Showing posts with label మహాభారత యుద్ధం నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా. Show all posts
Showing posts with label మహాభారత యుద్ధం నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా. Show all posts

Monday, 4 November 2019

మహాభారత యుద్ధం నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా


మహాభారత యుద్ధం
నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా!
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_4.html
మహాభారతములో మనలో ఎక్కువమందికి తెలిసినది కౌరవులు పాండవులు యుద్ధము శ్రీకృష్ణుడు ద్రౌపది, భీష్ముడు ద్రోణుడు కుంతి, కర్ణుడు ఇట్లు కొంతమంది మాత్రమే! ఉపాఖ్యానములు కాకుండా ప్రధాన కథను పంచుకొన్న పాత్రలు 70 కనిపించుతున్నాయి నాకు. నా అంచనా తప్పు కూడా ఉండవచ్చు. ఇందులో 98 మంది దుర్యోధన సహోదరులపేర్లు చేర్చలేదు. ఖాండవమునకు సంబంధించిన పాత్రలను చేర్చలేదు. ఇంకాకూడా ఎన్నో మరచి ఉండవచ్చు. అసలు ఇన్ని పాత్రలను కలుపుకొని చిక్కుపడకుండా ఊలుదారమును అందమైన బంతిగా చుట్టినట్లు చుట్టి వ్యాసులవారు మన చేతికి ఇచ్చినారు.
అసలు భారతములో 1,20, 000 శ్లోకాలూ వ్యాసుడే వ్రాసినాడా! ఈ వ్యాసుడు వేదాలను విభజించిన వ్యక్తియేనా! పురాణేతిహాసములు ఈయన వ్రాసినవేనా! ఒక్కడు ఇన్ని రచనలు చేయ సాధ్యమా! అంటూ అనేక దేశ విదేశ చరిత్రకారులు సందేహమును వేలిబుచ్చినారు. Maxmullar  కడుపు కక్కుర్తి కొరకు క్రైస్తవ మత వ్యాప్తికి కంకణము కట్టుకొని తన సంస్కృత మిడిమిడి జ్ఞానముతో వేదములను ఆంగ్లము లోనికి తర్జుమా చేసినాడు. రాను రాను ఈ దేశము యొక్క గొప్పదనము తెలియవచ్చి యుండవచ్చు, అందుచే అతడు ఏమన్నాడంటే:
"Whatever sphere of the human mind you may select for your special study, whether it be language, or religion, or mythology, or philosophy, whether it be law or customs, primitive art or science, you have to go to India. Some of the most valuable and instructive material of the history of man are treasured up in India and India only." -- Max Mueller
 ఈ ప్రశంస చాలు మనము మన పూర్వుల గొప్పదనము గుర్తించుటకు.
మానవుని జీవన కాలము యుగయుగమునకూ మారుతుంది. దశరథుడు 13 వేల సంవత్సరములు, శ్రీరాముడు 11 వేల సంవత్సరములు జీవించినట్లు మనము వాల్మీకి రామాయణము ద్వారా తెలుసుకొంటాము. ప్రాణము అంటే ఉఛ్వాస నిశ్వాస. దానిని నియంత్రించే శక్తినిబట్టి మనిషి యొక్క ఆయుర్ధాయము ఆధారపడి ఉంటుంది. ఋషులు అట్టి మహానుభావులు. మరి వ్యాసుడు విష్ణ్వంశ సంభూతుడు. పైగా మహా ఋషి. అసలు ఆయనను చిరంజీవిగా పురాణములు ఘోషించుచున్నాయి. అసలు ద్వాపరమునకు సంబంధించిన ఆ మహానుభావుడు కలియుగములో శంకరులవారికి ప్రత్యక్షమై 16 సంవత్సరముల అదనపు ఆయుర్దాయమును తన తపఃశక్తి నుండి ధారపోయలేదా! ఇటువంటి అనేకానేక దృష్టాంతరములు చూచిన తరువాత  నాకు మహనీయులకు సాధ్యము కానిది లేదు అనిపిస్తుంది. వ్యాసుని వంటి దైవాంశతో జన్మించినవారు, అఖండ తస్సంపంనులు, ఇట్టిపనులు చేయుటలో ఆశ్చర్యము కానరాదు.
