Showing posts with label హృదయమును గూర్చి మన వేదము చెప్పిన మాట. Show all posts
Showing posts with label హృదయమును గూర్చి మన వేదము చెప్పిన మాట. Show all posts

Monday, 21 August 2017

హృదయము-మంత్రపుష్పము


హృదయము-మంత్రపుష్పము
ఆంగ్ల శబ్ద కోశములో HEART అన్న మాటకు అర్థమయితే ఇచ్చినారు కానీ దాని పుట్టుకను గూర్చి నేను పరిశీలించినంత మేరకు కానరాలేదు. నా ఉద్దేశ్యములో 'హృత్' శబ్దము నుండి HEART పుట్టివుంటుంది. మనలనుపాలించిన వారు కదా మన భాషను తమ భాషకు మాతగా ఒప్పుకొనుటకు ఆభిజాత్యము అడ్డము వచ్చి  యుండవచ్చు.
సంస్కృతములో మాత్రము నిరుక్తమున ఎంత హృద్యముగా 'హృదయము' అన్న మాటకు వ్యుత్పత్తి చెప్పినారో అది తెలిపిన వారి మేధస్సును వర్ణింప నాతరము కాదు. వారు హిమవన్నగము వంటివారయితే నావంటి వారందు పిపీలిక సమానులు (పిపీలికము=చీమ). ఈ శ్లోకమును గమనించండి:
తదేతత్ త్ర్వక్షరంహృదయమితి, హృత్ ఏకం మహాక్షరం ద ఇత్యేకాక్షరం
యమిత్యేకం యివం హరతేర్ దదాతేరాయతేర్ హృదయ శబ్ద నిరుక్తః
'హృ' అంటే హరతి = గ్రహించునది
'' అంటే దదాతి = తిరిగి ఇచ్చునది
'' అంటే అయతి= ప్రవహింప జేయునది
మొత్తము గుండెయొక్క కార్యక్రమమంతా మూడు అక్షరములు కల ఒక పదములో వచ్చివేసినది. దీనిని 'సింధు' అనటము కూడా కద్దు. నదులు సంద్రమునకలిసి తిరిగి వర్షముతో నదులుగామారి సంద్రమున కలుస్తున్నాయో రక్తము కూడా గుండెతో అదే సంబంధమును నిరంతరమూ కలిగియున్నది కదా!
హృదయము యొక్క అర్థమును గూర్చి తెలుసుకొన్నాము. ఇపుడు ఆ హృదయమును గూర్చి వేదములోని మంత్రపుష్పమునందు ఏమి తెలిపినారో చూద్దాము.
మంత్రపుష్పమును విధిగా పూజల్లోనూ, వ్రతములలోనూ, దేవాలయములలోనూ పూజావసాన సమయమును చెబుతూ వుంటారు. అందువల్ల ఆ మంత్రమును మన హృదయమునకు సంబంధించిన మేరకు మీ ముందుంచుతూ నాకు చేతనయినంత వరకు  వివరించుతాను.
పద్మ కోశ ప్రతీకాశగ్౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా
సంతాపయతిస్వం దేహమపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ ||
మంత్రార్థమును తెలుపుటకు మునుపు మంత్రం పుష్పము అన్న పేరును గూర్చి తెలుసుకొందాము. పుష్పములు స్నిగ్ధత సౌకుమార్యము కలిగినవి. వానిలో శ్రేష్ఠతమమయినది తామర. అందుకే ఎర్ర తామర లక్ష్మీ నివాసమయితే తెల్లతామర వాణీ విలాసము. మన శరీరములో కూడా ఒక ఎర్రతామర మొగ్గ వుంది. మంత్రపుష్పము దాని గూర్చియే తెలుపుతుంది కాబట్టి అది మంత్రపుష్పము అయినదని నా ఊహ.
