Monday, 20 November 2017

మైనమౌచు మనసు కరుగ - ఎద వినిచెను గానము


మైనమౌచు మనసు కరుగ - ఎద వినిచెను గానము
                 కనురెప్పల తాళము - శ్వాస వాయులీనము
                 మైనమౌచు మనసు కరుగ - ఎద వినిచెను గానము
ఊహలు తెలిమబ్బులై - నింగిన విహరించగా
వన మయూరి నాట్య శాస్త్ర - మెళకువ వినిపించగా
హృది జలధిన కెరటమ్ములు - ఉవ్వెత్తున ఎగయగా
తన్మయత్వ వీచికలే - తావుల వెదజల్లగా
మైనమౌచు మనసు కరుగ - ఎద వినిచెను గానము
               జలజల ఝరి గమనము - జలతరంగ ధ్వానము
               ఇంద్రధనువు తోరణము - చిరుజల్లుల ప్రేరణము
               నీలి జలద విరిబోణికి - నీరెండకు కళ్యాణము
              కనుదోయికి పరిణయము - కమనీయము రమణీయము
              మైనమౌచు మనసు కరుగ - మది పాడెను గానము

Wednesday, 20 September 2017

జగదీశ మహాదేవా

జగదీశ మహాదేవా  రచన: చెరుకు రామ మోహన్ రావు

జగదీశ మహాదేవ చూపించుమయా త్రోవ
కైలాసమె నాగమ్యం నిను పొందినచో ధన్యం
1.విషనాగులు నగలయ్యా కంధరమున గరళమయా
తల నిండా జడలయ్యా తడియారక వుండునయా
ఇడుములు నీ సుఖమయ్యా నా యిడుములు బడయుమయా ll ll
2.నాదమునకు ఆదివయా వేదాల పునాదివయా
మందస్మిత వదన, దయా పరిపూరిత వపుషమయా
నే బాధల బందినయా నీ బాదర బందినయా ll ll
3.అమావాస్య విభావరిలో ఆక్రందన కలయికలో
నా ఆత్మ నివేదనలో నిను చేరిచి హృదయములో
అర్చించే గీతికలో అనుపల్లవి నీవయ్యా ll ll

Sunday, 17 September 2017

దీని భావమేమి

దీని భావమేమి 
జలదారంభ విజృంభమాణ ఘన చాంచల్య ఘోరార్భటీ
కలితాక్రందనతో నపాన ముఖ గంభీరంపు నాదమ్ముతో
చలియింపన్ మనసంత వ్యాకులముతోచాదస్తమొప్పారగా

పలికెన్ నామది పద్య రూపమున బల్ మత్తేభ ఘీంకారమై
అపాన వాయువు
 నాలుగు పాదములు సమాస బలమే 

Saturday, 16 September 2017

నేటి బ్రాహ్మణ యువత పోకడ

నేటి బ్రాహ్మణ యువత పోకడ
ఉపనయన కార్యమ్ములొనరించుటయెగాని
జంధ్యముల్ గూటమ్ము జతను గూడె
భుజము పై జంధ్యంపు ప్రొవులుండినగూడ
సంధ్య వార్చుట మలి సంధ్య జేరె
మంత్రముల్ గొణుగుట మాత్రముండినగూడ
మనసంత మగువలే మసలుచుండె
తర్పణంబులకెల్ల తర్పణము గావించి
తనదైన సుఖముకై తపన బడియెఁ
         రెంటికింజెడు రేవడ రీతి గాను
  నడచుచుండగ బ్రాహ్మణ నవత యువత
 నలువ తలలకు నెనరుతో నయముగాను
 అమృతాంజన మునుబూని యలదె వాణి

