ఆహారము – ఆర్యవాక్కు
https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post.html
రుచి లేని తిండి తినకుము
శుచి శుభ్రత లేని వంట చూడకు తినగా
విచలింపనీకు మనసును
పచనము సరిలేనివంట పారణ రామా!
రుచి శుచి శుభ్రత లేనిది ,వుడికీ ఉడకని వంట ఆతురతతో భోజనము చేసి ఆరోగ్యమును పాడు చేసుకోవద్దు.జీవరాసులలో తినుటలో చపలత చూపేది మానవుడు మాత్రమే! మిగత ప్రాణులకు అది కానరాదు. మనకు కడుపు నిండినా కూడా ఏ కారాబూందియో వేయించిన వేరుసేనగపప్పో మరేదో మరేదో నోట వేసుకొనే ఆతురత చూపుతారు. మన భోజనమును గూర్చి, దాని విధానమును గూర్చి ఋగ్వేద యజుర్వేదములలోని అన్న సూక్తములో చెప్పబడినాయి. ఎక్కడేమి చెప్పినా అన్నము పరబ్రహ్మ స్వరూపమనియే చెప్పినారు. మానవునికి తినుటకు యోగ్యమైన ప్రతి పదార్థమూ అన్నమే! అన్నము వండినవాడు వడ్డించినవాడు తినువాడు అందరూ బ్రహ్మ స్వరూపులే. ‘అందుకే అన్నం బ్రహ్మ అహంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ...’ అంటారు సముచిత సందర్భాలలో! అన్నానికి శుచి శుభ్రత అత్యంత అవసరమని చెబుతున్నవి వేదములు. పదే పదే అదే అదే చెబుతున్నది వేదము. ఆ అది ఏమిటం టే ‘హితము-మితము’. ఈ శాస్త్ర వచనమును గమనించండి.
గృహములో తల్లి లీక ఇల్లాలు చేసే వంటలో ఆయా పదార్థములలో వేసే వస్తువులుగాక అందులో ఒక అవ్యాజమైన అభిమానము కలిసిఉంటుంది. బయటి తిండ్లలో ఆ అవకాశము ఉండదు. పెద్ద పెద్ద brands మనకు అమ్మే Pockets లో ఉన్న మూలకములు (Ingradients) మంచివి వేస్తూఉన్నారో లేదో మనకు తెలియదు. ఇటీవల నేను విన్న విషయము ఒకటి మీకు తెలియజేస్తాను. ఒక ప్రముఖ Ice cream Company తాము తయారుచేసే Ice cream లో ఆలివ్ నూనె పిట్టు అనగా Extract పాలకు బదులుగా వాడుచున్నారని తెలిపినారు . మరి అటువంటి Ice cream కు అర్రులుసాచుట ఆరోగ్యమునకు ఆటంకము కాదా! పిజ్జా బర్గర్లలో వేసే ప్రతి మూలకము మనకు తెలిసే అవకాశము లేదుకదా! ‘ఆరోగ్యము మహాభాభాగ్యము’ అన్నది మన అతి ప్రాచీనమైన మన నానుడి. అనారోగ్యము అన్నీ పనులకూ అవరోధమే! మనకు కావలసిన రుచి మన ఇంట్లోనే దొరుకుతుంది, పెద్ద పెద్ద హోటళ్లలో కాదు. వంట చేతకాని నేటి కొంతమంది యువత నేర్చుకొనియైనాసరే తంటా లేని ఇంటి వంటకు అలవాటు పడితే ఆరోగ్యము ఘంటా పథమై ఉంటుంది.
హితమైన తిండిలో
ఆరోగ్యము ఉన్నదని మితము మీరీ తినకూడదు. పిల్లగాలిలో ఉన్న హాయి పెనుగాలిలో ఉండదు
కదా! అందుకే పెద్దలు మనము అంచనావేయలేని కాలములోనే ఈ విధముగా చెప్పినారు.
హితం మితంచ
భుంజీతా న భుంజీతాzమితం హితం l
హితమిష్టంచ
భుంజీతే ఏష ధర్మః సనాతనఃll
మిష కొరకు వెదుకబోవకు
విషాసాదృశ వంటకముల విదడువుము తినకన్
ఋషి వాక్యములను మరువకు
భీషకును తలపొయ్యకుండ భేషుగ బ్రతుకన్
హితమయిన ఆహారమును గుర్తించుట. ఏవిధముగా గుర్తించవలెనన్నది అనూచానముగా మనపూర్వులు చేయుచున్న వంటలు వంటకాలు శుచి శుభ్రత కలిగియుంటాయి. అసలు వానిలో ఒక అవ్యాజమైన ప్రేమ, మమకారము కలిసి ఉంటాయి. అందుకే హితమైనది ఇష్టాపూర్వకముగా అవసరమునకు మించకుండా ‘ఇక దొరకదేమో’ అన్నట్లు తినకూడదు అంటున్నది మన సనాతన ధర్మము.
ఇక ఈ విషయమును
గమనించండి
భుక్త్వా శతపదం గచ్ఛేత్ క్షణైః స్తేనతు జాయతే
అన్నసంఘాత శైథిల్యం
గ్రీవాజాను కటీ సుఖంl
భుక్తోప విషత స్తుందం శయానస్తుతు పుష్టకాః
ఆయుశ్చంక్రమమాణస్యమృత్యర్ధావతి
ధావతఃll
భోజనము చేసిన
తరువాత ఇంట్లోనే వంద అడుగులు వేస్తే తిన్న ఆహారము వంట పడుతుంది. మెడనడుము
మోకాళ్ళకు ఈ విధముగా చేయుటవల్ల మెడ మోకాళ్ళు నడుమునకు స్వస్థత సమకూరుతుంది. తాను
కదలకుండా కూర్చుంటే పొట్ట పెరుగుతుంది. తింటూనే పండుకొంటే కొవ్వు
పెరుగుతుంది. మెల్లగా అటు ఇటు తిరిగితే
చురుకు గావుంటారు. అన్నముతిన్న తరువాత పరిగెత్తినా, పరిగెత్తినట్లు నడచినా
ఆయుక్షీణమే!
ధీయోయోనః
ప్రచోదయాత్.
అసతోమా సద్గమయ
తమసోమా
జ్యోతిర్గమయ
మృతీవ్రమయ అమృతం
గమయ
ఓం శాంతి శాంతి
శాంతిః
స్వస్తి.