పరమశివుడు
- ఆర్ద్రత
పరమశివుడు - ఆర్ద్రత
https://cherukuramamohanrao.blogspot.com/2016/07/blog-post.html
పరమేశ్వరుని గమనించండి. నెత్తిన నుండి గంగాజలపాతము, చాలదన్నట్లు చంద్రుని
శీతల కిరణాలు, శరీరము గగుర్పొడిచే విధముగా పారాడే పాములు, శరీరములోని
సగ భాగము మంచుమల పట్యగు చల్లని చూపుల గౌరమ్మ, చందన లేపనముతో కూడిన
శరీరము. ఈచలువంతా చాలదన్నట్లు కొట్లాది భక్తజనుల అభిషేకాలు ఎట్లు
పొందుచున్నాడో, ఆయన బాధను గుర్తించిన భక్తుడు తను శివునికి ఏవిధముగా
సాయము చేయగలనని చెబుతున్నాడో ఒకపరి ఈ దిగువ లంకెలో చదవండి.
https://cherukuramamohanrao.blogspot.com/2016/07/blog-post.html
శ్రీ మహావిష్ణువునకు శ్రవణా నక్షత్రము ముఖ్యమైతే శంకరునికి ఆర్ద్రా నక్షత్రము అతి
ముఖ్యము.శ్రవణమంటే వినుటయే కదా. భక్తుడు నా సహస్ర నామ శ్లోకములలోని ఒక
శ్లోకమును నాకు వినిపించినా నా చెంతకు చేరుతాడంటాడు పరమాత్మ. నా నెత్తి పై
కాసిన్ని నీళ్ళు పోసి ఒక బిల్వం పెడితే చాలు నావద్దకు చేర్చుకొంటానంటాడు
పరమేశ్వరుడు. వారెంత భక్త సులభులో గమనించండి.
అశ్వని,భరణి .... రేవతి వరకు గల 27 నక్షత్రాలూ తమిళులకు గూడా వున్నాయి కానీ
ఆపేర్లను వారు సంస్కృత నామములనే, వారి ఉచ్ఛారణకు అనుకూలముగా
పలుకుతారు. తమిళములో 'తిరు' అంటే 'శ్రీ' అని 'శ్రేష్ఠము' అని అర్థము. ఈ తిరు
శబ్దాన్ని వారు అటు శ్రవణానికి ఇటు ఆర్ద్రకు మాత్రమే వాడుతారు కానీ వేరు
నక్షత్రములకు వాడరు. శ్రవణాన్ని'తిరువాణం' అంటారు. ఆర్ద్రను 'తిరువాదిరై' అంటారు.
ఎందుకంటే ఈ రెండు నక్షత్రాలు ఆ విశ్వ పాలకులకు అంత ముఖ్యమైనవి కాబట్టి.
అసలు ‘హరి’ అన్న ‘హర’ అన్నా ఇద్దరూ లయించుకొనేవారే!
వారు మన దుష్ట బుద్ధిని లయించవచ్చు, దుష్ట కామనలను లయించవచ్చు, దుష్ట
తంత్రములను లయించవచ్చు, దుష్ట సంకల్పములను లయించవచ్చు, ఎంతకూ కాకుంటే
మనలనే లయించ వచ్చు. ఆ ఒక్క మాట చాలు వారి అభేదము తెలుపుటకు. అందుకే
శంకరులవారు ఒక సందర్భములో అంటారు:
ఏకా నారీ సుందరీవా దరీవా ఏకం వాసం పత్తనం వా వనం వా l
ఏకో మిత్రః భూపతిర్వా యతిర్వా ఏకో దేవః కేశవోవా శివోవా llనారి అన్న శబ్దము ఒకటే.
ఆ నారి 'సుందరి' కావచ్చు 'దరి' కావచ్చు. మిత్రుడు ఒకడే! అది 'భూపతి' 'యతి' కావచ్చు.
నెలవు 'పత్తనము' కావచ్చు 'వనము' కావచ్చు. పరమాత్ముడూ ఒకడే! ఆయన
'కేశవు' డైనా కావచ్చు, 'శివు' డైనా కావచ్చు. అంటే ఈ శ్లోకము భక్తులకు తరతమ
భేదాలు లేవని చెప్పుటయే గాక పరమాత్మునిగా 'శివు'నైనా కొలువ వచ్చు 'విష్ణువువు'
నైనా కోలువవచ్చు.
ఈ శ్లోకములో రెండు మాటలు పాఠకుని సందిగ్ధములోనికి నెట్టుతాయి. మొదటిది ‘దరి’.