చెరుకు రామ మోహన్ రావు

Friday, 15 September 2017

కనరావదేల

కనరావదేల
తస్కరించ దలచినీవు తలపులోన నిలిచి నీవు
సత్కరించ దలచి నిన్ను సాంతము మది నింపినాను
అటులైనా ఇటులైనా ఎటులైనా లోలోపల
దోబూచులనాడనేల తోడుత కనరావదేల
                   వినువీధిన నడిఝామున వెల్ల రిక్క వెలుగు కలుగ
                   నీ వివరము తెలుసుకొనగ నిండుచందురుని చేరగ
                  జతనము నే జేయువేళ జాలి తలచి కానవేల
                  విరజాజులు వాడనేల వెతల నేను పడనేల
వడగాడుపు సుడిన నిలిచి వెడలలేక పడిగాపులు
గాయుచున్న దూదిపింజె కైవడి మది డోలికలు
దారిలేని గమనమాయె దరి గానని గమ్యమాయె
నిలకడయే లేకపోయె నీవు కానరావాయె                కోయిలమ్మ గళ మధురిమ కొంచెమైన వ  చెరుకు రామ మోహన్ రావు

Monday, 21 August 2017

హృదయము-మంత్రపుష్పము


హృదయము-మంత్రపుష్పము
ఆంగ్ల శబ్ద కోశములో HEART అన్న మాటకు అర్థమయితే ఇచ్చినారు కానీ దాని పుట్టుకను గూర్చి నేను పరిశీలించినంత మేరకు కానరాలేదు. నా ఉద్దేశ్యములో 'హృత్' శబ్దము నుండి HEART పుట్టివుంటుంది. మనలనుపాలించిన వారు కదా మన భాషను తమ భాషకు మాతగా ఒప్పుకొనుటకు ఆభిజాత్యము అడ్డము వచ్చి  యుండవచ్చు.
సంస్కృతములో మాత్రము నిరుక్తమున ఎంత హృద్యముగా 'హృదయము' అన్న మాటకు వ్యుత్పత్తి చెప్పినారో అది తెలిపిన వారి మేధస్సును వర్ణింప నాతరము కాదు. వారు హిమవన్నగము వంటివారయితే నావంటి వారందు పిపీలిక సమానులు (పిపీలికము=చీమ). ఈ శ్లోకమును గమనించండి:
తదేతత్ త్ర్వక్షరంహృదయమితి, హృత్ ఏకం మహాక్షరం ద ఇత్యేకాక్షరం
యమిత్యేకం యివం హరతేర్ దదాతేరాయతేర్ హృదయ శబ్ద నిరుక్తః
'హృ' అంటే హరతి = గ్రహించునది
'ద' అంటే దదాతి = తిరిగి ఇచ్చునది
'య' అంటే అయతి= ప్రవహింప జేయునది
మొత్తము గుండెయొక్క కార్యక్రమమంతా మూడు అక్షరములు కల ఒక పదములో వచ్చివేసినది. దీనిని 'సింధు' అనటము కూడా కద్దు. నదులు సంద్రమునకలిసి తిరిగి వర్షముతో నదులుగామారి సంద్రమున కలుస్తున్నాయో రక్తము కూడా గుండెతో అదే సంబంధమును నిరంతరమూ కలిగియున్నది కదా!
హృదయము యొక్క అర్థమును గూర్చి తెలుసుకొన్నాము. ఇపుడు ఆ హృదయమును గూర్చి వేదములోని మంత్రపుష్పమునందు ఏమి తెలిపినారో చూద్దాము.
మంత్రపుష్పమును విధిగా పూజల్లోనూ, వ్రతములలోనూ, దేవాలయములలోనూ పూజావసాన సమయమును చెబుతూ వుంటారు. అందువల్ల ఆ మంత్రమును మన హృదయమునకు సంబంధించిన మేరకు మీ ముందుంచుతూ నాకు చేతనయినంత వరకు  వివరించుతాను.
పద్మ కోశ ప్రతీకాశగ్౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మంత స్మిన్సర్వం ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా
సంతాపయతిస్వం దేహమపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ ||
మంత్రార్థమును తెలుపుటకు మునుపు మంత్రం పుష్పము అన్న పేరును గూర్చి తెలుసుకొందాము. పుష్పములు స్నిగ్ధత సౌకుమార్యము కలిగినవి. వానిలో శ్రేష్ఠతమమయినది తామర. అందుకే ఎర్ర తామర లక్ష్మీ నివాసమయితే తెల్లతామర వాణీ విలాసము. మన శరీరములో కూడా ఒక ఎర్రతామర మొగ్గ వుంది. మంత్రపుష్పము దాని గూర్చియే తెలుపుతుంది కాబట్టి అది మంత్రపుష్పము అయినదని నా ఊహ.
