Monday, 23 September 2019

సౌందర్య లహరి 28వ శ్లోకము


సౌందర్య లహరి-28వ శ్లోకము
https://cherukuramamohanrao.blogspot.com/2019/09/28.html
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
విపద్యన్తే విశ్వే విధి-శతమఖాద్యాదివిషదః |
కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జననితాటఙ్క మహిమా || 28 ||
ఈ శ్లోకార్థమును విస్తరించుటకు పూర్వము ఈ భాగవత పద్యమును ఒకపరి పరికించుదాము.
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (అష్టమ స్కందము 241 పద్యము)
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే
మ్రింగెడిది కాలకూట విషము, అది అన్యులకు అసాధ్యము అని తెలిసి కూడ లోకులకు మేలు జరుగుతుందను సదుద్దేశ్యముతో, కట్టుకొన్న భర్తకు గల సామర్థ్యము తెలిసినదగుటయూ అంతకన్నా తన మాంగళ్య బలముపై అపారమగు నమ్మకము కలిగినదియై యుండుటచే పార్వతీదేవి శివుని  హాలాహల భక్షణకు సమ్మతించింది.
ఈ పద్యమున శబ్దార్థసౌందర్యము అపారము. తాను తన భర్త శరీరంలో సగభాగమును పంచుకొన్నది.  మరి ఆ జగజ్జనని ఎట్లు ఒప్పుకొన్నది అని  పరీక్షిత్తునకే సందేహము కలిగి  అడిగితే శుకుడు చెప్పిన సమాదానము ఈ పద్యము. మ్రింగ్ మ్రింగ్ (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అన్న ఈ ధ్వని అటు కఠమునకు, ఇటు గరళమునకు సంబంధించినది కాగా అదే కంఠమునకు మంగళ మంగళ అంటూ అమ్మ మంగళ సూత్రము సమాధాన పరచుచున్నట్టి తీరును ప్రదర్శింపజేస్తూ వ్రాసిన ఈ పద్యము ఎంతటి భావ గర్భితమో! గరళంఅన్న పదమునకు మధ్యలో ‘ర’ ఉన్నది. ‘ర’ అన్న అక్షరమునకు ఎకార్థ నిఘంటువులో అగ్ని అన్న అర్థము ఉన్నది. దహించుట దీని గుణము. మరి గరళం యొక్క గుణము కూడా దహించడమే కదా! ఆ ‘ర’ గళమును దహించకుండా గళమును కాపాడినది మంగళ. అటువంటి ‘మంగళ’ కలిగినటువంటి శక్తియే ‘మాంగళ్యము’. మాంగళ్యమును గల్గిన స్త్రీని ముత్తైదువ అంటారు. ముత్త+ఐదువ= ముత్తైదువ.
నాకు తెలిసి ముత్త అన్న మాటకు ముదుసలి లేక వయసు మీరినది అన్న అర్థమును చెప్పుకొనవచ్చును. అంటే పూర్వము బాల్యములోనే వివాహము జరిగేది కాబట్టి ఒక 35 సంవత్సరముల యువతిని ముత్తయిదువ అనవచ్చునని నా అభిప్రాయము. ఎందుకంటే ఆమెకు అప్పటికి తమ పరివార ఆచారవ్యవహారాలనీ అవగతమై ఉంటాయి. ఇక ఐదువ అంటే ఐదు వన్నెలు కల్గినది. వన్నెలు అన్నమాట ఎంతో మంచి అర్థముతో కూడినది. ఈ ఐదు వన్నెలు ఏవేవంటే
1.    పసుపు, 2. కుంకుమ, 3. గాజులు, 4. కాటుక, 5. చెవ్వాకు.
మొదటి నాలుగూ తెలిసినవే. మరి చెవ్వాకు అంటే ఏమిటి? ఇది ఒక సందేహము. రెండవది ఏమిటంటే మరి తాళిబొట్టు ఉంటేనే కదా ముత్తైదువ అంటారు? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానము ఒకటే! చెవ్వాకు అన్నది వేరేమీ కాదు ‘తాటియాకు’. దీనిని తాళపత్రము అంటారు. తాళము అన్న మాటనుకూడా పర్యాయముగా వాడుతారు. ‘తాళ’ శబ్దము నుండి పుట్టినదే ‘తాళి’. పూర్వము ఈ తాళమును చెవికి కమ్మలుగానూ, ముక్కుకు నత్తు గానూ, కంఠానికి తాళిబొట్టుగానూ వాడేవారు. చెవ్వాకు అన్న పదము అక్కడ ‘తాళము’ అన్న అర్థములోనే వాడబడింది. అందుకే మగలసూత్రము పేరు ఐదువలో చేర్చబడలేదు.
ఇప్పుడు మనకు మాంగళ్యగరిమ అంటే ఏమిటో తెలిసినది.
ఇక తాటంకముల గూర్చి తెలుసుకొందాము.
లలితా సహస్ర నామములో ఒకనామము ‘తాటంక యుగళీ భూత తపనోడుప మండలా’ అని అనటం జరిగింది.
తాటంక యుగళి + భూత=కుండల ద్వయము కల్గిన, తపన ఉడుప మండల= వెలుగు వేడిమినిచ్చే నక్షత్రమండలము అంటే సూర్యచంద్రులు కల్గిన సమస్త ఆకాశము అని అర్థము. అంటే ఇక్కడ కుండలములు ఒకటి సూర్యుడయితే మరియొకటి చంద్రుడు. అంటే ఆ రెండుతాటంకములూ గరళములోని ‘ర’ ను తాముగ్రహించివేస్తాయి. అందువల్ల పరమేశుడు కాలకాలుడైనాడు. ఇది ఎందువల్ల అంటే 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అన్నది శాస్త్ర వచనము. అట్లే వనస్పతులకు, వనౌషధములకు అధిపతి చంద్రుడు. అంటే ఆరోగ్య దాత సూర్యుడు ఔషధనేత చంద్రుడు. మరి వారిరువురి చూపు కాలకంఠుని కంఠము పై నుంటే  గళము లోని 
గరళము ఆయనేమిచేయగలదు. ఇంకా కొంత సందేహము ఉండిపోయే అవకాశము ఉంది. అసలు సూర్యచంద్రులు తాటంకాలేమిటి అని? అమ్మవారు విశ్వరూపిణి. ఆకాశమంతా నిండిన ఆతల్లికి అటువైపు సూర్యుడు ఇటువైపు చంద్రుడు ఉంటారు కదా! ఆకాశారూపినియైన అమ్మకు ప్రతీకాత్మకముగా సేడురేడురుగా ఉండే సూర్య చంద్రులను తాతంకములుగా జగద్గురువులు వర్ణించుట జరిగినది.
కంచిలో కామాక్షి అమ్మవారు ఆకాశ స్వరూపిణిగా కొలవబడుతున్నది.  విశ్వాంతరాళమంతటా వ్యాపించిన ప్రకాశ స్వరూపిణియే కామాక్షి. అందుకే ఆమె సిద్ధాసనములో కూర్చున్న పీఠము నేలను అంటదు అని ప్రశస్తి. పైగా ఆకాశం శబ్దగుణయుక్తము. శబ్దము తెలిసేది చెవిద్వారానే, అంతేకాకుండా  ఆ ఆకాశంలోనే కదా సూర్య చంద్రులు కూడా ఉండేది. అక్కడ శబ్దగుణకమైన ఆకాశానికీ, శబ్దాలను వినే చెవులకూ, వానికి పెట్టుకునే ఆభరణాలకు సామ్యము ఇక్కడ కుదిరుతుంది. ఆకాశంలో ఒక వేపు సూర్యుడు మరోవేపు చంద్రుడు రెండు వేపులా రెండు, కాబట్టి ఆ ఆకాశస్వరూపంగా ఉన్న అమ్మవారికున్న శబ్దాన్ని గ్రహించే చెవులకు ఆభరణములుగా సూర్యచంద్రులను చెప్పినారు భగవత్పాదులు. ఇప్పుడు సందేహము సమసిపోయి ఉంటుంది.
ఇప్పుడు శ్లోకము యొక్క అర్థమును అన్వయమును చూద్దాము.
 భావము: తల్లీ! భయంకరమైన జరామృత్యువులను సరకు చేయని సుధ అంటే  అమృతమును త్రావి కూడా బ్రహ్మేంద్రాది దేవత లందరూ కల్పాంతమున మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన పరమేశ్వరుడు కాలకూటము భుజించి కూడా మృత్యువునకు మృత్యువై నిలచియున్నాడు. దానికి కారణము నీ కర్ణాభరణములగు తాటంకములే కానీ అన్యథా కాదు.
మనము పైన చెప్పుకొన్న తాళి తాటంకముల బలమే ఈశ్వరుని రక్షగా, మహా ప్రళయములో కూడా నిలిచి క్ష్వేళ అనగా హాలాహలము నుండి ఇసుమంత ఆపద కూడా పొందనీయక కాపాడుతూ వుంది.
కాళిదాసు ఒక శ్లోకంలో “తాళీ పలాశ తాటంకామ్” అని వాడినారు. తాళ, తాళి అంటే తాడిచెట్టు. పలాసమంటే మోదుగ చెట్టు అన్న ప్రసిద్ధార్థము ఉండగా, పచ్చియాకు అన్న అర్థం కూడా ఉన్నది. కాబట్టి తాళీ పలాశమంటే పచ్చి తాటియాకు అని అర్థము.
కాలము మారి తాళమును తాళముతో బంధించి బంగారునాకు తాళము వేయుచున్నాము. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవన విధానమును వదులుకొని బంగారు వెనుక పరిగెత్తుచున్నాము.
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం

విపద్యన్తే విశ్వే విధి-శతమఖాద్యాదివిషదః |
కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జననితాటఙ్క మహిమా || 28 ||

జగద్గురు ఆదిశంకరులవారు పైనాలుగు పాదముల ఈ శ్లోకములో చిన్ని బుర్ర కలిగిన అపండితుడనైన  నాతో ఇంత వ్రాయించినాడు. మరి పాండితీ మేరువులైతే ఎంత గొప్పగా చెప్పే వారో కదా!
స్వస్తి.

Wednesday, 28 August 2019

రామాయణము - ఇండోనేషియా


రామాయణము - ఇండోనేషియా
  https://cherukuramamohanrao.blogspot.com/2019/08/blog-post_28.html
శీర్షికను చదువుతూనే నా వంటి సామాన్య పాఠకునికి  ఏమనిపిస్తుందంటే, రామాయణము నకు ఇండోనేషియాకు 'అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు' ఉన్న సంబంధమనిపిస్తుంది. నిజమే! కానీ అబ్దుల్ ఖాదర్ కు అమావాస్యకు సంబంధము ఉన్నది అని చెప్పుటకు ఈ శీర్షికను ఈ వ్యాసమునకు ఎన్నుకొన్నాను. భారత దేశానికి ఆగ్నేయ దిశలో (South East) ఇండోనేషియా ఉన్నది. ఇక్కడి జనాభాలో ఇంచుమించు 85% ప్రజలు లో ముస్లిములు. మిగిలిన వారిలో 7% హిందువులు. 9% క్రైస్తవులు. 2% బౌద్ధులు.
నిజానికి ఈ దేశము వైశాల్యములో అతి పెద్దది. ప్రపంచ జనాభాలో కూడా నాలుగవ స్థానాన్ని ఆక్రమించుతుంది. ఇది 18110 చిన్న, పెద్ద ద్వీపముల సమూహము ఇది. ఇందులో జనావాసము కలిగిన ద్వీపములు సుమారుగా 6000. ఇంచుమించు 24,00,00,000 జనాభా కలిగిన పెద్ద దేశమిది. ఇది Greater Sunda Islands, Lesser Sunda Islands గా విభజింపబడి వున్నది. మనము రామాయణములో sunda ఉపసుందులను గూర్చి వింటాము. ఇండోనేషియా లోని మొత్తము ద్వీపములను జయించి రాజ్యమును ఇద్దరు అన్నదమ్ములు పంచుకొని, సుంద ద్వీపము ఉపసుంద ద్వీపమను పేర్లతో పరిపాలించుతారు ఈ ప్రాంతాన్ని. నోరుతిరుగని పాశాత్యులు వీనిని Greater Sunda (అన్న) Islands, Lesser Sunda (ఉపసున్దుడు అనగా తమ్ముడగు సుందుడు) Islands అని అన్నారు. భారతములో హిరణ్యకశిపుని వంశజుడైన నికుంభుని పుత్రులుగా ఒక సుందోపసుందులను చూస్తాము. రామాయణములో వచ్చే సుందోపసుందులు వేరు అని తెలియ వస్తూవుంది. వీరు జంభుని పుత్రులు. రామాయణమునందు సుందుడు అగస్త్యుని శాపముచే మరణించినట్లు తెలియవస్తూ వున్నది.
ఈ గ్రేటర్ sunda లో జావా, బోర్నియో, సుమత్రా, సులావేశి అన్నవి అతి ముఖ్య ద్వీపములు. హిందూ సభ్యతా సంస్కృతులకు ఆలవాలమైన బాలీ ద్వీపము Lesser Sunda Islands లో వస్తుంది. ఇంకా ఇందులో లోంబాక్, సున్బావా, టిమోర్, బారత్ దయా ద్వీపములు కాక ఇంకా ఎన్నో ద్వీపములు వస్తాయి. ‘ఈ ‘బారత్ దయ’ అన్న పేరు వెనుక గల చరిత్ర ను గూర్చి తెలుసుకొనుటకు ఎవరయినా ప్రయత్నము చేసి వుంటే బాగుండేదేమో!

