Wednesday, 16 October 2019

ఆంధ్ర భాగవత వినీలాకాశము లోని కొన్ని నక్షత్రములు

ఆంధ్ర భాగవత వినీలాకాశము లోని కొన్ని నక్షత్రములు

 భాగవతము నాకు పనస పండు వంటిది, నన్నొక పసి బాలునిగా ఊహించుకొంటే! తీయనైన ఆ ఫలమును కోసి తొనలు వేరుచేసి అందించితే  తినుట మాత్రమే చేతనయిన నేను, నేనే కత్తిని తెచ్చి, పదును పెట్టి, నూనె రాచి, పండును తరిగి తొనలను వేరుచేసి నేను తింటూ పదుగురికి అందించే అవకాశమును ఆ పరమాత్ముని ఆజ్ఞగా  గ్రహించి ఒక్క క్షణము నా యోగ్యతను మరచిపోయి ఈ పనిని చేపట్టినాను. ఇందు ఎన్నుకొన్న ఒక్కొక్క పద్యమునకు వ్రాసిన, నాకు తోచిన, భావమును పాఠకులు శ్రద్ధతో చదువుతారన్నది నా నమ్మకము.

పదునైదవ శతాబ్దమును శరదృతువులోని ఒక పున్నమి రోజుగా పరిగణించితే నాటి పగలు ను కలిగించిన సూర్యుడు  శ్రీనాథమహాకవి. ఆ రోజు రాత్రి చల్లని వెన్నెలలు విరియించిన పున్నమి చంద్రుడు పోతన. పోతన నిగర్వి, భోగభాగ్య నిరాసక్తుడు. సహజ పండితుడు సహజకవి.  కర్షక జీవితము నవలంబించి పంటలు తనకొరకు ఏమి పండించుకొన్నాడో కానీ మనకొరకు మాత్రము భాగవతము అన్న తిరుగులేని తరిగిపోని మేలిమి పంటనందించినాడు ఒక వృక్షము రూపములో! ఆయన చెప్పినట్లుగనే  భాగవతము ఆచంద్రతారార్కమూ నిలిచిపోయే మనపాలి కల్పవృక్షము. ఆంధ్రభారత భాగవతములు కరుణారసపూరితములగు వాగ్దేవి నయన ద్వయము. మొదటిది లౌకిక పారలౌకిక జ్ఞానమును ప్రసాదించితే రెండవది అత్యంత సులభసాధనమగు భక్తి మార్గమును ప్రసాదించినది. ఈ భక్తి మార్గము చెరుకు గణుపు వంటిది. మనము నమిలి నమిలి పిప్పిచేసినా తిరిగీ నమిలితే ఎదో తీయందనము వస్తూనే వుంటుంది. 
పోతన భావ బంధురమైన కవితా స్ఫూర్తితో, శ్రవణపేయమైన శబ్ధాలంకారములతో, అనుప్రాసా విన్యాసములతో, గానయోగ్యమౌ గీతి గుణముతో, మధుర భాషా శైలితో, రసరమ్య పద్యరచన మొనర్చిన కారణజన్ముడు.భాగవతమందలిప్రహ్లాద చరిత్రము, గజేంద్రమోక్షము,  వామనావతార ఘట్టము, శ్రీ కృష్ణ జననము, బాల్యలీలలు, రుక్మిణీ కల్యాణము వంటి ఘట్టములు ఆబాల గోపాలమునకు అత్యంత ఆస్వాద్యమానములని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పవలెనంటే తెలుగు జాతి జీవనాడి స్పందనను పట్టుకొన్న రచన పోతనగారి ఆంధ్రభాగవతమేనని అనుటలో అతిశయోక్తి లేదు . 
అట్టి భాగవతము నుండి ఎన్నుకొన్న కొన్ని వాసి వాడని కుసుమములను  సార్థకముగా అప్పుడొకటి అప్పుడొకటి మీముందుంచ ప్రయత్నిస్తాను........
ఈ పద్యార్థ నివేదన మీలోని ఆత్మరూపియగు ఆ విష్ణువునకే అంకితము.
1. 1.1.శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
శ్రీ కైవల్య పదము అనగా మోక్ష ప్రాప్తికై నేను లోకరక్షాపరాయణుడు ,భక్తపాలన కళానిపుణుడు, దానవుల యొక్క ఉద్ధృత,వికృత క్రియాకలాపనిర్మూలనాదక్షుడు,
లీలావలోకనా లేశము చేతనే భువన ,గగన, బ్రహ్మాండములను సృజించిన వాడు
,నందుని యొక్క ఇల్లాలి ముద్దులబిడ్డడైన చిన్నారి శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాను.

2- 1-5 వినాయక ప్రార్థన
ఉ. ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
అశేషమగు మాతృప్రేమను సంపాదించిన వాడు, సకల పాప నిర్మూలనాపరుడు,
ఆపన్నుల ఆర్తులను బాపువాడు, సమస్త విఘ్న బంధనముల విముక్తి చేయువాడు,
మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు,
నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును
అధిరోహించి విహరించువాడు, ముల్లోక శుభదాయకుడునగు వినాయకునకు శిరసు
వంచి ప్రణమిల్లుచున్నాను.
సరస్వతీ ప్రార్థన
3. 1-6
ఉ. క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
సైకత శ్రోణి గల తల్లి (సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు. ప్రార్థనలోనే భక్త కవి శృంగారమును ఒలికిన్చినాడే అని కొందరు చదువరులకు అనిపించవచ్చు. ఒక భక్తునికి అమ్మవారు సాక్షాత్కారించితే కన్నులార్పక ఆపాదమస్తకము చూసి తనివి తీర్చుకొని తన దృష్టిని చివరిగా పాదములపై నిలుపుతాడు. తన భావ వ్యక్తీకరణలో తాను గమనించినది తప్పకుండానూ, తడుముకొకుండానూ, తప్పనుకోకుండానూ తెలియజేస్తాడు. నిజమైన భక్తునిలో నీచ భావనలు పొడసూపవు. హీనమైన ఆలోచన కేవలము విచలిత మనస్కులకు మాత్రమే కలుగుతుంది.) ,  బారులు తీరిన తుమ్మెదల గుంపును పోలిన వేణి కలిగిన చదువుల రాణికి, రక్షించే అమర శ్రేణి కలిగిన వాణిని వనజభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; తన కరుణా కటాక్ష వీక్షణములతో సురనికరమును (సమూహమును) కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ నాలుగు చేతుల చల్లని తల్లిని నేలకు నెన్నుదురు అంటగా సాగిలపడి మ్రొక్కుచున్నాను.
ఈ పద్యం చివరి పాదంలో సరస్వతీదేవి చేతుల్లో జపమాల (అక్షదామం), చిలుక
(శుకం), పద్మం (వారిజం), పుస్తకం వున్నాయని వర్ణించినాడు. వీణ లేదే అన్న
అనుమానము వస్తుంది. పోతన వర్ణించింది శారదామూర్తి అని, ఆవిడ వైదిక విద్యలకు
అధిదేవత అని అర్థమౌతుంది ఆలోచించి చూస్తే! ఈ వర్ణనకు సమర్థన శృంగేరి
శారదాపీఠము వారు ప్రకటించిన శారదామూర్తి చిత్తరువును చూస్తే మనకు అర్థమౌతుంది . పోతన ప్రార్థించిన వాణి లలితాదేవి యొక్క జ్ఞాన స్వరూపంగా భావించే శారదాదేవి అని బోధపడుతుంది. అందువల్ల ఆ తల్లి చేతిలో వీణ యున్నట్లు చెప్పలేదు పోతన్న అన్నది నా భావన.
4-1-8
ఉ. శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
మాతా భారతీదేవీ! తెల్లదనాన్ని అనగా స్వచ్ఛతను ప్రతిబింబించే శరత్కాల మేఘములు,
శరదృతు చంద్రబింబము, కర్పూరము, మంచిగంధము, రాజహంసలు, మల్లెపూదండలు,
కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, బొండు మల్లెలు,
కల్పవృక్షము, పాలసముద్రము, తెల్లతామరలు, ఆకాశగంగ నీ ఉజ్జ్వల శుభాకృతికి
ఉపమానములు మాత్రమే ! అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనము
మనసార ఎన్నడు చూడగలను
5-1-10
ఉ. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
అమ్మలకమ్మ; ఉమా,లక్ష్మీ వాణీ మాతలకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా
అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన తల్లి; నమ్ముకున్న
దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లియగు మా అమ్మ తన
దయాసముమునుండి ప్రభవించిన కవిత్వ పటుత్వ సంపద నాకు సంవృద్ధిగా
ప్రసాదించు గాక.
బ్ర.శ్రీ. మామిళ్ళపల్లి గౌరీశంకర్ గారినుండి గ్రహించిన ఈ పద్యమునకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయమును ఇచ్చట పొందుపరచుచున్నాను.
మహత్వకవిత్వ పటుత్వ సంపదల్ .మహాకవి పోతనామాత్యుడు ఈపద్యములో విశేషించి మహత్వ-ఓం,కవిత్వ-ఐం,పటుత్వ-హ్రీం,సంపదల్ -శ్రీం అనేమంత్రరాజాన్ని అందించినారని ఆర్యులంటారు.విజయవాడ కనకదుర్గ దేవాలయము పై పద్యమును లిఖించినారు. మన ఆంధ్రులు అదృష్టవంతులు.
6-1-13
ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.
నేను వ్రాయబోవు ఈ కావ్యమును రాజాధములకిచ్చి వారిచే బహూకృతి
కావింపబడు హారాలు, అగ్రహారాలు వస్తు వాహనాలు మొదలయినవి తీసుకొని,
ఇహసౌఖ్యములలో మైమరచి , మరణించిన పిమ్మట యమధర్మరాజు చేతజిక్కి
సమ్మెట పోటులు పడలేను. అందుకే బమ్మర పోతరాజు నయిన నేను మనసారా
ఈ భాగవతమును శ్రీహరికే సమర్పించుచున్నాను.
నేను భాగవతాన్ని  లోకహితం కొరకు వ్రాస్తున్నాను. పుణ్యప్రదమైన ఈ కావ్య ఫలమును లోకానికి పంచుతాను. దానివల్ల లోకుల్లెల్లరూ భక్తి ప్రపత్తులతో చదివి భగవన్మార్గమును చేపడతారు. దానివల్ల లోకము పుణ్యప్రదమై నీతికి నియమానికి కట్టుబడి, భగవత్పద  ప్రాప్తికై  పాటుబడుతారు. ఇంతటి మహద్భావమును ఆవిష్కరించినాడు ఆయన. మహనీయుడు, మాననీయుడు,మానవకుల మూర్దన్యుడు మన పోతన.
"లోకాః సమస్తాస్సుఖినోభవంతు" అన్న వేద వాక్కును యథాతథముగా పాటించినాడు కదా! ఆ భక్త  శిఖామణికి మనఃపూర్వక సాష్టాంగ నమస్కారము.
7-1-14
తే. చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
ఇక్కడ పద్యము చిన్నది. అర్థము సులభగ్రాహ్యము. కానీ ఆచరణ సాధ్య దూరము. అకుంఠిత దీక్షతో  ఆచరణకు వంగితేగాని ఆ నాలుగు పాదములకు అర్థము సార్థకము చేసినవారము కాలేము. మా రోజులలో ఈ పద్యము తెలియని పిల్లలు ఉండేవారు కాదు. నాడు పోతన పిల్లలను ఉద్దేశించి చెప్పినాడు. నేడు ఆ మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన అవసరము ఎంతో వుంది. వారు ధనమే ప్రధానమగు విధానమనుకొని ఆ పెన్నిధానపు సన్నిధానమునకు చేరుచున్నారు. సంస్కారము లేకుంటే సర్వస్వమూ లేనట్లే అని తెలియకున్నారు. నాడు ఇటువంటి మంచిమాటలు చెప్పే తీరుబాటు తల్లికి, అవ్వ తాతలకు ఉండేది. ఇపుడు తల్లికి తీరుబాటులేదు. తండ్రికి అంతకన్నా లేదు. అవ్వ తాతలు వృద్ధాశ్రమాల పాలయినారు. ఉన్న తల్లుల్లో చాలామందికి పద్యము రాదు. నేర్చుకొని నేర్పించే తపన కూడా లేదు. ఈ మాట ముఖ్యముగా 30, 35 సంవత్సరముల తలిదండ్రులకు చెందుతుంది.
ఈ పద్యము శివకేశవాభేదమును తెలుపుతూ వుంది.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
సకల లోకములు, ఆ లోకములను పాలించేవారు, ఆయా లోకములలో ఉండేవారు అందరు నశించిన అనంతరము, క్రమ్మిన  కారు చీకట్లకవతల అఖండ మైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. (గజేంద్రమోక్షము, అష్టమస్కందము, 75వ పద్యము)
ఇంత కుండలు బ్రద్దలు కొట్టినట్లు చెప్పుటయే గాక శివ ప్రాధాన్యత వచ్చినచోట శివుని, విష్ణు ప్రాధాన్యత వచ్చిన చోట విష్ణువును అపారముగా నుతియించి తాను ధన్యుడయి, శివుడా-కేశవుడా అని కలహాలతో కొట్టుమిట్టాడుతున్న మనలను ఉద్ధరించ ప్రయత్నించినాడు. పాపం ఆయన అందరూ తనవంటివారే అనుకునే అన్నెం పున్నెమెరుగని అమాయక భక్త శిఖామణి.
8-1-18
క.పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
 నేను పలుకబోవునది భాగవతము. కాదు కాదు. నాచేత పలికింపబోవునది భాగవతము. పలికించుచున్నవాడు ఆ శ్రీరామ చంద్రుడు. నేను పలికినచో నా ఐహిక పాపపములన్నీ అంతరించి పోతాయట. ఇక ఆలసస్యమెందుకూ! పలికి నా భవపాప పరిహారము చేసుకొంటాను. ఎంత వినయము ఎంత భక్తి. ఇదికదా మనము అలవరచుకొనవలసినది.
9. 1.21.
మ. ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
నన్నయ , తిక్కన మొదలైన కవీశ్వరులు సంస్కృతము లోని అనేక పురాణాది
కావ్యములను ఆంధ్రీకరించినారు కానీ వారు భాగవతమును విస్మరించినారు. నా 
పూర్వజన్మ సౌభాగ్యమువల్ల భాగవతమును నాకొరకు వదిలిపెట్టి ఉంటారు.  ఆలస్యము
చేయక ఈ మహాగ్రంథమును తెనుగున తెల్లము చేసి నా జన్మను సార్థక్యతను
కలిగించుకొనుటయేగాక పునర్జన్మము లేకుండా చేసుకుంటాను. 
తాను చెప్పిన మాటను నిలబెట్టుకొన్న మహనీయుడు పోతన. సంస్కృత వ్యాస భాగవతమును వదిలిపెడితే అనేక భారతీయ భాషలలో అనేకులు వ్రాయ ప్రయత్నించినా పోతన ఆంద్ర భాగవతము యొక్క వాసి వన్నె వానికి కలుగలేదు. ఆంధ్రదేశములో కృష్ణ భక్తి తక్కువయినా భాగవత హరివంశములు ఆంధ్రభాష ఉఛ్వాసనిశ్వాసములు.
పోతన చాటువుగా గణుతికెక్కిన ఈ చాటువు, ఆచాటువునకు అనుబంధమైన ఈ కథ, ఆయన విషయవాంఛా విముఖతను రూఢి చేస్తుంది.

