ఇదీ ఉపపాండవుల కథ (క్లుప్తముగా)
మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత
ఉపపాండవులకు కనిపించదు. పాండువులకు ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన
అభిమన్యుడు, ఘటోత్కచుని వంటి వీరులకు దక్కిన
ప్రాధాన్యతా ఉండదు. అయినంత మాత్రాన వీళ్లు తక్కువవాళ్లని కాదు. పరాక్రమంలో
పాండవులంతటివారే! కురుక్షేత్ర సంగ్రామంలో తమ వీరత్వాన్ని రుచిచూపినవారే! అలాంటి ఈ
ఉపపాండవుల గురించి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.
అసలు వీరి జన్మ వృత్తాంతము ఒకసారి
గమనించుదాము. హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించేందుకు, విశ్వామిత్రుడు అతడి కుటుంబాన్ని నానా కష్టాలూ పెట్టిన కథ
తెలిసిందే! వారి నుంచి సకల సంపదలూ తీసుకోవడమే కాకుండా, రాజ్యం నుంచి కూడా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తాడు.
విశ్వామిత్రుని కరకుదనాన్ని ముల్లోకాలూ ముక్కున వేలేసుకుని చూస్తుండిపోతాయి. కానీ
దేవలోకం నుండి ఇదంతా గమనిస్తున్న ‘విశ్వేదేవతలు’ అయిదుగురు మాత్రం, విశ్వామిత్రుని వంటి మహర్షికి ఇట్టి ప్రవర్తన తగదంటూ వారించ
ప్రయత్నిస్తారు. అహం దెబ్బతిన్న విశ్వామిత్రడు వారిని మర్త్యులు అనగా మనుష్య
జన్మమెత్తమని శపించుతాడు. వారు " మహర్షీ మా బుద్ధికి తోచిన మంచిమాట చెప్పుటలో
తప్పేమి" యని అడుగగా తన తొందరపాటుతనమునకు చింతించిణ వాడై "నా శాపము అప్రతిహతము
కానీ మీరు భవ బంధములలకు తగుల్కొనక సద్వంశ సంజాతులై జన్మించి తిరిగీ మీలోకనకు
చేరుకొంటారు" అని శాప విమోచన మార్గమును తెలియజేస్తాడు. ఆవిధముగా ఉపపాండవులు
ఉద్భవించుట జరుగుతుంది. ద్రౌపది కి ధర్మరాజునకూ పుట్టినవాడు ప్రతివింధ్యుడు.
వింధ్యపర్వతానికి సాటి అయినవాడు కాబట్టి ఇతనికి ఈ పేరు వచ్చిందట. ఇతనికే
శ్రుతవింధ్యుడని కూడా పేరు ఉంది. ధర్మరాజు తనయుడు కాబట్టి, ఆయన తరువాత హస్తినాపురాన్ని ఏలే అర్హత కలిగినవాడు.
కురక్షేత్ర సంగ్రామంలో చిత్రసేనుడనే వీరుని సంహరించినాడు.
ఇక ఉపపాండవులలో రెండోవాడు నకులునికీ, ద్రౌపదికీ పుట్టిన శతానీకుడు. పాండురాజునకు కుంతి వలన
కలిగిన మొదటి సంతానమగు ధర్మజుని కి పుత్రోదయము జరిగిన పిమ్మట ధర్మబద్ధముగా ఆ
గౌరవము రెండవ భార్య యగు మాద్రి పెద్ద కుమారుడైన నకులునితో తన రెండో బిడ్డను
పొందేందుకు సిద్ధపడింది. అందుకని శతానీకుడు ఉపపాండవులలో రెండోవాడయినాడు. అవక్ర
పరాక్రముడగు నాతడు దుష్టద్యుమ్నుని సేనకు నాయకత్వం వహించినాడు.
భీమసేనునికీ, ద్రౌపదికీ జన్మించిన శ్రుతసోముడు ఒకానొక సందర్భంలో ద్రోణునీ, అశ్వత్థామను నిలువరిస్తాడు ఈతడు. భీమసేనుడు సహస్ర
సంఖ్యాకమైన సోమయాగములు చేయగా పుట్టినవాడు కనుక అతనికి “శ్రుతసోముడు” అను పేరు
సార్థకమయ్యింది అగ్ని దేవతా నక్షత్రమైన కృత్తికా నక్షత్రమున పుట్టినాడు కనుకు
సహదేవుడు తన కుమారునికి అగ్ని దేవత నామాంతరమైన “శ్రుతసేన” అని తన కుమారునికి
పెట్టినాడు అర్జునుడు ఒక మహాత్కార్యమును సాధించి తిరిగి ఇన్ద్రప్రస్థమునకు చేరి
కీర్తించబడే సమయమున పుట్టినాడు కనుక అతనికి“శ్రుతకీర్తి” అను పేరు సార్థకమయ్యింది.
ఉపపాండవులందరిలోకీ చిన్నవాడు కాబట్టి, చాలా గారాబంగా
పెరిగినవాడు ఈతడు. అయితే విశ్వామిత్రుడు సూచించినట్లుగానే, ఈ ఉపపాండవులంతా ఎలాంటి భవబంధాలలోనూ చిక్కుకోకుండా
అర్థాంతరంగా చనిపోతారు అశ్వత్థామ చేతిలో.కురుక్షేత్ర సంగ్రామం ముగింపుకి
వచ్చేసరికి మహామహాయోధులంతా కుప్పకూలిపోతారు. ఇక కౌరవుల గురువైన ద్రోణాచార్యుని
కూడా పాండవులు హతమారుస్తారు. అయితే ద్రోణునికి అబద్ధం చెప్పి, ఆయనతో అస్త్ర సన్యాసం చేయించి... పాండవులు ఆయనను అన్యాయంగా
పొట్టనపెట్టుకున్నారన్న ఆవేశంతో రగిలిపోతాడు ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ. తన
పగకు ప్రతీకారంగా పాండవులను సమూలంగా నాశనం చేస్తానని బయలుదేరతాడు. పాండవులను
ఎలాగైనా చంపాలన్న కసితో ఉన్న అశ్వత్థామ యుద్ధనీతిని సైతం కాదని రాత్రివేళ వారిని
చంపాలనుకుంటాడు. ఆ ఆవేశంలో చీకటివేళ పాండవుల గుడారంలోకి ప్రవేశించి అక్కడ
నిద్రస్తున్న అయిదుగురినీ నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. కానీ ఆ చీకటిమాటున
అశ్వత్థామ చేతిలో హతులైనవారు పాండవులు కాదు ఉపపాండవులు అన్న సత్యాని ఆలస్యంగా
గ్రహిస్తాడు. ఈ విధముగా మహాభారతంలో ఉపపాండవుల కథ ముగుస్తుంది. ఉపపాండవులను
అకారణంగా,
అధర్మంగా పొట్టన పెట్టుకున్నందుకు చిరకాలం రోగాలతో
జీవచ్ఛవంగా బతకమన్న కృష్ణుని శాపాన్ని పొందుతాడు అశ్వత్థామ.
స్వస్తి