రామాయణ కాలముననే ఈ దేశము ప్రముఖమైన చరిత్ర కలిగి ఉన్నది. ఇందులో మూడు ముఖ్యమైన రాజ కుటుంబాలు మనకు కనిపిస్తాయి. మొదటి కుటుంబము ‘జవ’ చక్రవర్తిది. ఆయన పేరుతోనే జావా ఏర్పడినది. ఈ జవుని భార్య పేరు శతహ్లద. జవ అన్న సంస్కృత పదమునకు వాడి వేగము అన్న అర్థము కనిపించుతుంది నిఘంటువులో!. శత అన్న పదమునకు నూరు అన్న అర్థమే కాకుండా అనేకము అన్న అర్థము కూడా కలదు. శతహ్లద అంటే అందరినీ తన ప్రియవచనములతో గానీ తగురీతి సత్కరించుతలోగానీ ఎలోటూ లేకుండా   ఆనంద పరచేది అని అనుకొన వచ్చును. వీరి కుమారుడు విరాధుడు. నిజానికి యీతడు గంధర్వుడగు తుంబురుడు. గంధర్వరాజగు కుబేరుని శాపముచే/ నారదుని శాపమనికూడా అంటారు, ఈయన పై దంపతులకు పుత్రునిగా జన్మించినాడు. ఎవరివలననూ సంతృప్తిని పొందనివాడు కావున విరాధుడని పిలువబడినాడు.
ఇండోనేషియాకు చెందినదై ఆస్ట్రేలియా కు దగ్గరగా Timor అన్న ద్వీపము ఉన్నది. ఇది రామాయణ కాలములో తుంబుర ద్వీపముగా పిలువ బడేది.ఈయన యక్షుడు. ఇండోనేషియాను పాశాత్య్లు కబళించినతరువాత ఈ ప్రాంతమును, తుంబుర ద్వీపమని పలుకలేక తుమ్బోరు, తిమ్బోరు చివరకు Timor గా మార్చినారు.  తుంబురుడు నారదునికి సమానమగు సంగీత విద్వాంసుడు. శాప వశాత్తు జవ, శతహ్లద పుత్రునిగా జన్మించుతాడు. ఈతడు రాక్షస ప్రవృత్తి అధికముగా కలుగుటచే తనకు తగినదియైన రాక్షసనిలయమగు దండకారణ్యమని తలచి అచటికి వెళ్ళిపోతాడు.
వాల్మీకి రామాయణములోని 3వదగు అరణ్య కాండలోని 3వ సర్గలోని 5\6 శ్లోకములో తన తల్లిదండ్రులను గూర్చి విరాధుడే రామలక్ష్మణులకు ఈ క్రింది శ్లోకము ద్వారా తెలియజేస్తాడు.
పుత్రః కిల జవస్వాహం మరుమాతా శతహ్లదాl
విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వ రాక్షసాం ll
బాల కాండ లోని 25వ సర్గలో
5, 6, 7, 8, 9 శ్లోకాలను ఒకసారి పరికించుదాము.ఈ శ్లోకముల సారాంశమును మాత్రము ఇక్కడ తెలియజేసుకొంటాను.ఇక్కడ తాటక వృత్తాంతము మనకు తెలియవస్తుంది. పూర్వము పరాక్రమ వంతుడు, సద్వర్తనుడు అగు సుకేతువు అన్న ఒక యక్షుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సుచేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై వారము కోరుకొమ్మంటే, అపుత్రుడగు అతడు, పుత్ర భిక్షను కోరినాడు. బ్రహ్మ ఆతనికి పుత్రికనొసగి ఆమెకు రూప లావణ్యములతో కూడా 1000 ఏనుగుల బలము ఉంటుంది అని చెప్పినాడు. కాలాంతరములో ఆమె అసురుడగు జంభ పుత్రుడగు సుందుని భార్య అయినది. వారికి శాపగ్రస్తుడగు రాక్షస ప్రవృత్తిగల మారీచుడు జన్మించినాడు. దీనివల్ల సుకేతువు రాజ్యము కూడా జంభుని రాజ్యములో కలియుటతో మొత్తము ఇండోనేషియాను సుంద ఉపసుందులు పాలించుట జరిగినది. అట్లే ఉపసున్డునికీ సుబాహు జన్మించినాడు. సుందోపసుందులవలె వీరిరువురు గూడా అన్యోన్యముగా ఉండేవారు. వీరు సుశిక్షితులు మరియు రావణ సేనాధిపతులు. రావణుడు అసురేంద్రుడు కాబట్టి వీరు రావణ సామ్రాజ్యమునకు బహుశ సామంతులుగా ఉంటూ సైన్యాధిపతి సేవలను అందించేవారేమో! దీనిని బట్టి ఇండోనేషియాను యక్షులు, అసురులు, శాపవశాత్తు రాక్షసులైనవారు పరిపాలించినారని తెలియవస్తూవున్నది.
అసలు బాల కాండ 25వ సర్గలో  శ్రీరాముడు విశ్వామిత్రుని మన మనసులో రేకెత్తే ప్రశ్న అడుగుతాడు.