ముందుఈ చాటువునకు సంబంధించిన కథను చూద్దాము.
ఒకమారు శ్రీనాథుడు  పోతనను భాగవతమును రాజునకు అంకితమివ్వమని బుజ్జగించుతూ  ఈ విధముగా చెబుతాడు.
క. కమ్మని గ్రంథం బొక్కటి
యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై
కొమ్మని యీయరె అర్థం
బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్
- శ్రీనాథ మహాకవి చాటువు
దానికి పోతన
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
- పోతన చాటువు
గున్న మామిడి చెట్టుయొక్క లేలేత చివుళ్ళను బోలు  కోమలమైన కావ్యకన్యకను  దుర్మార్గులకు ఇచ్చి ఆ  ప్యభిచారపుకూడు తినుటకంటె సత్కవులు  తన భార్యా బిడ్డల పోషణ కోసము, వ్యవసాయము చేసుకొన్ననూ పరవాలేదు లేక  అడవుల బట్టిపోయి కందమూలములు,పుట్టతేనెలతో జీవించిననూ పరవాలేదు అని తెగేసి చెప్పినాడు.
నేలపైనుండీ నేలనంటని పాదరసము ఆయన సంసారజీవనము. తనకు తనపై అంత నమ్మకము ఉన్నది కాబట్టే ‘నా జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్’ అని ఢంకా పతముగా చెప్పినాడు. అటువంటి సహజ పండితుడు, కవి, యశోభూషవిరాజితుడు, భూమిపై తిరిగీ పుట్టి అంతటి కవిత్వమును చెప్పినట్లు మనము చూడలేదు కాబట్టి ఆయన పునర్జన్మము గొనక సార్థక్యుడైనాడు అని రూఢియగుచున్నది.
22
మ. లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం    
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో    
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై    
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.    
ఈ పద్యమునందు భాగవతము కల్ప వృక్షముతో పోల్పబడినది.    
భాగవతాఖ్య కల్పతరువు అంటే భాగవతపురాణమనే ఈ కల్పతరువు మానవ    
శ్రేయస్సుకై భూమిపై వెలసిందట. ఇక్కడ 'సద్విజ శ్రేయమై' అన్న మాటను వాడుటచే  ద్విజులు అన్నాడు కావున ఇది బ్రాహ్మణులకు మాత్రమేనా అన్న సందేహమును 
వేలిబుచ్చేవారు వుంటారు. భాగవత సుధారసధారాలను గ్రోలినతరువాత  హరి చింతనామృత మత్తుడైన మానవుడు ఇహభోగములు క్షణికములని గ్రహించి, వానిని    
త్యజించి, భక్తిని గ్రహించుటచే రెండవజన్మము ఎత్తినట్లేకదా! ఇప్పుడు కల్పవృక్షమునకు    
భాగవతమునకు గల పోలిక చూద్దాము.    
లలితస్కంధము అంటే కల్పవృక్షము బోదె ఎంతో లలితముగా ఉందట!    
స్కంధాధారమైన భాగవతమూ ఎంతో లలితముగా సులభాగ్రాహ్యముగా చెప్పబడినది   
కదా! కృష్ణ’మూలము అంటే నల్లనివేళ్ళు కలది ఆ కల్పవృక్షమైతే భాగవతమునకు మూలము.
శుకాలాపాభిరామమ్ము అంటే శుకము అనగా చిలుక; ఆలాపము అంటే మాట;
అభిరామము అంటే మనోహరము; అంటే, కల్పవృక్షము చిలకల పలుకులతో ,
మనోహరంగా ఉందట మరి భాగవత ప్రవచనము పరీక్షిత్తునకు గావించినది
శుకమహర్షి కదా!  మంజులతా శోభితము అంటే మనోహరములైన తీగల చేత కల్పవృక్షము మనోజ్ఞమై భాసిల్లుచున్నదట. మరి భాగవతమో, స్నిగ్ధమై, మోహనమై మోహనరూపుని మనోహర గాథలను కలిగియున్నది. సువర్ణ సుమనస్సుజ్ఞేయము అంటే కల్పవృక్షము సువర్ణ పుష్పములచే అలరారుతూ బహుసుందరముగా భాసిల్లుతూ మనోజ్నమై మసలుచున్నదట. మరి భాగవత పరముగానో సౌమనస్యముతో అంటే మంచి మనసుతో సువర్ణ అంటే ఏర్చి పేర్చిన అక్షరములు కలిగిన పదములతో మంచి మనసు కలిగిన వారు మనసారా గ్రహించే విధముగా అలరారుచున్నది అని తెలియబరచుచున్నది.ఇంకా గమనించండి. సుందరోజ్వల వృత్తంబు ఆ కల్పవృక్షము యొక్క పాదుకూడా వర్తులాకారములో తీర్చిదిద్దబడి ఎంతో శోభాయమానముగా ఉన్నదట. భాగవతము కూడా సుందరమూ ఉజ్వలము అయిన శ్రీ నారాయణుని వృత్తాంతమును కలిగి యున్నది. ఇక్కడ వృత్తపద్యములు అంటే ఉత్పలమాల చంపకమాల మొదలయినవి అన్న అన్వయము సరిగా ఉండకపోవచ్చు. ఈ విధముగా అటు కల్పతరువు ఇటు భాగవతము సర్వ సల్లక్షణ సంశోభితలై దనరారుచున్నవి. వ్యాసమహర్షికూడా సంస్కృతములో ఈభావమే తెలిపినారు. భగవత్స్వరూపుడగు ఆయన రచనను పరమభాగవతుడగు పోతన ఇంతచక్కగా ఆంధ్రీకరించినాడు.
निगमकल्पतरोर्गलितं फलं
शुकमुखादमृतद्रवसंयुतम्
पिबत भागवतं रसमालयं
मुहुरहो रसिका भुवि भावुका: ॥వ్యాస భాగవతం 1-1-3
నిగమ కల్ప తరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతంl
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాఃll

ఈ భూమిపై గల నిత్య నిరంతర భగవద్భావుకులై విలసిల్లుచున్న భక్త శ్రేష్ఠులారా!
వేద వేదాంత మహా వృక్ష మధ్రుతాతి మధుర పక్వ ఫలము ఈ భాగవతము. పైగా ఇది చిలుక కొట్టిన పండు. చిలుక కొట్టిన పండుకు రుచి ఇనుమడించుతుందికది! అంటే శుకమహర్షి పరీక్షిత్తునకు విపులీకరించి చెప్పుటచే బాహ్యార్థ, అంతరార్థ, గూడార్థములు సులభాగ్రాహ్యములైనవి. బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసువులకు, బ్రహ్మజ్ఞాన తత్పరులకు, అసలు బ్రహ్మజ్ఞానులకు కూడా ఇది సిద్ధౌషధము. సముద్ర సాద్రుశామైన ఈ రసమును ఎవరి శక్తి కొలదీ వారు త్రాగవచ్చును. వ్యాసులవారి ఈ మాటను పోతన ఎంతగా విస్తరించి చెప్పినాడో!
భాగవతము-సప్తమస్కంధము-ప్రహ్లాదచరిత్ర
1. 7.130.
క. చదువనివాఁ డజ్ఞుం డగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ!
హిరణ్యకశిపుడు ఒకనాడు ప్రహ్లాదుని తో “నాయనా! చదువుకుంటే
మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. చదువురాణి మొద్దు కదలలేని
ఎద్దుతో సమానము. కనుక నిన్ను సద్గురువుల కడ చదివిస్తాను. చక్కగా చదువుకో !” అని చెప్పినాడు. ఇక్కడ ఒక విషయమును గమనించండి. హిరణ్యకశిపుడు రాక్షసుడే కావచ్చు, దుష్టుడే కావచ్చు, అయినాకూడా ఆయన తన కుమారునితో చదువు యొక్క ప్రాశస్త్యము చెబుతూ వున్నాడు. హిరణ్య కశిపుని కాలానికి, లేదంటే వ్యాసుని కాలానికి, లేదంటే పోతన కాలానికి ఆంగ్లేయులు ఇంకా మనకు మెకాలే విద్యావిధానముతో తల అంటకముందు విషయము కదా ఇది. మన పూర్వులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో చూడండి. క్రీ.పూ.50- క్రీ.శ.50 కాలమునకు చెందిన భర్తృహరి తన సుభాషితములలో విద్య గొప్పదనమును ఎంతగా చెప్పినాడో గమనించండి.
విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం
విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః ।
విద్యా బంధుజనో విదేశ గమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యా విహీనః పశుః ॥
పై శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు సేత చదవండి.
విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే

విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది, కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.
విద్య తోటి వచ్చు వినయము విద్వత్తు
విద్య తెచ్చు కీర్తి విత్తములను
విద్య నేర్వకున్న విలువేది ధరలోన
విద్య లేనివాడు వింత పశువు
పై పద్యములోని చివరి చరణము ఎంతో ప్రఖ్యాతి గాంచినది. దాని పైమూడు చరణములు నేను పూరించినవే. విద్యకు ఈ భారత దేశములో అనాది కాలమునుండి కూడా అంత ప్రాధాన్యత ఉండేది అన్నది నేను చెప్పదలచిన విషయము. 
2. పోతన సీసపద్యము చదువుటకు ముందు పాల్కురికి సోమనాథుని బసవపురాణ ద్విపద కావ్యము యొక్క
తృతీయాశ్వాసంలోని ఈ పంక్తులను చూడండి:
క్షీరాబ్దిలోపల గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ
జూతఫలంబుల జుంబించు చిలుక
జాతిబూరుగుమ్రానిపండ్లు గన్గొనునె
రాకామలజ్యోత్స్న ద్రావుచకోర
మాకాంక్షసేయునే చీకటిద్రావ
విరిదమ్మివాసన విహరించుతేటి
పరిగొని సుడియునే ప్రబ్బలి విరుల

ఈ ద్విపదపాదాలలోని భావాన్ని బమ్మెర పోతన ఎంత మధురంగా
కర్ణపేయంగా మందార మకరందమున అద్దిన మావి చిగుళ్ళు తినబెట్టి
మత్తెక్కించి కోయిలలచే పాడించిన వైనము చూడండి.
7.150.1
సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు?
తే. నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?
పొగడదగిన గుణశీలములు గలిగిన ఓ గురుసత్తమా! మందార పుష్ప
మకరంద మత్త యగు తుమ్మెద, ఉమ్మెత్త పూలను చూస్తుందా! స్వచ్చమైన
ఆకాశగంగా తరంగాలపై విహరించు రాయంచ వాగులు వంకలు వద్దకు
పోతుందా! మధురాతి మధుర ఫలభూజ కిసలయ భోక్త అంటే లేత చిగుళ్ళు తిని
పులకించిన కోయిల కొండ మల్లెల గూర్చి తలపోయునా! నిండు పున్నమి
పండువెన్నెలను కోరు చకోరము దట్టముగా ఉన్నాయని మంచు తెరల వైపునకు
మరలుతుందా? అదేవిధముగా అంబుజ నాభ పాదారవింద ధ్యాన తత్పరత
కలిగిన పరవశించు నామనస్సు అన్యములను ఆకర్షించుతుందా! వెయ్యేల and
హరిపాదాయత్తమగు నా మొత్తము చిత్తము అన్య విషయముల నసలు
స్మరించదు.” అని ఎతో అనునయముతో పలికినాడు ప్రహ్లాదుడు.
ఇక్కడ మనము గమనించవలసినది ఏమంటే, రాజసిక తామసిక గుణసంయుక్తుడు హిరణ్య కశిపుడు. తనకు  అందివచ్చిన సంపూర్ణ సత్వగుణ సదాచార సదాలోచన సంపన్నుడు ప్రహ్లాదుడు. అత్యంత ఉత్తమోత్తమమైన పోలికలతో ప్రాణి పరమాత్మ సంబంధమును తలియజేయుచున్నాడు. ఈబోధ కేవలము అంధేందూదయము మహాబధిర శంఖారావము, హిరణ్యకశిపునకు. అక్కడ ప్రహ్లాదుడు హిరణ్యకశిపునకు చెబితే ఇక్కడ పోతన, ఆలకించి ఆచరించే వారికి చెబుతున్నాడు. మనసు పెట్టి చదివిన మనిషి మాధవుని పాదదాసుడు కాక తప్పదు.
3. 7.166.
క. చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!
నాన్నగారూ! ధర్మా,ర్థ సంబంధ శాస్త్రములన్నీ గురువులు చదివించినారు, అవి
చదువుటయేగాదు అందలి సార మర్మములను కూడా సంపూర్ణంగా
గ్రహించినాను, అని అన్నాడు. ఇక్కడ ‘మర్మము’ అన్న మాటలోనే అసలు మర్మము దాగివుంది.
ఒకప్రక్క చదువవలసినవన్నీ చదివినాను అని అంటూనే అందులోని మర్మమును గ్రహించినాను అన్నాడు. చదువులో అత్యంత ముఖ్యమైన విషయము ఇది. ఇక్కడ ఒక ముఖ్యమైన నా అనుభవము చెబుతాను. నేను 3rd form అనగా 8వ తరగతి చదివే రోజులలో మా సైన్సు ఉపాధ్యాయుడు వలస పోవుట అన్న పాఠమును చెబుతూ ఉండగా, ముందు బెంచీ లో కూర్చుని కూడా కొంతెపనులు చేసుకొంటూ ఉండిపోయినాను. అది గమనించి మా సారు ‘వలసపోవుట అనగానేమి? అని నన్ను ప్రశ్నించినాడు. వినివుంటే కదా జవాబు చెప్పడానికి. ఆయనే జవాబు చెబుతూ నాతో పలికించుతూ వచ్చినాడు. ‘ఆహారము కొరకు ప్రాణులు ఒక ప్రాంతము నుండి మరియొక ప్రాంతమునకు పోవుతాను వలసపోవుట అందురు’ అని పలికించి ‘చిలుక పలుకులు’ అని పొడిగించినాడు. నేను కూడా ఆయన చెప్పినదంతా చెప్పి చిలుకపలుకులు అని అప్రయత్నముగా అన్నాను. మా సారు తోబాటూ అంతా నవ్వినవాళ్ళే! సారు నా చెవి పట్టుకొని గిచ్చి శ్రద్ధగా వినమని హెచ్చరించినాడు.
ఇక్కడ ప్రహ్లాదుడు నావలె బాధ్యతారహితముగా ప్రవర్తించకుండా నియమ నిష్ఠలతో.భక్తిశ్రద్ధలతో తదేకముగా అభ్యసించినాడు. అందువల్లనే అందలి సారమును ఒడిసిపట్టుకొన్నాడు. తండ్రితోడ తన సంభాషణలో ఈమాట కూడా అంటాడు:
కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్
కానని భంగి  కర్మములు గైకొని కొందరు కర్మ బధ్ధులై
కానరు, విష్ణు కొందరట, కందురకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా!
“ఓ దానవేశ్వరా! గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువుయోక్కయూ గుణగణములు తెలుసుకోలేనట్లు  విషయలోలురు కర్మబంధములో తగుల్కొని  విష్ణువును చూడలేరు.ఎవరైతే  విష్ణుపాదార్చకుల పాదార్చకులై  కర్మలను త్యజించి పూత చిత్తులౌ తారో, వారు ఆ పరాత్పరుని వీక్షించగలుగుతారు.” అని అన్నాడంటే హరి సేవన లో ఎంత ఆరితేరినాడో గమనించండి. అతి చిన్న వయసులోనే ఈ మర్మాన్ని ఆపోశన పట్టినాడు ప్రహ్లాదుడు, బాలుడైయుండికూడా! అదే విషయమును, విషయలోలుడైన హిరణ్యకశిపుడు తత్సంభంద కర్మజాలములో తగుల్కొని నిప్పులో పడిన శలభమై మాడిపోయినాడు. ఈ ఆంతర్యమును ఎంత శీఘ్రగాముగా మనము గ్రహించుతామో అంత శీఘ్రముగా ధర్మపతమువైపు పయనిన్చుతూ భక్త జనులను వృక్షఛాయలలో సేద తీర్చుకొంటూ పరమాత్మ దామమునకు పయనించగలుగుతాము.
4. 7-168-శా.
అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.
లోకంలో గుడ్డివానికి వెన్నెల, చెవిటికి శంఖ ధ్వానము, మూగకు గ్రంథపఠనము, పేడికి కాంతలపై కామము, కృతఘ్నుడికి బంధుత్వము, బూడిదలో పోసిన హోమద్రవ్యములు, లోభికి సంపద , పందికి పన్నీరు ఏవిధముగా రుచించవో విష్ణు భక్తి లేని జీవులకు జీవితము నిస్సారమై యొప్పారుచున్నది. ఎంతటి మానవ ప్రకృతి పరిశీలనో చూడండి. విష్ణు తత్వమును అర్థము చేసుకొనని, చేసుకొన తలవని వారిపై ఎంత ఎహ్యభావమో కవికి గమనించండి.
ఇది విష్ణువుకైనా, ఈశ్వరునికైనా, కాత్యాయనికైనా ఒకటే! ఇక్కడ భక్తి ప్రధానము, మనసు లగ్నము చేయుట ముఖ్యము అన్నది పోతన్న మనకు చెప్పదలచిన మాట.
5. 7-169-సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
7-169.1-తే.
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
తండ్రీ! కమలాక్షుని అర్చించే చేతులే చేతులు, శ్రీపతి ని స్త్రోత్రము చేసే నాలుకే
నాలుక సురరక్షకుని చూచు చూపులే చూపులు శేషశాయికి మ్రొక్కు శిరమే
శిరము, విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధుకైటభారి హరి యందు
లగ్నమైన చిత్తమే చిత్తము, భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసే పాదములే
పాదములు, పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి, దేవదేవుడైన
విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము, చక్రి గాథలు విశదపరుచు చదువే
చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే గురువే గురువు,
విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా! అని
తండ్రిని నిగ్గదీస్తూవున్నాడు ప్రహ్లాదుడు. అంటే శరీరములోని అణువణువూ
ఆఅవ్యయునికే అంకితము అని తలచినవాడే భక్తుడు, బాల్యముననే అటువంటి
బుద్ధిగరిపినవాడే తండ్రి అని నారదులవారి ద్వారా గ్రహించిన ప్రహ్లాదుడు
హిరణ్యకశిపునకు చెబితే,  వేదవ్యాసుల వారివద్దనుండి గ్రహించిన పోతన, మనకు ఈ సందేశమును అందించుచుచున్నాడు.
అందుకే శంకరులవారు 'మోహముద్గరము' అనబడు భజగోవిందము లో ఈ విధముగా అన్నారు:
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వంl
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తిఃll

