Sunday, 10 July 2016

నాచన సోమన (నాచన సోమనాథుడు)


నాచన సోమన (నాచన సోమనాథుడు)
https://cherukuramamohanrao.blogspot.com/2016/07/1.html

నాచన సోమనాథకవి నాగము శీతనగమ్ము, భావనల్ 
యోచన సేయనాతడు పయోధి, కవిత్వ పటుత్వ సంపదన్
ఖేచర చక్రవర్తి, పద ఖేలన లాలన పద్యవర్తియున్
వాచక వాగ్మి తిక్కనకు వారసు డాతడు వాస్తవమ్ముగన్
నేను వ్రాసిన పైపద్యము అక్షర సత్యము. ఆవిషయము మీరు ఈ వ్యాసమును ఆసాంతమూ చదువుతూపోతే మీకే అవగతమౌతుంది.
1. నాచన సోమనాధుని కాలము, ఆయన ఎక్కడివాడు అన్న విషయమును గూర్చి 

కాస్త చెబుతారా?

నాచన సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకులలో  భేదాభిప్రాయములు  ఉండినవి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనా వేసినారు అంటే 14వ శతాబ్దమన్న మాట.
నేను గ్రహించిన మేరకు ఈయన బుక్కరాయల ఆస్థాన విద్వాంసుడు.
విద్యారణ్యుల సహపాఠి. కాంచీపుర విద్యార్థి. బుక్కరాయలు ఆయనకు, కడప మండలమునకు చెందిన  పెంచికలదిన్నె లేక బుక్క పట్నం అన్న అగ్రహారమును బహూకరించినాడు. ఆతరువాత ప్రౌఢదేవరాయలు   ఆయనకు తరిమెళ్ళ దిన్నె అన్న అగ్రహారమును బహూకరించినట్లు తెలియవచ్చుచున్నది. రెండూ కడపలోనివే! అందుచేత ఆయన కడప జిల్లా వాసిగా తెలియవచ్చుచున్నది. ఆయనకు తిక్కనపై గల అబిమానము అపారము. అందుకే ప్రతి ఆశ్వాసము చివరిలో
'ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి  ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్ సకల భాషాభూషణ  సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ నాచన సోమనాథ ప్రణీతంబైన యుత్తరహరివంశంబునందు' ... అని వ్రాస్తారు.  
తెలుగులో భారత, భాగవతాలకు ఉన్నంత ప్రజాదరణ గల మరో గ్రంధం హరివంశం. ఇందులో కేవలం కృష్ణునికీ, అతని వంశీకులకూ సంబంధించిన కొన్ని కథలు వివరించబడినాయి. తెలుగులో హరివంశ కావ్యాన్ని రచించిన వారు ఇద్దరు. ఒక్కరు ఎఱ్ఱాప్రగ్గడ. రెండవ కవి నాచన సోమన. ఎఱ్ఱన హరివంశమును సంపూర్ణముగా వ్రాస్తే , సోమన ఉత్తర భాగం మాత్రమే వ్రాసినాడు. అందుకే దానిని  ఉత్తర హరివంశం అని ఎక్కువగా అంటారు.
లక్షణగ్రంథాల్లో ఇచ్చిన ఒకటి రెండు ఉదాహరణల్ని బట్టి నాచన సోమన్న “వసంతవిలాసము” అనే మరోకావ్యం రచించినట్లు తెలియవచ్చినా అది ఇంతవరకూ  బయటపడలేదు.ఆయన ఘనతను దెల్పుటకు  ఈ కావ్యమొకటి చాలదా!
ఎకోపి గుణవాన్ పుత్రః నిర్గుణేన శతైరపి
ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనం
అన్నారు పెద్దలు. ఆ కావ్యమును మర్రి విత్తనముతో పోల్చ వచ్చును. అంటే రాశిలో చిన్నదిగా కనిపించినా వాసిలో మాత్రమది అసమానము.
2. అంత ప్రాధాన్యత ఆ కావ్యమునకు ఎట్లు వచ్చినది?
తెలుగు సాహిత్యంలో నాచన సోమన స్థానము ప్రత్యేకమైనది. ఈయన కవిత్రయము లోని నన్నయ తిక్కన తరువాతి వాడు. బహుశ తిక్కన వార్ధక్యములో ఈయన యువకునిగా ఉండియుండవచ్చును. ఎర్రన ఈయన తదుపరి వచ్చినట్లుగా తెలియవచ్చుచున్నది. 
 శబ్ద రత్నాకర కర్త   బహుజనవల్లి సీతారామాచార్యులు గారు ఇతన్నీ, ఇతని గ్రంధాన్నీ పరిచయం చేస్తూ అది మిక్కిలి ప్రౌఢము గానూ, భారతము కంటె ఎల్ల విధముల విశేషించినది గానూ కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందురు. అట్లనుటకు సందేహింప బని లేదు అని అంటాడు. పరవస్తు చిన్నయ సూరి ఐతే ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున (నొసలు) యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అన్నాడు. యుద్ధ వర్ణనలోనూ, రాయభారాలు నిర్వహించిన పట్టుల లోనూ, నాచన సోమన తిక్కన ప్రజ్ఞను పుడికి పుచ్చుకున్నాడని కొందరు పెద్దలు భావించినారు.
3. ఆయనకు బిరుదులు ఏమయినా ఉన్నాయా?
ప్రాచీన తెలుగు కవుల్లో నాచన సోమన ఒక విలక్షుణుడైన కవి. తెలుగు సాహిత్యంలో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. ఆయన రచించిన ఉత్తర హరివంశం ఒక విశిష్టమైన కావ్యం. ఆశ్వాసాంతాల్లో సోమన తనను గురించి నాలుగు విశేషణాల్లో చెప్పుకున్నాడు. సకల భాషా భూషణ, సాహిత్య రస పోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాధ అనేవి ఆ నాలుగు విశేషణాలు. హరివంశమనేది భారతానికి పర భాగం కాబట్టి, తిక్కన సోమయాజి పూర్తి గావించిన భారతానికి తాను రాసిన ఉత్తర హరివంశం కొనసాగింపుగా సంభావింపబడాలని భావించిఉంటాడు. అందుకని ఆశ్వాసాంతాల్లో తిక్కనను పేర్కొనడమే గాక, ఆయన సృష్టించి అంకితమిచ్చిన హరిహరనాధునికే తన హరివంశాన్నీ అంకితమిచ్చి తద్వారా తాను తిక్కన సోమయాజికి విధేయుడనని చెప్పుకొంటూనే అంతటి వాడినని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నాడు.
ఉత్తర హరివంశంలో సోమన ప్రయోగించిన సామెతలూ, జన బాహుళ్యంలో అంతగా ప్రచారంలో లేని పలుకుబడులూ, జాతీయాలు ఆయన నవీన ప్రియత్వాన్ని పట్టిచూపుతాయి. అంతటి పలుకుబడులను జాతీయములను తెలుగు నేలకు పరిచయము చేసి తన కవిత నవీన గుణ సనాధకత్వమును ఋజువు చేసుకున్నాడు.
మిగిలినది తరువాత.......

నాచన సోమన (నాచన సోమనాథుడు)-2

1. నాచన సోమనాధుని కాలము, ఆయన ఎక్కడివాడు అన్న విషయమును గూర్చి 

 కాస్త చెబుతారా?

 నాచన సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకులలో  భేదాభిప్రాయములు  ఉండినవి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనా వేసినారు అంటే 14వ శతాబ్దమన్న మాట.

నేను గ్రహించిన మేరకు ఈయన బుక్కరాయల ఆస్థాన విద్వాంసుడు.

విద్యారణ్యుల సహపాఠి. కాంచీపుర విద్యార్థి. బుక్కరాయలు ఆయనకుకడప మండలమునకు చెందిన  పెంచికలదిన్నె లేక బుక్క పట్నం అన్న అగ్రహారమును బహూకరించినాడు. ఆతరువాత ప్రౌఢదేవరాయలు   ఆయనకు తరిమెళ్ళ దిన్నె అన్న అగ్రహారమును బహూకరించినట్లు తెలియవచ్చుచున్నది. రెండూ కడపలోనివే! అందుచేత ఆయన కడప జిల్లా వాసిగా తెలియవచ్చుచున్నది. ఆయనకు తిక్కనపై గల అబిమానము అపారము. అందుకే ప్రతి ఆశ్వాసము చివరిలో

'ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి  ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్ సకల భాషాభూషణ  సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ నాచన సోమనాథ ప్రణీతంబైన యుత్తరహరివంశంబునందు' ... అని వ్రాస్తారు.  