అల్పవీరా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగసహస్రస్య ధారయత్యబలాబలమ్ ||
అంటే 'ఓ మునిపుంగవా ! యక్షులు అల్పవీరులు అని వినబడడమైనది. అందువలన అబల అయిన ఆమె ఎట్లు వేయిఏనుగుల బలము కలిగియున్నది?' అని . దీనినిబట్టి యక్షులు అల్పవీరులు అందుచేతనే మహావీరులైన అసురులకు తమ కన్యలను ఇచ్చేవారని తెలియవ్స్తూ వుంది. ఇక తాటకిని గూర్చి పైన ముందుగానే చెప్పుకొన్నాము. వీరంతా రాక్షసాక్రుతి దాల్చినంతనే దండకారణ్యము తమకు బలమగు నెలవని తలచినట్లు తెలియవచ్చుచున్నది. అందుకే అంతా అక్కడకు చేరినారు.
ఈ విధముగా రామాయణ కాలమునకు ఇండోనేషియాకు అతుకు పడని సంబంధముంది. నేటికి కూడా అనేకములగు రామ విగ్రహములో రహదారి కూడళ్ళలో మనకు దర్శనమిస్తాయి. 251 అడుగుల విగ్రహము అచట కలదని విన్నాము. అంతేకాక రామాయణ పాత్రల యొక్క అనేక విగ్రహములను మనము ఆ దేశములో చూడవచ్చు. వారి నానేములపై గణేశుని విగ్రహ ముంటుంది. వారి వైమానిక సంస్తపేరు గరుడ. ఆ దేశాధ్యక్షుడు అమెరికాకు ఇచ్చిన బహుమతి సరస్వతీదేవి విగ్రహము. ఇక్కడి పరంబనన్ దేవాలయము ఎంతో సుప్రసిద్ధిచెందినది. ఈ దేశములో సుప్రసిద్ధి చెందినా దేవాలయములు పది ఉన్నాయని విన్నాను. ఇంతటి అనుబంధము ఉంది మనకు ఇండోనేషియాకు. వారి దేశీయ కావ్య గ్రంధము రామాయణము. వాళ్ళు ముస్లిములైనా ప్రతి తల్లీ తన తనయుడికి రామాయణము ఉగ్గుపలతోపోసి వారికి రుజువర్తన నేర్పుతుంది. ఒకనాటి ఆదేశపు అధ్యక్షులపేర్లు సుకర్నో, సుకర్నో పుత్రి, సుహార్తో. వారి స్వాతంత్ర్య దినమగు డిసెంబర్ 27ణ మహా వైభవముగా రామాయణ నృత్యనాతికను ప్రదర్శించుతఎగాక యువకులంతా హనుమద్ వేషధారులై మనకు కనిపిస్తారు.  అందుకే మనదేశమునకు గౌరవమిస్తూ Indo అన్న మాటను తమ దేశము పేరునకు ముందు తగిలించుకోన్నారేమో!
రాముని భగవత్స్వరూపునిగా ఎంచి మనము ఆయన విగ్రహములను గుళ్ళలోనే ఉంచుతారనుకోవచ్చు. మరి చిన్న చిన్న సందేశములతో పాండవుల శిల్పములను ప్రముఖ వీధుల కూడళ్ళలో ఉంచితే యువతలో తమ పూర్వులు ఘనులు అన్న విశ్వాసముతో ఉత్తేజితులుకారా!
యువకులారా ప్రపంచమునకు జ్ఞానము పంచిన ఈ దేశములో పుట్టినందుకు గర్వించుదాం.
వందేమాతరం అని మనసారా తలుద్దాం.
స్వస్తి.

Saturday, 24 August 2019

శ్రీరాముని తదనంతర వంశావళి


శ్రీరాముని తదనంతర వంశావళి
శ్రీరాముని తదనంతరం పెద్ద కుమారుడైన కుశుని మొదలు,నాకు తెలిసి 'రఘువంశం'(కాళీదాసు విరచిత ) ప్రకారము ఈ వరుసలో వుంది.
కుశ ,అతిధి, నిషధ,నల,నభస,పుండరీక,క్షేమధన్వ,దేవానీక,ఆహీనస,పారియాత్ర, దళ,ఉన్నాభ(ఉక్త),వజ్రనాభ,శంఖణ,వ్యుషితాశ్వ,విశ్వసహ, హిరణ్యనాభ,పుష్య, బ్రాహ్మిష్ఠ,ధృవసంధి,సుదర్శన,అగ్నివర్ణ,శీఘ్ర, మరు,ప్రసుశ్రుత, సుసంది,అమరశ,విసృతవంత, బృహద్బల .
రామాయణము 'మైత్' కాదు ,రాముని తరువాత కూడా ఎందరో వారి సంతతి వారు ఏలినారని తెలియ బరచుటకు వ్రాసినాను. రాముని పిదప గుర్తు పెట్టుకొనుటకు అంతటివారేరీ . రాజైయుండి ఏకపత్నీ వ్రతము ను పాటించిన మహానుభావుడాయన. ఆయన పిమ్మట వచ్చిన కుశునకు ఇద్దరు భార్యలు అని చదివినట్లు గుర్తు . చివరి వాడయిన బృహద్బలుడు ద్వాపరమున కౌరవుల పక్షమున యుద్ధము చేసి విగతుడైనాడు. 

