Showing posts with label వ్యాస ఘట్టము. Show all posts
Showing posts with label వ్యాస ఘట్టము. Show all posts

Friday, 29 March 2019

వ్యాస భారతమునందు కవితా చమత్కారము - వ్యాస ఘట్టము


వ్యాస భారతమునందు కవితా చమత్కారము 
ఒక వ్యాస ఘట్టము
https://cherukuramamohanrao.blogspot.com/2019/03/blog-post_29.html
నేను 1965 లో Degree చదివే రోజులలో మాకు తెలుగులో 'ఆంధ్ర సారస్వతము-హాస్యము' అన్న శీర్షిక కలిగిన ఒక పాఠ్యాంశము ఉండేది. నాకు దానిని వ్రాసిన విమర్శకుని పేరు గుర్తులేదు. అందలి ప్రతి విషయము గుర్తు లేకున్నా ఒకటి మాత్రము మదిలో కదలిక లేకుండా నిలచిపోయినది. అది ఏమిటంటే హాస్యము పాశ్చాత్యులు వివిధ విధములుగా పండించినంత మన దేశీయ సాహిత్య పండితులు, కవులు పండించలేదు, అసలు వారి పోకడలనే అనుకరించ\అనుసరించ లేదు అన్నది. ఇందులోని నిజానిజములను ఒకసారి పరిశీలించుదాము. భావమునకు అనుభవముతో సంబంధము ఉంటుంది. అనుభవమును అభివ్యక్తీకరణ చేసేది భాష. భాషా భావములది ఒక అవినాభావ సంబంధము. అసలు చమత్కారము కూడా ఆనందదాయకమే! ఆ చమత్కారమును పండించుటకు ఎక్కడ లేని పాండిత్యమవసరము. అంతటి ప్రజ్ఞా పాటవములు కలిగిన విష్ణ్వంశ కలిగిన మహానుభావుడు కాబట్టియే ఆయన ఈ కవితా చమత్కారమును ప్రదర్శించాగాలిగినాడు.
నాటి మన దేశ భాష సంస్కృతము. అందువల్ల మన సాహిత్య సంపద ఎక్కువగా సంస్కృతమునందే లభ్యము. కావున భావము ఆ భాషకు అనుగుణముగానే ఉంటుంది. అదే తెలుగు, తమిళము అయితే భావము కూడా తదనుగుణముగనే ఉంటుంది. ‘Have’ అన్న ఆంగ్లపదమునకు తెలుగులో ‘కలిగియుండుట’ అన్న అర్థమును అన్వయించుకొన వచ్చును. అప్పుడు సాధారణముగా మనము వాడే  ‘Had your lunch?’ అన్న వాక్యమును తెలుగునకు తర్జుమా చేస్తే ‘’మధ్యాహ్న భోజనము కలిగినారా?” అని చెప్పుకోవలసి వస్తుంది. అసలు ప్రశ్న అడుగుతూ ఉండేదే మధ్యాహ్నము కాబట్టి మన భాషలో ‘lunch’ ‘dinner’ అన్న తేడాలు ఉండవు. ‘భోంచేసినారా?’ అని అడుగుతాము. అదే తమిళములో ‘సాపాటాచ్చియా?’ అని అడుగుతారు. అంటే ‘భోజనము అయినదా?’ అని తెలుగులో అర్థము చేసుకోవలసి వస్తుంది. అంటే ‘వంట అయినదా!’ అన్నట్లు కూడా ధ్వనించుతుంది. కావున భాషానుగుణముగా భావమును గ్రహించవలసి వస్తుంది. హాస్యము యొక్క విషయములో కూడా ఇదే అన్వర్తించుతుంది.
హాస్యములో కూడా ఎన్నో రఖములున్నాయి. అసభ్యత, అశ్లీలత, అసహ్యత లేని హాస్యమే చుట్టూవున్న వాతావరణమును ఆనందమయము  చేస్తుంది. అటువంటి ఆనందమయమైన ఒక శ్లోకమును వ్యాస భారతమునుండి మీ ముందుంచుచున్నాను.  
శ్లో|| లేఖకో  భారత స్యాస్య భవత్వం గణనాయక l
మయైవ ప్రోచ్య మానస్య మనసా కల్పితస్య చ  ll