ఇపుడు ఈ మంత్రార్థమును నా శక్తి మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. నావేవయినా తప్పులు వుంటే విజ్ఞులు సవరించగలరు. హృదయము తలక్రిందులుగా వున్న తామర మొగ్గవలె భాసిల్లుచున్నది. నిష్ఠి అంటే తెలుగులో ముచ్చెన గుంత అంటారు. ఈ గుంత అటు కంఠానికీ ఇటు ఎదకు మధ్యన వుంటుంది. దానినుండి క్రిందికి వితశ్శాంతిఅంటే జానెడు దూరము, మరియు నాభ్యం ఉపరి అంటే బొడ్డునుండి పైకి జానెడు దూరములో ఈ మొగ్గ వున్నది. మరి కొలత ఏవిధముగా చేయాలి అన్నది తరువాతి సందేహము. కుడి ప్రక్కకా ఎడమ ప్రక్కకా లేక నిటారుగానా అన్న సందేహము వస్తుంది. నిటారుగా రెండు చేతులను ఉపయోగించి అటు నాభినుండి ఇటు నిష్ఠి నుండి లంబముగా అంటే నిటారుగా ఉంచితే రెండూ కలుస్తాయి. అందువల్ల అక్కడ అది లేదు అని తెలుస్తుంది. ఇక కుడి ఎడమ. గుండె 99 శాతము మానవులకు ఎడమవైపునే వుంటుంది కానీ 1 శాతము కుడివైపు కలిగినవారు కూడా వుంటారు. దీనిని Dextrocardia అంటారు ఆంగ్లములో. ఇది పారంపర్యముగా వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది. ఆంగ్లములో దీనిని congenital అంటారు. మరి పారంపర్యముగా వస్తూవుంది అన్నా కూడా దానికీ ఒక ఆది అన్నది ఉంటుందికదా! కాబట్టి మనము ‘కుడిఎడమయినా పొరబాటు లేదు’ అనుకోవలసి వస్తుంది. కాబట్టి మన రెండు చేతుల జానలను అటుగానీ ఇటు గానీ బొటన వ్రేళ్ళను ఆయా కేంద్రములనుడి కదిలించక చిటికెన వ్రేళ్ళను ఎడమకు (కుడి కూడా తీసుకొనవచ్చును అని చెప్పుకొన్నాము) కదిలించుతూ పోతే ఎక్కడ తాకబోతాయో అది హృదయస్థానము. కత్తులు కటార్లు ఈటెలు బాకులు వాడకుండా హృదయస్థానమును లక్షల సంవత్సరముల క్రితమే నిర్ణయించిన మన పూర్వీకుల ప్రతిభ, ప్రశస్తిని ఏమని ఎంతని పొగడ గలము. జ్వాల+ మాల+ ఆకులము అంటే నిప్పురవల మాల ను బోలుతూ చెదరుతూ అంటే చుట్టుప్రక్కల వ్యాపించుతూ వుంది.   విశ్వస్య ఆయతనం మహత్ అంటే ఈ విశ్వము యొక్క పుట్టుకకు మూలము అదియే! ఈ విషయమునే NASA(USA) కూడా ద్రువపరచడము జరిగింది. ఇంకా వారు భగవంతుడు ఇక్కడ ఉంటాడా అని పరిశోధనలు చేస్తున్నారట. ఒక్క విషయము ఆలోచించుదాము. మనిషిలో వేడి లుప్తమయితే మృతుడే! మరి వేడి ఉన్నంతవరకు మనిషి బ్రతి ఉన్నాడు. మరి ఆవేడికి కూడా మూలము ఉండవలెను కదా! ఆ మూలమే దేవుడు. ఆ మూలము ఎక్కడుంది ఆ మూలములో ఆయన ఎక్కడున్నాడు అన్నది చూద్దాము. సంతతగ్ం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం అంటే ఆ హృదయము వద్ద ఎల్లపుడు శిలాభిః (‘ర’’ల’యోరభేదః) అంటే శిరలు (శిలాభిః) లంబముగా ఆ పద్మ కోశమునకు ఆనుకొని వ్రేలాడుతున్నాయి. ఆ కోశమునకు అంతమందు సుషిరగ్ం  సూక్ష్మం అంటే మిక్కిలి చిన్నదియైన ఒక రంధ్రము వుంది. తస్మిన్, అందులో సర్వం ప్రతిష్ఠితం అంతా అందులోనే ప్రతిష్ఠింపబడి వుంది. అక్కడ అంటే ఆ రంధ్రములో మహత్తరమగు అగ్ని వుంది. దానివలననే ఈ ప్రపంచమంతా వెలుగుతూ వుంది.

    ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి ఉంటుంది. మరి ప్రకృతిలోని మానవేతర స్థావర జంగమములకు లోపల ఈ వెలుగు లేదా! అంటే వానికి మానవ భాషలో తెలిపినా అర్థము చేసుకోనలేవు. అందుకే వేదము మానవులకు చెప్పబడింది. మళ్ళీ విషయమునకు వస్తే అది విశ్వార్చిర్ విశ్వతోముఖః అంటే దానివలననే ఈ విశ్వము అంతా వెలుగుచున్నది ఎందుకంటే విశ్వతోముఖః అది ప్రపంచమంతా  వ్యాపించి యున్నది. విశ్వము వెలుగుతూ వుంటే మరి సూర్య చంద్రాగ్నులు అవసరము లేదు కదా! అంటే సూర్యుడు అగ్నిగోళం, చంద్రుడు, తనపైబడు సూర్య కిరానా పరావర్తనముచే మాత్రమే వెలుగుచున్నాడు. ఇక అగ్నిది ప్రకృతితో కాకుండా మానవునికి సంబంధించిన వరకు అది పరిమిత ప్రయోజకత్వమునే ప్రసాదించుతుంది. కాబట్టి ఆ మూడు లేకపోతే ప్రాణికోటి లేదు అని తలువ వచ్చును. కావున అవి వుంది తీరవలసిందే! మరి ఈ వెలుగు మాటేమిటి. మనము ప్రకృతిలో గమనించితే పచ్చటి చెట్లలో ఒక కాంతిని చూస్తాము. అది వాడిపోయిన చెట్లలో అగుపించదు. వయసులో వున్న యువతీయువకులలో వుండే కళ ముదుసలివారిలో చూడలేము. అంటే ఏ వెలుగయితే మనలో ఉన్నదని చెప్పుకొన్నామో అది మెల్లమెల్లగా అధోముఖము పడుతూ ఉందన్నమాట. అసలు రంగులతో నిమిత్తము లేకుండా దాదాపు సమానమగు వయసులో ఉన్నవారి మధ్యన కూడా వర్చస్సులో కాంతో భేదములను చూడవచ్చు. లోపలి వేలుగునుబట్టే బయట నిగారింపు కనబడుతూవుందన్నమాట. నేటికి కూడా తపోసాధకులగు గురువుల ముఖములు ఎంతో వెలుగుతో, ప్రసన్నతతో, ఇంకా చూడవలెననిపించే రీతిగా వుంటాయి. దానికి వారి సమగ్ర సాధనయే కారణము.
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః అంటే ఏ వెలుగును గురించియయితే ఇంతవరకూ మాట్లాడుకొన్నామో దాని మధ్యన ఒక అగ్ని శిఖ ఊర్ధ్వ ముఖముతో భాసిల్లుచూ వున్నది. అందులో అణువును బోలి ఊర్ధమునకు చూసే ఒక అంతశ్శిఖను కలిగియున్నది. నీలతోయదము అంటే వర్షము కురియుటకు సిద్దముగానున్న నీలమేఘము. దాని మధ్యలో మెరిసే మెరుపువలె ప్రస్ఫుటమగుచూ ఇక ఛేదించలేని అణు రూపమై ప్రభావించుతూ వున్నది. అదే మంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్
