Showing posts with label విశ్వనిర్మాణ శిల్పం (వైదిక విశ్వరూప దర్శనం). Show all posts
Showing posts with label విశ్వనిర్మాణ శిల్పం (వైదిక విశ్వరూప దర్శనం). Show all posts

Monday, 14 March 2022

విశ్వనిర్మాణ శిల్పం (వైదిక విశ్వరూప దర్శనం)

విశ్వనిర్మాణ శిల్పం (వైదిక విశ్వరూప దర్శనం)

Structure of the Universe (Vedic) - Viswaroopa

By Dr. (MM) K. Sivananda Murty

https://cherukuramamohanrao.blogspot.com/2014/01/structure-of-universe-vedic-viswaroopa.html

సద్గురు శివానందమూర్తిగారిచేత రచింపబడి 20 డిసెంబరు 2013 న వరంగల్లు లో ఆవిష్కరింపబడిన ఈ పుస్తకానికి సమీక్ష వ్రాద్దామని సంకల్పం. మొదలు పెట్టాక అది ఎంతకష్టమో నాకు అవగాహనకు వస్తూంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ పుస్తకంపేరు Structure of the Universe. ఒక భౌతిక శాస్త్రవేత్త దృష్టిలో విశ్వమంటే ఏమిటో ఊహించడం కష్టంకాదు. ఆ శీర్షికకు వైదిక, విశ్వరూపాలనే పదాలు జోడిస్తే వచ్చినది గురువుగారి పుస్తకం. ఈ రెండు పదాలు పుస్తకం యొక్క పరిధిని, పరిమాణాన్ని బహుముఖాలుగా విస్తరిస్తాయి. విశ్వరూపమనే పదం శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప దర్శనమును గుర్తుకు తెస్తుంది. ఆయన కురుక్షేత్రంలో అర్జునునికి విశ్వరూపం చూపిస్తాడు. "కాలోస్మి" అని చెబుతూ, జరగబోయే లోక క్షయాన్ని చూపిస్తాడు. మొదట యశోదకు తన నోటిలో "పదునాలుగు భువనములు" చూపిస్తాడు. కౌరవ సభలో రాయబార సమయంలో దుర్యోధనాదులకు చూపిస్తాడు. భారత భాగవతాలలో వర్ణించిన ఈ సంఘటనలు వైదిక వాఙ్మయములోని విశ్వ వర్ణనకు ప్రత్యక్ష నిదర్శనాలు. "విశ్వం విష్ణు" అనే విష్ణునామాలకు వివరణ.

ఆధునిక మానవుడు ఆధునిక విజ్ఞానము సృష్టించిన ప్రపంచములో బ్రతుకు తున్నాడు. కుజ గ్రహం మీద వసతియేర్పరచుకోవలనే ప్రయత్నంలో ఉన్నాడు (మార్స్ వన్ ప్రాజెక్ట్) . గ్రహాంతర వాసులను గురించి కథలు కల్పించి, చలన చిత్రాలు నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడు మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకుండా ఒక్క రోజు బ్రతకలేని స్థితికి వచ్చాడు. వేద పురాణాలలో ఈ విశ్వాన్ని, సృష్టిని గురించి ఉన్న విశేషాలు, నేటి భౌతిక శాస్త్ర పరిశోధనలో తెలిసిన విశ్వ విజ్ఞాన విశేషాలు ఒకే చిత్రము (frame, చట్రము) లో చూపిస్తే ఎలాఉంటుంది? - ఇది ఈ పుస్తకంలో శ్రీ గురువుగారి ప్రయత్నం. మొదట తెలుసుకోవలసినది వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిషము వంటి వేదాంగాలు, శాస్త్రాలు, బ్రహ్మాండాది పురాణాలు విశ్వరచన గురించి ఏమిచెప్పాయనేది. ప్రాచీన ఋషులు వైదిక విజ్ఞానాన్ని ఎలా సంపాదించారు? ఆధునికులు భౌతిక, రసాయన జీవ శాస్త్రాల విజ్ఞానాన్ని ఎలా సంపాదిస్తున్నారు అనేది రెండవ ప్రశ్న. ఈ రెండు విధానాలలో భేదములు ఏమిటి? రెండు మార్గాలూ విభిన్నమైనవి. రెండు మార్గాల్లలో లభించే విజ్ఞానముకూడా భిన్నమైనది. ఈ రెండిటినీ ఎలా సమన్వయము చేసుకోవాలి? మనం ఈ రెండు విధాలయిన సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలి?

ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయాలు మన విద్యావిధానంలో అందరూ నేర్చుకుంటూనే ఉన్నారు. దీని వలన వీళ్ళకి వైజ్ఞానిక దృక్పథం అలవడినదా? సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటి? ఈ మాట అమెరికాలో వినబడదు. దీని ప్రచారం నెహ్రూ గారి "డిస్కవరీ ఆఫ్ ఇండియా" నుండి వచ్చినది.

నెహ్రూ ఉవాచ

ఈ ఆధునిక యుగంలో మనకు కావలసినది వైజ్ఞానిక దృక్పథం. ఇదే సైంటిఫిక్ టెంపర్. దీని అర్థం - నూతన విజ్ఞాన సాధనకు, సత్యాన్వేషణకు నిరంతర పరిశ్రమ, ఏ సిద్దాంతాన్నీ పరీక్షకు గురిచేయకుండా అంగీకరించక పోవడం, క్రొత్త ఆధారాలూ, సాక్ష్యాలూ లభిస్తే మన పాత ఊహలను, విశ్వాసాలను సరిదిద్దుకోవడం, ప్రత్యక్షముగా లభించిన యదార్థజ్ఞానాన్ని యదార్థముగా స్వీకరించడం, మేధస్సును, హేతువాదాన్నీ ఉపయోగించడం --- ఇదంతా కేవలం వైజ్ఞానిక విషయాలకే కాదు, జీవితగమనంలో ఎదురయ్యే సమస్యలకు కూడా ఇదే మార్గం.

