Showing posts with label వాచాలత. Show all posts
Showing posts with label వాచాలత. Show all posts

Monday, 3 February 2014

ఇది ఎదో నా విషయములో జరిగిన ఉదంతమని పొరపడవద్దు. ఇది కేవలము నా కల్పన మాత్రమే. ఉత్తమ పురుష లో వ్రాస్తే బాగుంటుందని వ్రాసినాను. నవ్వు వస్తే ఆపుకోవద్దని మనవి.

వాచాలత

అనగా అనగా ఒక నేను. పెద్దవాడయిన తరువాత ఆ నేనుకు ఒక శిష్యుడు.నా గొప్ప తెలుపుటకు "శిష్యా! 'వాచాలత' అన్న శీర్షిక క్రింద మొన్న జరిగిన ఒక ఉదంతము వ్రాయబోవుచున్నాను"అన్నాను. " "గురువు గారూ ఒక చిన్న సందేహము " లత అంటే ఒక అమ్మాయి పేరని నాకు అర్థమైనది మరి వాచా అంటే ఏమిటి ? బహుశా వాచి + ఆ = వాచా అని అను కొంటాను. అంటే వాచ్ కట్టుకొన్న ఆ లతా ను గూర్చి వ్రాయబోతున్నారన్నమాట" అన్నాడు. అప్పుడు జీవితములోని ఒక వాస్తవము నా కర్థమైనది. అది ఏమిటంటే 'పిచ్చయ్య పుల్లట్ల కొట్టుకు  పిజ్జా లకోసం రారు కదా'అని, వానితోనే సర్దుకు పోతున్నాను ఏదోవిధంగా . నేను వానితో వచస్సు అంటే మత్ రా వాచ్చ్లత అంటే అవసరానికి మించి మాట్లాడుట అంటే అధిక ప్రసంగము అని అదీ కాదంటే నోటి దురద అని అర్థము చెప్పి ఒప్పించే లోపు తల బొప్పి కట్టింది.

మా నాన్న నాకు రామ మోహన్ రావు అని పేరు పెట్టినా రాముడూ అని ఎంతో ప్రేమతో పిలిచేవారు. అమ్మ లేని నన్ను పెంచిన అమ్మమ్మ కూడా ఆ విధంగానే పిలిచేది. నేను ఒంటరిని తుంటరిని కావడంవల్ల మా నాన్న నాకు ఏదో ఒక పని చేయమని చెప్పేవాడు. అప్పుడు రాను రానూ నాకు అర్థమైంది నన్ను రాముDO అని ఎందుకు పిలుస్తాడో అని. కానీ బయటి వారు పనిచేబితే తప్పించుకొనుటకు వీలుగా చివర 'రావు' చేర్చిన ఆయన చాకచక్యాన్ని నేను మరచి పోలేను.

ఇక మోహన శబ్దాన్ని గూర్చి ఒక్క మాట.అయిన వాళ్ళు పిలిస్తే వినటానికి మనసుకు ఎంత సంతోషంగా వుంటుందో అంతే బాధాకరంగా మరియు మొహనకరంగా పనిచేస్తుందని లౌకికము లేని నేను తెలుసుకొన్న సత్యము.మీరు కూడా తెలుసుకొంటారు ఈ నిజము.

నా శిష్యుడు అనవలెనో నా పరమానందయ్య శిష్యుడు అనవలెనో నేను తేల్చుకోలేక యున్నాను గానీ నేనెక్కడికి పోయినా నా వెంబడే 'లైఫ్ బాయ్ ఎక్కడ వుంటే ఆరోగ్యము అక్కడ వున్న'ట్లు నాతోనే ఉంటాడు.ఒకవేళ ఎవరైనా ఏ సభకో సమావేశానికో పిలిస్తే 'కారులో పోదా'మని నేనంటే నా శిష్యుడు ఈ విధంగా అనేవాడు "గురువుగారూ మీరు
ప్రాయములో వున్నవారు కారు ఏటికి నడచెదము రండి బయటికి" అనేవాడు.మొదట్లో వాడు నన్ను 'ప్రాయములో వున్నవాని'గా పోగడుచున్నాడని ఎంతో సంతసించే వాడిని. ఒక రోజు నా భార్య నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పిలిచి "వాడు మిమ్మల్ని గౌరవించుటలేదు సరికదా ఎగతాళి చేస్తున్నాడు అని చెప్పింది. నేను ఆశ్చర్యముతో అదెట్లు అన్నాను. తాను ఇట్లు చెప్పింది"వినండి. గురువుగారూ మీరు ప్ర్రాయములో వున్నవారు కారు, ఏటికి వెళ్ళెదము రండి"అని అంటున్నాడని చెప్పింది. విస్తు పోవటం నా వంతయింది . వాని మనోభావాన మీకు చెప్పుకోలేనుకాని నాకు పూర్తిగా అర్థమైపోయింది.నా మూర్ఖత్వం నా భార్యాశి
ష్యులమధ్య దాక్కొంది.