తెలుగులో భారత, భాగవతాలకు ఉన్నంత ప్రజాదరణ గల మరో గ్రంధం హరివంశం. ఇందులో కేవలం కృష్ణునికీ, అతని వంశీకులకూ సంబంధించిన కొన్ని కథలు వివరించబడినాయి. తెలుగులో హరివంశ కావ్యాన్ని రచించిన వారు ఇద్దరు. ఒక్కరు ఎఱ్ఱాప్రగ్గడ. రెండవ కవి నాచన సోమన. ఎఱ్ఱన హరివంశమును సంపూర్ణముగా వ్రాస్తే , సోమన ఉత్తర భాగం మాత్రమే వ్రాసినాడు. అందుకే దానిని  ఉత్తర హరివంశం అని ఎక్కువగా అంటారు.

లక్షణగ్రంథాల్లో ఇచ్చిన ఒకటి రెండు ఉదాహరణల్ని బట్టి నాచన సోమన్న “వసంతవిలాసము” అనే మరోకావ్యం రచించినట్లు తెలియవచ్చినా అది ఇంతవరకూ  బయటపడలేదు.ఆయన ఘనతను దెల్పుటకు  ఈ కావ్యమొకటి చాలదా!

ఎకోపి గుణవాన్ పుత్రః నిర్గుణేన శతైరపి

ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనం

అన్నారు పెద్దలు. ఆ కావ్యమును మర్రి విత్తనముతో పోల్చ వచ్చును. అంటే రాశిలో చిన్నదిగా కనిపించినా వాసిలో మాత్రమది అసమానము.

2. అంత ప్రాధాన్యత ఆ కావ్యమునకు ఎట్లు వచ్చినది?

తెలుగు సాహిత్యంలో నాచన సోమన స్థానము ప్రత్యేకమైనది. ఈయన కవిత్రయము లోని నన్నయ తిక్కన తరువాతి వాడు. బహుశ తిక్కన వార్ధక్యములో ఈయన యువకునిగా ఉండియుండవచ్చును. ఎర్రన ఈయన తదుపరి వచ్చినట్లుగా తెలియవచ్చుచున్నది. 

 శబ్ద రత్నాకర కర్త   బహుజనవల్లి సీతారామాచార్యులు గారు ఇతన్నీ, ఇతని గ్రంధాన్నీ పరిచయం చేస్తూ అది మిక్కిలి ప్రౌఢము గానూ, భారతము కంటె ఎల్ల విధముల విశేషించినది గానూ కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందురు. అట్లనుటకు సందేహింప బని లేదు అని అంటాడు. పరవస్తు చిన్నయ సూరి ఐతే ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున (నొసలు) యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అన్నాడు. యుద్ధ వర్ణనలోనూ, రాయభారాలు నిర్వహించిన పట్టుల లోనూ, నాచన సోమన తిక్కన ప్రజ్ఞను పుడికి పుచ్చుకున్నాడని కొందరు పెద్దలు భావించినారు.

3. ఆయనకు బిరుదులు ఏమయినా ఉన్నాయా?

ప్రాచీన తెలుగు కవుల్లో నాచన సోమన ఒక విలక్షుణుడైన కవి. తెలుగు సాహిత్యంలో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. ఆయన రచించిన ఉత్తర హరివంశం ఒక విశిష్టమైన కావ్యం. ఆశ్వాసాంతాల్లో సోమన తనను గురించి నాలుగు విశేషణాల్లో చెప్పుకున్నాడు. సకల భాషా భూషణ, సాహిత్య రస పోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాధ అనేవి ఆ నాలుగు విశేషణాలు. హరివంశమనేది భారతానికి పర భాగం కాబట్టి, తిక్కన సోమయాజి పూర్తి గావించిన భారతానికి తాను రాసిన ఉత్తర హరివంశం కొనసాగింపుగా సంభావింపబడాలని భావించిఉంటాడు. అందుకని ఆశ్వాసాంతాల్లో తిక్కనను పేర్కొనడమే గాక, ఆయన సృష్టించి అంకితమిచ్చిన హరిహరనాధునికే తన హరివంశాన్నీ అంకితమిచ్చి తద్వారా తాను తిక్కన సోమయాజికి విధేయుడనని చెప్పుకొంటూనే అంతటి వాడినని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నాడు.

ఉత్తర హరివంశంలో సోమన ప్రయోగించిన సామెతలూ, జన బాహుళ్యంలో అంతగా ప్రచారంలో లేని పలుకుబడులూ, జాతీయాలు ఆయన నవీన ప్రియత్వాన్ని పట్టిచూపుతాయి. అంతటి పలుకుబడులను జాతీయములను తెలుగు నేలకు పరిచయము చేసి తన కవిత నవీన గుణ సనాధకత్వమును ఋజువు చేసుకున్నాడు.

ఇందులకు గానూ ఒక చిన్న ఉదాహరణ తెలుపుతాను. నరకాసురుడు స్వర్గం మీద దండయాత్ర చేసినపుడు దిక్పాలకులందరూ అతని సైన్యంతో యుద్ధం చేస్తారు. వరుణునితో హయగ్రీవుడనే దనుజుడు తలపడతాడు. ఆ రాక్షసుని ధాటికి మూర్చ పోయి లేచి, ఇక యుద్ధములో ఉండలేక వరుణుడు బీరపు బొత్తయు గట్టుకుని పోయె, పోయిన పోకై అంటాడు సోమన. బీరపు బొత్త అంటే మేకతోలుగా మనము ఎంచుకొనవచ్చు. యుద్ధంలో నిలవనూ లేడు, ఓటమి ఒప్పుకోనూ లేడు. పిరికితనము , బడాయితనము పొత్తము (బొత్త) అంటే రెంటినీ పొట్లంగా చేసుకుని పోయిన పోకై  అదే పోతగా వెళ్ళిపోయినాడట. ఇలాంటి సందర్భంలోనే, ఇదే విధంగా యుద్ధంలో ఓడిపోయి యముడూ మరలి పోతాడు. ఇట్టిక సూడని వాడో, యొట్టిడుకున్నాడొ యనుచు ఉల్లసమాడం బట్టగుచు మగిడి చూడక పట్టణమునకేగె లజ్జ బండతనమునన్  ఇటువైపు ఇక చూడను అని, ఒట్టు పెట్టుకున్నట్లు, తిరిగి చూడకుండా పారిపోయినాడట  పైగా లజ్జ బండతనమునన్, అంటే ఒకవైపు తలెత్తుకోలేనంత సిగ్గూ, మరో వైపు ఆ సిగ్గు బైటకు కనిపించనీయని నిర్లక్ష్యవైఖరి నటించుతూ వెళ్లిపోయినాడట. ఇటువంటి ప్రయోగములు ఆయన రచనలలో పుంఖానుపుంఖములు.

ఆయన సంభాషణా రచనా పాటవమును ఒకసారి గమనించుతాము. 

యజ్ఞయాగాది క్రతువులు  నిర్వహించుచున్న ఋషిముని వరేణ్యుల వద్దకు పోయి హవిస్సులు అన్నీ తనకే చెందవలె నంటాడు నరకుడు. అందుకు వారు కనికని కొర్రెవడింటి కంబము చేయున్ అంటారు. కొర్రు అంటే పూర్వము పాకలు లేక కోష్టములు అనగా కొట్టములు నిర్మించుకుని ప్రజలు నివసించేవారు . అదే విధముగా పర్ణశాలలు అన్న పేరుతో ఋష్యాశ్రమములు   నిర్మింప బడేవి. వాని నిర్మాణములో చల్లదనము నిచ్చే తాటి యాకుల మండలను గానీ బోద అనబడు ఒక విధమైన జంబును గానీ పైకప్పునకు వాడేవారు. ఆ కప్పు నిలుచుటకు పొడవాటి వెదురు బొంగులను ఉపయోగించేవారు. అంటే అవి కర్ర వలె కనిపిస్తున్నా లోపల అంతా డొల్ల. దానిని ఆ చూరు నిలుచుటకు వాడే వారు. దానిని కొర్రు అంటారు అంటే సన్ననైన కర్ర  అన్న అర్థమును గ్రహించ వచ్చును. దానిని స్తంభంగా ఎవరైనా వాడతారా అని అవహేళన చేస్తున్నారు ఋషులు. మరి నరకుని కూడా సోమన తక్కువ తిన్న వానిగా చూపక అతనితో సమాధానము ఈ విధముగా ఇప్పించుచున్నాడు: యుద్ధంలో దేవతలందర్నీ జయించిన నాకు కాక, ఓడిన వారికివ్వడము , “శిరస్సుండగ మోకాలున సేసలు వెట్టుట లాంటిదట. అంటే తలకు కాక తలంబ్రాలను మోకాటికి పోసినట్లున్నదట. ఎంత సమయోచితంగా పద ప్రయోగమూ గమనించండి. సంభాషణలను నడిపించుటకు ఆయన కాయనే సాటి.

పరమ కిరాతకులు రాక్షసులైన హంసడింభకుల అత్యాచారాలను గూర్చి తెలుపుతూ  దుర్వాసో  మహాముని శ్రీకృష్ణునితో

హంస డిభకుల చేత మేము పొందిన పాట్లని వేరే చెప్పకరలేదు. ఇదిగో యీ మా వస్తువులని చూడు. “ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్న పదప్రయోగము నేడు మనకు నానుడియై కూర్చుంది. అది ఆయన రచనా వైశిష్ట్యము.