Thursday, 22 August 2019

సమస్య మనది - సలహా గీతది


సమస్య మనది - సలహా గీతది
పై శీర్షిక క్రింద నేను వీలు దొరికినపుడల్లా ఒక్కొక్క సమస్య తీసుకొని దానిని విశ్లేషించి గీత బోధించే పరిష్కార మార్గమును తెలియజేస్తూ వస్తూవున్నాను. భగవద్గీత 3వ అధ్యాయమును గతములో చదివినా,  ఈ పర్యాయము తిరిగీ చదువు సమయములో అందుగల 36 నుండి 41 వరకు గల శ్లోకములు నన్ను ఆకర్షించినవి. ఇందలి ప్రత్యేకత ఏమిటన ఇక్కడ ప్రపంచములోని  ప్రతి మానవునికి కలిగే సందేహమును తీర్చుటకు కంకణము కట్టుకొని అడిగినాడా అన్నట్లు పరమాత్మునికి తన సందేహమును నివేదించుచున్నాడు. అసలు ఈ కోతివంటి మనసును, అవాంచిత ద్వేషాలు,ఆపదలను కోరి కొనితెచ్చుకొనే ఉద్వేగాలు ఎందుకు కలుగుతున్నాయి. వాటిని ఎందుకు అణుచుకోలేక ఆ బాటలో పయనించి అనర్థములు కొనితెచ్చుకొంటున్నాము. వీని మూల కారణమేమి? ఈ మాయాజాలపు మరుగునపడి మంచిని మనసు చేసే వంచనకు బలి చేయవలసిందేనా!

ఈ జాతిల సమస్యకు పరమాత్ముడు కూడా తన సమాధానమును విస్తారముగా అందరికీ సులభమగు రీతిలో తెలియజేయుచున్నాడు. అందువలన నేను 36నుండి 41 వరకు గల అన్ని శ్లోకములనూ నాచేతనగు రీతిలో తెలియజేయబోవుచున్నాను. ఇది ఏకాంతములో కూర్చుని తత్వ విచారణ చేసుకొనే ప్రతి జిజ్ఞాసువుకు కలిగే సందేహమే! పరిష్కారమును చదివి ఆచరణలో పెట్ట ప్రారంభించండి.
నేను బాంకి సేవ చేసిన వాడిని కాబట్టి బాంకికి సంబంధించిన ఒక విషయమును మీకు తెలియజేస్తాను. ఇది జరిగినదా లేక కల్పితమా అన్న చర్చ మనకు అనవసరము. అందువల్ల, కావలసిన మేరకు, కేవలము విషయ పరిశీలనకు మాత్రమే అంకితమౌదాము.
ఒకానొక బాంకి శాఖలో నా సహోద్యోగి ఒకతను ఉండేవాడు. ఆయనకు కాళ్ళు వున్నా అవి కట్టెపుల్లలవలె అతి సన్నగా ఉండుటవల్ల చంకలో తగువిధమగు దండముల సహాయముతో నడచేవాడు. ఒక్క శౌచాలయము, మరియు మధ్యాహ్న భోజనమునకు తప్ప ప్రక్కకు కదిలేవాడు కాదు. బ్రాంచ్ కస్టమర్ల వద్దనుండి అపారమైన మంచిపేరు సంపాదించినాడు. అది అమితముగా ప్రాకి NRI లకు చేరింది. దాంతో ఆయనను ఆ NRI సీటు నుండి కదిలించుట జరుగలేదు. పువ్వులో సువాసన, పుప్పొడి మాత్రమె కాకుండా పురుగులు కూడా చేరినట్లు అతనికి బుద్ధి  గతితప్పింది. ఏ బలహీనమైన క్షణములోనో మనసు పెట్టిన ప్రలోభానికి లోనయినాడు. బాంక్ లో ఒక transaction పూర్తి అగుటకు ముగ్గురు నలుగురు దోహదపడవలసి ఉంటుంది. తప్పు చేయదలచినవాడు తానూ చేయబోవు పనిని ఎన్నో కోణాలలో పరిశీలించి ఒక పథకము ప్రకారమూ అమలుపరచుతాడు. మిగతావారు అది తాము చేసే సాధారణమగు పనిగానే తలచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోరు. అందువల్ల అతడు చేసిన నేరములో తమ ప్రమేయములేకనే నిస్వార్థ పరులు, ఉద్యోగమునే నమ్ముకొన్నవారు, చిక్కుబడి తమ భవిష్యత్తును అసంకల్పితముగానే అతని స్వార్తమునకు అంకితము చేసినారు. నేరము నిప్పు. అది వీడు వాడు అన్న భేదము లేకుండా అందరినీ కాలుస్తుంది. ఇక్కడ మానసిక ప్రలోభమునకు గురియైన ఆ వ్యక్తి తానూ కారాగారము చేరి శిక్ష అనుభవించినాడు. అమాయకులకు ఉద్యోగము కంటక ప్రాయము చేసినాడు.
ఈ కథ ఇక్కడితో ఆపి ఈ విషయమును విశ్లేషించుకొందాము.
ఆ వ్యక్తి మొదట మంచివాడు. చీడ పట్టితే చెట్టు చెడిపోవలసిందే! ఆ చీడ అతనికి పట్టింది. మరి అటువంటి చీడ మంచిమార్గాములో నడువదలచిన మనకు పట్టకుండా వుండవలెనంటే ఏమిచేయాలి? భగవంతుడు దీనికి సమాధానమే మనకు తెలియజేస్తూవున్నాడు.
భగవద్గీత 3వ అధ్యాయము 36 – 41
అర్జున ఉవాచ|
అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః|| 3-36 ||
వలదని మది మరి వారించినను
వదలని శక్తికి వంచుచు శీర్షము
పాపపు పనులను బాయక చేతురు
వృష్ణివంశజా వివరము తెల్పుము
అర్జునుడు తన సందేహమును ఈవిధముగా వ్యక్తము చేసినాడు. కృష్ణా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? ఆ ప్రేరణశక్తి ఎవరిది? ఎవరి కారణంగా ఈ ఇష్టములేని పాపాలను చేస్తున్నాడు?

