Showing posts with label అన్న మాటల గూ ఢార్థమును చూడండి.. Show all posts
Showing posts with label అన్న మాటల గూ ఢార్థమును చూడండి.. Show all posts

Saturday, 22 February 2020

విదర్భ దేశము - రుక్మిణి కళ్యాణము


విదర్భ దేశము-రుక్మిణీ కళ్యాణము
నేను రుక్మిణీ కల్యాణమును గూర్చి తెలుపబోవుట లేదు. అందు నాకు తోచిన కొన్ని ముఖ్య విషయముల గూర్చి తెలియజేయుట నా ఈ వ్యాసము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
విదర్భ దేశము విదర్భ రాజ్యమునకు రాజధాని. ఈ దేశమునకు పేరెన్నికగన్న రాజు భీష్మకుడు. ఆయన కుమార్తె రుక్మిణి అని, ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు విదర్భ వచ్చి ఆమె అన్న రుక్మి ని శృంగభంగము చేసి, అతనిని ఆశ్రయించిన బంధు మిత్రులను ఓడించి, రుక్మిణిని ద్వారకకు కొనితెచ్చి వివాహము చేసుకొన్నది భాగవతులందరికీ తెలిసిన విషయమే! ఈ సందర్భములో ఎక్కువ మందికి తెలియని ఒకటి రెండు విషయములు తెలుపుతాను.
1.   కర్మ యోగమును ఆశ్రయించినవారు  దర్భ లేకుండా క్రతువులను చేయలేరు. అదే జ్ఞానయోగమును ఆశ్రయించిన వారికి దర్భ అవసరము లేదు. విదర్భ జ్ఞాన మార్గీయులచే పాలింప బడినది కాబట్టి ఆ దేశము\ప్రాంతము విదర్భ అంటే దర్భ అవసరములేని ప్రాంతమైనది.
2.   రుక్మి భీష్మకుని పెద్ద కుమారుడు. ఇతనికి నలుగురు అనుజులు ఉన్నారు.
జ్ఞాన\అజ్ఞానమునకు 5 గణుపులు ఉంటాయి అని పెద్దలు చెబుతారు. ఈ ఐదు గణుపులలో  మొదటి గణుపు రుక్మి. ఐదు మందిలో ఇద్దరు పెద్దవాడయిన రుక్మి అనుచరులు. మిగత ఇర్వురు ఉదాసీనులు. అంటే వాళ్ళు దేనినీ తవ్వరు పూడ్చరు. ఈ 5గణుపులకు సమన్వయార్థమును ఒకసారి పరిశీలించుదాము. నిజానికి ఇవి  త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణశ్రోత్రములు అన్న  జ్ఞానేంద్రియ పంచకములు. వ్యాస భాగవతములో ఈ 5గురి పేర్లు  ఈ విధముగా ఇవ్వబడినాయి. రుక్మము  అంటే బంగారము. అది జ్ఞానమునకు ప్రతీక. విదర్భను గూర్చి  మొదలే జ్ఞానాపేక్ష కల్గిన దేశముగా చెప్పుకొన్నాము కదా! అందుకే ఆ దేశ ప్రభువగు  భీష్మకుడు తన 5 మంది  కుమారులకు మరియు 6వ సంతానమైన కుమార్తెకు జ్ఞానాన్వయమైన రుక్మము అనగా బంగారము అన్న పేరు వచ్చేలాగున ఈ  విధముగా పేర్లు పెట్టినాడు. ఆ పేర్లు వరుసగా 1. రుక్మి 2. రుక్మకేశుడు 3. రుక్మబాహు 4. రుక్మరతుడు  5. రుక్మమాలిని చివరిగా కుమార్తె పేరు రుక్మిణి. ఈ పేర్లు చెప్పకనే ఒక వాస్తవాన్ని చెబుతూ ఉన్నాయి. భీష్మకుని మొదటి కుమారుడు రుక్మి. అంటే  సువర్ణము . దాని ఆ రుక్మికి శోభను కూర్చేవాడు రుక్మ కేశుడు. మనిషికి జుట్టు అందము. ఇక బలము కూర్చేవాడు రుక్మ బాహు. అంటే రుక్మికి ఆకర్షణ బలము ఈ ఇరువురు తమ్ములు. మిగిలిన ఇరువురిలో ఒకరు రుక్మ రతుడు. అంటే  ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వేద వాక్యమును నమ్మి ఆరాధించేవాడు. కావున ఐహికము, దైహికము అయిన ప్రలోభమయమగు కర్మలకు యీతడు అతీతుడు. బ్రహ్మజ్ఞాన రతుడు కాబట్టి ఆయన ఏదీ పట్టించుకోడు.ఇక మిగిలిపోయిన చివరి తమ్ముడు రుక్మ మాలిని. ఏ జ్ఞానమయితే రుక్మమో దానికి కాపుదారుడు ఈయన. తోటకు మాలి ఉన్నట్లు ఈయన తత్వమసి అన్న వేదవాక్కును(ఛాందోగ్యోపనిషత్తు) నమ్మి ఆ రుక్మమే తానై కాపాడేవాడు. కావున ఈ ఇరువురు రాగ ద్వేషాలకు అతీతులు.
  జ్ఞానేంద్రియ పంచకములయిన త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణశ్రోత్రము లను గూర్చి ఒకమాట చెప్పుకొందాము. చర్మము కన్నులు నాలుక ముక్కు చెవులు బాహ్యానుభవమును గూర్చు ఇంద్రియములు. ఇవి ఇటు మంచిని అటు చెడును కూడా తమ అనుభవములోనికి తీసుకోగలుగుతాయి. కానీ ఇవి ఏ మనసుకైతే చేర్చుతున్నాయో ఆమనసు సత్కర్మ పక్షపాతియైతే సత్వము సత్కర్మలను ఆశ్రయించుతుంది. దుష్కర్మ పక్షపాతియైతే ఆదారి లోనే పోతుంది. ఈ ద్వంద్వముల వాళ్ళ మనసు ఎప్పుడూ ఘర్షణకు లోనవుతూ వుంటుంది. అందుకే మనోనిశ్చలత మనిషికి ఎంతో అవసరము అన్ని ఎన్నోవిధములుగా పెద్దలు చెప్పినారు. అందుకే రుక్మి అతని మొదటి ఇరువురు సోదరులూ, అతని స్నేహితులూ పరమాత్ముడగు శ్రీకృష్ణునిచే శృంగభంగమునకు గురియైనారు.
ఈ విధముగా మన పురాణేతిహాసములన్నీ తమసోమా జ్యోతిర్గమయ అన్న వేదవాక్కునకు దృష్టాంతరములు. వీనిని ఆకళింపు చేసుకొని పాటించితే జీవాత్మ పరమాత్మ సాయుజ్యమును చేరుకొంటుంది. ఇదియే శ్రీకృష్ణ పరమాత్మను జీవాత్మయగు రుక్మిణీదేవి  కల్యాణమాడుట. ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహత ఏర్పడుతుందో అప్పుడు పరమాత్మ మిగిలిన అంటే కర్మఫలము వల్ల ఏర్పడిన దోషములను సవరించి ఆత్మను తనలో ఐక్యము చేసుకొంటాడు.
స్వస్తి.