 నకట మోమోట లేక తా రంతజేసి

బ్రదికి పోయిరె! పులి పేదవడిన బసుల
వాండ్రె యెక్కాడి రను కత వచ్చె నాకు;
మునుల లోపల నాలుక ముల్లు విరిగె

తమను నిర్జించు వారలు లేరన్న ధైర్యముతో భయం ఏ కోశానా లేకుండా ఆ హంసడింభకులు అంతటి దౌష్ట్యమును మాపై నెరపుతున్నారంటే ఏమనాలి. శక్తి హీనమైన పులిని పసువుల కాపర్లు కూడా వెక్కిరించారట! అలా అయ్యింది నాపని! మునుల నాలుక ముళ్ళు, అంటే కిన్నాలుక అని గానీ కొండ నాలుక అని గానీ  మనము ఉపయోగించే మాటకు బదులుగా నాలుక ముల్లు అని వాడి నాడు ఆ నవీన గుణ సనాధుడు. కొండనాలుక నిజంగా మనము గమనించితే ముల్లు లాగానే వుంటుంది. మల్లు తిరుగబడిన కొండ రూపము లోనే కదా వుంటుంది.

అందకే నాలుక ముల్లు ఈ నాడు విరిగిపోయింది అంటే ఇక మాటలాడలేము .  అని చెప్పకనే చెబుతున్నాడు దూర్వాసోమహాముని.

4. ఆయన తన కావ్యములో నాలుగు విశేషణములు తనను గూర్చి చెప్పుకున్నాడని అన్నారు. అవి ఆయనకు ఏవిధముగా అన్వయమౌతాయో చెప్పగలరా?

ఆయన తను గూర్చి నాలుగు విశేషణాలు చెప్పుకున్నాడు. 1. సకల భాష భూషణ 2. సాహిత్య రస పోషణ ౩. సంవిధాన చక్రవర్తి 4. నవీన గుణ సనాథ, ఇవి ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాము.

1.          సకలభాషా భూషణ: ఇది వాస్తవమై ఉండవచ్చును, ఎందుకంటే

ఆయన చెప్పిన మిగతా విశేషణములు వాస్తవములు కావున ఇది కూడా నిజమై యుండ నగును. పైపెచ్చు తానూ అవసరము అనుకొన్న చోట అరబ్బీ ఫార్సీ భాషా పదములు కూడా వాడుట తటస్థించినది. మరి అప్పుడు ఆయన చెప్పిన మాట వాస్తవమే కదా!

2.          సాహిత్య రసపోషణ: స హితమైనది సాహిత్యము. హితము తో కూడినది సాహిత్యము. దాని అంతిమ లక్ష్యము సమాజ హితవే. మరి సోమన అదేవిధముగా పరమార్థము ,పారలౌకికము, పరమాత్మ గుణ విశేషములని గీర్తించి ఈ గ్రంథమున సంపూర్ణ ,సమగ్ర సాహిత్య పోషణము  గావించినాడు.  అంతే కాక ఈయన లోకోత్తర చమత్కార శబ్ద విన్యాసముతో తన కవిత రథమును రథ్యలు  అంటే  రాచబాటలపై నడిపినాడు. రసమునకు మూల ప్రాతిపాదిక నాట్య శాస్త్రము. అందుకే సోమన నాట్య రసాన్నే  సాహిత్య రసము అన్నాడు.

 విభావైరనుభావైశ్చ సాత్వికైః ర్వ్యభిఛారిభిః  

అనీయ మానః స్వాదుత్వం స్థాయీ భావో రసస్మృతః’

అన్నాడు ‘దశరూపక’ కర్త ధనంజయుడు. స్థాయి అంటే చెదరక స్థిరముగా వుండే అనుభూతి. నాట్య శాస్త్ర నిర్మాత భరతుడు’ నహి రసాదృతే కశ్చిదగ్ధః ప్రవర్తతే ’  అని రసాన్ని ప్రశంసించినాడు తన నాట్య శాస్త్రములో .

వాక్కు చేత గానీ అంటే కావ్య గత, కథ, కథన, శబ్ద, భావ, అలంకార, సహితమగు కవనము చేత గానీ, నాట్యము చేత గానీ, నాటకము చేత గానీ, సంగీతము చేత గానీ, ఒక భావము ప్రదర్శించి నపుడు ఆ అనుభూతిని మన మనసున ఆవిష్కరింపజేసే ప్రయోగ సిద్ధికి రసము అని పేరు. అందుకే పెద్దలు ‘రసోవై సః’ అన్నారు. రసము అంటే అదే అని అర్థము. ఆ రసజ్ఞత కు చెప్పబడిన నిర్వచనమునకు నికరమైన కావ్య రూపము ఉత్తర హరివంశము. ఆ రస, రసాల సాలమే నాచన సోముడు. ఉత్తర హరివంశములో  ధీరోదాత్తుడైన కృష్ణుడు నాయకుడు. ఇటు వీరము అటు శృంగారమునకు  రెండింటికీ పెద్ద పీటవేసి తన కవనమను బండికి   ఆ రెంటినీ జోడెడ్లగా పూన్చినాడు. అట్లని ఇతర రసాలను చిన్న చూపు చూడలేదు. ఉదాహరణలు తరువాత ఇచ్చుకుంటాను. అందుచేత ఆయన చెప్పుకున్న సాహిత్య రసపోషణ మనకు ఉత్తర హరివంశములో అడుగడుగునా కాన వస్తుంది. అందుకే ఆయన తనను సాహిత్య రసపోషణా చక్రవర్తిగా చెప్పుకున్నాడు.

 ౩. సంవిధాన చక్రవర్తి :  విధానము అంటే చేయుట, పూజ, తీరు, ఉపాయము అనే అర్థములు వున్నాయి. ఇక్కడ సంవిధానము అన్న మాటకు చక్కగా కూర్చుట అన్న అర్థమును తీసుకొనవచ్చును. మహా పండితుడైన భవభూతి తన నాటకములలో విచిత్ర సంఘటనము ఏర్పడినపుడు ‘అహో సంవిధానకం’  అన్న ప్రయోగమును విరివిగా వాడినాడు. ఇదే పదమును సోమన కూడా తన కావ్యములో అనిరుద్ధుని గొని పొమ్మని, బాణాసురుని కుమార్తె ఉషా దేవి యొక్క చెలికత్తె చిత్ర రేఖకు చెబుతూ, నారదుడు ఈ విధముగా అంటాడు “.........నా చేసిన సంవిధానంబున నీవు నిశ్చింతంబుగా ననిరుద్ధుం గొని పొమ్ము.” ఆయన తీసుకున్న ఆరు కథలూ కేళీ విక్రమ చక్రవర్తి యగు శ్రీకృష్ణ ప్రాధాన్యత సంతరించుకొన్నవి.  అసలక్కడే మనకు సోమన కథాకథన సంవిధాన నైపుణ్యత కనిపించుతుంది ఆ ఆరు ఆశ్వాసాలనూ తడిమితే! మూల హరివంశములో ముందు అనిరుద్ధుని వివాహము పిదప రుక్మిణి కృష్ణుని పుత్ర సంతతి కోరుట వుంటుంది. దీనిని సవరించి ముందు ప్రద్యుమ్నోదయము పిదప అనిరుద్ధ జననము  జెప్పి వరుస క్రమమును తప్పకుండా కథనము సాగించినాడు.

మిగతది మరొకసారి.....

నాచన సోమన (నాచన సోమనాథుడు)-3

నవీన గుణ సనాధత : నిజమునకు ఈ గుణములు తనకు గాక తన కావ్యమునకు చెందుతాయి. సోమన కవితాధారలో, ఆయనకు పూర్వ కవులు వ్రాసిన ప్రసిద్ధ కావ్యములలో కనిపించని అనేక గుణములు కనిపించుతాయి. అవే నవీన గుణములు అని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు తెలిపిన మాట. దృశ్యమును మనోనయన రంజకముగా చెప్పుట, తదనుగుణములైన పదములను వాడుత ఆయనకే చెల్లినది. ఉదాహరణమునకు కావ్యమున మనము జూచే గదా యుద్ధము, జూదము, పిశాచద్వయ వర్ణన నిరుపమానము. చిన్న ఉదాహరణము : ఉష ఈ విధముగా అంటుంది ‘తలపునకు జక్కనుండెడి తలపు లేదు , లజ్జ బోద్రోవ లజ్జకు లజ్జ లేదు.’ పుంఖాను పుంఖములైన ఆయన రచనా మాయాజలాలపు అల్లికలో ఇది యొక పోగు మాత్రమే. ఈయన సీస పద్య రచన పోతనాదులకే అనుసరణీయమైనది. హరి పాంచజన్య పూరణమును వర్ణించుతూ ఆయన చెప్పిన సీసము లోని ఈ పాదము గమనించితే , ఇది 4వ ఆశ్వాసములోని 216వ పద్యము, ఉర్రూతలూగెడు నుదయాస్తగిరులతో నాకాశలక్ష్మి కోలాటమాడ’ ఇట్లు చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా చాలదు. అందుకే ఆయన నవీన గుణ సనాధుడైనాడు.