 గణేశా నీవు ఈ భారతానికి లేఖకుడిగా వుండుము. నేను నా మనస్సు చేత ఊహించి నీకు చెబుతాను అని వ్యాసమహర్షి వినాయకుని అడిగినట్లు మనకు భారతము ద్వారా తెలియవస్తూ ఉన్నది. ఇది 1,18, 000 శ్లోకములు కలిగిన కావ్యముగా పండితులు చెబుతూ వుంటారు. ధారాపాతముగా వ్యాసులవారి నాటినుండీ వచ్చే శ్లోకములనన్నిటినీ అంతే వేగముతో వ్రాసి ఇంకా చెప్పమని వినాయకుడు తొందరచేసేవాడట వ్యాసులవారిని.
‘ఓహో! నీవిట్లున్నావా, వుండు నీకు తగినట్లు చేస్తాన’ని మదిలో తలంచినాడు వ్యాస మహర్షి. ఆయన విఘ్నేశ్వరునితో అన్నాడట ‘అయితే నేను చెప్పే శ్లోకమునర్థము చేసుకొని వ్రాస్తూ పోయేది’ అని అన్నాడట. వినాయకుడు సరేనన్నాడు. అప్పటినుండి తనకు ఆలోచించుటకు కాస్త వ్యవధి కావలయునని అనిపించినపుడల్లా అలంకారములలో ఒకటగు,  విరోదాభాసములో ఒక శ్లోకమును చెప్పేవాడట. అంటే పైకి మాత్రము ఆశ్లోకములో వ్యతిరేకార్థము ధ్వనించేది. తరచి చూస్తే సరియగు అర్థము స్ఫురించేది. ఈ విధములగు శ్లోకములు దాదాపు 200 దాకా భారతములో ఉన్నాయని పండితులు చెబుతారు. వీనిని వ్యాస ఘట్టములు అంటారు.
అటువంటి ఒక శ్లోకమును ఈ క్రింద మీకై పొందుపరచినాను.
దివా న పూజయేర్లింగం రాత్రౌచాపి న పూజయేత్      l
నిత్యంచ పూజయేర్లింగం  దివారాత్రంచ పూజయేత్ ll
శ్లోకము చదువుతూనే మనము గ్రహించేది ఏమిటంటే పగలు శివలింగమును పూజచేయ కూడదు, రాత్రి కూడా పూజచేయ కూడదు. ప్రతి రోజూ శివలింగమును పగలూరాత్రీ పూజ చేయవలసిందే! పగలూ రాత్రి పూజ చేయకూడదని మొదటి పాదములో చెప్పి రెండవ పాదములో పగలూ రాత్రి రోజంతా పూజ చేయవలెనని చెప్పుటలో అర్థమేమిటి అనిపిస్తుంది.
కానీ నిలుపూ నిదానముగా, ఒలుపూ వైనముగా చూస్తే అర్థమౌతుంది, ‘దివా’ అన్న పదమునకు మొగిలి పూవు అన్న ఒక అర్థము ఉన్నదని. అంటే మొగిలి పూవుతో పూజ చేయకూడదు అని అర్థము. శివునికి మొగిలి పూవుతో పూజ లేదుకదా!
బ్రహ్మ విష్ణువులు లింగ స్వరూపుడైన శివుని ఆద్యంతములు చూడబోయి చేతకాక వెనుకకు మరలుతారు. విష్ణువు నిజము చెప్పి, శివునితో సమానముగా పూజలు పొందు విధముగా వరము పొందుతాడు. అదే బ్రహ్మ శివుని శీర్షభాగమును పూజించి వెనుదిరిగిన మొగిలి పూవును, బ్రహ్మ తాను కూడా చూసినట్లు అబద్ధము చెప్పుటకు ఒప్పించి, శివుని ముందు చెప్పించుతాడు. శివుడు కోపించి మొగిలికి పూజార్హత లేకుండా చేస్తాడు. అట్లే కామ ధేనువు కూడా తలతో అవునని తోకతో కాదని, ఆడించుతూ చెబుతుంది. అందుకే ధేనువు వంశానికి తలవైపు పూజ లేకుండా తోకవైపు పూజకు అర్హత కలిగించుతాడు పరమ శివుడు.
కాబట్టి దివ అంటే మొగిలిచేత పూజించాకూడదు. మరి ‘రాత్రౌ’ అని కూడా అన్నాడు కదా!
రాత్రౌ అన్నమాటకు బదులుగా ‘నిశ’ అని కూడా ప్రయోగించుతారు. ‘నిశ’ అంటే ఒక అర్థము ‘పసుపు’ అని. శివుని పసుపుతో కూడా పూజ చేయ కూడదు. కాబట్టి శ్లోకమునకు అసలయిన అర్థము ఏమిటంటే మొగలి పూవులు పసుపు తో కాకుండా పగలూ రాత్రి శివుని పూజింపవలెను అని అర్థము. ఎంత సునిశితముగా హాస్యము అందిపబడినదో వ్యాస మహర్షితో చూడండి.
ఆ మహనీయునికి నమ్స్కరిస్తూ....
స్వస్తి.