ఆత్మ – అహంకారమమకారము – మానావమానము
https://cherukuramamohanrao.blogspot.com/2022/06/blog-post.html
బృహదారణ్యకోపనిషత్తును
గూర్చి మాట్లాడుకొనునపుడు శరీరాంతర్గతమగు ఆత్మయే పరమాత్మ అని చెప్పుకొన్నాము. మహా చైతన్య పదార్థమైన ఈ ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు
అంతా ఆత్మచైతన్యము ద్వారానే ముందుకు నడుస్తోంది. జీవికి శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు, సర్వ శారీరక సుఖాలు. ఇవన్నీ
ఆత్మ వల్లనే తెలుస్తున్నాయి. నిజానికి ఈ అనుభూతులు ప్రాణానికి సంబంధించినవే అయినా, ఈ అనుభవాలకు ఆధారం ఆత్మ మాత్రమే! మెలకువలోనూ, స్వప్నావస్థలోనూ, సుషుప్తిలోనూ జాగృతంగా ఉండి జీవికి సంభవించే అనుభవాల సమాహారాన్ని
ఎప్పటికప్పుడు గ్రహించి, తిరిగి జ్ఞాపకం చేయగలిగే నిరంతర చేతనా శక్తి హృదయకుహరంలో
స్థితమై ఉన్న ఆత్మ. ‘హృదయమునకు దగ్గరగా నీలి రంగులో జ్వలించుచున్న జ్వాల శిఖరమున
అణుమాత్రముగా ప్రకాశించుచునా పరమాత్మయే ఆత్మ. జీవికి ఆత్మ జీవులకు పరమాత్మ. అది
చలనం లేనిది. కానీ మనసు కన్నా వేగవంతమైనది. ఆత్మ ఒకచోట స్థిరంగా ఉంటూనే అన్నిటినీ
అధిగమించి ముందుకూ వెళ్ళగలుగుతుంది వెనకలకూ రాగలుగుతుంది. ముందునకైనా
వెనకలికైనా దాని వేగమును అందుకొనజాలవు. మరి పరమాత్మే సృష్టించిన ఏ వస్తువైనా పరమాత్మను
అధిగమించలేవు కదా!
ఆత్మ ఇంద్రియాలకు పూర్తిగా
అతీతమైనది. ఇంద్రియములద్వారా మనము ఆత్మను గ్రహించలేమన్నది వాస్తవము. మనకు ఉన్న ఏ
ఉపకరణమయినా తనకు నిర్దేశించిన పని మాత్రమే చేయగలుగుతుంది. అవయవ లోపము ఉన్నపుడే
దాని బాధ్యతను ఉన్న అంగము స్వీకరించవలసి వస్తుంది. ఆంతరిక లోకంలోని సత్యాలను సందర్శించలేవు.
ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేవు.
శరీరమునకు ఉన్న బాహ్యాంగములు బాహిరమగు వస్తు సముచ్చయమును గమనించగలవు, దృశ్యములను చూడగలవు అవసరమగునపుడు తత్సంబంధిత అంగములతో
స్పందించనూగలవు.
ఆత్మ భూత, భవిష్యత్తులకు అతీతము కానీ వానికదియే అధిపతి.
ఆత్మస్వరూపుణ్ణి వర్ణిస్తూ
‘‘బొటనవేలి పరిమాణం కలిగి, భూత, వర్తమాన. భవితవ్యాలకు అధిపతిగా వెలిగే పురుషునిగా
చెప్పవచ్చును. ఇక్కడ పురుషుడు అన్న శబ్దము నపుంసక లింగము. ‘ఆత్మ పొగబారని నిర్మల
తేజోమయ జ్యోతి’గా వర్ణించుతుంది కఠోపనిషత్తు. ఆత్మ జన్మించదు, మరణించదు. ఈ లోకాన ఆవిర్భవించిన లేదా జన్మించిన ప్రతి
వస్తువూ అనిత్యం. కాబట్టి వాటిలో షడ్భావ వికారాలు ఉంటాయి. ఆ ఆరూ మానవుని పరిణామ
దశలు. అవి జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, పరిక్షీయతే, వినశ్యతి
అనునవి. అంటే సూక్ష్మ (పుట్టుక), స్థూల
(పెరుగుదల) , మహిమ (మరింతగా పెరగడం లేక బలపడడం), రూప పరివర్తన (రూపంలో మార్పు రావడం), రూపక్షీణము (వార్ధక్యము), నాశనం
(మరణించుట). ఇవన్నీ బాహ్య పరిణామములు. వీటిలో ఏ భావ వికారాలకూ లోనుకానిది ఆత్మ.
అది సూక్ష్మమైన అణువుకన్నా సూక్ష్మమైనది. బ్రహ్మాండము కన్నా పెద్దది. ఆత్మను గూర్చి పరమాత్మ భగవద్గీతలోని రెండవ అధ్యాయములోని
సాంఖ్య యోగములోని 22, 23వ శ్లోకములుగా ఆత్మను గూర్చి ఈ విధముగా తెలుపుతాడు:
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2 - 22 ।।
ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో
అదే విధముగా జీవాత్మ, మరణ సమయములో పాత శరీరమును
వీడి కొత్త శరీరమును స్వీకరించును.
పునర్జన్మ ఉంటుందని
నిరూపించటానికి 'న్యాయ దర్శన' మన్న గ్రంధము ఈ
క్రింది వాదన ని చెపుతోంది.
జాతస్య హర్షభయశోక
సంప్రతిపత్తేః (3.1.18)
చిన్న శిశువును గమనిస్తే, ఏ పత్యేకమైన కారణం లేకుండానే, ఒక్కోసారి నవ్వుతూ వుంటుంది, ఒక్కొక్కపరి ఏడుస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఎదో ఆలోచనలో ఉన్నట్లు ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శనము' ప్రకారము, ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ
భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ, అ శిశువు
పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ వాసనలు మనసులో బలంగా ముద్రింపబడటం చేత అవి గత జన్మ
స్మృతులను తుడిచివేస్తాయి.
మిగిలినది మరోమారు....
No comments:
Post a Comment