5. ఆయన తన కవిత్వములో వక్రత అనబడదగిన ఆలంకారమును వాడినాడట. దానిని కాస్త ఉదాహరణముతో వివరించగలరా?

వక్రత

కుజము కుంజరముచే కూలునో కూలదో?
కూలు; కుంజరము నీ కుజము గూల్చె!
మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో?
మడుగు; పేరేటి నీ మ్రాను మడచె!
గాలునో యొకనిచే గాలదో సాలంబు?
గాలు; నీ సాలంబు గాల్చె నొకని!
దునియునో పరశుచే దునియదో వృక్షంబు?
తునియు; నీ వృక్షంబు తునిమె బరశు!

ననుచు దమలోన జర్చించు నమరవరుల
కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు
పారిజాతంబు నా మ్రోల బండియుండ
నంద గంటి నా కోర్కుల నంద గంటి!

ఇది కృష్ణుడు శివుని స్తుతించే పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి చెప్పదలచుకున్న విషయమేమిటన్నది బోధపడదు. వాక్య నిర్మాణంలోనూ, చెప్పిన విధానంలోనూ ఉన్న వక్రత దీనికి కారణం. శివుని పారిజాతవృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. చెట్టు ఏనుగు చేత కూలుతుందా కూలదా? కూలుతుంది. కాని ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది! అలానే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద ఏరువల్ల వంగిపోవడం, అగ్ని వలన కాలడం, గొడ్డలిచేత విరగడం శివుని విషయంలో తారుమారవ్వడం కనిపిస్తుంది. మొదటి పాదంలో ప్రశ్నకి రెండవ పాదం మొదటి పదంతో సమాధానం చెప్పడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనది శివుని విషయంలో జరగడాన్ని ప్రస్తావించడం ఇక్కడ పద్య (వాక్య) నిర్మాణంలో సోమన చూపించిన వక్రత. ఇదే అస్పష్టతకి దారితీస్తోంది. అలాగే ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు అర్థమవ్వాలంటే కొంత పురాణ జ్ఞానం అవసరమవుతుంది. శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచడం, మన్మథ దహనం – ఇవి మొదటి మూడు పాదాలలోని అంశాలు, ప్రసిద్ధమైనవే. నాల్గవ అంశం శివుడు పరశువుని ఖండించడం. దక్ష యజ్ఞ ధ్వంసమప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశువుని ఖండించాడని ఒక కథ ఉంది. ఇక్కడ ప్రస్తావించినది అదే. ఈ కథలు తెలియకపోతే పద్యం అసలు అర్థం కాదు.

ఉత్తరహరివంశంలో ప్రతి కథలోనూ అనేక రసాలు కనిపిస్తాయి. ఏ ఒక్క రసమూ ప్రథాన రసంగా కనిపించదు. ఒకే సన్నివేశంలో రెండు రసాలని సమ ప్రాథాన్యంతో నిర్వహించడం కనిపిస్తుంది. ఒకోసారి, ఒకటి ప్రథాన రసమవుతుందని సాధారణంగా అనుకునే చోట మరొక రసానికి అధిక ప్రాథాన్యం ఉంటుంది! ఇది రస నిర్వహణలో సోమన చూపించిన వక్రత. ప్రతి కథా దీనికి ఉదాహరణే.

6. ఆయన వక్రత ప్రదర్శించిన వేరు సన్నివేశములు వేరు ఏమయినా ఉన్నాయా?

ఉన్నాయి. ఇంద్రుని జయించి సభకు ఊర్వశిని రప్పిస్తాడు నరకుడు. అప్పుడు ఈ పద్యములో వినిపిస్తాడు సోమన నరకుడి చేష్టలను.

దనుజేంద్రుడా తలోదరి
గనుగొని చొళ్ళెంబు నిమురు గ్రమ్మున బైకొం
గనువు పఱుచు గేదగి రే
కు నఖంబుల జీఱు గులుకు గోర్కుల దేలన్

సభకి రప్పించిన ఊర్వశిని చూడగానే నరకుడు చేసిన చేష్టలివి. కొప్పు నిమరడం, పైకొంగుని సర్దడం, గేదగి(కేతకి = మొగలి పువ్వు) రేకులని గోళ్ళతో చీరడం. నరకుడు ఎవరి కొప్పు నిమిరాడు? ఎవరి పైకొంగుని సర్దాడు? ఊర్వశి వని విశ్వనాథతో సహా చాలామంది అర్థం చెప్పారు. మరి చివరనున్న గేదగి రేకులని చీరడమేమిటి? లేత చెక్కిళ్ళని గేదగి (మొగలి) రేకులతో పోల్చడం ఆనవాయితీ. నరకుడు ఊర్వశి బుగ్గ గిల్లినాడన్నమాట, అని వివరించినారు. బుగ్గలని చెప్పకుండా, వాటిని పోల్చే గేదగి రేకులని మాత్రమే చెప్పి ఊరుకోవడము వర్ణనలోని వక్రత. అయితే యీ పద్యాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు.

నరకుడు తన కొప్పుని నిమురుకున్నాడు. తన పైకొంగుని సర్దుకున్నాడు. తన చేతిలోని గేదగి పూరేకులను గోళ్ళతో చీరీనాడు. ఇవి కూడా అందమైన స్త్రీని చూస్తే రసికుడు చేసే శృంగార చేష్టలే. నిజానికి యీ అర్థమే నాకు ఎక్కువ సమంజసమనిపిస్తోంది. ఎక్కడో సింహాసనం పైనున్న నరకుడు కిందగి దిగి ఊర్వశి వద్దకు వచ్చి, ఇంకా మాటలైనా మొదలుపెట్టకుండానే ఊర్వశితో అంత చనువు తీసుకున్నాడా అని నా అనుమానం. మొత్తానికి పద్యాన్ని రెండు విధాలు గానూ అర్థం చేసుకోవచ్చు. ఇది పద్య నిర్మాణంలో ఉన్న విలక్షణత, వక్రత. ఇలా పద్యాలని ప్రహేళికల్లా నిర్మించడం చాలా చోట్ల కనిపిస్తుంది.

ఇదే వక్రత సంభాషణలలోనైతే, కాకువుని(శోక భయాదులచే కలిగించు ధ్వని) ధ్వనించి నాటకీయతకి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, తన కొడుకుని యముని బారినుంచి కాపాడలేకపోయిన అర్జునుడితో బ్రాహ్మణుడు పలికే మాటలు:

నీ వేమి సేయు దీ గాం
డీవము నీకిచ్చి యిమ్ము డెప్పరమైనన్
లావు గలదంచు బలికిన
పావకుజే గాదె కోలుపడితి కుమారున్

ఉరుమురిమి మంగలమ్మీద పడ్డట్టు, తన దుస్థితికి అగ్నిని దోషిగా నిలబెడుతున్నాడా బ్రాహ్మణుడు! ఇది సంభాషణలోని వక్రత. అర్జునుడిని నిందించే సందర్భంలో అతనికి గాండీవాన్ని ఇచ్చిన అగ్ని దేవుడిని కూడా తన నిందలోకి లాగడం, ఆ బ్రాహ్మణుడి అమాయకపు ఆవేదనని చక్కగా స్ఫురింపజేస్తోంది. ఇలాగే, హంసడిభకుల కథలో హంసుడు జనార్దనునితో చెప్పే మాటలు, జనార్దనుడు దూతగా యాదవ సభలో మాట్లాడిన మాటలు వక్రతతో నిండి వారి వారి రాజకీయ చతురతని బాగా పట్టిస్తాయి.

ఇంకా ఉన్నది.... ఇంకాస్త 4 వ భాగములో చూతము.....

నాచన సోమన (నాచన సోమనాథుడు)-4


. నరకాసుర వధ లో వీర శృంగార రసములను మేళవించి వ్రాసిన తీరు అమోఘమని అంటారు. కాస్త వివరించండి.

నరకాసుర వధ ఘట్టంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో శృంగార వీర రసాలని రెంటినీ నిర్వహించాడు సోమన. సాధారణంగా వీర రసం ఇక్కడ ప్రథానమవ్వాలి, కానీ శృంగార రసమే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి, సత్యభామ కొంతసేపు యుద్ధం చేసిన తరువాత కృష్ణుడు సంతోషించి ఏమి చేస్తాడో చూడండి:


చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి

తరుణి నుదుట బైకొన్న కుంతలములొత్తి

రమణి కుచమధ్యమునకు హారముల ద్రోచి

పొలతిపయ్యెద కొంగు పైబొందుపరచి

దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు. మల్లంపల్లి శరభయ్యగారు చేసినారని విన్నాను కానీ అలభ్యము.