భగవంతుని సమాధానము:
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్|| 37-3||
రౌద్ర కామములు రజోగుణజములు
పాపి రజస్సది బాయదు జఠరము
ఆశాపాశములమరిన చేతికి
పోల్పగ కామము బొటికెన వ్రేలు   || 37-3||
 (ఇక్కడ కొంత స్వేచ్ఛను తీసుకొన్నాను. క్షంతవ్యుడను)
భగవానుడంటూవున్నాడు ఈ విధముగా, ఈ కామక్రోధములు,రజోగుణం నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని తెలుసుకో.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్|| 38-3||
క్రమ్మినచో పొగ కనరాదనలము
మురికి క్రమ్మితే ముకురము దండుగ
మావి పిండమును మరుగున చేర్చును
కామ రజస్సులు కప్పు జ్ఞానమును        || 38-3||
అగ్నిని పొగ ఆవరించినట్లు,అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా|
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ|| 39-3||
విరోధి, కామము విపులజ్ఞానికి
తనివిని కోరని దాహకమయ్యది
నివురే తెలియని నిరత జ్వాలది
కౌంతేయా కనుగొనుమీ నిజమును     ||39-3||
కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది. ఇది జ్ఞానానికి నిత్య శత్రువు.దీనితోజ్ఞాని జ్ఞానం కప్పబడి ఉంటుంది.

ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్|| 40-3 ||
మనస్సు బుద్ధియు మరి ఇంద్రియములు
కామపు నెలవులు ఘన వాస్తవములు
మోహము దేహికి ముసుగును వేసి
కాంచగనీయదు జ్ఞాన రత్నమును    ||4౦-3||
ఇంద్రియాలు మనస్సు,భుద్ధి,కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి.ఈ కామం జ్ఞానాన్ని కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ పరుస్తుంది.

తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ || 41-3 ||
భరతర్షభ సత్ఫలితమునందగ
నీ ఇంద్రియముల  నిగ్రహించుము
జ్ఞానము విజ్ఞానము నెక్కొనుటకు (పాదుకొనుటకు)
పాపపు కామము పరిహరించుము      || 41-3 ||

అందువలన భరత కుల శ్రేష్టుడా;ముందుగానీవు ఇంద్రియాలని నిగ్రహించి,జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.   ||41-3||

పరమాత్ముడు మొదట ఈ మనో వికల్పమునకు కారణము కామము క్రోధము అన్న రెండు లక్షణములు అని మొదలుపెట్టి అందులో క్రోధమునకు కూడా కామమే కారణమని నొక్కిచెబుతాడు. దీనికి ఆలంబనము రజోగుణము. సత్వము సహనమునకు,సాదువర్తనకు, సద్బుద్ధికి, సహజతకు, సామరస్యమునకు ప్రతీక. రజస్సు అటులకాదు. అవాంఛితమగు కోరికలను అది కలిగిస్తుంది. అంతటితో అసగాక అవితీరే మార్గములను ఆలోచింపజేస్తుంది.ఒక్క మాటలో చెప్పవలసి వస్తే జ్ఞానవంతుడవగుచున్న నీ ప్రతిబింబమును కననీయకుండా నీ జ్ఞానమనే అద్దమునుఈ గుణము ధూళి రూపములోను, పొగ క్రమ్మిన అనలము అంటే అగ్నివలెనూ, మావి క్రమ్మిన గర్భస్థ శిశువు వలెను చేసివేస్తుంది. ఈవిధంగా రజస్సు కామముల గూర్చి  ఎంతగానో నొక్కి చెబుతాడు పరమాత్మ. ఈ నాడు రజోహేతువులు, కామోద్దీపనములు, పగ ప్రతీకారాలు, నిర్లక్ష్యము, నిర్లజ్జ మొదలగు విషయములు మనము వద్దన్నా వివిధ విధములగు ప్రసార మాధ్యమముల ద్వారా మనకు కనిపిస్తూనే ఉంటాయి.
అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పినారు:
కామః క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరాః ||
ఙ్ఞాన రత్నాపహారేణ తస్మాత్ జాగృత జాగృత  ||
అని. కావున కామమూ, క్రోధమూ, లోభమూ అనే ఈ ఆంతరంగిక తస్కరులు అనగా దొంగలతో మనము ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసియుంటుంది. మనలో జాగరూకత లోపించితే ఈ దొంగలు ఙ్ఞానమనే రత్నాన్ని దొంగిలించుకొని పోతారు.
మన chating, hearing, friends, TV programmes, colleagues, friends, music, movies, books ఇవి అన్నీ నిజానికి చేడుగుకు దోహదాలు. యువత అధికముగా ‘సందులోసుందరి’ సినిమా చూడాలని తహతహ పడుతారు గానీ ‘సతీ సావిత్రి’ చూడరు కదా! ఇది నేటి పరిస్థితి కావున చెడుగుతో తెంచుకొని, మంచిని ఎంచుకొని మనసును అదుపులో ఉంచుకొని, సత్సంగముపై అనురాగము పెంచుకొని, సౌహార్ద్రత పంచుకొని జీవితము సాగిస్తే సంతోషము తప్ప మరేదీ చెంతచేరదు. శంకరులవారు కూడా
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః
అంటారు.
ఇక్కడ Regulator\ Remote Control ను గూర్చి ఒకమాట చెబుతాను. మన విద్యుత్ సాధనములలో  ఇవి లేనివి ఉండవు. ఇవిచెడితే మన మనుగడ దుర్భరమే! ‘అతి సర్వత్ర వర్జేయ్త్’ అనికదా పెద్దల వాక్కు. ‘Too much of anything is good for nothing’ అనికదా మనము అనుకరించే\అనుసరించే ఆంగ్లేయుల వాక్కు. ఎప్పుడో చెప్పిన మన పెద్దల మాట వినకున్నా, మనకాదర్శమైన పాశ్చాత్యుల మాటయినా వినవచ్చు కదా!
అన్నింటికన్నా ముఖ్యమయినది మనో నియంత్రణ. దానికి కావలసినది నీ ఇంద్రియ నిగ్రహము, ముఖ్యముగా బాహ్యేంద్రియములగు త్వక్ (చర్మము) చక్షుః (కళ్ళు) శ్రోత్ర (చెవులు) జిహ్వ (నాలుక, రుచి) ఆఘ్రాణములు (ముక్కు, వాసన). బుద్ధిని ఆంగ్లములో Conscious Mind గా చెప్పుకొనవచ్చు. అప్పుడు మనసు Subconscious Mind అవుతుంది. ఈ రెంటికీ inter connection వుంటుంది. ఆ connectiviti ణి అర్డుగా తప్ప అతిగా వాడుకోగూడదు. ఈ విషయమును మనః పూర్వకముగా అర్థము చేసుకొంటే ఆనందమును అందుకోబోతున్నట్లే!
స్వస్తి.