మోహముద్గరము’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది. సత్పురుషుల సాంగత్యం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం తొలగిపోతే మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది (నిశ్చలతత్వం). అలా మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తికి సులభమగు మార్గము గా కనిపించుతుంది కానీ ఆచరణలో అది ఎంత కఠినమో సాధకునికే తెలుస్తుంది.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు, సాధుపురుషులు, జ్ఞానులు. వారితో మాట్లాడటం, వారి మాటలను వినడం, వారి ద్వారా సందేహాలను తీర్చుకోవడం, వారిని అనుసరించడం.. ఇదే సత్సంగత్వం అంటే. ఒకవేళ అలాంటివారు లభించకపోతే సద్గ్రంథాలతో స్నేహం చేయాలి. అందులోని విషయాలను గ్రహించి ఆచరణలో పెట్టాలి. తద్వారా,  మనకు నిత్యమైన ఆనందాన్ని ఇవ్వలేవని, ప్రాపంచిక లేక భౌతిక సుఖములకు మనము దూరము కాగాలుగుతాము.  చివరకు, నిత్యమైన ఆనందం పరమాత్మ వల్లనే లభిస్తుందని తెలుస్తుంది. మనలో మానసిక ప్రశాంతత కలిగి మనసులో విషయవస్తువుల పట్ల ఏర్పడిన నిస్సంగ భావమే ఐహిక ఆకర్షణల నుండి దూరము చేసి మనలను రక్షిస్తుంది.
స్వస్తి.
ఇంకొకసారి ఇంకొక పద్యముతో......
6. 7.170.
సీ. కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే? ;
ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;
7.170.1
ఆ. చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
పద్మనయనుడగు విష్ణుమూర్తికి పనికి రాని శరీరము శరీరము కాదు కేవలము
అది గాలిచే నిండిన కొలిమితిత్తి. వైకుంఠవాసు డైన ఆ హరి నామ సంకీర్తన
చేయని నోరు ఒక నోరా! ఢమ ఢమ యని మ్రోగే ఢక్క మాత్రమె! హరి
పూజలెరుగని హస్తము హస్తమా! కాదు అది సంకతిని కలియబెట్టే కొయ్య తెడ్డు.
పప్పు ఎనుపుటకు అంటే కలియద్రిప్పి మెత్తగా మార్చుట, సంకటి కెలుకుటకు
దీనిని వాడేవారు. శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే
గోడకు వేసిన రెండు కన్నములు మాత్రమే! చక్రాయుధుండగు శౌరిని
ధ్యానించని జన్మ కూడా ఒక జన్మమేనా! అది క్షణభంగురమగు నీటి బుడగ
గాక. విష్ణు భక్తి లేని పండితుడూ ఒక పండితుడేనా! రెండు కాళ్ళ పశువు
గాక. సాధారణముగా ఎదుటివాడిని తిట్టేటపుడు నీవు ‘మనిషా! పశువా!
అంటాము. పోతన గొప్పదనము ఇక్కడ అదేమాట వాడటము. (ఈ పద్యము
మరియు మునుపు చెప్పిన 'మందార మకరంద' కమలాక్షునర్చించు' ఇత్యాది పద్యములు అమాత్రుకములు, కానీ వీని పోకడలను మనము పాల్కురికి సోమనాథుని బసవ పురాణములో చూడవచ్చును. పాల్కురికి సోమన్న కన్నా పోతన్న చిన్నవాడు. కావున అందమయిన ఆయన బాణీ ఈయన మనసులో నాటుకొనియుండ వచ్చును. కానీ ప్రచారము పోతన పద్యములకే ఎక్కువ. పాల్కురికి సోమన, నాచన సోమన, వారిని అనుసరించిన పోతన మొదలైన మహానుభావులను కన్న భూమి మన ఆంధ్రభూమి. వారి పద్యములను ప్రాచ్ర్యమునకు తెచ్చుటే వారికి మనమిచ్చే ఘన నివాళి.)
స్వస్తి.
మరొకరోజు మరొక పద్యముతో.....
31\03\2020
7. 7.198
సీ. ఒకమాటు దిక్కుంభియూధంబుఁ దెప్పించి;
కెరలి డింభకునిఁ ద్రొక్కింపఁ బంపు;
నొకమాటు విషభీకరోరగ శ్రేణుల;
గడువడి నర్భకుఁ గఱవఁ బంపు;
నొకమాటు హేతిసంఘోగ్రానలములోన;
విసరి కుమారుని వ్రేయఁ బంపు;
నొకమాటు కూలంకషోల్లోల జలధిలో;
మొత్తించి శాబకు ముంపఁ బంపు;
7-198.1-ఆ.
విషముఁ బెట్టఁ బంపు; విదళింపఁగాఁ బంపు;
దొడ్డ కొండచఱులఁ ద్రోయఁ బంపుఁ;
బట్టి కట్టఁ బంపు; బాధింపఁగాఁ బంపు;
బాలుఁ గినిసి దనుజపాలుఁ డధిప!
ఆ రాక్షసరాజగు హిరణ్యకశిపునికి అనుమానంతో పాటు మరింత కోపము,
పట్టుదల పెరిగిపోయినాయి. ఒకసారి, దిగ్గజములా అన్నంత మదపుటేనుగులతో
ప్రహ్లాదుని త్రొక్కించినాడు. మరియొకసారి, అతి భీకర విషసర్పముల చేత

కరిపింపజేయించినాడు. వేరొకసారి భగభగ మండే మంటలు గల్గిన
అగ్నిగుండములలో పడేయించినాడు. ఇంకొకమారు, ఆ పసివాని చితకగొట్టి,
నడిసముద్రములో ముంచిరమ్మన్నాడు. విషము పెట్టి చంపమన్నాడు, కత్తితో
నరకమన్నాడు, పర్వత శిఖరాగరముల నుండి క్రింది లోయలలోనికి
త్రోసివెయమన్నాడు. కదలకుండా కట్టిపడవేయమన్నాడు. భరింపలేని బాధల
పడవేయమన్నాడు. ఆవిధముగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చిత్ర విచిత్ర
హింసలకు గురిచేసినాడు.
మనము ప్రహ్లాదులము కాలేము. కానీ బాలకుడగు ప్రహ్లాదుడు మనకాదర్శము. ఆ బాలకుడు భరించిన కష్టములతో మన కష్టములను పోల్చుకొని భగవంతునిపై అచంచలముగా భక్తి నిలిపి నిరంతర సాధన చేయవలయును. Pass కావాలంటే పరీక్ష తప్పదు. పరీక్షను ఎదుర్కొనాలంటే మనము తగిన పరిశ్రమ చేయకనూ తప్పదు. ఒకవేళ పరీక్ష తప్పితిమో పట్టుదలను ఇంకాపెంచుకొని Pass అయ్యే వరకూ పరిశ్రమించక తప్పదు.
మరొక మారు మరొక పద్యముతో........
8. 7.264
కం. బలయుతులకు దుర్భలులకు
బల మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
బల మెవ్వఁడు ప్రాణులకును
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!
ఓ రాక్షసరాజా! బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, బ్రహ్మ మున్నగు
వారికి, ఆ మాటకొస్తే సృష్ణిలోని సమస్త చరాచర జీవరాశులకు
శరణమునొసగువాడగు ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు. భక్తి ప్రపత్తి
భరితుడగు బాలుడు తండ్రి మరియు దానవేంద్రునకు ఎంత నిర్భీతితో బదులు
చెప్పుచున్నాడో చూడండి.
గర్వాంధకారముతో కొట్టుమిట్టాడే మూర్ఖులు తప్ప పరమాత్ముడు సర్వోపకారి సర్వ రక్షకుడు. ఈ విషయమును మనసా వాచా కర్మణః నమ్మిన వానికి దేవుని తోడెప్పుడూ వుంటుంది. కలియుగములో ‘దైవము మానుష రూపేణ’ అన్నట్లు మానవ రూపములో సహాయకారిగా ప్రకటితమౌతాడు. అతి క్లుప్తముగా ఒక కథ చెబుతాను. ఒక స్వార్థపరుడు తపస్సు చేసి దేవుని సంతృప్తి పరచినాడు. అశరీరుడైన పరమాత్మ వరము కోరుకొమ్మన్నాడు. ఈ స్వార్థపరుడు తనకు చావు లేకుండా చేయమన్నాడు. దేవుడు అది సాధ్యము కాదు, పుట్టినవాడు మరణించక తప్పదని చెబుతూ, ప్రాణాపాయ స్థితిలో తాను చూపించే దారిని గ్రహించి నడుచుకొమ్మని చెబుతాడు.
ఒక సారి పేను తుఫాను మొదలౌతుంది. అతని మిత్రుడు వచ్చి,గాలివాన ముదరక ముందే ఆస్థలము విడిచి రమ్మంటాడు. అతడు నేను రాను దేవుడు కాపాడుతాడు అని చెబుతాడు. వాన పెద్దదయి ప్రవాహముగా మారుతుంది. ఒక పడవ ఆదారిన పోతూ, నడిపే వ్యక్తి, ఇతనిని ప్రాణాలు కాపాడుకొనుటకు ఎక్కమంటాడు. అక్కర లేదు దేవుడు కాపాడుతాడు అని చెబుతాడు. ఈ విధముగా ఇంకా రెండుమూడు మార్లు జరిగిన తరువాత, నీటి వరవడి ఎక్కువయి ప్రవాహములో పది ప్రాణాలు పోగొట్టుకొని, దేవుని ముందు నిలుస్తాడు. దేవుని చూసిన వెంటనే ఆయన అబద్ధాలకోరని దూషించుతాడు. అప్పుడు దేవుడు జరిగినదంతా తిరిగీ ఏకరువు పెట్టి నిన్ను 5 మార్లు కాపాడ ప్రయత్నించినాను. మూర్ఖత్వము, మూర్ఖత్వముల వల్ల అన్ని అవకాశాలనూ పోగొట్టుకొన్నావు. అందువల్ల ఇక్కడికి చేరినావన్నాడు. దీని వాళ్ళ మనము గ్రహించావలసినది ఏమిటంటే ప్రాపంచిక విషయములపై నిరపేక్ష భావనతో పరమాత్మను ప్రార్థించితే ఆయన అండదండలు మనకేపుడూ వుంటాయి.
నాటకీయత ఉట్టిపడే ఈ చిన్న పద్యము పోతన సామర్థ్యమునకు మచ్చుతునక.
వేరోకమారు వేరొక పద్యముతో......
9. 7-274-మ.
కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.

ప్రహ్లాదుడు తండ్రికి చెబుతున్నాడు. విశ్వంభరుడగు మహావిష్ణువు లేని చోటు
ఎక్కడా లేదు. ఆయన భూమిపైనే కాదు, నీటిలో, నిప్పులో, అనిలములో,
ఆకాశంలో అంతటా ఉన్నాడు. సకలదిక్కులయందునూ ఉన్నాడు.
రేయింబవళ్ళలో ఉన్నాడు. సూర్య , చంద్ర, ఆత్మ, ప్రణవ, బ్రహ్మ విష్ణు మహేశ్వర,
స్త్రీ పురుష నపుంసక విచక్షణా రహితుడై పర్వత పరమాణు రూపకుడై
విశ్వమంతా వ్యాపించియున్నాడు. అట్టి పూర్ణస్వరూపుని, సర్వవ్యాపియయిన
వానిని, సర్వేశ్వరుని కొరకు ఎక్కడెక్కడో వెదుకవాలసిన పనిలేదు. ఆయన
సర్వవ్యాపకుడు. ఇది నిర్వివాదమగు వాస్తవము.
10. 7-275-క.
ఇందు గలఁ డందు లేఁ డను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.
ఓ హిరణ్యకశిప దానవేంద్రా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ
ఉండడు; అన్న సందేహమే వలదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల
సర్వావస్థల అన్నింటి యందు ఉండే వాడు.ఇందు సందేహమన్నది లేదు. ఎక్కడ
వెతికితే అక్కడే కనిపించుతాడు. అంతయూ వెదుకుటలోగల చిత్తశుద్ధిపై ఆధార
పడియుంటుంది అన్నది అంతర్లీనమగు అర్థము.
పైరెండు పద్యముల సారము ఒకటే. చెట్టు పుట్ట గుట్ట మనము ఉండేఇల్లు
, మన వాహనము, చూసే దూరదర్శనము (TV) ను కూడా పూజ్యమానముగా భావించుతాము. ఈ భావము భగవంతుని విశ్వవ్యాపకతను తెలుపుతుంది. దుష్టులుగా ముద్రపడిన అసురులగు హిరణ్యకశిప హిరణ్యాక్షులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు ఆదిగాగల వారందరూ మహావిష్ణువుచే సంహరింపబడినవారే! కానీ వారు చేరింది వైకుంఠమే! కారణం శ్రీహరి యొక్క ప్రతిపనినీ, ద్వేషించినా, గమనించినారు, అనుక్షణమూ తలపోసినారు. ఆ తలపోతాయే వారిని విష్ణు సాయుజ్యమును చేర్చినది. నేటి సామాజిక సహజీవానములో ఈ పంథాను అవలంబించలేము. అందువల్ల 'నోరు నొవ్వంగ హరికీర్తి నుడువుటే' మన కర్తవ్యము. అసలు 'హరి' అన్నా 'హర' అన్నా ఒకటే! ఇరువురూ హరిన్చేవారే! ఏమి హరిన్చుతారు అంటే మన దోషములను, ఎప్పుడు హరించుతారు అంటే మనము వారిని నమ్మినపుడు. 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే' అనికదా శాస్త్రవచనము. ఈ విషయమును గమనించండి. విష్ణువు శయనించే శేషుడు శివుని కాలి కంకణము. శివుడు నేత్తికెత్తుకొన్న గంగ యొక్క పుట్టుక విష్ణు పాదములు. ఈ ఒక్క మాట చాలు వారిరువురు అభేదులు అనుటకు. మనకు కావలసినది, వారిరువురిలో ఎవరయినాకానీ, అచంచల భక్తి  అకుంఠిత విశ్వాసము.
ప్రహ్లాద చరిత్రములోని ఈ రెండు పద్యములతో ఆ ఘట్టమును ముగించుచున్నాను . 'సర్వేజనాః సుఖినోభవంతు'.

3. భాగవతము-అష్టమ స్కంధము-గజేంద్రమోక్షము
1. 8.73
ఉ. ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్
ఈ లోకమున ఎవరి వల్ల సృష్టిస్థితిలయములు జరుగుచున్నవో, ఎవరు
పరమేశ్వరుడో; ఎవరు ఈ జగత్తునకు మూలకారణమో; ఎవరైతే పుట్టడం,
గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; ఆదిమధ్యాంతము లేని
అనంతుడో; సమస్తమూ తానే అయిన వాడెవ్వడో; అటువంటి స్వయంభువగు
ప్రభువును శరణు వేడుచున్నాను.
ఈ పద్యమును ప్రత్యేకముగా శివుని గూర్చియో విష్ణువును గూర్చియో పోతన్న వ్రాయలేదు.
‘ఏకమేవాద్వితీయం బ్రహ్మ’  అన్న మాండూక్యోపనిషత్ వాక్యాన్ని బలపరుచుతూ చెప్పిన పద్యమిది. వర్షపు చినుకులు చివరకు నదుల రూపములో సాగరమును చేరినట్లు ఆ పరమాత్ముని  ఏపేరుతో సంభావించి పూజించినా చివరకు చేరేది
ఆ పరబ్రహ్మకే! ఈ సందర్భముగా  నేను వ్రాసుకొన్న పాట యొక్క పల్లవి  గుర్తుకొస్తూవుంది.
ఎటుల తలచినా ఏవిధి కొలిచిన
పరబ్రహ్మమే పావన గమ్యము
బ్రహ్మవిష్ణుశివ ప్రతి రూపమ్ములు
సకలము తానే శకలము నేనే
ఈ చిత్తవృత్తితో ఆ పరాత్పరుని మనము కోరుకొన్న రూపములో ధ్యానించుకొనవచ్చును.
ఒక 50సంవత్సరముల క్రితము వరకు ఈ పద్యము రాని బాలుడు తెలుగునాట
లేడు అనుట అతిశయోక్తికాజాలదు. విద్యావంతుడా కాదా అన విచక్షణ లేకుండా ఈపద్యము ప్రతియోక్కరి నోటా నానేది. పద్యము అల్పము భావమనంతము, ఇట్టి రచన పోతనకే స్వంతము.
పోతన పుట్టిన గడ్డపై పుట్టిన మనము ఎంత అదృష్టవంతులమో!