8.ఈ విధమగు వేరేదయినా అలంకారాన్ని సోమన ఉపయోగించినారా?


సూక్ష్మత

చెప్పే విషయాన్ని చాలా క్లుప్తంగానో, గుప్తంగానో చెప్పడం సూక్ష్మత. నాచన సోమన కవిత్వ లక్షణాలలో సూక్ష్మత ఒకటంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. సోమన కవిత్వంలో శబ్దాడంబరం తప్ప మరేమీ లేదన్న విమర్శకులున్నారు. అతను ఏ విషయాన్నైనా సమగ్రంగా వర్ణించకుండా ఉండలేడు అన్న వారున్నారు. కాని, వాటి వెనక సూక్ష్మంగా, సోమన తాను చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలా ఆవిష్కరించినాడో గమనిస్తే అతని కవిత్వంలోని గొప్పదనం తెలుస్తుంది. వర్ణనలలో అయితేనేమి, పాత్ర చిత్రణలోనైతేనేమి సోమన చూపిన సూక్ష్మత అనన్యమైనది. ఉదాహరణకి యీ వర్ణన చూడండి:

నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి

రణకేళి వలకేలి రమణ జూపె

గంసదానవ శిరః కమల కృత్తన మేలు

తన మేలుచేయి పెద్దలకు నొసగె

జాణూర ముష్టిక క్షతజ కీలాలంబు

నాలంబులో నెల్ల నలవు వఱపె

ముర హయగ్రీవాంత్రమూల ఫేనావలి

నావలి దలగ జీకాకు పఱచె


వీరరససార కాసార విహరణంబు

విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప

దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి

పాఱ వెంపళ్ళు తమకెంత బంటి యనుట

ఇందులో పైకి ఎక్కువగా కనిపించేది శబ్దాలంకార ఆడంబరం. విస్తారమైన వర్ణన. కాని వాటిని దాటుకొని అందులోని భావాన్ని తరచి చూస్తే ఏం కనిపిస్తుంది? నరకాసురుని ప్రాణాలనే తామర తూళ్ళని పెరికి పారెయ్యడమూ, కంసుని శిరస్సనే పద్మాన్ని తుంచి పారెయ్యడమూ, చాణూర ముష్టికుల రక్త జలాన్ని నలుదిక్కులా చిమ్మేయడమూ, ముర హయగ్రీవుల ప్రేగులనే నురగల సమూహాన్ని చిందరవందర చెయ్యడమూను. ఇది చదివాక, సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం మనకి కనిపించక మానదు! వర్ణన ద్వారా పాఠకుల మనసులలో ఒక చిత్రాన్ని రూపుకట్టించడం కవి ప్రతిభ. ఇక్కడ సోమన ప్రత్యేకతంతా విష్ణువుని మదగజంతో నేరుగా పోల్చకపోవడంలో ఉంది. అది పాఠకుల ఊహకి వదిలివెయ్యడమే ఇందులోని సూక్ష్మత. పైకి కనిపించే శబ్దాలంకారాలకి లొంగి అక్కడే ఆగిపోక, ‘లోనారసి’ చూస్తే ఇందులో దాగిన ఆ చక్కని చిత్రం దర్శనమిస్తుంది. అలాగే మరో వర్ణన చూడండి.

నరకుని వలన మునులుపడ్డ బాధలని విని కృష్ణుడు కోపించినప్పుడు అతని క్రోధాన్ని వర్ణించే పద్యమిది :

అరుణాంభోరుహ పత్రనేత్రుడు సముద్యద్భ్రూకుటీ భంగ భా

సుర ఫాలస్థలుడుం జలాచల మనశ్శూలాయమానవ్యధా

పరివేషానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్

నరకాలంభ విజృంభణంబు నెఱపెన్ నారాయణుండాకృతిన్

ఈ పద్యములో ‘ప్రత్యక్ష రౌద్రంబనన్’ అంటే ఏమిటి? ‘రౌద్ర రసమే సాక్షాత్కరించిందా అన్నట్టుగా’ అన్నది సామాన్యంగా చెప్పే అర్థం. (రౌద్ర అన్న పదమును రుద్రా సంబంధమైనదిగా వాడుట జరిగినది.)  రుద్రుడే, అంటే శివుడే ప్రత్యక్షమైనాడా అన్నది సూక్ష్మంగా కవి స్ఫురింప జేస్తున్న అర్థం. భాసురమైన ఫాలస్థలి ప్రస్తావన దీనికి మరింత దోహదం చేస్తోంది. ఇది శ్లేష కాదు. ఒక చిత్రాన్ని లీలగా ఛాయగా ప్రదర్శించడం, ఇక్కడ మరో విశేషం. ఇలాగే వర్ణన ద్వారా శివుని రూపాన్ని లీలగా స్ఫురింపజెసిన సందర్భం, ఉత్తరహరివంశంలో మరొకటి ఉంది. పౌండ్రకుని వద్దకు నారదుడు వచ్చినప్పుడు, ఆ నారదుడెలా ఉన్నాడో వర్ణించే పద్యమిది :

ప్రాలేయాంశు మరీచి నిర్మల తనూ భాగంబు కృష్ణాజిన

వ్యాలోలామల యజ్ఞసూత్రములు సంసాసక్త వీణాలతా

లాలిత్యంబు, లలాటికా రుచులు గ్రాలన్నారదుండిచ్చలం

గైలాసంబుననుండి వచ్చె గలహోత్కస్వాంతుడచ్చోటికిన్

ఈ పద్యంలో ప్రస్తావించిన చంద్రకాంతిలా(తో) తెల్లగా వెలుగుతున్న శరీరము, లలాటము చిందే కాంతులు, కైలాసము నుండి విచ్చేయడము – ఇవన్నీ కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చాడా అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇంతకుముందు పద్యంలో లాగానే ఇందులో కూడా శ్లేష లేదు. ఇక్కడ ఉన్నది ధ్వని! ఇలా వర్ణనలలో సూక్ష్మంగా అంతరార్థాన్ని ధ్వనింప జేసే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. నేను తెలుసుకోలేక పోయినవి ఇంకా చాలానే ఉండి ఉంటాయి! దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు. మల్లంపల్లి శరభయ్యగారు చేసినారని విన్నాను కాని, అది నాకు అలభ్యము.

పాత్ర నిర్వహణలో కూడా సోమన పాత్ర స్వభావాలని వాచ్యం చెయ్యకుండా సూక్ష్మంగా ధ్వనింపజెయ్యడం గమనించవచ్చు.

పాత్ర నిర్వహణలో సోమన చూపించిన సూక్ష్మతకి మంచి ఉదాహరణ పౌండ్రకుని కథ. ఇందులో పౌండ్రకుని పాత్ర ప్రవేశంలో ఉన్న యీ పద్యం చూడండి:

ఇక్కడ బౌండ్రభూపతి వివేకవిహీనత జేవ యెక్కగా

“నెక్కడి వాసుదేవు డిల నేనొకరుండన వాసుదేవుడన్

దక్కినవాడు నందక సుదర్శన శార్ఙ గదాది హేతులన్

స్రుక్కక పట్టినన్, దెసల జుట్టిన .......

అని అంటూ కృష్ణుని ఎగతాళి చేస్తున్నట్లనుకొంటూ తనను తానూ ఎగతాళి చేసుకొంటాడు.


9. పాలలో పండ్లు పిసికిరి అన్న ప్రయోగము అమోఘమని అందరూ అంటారు . దానిని గూర్చి కాస్త తెలుపండి?


బాణాసురుడు అనిరుద్ధుని చెరసాలలో బంధించినాడనే విషయం తెలిసి, ద్వారకలోని అమ్మలక్కలు అనుకునే మాటల్లో “పాలలో పండ్లు పిసికిరమ్మ” అనుకుంటారు.


“అఖిల లోకాధీశుడగు చక్రధరు నింట

నొక కీడు మాట నేడొదవె నమ్మ

బాల్యంబు నంద శంబరు జంపె

ప్రద్యుమ్ను డతని లావెల్లిద మయ్యెనమ్మ.

కీడు లేదన దేవకీ దేవి బలగమొ

ప్పిన పాలలో పండ్లు బిసికిరమ్మ”


అన్ని లోకాలనూ ఏలే కృష్ణుడింట్లోనే ఇన్నాళ్ళకు ఇటువంటి కీడు జరిగింది కదా. చిన్నప్పుడే శంబరాసురుని చంపిన ప్రద్యుమ్నుని పరాక్రమం నగుబాటు చెందినట్లయింది గదా – అతని కుమారుడైన అనిరుద్ధుని ఒక రాక్షసుడు బంధించడం. దేవకీ దేవి బలగానికి ఎప్పుడూ ఏ కీడు ఉండదు. అటువంటిది పాలలో పండ్లు పిసికినట్టయింది కదా అని అర్ధం. ఈ పాలలో పండ్లు పిసకడం అనేది ఒక విచిత్రమైన ఊహ. పాలు రుచి కోల్పోయినప్పుడు రుచి కోసం పాలలో పండ్లు పిసుకుతారు. అలాగే, పాలు పలచ నైనప్పుడు చిక్కదనం కోసం పండ్లు పిసికి కలుపుతారు. ఇన్నాళ్ళకి దేవకీ దేవి ఇంట పాలు రుచినీ చిక్కదనాన్నీ కోల్పోయినాయి. ఎటువంటి దశ వచ్చింది, కృష్ణుని ఇంటికి, అని వాపోవడం ఇది.


ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి విశ్వనాథ సత్యనారాయణ ‘ఒకడు నాచన సోమన్న’ అన్న పుస్తకాన్ని రాసినారు. సోమన స్థాపించాలనుకున్న విషయం విష్ణువు యొక్క పరమస్థితి అని విశ్వనాథ ఆలోచన. పరమస్థితి అంటే అతని పరమాత్మ తత్వమన్నమాట. ఉత్తరహరివంశం లోని కథల సంవిధానము, వాటి కథనము విష్ణు పారమ్యాన్ని ఎలా ధ్వనింపజేస్తున్నాయో ఆ పుస్తకంలో వివరించినారు. ముఖ్యంగా నరకాసురుని కథ గురించి, జ్యోతిష పరంగా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నరకుడు నిజానికి భూమినుంచి విడిపోయిన ఒక గోళమని, అది భూమికి దగ్గరగా వచ్చి దాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, కాల స్వరూపుడైన విష్ణువు దాన్ని ఛిన్నాభిన్నం చేయడమే నరకాసుర వధ అని కొన్ని ఆధారాలతో వివరించినారు.

 చివరి భాగము మరులా ........


నాచన సోమన (నాచన సోమనాథుడు)-చివరి భాగము

10. నరకాసురునితో యుద్ధ సమయమున వ్రాసిన సోమన పద్యములు భాగవతమున పోతనకు ఆలంబనములైనాయని విన్నాను. ఉదహరించ గలరా?

నరకాసుర యుద్ధ ఘట్టములో కొన్ని పద్యాలను చూద్దాము. ఎంతటి గంభీరమైన పద ప్రయోగమో ఎటువంటి భావజాలమో గమనించుదాము. ఈ పద్యములను నరకాసుర ఘట్టములో పోతనే ఈయనను అనుకరించినాడు అంటే ఈయన గొప్పదనము మనము అర్థము చేసుకోన గలము .

ఈ పద్యము చూడండి

తంత్రీ వినోదంబు తడవు సైపని వ్రేళ్ళ
గొనయంబు తెగలపై గోరికనుట

యద్దంబు పిడి ముట్టనలయు పాణి తలంబు,
లస్తకంబిఱియించు లావు కలిమి

చెలికత్తెనొత్తిలి చీఱలేని యెలుంగు,
సింహనాదంబుచే జెదరకునికి

ప్రమద నర్తన కేళి బంతవింపని పదం,
బైదు రాణంబుల నలత బడమి

సోయగపు జిత్రరూపంబు జూచుచోట,
వేసరు విలోచనంబులు వికృత దైత్య
లక్ష్యమీక్షించుటయు మొక్కలంపు గెలుపు
గైకొనియె సత్యభామ సంగ్రామ సీమ''

తంత్రులను మీటుటకే కనలి పోయే వ్రేళ్ళు వింటి అల్లెత్రాటిని ఏవిధముగా వింటికి అనుసంధించ గలుగుతుంది. అద్దము యొక్క పిడిని పట్టుకుంటేనే కందిపోయే చేయి ధనువు మధ్య గల ధృడమైన పిడిని ఏవిధముగా పట్టుకోగలుగుతుంది. చేలికత్తెలనే గట్టిగా పిలువలేని స్వరము సింహనాదముల నేవిధముగా చేస్తుంది, స్త్రీ సహజమైన సౌకుమార్యముగల నాట్యమే చేయనోపని సుకుమార పదములు ఐదు విధములగు నైపుణ్యతలను అంటే 1.విల్లు ధరించుట 2. బాణమును సంధించుట ౩. ఆకర్ణాంతము లాగుట, 4. ప్రత్యాలీఢ పాదమ్ముతో నిలచుట 5. శరమును వదలుట అన్న ఈ ఐదు పనులను ఒకే సమయమున అలయకుండానే ఏవిధముగా చూపగలదు. సోయగముతో కూడిన రూప లావణ్యముల గాంచ వలసిన ఆమెలో వికృతమగు రక్కసుని

లక్ష్యముగాగొని ఆతని కదలికలు సునిశితముగా చూసి వేసారిన కన్నులు గలిగి అలసి కూడా అసాధ్యమైన గెలుపు గైకొనె నా సంగ్రామ సీమ లో సత్యభామ.

ఈ పద్యము సత్యభామా సౌకుమార్యమును తెలుపుతూ ఆమె యుద్ధము ఎట్లు చేయగలదు అన్న సందేహమును వ్యక్తము చేస్తున్నాడు సోమన.

ఇదే సందర్భమును, ఇదే భావమును, ఇదే పాత్రను , యథాతథముగా గ్రహించి పోతన భాగవత దశమ స్కందములోన ఏవిధముగా వర్ణించినారో తిలకించండి.

వీణ చక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ
బాణాసనంబెట్లు పట్ట నేర్చె

మ్రాకునదీగె గూర్పంగ నేరనిలేమ
గుణము నేక్రియధనుష్కోటి గూర్చె

సరవి ముత్యము గ్రువ్వజాలని యబల
ఏనిపుణత సంధించె నిశిత శరము

చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి
యస్త్రమంత్రము లెన్న డభ్యసించె

బలుకు మనిన బెక్కు పలుకని ముగుద
యే గతి నొనర్చె సింహ గర్జనములు
ననగ మెరసె ద్రిజగదభిరామ గుణధామ
చారు సత్యభామ సత్యభామ !

వీణ చక్కగా పట్టుకొనుట తెలియని ఈమె విల్లు పట్టుకొనుట ఎటుల నేర్చుకున్నది ? చెట్టుకు లతలను ఎక్కించ లేని ఈమె ధనస్సుకు, వింటినారిని ఎటుల ఎక్కించినదో ? ముత్యాలలో దారము గూర్చుట తెలియని మగువ బాణములు గురి తప్పక ఎటుల సంధించుచున్నదో? చిలుకలకు మాటలు నేర్పలేని సుందరి ఈ అస్త్రమంత్రముల నెప్పుడు నేర్చుకోన్నదో ? బిగ్గరగా మాట్లాడలేని ఈమె ఈ యుద్ధము సింహగర్జనలు చేయుచున్నది . ముల్లోకాలలో చారు సత్య సౌందర్య యుతయైన భామయగు, సత్యభామకు ఇవన్నీ ఎటుల సాధ్యమయెను ? సమాధానము కుడా ఆపరమాత్మకు తెలియును. సత్యభామ సాధారణ కన్య కాదు చక్రవర్తి కుమార్తె. క్షత్రియులలొ స్త్రీ పురుషులకు ఈ విద్యలెల్ల నేర్పు ఆచారముండెడిది ఆ కాలంలో.. అవసరమైనపుడు మాత్రమె వానిని ప్రదర్శించెడి వారు.

మ. అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే
సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్

ఇది నాచన సోమనాథుడు ఉత్తరహరివంశమున నరకాసురవధ ఘట్టమున రచించినది.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఒక హేలావిలాసంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంలో ఆమె పయ్యెద కొంగు కొంచెం తొలిగింది. మెడలోని మందారమాల లోని పువ్వుల నుంచి తేనె సొనలు కురిసి ఆమె వక్షస్థలాన్ని చిత్తడి గావిస్తున్నాయి. ఇదీ దృశ్యం. ఆమె సౌందర్యమూ, శృంగారమూ, వీరమూ, చిరునవ్వుల జల్లూ, మెడలోని మందారదామం లోని మకరందాల ధార, కొంచెంగా తొలగిన పైటకొంగు — ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని ఈ పద్యంలో రూపు కట్టించాడు సోమన కవి.

దీనిని అదే ఘట్టములో పోతన ఏవిధముగా అనుకరించినాడో చూడండి

పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్

ఆమె వీరావేశముతో శతృవును విప్పారిన కనుబొమలతో కూడిన మందహాసము తో అటు నరకుని ఇటు హరిని చూచుచున్నదట, కళ్ళు ఎర్రబడినాయి. వాడియైన బాణములతో నరకుని బాధించుతూ వేడి చూపులతో కృష్ణుని వేధిస్తూ వున్నది. ఆ కళ్ళలో ఇటు వీరము అటు శృంగారము తో కళ్ళు ఎరుపెక్కినాయట. ఒక ప్రక్క పరుని అంటే శత్రువును ప్రచండాస్త్రములు సంధిస్తూ ఇంకొక ప్రక్క వరుని సరసరస సంయుక్తావలోకనములతో స్పందిస్తూ ఆమె తన హేల అంటే సుస్పష్టమైన కవళికలతో కన్పించుచున్నదట

ఇంకా ఒకటి రెండు పద్యాల మొదటి పాదాలు వినిపిస్తాను.

