అహంకార చిత్త మత్త
ప్రవృత్తుడైన దుర్యోధనుని ఒకసారి చూద్దాము. బాల్యములోనే భీముని జంప నీట ముంచినాడు, లాక్ష్యాగృహము దహింప జేసినాడు, ద్రౌపదీ వస్త్రాపహరణము గావింపజేసినాడు. అతిరథ మహారథులు ఆరు
మంది కలిసి అభిమన్యుని పద్మవ్యూహమునందు చంపింప జేసినాడు. తనకు
సతి ఎవరని విర్రవీగినాడు. చివరకు భీమునిచేతిలో హృదయ విదారకమైన రీతిలో చనిపోయినాడు.
పిండప్రదానము చేయుటకు ఇటు పుత్రులు గానీ అటు సహోదరులు గానీ లేకుండా బలిచేసుకొని, చివరకు ధర్మరాజుతో నువ్వులు నీరు వదిలింప జేసుకొన్నాడు. మన
కార్య కలాపములను పైవాని కన్ను గప్పి చేయలేము. ఇటువంటి కార్య కలాపములు చేయువాడు
తప్పక జనన మరణ వాయు గుల్మమున అనగా సుడి గుండమున తగులుకొన్నట్లే! అంటే శంకరులవారు
వేరొక సందర్భములో చెప్పినట్లు
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||
పరమాత్మా! ఈ చావు పుట్టుకల
జలవలయము లోనికి నన్ను జోప్పించకు. దానిని దాటింపజ్జేయు అనుగ్రహము నాపై చూపించు, అని ఆర్త్ తో వేడుకొంటాడు నిజమైన భక్తుడు. దానకి మనము
కృషిచేయవలసినది అందుకు చేయవలసిన మొదటి పని అహంకార త్యాగము.
ఈ విషయమై ఇంకొక మాట
చెబుతాను:
మనుష్యుల మధ్య వచ్చే చాల
మటుకు పొట్లాటలు ఈ ''అహం" వల్లనే జనిస్తాయి. అది మనకు తెలిసినదే!
"What They
Don’t Teach You At Harvard Business School" అనే పుస్తకం రాసిన Mark H McCormack, అనే రచయిత ఇలా అన్నాడు : "చాలా వరకు, పెద్ద పెద్ద సంస్థలలో ఉన్నతస్థాయి అధికారులు(Carporate Executives) , రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార
బుడగలు." గణాంకాలు పరిశీలిస్తే, చాలామంది ఉన్నత
స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణం, వారికి పనిలో నైపుణ్యం లేక కాదు, వ్యక్తుల మధ్య సమస్యల వలన. కావున అహంకారాన్ని పెంచి పోషించు
కోకుండా, దానిని త్యజించటం లోనే ప్రశాంతత కు మార్గమున్నది.
ఇక మమకారమును గూర్చి కాస్త
విశ్లేషించుకొందాము.
మరొక మారు.........
ఆత్మ – అహంకారమమకారము –
మానావమానము- 4
భగవద్గీతలోని ఈ రెండు
శ్లోకములను గమనించండి:
ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ
కిమకుర్వత సంజయ ॥1-1॥
ఈ శ్లోకము
ప్రతమాధ్యాయములోని ప్రథమ శ్లోకము. ధృతరాష్టృదు
పుట్టు గ్రుడ్డి. ధర్మశాస్త్ర రీత్యా రాజ్యపాలనా యోగ్యత లేనివాడు. పాండురాజు యొక్క
దయ, జాలి, అభిమానముతో సింహాసనము
అధీష్ఠించినాడు. తన పుత్రులు ఎల్లవేళలా పాండవులకు ఎగ్గులు చేసినవారే! కానీ యుద్ధము
వచ్చిన వెంటనే నా సుతులు పాండుసుతులు అన్నాడు కానీ, అయ్యో
అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకొన యుద్ధమునకు సిద్ధమైనారే అని అనలేదు. ఇదే మమకారము
అంటే! పిఒనీ ఇది శాశ్వతమా అంటే క్షణికమే! మరి దీనికి అంత స్వార్తమవసరమా! అసలు
ధృతరాష్ట్రుడు
ఏమంటున్నాడో చూడండి- “ఓ
సంజయా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్దులై కూడి ఉన్న
నా వారైన దుర్యోధనాదులు, పాండు పుత్రులు ఏం చేసినారు? ఇదీ మమకారము.
ఇపుడు భగవద్గీత నుండియే మరియొక ఉదాహరణ తీసుకొందాము.
రెండవ అధ్యాయములోని 5వ
శ్లోకములో అర్జునుడు తన మమకారమును ఈ విధముగా వ్యక్తము చేయుచున్నాడు.