ఈ దేశ సంస్కృతిని కాపాడే బాధ్యత యువతదే. అలసత్వముచే కాంచన సమమైన వారసత్వమును కాంచకుండా పోవుటకు కారణభూతులు కాకండి.
 31.05.2020
2. 8.74
కం. ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

ఇది నిజమునక్లు మనకు నిత్యపారాయణము కావలసిన పద్యము. ఈ
పద్యములకు పునర్వైభవము తెచ్చే ఈ ప్రయత్నములో నేను ఒక అడుగు
ముందుకు వేయగాలిగినా నా జన్మ ధన్యమయినట్లుగా భావించుతాను.
ఈ పద్యభావము అత్యంత సులభము. కానీ ఇది పాలలాంటిది. దీనినుండి నెయ్యి
తీయుట మన బాధ్యత.
సృష్టి కి లయమునకు తానే కారకుడగుటయేగాక వాని స్థితికి తానే కారణ భూతుడగుచూ సాక్షియై నిలచియున్నాడు. అట్టి కళంకములేని పరమాత్ముని ఆత్మబూని నేను భజించెదను.
ఈ ఋగ్వేద శ్లోకమును గమనించండి.
1-164
46 इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः सुपर्णो गरुत्मान |
एकं सद विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः ||
ఒక ఋగ్వేద సూక్తం  1-164
‘’ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహు హు ఔతో దివ్యహ సుపర్ణో గరుత్మాన్l
ఏకం సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం యమాన్ మాత రిష్వాన  మాహుహుll ‘’
ఈ సత్యాన్ని ఇంద్ర ,మిత్ర ,వరుణ ,అగ్ని ,సుపర్ణ ,యమ ,మాత రిశ్వ అంటే వాయువు గా పిలుస్తారు.
కాని  సత్యం ఒకటే .వివిధ నామాలతో పిలువ బడుతోంది .ఈ ఏకీకృత శక్తి నే వేదం ‘’సత్ ‘’అన్నది. అందుకే వేదం ‘’ఏక మేవా ద్వితీయం బ్రహ్మ ‘’అంటే సృష్టి కర్త ఒక్కడే .రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు  అని అర్ధం . అందువల్లనే పై పద్యములో 'ఆకలంకునిఅంటే ఎటువంటి కళంకము లేని వాని అని సంబోధించినాడు పోతన. పరమాత్ముడు సకలాత్ముడు అంటే రూపమును ధరించి దర్శనమిస్తాడు
అట్లే ఆయన ఆకలాత్ముడు అంటే రూప రహితుడు. కాబట్టి అంతా తనచేతిలోనే ఉంచుకొన్న వానికి కళంకము నాపాదించుట ఎట్లు? అంతే కాదు హరి హర రెండు శబ్దాలూ గ్రహించే గుణము కలిగినవే. అందుకే పరమాత్మకు శివ కేశవ భేదము లేదు. ఆయన హృదయ కుహరములోనే ఉంటాడు.  హృదయము అన్న మాటకు  అర్థమే తీసుకొని ఇచ్చే నిర్వాకము కలిగినది  అని. అది చెడు రక్తము తీసుకొని మంచి రక్తము నిస్తుంది. పరమాత్ముడు కూడా, మన నమ్మకమును బట్టి చెడు గ్రహించి

మంచిని ఇస్తాడు. ఈ సూక్ష్మము గ్రహించితే విశ్వమే సౌభాగ్యవంతమౌతుంది.
స్వస్తి.
మరొకమారు ఇంకొక పద్యముతో.........
16.06.2020
3. 8.75.
కం. లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
లోకాలు, లోకపాలకులు, లోకవాసులు, అందరూ నశించిన పిదప క్రమ్ముకొన్న
ఆ కారు చీకట్లకు ఆవల అఖండమైన తేజో రూపముతో ఎవరయితే వేలుగుచున్నాడో
ఆయనను నేను పరమాత్మునిగా, పరమాప్తునిగా సేవించుదును.
ఆ కారుచీకట్లు క్రమ్ముతనే ప్రళయము (ప్ర+లయము) అంటారు. భాగవతము లోని
 అంబరీషోపాఖ్యానములో ఈ ప్రళయమును గూర్చిన చర్చ వింటాము. ఆ విషయముల గూర్చి అతి క్లుప్తముగా
తెలియజేస్తాను.

సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియునగును. ఇటువంటి 360 దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము. దీనిని దివ్య సంవత్సరము అంటారు. ఇట్టి దివ్యసంవత్సరములు  నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. ఇట్టి ప్రళయములు యుగాంతమున మహాయుగాంతమున, మన్వంతరమున సంభవించునే యుండును. వీనికి వివిధములగు పేర్లతో పెద్దలు నిర్వచించినారు/ ఈ ప్రళయము సంభవించినపుడల్లా లోకములు భగవంతునిలో లయమైపోతాయి. తిరిగీ సృష్టి మొదలవుతుంది. కానీ ఆ పరమాత్ముడు అవినాశుడు. లోకాలన్నీ ఆయనే లయము చేసుకొంటాడు తిరిగీ వానిని సృష్టించుతాడు. ఇదీ ఆయన లీల. ఈ విషయమును నాలుగు చిన్న వాక్యములలో పోతన మనకు తెలియజేస్తున్నాడు.
మరొకమారు మరొక పద్యముతో......

Ramachandra Rao Bhandaru: Ramamohana Rao Garu,
You must have spent a lot of your quality time in writing this excellent article .
I will take a printout and preserve this.Every day in my morning puja , I recite
శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై --- Without knowing full meaning .Today I could fully understand .
Thank you for your excellent post .
Srinatha Babu: Mee visleshana maha adbutham. 🙏🙏🙏👌👌👌
Vasudha Wuntakal: అత్యద్భుతంగా వుందండి 🙏 🙏 🙏 🙏
Sudha Jandhyala: భాగవతం లోని పద్యాలన్నీ అద్భుతంగా మనకోసం కూర్చి పెట్టిన మహానుభావుడు దైవతుల్యుడు పోతనకు వందనమలు.వాటినన్నిటి ఏరి శ్రమకోర్చి

ప్రతిఫలాపేక్ష లేకుండా మాకందరికీ ఆసారాన్ని అందచేస్తున్న మీకు 🙇🙇🙇🙇🙇.
4. 8-86-క.
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
ఈ పద్యము ఎంత సహజముగా, అలతిపదములతో, ఒక పండితుడు కాని వ్యక్తి
చెప్పినట్లుగా మనకు చదివిన లేక విన్న వెంటనే స్ఫురించుతుంది. యధార్థ
జీవితమునకూడా ఈవిధముగా తలచుట కద్దు. నిజముగానే దైవాంశ లేనిదే
వాస్తవమునకు ఇంత దగ్గరగా ఎవరూ వ్రాయజాలరు. భావము సులభగ్రాహ్యమే
అయినా తెలియజేయుచున్నాను.
దీన బాంధవుడన్న పేరుగాంచిన పరమాత్మ, ఆర్తు లైన వారి వెంట, ఉత్తము లైన
యోగుల చెంత, అది ఇది కాదు అన్ని దిశలయందును ఉంటాడంటారు కదా!.
కానీ నన్ను కాపాడుటకు మాత్రము ఇప్పటివరకూ రాలేదు. అసలు “ఉన్నాడు
ఉన్నాడు” అనే ఈ దేవుడు ఉన్నాడో! లేడో!
కష్టములలో భక్తుని మానసిక సందిగ్ధతకు అద్దము పడుతూవున్నది ఈ పద్యము.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీముందుంచుతాను. పరీక్షకు ఒక విద్యార్థి కష్టపడి చదువుతాడు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడౌతాడు. ఇక అతను అతని తలిదండ్రులు తానెట్లు చదివింది, తామేట్లు చదివించింది ఒక నవలకు సరిపడా తమ తమ భాషనమును వినిపించుతారు. అంత శ్రమపడి ఆబాలుడు ఎదోకారణానికి అనుత్తీర్ణుతే తమను తప్ప తక్కిన వారందరినీ తిట్టిపోసే వాళ్ళే! ఎటూ వినిపించదులే అన్న గట్టి నమ్మకము కలవారై  దేవుని తమశక్తికి మించి కూడా ఆడిపోసుకొంటారు. వీరు ‘అయితే నామహత్మ్యం కాకుంటే నీ మహాత్మ్యం’ బాపతు మనుషులు. ఇంకొక విధమైన మనుషులు ఈ విధముగా ఉంటారు.  పెళ్లి అయిన తరువాతి కాలమున భార్య వండిపెడితే భర్త తినేవాడు. బాగున్నరోజు తెగమెచ్చుకొనేవాడు భర్త. బాగాలేకపోతే ఎట్లుబడితే అట్లు తిట్టేవాడు. అంటే తనపని జరిగితే దేవుని పోగడుతాడు జరుగక పోతే నోటికొచ్చిన మాట మాట్లాడుతాడు.
ఆ రెండింటిలో మొదటిది ‘అస్థిర నిశ్చలత’ (Unstable Eqilibrium) రెండవది తటస్థ నిశ్చలత (Neutral Eqilibrium). కానీ మనకు వలసినది ‘స్థిర నిశ్చలత’ (Stable Eqilibrium) . అంటే మంచికి చెడుకు బాధ్యత ఆయనపైనే ఉంచి తదేక భక్తి ధ్యానములతో తమను తాము భగవంతునికి అర్పించుకొనుట. భగవంతుడు కూడా గీతలో  చెప్పినది అదేకదా!. అప్పుడు కలిగేదే నిజమైన ఆనందము. ఎందుకంటే ఆ స్థితిలోనే ఆత్మ పరమాత్మతో అనుసంధానము కాగలుగుతుంది.

 Ramachandra Rao Bhandaru:
ఆంధ్ర భాగవత వినీల ఆకాశంలో నక్షత్రములు అను మీ వ్యాసాలను మళ్లీ చదివాను . ఎన్ని సార్లు చదివినా తనివి
తీరని ఆ భాగవత పద్యాలను , మీ సరళ మైన వ్యాఖ్యానం మళ్లీ చదివాను .ముఖ్యంగా గజేంద్ర మోక్షము మీద మీరు రాసిన వివరణ చాలా బాగుంది .
నన్నయ్య , తిక్కనలు భాగవతాన్ని రాసే
మహత్తర మైన అవకాశం తనకు మిగిల్చారు అని చెప్పుకోవడం పోతన గారి హృదయ విశాలము ను సూచిస్తుంది. ధన్యవాదములు .
మరొకమారు మరొక పద్యముతో .............................
5. 8-90-శా.
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
నిరాశ,నిస్పృహ, బలహీనత, నీరుగారిన పోరాట పటిమ, వారి బలోద్ధతి ఇన్ని
ఒకసారిగా ఒక బలహీనునిపై బడితే అతనికి ఆ పరాత్పరుదుఇగాక వేరెవరు
గుర్తుకొస్తారు. అట్టి వ్యక్తియొక్క వేదికోలె ఈ పద్యము. ఎంత భావగార్భితమో
చూడండి.
నాలో శక్తి క్షీణించినది. ధైర్యం సడలి పోయినది. ప్రాణములు నెలవులు
తప్పుతున్నాయి. మూర్చ వస్తూవుంది. శరీరము అలసిపోయింది. శ్రస్మ
అధికమైపోయింది. నీవు తప్ప ఇతరు లెవ్వరు నాకు తెలిసివచ్చుట లేదు. నీవే
దిక్కు. ఆర్తితో ఉన్న ఈ దీనుని ఆదుకోవయ్యా స్వామీ! రా తండ్రీ! కరుణించు,
నన్ను కాపాడు ఓ భద్రాత్మకా! భద్రాత్మకా అంటే శుభమును, సౌభాగ్యమును,
శాంతిని అదంతా ఎందుకు సర్వమంగళత్వమును సమకూర్చేవాడా రక్షించు.
ఒక పద్యముగా దీనికి, ఒక 5౦ సంవత్సరముల క్రితము ఎనలేని ప్రాచుర్యము
వుండినది. ఆనాడు శాంతినివాసము అన్న సినిమాలో నాయకుడయిన
నాగేశ్వరరావు గారు ఘంటసాల గారి గానదానమునకు అభినయించుతారు.
కథకు అనుకూలముగా చివరిపాదము మార్చి ప్రాణేశ్వరీ అన్న సంబోధనతో
ముగిస్తారు. కొందరు ‘లా’ అన్న అక్షరమును మాత్రమే తీసుకొని ఆకాలములోనే
లేదు అని వ్యంగ్యముగా ఛణుకులు విసరేవారు.
ఇదంతా అట్లుంచితే, ‘జీవనము’ అన్న మాటకు రెండు అర్థములున్నాయి. ఒకటి మనము భూమిపై పుట్టి
అనుభవించే కష్ట సుఖములతో కూడిన జీవనము.  రెండవది ఆటుపోటులతో అతిభయంకర
జలచరములతో హృదయవిదారకముగానూ , కలువలు తామరలతో, లేత గాలులు తాకుటచే పరవశించి
హొయలుపోతున్న అలలు మొదలగువానితో ఎంతో హృద్యముగానూ ఉన్న నీటికి మన జీవితాలకూ ఎంతో పోలిక వున్నది. అహంకారము అన్న ఆభారణమును ధరించియే మానవుడు పుడుతున్నాడు. అది ఉన్నంతసేపూ దేవుడూ లేడు దైవమూలేదు. ఎప్పుడయితే తాను క్రుంగి కృశించి అహము నశించి పోతుందో
అప్పుడు తనపైవాడు గుర్తుకొస్తాడు. ఏనుగు మానవ అహంకారమునకు ప్రతీక. అందుకే మదించి పరివారముతో కొలనులో దూకి నానా భీభత్సము చేస్తుంది. ఎప్పుడయితే విడచిపెట్టని బాధ మొసలి రూపములో పట్టుకొనిందో, ఎప్పుడయితే తనకు చేతకాదు అని ఏనుగు\మనసు నిర్దారించుకొనిందో అప్పుడు దైవము, శరనాగాతము గుర్తుకొచ్చి నీవుతప్ప ఎవరూ లేరని పరమాత్మును వేడుకోనింది.
అందుకే కబీరు దాసు ఒక సందర్భములో ఈ విధముగా అంటాడు:
दुःख में सुमिरन सब करे
सुख में करे कोई
जो सुख में सुमिरन करे
तोह दुःख काहेको होय
దుఃఖములో దేవుని అందరూ స్మరించుతారు. సుఖములో మరచిపోతారు. మరి అదే సుఖములోకూడా మరవకుండా పరమాత్ముని తలచితే దుఃఖము లో తలచే అవసరమే రాదు కదా! కానీ దీనికి శ్రద్ధ ఏకాగ్రత, చిత్తశుద్ధి అత్యంత ఆవశ్యకము. ఈ పద్యాన్ని ఎంత విశ్లేషించినా అది తక్కువే.
ఇంత చరిత్ర వున్నది ఈ పద్యానికి.
స్వస్తి.

మరొకమారు మరొక పద్యముతో......

6.8.95.
మ. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.
ఆపన్న ప్రసన్నుడగు ఆపరమాత్ముడు ఆ సమయంలో వైకుంఠంలోనే ఉన్నాడు.
వైకుంఠములో ఎక్కడ వున్నాడు అన్నది కాస్త విడమరచి చెప్పవలసివుంటుంది.
ఎందుకంటే ఈ పద్యములో; ఆ మూల సౌధమ్ము దాపల; అన్న మాట వస్తుంది.
దానికి భావమును వ్రాస్తూ కొందరు; ఒక ప్రక్కగా; అనికానీ; ఏదో మూలలో;
అని కానీ వ్రాస్తూ వుంటారు. ఆ పద్యార్థమునకు సమన్వయము కుదరదు.
‘మూల’ అన్న సంస్కృత పదమునకు ప్రదానమైన, ముఖ్యమైన, (Important,
Central) అన్నవి సరియగు అర్ధములు. తెలుగులో ‘మూల’ అంటే ఒక కొసన, (A Corner) ఒక ప్రక్కన అని అర్థము. మూల అన్నది తెలుగు పదముగా ఉపయోగించి ఉంటే ‘మూల మేడ’ అని వ్రాయవలసియుండేది. ఇక్కడ మూల, సౌధము అన్నవి రెండూ సంస్కృత పదములే అట్లు కాకుంటే తెలుగు మూల సంస్కృత సౌధమునకు సంధి పోసగదు, అంటే వ్యాకరణము ఒప్పుకోదు. కావున మూల సౌధము అంటే ముఖ్యమయిన మేడ. ఈ ‘మూల’, మూల స్తంభము, మూల పురుషుడు, మూల మంత్రముమూల కారణము, మూలగుణము మొదలగు శబ్దములయందు వలె ప్రధానమైన అన్న అర్థములోఉపయోగింపబడినది. 
సౌధము అన్న పదమునకు సుధచే అంటే సున్నము లేక గచ్చుచే నిర్మింపబడినది అని అర్థము. సుధా అన్పూన పదమునకు అమృతము అన్న అర్థమే కాకుండా సున్నము అన్న అన్వయముకూడా వున్నది.  సిమెంటు లేని కాలములో సిమెంటుకు ప్రత్యామ్నాయముగా సున్నము మరియు ఇసుక యొక్క మిశ్రమమును వాడేవారు. తగు పాళ్ళలో రెంటినీ కలిపి ఒంటి ఎద్దు గానుగలో ఆ మిశ్రణమును పోసి తోడుగా నియమిత రీతిలో బెల్లము కోడిగుడ్లను కలిపి, ఆడించేవారు. ఆ మిశ్రణము ఎంతో తెల్లగానూ చాలా గట్టిగానూ, ఎంతో నునుపుగానూ ఉంటూ మేడల గోడలను తీర్చిదిద్దేవి. ఇక ఆగోడలకు వేల్లవేయు అవసరము కూడా ఉండేది కాదు. ఇందుకు ఉదాహరణ, నేటికీ, మన దేవాలయమును పడగొట్టి, మీర్ జుమ్ల గండికోటలో కట్టించిన పాలరాతి కట్టడమును బోలిన మసీదే తార్కాణము.
ఇక భావము తెలుసుకొందాము.
ఆ వైకుంఠము లోని అంతఃపురంలో ప్రధాన సౌధమునకు అనగా మేడకు
సమీపములో వున్న మందార పుష్పవనమునందలి అమృత
సరోవరమునానుకొనియున్న చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల
పాన్పుపై లక్ష్మీదేవితో వినోదించుచుండినాడు పరమాత్ముడు. అట్టి తరుణమునందు
భయకంపిత మతియైన కరిరాజు, రక్షించుము, రక్షించుము,  పాహి పాహి యని
మొరపెడుతున్న దీనాలాపము విని పరమాత్మ ఆ గజరాజును, క్షణమాలస్యము చేయకుండా కాపాడ ఉద్యమించినాడు. ఇక్కడ మహా భక్తుడగు పోతన ఏమి చెప్పదలచుకొన్నాడంటే, దీనుని ఆర్తనాదము పరమాత్ముని చెవిన పడితే చాలు తాను ఎంత ముఖ్యమైన పనిలో వున్నా, ఎంత వినోద క్రీడల తెలియాడుచున్నా, ఉన్న ఫళంగా  భక్త రక్షణార్థము బయలుదేరుతాడు. త్రికరణ శుద్ధితో కూడిన మన ప్రార్థన ఆయన చేవినబడుటయే ఆలస్యము. అందువల్ల మన భక్తి ఏకాగ్రచిత్తముతో కూడియుండుట ఎంతో అవసరము.
స్వస్తి.