Tuesday, 20 August 2019

నారి (ఇల్లాలు)


 నారి-ఇల్లాలు                                                                       యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః l
వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వ జగన్మయీ ll
అంటున్నది అమ్మవారు, ‘లక్ష్మీతంత్రం’లో. అంటే,
నేను ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యముతో బాటు పురుషోత్తముడు’
కూడా ఉంటాడు. నేను ఆడవాళ్లందరిలో ఉన్నాను. కాబట్టి  వారిని
నా రూపంగా గౌరవించితే చాలు పుణ్యము పురుషార్థము దక్కుతాయి.
అదే విధముగా ఇల్లాలి గొప్పదనమును గమనించండి, దయతో నేను వ్రాసిన ఈ పద్యము చదివి.
ఇల్లది విల్లుగాగ తన ఇంటికి నారియె నారియౌచు తా
నుల్లము ఉల్లసిల్ల బహు ఓరిమి జీవిత లక్ష్యమెప్పుడున్
కల్లగ జేయబోక కడు కచ్చితమౌ గురి గల్గి యల్గులన్
మెల్లగ తాకజేయు కడు మేలిమి వల్లరి భార్యయన్నచో 
స్వస్తి

Monday, 19 August 2019

దండం దశగుణం భవేత్


దండం దశగుణం భవేత్
https://cherukuramamohanrao.blogspot.com/2019/08/blog-post_19.html

"దండం దశగుణం భవేత్" అన్న మాటను వింటూ ఉంటాము. దండము అన్నమాటను     పరిశీలించితే శబ్ద రత్నాకరములో మనము 18 అర్థములను చూడవచ్చును.
   అవి ఈ దిగువన పొందుపరచుచున్నాను.
1.   నమస్కారము, 2. రాజ దండన అనగా రాజు విధించు శిక్ష, 3. చెట్టు బోదె, 4. కాడ,  5. కవ్వము, 6. డోలు మొదలగునవి వాయించు కొడుపు, 7. దండు, 8. అడ్డముగా   తీర్చిన వ్యూహము, 9. గర్వము, 10. పీడనము, 11. వధము(చంపుట), 12. బార, 13. గుఱ్ఱము, 14. తోక తెగిన ఎద్దు, 15.  హారమునందలి పేట, 16. కప్పము, 17. ౙత,  18. సమూహము.
ఇందులో అన్నీ లుప్తమయి రెండు మిగిలినాయి. 1. దుడ్డుకర్ర 2. నమస్కారము.  పదమును దానికి ఉన్న వివిధమగు అర్థములలో వాడుతూ వుంటే అటు పదములూ ఇటు అర్థములూ జీవించగలుగుతాయి. అదేవిధముగా అక్షరములు కూడా! ఒక్క ౘ,  లను అక్షరామాలనుండి వెలి వేయుట వల్ల ఎంత అనర్థమో చూడండి. నేడు నాకు ‘ౘాలు’ అని ఒక స్త్రీ పలుకవలసి వస్తే ‘నా కుచాలు’ అని పలుకుతూవుంది. వినుటకు  బాధాకరముగా లేదా! గౙ్జలు ( రెండు తొడల సందు). ‘నా గౙ్జల్లో గడ్డ కట్టింది’ అని చెప్పవలసిన చోట ‘నా గజ్జల్లో గడ్డ కట్టింది’ అని చెప్పుట వెకిలిగా లేదా! ఒక్కసారి ఆలోచించండి. మన భాషకు పునర్వైభవము తెచ్చుటకు నడుం కట్టండి.
ఇక మిగిలిన రెండులో, నమస్కారము అన్న అర్థమునకుగల 10 లాభాములేవో నేను వ్రాసిన ఈ క్రింది పద్యములో చూద్దాము.
       దండము గౌరవించుటకు, దండము భక్తికి శక్తి ముక్తికిన్
దండము కోర్కె దెల్పుటకు, దండము భాషణమాదియందునన్
దండము ధన్యవాదమున, దండము విన్నప కార్యమందునన్
దండము పరిచయమ్ములను దాస్యత యందున కూర్చు మాన్యతన్
దండము పెట్టుట వలనకూడా, ఈవిధముగా 10 విధముల మాన్యత పెంచుతుందని మనకు అర్థమౌతూవుంది.
ఇక దండము అనగా దుడ్డుకర్ర అన్న అర్థములో పై నానుడి యొక్క గొప్పదనము ఈ చాటు శ్లోకము ద్వారా తెలుసుకొందాము.
విశ్వామిత్రా హి  పశుషు కర్దమేషు జలేషు చ l
అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ ll
దీనిలోని అర్థమును గమనించండి: ఈ శ్లోకములోని ఎత్తుగడలోనే ఒక విశేషము ఉన్నది. విశ్వామిత్రా’ తో శ్లోకము ప్రారంభమౌతుంది. మనకు వెంటనే విశ్వామిత్రునికీ దుడ్డుకర్రకు సంబంధము ఎట్లు కుదురుతుంది అని సందేహము. ఆ ఉత్సుకతతో చదువుట ప్రారంభించుతాము. కవి యొక్క చమత్కారము అక్కడ మనకు తెలియవస్తుంది. ప్రపంచములోని ఏ భాషకు లేని ప్రత్యేకత సంస్కృతానికి ఉన్నది. ఈ భాషలో ఒకే అక్షరమునకు కూడా ఒక అర్థము ఉంటుంది. ఆ విధముగా ఎన్ని అక్షరాలు ఉంటే అవి అన్నియు క్రోఢీకరించి ఏకాక్షర నిఘంటువునే ప్రసాదించినారు మన పూర్వులు. అవధాన ప్రక్రియకు అందునా ‘నిషిద్ధాక్షరి’లో ఈ నిఘంటువు యొక్క ఉపయోగము ఎంతగానో ఉంటుంది. ఈ నిఘంటువు సహాయముతో, ఇక ఒకసారి ఈ శ్లోకము యొక్క ప్రతిపదార్థమును చూద్దాము.
 వి - పక్షులు,
శ్వా - కుక్కలు,
అమిత్ర - మిత్రులుకానివారు(శత్రువులు),
అహి - పాములు,
పశు - పశువులు,
కర్దమేషు - బురదలో,
జలేషు - నీటిలో,
అంధే - గుడ్డితనంలో,
తమసి - చీకటిలో,
వార్ధక్యే - ముసలితనంలో
దండం – కర్ర ముఖ్యముగా దుడ్డుకర్ర
దశగుణం - 10 విధములగు ప్రయోజనములను భవేత్ - కలిగించుతుంది.
దీని భావము ఏమిటి అంటే:-
పులుగుల కుక్కల శత్రుల
పలు పాముల పసుల తరుమ పంకము నీటన్
తలువగ కృష్ణచరాంధక