ఒకసారి నాలో ఏమి కనిపించిందనోనన్ను వక్తగా ఆహ్వానించినారు ఒక మోస్తరు సభకు. 'వక్త' గా పిలచినా 'భోక్త'ను కూడా చేస్తారనే నమ్మకముతో సరే అన్నాను, నా శిష్యుని సలహా మేరకు,ఆపై  నాకు చేదోడు వాదోడుగా ఉంటాడన్న భరవసాతో, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా అగర్ బత్తీ లాగా.కార్యకర్త కనిపించకుంటే నాశిష్యునితో అతనిని పిలువమన్నాను . వాడు వెళ్లి సవినయంగా ' గురువుగారు రమ్మంటున్నా'రని చెప్పినాడు . ఆ మహాశయుడు ఏ లోకములో ఉన్నాడో 'rum' అని వూహించి, కంఠ శుద్ధి కోసమేమోనని భావించి  ఏ బ్రాండన్నాడు. గతుక్కుమన్న శిష్యుడు తన సరళి మార్చి 'మిమ్ము మా గురువుగారు పిలువమన్నారు' అని అర్థమయ్యే భాషలో చెప్పినా చెంతకు చేర్చినాడు. అతనితో ముచ్చటించవలసిన నాలుగు మాటలూ ముచ్చటించినతరువాత "మీరు నాకొరకు ఏర్పాటుచేసిన ఈ 'రజని' నా మనో రంజనియై మదిలో పదిలంగా వుంటుంది " అన్నాను, అతని ఇల్లాలు అతని ప్రక్కనే వున్నది గమనించకుండా . "మీకు సభ్యత సంస్కారము శూన్యమనిపిస్తూంది నాకు , ఈవిడ నాభార్య 'రజని' " అన్నాడు అగ్గిమీద గుగ్గిలంలా సెగలు పొగలు కక్కుతూ. అనర్థాన్ని ఆపే ప్రయత్నంగా నేనతనికి క్షమాపణ చెప్పి , 'రజని'కి చీకటి అన్న అర్థము ఒకటుందని ,నా పాండిత్యాన్ని తెలిపే ప్రయత్నములో పప్పులో/తప్పులో కాలు వేసినానని చెప్పి ఆ గండం నుండి గట్టెక్కినాను. 

శ్రోతలతో సభనిండింది, నాలోని పస పిస పిస అని తెలియక. సభాధ్యక్షుణ్ణి,నన్ను వేదిక మీదికి ఆహ్వానించినారు. కూర్చున్న తరువాత శ్రోతలకు పరిచయ వాక్యాలు చెప్పే అతడు వచ్చే లోపు నేను అధ్యక్షునితో "సభ నిండుకున్నది" అన్నాను. అతడు ప్రపంచములోని అసహ్యమునంతా ముఖముపై అలదుకొని  ఒక బొద్దింకను చూసే చూపులతో "నిండుకున్నది " కాదండి "నిండుగున్నది" అని అనవలె నన్నాడు. నేనన్న దానిలో తప్పేమి  అని అడిగి  నా మూర్ఖతను ఇంకా ప్రదర్శించకముందే "నిండుకున్నది" అంటే 'ఏమీ లేదని'  అర్థము అని విశధ  పరచినాడు, ఇది తెలియదా నీ  ఉడతలు పట్టే వాని ముఖము నీవూనూ అన్నట్లు చూస్తూ. 

ఎందుకో గానీ 'పోడియం' వద్ద మైకులు రెండు ఎర్పాటు  చేసినారు. పరిచయ వాక్యాలు మొదలైనవి ముగిసిన తరువాత పోడియం వద్దకు నన్ను ఆహ్వానించినారు. ఆనందాతిరేకం లో అప్రయత్నంగా కాలికి మైకుల వైర్లు తగిలి పడబోతూ తమాయించుకొని పోడియం వద్దకు చేరినాను. నాకాలు తగలటము వల్లనేమో ఏదో కనెక్ షను  లూజై మైకులు పనిచేయుట మానివేసినాయి. సైగ చేసి నాశిష్యునితోచెప్పినాను.వాడు'మై'అన్నఅక్షరముపలికినదిఏమైందోవాడికి సరిగా వినిపించలేదు కానీ 'కులట అంటున్నారు గురువుగారు' అని వాడు బిగ్గరగా అన్నది చుట్టు ప్రక్కల అందరికీ వినిపించింది. గతములో నాతొ అనుభవము కలిగిన నిర్వాహకుడు ఆగ్రహోదగ్రుడై వీధి భాగవతంలో వీరభద్రునివలె విజృంభించి ఆంగ్లములో "Who is this useless person and what is this nonsence. How can he dare to say కులట" అని కోపం తో ఊగిపోతూ ఇంకా ఎదో అనే లోపే ఆ మాటలు లీలగా వినిపించిన నేను 'మైకు' 'మైకు' అన్నాను. తనతప్పుకు నాలుక కరచుకొని  'మైకులు సరిచేయించినాడు నిర్వాహకుడు. నేను మైకం వదిలించుకొని మైకు చెంతకు చేరి గొంతు సవరించుకొని నా ఊపన్యాసమును ఆరంభించినాను. 

సభకు నమస్కారం 
మా ఇంటి పేరు చెరుకు 
నాకు మాట్లాడడమంటే బెరుకు 
మైకంటే మనసు వెనక్కు ఉరుకు 
ఎందుకంటే నాలో లేదంత సరుకు"
అని అన్నాను . అంతే కరెంటు పోయి కటిక చీకటి ఆవహించింది ఆ ప్రదేశాన్ని. జనరేటరు పని చేయక  జనం ఇంటి దారి పడితే నేను కూడా అదేపని చేసినాను శిష్యుని సహాయంతో. 

నీతి: ఉన్నదెంతో తెలియకుండా లేనిది ఆశించకు 

తత్సత్