‘దరి’ అన్న తెలుగు పదమునకు అర్థము ‘ఒడ్డు’. కాబట్టి ‘దరి’ అన్న మాట సంస్కృత
శ్లోకములో ఇముడదు. అదే ‘దరి’ కి సంస్కృతములో ‘వికృతరూపిణి’ అన్న అర్థము ఉంది.
ఇది సరిపోతుంది. అదే విధముగా ‘పట్టణము’ అన్నది తెలుగుమాట. సంస్కృతములో
దీనిని ‘పత్తనము’ అంటారు. అందుకే సంస్కృతాంధ్రములు సాగర తుల్యములు అనుట
స్వభావోక్తిగా తలచుతాను.
‘ఏకో దేవః కేశవోవా శివోవా’ అన్న ముక్తాయింపును చివరిలో మనకు బల్ల గుద్ది
చెప్పినారు జగద్గురువులు. కావున వారిది అభేద ధర్మము. ‘యథా అంతరం నపశ్యామి
తథామే స్వస్థిరాయుషి’ అని చెప్పినది శాస్త్రము. ఆవాస్తవమును గుర్తించినవారు మాత్రమే
సుఖ శాంతులను బడయగలరు అనేకదా ఆమాటకు అర్థము.
విషయము 'ఆర్ద్రత'ను గూర్చి కాబట్టి మొదలు దాని అర్థము చెప్పుకొందాము. ఆర్ద్రత
అంటే తడిసిన అని అర్థము. కన్నులు ఆర్ద్రత తో నిండిపోయినాయి అంటే కన్నులు
చెమ్మగిల్లినాయి అని అర్థము. మరి శివునికి 'ఈ ఆర్ద్రత చాలా ఇష్టము. ఆయన దుఃఖము
సహించలేడు. అశ్రు పూరితనయనములతో ఆయనను ఒక్క సారి వేడుకొంటే కనిగుడ్డే
శివలింగముగా కన్నీరే అభిషేకజలము గా భావించి మనల నాదుకొంటాడు.
చితంబరములో మార్గశిరమాసములో వచ్చే ఆర్ద్ర నక్షత్రము చాలా ముఖ్యమైన
దినము. మార్గశిర పౌర్ణిమ రోజు చంద్రుడు మృగశిర నక్షత్రము దాటగానే ఆర్ద్ర ను
చేరుతాడు. అప్పటికి పున్నమి ఘడియలె వుంటాయి. మార్గశిర మాసమే చలికాలము
అందులోనూ శీతకిరణుని పౌర్ణిమ. అంటే ఒకటే చలి. అభిషేకము చేసి స్వామికి
చల్లదనాన్నిచ్చే చందనమును అలదుతారు. ఆ పరమేశుడు ఎంత 'ఆర్ద్రత'ను
భరించుతాడో చూడండి.
ఈ విషయాన్ని తీసుకొని ఒక శివభక్తకవి ఈ శ్లోకాన్ని ఎంత మనోహరంగా చెప్పినాడో
చూడండి. ఒకవైపు ఇంత చలిని ఎట్లు భారించుతావయ్యా అంటూనే దానికి మార్గము
కూడా నిరుత్తరుడైన పరమేశ్వరునకు చెబుతాడు.
మౌళౌ గంగాశశాంకౌ కరచరణ తలే శీతలాంగా
భుజంగా
వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందనం
సర్వగాత్రేl
ఇత్థం శీతం ప్రభూతం కనక సభా నాథ సోఢుం
క్వ శక్తిః
చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే
నిత్యవాసో మదీయేll
కనక సభానాథా : కనక సభాపతీ!
మౌళౌ : శిగలో
గంగా శశాంకౌ : గంగయును మరియు
చంద్రుడిని కలిగి
కరచరణతలే : చేతులు కాళ్ళ నంటుకొని
శీతలాంగాం : చల్లని శరీరములు కల
భుజంగాః : పాములను (దేహముపై ప్రాకుతూ) కలిగి
వామే : ఎడమ
భాగే : వైపున
దయార్ద్రా : దయచేత తడిసిన (అమితమగు
దయగలిగిన)
హిమగిరిదుహితా : మంచుమల పట్టిని
విరాజిల్ల జేసి
సర్వగాత్రే : ఒడలంతా
చందనం : మంచి గంధము పూతను కలిగి
ఇత్థం : ఇట్లు , (ఈ విధంగా, ఇన్నివిధాలుగా)
ప్రభూతం : ఎక్కడైనా
శీతం : చలువదనమును
సోఢుం : ఉందా ( కలిగియుండే చోద్యము
కలదా!)