ఇపుడు ఈ మంత్రార్థమును నా శక్తి మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. నావేవయినా తప్పులు వుంటే విజ్ఞులు సవరించగలరు. హృదయము తలక్రిందులుగా వున్న తామర మొగ్గవలె భాసిల్లుచున్నది. నిష్ఠి అంటే తెలుగులో ముచ్చెన గుంత అంటారు. ఈ గుంత అటు కంఠానికీ ఇటు ఎదకు మధ్యన వుంటుంది. దానినుండి క్రిందికి వితశ్శాంతిఅంటే జానెడు దూరము, మరియు నాభ్యం ఉపరి అంటే బొడ్డునుండి పైకి జానెడు దూరములో ఈ మొగ్గ వున్నది. మరి కొలత ఏవిధముగా చేయాలి అన్నది తరువాతి సందేహము. కుడి ప్రక్కకా ఎడమ ప్రక్కకా లేక నిటారుగానా అన్న సందేహము వస్తుంది. నిటారుగా రెండు చేతులను ఉపయోగించి అటు నాభినుండి ఇటు నిష్ఠి నుండి లంబముగా అంటే నిటారుగా ఉంచితే రెండూ కలుస్తాయి. అందువల్ల అక్కడ అది లేదు అని తెలుస్తుంది. ఇక కుడి ఎడమ. గుండె 99 శాతము మానవులకు ఎడమవైపునే వుంటుంది కానీ 1 శాతము కుడివైపు కలిగినవారు కూడా వుంటారు. దీనిని Dextrocardia అంటారు ఆంగ్లములో. ఇది పారంపర్యముగా వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది. ఆంగ్లములో దీనిని congenital అంటారు. మరి పారంపర్యముగా వస్తూవుంది అన్నా కూడా దానికీ ఒక ఆది అన్నది ఉంటుందికదా! కాబట్టి మనము ‘కుడిఎడమయినా పొరబాటు లేదు’ అనుకోవలసి వస్తుంది. కాబట్టి మన రెండు చేతుల జానలను అటుగానీ ఇటు గానీ బొటన వ్రేళ్ళను ఆయా కేంద్రములనుడి కదిలించక చిటికెన వ్రేళ్ళను ఎడమకు (కుడి కూడా తీసుకొనవచ్చును అని చెప్పుకొన్నాము) కదిలించుతూ పోతే ఎక్కడ తాకబోతాయో అది హృదయస్థానము. కత్తులు కటార్లు ఈటెలు బాకులు వాడకుండా హృదయస్థానమును లక్షల సంవత్సరముల క్రితమే నిర్ణయించిన మన పూర్వీకుల ప్రతిభ, ప్రశస్తిని ఏమని ఎంతని పొగడ గలము. జ్వాల+ మాల+ ఆకులము అంటే నిప్పురవల మాల ను బోలుతూ చెదరుతూ అంటే చుట్టుప్రక్కల వ్యాపించుతూ వుంది.   విశ్వస్య ఆయతనం మహత్ అంటే ఈ విశ్వము యొక్క పుట్టుకకు మూలము అదియే! ఈ విషయమునే NASA(USA) కూడా ద్రువపరచడము జరిగింది. ఇంకా వారు భగవంతుడు ఇక్కడ ఉంటాడా అని పరిశోధనలు చేస్తున్నారట. ఒక్క విషయము ఆలోచించుదాము. మనిషిలో వేడి లుప్తమయితే మృతుడే! మరి వేడి ఉన్నంతవరకు మనిషి బ్రతి ఉన్నాడు. మరి ఆవేడికి కూడా మూలము ఉండవలెను కదా! ఆ మూలమే దేవుడు. ఆ మూలము ఎక్కడుంది ఆ మూలములో ఆయన ఎక్కడున్నాడు అన్నది చూద్దాము. సంతతగ్ం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం అంటే ఆ హృదయము వద్ద ఎల్లపుడు శిలాభిః (‘ర’’ల’యోరభేదః) అంటే శిరలు (శిలాభిః) లంబముగా ఆ పద్మ కోశమునకు ఆనుకొని వ్రేలాడుతున్నాయి. ఆ కోశమునకు అంతమందు సుషిరగ్ం  సూక్ష్మం అంటే మిక్కిలి చిన్నదియైన ఒక రంధ్రము వుంది. తస్మిన్, అందులో సర్వం ప్రతిష్ఠితం అంతా అందులోనే ప్రతిష్ఠింపబడి వుంది. అక్కడ అంటే ఆ రంధ్రములో మహత్తరమగు అగ్ని వుంది. దానివలననే ఈ ప్రపంచమంతా వెలుగుతూ వుంది.

    ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి ఉంటుంది. మరి ప్రకృతిలోని మానవేతర స్థావర జంగమములకు లోపల ఈ వెలుగు లేదా! అంటే వానికి మానవ భాషలో తెలిపినా అర్థము చేసుకోనలేవు. అందుకే వేదము మానవులకు చెప్పబడింది. మళ్ళీ విషయమునకు వస్తే అది విశ్వార్చిర్ విశ్వతోముఖః అంటే దానివలననే ఈ విశ్వము అంతా వెలుగుచున్నది ఎందుకంటే విశ్వతోముఖః అది ప్రపంచమంతా  వ్యాపించి యున్నది. విశ్వము వెలుగుతూ వుంటే మరి సూర్య చంద్రాగ్నులు అవసరము లేదు కదా! అంటే సూర్యుడు అగ్నిగోళం, చంద్రుడు, తనపైబడు సూర్య కిరానా పరావర్తనముచే మాత్రమే వెలుగుచున్నాడు. ఇక అగ్నిది ప్రకృతితో కాకుండా మానవునికి సంబంధించిన వరకు అది పరిమిత ప్రయోజకత్వమునే ప్రసాదించుతుంది. కాబట్టి ఆ మూడు లేకపోతే ప్రాణికోటి లేదు అని తలువ వచ్చును. కావున అవి వుంది తీరవలసిందే! మరి ఈ వెలుగు మాటేమిటి. మనము ప్రకృతిలో గమనించితే పచ్చటి చెట్లలో ఒక కాంతిని చూస్తాము. అది వాడిపోయిన చెట్లలో అగుపించదు. వయసులో వున్న యువతీయువకులలో వుండే కళ ముదుసలివారిలో చూడలేము. అంటే ఏ వెలుగయితే మనలో ఉన్నదని చెప్పుకొన్నామో అది మెల్లమెల్లగా అధోముఖము పడుతూ ఉందన్నమాట. అసలు రంగులతో నిమిత్తము లేకుండా దాదాపు సమానమగు వయసులో ఉన్నవారి మధ్యన కూడా వర్చస్సులో కాంతో భేదములను చూడవచ్చు. లోపలి వేలుగునుబట్టే బయట నిగారింపు కనబడుతూవుందన్నమాట. నేటికి కూడా తపోసాధకులగు గురువుల ముఖములు ఎంతో వెలుగుతో, ప్రసన్నతతో, ఇంకా చూడవలెననిపించే రీతిగా వుంటాయి. దానికి వారి సమగ్ర సాధనయే కారణము.
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః అంటే ఏ వెలుగును గురించియయితే ఇంతవరకూ మాట్లాడుకొన్నామో దాని మధ్యన ఒక అగ్ని శిఖ ఊర్ధ్వ ముఖముతో భాసిల్లుచూ వున్నది. అందులో అణువును బోలి ఊర్ధమునకు చూసే ఒక అంతశ్శిఖను కలిగియున్నది. నీలతోయదము అంటే వర్షము కురియుటకు సిద్దముగానున్న నీలమేఘము. దాని మధ్యలో మెరిసే మెరుపువలె ప్రస్ఫుటమగుచూ ఇక ఛేదించలేని అణు రూపమై ప్రభావించుతూ వున్నది. అదే మంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్
ఈ మెరుపులో, నీవార ధాన్యము యొక్క ముల్లు, (నేను చూడలేదు కానీ వడ్లగింజ కున్న ముల్లుతో పోల్చుకొన వచ్చును.) అంతటి చిన్న ముల్లు లాంటి వెలుగులో పరమ పరమాణు రూపములో ఊర్ధ్వముఖముగా ప్రజ్వరిల్లే జ్యోతి మధ్యలో పరమాత్మ నివసితూవున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రదులంతానేకాదు పరమస్వరాట్ అయిన సకలచరాచర సృష్టికి మూలకారకుడు కూడా వున్నాడు.
    ఇక్కడ Science పరముగా ఒక మాట చెప్పుకోనవలస్డినది వున్నది. మన గుండెలో sinoatrial node అనే ఒక స్థానం ఉంది, దానినుండి ఒక విద్యుత్తరంగము లాంటిది వెలువడి గుండెను పని చేయిస్తూ వుంది. దీనికి కొంత దూరంలో atrioventricular node  ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే గుండె పని చేస్తుంది. ఈ sinoatrial node  నుండి  విడుదలయ్యే విద్యుత్తు ఏవిధముగా పుడుతుంది అన్నది మన Scientists కు ఇంకా తెలిసిరాలేదు. , దీనినే pacemaker అని చెబుతున్నారు మన Scientists. గుండెను పని చేయించేది ఇదే. మన వేదములోని మంత్రపుష్పము దీని లోని ఆ అత్యంత పరమాణు రూపమునే పరమాత్మ అంటూ వుంది.
చివరిగా, చదివిన వారికి వచ్చే చిన్నదయినా అతి పెద్ద సందేహమును నాకు తెలిసిన రీతిలో తీర్చి నా వ్యాసమునకు భారత వాక్యము పలుకుతాను. ఆ వెలుగు మనకు కనబడుట లేదే? కనబడదా? ఎందుకు కనబడదు. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అన్న వేటూరి వారి మాట మీకు తెలిసినదే కదా! ఆ వెలుగును చూడగలిగిన వారే ఋషులయినారు. మరి మనమో, లోపల తళుక్కుమన్నపుడల్లా సంసారమో, పిల్లలో, అందమయిన అమ్మయిలనో/అబ్బాయిలనో సినిమాలనో, షికార్లనో చూసుకొంటూ ఇంకా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము.
ఇకనైనస మేలుకొని, మెలుకువలో కళ్ళు మూసుకొని అంతర్ముఖులమై అనుదినమూ ధ్యానించితే పరమాత్ముని మనలోనే సందర్శించగలము. దానికి అంతః శుద్ధి, బాహ్యశుద్ధి, త్రికరణ శుద్ధి తోడయితే అసలు మనమే పరమాత్మ స్వరూపులమని తెలుసుకొనగలుగుతాము.

స్వస్తి.