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు
గురూనిహైవ భుఇజ్నీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 2 -5 ||
మహానుభావులైన ఈ గురుజనులను
చంపకుండా బిచ్చమెత్తుకొని యైనను ఈ లోకమున జీవించుట శుభదాయకము. ఏలనన ఈ గురుజనులను
చంపినను, రక్తసిక్తములైన రాజ్యసంపదలను, భోగములను
మాత్రమే నేను అనుభవింతును గదా ।
మమకారము అను బలమైన పొర లేక
తెర ఎంతగా అర్జునుని కనులుగాప్పిందో చూడండి. అర్జునుడు స్వతహాగా క్షత్రియుడు.
ఎదుటి వ్యక్తి యుద్ధమునకు ఆహ్వానించి యుద్ద్ఝారంగాములో నిలచిన తరువాత ఎదురించి
పోరుట క్షాత్ర ధర్మము. అదికాదని ఎదురునిలచినవారు నాకు గురువులు, పెద్దలు ప్రియతమ బంధువులు అనుట మమకారము కాక మరేమిటి? భగవంతుని సారధిగా చేసుకొని, ఆయన
అదేశానుసారమూ నడచుకొనే పార్థుడు మమకారము అన్న మాయకు ఎంత లోనయినాడో చూడండి. మన
సనాతన ధర్మమూ నిర్దుష్టముగా చేయ తగినవి చేయ తగనివి అనేకానేక గ్రంధములావ్ ద్వారా
ఆదేశించినది. మనము అల్లోచించక ఆచరించుతూ పొతే చాలు.
ఇక్కడ పెద్దలు చెప్పిన ఒక
మాట గుర్తు చేస్తాను. ‘సంఘః ఖలు పాంథ సంగమః’ అంటే భావమంధము లోన బందీలై మమకారము
పెంచుకొన్నవారంతా కేవలము ప్రయాణములో కలిసిన పాంథులు అంటే ప్రయాణీకులు. ఎవరిగామ్యము
వారిది అన్నది ఎరిగి మసలుకోనుతకు బదులుగా ‘ఆహామైతెశాం’ ‘మమైతే’ అనగా నేను నాది
అన్న వలయమున తగుల్కొని తిప్పలు పడుతూ ఉన్నాము. పై శ్లోకములోని మొదటి పాదములో
జగద్గురువులు ఆదేశించినది దీనిని పరిత్యజించమనియే! శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో
చెప్పినది కూడా ఇదియే!
విహాయ కామాన్యః
సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స
శాంతిమధిగచ్ఛతి ।। 2-71 ।।
ఎవరైతే ప్రాపంచిక కౌతుకములను త్యజించి, అత్యాశ లేకుండా, నేను/నాది అన్న
భావన లేకుండా, అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి
పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.
శ్లో॥ సమశ్శత్రౌచ మిత్రేచ
తథా మానావ మానయోః।
శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ
వివర్జితః॥
(18)
శత్రువుల యందు, మిత్రులయందు సమంగా ప్రవర్తించేవాడు, అలాగే మానావమానములయందు, శీతోష్ణములయందు, సుఖదుఃఖములయందు సమంగా ఉండేవాడు, సంగభావాన్ని విడిచిన వాడు(నా ప్రియభక్తుడు).
అద్వేష్టా సర్వభూతానాం
మైత్ర: కరుణ ఏవచ l
నిర్మమో నిరహంకార: సమదు:ఖ సుఖ క్షమీll
సమస్త ప్రాణుల యెడల ద్వేషము లేనివాడు , స్నేహభావము, దయకలవాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దు:ఖములందు
కలవాడు. ఓదార్పుగలవాడు (భక్తుని లక్షణములు).
అని ఈ విధముగా ఇది
చెప్పినదే కదా! అనుకోకుండా పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.
కళ్ళుమూసుకొని శ్లోకములను
చెప్పుకొనుటయే గాక నైతిక విలువలను పాటించుతూ అహంకార మమకారములను సమదృష్టితో చూస్తూ, సుఖదుఃఖములను సాకు జేయక సరభూత శ్రేయోభావనతో ఈవితము5
కొనసాగించువాడు నిజమగు భక్తుడు. జీవన గమనములో మనము ఏర్పరచుకొన్న పథములో బాటకు
ఇరువైపులా పాత్ర పుష్టి గల చెట్లుంటే సేదతీరి బడలిక సడలుతుంది. అదే చెట్లు లేని
దారింబడితే దారి క్కన్తక్కబ్ ప్రాయమయినడై ఉండవచ్చు, సూర్యుని
వాదియగు వేడి భరించనూ లేకపోవచ్చు. కానీ కానీ సుఖదుఃఖాలను పరిగణన లోనికి తీసుకొనక
ప్రయాణము చేస్తూ ఆదేవదామమును పొందినవాడే నిజమగు భక్తుడు.