నెహ్రూగారు చెప్పింది ఒక వైజ్ఞానిక పద్దతి వలెనే కనుపిస్తుంది. కాని అది ఆచరణయోగ్యమూకాదు, ఆమోద యోగ్యమూకాదు, సత్యాన్వేషణకు మార్గమూకాదు, ఆయన అనుకున్నట్లు అది ఆధునికమూకాదు. ఆయన కుమార్తె ఇందిరాగాంధి కాలములో 1976లో జరిగిన 46వ రాజ్యాంగ సవరణ ఈ సైంటిఫిక్ టెంపర్ ను అలవరచుకోవడం భారతపౌరుల విధులలో ఒకటనిచెప్పబడినది. (దీని ఆధారంగా మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాలు అంధ విశ్వాసాల నిర్మూలన చట్టాలు ప్రవేశ పెడుతున్నాయి. ఇదొక విష వలయం. ఈ పుస్తకముతో ప్రత్యక్ష సంబంధములేనిది.)

నెహ్రూ తర్కం ఎందుకు దోషపూరితం? ఆయన తర్కం ప్రకారం వేద పురాణ విషయాలు అంధ విశ్వాసాలు అవుతాయి. ఒక మహర్షికి తపస్సులో లభించిన అనుభవం, విజ్ఞానం సామాన్యునికి ప్రయోగ శాలలో లభించే, నిరూపించే అవకాశంలేదు. అసలు విషయం ఆయనకు తర్క శాస్త్ర పరిజ్ఞానంలేదు, ఆధునిక విజ్ఞాన విధానాల అవగాహనాలేదు. అనేక తర్కాలున్నాయి. గణితంలో ఉపయోగించే తర్కం (deductive logic), భౌతిక శాస్త్రంలో పనికిరాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది భూమిపైనున్న వారికి ప్రత్యక్ష అనుభవం. భూమి తనచుట్టూ తాను తిరుగుట వలన మనకు సూర్యుడు ఉదయించినట్లు కనబడతాడు అనేది ఎక్కువ సత్యం. సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతాడు? ధనూరాశివైపు వెడుతున్నట్లు అగుపిస్తాడు. నిజానికి వియత్పధం (మిల్కీవే గెలాక్సీ) లోని కృష్ణబిలం (బ్లాక్ హోల్)చుట్టూ సర్పిల (స్పైరల్) ఆకారంలో పరిభ్రమిస్తాడు అనేది ఇంకా సత్యం. ఈ పరిణామం చెందే సత్యాలు inductive, abductive reasoning ద్వారా లభిస్తాయి. విజ్ఞాన శాస్త్ర విషయాలన్నీ తాత్కాలిక సత్యాలు. భారతీయ తర్కం ప్రమాణాలమీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు సైన్స్ లో చెప్పేవే. కాని జ్ఞాన సముపార్జనకు ఇతర ప్రమాణాలున్నాయి. నెహ్రూ, గాంధీ ఇలా అన్నారు అంటే వారి వాక్యాలు ప్రమాణాలు కావు అని చెప్పుకోవాలి. అవి తర్క పరిభాషలో హేత్వాభాసలు (fallacies). వేదంలో వాక్యాన్ని శబ్ద ప్రమాణం అంటారు. అది స్వీకరించని వారు నాస్తికులు. వారితో చర్చ వితండ వాదానికి దారితీస్తుంది.

రచయిత మొదటి అధ్యాయం ఆధునిక విశ్వనిర్మాణ శాస్త్రముతోనే ప్రారంభిస్తారు. విజ్ఞాన శాస్త్రముతో వచ్చే విజ్ఞాన లక్షణాలను పేర్కొంటారు. విజ్ఞాన శాస్త్రముతో లభించే విజ్ఞానము ఎప్పుడూ అసంపూర్ణమే. దీని మూలకారణము సైన్స్ పద్ధతిలోనే ఉన్నది. వైదిక సాహిత్యములో చెప్పబడిన విషయాలు అనేక మహర్షుల తపః ఫలముగా లభించినవి. ఆదినుండీ వారికి తెలిసిన మార్గము తపస్సు, ఏకాగ్రత, ధ్యానము మొదలైనవి. వారికి వారు చెప్పిన విషయాలవలన లభించిన స్వార్థ ప్రయోజనాలు లేవు. అనేకుల తపస్సుల వలన తెలిసిన విశేషాలలో ముఖ్య విషయాల విషయంలో ఏకాభిప్రాయమే ఉన్నది. ఊర్ధ్వలోకాలు మొదలైనవి వారు తమ తపస్సులో దర్శించారు. దీనినే శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు యౌగిక ప్రత్యక్షమన్నారు. వేద పురాణాలలో చెప్పిన విషయాలు పరిశీలించి ప్రయోగాల ద్వారా వానిని నిరూపించడం విజ్ఞాన శాస్త్రజ్ఞులకు ప్రస్తుతం అసాధ్యం. కాని విజ్ఞానశాస్త్రము యొక్క పరిమితులను గ్రహించడం వారికి సాధ్యమే.

నేను చెప్పిన విషయాలపై ఈ పుస్తకం అలోచింపచేస్తుంది. "విజ్ఞాన శాస్త్రం మనుష్యుల సమస్యలకు సమాధానాలు ఇస్తుంది" అనే ఆధునిక భావములోని సత్యాసత్యాలను గుర్తింపచేస్తుంది.

By vvs Sarma