ఈ మెరుపులో, నీవార ధాన్యము యొక్క ముల్లు, (నేను చూడలేదు కానీ వడ్లగింజ కున్న ముల్లుతో పోల్చుకొన వచ్చును.) అంతటి చిన్న ముల్లు లాంటి వెలుగులో పరమ పరమాణు రూపములో ఊర్ధ్వముఖముగా ప్రజ్వరిల్లే జ్యోతి మధ్యలో పరమాత్మ నివసితూవున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రదులంతానేకాదు పరమస్వరాట్ అయిన సకలచరాచర సృష్టికి మూలకారకుడు కూడా వున్నాడు.
    ఇక్కడ Science పరముగా ఒక మాట చెప్పుకోనవలస్డినది వున్నది. మన గుండెలో sinoatrial node అనే ఒక స్థానం ఉంది, దానినుండి ఒక విద్యుత్తరంగము లాంటిది వెలువడి గుండెను పని చేయిస్తూ వుంది. దీనికి కొంత దూరంలో atrioventricular node  ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే గుండె పని చేస్తుంది. ఈ sinoatrial node  నుండి  విడుదలయ్యే విద్యుత్తు ఏవిధముగా పుడుతుంది అన్నది మన Scientists కు ఇంకా తెలిసిరాలేదు. , దీనినే pacemaker అని చెబుతున్నారు మన Scientists. గుండెను పని చేయించేది ఇదే. మన వేదములోని మంత్రపుష్పము దీని లోని ఆ అత్యంత పరమాణు రూపమునే పరమాత్మ అంటూ వుంది.
చివరిగా, చదివిన వారికి వచ్చే చిన్నదయినా అతి పెద్ద సందేహమును నాకు తెలిసిన రీతిలో తీర్చి నా వ్యాసమునకు భారత వాక్యము పలుకుతాను. ఆ వెలుగు మనకు కనబడుట లేదే? కనబడదా? ఎందుకు కనబడదు. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అన్న వేటూరి వారి మాట మీకు తెలిసినదే కదా! ఆ వెలుగును చూడగలిగిన వారే ఋషులయినారు. మరి మనమో, లోపల తళుక్కుమన్నపుడల్లా సంసారమో, పిల్లలో, అందమయిన అమ్మయిలనో/అబ్బాయిలనో సినిమాలనో, షికార్లనో చూసుకొంటూ ఇంకా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము.
ఇకనైనస మేలుకొని, మెలుకువలో కళ్ళు మూసుకొని అంతర్ముఖులమై అనుదినమూ ధ్యానించితే పరమాత్ముని మనలోనే సందర్శించగలము. దానికి అంతః శుద్ధి, బాహ్యశుద్ధి, త్రికరణ శుద్ధి తోడయితే అసలు మనమే పరమాత్మ స్వరూపులమని తెలుసుకొనగలుగుతాము.