పలితాళికి దండమగును బంధువు రామా!
కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికిబురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను 10 విధముల తోడుగా ఉంటుంది.ఇటువంటి శ్లోకములు పద్యములు, వివరణలు ఉత్సాహముతో చదువుటవల్ల మన తెలుగు, సంస్కృతముల గొప్పదనము తెలుసుకోనుటయే గాక లోకానికి తెలుపగలుగుతాము.
స్వస్తి.

Friday, 9 August 2019

వేదవిదిత గీర్వాణీ మాతా


వేదవిదిత గీర్వాణీ మాతా 9\8\19
విపంచి హస్తా విరించి కాంతా
విమల విభాస విభూతిస్వాంతా
నమోసురాగ పరాగ లతాంతా
నమామి మాతా వేదశ్రాంతా
స్ఫాటిక మాలాలంకృత హస్తా
స్ఫారక విద్యా జ్ఞాన సమస్తా
పరమ పవిత్రా పరిమళ గాత్రా
ప్రబల శుభాన్విత ప్రధిత చరిత్రా
విస్ఫుర విద్యా వినయక్రాంతా
విమూఢ మంద ధ్వాంతాహంతా
దయానితాంత క్లాంతా శాంతా
ధవళ నీరజా విశ్రాంతా
కుల మత జాతి విచక్షణ రహితా
విలసిత కరుణా భరణా భరితా
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా
కఠిన పదార్థములు
1. విపంచి=వీణ
విరించి= బ్రహ్మ
విమల= మలినములేని
విభాస=వెలుగు
విభూతి=ఐశ్వర్యము
స్వాంతా= మనసు కలిగిన దానా
2. సురాగా= శ్రేష్ఠమైన రాగములు (అనెడు)
పరాగ= పుప్పొడిని గల్గిన
లతంతా=లతకు చివర నిల్చునది (పుష్పము)
వేద శ్రాంతా=వేదములయండు సేద దీరునది
3. స్ఫాటిక మాలాలంకృత హస్తా= స్ఫటిక మాలను హస్తమున కలిగిన దానా
స్ఫారక=విస్తృతమైన
4. గాత్రము= శరీరము (గొంతు అన్న అర్థము కూడా కలదు)
ప్రబల=మిక్కిలి
శుభాన్విత=శుభములను కూర్చునది
ప్రధిత=ప్రఖ్యాతి గాంచిన
5. విస్ఫుర= అమితముగా
6. విద్యావినయ+ఆక్రాంతా= విద్యావినయములను తన వశములో ఉంచుకొన్నది
7. విమూఢ మంద ధ్వాంతాహంతా= తెలివే లేని, ఉన్న తెలినివిని ఉపయోగించలేని, (వారియొక్క)
ధ్వాంతా+హంతా = చీకటిని (బుద్ధిహీనతను, బుద్ధి మాంద్యమును)రూపు మాపెదానివి
8. నితాంత+ఆక్లాంతా=అపారముగా అలసటయే ఎరుగనట్టి శాంతము కలిగినదానా
ధవళ నీరజ = తెల్ల తామర
విశ్రాంతా=విశ్రమించుదానివి
9. విలసిత=ఒప్పబడిన, మెచ్చుకోనబడిన, అంగీకరించిన
కరుణా భరణా భరితా= అన్ని ఆభరణములలోనూ కరుణ అన్న బంగారమును కలిగినదానా
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా=జ్నానముఇ, సర్వశ్రేష్ఠమైన సత్వగుణమును కల్గిన విద్వాంసులకు అనుకూలించు మాతా
లోకహితా= లోకములకు మేలుచేయుదానా
జయహో=నీకు జయమగు గాక!