ఈ ఉపోద్ఘాతముతో మనము యుద్ధభూమిని ప్రవేశించుదాము.
మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య
18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత అన్నది ఒకసారి తెలుసుకొందాము.
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంటులు (పదాతి దళం) కలిసితే సైన్యములో దానిని ‘పత్తి' అని అంటారు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.  వాహినికి మూడు రెట్లు ‘పృతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పృతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.
ఇప్పుడు మనము చర్చించ బోయే విషయములో ముఖ్యముగా గుర్తుంచుకొనవలసినది యుద్ధము జరిగినది 18 రోజులే. హతులుకాగా మిగిలినది 15, 16 మంది మాత్రమే! వారెవరు అన్నది చివరన తెలుపుకొంటాను. 18 రోజులలో 18 అక్షౌహిణులను మట్టుబెట్టవలెనంటే బాణములతో బల్లెములతో సాధ్యమా! చూద్దాము.
మహాభారత యుద్ధము  మహాభీకరమయిన  యుద్ధము.దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధము ద్వాపరయుగ అంతమునకు ఏర్పడిన ప్రళయముగా మనము భావించవచ్చు.
దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో పాశవిక రసాయన మారణాస్త్రాలను ఉపయోగించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఆకాలములో కౌరవ పాండవులకు ఏవిధముగా లభించి వుండవచ్చు అన్నది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. సమాధానమును సాధించే ప్రయత్నమూ చేద్దాము.
వ్యాసుని హరివంశములో కొన్ని చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. తరువాతి కాలములో కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించిన నిర్దుష్ట చరిత్ర దొరుకుతుంది. ఈ రచనలకు ఆలంబనమే శ్రీకృష్ణ ద్వైపాయనుడు వ్రాసిన హరివంశము. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశ, చంద్రవంశ రాజుల చరిత్రలు వున్నాయి.
క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. వ్యాసుని వ్రాతలను నేటి కాలమానమునకు మార్చితే,  క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు మనకు తెలియవస్తూవుంది. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చినారు అని చదివినాను కానీ అందుకు తగిన ఆధారమును పొందుట నాకు అసాధ్యమైన విషయము. అయినా ఈ శీర్షికపై మన వివరణకు వచ్చిన ఇబ్బందిలేదు.
మహాభారత యుద్ధ కాలం
భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించియుండినట్లు మనకు తెలియవస్తూవున్నది. భీష్ముడు సైన్యాధిపతిగా యుద్ధము చేసినది పదిరోజులు. పదవ రోజు సాయంత్రము శిఖండిని ముందుంచుకొన్న  అర్జనునితో  యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో ఆయన అస్త్ర సన్యాసం చేయుట జరిగినది. ఇందుకు సంబంధించిన వివరములు భీష్మార్జున యుద్ధము  లో వ్రాసినాను. అంటే భీష్ముడు గతించిన 68 రోజులకు పూర్వము మహాభారత యుద్ధము ప్రారంభమైనట్లే కదా! అంటే మహాభారత సంగ్రామము సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైనదని చెప్పుకొనవచ్చును. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే ,89 లక్షలుగా  నమోదు చేసినారు.
బ్ర.శ్రీ. కోట వేంకటా చలం గారు వ్రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించినారు.
రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు లేనిదే ఇంత మారణ హోమము అంత తక్కువసమయములో జరుగ వీలులేదు అని కొందరు ప్రఖ్యాత చరిత్రకారులు ఖండితముగా చెప్పినారు.
భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతము ద్వారా మనకు తెలియవస్తూ వున్నది. ఈ నారదుడు 372 కాంతిసంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం  ఆనాడు వుండేదని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలినట్లు కొందరు ఈవిషయమీ కృషి చేసినవారు చెప్పగా విన్నాను.
వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానము శ్రీకృష్ణుని ద్వారానూ, మరెన్నో విధములుగానూ పాండవులకు, ముఖ్యముగా అర్జనునికి లభించినట్లుగా భారతము లోతుగా చదివితే మనకవగాతమౌతుంది. ఖాండవ దహన సందర్భములో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి ఇచ్చిన సుదర్శనచక్రము ఒక rotating sharp edged distence control weapon గానూ,  గాండీవమును launcher గానూ  అక్షయ బాణ తూణీరాలను missils గానూ పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ మారణాస్త్రాల వినియోగం వల్ల బుగ్గియైపోయినది.
ఈ అస్త్రాలను వినియోగించేందుకు అతి నిగూఢమైన Passwordలాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరూ, Control Button లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇంకా సమగ్రముగా పరిశోధించవలసిన అంశము.
Remote Control ద్వారా అస్త్రాల ప్రయోగం
అణ్వాస్త్రాల సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి GPS Advanced Technology తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు.
ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్న అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!
అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటున్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ అన్న Scientist, 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి PHd. పట్టా పొందుట జరిగినది. కొంత లోతుగా ఆలోచించితే ఈ అస్త్రాలన్నీ ప్రస్తుతము ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా ఉండినట్లు ఒక అంచనా.
మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల నుండి గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడినట్లు పరిశోధకులకు తెలియవస్తూ వుంది. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువులు ప్రయోగించిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేసినట్లు వ్యాసులవారు భాత్రతమునండు తెలియజేసినారు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే ప్రతిభావంతమగు ప్రతిఘటన శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి దానిని నిర్వీర్యము చేస్తుంది. కావున మహాభారత యుద్ధములో దాదాపు కోటి యోధులు మరణించినారంటే ఈ యుద్ధం Missils లేకుండా జరిగిఉన్దదనె చెప్పవలసి వస్తుంది.
ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.
క్రీస్తుకు పూర్వం భూమిపైన ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన 'అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో Epi-center (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై వారికి కనపడటం జరిగింది. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. అంటే పైన చెప్పిన కాలమునకు ఇది సరిపోతూ ఉంది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించినారు.
అస్త్రాల వివరాలు
మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబుల వంటి ఆయుధాలు ఉన్నట్లు తెలిపినారు. పది సూర్యులనుండి  ప్రసరించగల వేడిమి పుట్టించే అస్త్రాలు వున్నట్లు తెలుపటం జరిగింది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను కూడా ప్రయోగించినారని పేర్కొన్నారు. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయినాయణి అందు వ్రాయబడి ఉంది. రణభూమిలోని గుడారాల్లో భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారితే అసంఖ్యాకులగు సైనికులు పారిపోయి నదులలో మునిగి ఆ నీరు త్రాగి ప్రాణాలు కాపాడుకొన్నారు అని తెలియవస్తూ వుంది.
మహాభారతంలో ఒక్క బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. దుర్యోధనుడు మరణించిన పిదప అశ్వత్థామ ఆపని చేయబోయినాడు కానీ శ్రీకృష్ణుదు దానిని వారించి అతని నొసట ఉన్న మణిని తీసుకొని ఆతనిని, చిరంజీవి కాబట్టి, అడవులలో సంచరించుతూ ఉండమని చెప్పినాడు. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా ఆయన వ్యూహరచన అమోఘము, అనన్యసాధ్యము. తానూ పరమాత్మే యని చెప్పుకొన్న వేదవేద్యుడు.
అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం’ అన్న గీతా వాక్యమును సార్థకము చేసి, యుద్ధమున ఉపయోగించిన సమస్త అస్త్రశాస్త్రములనూ సముద్రమున ముంచనాదేశించి పునః ‘ధర్మస్థాపన’ చేసిన ఆ త్రిజగాన్వంద్యునికి సాష్టాంగ ప్రణామము మనసారా చేస్తూ శెలవు తీసుకొంటున్నాను. .
స్వస్తి