మిగిలినది మరోమారు.......
ఆత్మ – అహంకారమమకారము –
మానావమానము – 5 (చివరి భాగము)
మన పూర్వుల మనస్తత్వము
ఏవిధముగా ఉండేదో ఒకసారి ఈ క్రింది శ్లోకములో గమనించండి:
మన్నిన్దయా యః జనః
పరితోషమేతి నన్నప్రయత్న సులభోయమనుగ్రహోమేl
శ్రేయోర్థినోహి పురుషాః
పరతుష్టి హేతోః దుఃఖార్జితాన్యాపి ధనాని విసర్జయతిll
ఈ శ్లోక సారాంశము ఏమిటంటే , నాటి విద్వద్వరేణ్యులు ఈ విధముగా తలపోసేవారట. సాధారణముగా
సంతోషమును పొందుటకు దాతలు అవసరమగు వ్యక్తులకు ధనమును దానము జేసి సంతోషమును
పొందుతారు, కానీ నేను ఒక వ్యక్తి నిందకు కారనంకై సంతోషమును
కలిగించుచున్నాను. ఎటువంటి ఖర్చూ లేకుండా ఎదుటి వ్యక్తిని సంతోషపరచి ఆ పుణ్యమును
మూటకట్టుకొనుచున్నాను కదా! మానావమాన విషయములో ఈ ఉదాసీనతను కలిగియున్డుతకు ఇది
పరాకాష్ట.
ఈ విషయమై మహనీయులు నీలకంఠదీక్షితులు ఒకసారి ఇలా అన్నారు:
ప్రామాణ్య బుద్ధిః
స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని l
కీట బుద్ధిర్మనుష్యేషు
నూతనాయాః శ్రియః ఫలంll
స్తోత్రము అనగా ‘అవిద్యమాన
గుణ కీర్తనం స్తోత్రం’. అంటే లేని ఉత్తమ గుణములను స్తోత్రము చేయు వ్యక్తిలో
ఆపాదించుట. ఇది మానవుల విషయములో మాత్రమే! మనుష్యుల విషయములో ఈ స్తోత్ర పాఠమును
వంగర, అల్లు గారలు రేలంగిని ప్రశంసించుతూ ఆయన పాత్రకు లేని
గుణములతో చ్గేస్తారు. ఇది నేటి సామాజిక పరిస్థితికి నిలువుటద్దము.
ఈ శ్లోకము యొక్క అర్థము
ఏమిటంటే కొత్తగా సంపద పొందినవాడు, స్తోత్ర పాఠాలకు,
అవి వాస్తవాలు కాకున్నా పొంగి పొరలి పోతాడు. తనకు ఎక్కడలేని
దేవతా బుద్ధులను ఆపాదించుకొంటాడు. కీతబుద్ధి అంటే సాటి మనుషులను పురుగులవలె చూస్తూ
హీనముగా మాట్లాడుతాడు. అందుకే మనవాలు అంటూవుంటారు ‘అష్ట దరిద్రునికి ఐశ్వర్యము
వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడని’. కాబట్టి మనకు ఒకరి రాగద్వేషాలతో పనిలేదు.
మనసుకు తోచిన పని మనము చేస్తున్నామని మన ఆత్మకు నచ్చజేప్పుకోగలిగితే చాలు.
మానావమాన సదృశాః
సదర్శినశ్చ’ అన్నది ఆర్యవాకు. మానావమానములకు పొంగనూ వద్దు కృంగనూ వద్దు. భగవద్గీత
ఈ విధముగా చెబుతూ వుంది.
విద్యావినయసంపన్నే
బ్రాహ్మణే గవి హస్తిని ।
శుని చైవ శ్వపాకేచ పండితాః
సమదర్శినః ।। 5 - 18 ।।
విద్యా వినయములు గల్గిన
నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో
చూస్తారు. ఈ తరతమ భేదములు పాతిన్చానివాడే నిజమైన భక్తుడు కాగలుగుతాడు.
‘కర్తారమన్య మవగమ్య
తదర్పితాని కుర్వన్తి కర్మ పరిపాక ఫలాని ధన్యః’ ఆదేమీ లేదండీ. అంతా పైవాడు
చేసినదే! నన్ను ఉపాధిగా ఆయన వాడుకొన్నందుకు ధన్యుడను. ఇది మనము మనసా వాచా నమ్మి
ఆచరించవలసినది. గీతలో పరమాత్మ ఈ మాటే చెబుతున్నాడు.