గనయంబున్ గొనయంబుతో నెన్నడుముతో కర్ణావతంసంబుతో

1-157 ఉ.హ.వం

అలినీలాలక చూడ నెప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో భాగ.దశ.179

సత్రాజిత్తనయా కరాంతర ధనుర్జ్యారావ మైరావతీ ఉ.హ.వం.160

జ్యావల్లీ ధ్వని గర్జనంబుగా సురల్ సారంగ యూధమ్ముగా భాగ.దశ.182

అనుకరణ కన్నా అసలు పద్యము ఎంత హృద్యముగా ఉన్నదో అర్థమును తడివితే మనకు అర్థమౌతుంది. అంతటి మహనీయుడు కావుననే పోతన, ఒంటిమిట్టకు 40 కి.మీ. దూరములో వున్న బుక్కపట్ణము పోయి సోముని కలిసియుండ వచ్చును. హృద్యమైన ఆయన పద్యములచే ప్రభావితుడై సోమన పద్యములను పోతన అనుకరించి యుండ వచ్చును. నేను వయసులో ఉన్న కాలములో 50కి,మీ. నడచిన దాఖలాలున్నాయి. మన పూర్వులు మనకన్నా ఆరోగ్యవంతులు. వారికి 40కి.మీ.దూరము ఒక లెక్కలోనిది కాదు.

ఇటువంటి ఒక మహనీయుని గుర్తు చేసుకొనే అవవకాశాము ఈ రాబోవు దీపావళి సందర్భమున పాఠకులగు మీకు, ఓర్పుతో చదువుతారని విశ్వసించుతూ, మానస సరోవరాంతర్గత మరాళయానయౌ వాణికి వీణా పాణికి క్షోణీకరురాణి కి నమస్సుమాలను అర్పించుకొంటూ శెలవు తీసుకుంటూ వున్నాను .

స్వస్తి.

Tuesday, 5 July 2016

పరమశివుడు - ఆర్ద్రత

పరమశివుడు - ఆర్ద్రత

పరమశివుడు - ఆర్ద్రత

https://cherukuramamohanrao.blogspot.com/2016/07/blog-post.html

పరమేశ్వరుని గమనించండి. నెత్తిన నుండి గంగాజలపాతము, చాలదన్నట్లు చంద్రుని 

శీతల కిరణాలు, శరీరము గగుర్పొడిచే విధముగా పారాడే పాములు, శరీరములోని 

సగ భాగము మంచుమల పట్యగు చల్లని చూపుల గౌరమ్మ, చందన లేపనముతో కూడిన  

శరీరము. ఈచలువంతా చాలదన్నట్లు కొట్లాది భక్తజనుల అభిషేకాలు ఎట్లు 

పొందుచున్నాడో, ఆయన బాధను గుర్తించిన భక్తుడు తను శివునికి ఏవిధముగా 

సాయము చేయగలనని చెబుతున్నాడో ఒకపరి ఈ దిగువ లంకెలో చదవండి.

https://cherukuramamohanrao.blogspot.com/2016/07/blog-post.html


శ్రీ మహావిష్ణువునకు శ్రవణా నక్షత్రము ముఖ్యమైతే శంకరునికి ఆర్ద్రా నక్షత్రము అతి 

ముఖ్యము.శ్రవణమంటే వినుటయే కదా. భక్తుడు నా సహస్ర నామ శ్లోకములలోని ఒక 

శ్లోకమును నాకు వినిపించినా నా చెంతకు చేరుతాడంటాడు పరమాత్మ. నా నెత్తి పై 

కాసిన్ని నీళ్ళు పోసి ఒక బిల్వం పెడితే చాలు నావద్దకు చేర్చుకొంటానంటాడు 

పరమేశ్వరుడు. వారెంత భక్త సులభులో గమనించండి.

అశ్వని,భరణి .... రేవతి వరకు గల 27 నక్షత్రాలూ తమిళులకు గూడా వున్నాయి కానీ 

ఆపేర్లను వారు సంస్కృత నామములనే, వారి ఉచ్ఛారణకు అనుకూలముగా 

పలుకుతారు. తమిళములో 'తిరు' అంటే 'శ్రీ' అని 'శ్రేష్ఠము' అని అర్థము. ఈ తిరు 

శబ్దాన్ని వారు అటు శ్రవణానికి ఇటు ఆర్ద్రకు మాత్రమే వాడుతారు కానీ వేరు 

నక్షత్రములకు వాడరు. శ్రవణాన్ని'తిరువాణం' అంటారు. ఆర్ద్రను 'తిరువాదిరై' అంటారు. 

ఎందుకంటే ఈ రెండు నక్షత్రాలు ఆ విశ్వ పాలకులకు అంత ముఖ్యమైనవి కాబట్టి. 

అసలు ‘హరి’ అన్న ‘హర’ అన్నా ఇద్దరూ లయించుకొనేవారే! 

వారు మన దుష్ట బుద్ధిని లయించవచ్చు, దుష్ట కామనలను లయించవచ్చు, దుష్ట 

తంత్రములను లయించవచ్చు, దుష్ట సంకల్పములను లయించవచ్చు, ఎంతకూ కాకుంటే 

మనలనే లయించ వచ్చు. ఆ ఒక్క మాట చాలు వారి అభేదము తెలుపుటకు. అందుకే 

శంకరులవారు ఒక సందర్భములో అంటారు:

ఏకా నారీ సుందరీవా దరీవా  ఏకం వాసం పత్తనం వా వనం వా l

ఏకో మిత్రః భూపతిర్వా యతిర్వా ఏకో దేవః కేశవోవా శివోవా llనారి అన్న శబ్దము ఒకటే. 

ఆ నారి 'సుందరి' కావచ్చు 'దరి' కావచ్చు. మిత్రుడు ఒకడే! అది 'భూపతి' 'యతి' కావచ్చు.

నెలవు 'పత్తనము' కావచ్చు 'వనము' కావచ్చు. పరమాత్ముడూ ఒకడే! ఆయన 

'కేశవు' డైనా కావచ్చు, 'శివు' డైనా కావచ్చు. అంటే ఈ శ్లోకము భక్తులకు తరతమ 

భేదాలు లేవని చెప్పుటయే గాక పరమాత్మునిగా 'శివు'నైనా కొలువ వచ్చు 'విష్ణువువు' 

నైనా కోలువవచ్చు.

ఈ శ్లోకములో రెండు మాటలు పాఠకుని సందిగ్ధములోనికి నెట్టుతాయి. మొదటిది ‘దరి’. 

‘దరి’ అన్న తెలుగు పదమునకు అర్థము ‘ఒడ్డు’. కాబట్టి ‘దరి’ అన్న మాట సంస్కృత 

శ్లోకములో ఇముడదు. అదే ‘దరి’ కి సంస్కృతములో ‘వికృతరూపిణి’ అన్న అర్థము ఉంది. 

ఇది సరిపోతుంది. అదే విధముగా ‘పట్టణము’ అన్నది తెలుగుమాట. సంస్కృతములో 

దీనిని ‘పత్తనము’ అంటారు. అందుకే సంస్కృతాంధ్రములు సాగర తుల్యములు అనుట 

స్వభావోక్తిగా తలచుతాను.

‘ఏకో దేవః కేశవోవా శివోవా’ అన్న ముక్తాయింపును చివరిలో మనకు బల్ల గుద్ది 

చెప్పినారు జగద్గురువులు. కావున వారిది అభేద ధర్మము. ‘యథా అంతరం నపశ్యామి 

తథామే స్వస్థిరాయుషి’ అని చెప్పినది శాస్త్రము. ఆవాస్తవమును గుర్తించినవారు మాత్రమే 

సుఖ శాంతులను బడయగలరు అనేకదా ఆమాటకు అర్థము.

విషయము 'ఆర్ద్రత'ను గూర్చి కాబట్టి మొదలు దాని అర్థము చెప్పుకొందాము. ఆర్ద్రత 

అంటే తడిసిన అని అర్థము. కన్నులు ఆర్ద్రత తో నిండిపోయినాయి అంటే కన్నులు 

చెమ్మగిల్లినాయి అని అర్థము. మరి శివునికి 'ఈ ఆర్ద్రత చాలా ఇష్టము. ఆయన దుఃఖము 

సహించలేడు. అశ్రు పూరితనయనములతో ఆయనను ఒక్క సారి వేడుకొంటే కనిగుడ్డే 

శివలింగముగా కన్నీరే అభిషేకజలము గా భావించి మనల నాదుకొంటాడు. 