నిత్యతప్తే : (స్వామీ!)ఎల్లకాలమునందును
వేడి పుట్టించే
నిర్వేద తప్తే : ఉదాసీనత చేత
కాగబడుచూ వున్న
మదీయచిత్తే : నా మనసునందు
తే : నీకు
నిత్య వాసః : నిరంతర నిలయమయినచో (నీకు
ఎంతో ఊరట కలుగుతుంది)
యది న భవతి : అట్లుకానిచో
శక్తిః : సత్తువ
క్వ : ఎక్కడ (అంటే శక్తి ఎక్కడ నుండి
వస్తుంది)
ఎంత అత్యద్భుత అపురూప భావనో
గమనించండి.
పరమేశ్వరునికి పృథివి పైన ఐదు నాట్య సభలు తమిళనాడు లోని ఐదు దేవాలయాలలో
వున్నాయి .
అవి 1. చితంబరములో కనకసభ, దానికి నాయకుడైన శంకరుడు కనక సభాపతి 2.
తిరువలంగాడు లో రత్న సభ, దానికి నాయకుడైన శంకరుడు రత్న సభాపతి. 3.
తిరుక్కుట్రాలం లో చిత్ర సభ, దానికి నాయకుడైన శంకరుడు చిత్రసభాపతి 4.తిరునెల్వేలి
లో తామ్రసభ, దానికి నాయకుడైన శంకరుడు తామ్ర సభాపతి 5. మధురై లో రజత సభ,
దానికి నాయకుడైన శంకరుడు రజత సభాపతి .
ఇప్పుడు మన నాయకుడు కనక సభాపతి. మహనీయుడగు అజ్ఞాత కవి స్వామితో ఈ
విధముగా మాటలాడుచున్నాడు.
స్వామీ కనక సభాపతీ నీవా వ్యోమ కేశునివి. నీ జటల శిగలో ఒడలు జలదరించే గంగ,
శిగపువ్వు చల్లదనాన్ని సమకూర్చే నెలవంక,చేతులు కాళ్ళు మేనూ చూతమా నీ
ఆభరణాలైన పాములు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి, నీ నెలవా మంచుకొండ
,వామ భాగము (ఎడమ వైపు) చూస్తేనో దయాంబురాశియైన నీ ఇల్లాలు హైమజ, ఇవి
ఇట్లుండగా మార్గ శీర్ష ములో చలి, దానికి తోడూ చల్లని పున్నమ రేయి,జలధారలతో
అకుంఠిత అభిషేకము ఆపై శైత్యము కలిగించే చందన గంధము నీ మేనికి అలదుతూ
వుంటే అంతటి చలిని ఎట్లు భరింపగలుగు
చున్నావయ్యా మహానుభావా.
బహుశ ఈ ప్రశ్నకు, తనలో 'ఇంత ఆర్ద్రత' ఉందా అన్న ఆశ్చర్యముతో అవాక్కయిపోయి
ఉంటాడుశివుడు. అందుకని ఆ భక్త కవే జవాబు చెప్పుచున్నాడు. స్వామీ నీవు చింతించ
నక్కరలేదు. వాసనా జనితుడనై,భరితుడనై, మొహపరవశుడనై, బాధాగ్నివలయ
పరివేష్టితుడనై వున్న నావద్ద కావలసినంత వేడి దొరుకుతుంది. నా మది యన్న గది నీ
కొరకే ఖాళీగా వుంచినాను. అక్కడ ఉండిపోతే నీకూ హాయి నాకూ హాయి మరి
నీవేమంటావు అన్నాడు భక్తుడు.
వేరేమంటాడు సరే అనక శివుడు.
చిత్తము శివునికి నెలవైతే మరి భక్తి ఆ
భగవంతుని అర్చనా పుష్పమే కదా !
పై శ్లోకమును మదిన పదిలము జేసి తదనువర్తనమైన రెండు పద్యములు నేను నా
శంకరదాస అష్టోత్తర శతిలో వ్రాసినాను. ఒకసారి
చిత్తగించండి.
58. గంగను కొప్పులోపలను గట్టున చక్కని
చంద్రవంకయున్
హంగగు హైమ శైలమును ఆభరణాలగు కాళజాలముల్
అంగములన్ని ప్రాక మరి ఆర్ద్రత ఎంతయు
కల్గుచుండ యా
సంగతి వీడి నీటికయి సాచెద వర్రు లదేల
శంకరా!
59. ఆర్ద్రత ఎంత కల్గినను అల్లది తీరగ
నేను నీకు సౌ
హార్ద్రత తోడ నొక్క విషయమ్మును
చెప్పెద నాలకించు నీ
వార్ద్రత చూపి నామదిని ఆశ్రయ మందిన
వేడి పుట్టు నో
ఆర్ద్ర జలాభిషేకరత ఆవము కోర్కెల కద్ది శంకరా!
స్వస్తి