యత్కరోషి యదశ్నాసి
యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ
తత్కురుష్వ మదర్పణమ్ ।। 9 - 27 ।।
నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో
అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ
పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.
అంటే “భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం
చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే తీవ్రమైన విరహ వ్యాకులత
చెందటమే.” పనులను ఆయనకు అంకితం చేసి మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చి
వేస్తే దానినే అర్పణం అంటారు. భౌతికమైన ప్రాపంచిక పనులను, ఇటువంటి దృక్పథం దివ్యమైన భగవత్ సేవగా సంపూర్ణముగా
మార్చివేస్తుంది. స్వామి వివేకానంద పని పట్ల ఈ దృక్పథాన్నే వ్యక్తీకరించాడు: “ఏ
పనీ లౌకికమైనది కాదు. ప్రతిదీ భక్తి మరియు సేవయే! పరమ భక్తుడగు కబీరు ఈ విధముగా
అంటున్నాడు.
జహాఁ జహాఁ చలూ కరూ పరిక్రమా, జో
జో కరూ సో సేవా
జబ సోఁవూ కరూ దండవత్, జానూ దేవ న దూజా
“నేను నడిచినప్పుడల్లా నేను
భగవంతుని గుడిని ప్రదక్షణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది
చేసినా, అది భగవత్ సేవ గానే చేస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం
చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను.”
పోతన భాగవత రచనా
ప్రారంభములో ఈ విధముగా అంటాడు:
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు
రామభద్రుండట,నే
బలికిన భవహర మగునట
పలికెద వేరోండు గాథ పలుకగ నేలా?
అట్టి భక్తియే నిజమైన
తాదాత్మ్య యుక్తమగు భక్తి. అసలు గీతలో పరమాత్ముడే అర్జునునితో చెబుతాడు” ఈ
యుద్ధమంతా నీభ్రమ. చావవలసినవారి నందరినీ చంపుచున్నది నేనే! ఆ మాటకొస్తే వీరిని
పరిమార్చాదము అయిపోయినది.నీవు నిమిత్త మాత్రుదివే!”. ఈ భావన కలకాలమూ మాడిన నిలిపి కర్మను
చేసేవాడు భక్తి తాదాత్మ్యతను పొందినవాడే!
శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే
కర్మ బంధనైః
ఎవడైతే ఆహంకారమమకారములను
వదిలిపెట్టి మానావమానములను లెక్కించక, సర్వత్ర సమదర్శిగాఉండి, తాను చేస్తున్నాననే భావనతో కర్మలను చేయక, చేయించే వాడు పరమాత్మయే అని తలచి, తత్కర్మలను చేసి పరమేశ్వరార్పణముగా భావించుతాడో వాడు
ధన్యుడు అన్నది శంకరులవారు,
భగవద్గీతలో వేర్వేరు అద్యాయములలో చెప్పిన సందేశములను
క్రోడీకరించి ఆదియందు తెలిపిన చిన్న శ్లోకము రూపములో జగద్గురువగు ఆది శంకరులవారు
మనకు అందజేసినారు.
పార్థ నైవేహ నాముత్ర
వినాశస్తత్య విద్యతే ।
న హి కల్యాణకృత్కశ్చిత్
దుర్గతిం తాత గచ్ఛతి ।। 6 - 40 ।।
ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు
ఈ లోకం లో కాని, పర లోకంలో కాని చెడిపోడు. ప్రియ మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి
పాలుకాడు.
తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నది, దీనర్థం "పుత్రుడా" అని. అర్జునుడిని తాత అని
సంబోధించి శ్రీ కృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొడుకుని
అనురాగంతో తాత అని సంభోదిస్తారు. గురువు తన శిష్యుడికి తండ్రి లాంటి వాడు, కాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో 'తాత' అని సంభోదిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని
మరియు కృపని చూపిస్తూ, ఆయన మార్గం లో ఉన్న వారి బాగోగులని తనే చూసుకుంటాడు అని
చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు ఎందుకంటే
వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్టు. మరియు "మంచి చేసే వారు
ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." ఈ లోకంలో మరియు పర లోకంలో భక్తుడిని
భగవంతుడే కాపాడుకుంటాడు అని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక
అభిలాషులకు ఒక గొప్ప భరోసా.
స్వస్తి ప్రజాభ్యాం
పరిపారలయంతాం
న్యాయేన మార్గేన మహీం,మహీశాం l
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు
నిత్యం
లోకాః సమస్తా స్సుఖినో
భవంతు.ll
సర్వే జనాః సుఖినోభవంతు.