మరొకమారు మరొక పద్యముతో..........

7. 8-96-మ.  

7.8.96.

మ.  సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁడభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

భక్త సంరక్షణయే లక్ష్యముగా గలిగిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు,

శంఖచక్రములను చేతులలో ధరించలేదు, సేవకులను తనతో రమ్మనలేదు,

వాహనమయిన గరుత్మంతుని అధిరోహించ తలువలేదు, చెవికుండలాల వరకు

జారిన జుట్టుముడిని సరిచేసుకోలేదు. అంతెందుకు, ప్రణయ కలహములో పట్టిన

లక్ష్మీదేవి పైటకొంగును కూడా వదలక పరుగిడసాగినాడు పరమాత్ముడు. ఆర్తికి

ఆర్త రక్షణకు గజేంద్రుడు గోవిందుడు కొలమానములైనారు.

ఈ పద్యమునకు సంబంధించి ఒక కథ ప్రాచుర్యములో ఉన్నది. శ్రీనాథుడు పోతన్నకు తన చేల్లెలునిచ్చిన బావగారు. నేను నిజానిజాలు చర్చించ దలచలేదు. ఒకసారి ఆయన తన భార్యాపుత్రునితో చెల్లెలి యింటికి వస్తాడు. ఆయన వచ్చుటకు కొన్నిరోజులనుండి భాగవతములో గజేంద్రమోక్ష ఘట్టమును పోతన వ్రాస్తూవుండినారు. ‘అలవైకుంఠ పురంములో.....’పద్యమును ముందుకు నడిపించుటకు తోచక అట్లే వదలి వెళితే ఆయన రూపములో వచ్చి ఆ పద్యమును పూరించి ఆ ఇల్లాలి చేతి వంట తిని వెళుతాడు. పరమాత్మ వెడలిన మరుక్శనము ఇల్లుజేరిన పోతన అద్భుతమైన ఆపద్య పూరణ చూసి ఎవరు పూరించినారు అని అడిగితే ‘మీరే కదా’ అని ఆ ఇల్లాలు చెప్పుటతో ఒక నిముసనమునకు అప్రతిభుడైనా తేరుకొని వాస్తవమును అర్థము చేసుకొని ‘నాకు కనిపించకుండా పోయినావా’ అని విలపించుతాడు. ఆ పద్యము అంతటి మహత్తు కలిగియుండగా ఈ పద్యమును గూర్చిన కథ, నిజానిజాలు ప్రక్కనబెట్టి, తెలియని వారి కొరకు తెలియజేస్తున్నాను.

భోజనము ముగిసిన పిమ్మట, శ్రీనాథుడు కుటుంబ సమీతముగా వచ్చుటకు కొంచెము ముందే పూర్తిచేసిన పై పద్యమును శ్రీనాథునికి చూపుతాడు. శ్రీనాథుడు అది చూసి చేత చక్రము గద కూడా లేకుండా పోయి ఏమిచేస్తాడు మహావిష్ణువు అని కొంత హేళనతో కూడిన స్వరములో అంటాడు. ఆ మాట విన్న పోతన కుమారుడు మల్లన పెరటిలోకి పోయి అక్కడ ఉన్న ఒక బండరాయిని నూతిలోకి బలంగా విసురుతాడు.

శబ్దము విని ఉలికి పడిన ఇంటిలోని వారితో శ్రీనాథుని కొడుకు బావిలో పడినట్లు చెబుతాడు మల్లన. భుజము పై ఉత్తరీయము కూడా లేదని చూచుకోకుండా శ్రీనాథుడు బావి వద్దకు పరుగు తీస్తాడు. అప్పుడు మల్లన్న ‘మామగారు చూసినారా! మీ కుమారుడు పడినాడు అంటూనే వంటిపై వస్త్రము కూడా లేకుండా పరుగెత్తినారే మరి బిడ్డలకన్నా మిన్నయైన భక్తులు ఆపదలో ఉంటే మరి ఆయుధాభరణములు ధరించి నింపాదిగా వెళ్తాడా! అని నింపాదిగా అడిగినాడట.  శ్రీనాథుడు పోతన ముందు తన తప్పు ఒప్పుకొన్నాడట.

ఈ కథలోని నిజానిజాలు ప్రక్కన ఉంచితే ఆర్తత్రాణ పరాయణుడగు పరమాత్మ భక్తుని కాపాడుటకు సందేహము లేకుండా ఆలస్యము కాకుండా వస్తాడు అన్నది మనము గ్రహించవలసిన విషయము. కానీ అది భక్తిలో త్రికరణ శుద్ధి ఉన్న వ్యక్తికే సాధ్యము.

కావున చిత్తము మొత్తము పురుషోత్తము పై నిలిపి ఆ ఆకలంకుని సేవించుదాము.

స్వస్తి.

మరొక సారి మరొక పద్యముతో.........

8. 8-98-మ.

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె

న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ

క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

అంత హటాత్తుగా లక్ష్మీదేవి కొంగు కూడా వదలకుండా శ్రీమన్నారాయణుడు

బయలుదేరటంతో, ఆయన వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు,

వారి వెనుక గరుడుడు, ఆయన తోకూడా విల్లూ గదా శంఖచక్రాలు

నారదుడు,సైన్యాధ్యక్షుడు( విష్వక్సేనుడు) బయలుదేరగా, వారి వెంట వరసగా

వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరు కూడా బయలుదేరినారు.

ద్రుశ్యమానము చేయు ఈ పద్యము పోతన్న సృష్టించిన పరమాద్భుత

పద్యములలో ప్రముఖమైనది. నడకలో భావంలో ఉత్తమ మయినది. ఇక్కడ

పోతన పద్యమును నడిపించలేదు, పరుగులేత్తించినాడు. ఏమి జరుగుతూవుందో

అన్న అందోళన మహావిష్ణువు పరిజనములందేగాక పాఠకులలో కూడా

ఉత్కంఠత నెలకొల్పినాడు. ఆయుధములు కూడా ఆయన వెంట పరుగిడినవంటే

ఎంత నిబద్ధత కలిగియున్నాయో చూడండి. ఆయన భక్తులపై ఎంత నిబద్ధ్గత 

కలిగియున్నాడో గమనించండి.

మనము జాగ్రత్తగా గమనించితే, భాగవత పద్యాల్లో చూస్తే.. ‘ఈశ్వరా’ అన్న 

సంబోధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు, విష్ణువూ 

కాదు. బ్రహ్మా కాదు. ఈ ముగ్గురికీ మూల పురుషుడైనట్టి పరబ్రహ్మ, పరంధాముడు

పరమేశ్వరుడు. అండ పిండ  బ్రహ్మాండాలకు అధిపతియైున అట్టి పరమేశ్వరుడు.  

ఆత్మచైతన్యస్వరూపుడు అయిన భగవంతుణ్ని ప్రార్థించినాడు. మరి ' విష్ణువు 

చక్రాయుధుడై వచ్చి కాపాడటమేమిటి' అంటే మనం భగవంతుణ్ని ‘ఫలానా 

రూపంలో వచ్చి నన్ను కాపాడు’ అంటే అలాగే వస్తాడు. ఏ రూపమో ప్రత్యేకించి 

చెప్పకపోతే.. స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు కాబట్టి  విష్ణువు 

రూపములో  ఆయన వచ్చినాడు.

ఇక్కడ ఆలోచించవలసిన విషయము ఒకటుంది. ఆ పరబ్రహ్మను 'అయ్యా! నీవు వచ్చి 

నన్ను రక్షించు' అని అన్నాడు. ఆయుధాలతో దాసీ జనముతో, వాహనాలతో, లక్ష్మీ 

దేవితో రమ్మనలేదు. ఆర్తిలో ఆ పరమాత్మునికి చ్వేరగల విన్నపము ఉంటె అదిచాలు. 

భక్తునికి కావలసినవి అన్నీ తన తోడు తెస్తాడు.  అందుకే గజేంద్రుడు కేవలం 

భగవంతుణ్ని వచ్చి తన ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరితేఆయన తన  వెంబడి 

లక్ష్మీదేవిఅంతఃపుర స్త్రీలు, గరుత్మంతుడువిల్లు, గద మొదలైన ఆయుధాలు, ఆపై 

వైకుంఠానికి విష్ణు దర్శనానికి వచ్చిన నారదుడు. ఈ విధముగా వైకుంఠములో 

ఉండే అందరూ ఎందుకు వచ్చినట్లు? దీనికి ఒక అర్థము ఒక అన్వయము ఉంది. 

మనం భగవద్దర్శనము చిత్తశుద్ధితో కోరితే చాలు, ఆ దర్శనముతోనే సిరిసంపదలన్నీ 

వస్తాయి. దాసదాసీజనం సమకూరుతారు. వస్తువాహనాలు కొనగలిగే శక్తి 

సమకూరుతుంది. మనల కాపాడుటకు, మనకు సహకరించుటకు, సర్వాయుధాలూ 

వస్తాయి. అత్యున్నత అధికారులందరూ మనచుట్టూ తిరుగుతారన్నమాట.

 ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ మంత్రుల 

చుట్టూ తిరగడం మాని ఒక్క పరమాత్మును చుట్టూ మాత్రమే మనసును ప్రదక్షిణం 

చేయిస్తూ భాగవతం రచించినాడు. అందుకే, శ్రీనాథునిలా కాకుండా, ఆయనకు 

ఇహలోక జీవితములో వచ్చిన కష్టాలు కడగళ్ళనన్నింటినీ దాటుకొని, పరలోకంలో 

మోక్షమును దక్కించుకొన్నాడు. కావున మనము  ఈ రహస్యమును  గ్రహించి 

భగవంతుని యందు నమ్మకముంచి ఆత్మవిశ్వాసంతో మన పని మనము 

నిర్వర్తించితే ఇహమూ పరమూ రెండూ దక్కుతాయి.

వేరోకమారు వేరొక పద్యముతో......

9-8-103 (తేదీ. 10\09\20)

క. అడిగెద నని కడువడిఁ జను

నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్

వెడవెడ సిడిముడి తడఁబడ

నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

అప్పుడు శ్రీమహాలక్ష్మీదేవి భర్తను అడుగుదామని వేగంగా అడుగులు వేస్తుంది.

అడిగితే మారు పలుకడేమో అని వెనుకకు తగ్గుతుంది. కలబోసిన తొట్రుపాటు

చీకాకుతో అడుగు ముందుకు వేసేది. అంతలోనే అడుగును ఉపసంహరించుకొనేది.

ఈ పద్యము ఒక చమత్కారమయిన పద్యము. మొదట ఇది సర్వ లఘు కందము. 

గణ భంగము కాకుండా 2,4 పాదాంతములందు ‘న’కారము చేర్చుట

తప్పించితే అన్నీ లఘువులే. ఎందుకు అంటే మరి లక్ష్మీదేవి మనసు కిం కర్తవ్య

విమూఢత ముప్పిరిగొని వుంది. అందువల్ల అడుగు లఘువుగా పడుతూవున్నది

కాబట్టి అన్నీ లఘువులే ఆయన వాడినారేమో! ఇక తడబాటులో ప్రధానాక్షరము

‘డ’. అందువల్లనే నెమో ‘డ’ ను వృత్యనుప్రాసలో అలవోకగా అమర్చినాడు. శబ్ద

సౌందర్యమే కాకుండా ఈ పద్యములో అపురూపమయిన భావ సంపద కూడా

జొప్పించిన ఘనుడు మన పోతన్న.

మరొక పద్యముతో మరొకమారు.........

10-8-114

 

క. మకర మొకటి రవిఁ జొచ్చెను;

మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;

మకరాలయమునఁ దిరిగెఁడు

మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.

భావము:

మకరము  అంటే మొసలి అన్నది మనకు తెలిసినదే! భూలోకంలో ఒక మడుగులో ఉన్న

గజేంద్రుని హరించ సిద్ధపడ్డ ఒక మకరమును  విష్ణువు తన చక్రముతో ఖండించుటచే 

విశ్వవ్యాప్తముగా ఉన్న వివిధ మకరములు విపరీతమగు భయందోళనములకు 

గురియైనాయట. కవి చమత్కారం యిది.

ద్వాదశరాశులలో ఉండే మకరము (1మేషము 2వృషభము 3మిథునము

4కర్కాటకము 5సింహము 6కన్య 7తుల 8వృశ్చికము 9ధనుస్సు 10మకరము

11కుంభము 12మీనము అనబడే ద్వాదశ రాశులలోని మకరము) సూర్యుని

చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరము (1మహాపద్మము 2పద్మము

3శంఖము 4మకరము 5కచ్ఛపము 6ముకుందము 7కుందము 8నీలము

9వరము అనబడే నవనిధులు కుబెరునివద్దఉన్నాయి.) కుబేరుని చాటున

దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు అంటే మొసళ్ళు ఆదికూర్మం(విష్ణువు

ఆది కూర్మావతారుడు కదా!) చాటునకు చెరుకొన్నాయి. ఇది కవి

చమత్కారమును ప్రస్ఫుటము చేసే పద్యము.

ఉపసంహారము

శతభిషం - శత భిషజ - శతతార

శతభిషము అన్న పదమునకు బదులుగా ఈ శతతార అన్న అన్న మాటను విక్రమార్కుని నవరత్నములలో ఒకడగు వరరుచి మొదటిసారిగా వాడినట్లు తెలియవస్తూవుంది. దానినే, అదే రాజాస్థానము లోని కాళిదాసు - 1, రఘువంశ, కుమారసంభవాది కావ్య నాటక రచయిత, 'మండలాభ శతతారక పురైః' అని తాతన కావ్యములయండు ఒకదానిలో వాడినాడు.   ఫలానా కావ్యమన్నది నిర్దుష్ఠముగా నాకు జ్ఞాపకము లేదు.

శత అన్న పదము నూటికి సంకేతమని మనకు తెలిసినదే! శతభిషము అంటే శతతార అంటే నూర్లకొద్దీ తారలను కలిగినది అని అర్థము, నూరు తారలు మాత్రమె అనికాదు. మనపూర్వులు  27 నక్షత్రాలను గుర్తించి వానికి అశ్వని, భరణి, కృత్తిక  మొదలగు 27 పేర్లను పెట్టినారు. ఖగోళ శాస్త్రములో వాణి వర్ణన విస్తారముగా చేసినారు. అవి నిజానికి కొన్ని తారకల సమూహములు.  దేని దేనిలో ఎన్నెన్ని వున్నాయన్నది వారే వాకృచ్చినారు. ఆవిధముగా చెప్పబడినదే శతభిషము.

ఇక్కడ మనము ఒక విషయమును గ్రహించవలసియుంటుంది. మనము మన పూర్వుల వ్రాతలకు కొన్ని కొన్ని అన్వయములను చేసుకొంటున్నాము, ఎందుకని? 

కారణమేమిటంటే పూర్వులు తరువాతి తరములవారు సులభముగా గుర్తుంచుకొనుటకు గానూ తాము చెప్పదలచినది శ్లోకరూపములో వ్రాసినారు. సాధారణముగా శ్లోకమునకు రెండు పాదములు. మరి తెలుపదలచిన భావమును స్థలాభావము లేకుండా చెప్పుటకు మరియు పాఠకుడు సులభముగా గుర్తుంచుకొనుటకునూ ఈ విధముగా వ్రాయుట జరిగినది. అందుకే ధారణ గలిగినవారు నేటికీ, మహా కావ్యములను కూడా కంఠస్థము చేసియుండుట మనము చూస్తూనే ఉన్నాము. పై పెచ్చు శ్లోకము అంటే చందోబద్ధమై వుంటుంది. కావున అర్థము చెడకుండా తగిన పదమును వారు ఆచితూచి వేస్తారు. కావున విశ్లేషణ తప్పదు. అసలు ఈ విధముగా కంఠస్థము చేసుకొని ఉంచుకొనుట చేతనే వేదశాస్త్రపురాణాదులు భూమిపై నిలచినవి. లేకుంటే అన్నీ అగ్నికి ఆహుతాయి ఉండేవి తురుష్క పాశ్చాత్య పాలనలలో!

తిరిగీ విషయమునకు వస్తే శతభిషము కుంభరాశికి చెందినది. దానికి అధిపతి వరుణుడు. ఆతని వాహనము మకరము. ఎందుకంటే ఆకాశములో క్రింద మకర రాశి పైన కుంభరాశి ఉంటుంది. రాసుల పేర్లు చెప్పేసమయమున మకరము తరువాతనే కదా కుంభము వస్తుంది. ఈ కుంభరాశికి అధిపతి వరుణుడు. వరుణునికి క్రింద మకరము వున్నది కావున, వరుణుని వాహనము మకరమైనది. ఒకవేళ అదే కుంభమునకు పైన వుండి వుంటే ధ్వజమై వుండేది.