స్వస్తి.

Saturday, 19 August 2017

శ్రేయాంసి బహు విఘ్నాని

శ్రేయాంసి బహు విఘ్నాని

'ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ' అన్నది భర్తృహరి సుభాషితము. నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే  యెంతో బాధ కలుగుతుంది. ఇది ఏ విధముగా ఉన్నదంటే 'అమ్మ పెట్టదు అడుక్కొనీ తిననివ్వదు' అన్నట్లుంది. శిశు ప్రసవము జరుగుటకు ఒక అరగంట లేక గంట పట్టినా ఆ తల్లి తొమ్మిది మాసములు ఆ శిశువును ఎంతో జాగ్రత్తగా కడుపులో పెట్టుకొని చూసుకొంటుంది. వ్యాస వాల్మీకులు ఇరువురూ 'క్షమయా నిష్ఠితాం జగత్ ' అన్నారు. అదీ కాక
 ' శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి
   అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాంతి వినాయకాః'
లోక శ్రేయస్సు కొరకు పాటుపడే మహనీయులకు విఘ్నాలు కొల్లలు. అదే హీనకార్యనులను ఆచరించే వారికి విఘ్నాలు కూడా విపరీతమైన దూరములో ఉండును, అన్నది ఆర్య వాక్కు. మరి పైన చెప్పిన విషయములలో ఒకదానిని గూర్చియైనా మన ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఆలోచిస్తున్నారా! ప్రభుత్వము చెడుగు మాత్రమె చేయుటకు ఏమయినా కంకణము కట్టుకోన్నదా! ఇపుడుప్రభుత్వము చేపట్టిన ఈ 'విముద్రీకరణ (demonetisation)' ప్రక్రియను తీసుకొందాము.నోట్ల మార్పిడి లో కష్టాలు లేవని కాదు, ఎవరికైనా కష్టం వస్తే స్వాంతన పలుకవలసినప్రసార మాధ్యమాలు మానవ సహజమైన వైఫల్యములను ప్రత్యేకముగా ఎత్తి చూపుతూ ప్రభుత్వమును విమర్శించుట అత్యంత బాధాకరమైన విషయము.,  ప్రభుత్వమూ యొక్క నోట్ల మార్పిడి విషయములో ప్రసార మాధ్యమాలు అనుసరిస్తున్న విధానము ఎంత దుఃఖదాయకమైన విషయమొ గమనించండి.