చితంబరములో మార్గశిరమాసములో వచ్చే ఆర్ద్ర నక్షత్రము చాలా ముఖ్యమైన 

దినము. మార్గశిర పౌర్ణిమ రోజు చంద్రుడు మృగశిర నక్షత్రము దాటగానే ఆర్ద్ర ను 

చేరుతాడు. అప్పటికి పున్నమి ఘడియలె వుంటాయి. మార్గశిర మాసమే చలికాలము 

అందులోనూ శీతకిరణుని పౌర్ణిమ. అంటే ఒకటే చలి. అభిషేకము చేసి స్వామికి 

చల్లదనాన్నిచ్చే చందనమును అలదుతారు. ఆ పరమేశుడు ఎంత 'ఆర్ద్రత'ను 

భరించుతాడో చూడండి.

ఈ విషయాన్ని తీసుకొని ఒక శివభక్తకవి ఈ శ్లోకాన్ని ఎంత మనోహరంగా చెప్పినాడో 

చూడండి. ఒకవైపు ఇంత చలిని ఎట్లు భారించుతావయ్యా అంటూనే దానికి మార్గము 

కూడా నిరుత్తరుడైన పరమేశ్వరునకు చెబుతాడు.

మౌళౌ గంగాశశాంకౌ కరచరణ తలే శీతలాంగా భుజంగా

వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందనం సర్వగాత్రేl 

ఇత్థం శీతం ప్రభూతం కనక సభా నాథ సోఢుం క్వ శక్తిః

చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయేll 

కనక సభానాథా : కనక సభాపతీ!

మౌళౌ : శిగలో

గంగా శశాంకౌ : గంగయును మరియు చంద్రుడిని కలిగి

కరచరణతలే : చేతులు కాళ్ళ నంటుకొని

శీతలాంగాం : చల్లని శరీరములు కల

భుజంగాః : పాములను (దేహముపై ప్రాకుతూ) కలిగి

వామే : ఎడమ

భాగే : వైపున

దయార్ద్రా : దయచేత తడిసిన (అమితమగు దయగలిగిన)

హిమగిరిదుహితా : మంచుమల పట్టిని విరాజిల్ల జేసి

సర్వగాత్రే : ఒడలంతా

చందనం : మంచి గంధము పూతను కలిగి

ఇత్థం : ఇట్లు , (ఈ విధంగా, ఇన్నివిధాలుగా)

ప్రభూతం : ఎక్కడైనా

శీతం : చలువదనమును

సోఢుం : ఉందా ( కలిగియుండే చోద్యము కలదా!)

నిత్యతప్తే : (స్వామీ!)ఎల్లకాలమునందును వేడి పుట్టించే

నిర్వేద తప్తే : ఉదాసీనత చేత కాగబడుచూ వున్న

మదీయచిత్తే : నా మనసునందు

తే : నీకు

నిత్య వాసః : నిరంతర నిలయమయినచో (నీకు ఎంతో ఊరట కలుగుతుంది)

యది న భవతి : అట్లుకానిచో

శక్తిః : సత్తువ

క్వ : ఎక్కడ (అంటే శక్తి ఎక్కడ నుండి వస్తుంది)

ఎంత అత్యద్భుత అపురూప భావనో గమనించండి.

పరమేశ్వరునికి పృథివి పైన ఐదు నాట్య సభలు తమిళనాడు లోని ఐదు దేవాలయాలలో 

వున్నాయి .

అవి 1. చితంబరములో కనకసభ, దానికి నాయకుడైన శంకరుడు కనక సభాపతి 2. 

తిరువలంగాడు లో రత్న సభ, దానికి నాయకుడైన శంకరుడు రత్న సభాపతి. 3. 

తిరుక్కుట్రాలం లో చిత్ర సభ, దానికి నాయకుడైన శంకరుడు చిత్రసభాపతి 4.తిరునెల్వేలి 

లో తామ్రసభ, దానికి నాయకుడైన శంకరుడు తామ్ర సభాపతి 5. మధురై లో రజత సభ

దానికి నాయకుడైన శంకరుడు రజత సభాపతి .

ఇప్పుడు మన నాయకుడు కనక సభాపతి. మహనీయుడగు అజ్ఞాత కవి స్వామితో ఈ 

విధముగా మాటలాడుచున్నాడు.

స్వామీ కనక సభాపతీ నీవా వ్యోమ కేశునివి. నీ జటల శిగలో ఒడలు జలదరించే గంగ

శిగపువ్వు చల్లదనాన్ని సమకూర్చే నెలవంక,చేతులు కాళ్ళు మేనూ చూతమా నీ 

ఆభరణాలైన పాములు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి, నీ నెలవా మంచుకొండ 

,వామ భాగము (ఎడమ వైపు) చూస్తేనో దయాంబురాశియైన నీ ఇల్లాలు హైమజ, ఇవి 

ఇట్లుండగా మార్గ శీర్ష ములో చలి, దానికి తోడూ చల్లని పున్నమ రేయి,జలధారలతో 

అకుంఠిత అభిషేకము ఆపై శైత్యము కలిగించే చందన గంధము నీ మేనికి అలదుతూ 

వుంటే అంతటి చలిని ఎట్లు భరింపగలుగు చున్నావయ్యా మహానుభావా.

బహుశ ఈ ప్రశ్నకు, తనలో 'ఇంత ఆర్ద్రత' ఉందా అన్న ఆశ్చర్యముతో అవాక్కయిపోయి 

ఉంటాడుశివుడు. అందుకని ఆ భక్త కవే జవాబు చెప్పుచున్నాడు. స్వామీ నీవు చింతించ 

నక్కరలేదు. వాసనా జనితుడనై,భరితుడనైమొహపరవశుడనై, బాధాగ్నివలయ  

పరివేష్టితుడనై వున్న నావద్ద కావలసినంత వేడి దొరుకుతుంది. నా మది యన్న గది నీ 

కొరకే ఖాళీగా వుంచినాను. అక్కడ ఉండిపోతే నీకూ హాయి నాకూ హాయి మరి 

నీవేమంటావు అన్నాడు భక్తుడు. 

వేరేమంటాడు సరే అనక శివుడు.

చిత్తము శివునికి నెలవైతే మరి భక్తి ఆ భగవంతుని అర్చనా పుష్పమే కదా !

పై శ్లోకమును మదిన పదిలము జేసి తదనువర్తనమైన రెండు పద్యములు నేను నా 

శంకరదాస అష్టోత్తర శతిలో వ్రాసినాను. ఒకసారి చిత్తగించండి.

58. గంగను కొప్పులోపలను గట్టున చక్కని చంద్రవంకయున్

హంగగు హైమ శైలమును ఆభరణాలగు కాళజాలముల్

అంగములన్ని ప్రాక మరి ఆర్ద్రత ఎంతయు కల్గుచుండ యా

సంగతి వీడి నీటికయి సాచెద వర్రు లదేల శంకరా!

59. ఆర్ద్రత ఎంత కల్గినను అల్లది తీరగ నేను నీకు సౌ

హార్ద్రత తోడ నొక్క విషయమ్మును చెప్పెద నాలకించు నీ

వార్ద్రత చూపి నామదిని ఆశ్రయ మందిన వేడి పుట్టు నో

ఆర్ద్ర జలాభిషేకరత ఆవము  కోర్కెల కద్ది శంకరా!

స్వస్తి

 

 

 

Wednesday, 29 June 2016

విభీషణ నీతి

విభీషణ నీతి 
ఈ పద్యము చిన్న ఆటవెలదే! కానీ భావము ఎంత గంభీరమో చూడండి. పైపెచ్చు ఇది మనకు తెలియని విషయమూ కాదు. అయినా సమయోచితముగా  సందర్భానుసారముగా మనకు తెలిసిన విషయమును చెప్పవలసిన మాట లేక ఉపదేశమునకు జోడించి చెప్పుట అగరు బత్తి ని వెలిగించినట్లుంటుంది. వెలిగించకున్నా దాని వాసన దానికుంటుంది, కానీ వెలిగిస్తే సువాసన చుట్టుప్రక్కలకు ప్రసరిస్తుంది.
అష్ట దిగ్గజములలో ఒకడైన అయ్యలరాజు రామభద్రకవి వ్రాసిన 'రామాభ్యుదయము నుండి గ్రహింపబడిన ఈ పద్యము విభీషణుడు రావణునికి బుద్ధిజేప్పు సందర్భము లోనిది.
పరుషోక్తి బాధ చూడకు,
పరిణామ సుఖమ్ముచూడు, బ్రతికెద వసురే
శ్వర! మందు చేదుచూడకు, 
పెరిగిన తెవులడగ జూడు పెద్దతనానన్!
ముదిరిన వ్యాధిని అణచుటకు మందు చెడు కదా అని త్రావుటకు సంశయిస్తే రోగము ప్రాణాంతకము కావచ్చును. మంచి మాట యొక్క కటవుదనమును చూసి ఈసడించుకొని, పెడ చెవిన పెడితే అది ప్రాణాంతకమే కావచ్చును.