ఈ 27 నక్షత్రములు సూర్య గతితో సంబంధమున్నవి. ఇవికాక అనంతమగు నక్షత్రములు నింగిలో మనకు కనిపించుతాయి. అందులో దక్షిణార్ధగోళములో కనిపించే ఒక నక్షత్రము అగస్త్య నక్షత్రము. ఇది మన భారతీయ ఋషులు ఆ నక్షత్రమునకు పెట్టుకొన్న పేరు. దీనినే ఆంగ్లములో Canopus అంటారు. ఆవిధముగా దానికి దగ్గరగా కనిపించే ఇంకొక నక్షత్రము ‘ఇంద్రద్యుమ్న’ నక్షత్రము. ఇది చాలా పొడవైన నక్షత్రమని చెబుతారు. బహుశ ఆయన కీర్తి అంతగా విస్తరించినది అన్న మాట అందుకే చెబుతారేమో! ఆంగ్లములో FOMALHAUT అని వ్రాస్తారు FOMALO అని పలుకుతారు. ఇక్కడ మేరు పర్వతమందు ద్రోణము అంటే లోయలో వరుణుని వనము అందు తటాకము అందు ఆయన వాహనము మొసలి వున్నది.

 

కృతయుగకాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా పరిపాలిస్తూండేవాడు. ఎన్నో యజ్ఞకార్యాలు కూడా చేయడంతో అతను మరణించిన పిదప స్వర్గము చేరినాడు. ఆయన  స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తూ ఎంతకాలం వుండినాడో అతనికే తెలియదు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుని వద్దకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలము ముగిసింది తిరిగీ  భూలోకమునకు వేరొక జన్మతో  వెళ్లవలయు’ నన్నారు.

‘మరి నేను ఇంకా కొంతకాలము ఇచట వుండే అవకాశము లేదా అన్నాడు’ ఇంద్రద్యుమ్నుడు.  అప్పుడు ఇంద్రుడు ‘నీవుచేసిన పుణ్యకార్యములవల్ల ఇంకా నీపేరు భూమిపై తలచుకొనబడుతూ వుంటే నీకు ఇచట ఇంకా వుండే అవకాశము వుంటుంది’ అని అన్నాడు. ఇంద్రుని మాటకు వల్లెయని ఆయన దేవదూతలతో  భూలోకమునకు బయలుదేరినాడు. తన తదనంతరము ఎన్నో మార్పులు వచ్చుటచేత ఇంద్రద్యుమ్నునకు భూలోకము కొత్తగా కనిపించింది. తెలిసిన వారెవరూ కనిపించలేదు. భూలోకవాసులలో అతి వృద్ధుడగు మార్కండేయునివద్దకువెళ్ళి  తననుగూర్చి అడిగితే ‘నేనపటికి పుట్టలేదేమో! అందుచే నాకు తెలియదు, నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబను అడిగితే  విషయము తెలియగలదు’ అన్నాడు మార్కండేయుడు.

 

అందరూ కలిసి ఆ గుడ్లగూబ వద్దకు వచ్చి  అదే ప్రశ్న అడిగితే  ‘మీరెవరో నాకు తెలియదుకానీ నాకన్న వృద్ధుడగు  ‘నాళీకజంఘుడు’ అను కొంగను అడిగితే తెలుసుకొనే అవకాశము వున్నది’ అని చెబుతూ  అందరూ కలిసి ఆ కొంగ దగ్గరకు బయలుదేరినారు. ఇంద్రద్యుమ్నుని అదే ప్రశ్నకు ‘నాకన్న పెద్దయగు ‘ఆకూపారుడు’ అన్న తాబేలు కు తెలియవచ్చు,వెళ్లి అడుగుదాము రండి ’ అనుటచే అందరూ కలిసి నాడీజంఘుని వద్దకు వచ్చినారు. యథాలాపముగా రాజు  ‘నేనెవరో తెలుసా’ అని అడిగినాడు అకూపారుని. అందుకు అకూపారుడు ‘మిమ్ము నేనెలా మర్చిపోగలను. మీరు ఎన్నో యజ్ఞములు చేసి అపారమగు గోదానములు ఇచ్చుటచే లక్షలసంఖ్యలో తోలుకోనిపోబడుచున్న ఆ ఆవుల కాలి గిట్టల తొక్కుడు చేత ఈ కొలను ఏర్పడగా మాకిది వాసయోగ్యమైనది. ఎడతెగని నీటియూట గల్గిన ఈ హ్రదమునొదిలి వేరేచోటికీ వెడలు అవసరము మాకు కలుగలేదు అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని మీ పేరే పెట్టుకొన్నాము. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు. దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లటంజరిగింది. ఆయన తన పుణ్య ఫలము తీరిన తరువాత భూమిపై పుట్టి ప్రజారంజకముగా పాలన సాగించుచూ, ఎదో కారణమున అదే పర్వతమున తపము నాచారించు సమయమున వచ్చిన అగస్త్యునికి సముచిత గౌరవము సేయలేకపోయినందున అగస్త్యుడు "మదముచే కన్నూమిన్ను కానక వ్యవహరించినందుకు మదగజమువై పుట్టుము, నీ పరివారము కూడా ఏనుగులై నీతో ఉండుగాక!"" అని శపించుతాడు. ఆ గజేంద్రుడే మన గజేంద్రమోక్షము లోని గజేంద్రుడు.

ఇపుడు ఈ కథకు మన నక్షత్రమండలమునకు గల పోలిక చూస్తాము. బేయర్ అన్న పాశ్చాత్య శాస్త్రజ్ఞుడొకడు దక్షిణార్ధములోని అంటే మన దక్షిణాపథమునకు ఇంచుమించు 17౦౦ క్రీ.శ. లో వచ్చి ఆకాశమున కొంగను బోలిన నక్షత్ర సముదాయమును జూసి దానికి Gruss అన్న పేరును పెట్టినాడు. Gruss అంటే లాటిను భాషలో కొంగట. అట్లే అతను గుడ్ల గూబ ఆకారమును బోలిన నక్షత్రతతిని జూచి Phoenix అన్న పేరు పెట్టినాడు. క్రీ.శ. 1752 లో Lokeyt అన్న పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు తాబేలు వంటి నక్షత్ర సముదాయమును మన దక్షిణ దేశమున గమనించి దానికి Sculptor అన్న పేరును పెట్టినాడు. ఇపుడు కథలో వచ్చిన ముఖ్యమగు పేర్లతో నక్షత్రములున్నట్లు మనకు పాశ్చాత్యులు చెప్పుటచే, వారు మనకు ఆరాధ్యులగుటచే, రూఢియైనది. కథ జరిగినదా లేదా అన్న తర్కమును వదలి పెద్దలు ఆకాశములో కనిపించే వాస్తవాలతో చెప్పిన కథ మనము మరువము కదా!

భాగవత కథనము ప్రకారము ఈ మకరి బారిన పడి గజేంద్రుడు మోక్షము పొందుతాడు. పైన తెలిపిన ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని శాపముచే మదించిన ఏనుగుల రాజవుతాడు. పైన తెలిపిన అగస్త్య,ఇంద్రద్యుమ్న శతభిష నక్షత్రములున్నపుడు అక్కడ ఈ మత్తగజ నక్షత్రము ఉన్నదేమో! లేక ఇంద్రద్యుమ్న నక్షత్రమే ఆరూపమున ఉన్నదేమో! ఏనుగు శరీరము ఎక్కువ పొడవును కలిగియుంటుంది కదా! అదీ అంతరిక్షములో గజేంద్రుని కథ. నాకయితే ఈ విషయము తారసిల్లలేదు. ఇంకా శాస్త్రజ్ఞులు కనుగొనవలసి ఉందేమో!

స్వస్తి

భాగవతము-అష్టమస్కంధము-బలిచక్రవర్తి కథ

1-8-574

క. వ్యాప్తిం జెందక వగవక

ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం

దృప్తిం జెందని మనుజుఁడు

సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?

తనకు ప్రాప్తించిన లేశమయినా, విర్రవీగకుండా విచారించకుండా ,

అదే పదివేలుగా భావించి తృప్తి పొందవలెను. ఆవిధముగా

తృప్తిపడనివారికి సప్తద్వీప సంపదలు వచ్చిచేరినా ఉపయోగము లేదు.

మానవుడు మొదట గ్రహించవలసినది తన శరీరము  నశ్వరము లేక క్షణ 

భంగురము అన్నది.

 జనన మరణ చక్రవలయ నిలయం. ఆత్మ  నిత్యము, సత్యము, శాశ్వతము,అనంతము, ఆనంద మయము. అనేకులు అజ్ఞానాంధకారానికిలోనై శరీరమే శాశ్వతమని భ్రమించి అరిషడ్వర్గాలను ఆశ్రయించి అధోగతిపాలైపోతారు. కొంతమంది ఆధ్యాత్మిక శిఖరాల్ని అధిరోహించి తత్మాన్వేషణతో ఆత్మను తెలుసుకొని ప్రయోజకులై సమాజాన్ని ఉద్ధరించి జీవన్ముక్తులవుతారు.

కానీ నేటి కాలములో చాలామంది పరతత్వము తమ ఎరుకలోనికి రాకుండానే దానిని బోధించే ప్రయత్నమూ చేస్తారు. అందులోని నిజాయితీ వారికే తెలియవలెను. అసలు పరతత్వము అన్నది శుభ్రమగు మంచినీరు అనుకొంటే, అనీతిని త్రుప్పు లేక చిలుము పట్టిన లోటాతో త్రాగము. నీరు త్రాగాలంటే లోటా లోపల బయట శుభ్రముగా ఉండితీరవలసినదే! కావున ముందు దేహమును ‘స బాహ్య అభ్యంతర శుచి’ అంటే లోపల బయట శుభ్రపరచుకోవలసిందే! జీవితమంతా పైమేరుగులకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కారణాంతరములచే వైద్యా లయములో చేరినాడనుకొందాము. అంటే అంతశుద్ధి లేదనియే కదా అర్థము. నేలరోజులకూ ఆస్పత్రిలో ఉంటే మేకప్పు అనే పైకప్పు మాయమౌతుంది. అప్పుడు అడ్డమే అతనిని వెక్కిరిస్తుంది. అందువల్ల మనసు వాకు కర్మ ఎప్పటికీ పరిశుద్ధముగా ఉండవలెను. అప్పుడు పరతత్వ సాధన చేసి పరమాత్మను సాధించవచ్చును. మానవడు మొదట శుచిత్వము పొందవలెనంటే అలవికాని ఆశ, అసంతృప్తిని మొదట విడనాదవలసియుంటుంది. అతిగా తింటే అజీర్ణమే, అజీర్ణమైతే అనర్థమే!

శ్రీ మదాంధ్రమహాభారతంలో విధురుడు ధృతరాష్ట్రుడికి బోధించిన నీతుల్లో అసంతృప్తి గురించి చెప్పాడు. అది అనేక చెడ్డ గుణాల్లో ఒకటని తెలుపుతూ

 

కోపము నుబ్బును గర్వము నాపోవకునికి దురభిమానము ని

ర్వ్యాపారత్వముననునివి కాపురుషగుణంబులండ్రు కౌరవనాధా! (ఉద్యోగపర్వము-ద్వితీయాశ్వాసములో కలదు)

కోపము, పొగడ్తలకు పొంగిపోవటము, అహంకారము, అపోవకునికి అన్న మాటను కాస్త విశధపరుస్తాను. ఆపోవుట ఆటే తృప్తి చెందుట, ఆపోవక అంటే తృప్తి చెందక, ఉనికి అంటే ఉండుట. వెరసి జీవితమును అసంతృప్తితో నడుపుట లేక గడుపుట,. అవసరము మీరిన అభిమానము, పనిపాట లేకుండా కాలము గడుపుట అనునవి కుత్సితుల లక్షణములు. అత్యాశకు ధృతరాష్ట్రుడిని, దురాశకు దుర్యోధనుడిని ఉదాహరణగా పోల్చుతారు విద్వాంసులు. అత్యాశ, దురాశల వల్లే కౌరవ వంశం నాశనమైంది. ఈ ప్రమాదాన్ని పసికట్టుతచే  హెచ్చరించినాడు విదురుడు. దుర్యోధనుని  మొండిపట్టు అసంతృప్తే అతన్ని ఆహవములో అంటే యుద్ధములో,  అంతము చేసినది. రావణుడు కూడా మొండిగా, సీతను చెరబట్టి శ్రీరాముని కోదండముతో కూలిపోయాడు. అసంతృప్తికి దుర్యోధన రావణాసురులు  ప్రబలతార్కాణములు.

         అందుకే తృప్తి సుఖమయజీవితానికి కల్పవృక్షం, అది సమాజ అభ్యున్నతికి అమేయ ఆనంద లక్ష్యము. మానవులు అజ్ఞానాంధకారానికి నిలయమైన అసంతృప్తిని అణగత్రొక్కి జ్ఞానామృతానికి నిలయమైన తృప్తిని ఔదలదాల్చి విశ్వవికాసానికి తోడ్పడితే బాగుంటుంది అన్నది ఈ పద్యము యూక్క సారాంశము.

భారతము చెప్పినా భాగవతము చెప్పినా మంచి ఒకటిగానే ఉంటుంది. చెప్పే మార్గములు వేరుకావచ్చు.

కానీ అత్యంత ఆచరణ యోగ్యము.

పై భాగవత పద్యము ;’పిట్ట కొంచెము కూత ఘనము’ అన్న నానుడికి అద్దము పడుతూవున్నది.

మరొక మారు మరొక పద్యముతో....... 

2-8-585

ఆ. వారిజాక్షులందు వైవాహికము లందుఁ

బ్రాణవిత్తమానభంగమందుఁ

జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు

బొంకవచ్చు నఘము పొందఁ దధిప!

 

ఓ బలిచక్రవర్తీ! స్తీలతో సంభాషించునపుడుగానీ , పెళ్ళిళ్ల విషయమునగానీ,

ప్రాణహాని కలుగు తరిన గానీ, ధన, గౌరవ భగము కలుగునపుడుగానీ,

భీతిచెందిన గోవులను, విప్రులను కాపాడే తరుణమునగాని అబద్ధం చెప్పవచ్చు.

దాని వల్ల పాపం కలుగదు. ఒక 45 సంవత్సరములకు పూర్వము ఈ

పద్యమును చెప్పి శుక్రుడు మనకు సాధికారికమగు అనుమతిని ఇచ్చినాడు అని 

సరస సంభాషణా సమయములలో చెప్పుకొనేవారు.

ఈ పద్యమునకు ముందు మరొక పద్యము ఉన్నది. అది విష్ణువును తూలనాడుతూ శుక్రాచార్యుడు చెప్పినది. దేవుని తూలనాడినాడే అని ఆలోచించకుండా ఒక నిజమయిన గురువు తన శిష్యుడు ఆపదలో ఉన్నాడు అంటే తాను ఎదురించబోయేది ఎవరు అన్న ఆలోచన లేకుండా తన వినేయుని అనగా శిష్యుని తనుస్త్రాణమై ఎంతగా రక్షించుతాడో చూడండి. అద్సి గురుధర్మము అంటే! ద్రోణుడు కూడా ఉప్పుతిన్న నేరానికి దుర్యోధనునికి తన ప్రాణములనే పణముగా పెడతాడు. గురువు అన్న మాటకు అంతటి మహత్తరమైన అర్థము ఉన్నది.

ఇపుడు ఆ పద్యమును తిలకించండి.

సర్వమయినచోట సర్వధనంబులు

నడుగ లే దటంచు ననృతమాడు

చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి

శవము వాఁడు; వాని జన్మ మేల?

ఏ దానము దాతయొక్క సంపద అంతటికీ సమానమో, దానిని అడుగుతూ; నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలూ కాదు అని ఆ మాయామానుషరూపుడు అబద్ధమునే చెప్పుచున్నాడు కదా! ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు; వాడు ప్రాణమున్న పీనుగ; వాడి బ్రతుకు వ్యర్ధము అని ఇన్ని విధముల తూలనాడినాడు. అయినా ఆడిన మాటను విడుచుట పాడికాదని, మాటకు కట్టుబడి మాట నిలుపుకొన్న మహా ఘనుడు బలిచక్రవర్తి. మన పురాణములలో నాయకుడు సల్లక్షణములు కలిగియు సంచిత ప్రారబ్ధ కర్మల వశమున చేసిన పొరాబాటులకు గానూ అనుభవించవలసిన శిక్షలను అనుభావించుతారు కానీ, వారి ప్రతినాయకులు పాపకులు లేక దుషుస్తులగుతవల్లకాదు. మదము కామోన్మాదము చేత రావణుడు, మాత్సర్యము చేత దుర్యోధనుడు అసువులు బాసినారు కానీ వారు ప్రక్జలకు తండ్రితో సమానమగు రాజులు. అందుకే వారు ప్రతినాయకులు మాత్రమే! ఖల నాయకులు కాదు.

స్వస్తి.

మరొకమారు మరొక పద్యముతో.........

కారేరాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై

యీరేకోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

 

భర్గుని సూనుడైన శుక్రాచార్యా! గతములో ఎందరో రాజులు ఉండినారు, వారికి

రాజ్యములూ ఉండినవి, వారికి వల్లమాలిన అహంకారమూ వుండినది. కాని

వారిలో ఎవరైనా సిరి సంపదలు మూటగట్టుకొని పోయినారా! ప్రపంచంలో

వారి నామరూపములు ఏమయినా మిగిలినవా! కీర్తికాముకులైన శిబి

చక్రవర్తివంటి వారు సంతోషముగా అడిగినవారి కోరికలు తీర్చి నేటికీ

లోకములో అమరులై నిలచినారు కదా!

అంటూ వామనునికి మూడడుగులు దాన మివ్వటానికి శుక్రుని అభ్యంతరాలు

తోసిపుచ్చుతున్నాడు ఆ సత్యానువర్తి, దానవ స్ఫూర్తి, బలిచక్రవర్తి. ఈసందర్భాములో నేను వ్రాసిన ఈ పద్యము మీ ముందుంచుత అసందర్భము కాదని తలచుతూ మీ ముందుంచుచున్నాను.

వాసనెపుడు గాలి వాటపు నేస్తము

అరయ కీర్తిగంధ మటుల కాక

అన్నిదిశల ప్రాకు అది నీవు గమనించు

రామమోహనుక్తి రమ్య సూక్తి

మనము ఇహలోకమును వదలినా మన పేరు చిత్తశుద్ధితో మనము చేసే మంచిపనులవల్ల మన తదనంతరము కూడా నిలుస్తుంది. శిబి, రంతిదేవుడు, కర్ణుడు మొదలగువారి పేరు చరిత్రలో శాశ్వతముగా నిలిచి పోయినది. అంతెందుకు దేశ స్వతంత్రము కొరకుశివాజీ కుమారుడు శంభాజి మరియు హిందూ బ్రాహ్మణులకొరకు, దేశ రక్షణ కొరకు ఔరంగజేబును ఎదురించి, అతనిచే మోసపూరితముగా పట్టుబడి ప్రాణములను తృణప్రాయముగానెంచి, అత్యంత దారుణ హింసకు లోనై, సమర్పించిన తేగ్ బహదూర్ సింగులను  ఇప్పటికీ మనము  ఆరాధించుచున్నాము కదా! కావున మంచిపేరు ముఖ్యము కానీ కేవలము బ్రతుకుట కాదు. పేద పురుగు బ్రతుకు ఒక బ్రతుఎనా ఆలోచించండి.

మరొకసారి మరొక పద్యముతో.......

 4-8-593

మ. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు

ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;

హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;

దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

శుక్రుడు ఎంతగానో బలిచక్రవర్తికి నచ్చజెప్ప ప్రయత్నించినా బలి వాటన్నింటినీ త్రోసిరాజని

ఈ విధముగా అంటాడు: నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకము దాపురించుట కాని, నా కులమే నాశనమగుట కాని, భూమండలము బద్దలగుట కాని, వస్తే రానీ; జరిగితే జరుగనీ; నేను మాత్రం అబద్దమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకు ఆడిన మాట తప్పటం రాదు. ఓ సుధీవర్యా శుక్రాచార్య! వేయేల నా నిర్ణయము ఎన్నటికీ మారదు. మరి ఒక దానవుడు అంత నిశ్చయముతో కూడిన నిర్ణయము తీసుకొంటే మానవులమై కూడా అంతలో కొంతకు కొంతయినా తీసుకొన వలయును కదా!

ఒక్క మాటలో చెప్పవలసివస్తే, నరకము దాపురించినా సరే (నిరయంబైన), నన్ను 

కట్టివేసినా సరే (నిబంధమైన), రాజ్యము సర్వ నాశనం అయిపోయినా సరే, దుర్మరణం 

వచ్చినా సరే, కులాంతమైనా సరే, వచ్చినవాడు, హరిహరబ్రహ్మాదులలో  ఎవ్వరయినా సరే

వేయి మాటలేల, అభ్యాగతుడు ఆడిగిన తరువాత  ఈ దానమును నేను ఇచ్చితీరుతాను.

ఈ పద్యమునకు కాస్త విశ్లేషణ జతచేసి తీరవలసినదే! శిష్య వాత్సల్యముతో 

శుక్రాచార్యులవారు ఎన్నోవిధముల బలికి చెప్పిచూసినారు. అంతా అంధేందూదయమే 

అయినది. అంతావిని ఈ లోకమే తల్లక్రిందులయినా పాడి కాదు కావున ఆడిన మాట 

తప్పను అని అంటూ తన సాత్విక దాన వ్రతనియమమునకు అచంచల మనస్కుడై 

కట్టుబడినాడు. సత్యవ్రతాభిలాషియై గురువు మాట వినుట తన గురుతరమైన బాధ్యత 

అయివుండి కూడా త్రోసిరాజని, మిన్ను విరిగి మీదబడినా సరే, దానమిచ్చుటకే 

కట్టుబడినాడు.    

కుల గురువు కోపం ఏపాటిది? దుర్మరణమే వచ్చినా తాను మాట తప్పను అన్నాడు.  ఆత్మార్థే 

పృథ్వీం త్యజేత్ అన్నది ఆర్య వాక్కు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొందాము.ఈ పరిస్త్తే 

మనకు వస్తే ఆయన వాలే అచంచాలముగా మాటపై నిలువగాలుగుతామా! విదేశీ సాహిత్యములలో ఇటువంటి ఉదంతములు మంకు దొరకవు. అందుకే ముందు మన భాష మన సంస్కృతి నేర్చుకొనుట ఎంతో అవసరము. ఇక్కడ ఒక చిన్న ఉదంతము కర్ణుని గూర్చి తెలియజేస్తాను.

 

దానం గొప్ప గుణం. త్యాగం సాటిలేని గుణం. చరిత్రలో కొంతమంది ఈ అత్యున్నత 

లక్షణాలు కలిగిన వాళ్ళున్నారు. వాళ్ళని ప్రపంచమెప్పటికీ మరచిపోదు. అట్లాంటివాళ్ళలో కర్ణుడు ఒకడు. అందుకే అతన్ని దానకర్ణుడు అని అన్తోఉన్నది లోకము. ఎప్పుడు ఎవరు ఏమి అడిగినా తటపటాయింపు అన్నది లెకుండా ఇచ్చేవాడు కర్ణుడు. ఇవ్వడంలో ఔదార్యమే తప్ప అన్యథా ఆలోచనలకు తావివ్వనివాడు కర్ణుడు. ఇవ్వడంలో ఎంత ఆనందముందో ఇచ్చే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇస్తే తమ దగ్గరవున్నదంతాపోయి తాము బికారులుగా మిగిలిపోతామేమో అని భయపడేవాళ్ళు ఎప్పుడూ ఇవ్వలేరు.

కానీ దానం చేసే వాణ్ణి దైవం చల్లగా చూస్తుంది. అతని ఆత్మ అపూర్వ ఆనంద 

తరంగితమవుతుంది. అతను నిర్ధనుడయిపోయినా ఎప్పుడూ తను కోల్పోయినానను తపన 

కలిగియుండడు. తనవల్ల ఒకరు బాగుపదినారన్న సంతృప్తిని కలిగియుంటాడు..

కర్ణుని దానపరత్వమునకు నిర్ణీత సమయమంటూ ఏదీ లేదు. అవసరంవున్న వాళ్ళు ఏ 

సమయంలో వచ్చినా ఆదుకునే అలవాటు కలిగినవాడు.

ఒకరోజు కర్ణుడు తల స్నానం చేయుటకు ఒక వజ్రాలు పొదిగిన గిన్నెలోనున్న నూనెతో తల 

అంటుకొంటూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు అప్పుడే కర్ణుని ఇంటికి రావటము తటస్థించింది. 

అక్కడున్న వజ్రాలగిన్నె కృష్ణుని కంట బడింది. కృష్ణుడు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని 

ఆటపట్టిద్దామనుకునే వాడు కదా! కర్ణుని పరిక్షిద్దామనుకున్నాడు. వెంటనే కర్ణునితో          

 కర్ణా! నిన్ను ఒకటి కోరాలనుకుంటున్నాను అన్నాడు. కృష్ణా! నిరభ్యంతరంగా 

అడుగు, అది ఒకవేళ నా ప్రాణమే అయినాసరే! అన్నాను కర్ణుడు. కృష్ణుడు నీ ప్రాణము 

నేను తీసుకొను, నాకు ఈ వజ్రాలు తాపిన నూనె గిన్నె ఇవ్వు. అది చాలును అన్నాడు కృష్ణుడు.

దానికేం భాగ్యం. తప్పక తీసుకో అని కర్ణుడు తన ఎడమ చేతితో ఆ వజ్రాల గిన్నెను 

కృష్ణుడికి అందించబోయినాడు, కుడిచేతిలో వున్న తైలంతో తలను అంటుకొంటూ 

ఉండినాడు కాబట్టి. కృష్ణుడు ఎడం చేతితో ఇవ్వడం మర్యాదకాదుగదా! అన్నాడు.

అప్పుడు కర్ణుడు కృష్ణా! నాకు ఎడంచేతితో నీకు ఇవ్వాలన్న అహంకారం లేదు. నేను 

కుడిచేతితో తలపై తైలం రుద్దుకుంటున్నాను. అందుకని నువ్వు ఎడం చేతిలో వున్న గిన్నెను 

తీసుకో, ఏమి చెప్పగలము గిన్నె చేయిమారేలోపు మనసుకూడా మారవచ్చు అన్నాడు. నత్తి 

నిస్వార్థ దాత్రుత్వామో చూడండి.

ఈ కథను కాస్త నాకు జరిగిన సంఘటనతో పోల్చి చెబుతాను.. దారిలో ఒక బిచ్చగాడు 

కనిపించి 3రోజులనుండి తిండిలేదు. భోజనము పెట్టించండి బాబు అని అడిగినాడు.

ఆర్తితో అతను అడిగిన వెంటనే, ఈ కాలపు పరిస్థితులకు ఒక 50 రూపాయలయినా 

ఇవ్వనిదే అతనికి త్రుఫినిచ్చే భోజనము దొరుకదనిపించి, జేబులో చేయి పెట్టినాను. 50 

రూపాయల కాగితముతోబాతూ 20 రూపాయల కాగితము కూడా బయటికి వచ్చినది. 

వెంటనే ణా ఆలోచన గతి తప్పినది.  నేను అతనికి 20 రూపాయలు ఇస్తే మిగిలిన 30 తో 

నేను అల్పాహారము తీసుకొనవచ్చును కదా! అని. అంటే అతనికి 20 రూపాయలు 

ఇచ్చినాను. ఇక్కడ బాహ్యముగా దానమైతే చేసినాను కానీ నిజానికిది ఆత్మవంచనతో కూడినది. ఇది పుణ్యకార్యముగా జమకట్ట వీలుకానిది. పరమాత్ముని అభిశంశ తప్పించితే ప్రశంశ దొరకదు. మరి ఇంత చిన్న విషయములోనే అంతపెద్ద మానసిక దౌర్బల్యము కలిగిననేను ఆసలు బలిచక్రవర్తి కథను వ్రాయుటకు, చదువుటకు కూడా అర్హుడను కాదేమో! మరి చక్రవరి అనా రాజులకు రాజులగు మహారాజులకు రాజు చక్రవర్తి అనబడుతాడు. అటువంటి వ్యక్తి తన సర్వస్వమును ధారపోయుతఎగాక తలపై కాలు కూడా పెట్టించుకొని పాతాళము చేరుచున్నాడు. ఎంతటి వదాన్యుడో చూడండి.

ఈ సందర్భములో వివేకానందుని సూక్తి ఆత్మ పరిశీలనకై మీ ముందుంచుచున్నాను. "నీవు 

దానమిచ్చే సమయములో గ్రహీతకు కృతజ్ఞుడవై ఉండు. నీవు అతనికి ఎప్పుడో బాకీ ఉన్నట్లు 

భావన చేసి దానము చేయి. చిత్తశుద్ధితో మనఃపూర్వకముగా చేసినదే సాత్వికదానము". 

ఇంతకన్నా గొప్పమాట ఉండదు.

మిగతా రెండూ రాజసిక తామసిక దానములు. ఒకటి అహంకారమును కలిగియుంటే 

మరొకటి అలసత్వము కలిగియుంటుంది. రెండూ నిరర్థకములే!

స్వస్తి.

మరొకమారు మరొక పద్యముతో.........

 శా. ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దానింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

పూర్వము ఈ పద్యమును  ఏదో ఒక సందర్భంలో వాడని వారు, వినని వారు, 

ఉండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి 

ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో From Scratch to Summit అని 

ఆంగ్లములో), అలాగే ఒక చేతిపని తో మొదలై అది కుటీర పరిశ్రమయై ఆపై 

లఘుపరిశ్రమ స్థాయినిజేరి, ఇంకా ఒక గొప్ప సంఘటిత వ్యవస్థగా క్రమక్రమాభివృద్ధి 

గాన్చినదాని గూర్చి చెప్పునపుడో (రెంటికీ ఉదాహరణ అంబానీ, Reliance)  ‘ఇంతింతై 

వటుడింతయై’ అన్న పద్య ప్రథమ పాదమయినా చెప్పుట పరిపాటి. అంతగా ప్రజల 

నాలుకల మీద నిలిచిపోయింది ఈ పద్యము. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే 

చెబుతుంది. ఇది బమ్మెర పోతన కవివరెంయుడు కాక వేరెవరు ఈ శైలిని 

బడయగలరు. పాండితీ దురీణులగు ఉత్కృష్ట కవివరేణ్యులుకరుణశ్రీ వంటి వారికీ, నికృష్ట కవినగు నాకూ ఆయన ఆదర్శమే. ఆయన మానస సరోవరమైతే అందులోని హంస కరుణశ్రీ గారు. నేనందున ఒక కప్పను. వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును 

భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించుటకు ఎంతగా మహావిష్ణువు 

ఉద్యమించినాడు అన్నది వర్ణించిన ఆయన తీరును వర్ణించుటకు నా మాటలు చాలవు. 

క్రిందనుండి ఒక్కొక్క పదమును  దాటుకుంటూ బ్రహ్మాండము వ్యాపించుటకు ఎంతగా 

విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు 

రూపు కట్టించినాడు  పోతన. బహుశ ఆయన బలిచక్రవర్తి కథనము ఆనాడు కన్నులారా 

చూసినాడేమో!

బలిచక్రవర్తి మూడడుగుల మేర దానమును గ్రహించిన వామనుడు

ఇంతలింతలుగా ఎదగనారంభించినాడు. మరికొంచెము పొడవయినాడు,

ఆవిధముగా ఎదుగుతూ ఆకాశమునంటినాడు, మేఘాల పైకి పెరిగిపోయినాడు;

పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటినాడు, ధ్రువ నక్షత్రం కూడ దాటినాడు,

ఏడు ఊర్ధ్వ లోకములలోని నాల్గవ లోకమయిన మహర్లోకమును మించినాడు.

ఏడవ లోకమగు సత్యలోక కన్నా పైకి చేరి మొత్తము బ్రహ్మాండభాడమును

ఆవరించి వెలిగిపోతున్నాడు; త్రివిక్రమరూపము చూచుటకు ఎన్ని జన్మల

పుణ్యము కావలెనో! ఎంత తపస్సు చేసియుండవలేనో, ఎంత అచంచలమైన భక్తి కలిగియుండవలెనో కదా!

ఈ మహత్తేజమును భూమిమీదినుండి మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి 

చూస్తున్నారు. క్షణం పూర్వం కండ్లముందు నిలుచున్న బడుగు, బుడుగు బాలకుడు 

క్రమక్రమముగా ఎదిగి భూనభోంతరాళములను  నిండిపోవడాన్ని ఇంతకన్నా 

అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ

వామనుడు పదపదానికీ పెరుగుతూ పోయే క్రమతను చూపించి రూపించిందీపద్యము. 

ఇది ఒక గొప్ప దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారము చేసిన ఘనత కవులకన్న పోతన్నది.

ఇంతేకాదు. ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు 

క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి 

చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు 

ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు 

పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై 

కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, నగగానూ, బంగారు 

జాజుబందీ లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు 

గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి 

యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్

మహానుభావుడు పోతన. కథ పాటికి కథ నడిచిపోతున్నా, భగవంతుని లీలలను 

వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు ఒక మహాభక్తుని ఆంతరంగము యొక్క  పరవశ నర్తనను  కంటిముండు సాక్షాత్కారిమజేస్తుంది. మహద్భక్తి భావ గర్భితంబయిన భాగవతము మన తెలుగన్న పోతన్న చేతికి చేరుకొన్నదంటే అది మనము చేసుకొన్న  అదృష్టము కన్న మిన్న కాదని ఎన్నెన్నో విధములుగా అన్నట్లున్నది. తెలుగును ఇంకా ఇంకా దిగజార్చి పోతన ఎవరు అన్న స్థితికి దిగమన భాషను ఉద్ధరిద్దాం. కవికిరీటులను కాపాడుకొందాం.

స్స్వస్తి.

ఈసారి భాగవతము దశమస్కంధము-కృష్ణలీల-నరకాసుర వధ నుండి కొన్ని పద్యములతో మీ ముందుకు వస్తాను.