1. రెండున్నర లక్షల వరకూ యెవరైనా బాంక్ లో జమ చేసుకోవచ్చు అన్న విషయమును ప్రజా బాహుళ్యమునందు ఎంతయినా ప్రచారము చేయవచ్చును కదా!
 2. పొలం అమ్మిన డబ్బులు బాంక్ లో వేసుకోవచ్చు. మహా అయితే కొంత టాక్స్ కట్టాలి అంతే కానీ చింత పడ నవసరము లేదని చెప్పకుండా, పదే పదే కష్టాలు మాత్రమే చూపినందుకు, అవునేమో అని నమ్మి 52 లక్షలు ఉన్న ఒక మహిళ ఆత్మ హత్య చేసుకొంది. ఈ ఉదంతము జరిగిన పిదపనైనా ప్రసార మాధ్యమములవారు ఒక్కసారయినా ఆత్మా విమర్శ చేసుకొన్న దాఖలాలు కనిపిస్తున్నాయా?
3. 73 సంవత్సరాల వృద్ధుడుపంక్తి(Que) లో నిలబడలేక చనిపోయినాడని చెప్పే మీడియా అక్కడ క్యూ లో ఉన్న వారు ఆ వృద్దుని ముందుగా పంపియుంటే ఈ ఘోరము జరిగియుండేదికాదు, అని తెలియజేయగాలిగినారా!  మరి మన పాత్రికేయులు, దూర శ్రావని, దూర దర్శిని మాధ్యమాలలో ఆ సంస్కారం  లేకపోయింది కదా! ఇది తమ పొరబాటుగా, పొరపాటుననైనా తలచినారా?
4. ఈ వాస్తవాన్ని ఒకపరి గమనించండి. జపాన్ లో సునామీ వచ్చినపుడు, వచ్చిన రోజుమొదలు పరిస్థితి చక్కబడే వరకు, అచటి  ప్రతి వ్యాపారస్తుడు తాము విక్రయములను తగ్గింపు ధరలకు వస్తువులనమ్మి  ప్రజలకు సేవ చేసిన విషయం ప్రసారం చేసి ఉంటే కనీసం కొంత మంది అయినా ప్రభావితం అయ్యే వారు కాదా! మన వ్యాపారులు తమ లాభములలో కొంత తగ్గించుకొని అమ్మితే దేశమునకు , ప్రజలకు సేవచేసినట్లగునని ఎందుకు తెలియజేయ కూడదు?
5. సునామీ నుండీ జపాన్ తేరుకొనుటకు 10 రోజులు పట్టినా, ప్రభుత్వ కార్య నిర్వాహకులు, ఎవరి వస్తువులు వారికిచ్చినారు. అందుకే కదా అది చిన్న దేశం అయినా ప్రపంచంలో అంతా గౌరవంగా బ్రతుకుతోంది. మరి ఈ విషయమును ప్రసారం చేసి ఉంటే బాగుండేది కాదా!
6.అమెరికాలో జంట టవర్లు కూలిపోయినపుడు,ప్రతిపక్ష పార్టీ లు గాని ప్రజలు కాని ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు.మీడియా కూడా తప్పుడు వార్తలు వ్రాయకపోగా, ప్రజలకు ధైర్యము కలిగించే వార్తలు మాత్రమే వ్రాసినారు. ఆవిధముగా చేయుటచే అమెరికా తన పెద్దరికము 
మన దేశము లో మీడియా చేస్తున్న మేలు కన్నా కీడు యెక్కువగా ఉంది.
యెక్కువగా మీడియా ప్రసారాలు చూస్తే అసలు దేశములో జీవించే అవకాశం లేదేమో అనే అనుమానం మనకే కలుగుతుంది.
ఈ మీడియాకు  సరి అయిన దిశానిర్దేశం యెప్పుడు యే కోర్టు ఇస్తుందో అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఒక్క సారి మన వీర సైనికులు పడుతున్న కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మూడు నాలుగు గంటల క్యూలో కరెన్సీ  మార్చుకునే కష్టం యెంత.
నల్ల ధనం తో టెర్రరిస్ట్లు పేట్రేగిపోతుంటే 70 సంవత్సరాలు ఈఁ దేశాన్ని అస్థిరపరిచే  నల్ల కుబేరుల భరతం పట్టే దమ్మున్న నాయకుడు మన ప్రధాన మంత్రి అని గర్వపడే ప్రతి పౌరులకు నమస్సులు.
మీడియా యెంతగా   ప్రయత్నించినా క కా పార్టీ లు యెన్ని తప్పుడు కూతలు కూసినా కొన్ని రోజులు చిన్న చిన్న కష్టాలు ఉన్నా ఇప్పటికైనా ఒక గొప్ప నాయకుడు మన దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మేమూ సహకరిద్దాము   అని మీడియా మైకుకు చెప్పిన హీరోల్లారా జోహార్ జోహార్.
అసలు ఇంట్లో 100, 50, 10 నోట్లే లేనట్లు ప్రతి పేదవాడు కేవలము 500 లేదా 1000 నోట్లు మాత్రమే ఉన్నట్లుగా చూపిన ఓ మీడియా ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకో.
సారీ మీకు రేటింగ్స్  పెంచుకోవడం తప్ప మరేమీ అవసరం లేదనుకోండి.
దేశం యేమైనా మా చానల్ రేటింగ్ మాకు చాలు అనే కుటిల మీడియా కారణముగా మీడియా పై నమ్మకం పోగొట్టే అవకాశం ఉంది.
యెప్పుడూ నిరాశా నిస్పృహ వార్తలే కాకుండా మంచి వార్తలు ప్రసారం చేసి పుణ్యం తెచ్చుకోండి
"సత్యం వధ ధర్మం చెర "
శ్రీ రావు గారి సౌజన్యముతో ........