Showing posts with label ఆర్తిని గూడిన ఈ పరమేశ్వర వర్ణనను భక్తి పూర్వకముగా చదవండి.. Show all posts
Showing posts with label ఆర్తిని గూడిన ఈ పరమేశ్వర వర్ణనను భక్తి పూర్వకముగా చదవండి.. Show all posts

Tuesday, 14 February 2023

కాలకాలుడా కావుమయ్య

 

కాలకాలుడా కావుమయ్య

https://cherukuramamohanrao.blogspot.com/2023/02/blog-post_14.html

సీసపద్యమునకు ప్రాస నియమము లేదు.   ‘ఇంద్రగణములారు ఇన గణమ్ములు రెండు’ అనుటచే సీసమునకు నాలుగు పాదములే అని తెలియవచ్చుచున్నది. అయినా ఈ క్రింది సీసములో ‘ర్ణ’ అన్న, నాశక్తికి ఒక దుష్కరమైన, ప్రాసతీసుకొని. మామూలుగా నాలుగు పంక్తులను ఎనిమిదిగా వ్రాసే సాంప్రదాయమును పాటిస్తూ, ఎనిమిది పంక్తులలోనూ ‘ర్ణ’ ను ప్రాసగా తీసుకొనుట జరిగినది. ఇది పరమేశ్వరానుగ్రహమనే నా ప్రగాఢ విశ్వాసము.

భావము: నీ కథలు అమృత తుల్యములు. మాటలకు అందని వ్యక్తిత్వము నీది. వరములిచ్చుటలో కల్పవృక్షమును మించిన వాడవు. ఆచెట్టు పర్ణఛాయలో నన్నుండనివ్వు. విధి బాధలనెడు ఉలి సమ్మెటల బారి నుండి నన్ను గట్టెక్కించు. బాల్యము లో బుద్ధి రాలేదు. యౌవ్వనము క్రొవ్వువల్ల కళ్ళు కనిపించలేదు. మృత్యువుకు చేరువైన పిదప నీ ప్రాధాన్యత తెలియవచ్చింది. అయ్యా నన్ను కాపాడు.

కర్ణామృతం బైన  కథల కారకు డీవు

వర్ణాల కందని వస్తు వీవు

వర్ణనా తీతమౌ వర భూరుహము నీవు

పర్ణ ఛాయల నీదు  బరగ నివ్వు

జీర్ణ మైతిని విధి చీర్ల సమ్మెట పోట్ల

చూర్ణమై పోనట్లు చూడుమయ్య

కీర్ణుండ జర చేత  శీర్ణుండ బ్రతుకనే

ఆర్ణవం దాటించు పూర్ణ పురుష

బాల్య మందున బుద్ధి నే బడయనైతి

యౌవ్వనపు క్రొవ్వు తోడ నిన్నరయనైతి

కాలునకు చేరువగు నెడ కలిగె బుద్ధి

కాలకాలుడ  కావుమా కరుణ తోడ