 


 

 

 



Wednesday, 2 October 2019

వేదవిదిత గీర్వాణీ మాతా


               వేదవిదిత గీర్వాణీ మాతా  (కీర్తన)                     https://cherukuramamohanrao.blogspot.com/2019/10/1.html    
విపంచి హస్తా విరించి కాంతా
విమల విభాస విభూతిస్వాంతా
నమోసురాగ పరాగ లతాంతా
నమామి మాతా వేదశ్రాంతా
1. స్ఫాటిక మాలాలంకృత హస్తా
స్ఫారక విద్యా జ్ఞాన సమస్తా
పరమ పవిత్రా పరిమళ గాత్రా
ప్రబల శుభాన్విత ప్రధిత చరిత్రా  llవిపంచి హస్తాll
2. విస్ఫుర విద్యా వినయాక్రాంతా
విమూఢ మంద ధ్వాంతాహంతా
దయానితాంతా క్లాంతా శాంతా
ధవళ నీరజా విశ్రాంతా    llవిపంచి హస్తాll
3. కుల మత జాతి విచక్షణ రహితా
విలసిత కరుణా భరణా భరితా
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా
ప్రబల భారతీ పవిత్ర చరితా     llవిపంచి హస్తాll

జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా

కరుణ దయార్ద్రత ప్రేమాకలితా

పూర్ణ గాన విజ్ఞాన ప్రధితా

రామ మోహనభిదాన ప్రదాతా llవిపంచి హస్తాll

కఠిన పదార్థములు


1. విపంచి=వీణ
విరించి= బ్రహ్మ
విమల= మలినములేని
విభాస=వెలుగు
విభూతి=ఐశ్వర్యము
స్వాంతా= మనసు కలిగిన దానా
2. సురాగా= శ్రేష్ఠమైన రాగములు (అనెడు)
పరాగ= పుప్పొడిని గల్గిన
లతంతా=లతకు చివర నిల్చునది (పుష్పము)
వేద శ్రాంతా=వేదములయండు సేద దీరునది
3. స్ఫాటిక మాలాలంకృత హస్తా= స్ఫటిక మాలను హస్తమున కలిగిన దానా
స్ఫారక=విస్తృతమైన
4. గాత్రము= శరీరము (గొంతు అన్న అర్థము కూడా కలదు)
ప్రబల=మిక్కిలి
శుభాన్విత=శుభములను కూర్చునది
ప్రధిత=ప్రఖ్యాతి గాంచిన
5. విస్ఫుర= అమితముగా
6. విద్యావినయ+ఆక్రాంతా= విద్యావినయములను తన వశములో ఉంచుకొన్నది.
విమూఢ మంద ధ్వాంతాహంతా= తెలివే లేని, ఉన్న తెలినివిని ఉపయోగించలేని, (వారియొక్క)
ధ్వాంతా+హంతా = చీకటిని (బుద్ధిహీనతను, బుద్ధి మాంద్యమును)రూపు మాపెదానివి.
నితాంత =    అపారముగా
ఆక్లాంతా శాంతా = అలసటయే ఎరుగనట్టి శాంతము కలిగినదానా
ధవళ నీరజ =   తెల్ల తామర
విశ్రాంతా  =  విశ్రమించుదానివి 
విలసిత =    ఒప్పబడిన, మెచ్చుకోనబడిన ,  అంగీకరించి
కరుణా భరణా భరితా= అన్ని ఆభరణములలోనూ కరుణ అన్న బంగారమును కలిగినదానా
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా=జ్ఞానము మరియు  సర్వశ్రేష్ఠమైన సత్వగుణమును కల్గిన విద్వాంసులకు అనుకూలించు మాతా
లోకహితా=  లోకములకు మేలుచేయుదానా
జయనీకు జయమగు గాక!
4. అభిదానము =  మంచి పేరు 





Tuesday, 1 October 2019

శంకరాచార్యుల వారి శ్రీలలితా అనుభవము


శంకరాచార్యుల వారి శ్రీలలితా అనుభవము

శంకరులు కాశీలో ఉన్న కాలములో కేదారేశ్వర ఘట్టములో ఉండేవాడట. ఇప్పుడు ఆది గతములో మణికర్ణిక ఘట్టమని పిలువబడే పురాతన మణికర్ణికా ఘట్టమునకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు భక్తులు విరివిగా వెళ్ళే మణికర్ణికా ఘట్టము కొత్తది.
సౌందర్య లహరి వ్రాయుటకు ఎన్ని కథలు కారణాలు చెప్పుకొంటారు. అందులో ఇదీ ఒకటి. నిజానిజాల మాట ఎటులున్నా, మనకు ఆదర్శప్రాయులైన శంకరులవారి అచంచల భక్తిని, ఆత్మానుభావమును కొట్టిపారవేయలేము.
ఒకసారి పైన తెలిపిన కేదారేశ్వర ఘట్టమునుండి శంకరులవారు ప్రదోష కాలమున విశాలాక్షీ విశ్వేశ్వర దర్శనమునకు బయలుదేరినారట. దర్శనము ముగించుకొని వచ్చులోపల చీకటి పడినది. నాడు దారులు ఇప్పటి వలె కాదు. దీపకాంతి లేదు. స్వామీ ఆస అటవీ మార్గమున వస్తూ, కనిపించక, ఊబిలో చిక్కుకొనుట జరిగినదట. ఎవరూ కనిపించలేదు. శరీరము ఊబిలోనికి క్రున్గిపోతూ వుంది. అప్పుడు ఒక పండుముసలి అయిన స్త్రీ ఆయన కంటికి అగుపించింది.
అప్పుడు ఆయన ఆమె తన మాట వినగలిగిన దూరమునకు వచ్చినవెంటనే ‘అమ్మా! ఊబిలో కూరుకు పోతున్నాను, నాకు శక్తిలేదు కాస్త సాయము చెయ్యి’ అని అడిగినాడట. అప్పుడు ఆమె ‘శక్తిలేకనే చైతన్యవంతమైన జగతిని చూడగాలుగుసున్నావా! శక్తిలేకనే బయట పాడుటకు ప్రయుఅత్నించుచున్నావా’ అని ప్రశ్నించింది. మహనీయుడైన ఆ తపస్వి కనులు మూసుకొని యోగమున, ఆ ముసలమ్మను, ఆమె అన్న మాటలను ఒకసారి గమనించినాడు. ఆయన మనోనేత్రము తెరుచుకొన్నది. ఆమె ఎవశ్రు అన్నది తెలుసుకొన్నాడు. వెంటనే ఆయన కంఠము నుండి ఈ క్రింది శ్లోకము జాలువారినది. దీనిని సౌందర్య లహరిలో ఏడవ శ్లోకముగా చూడగలము.
క్వణః కాంచీ దామా కరికలభ కుంభఃస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా
ధనుర్బాణానుపాశం సృణిన విదధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమధిపురాహో పురుషికాll

ఆమె వఢ్యాణమునాకున్న గజ్జలు గలగలా శబ్దములు చేస్తూ వున్నాయి. ఆ తల్లి స్తనములు
ఏనుగు కుభాస్తలమును బోలి ఉన్నాయి. (పూర్వపు మహనీయులకు, స్త్రీ దేవతల విశేషాంగముల వర్ణించునపుడు ఆయా దేవతలను తమ తమ తల్లులకన్నా మిన్నగా ఊహించుకొని ప్రార్థించినారు తప్పించి నేటి కాలము వలె వయోభేదమును పాటించక కామ దృష్టితో స్త్రీలను, దేవతా స్వరూపములను, దర్శించేవారు కారు.), ఆమె అతి సన్నని నడుముతో అలరారుచున్నది. పరిణత శరశ్చంద్ర వదనా అంటే, చంద్రుడు పూర్ణిమ చంద్రుడైతేనే అంటే పూర్ణ చంద్రుడైతేనే పరిణత చంద్రుడౌతాడు. అమ్మవారి ముఖబింబము పూర్ణచంద్రునివోలె దేదీప్యమానముగా ప్రకాశించుచున్నది. ధనుర్బాణాంకుశములతో ఆ తల్లి హస్తములు అలరారు చున్నవి. మణిమయ మకుట ధారిణియైన ఆమె పురుషికా అంటే పౌరుషము శక్తి ఇత్యాది పురుష గుణములు కలిగియున్నట్లు కనిపిస్తూ వున్నది.
ఊబిలో పడిన వ్యక్తి వెంటనే, గుంతలో నీళ్ళు పోసినట్లు తక్షణం లోపలికి వెళ్ళిపోడు.  జగద్గురువులు ఊబిలో పడుతూనే, ఆయనకు కనబడిన, నిలబడిన అమ్మవారి స్వరూపము కటి నుండి కనిపించసాగింది. అందుచేత శ్లోకములోని వర్ణన ఆక్కడినుండి మొదలయ్యి కొద్దికొద్దిగా ముఖము వరకూ వ్యాపించింది. ఈవిధమగు తార్కిక దృష్టి తో చూస్తె మనము కథలుగా వినే విషయములు వాస్తవములనిపించక మానవు. తల్లి ప్రసన్న మానసయై శంకరులవారిని ఊబినుండి బయల్వేడలజేసిందట. అటుపిమ్మట ఆయన ఆశ్రమము చేరి సౌందర్య లహరిలో ఆ శ్లోకమును చేర్చి,  మిగతా శ్లోకములను వ్రాసి పూర్తిచేసినాడన్న  ఒక ప్రచారము విశేషముగా ఉన్నది.
స్వస్తి.

Monday, 23 September 2019

సౌందర్య లహరి 28వ శ్లోకము


సౌందర్య లహరి-28వ శ్లోకము
https://cherukuramamohanrao.blogspot.com/2019/09/28.html
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
విపద్యన్తే విశ్వే విధి-శతమఖాద్యాదివిషదః |
కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జననితాటఙ్క మహిమా || 28 ||
ఈ శ్లోకార్థమును విస్తరించుటకు పూర్వము ఈ భాగవత పద్యమును ఒకపరి పరికించుదాము.
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (అష్టమ స్కందము 241 పద్యము)
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే
మ్రింగెడిది కాలకూట విషము, అది అన్యులకు అసాధ్యము అని తెలిసి కూడ లోకులకు మేలు జరుగుతుందను సదుద్దేశ్యముతో, కట్టుకొన్న భర్తకు గల సామర్థ్యము తెలిసినదగుటయూ అంతకన్నా తన మాంగళ్య బలముపై అపారమగు నమ్మకము కలిగినదియై యుండుటచే పార్వతీదేవి శివుని  హాలాహల భక్షణకు సమ్మతించింది.
ఈ పద్యమున శబ్దార్థసౌందర్యము అపారము. తాను తన భర్త శరీరంలో సగభాగమును పంచుకొన్నది.  మరి ఆ జగజ్జనని ఎట్లు ఒప్పుకొన్నది అని  పరీక్షిత్తునకే సందేహము కలిగి  అడిగితే శుకుడు చెప్పిన సమాదానము ఈ పద్యము. మ్రింగ్ మ్రింగ్ (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అన్న ఈ ధ్వని అటు కఠమునకు, ఇటు గరళమునకు సంబంధించినది కాగా అదే కంఠమునకు మంగళ మంగళ అంటూ అమ్మ మంగళ సూత్రము సమాధాన పరచుచున్నట్టి తీరును ప్రదర్శింపజేస్తూ వ్రాసిన ఈ పద్యము ఎంతటి భావ గర్భితమో! గరళంఅన్న పదమునకు మధ్యలో ‘ర’ ఉన్నది. ‘ర’ అన్న అక్షరమునకు ఎకార్థ నిఘంటువులో అగ్ని అన్న అర్థము ఉన్నది. దహించుట దీని గుణము. మరి గరళం యొక్క గుణము కూడా దహించడమే కదా! ఆ ‘ర’ గళమును దహించకుండా గళమును కాపాడినది మంగళ. అటువంటి ‘మంగళ’ కలిగినటువంటి శక్తియే ‘మాంగళ్యము’. మాంగళ్యమును గల్గిన స్త్రీని ముత్తైదువ అంటారు. ముత్త+ఐదువ= ముత్తైదువ.
నాకు తెలిసి ముత్త అన్న మాటకు ముదుసలి లేక వయసు మీరినది అన్న అర్థమును చెప్పుకొనవచ్చును. అంటే పూర్వము బాల్యములోనే వివాహము జరిగేది కాబట్టి ఒక 35 సంవత్సరముల యువతిని ముత్తయిదువ అనవచ్చునని నా అభిప్రాయము. ఎందుకంటే ఆమెకు అప్పటికి తమ పరివార ఆచారవ్యవహారాలనీ అవగతమై ఉంటాయి. ఇక ఐదువ అంటే ఐదు వన్నెలు కల్గినది. వన్నెలు అన్నమాట ఎంతో మంచి అర్థముతో కూడినది. ఈ ఐదు వన్నెలు ఏవేవంటే
1.    పసుపు, 2. కుంకుమ, 3. గాజులు, 4. కాటుక, 5. చెవ్వాకు.
మొదటి నాలుగూ తెలిసినవే. మరి చెవ్వాకు అంటే ఏమిటి? ఇది ఒక సందేహము. రెండవది ఏమిటంటే మరి తాళిబొట్టు ఉంటేనే కదా ముత్తైదువ అంటారు? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానము ఒకటే! చెవ్వాకు అన్నది వేరేమీ కాదు ‘తాటియాకు’. దీనిని తాళపత్రము అంటారు. తాళము అన్న మాటనుకూడా పర్యాయముగా వాడుతారు. ‘తాళ’ శబ్దము నుండి పుట్టినదే ‘తాళి’. పూర్వము ఈ తాళమును చెవికి కమ్మలుగానూ, ముక్కుకు నత్తు గానూ, కంఠానికి తాళిబొట్టుగానూ వాడేవారు. చెవ్వాకు అన్న పదము అక్కడ ‘తాళము’ అన్న అర్థములోనే వాడబడింది. అందుకే మగలసూత్రము పేరు ఐదువలో చేర్చబడలేదు.
ఇప్పుడు మనకు మాంగళ్యగరిమ అంటే ఏమిటో తెలిసినది.
ఇక తాటంకముల గూర్చి తెలుసుకొందాము.
లలితా సహస్ర నామములో ఒకనామము ‘తాటంక యుగళీ భూత తపనోడుప మండలా’ అని అనటం జరిగింది.
తాటంక యుగళి + భూత=కుండల ద్వయము కల్గిన, తపన ఉడుప మండల= వెలుగు వేడిమినిచ్చే నక్షత్రమండలము అంటే సూర్యచంద్రులు కల్గిన సమస్త ఆకాశము అని అర్థము. అంటే ఇక్కడ కుండలములు ఒకటి సూర్యుడయితే మరియొకటి చంద్రుడు. అంటే ఆ రెండుతాటంకములూ గరళములోని ‘ర’ ను తాముగ్రహించివేస్తాయి. అందువల్ల పరమేశుడు కాలకాలుడైనాడు. ఇది ఎందువల్ల అంటే 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అన్నది శాస్త్ర వచనము. అట్లే వనస్పతులకు, వనౌషధములకు అధిపతి చంద్రుడు. అంటే ఆరోగ్య దాత సూర్యుడు ఔషధనేత చంద్రుడు. మరి వారిరువురి చూపు కాలకంఠుని కంఠము పై నుంటే  గళము లోని 
గరళము ఆయనేమిచేయగలదు. ఇంకా కొంత సందేహము ఉండిపోయే అవకాశము ఉంది. అసలు సూర్యచంద్రులు తాటంకాలేమిటి అని? అమ్మవారు విశ్వరూపిణి. ఆకాశమంతా నిండిన ఆతల్లికి అటువైపు సూర్యుడు ఇటువైపు చంద్రుడు ఉంటారు కదా! ఆకాశారూపినియైన అమ్మకు ప్రతీకాత్మకముగా సేడురేడురుగా ఉండే సూర్య చంద్రులను తాతంకములుగా జగద్గురువులు వర్ణించుట జరిగినది.
కంచిలో కామాక్షి అమ్మవారు ఆకాశ స్వరూపిణిగా కొలవబడుతున్నది.  విశ్వాంతరాళమంతటా వ్యాపించిన ప్రకాశ స్వరూపిణియే కామాక్షి. అందుకే ఆమె సిద్ధాసనములో కూర్చున్న పీఠము నేలను అంటదు అని ప్రశస్తి. పైగా ఆకాశం శబ్దగుణయుక్తము. శబ్దము తెలిసేది చెవిద్వారానే, అంతేకాకుండా  ఆ ఆకాశంలోనే కదా సూర్య చంద్రులు కూడా ఉండేది. అక్కడ శబ్దగుణకమైన ఆకాశానికీ, శబ్దాలను వినే చెవులకూ, వానికి పెట్టుకునే ఆభరణాలకు సామ్యము ఇక్కడ కుదిరుతుంది. ఆకాశంలో ఒక వేపు సూర్యుడు మరోవేపు చంద్రుడు రెండు వేపులా రెండు, కాబట్టి ఆ ఆకాశస్వరూపంగా ఉన్న అమ్మవారికున్న శబ్దాన్ని గ్రహించే చెవులకు ఆభరణములుగా సూర్యచంద్రులను చెప్పినారు భగవత్పాదులు. ఇప్పుడు సందేహము సమసిపోయి ఉంటుంది.
ఇప్పుడు శ్లోకము యొక్క అర్థమును అన్వయమును చూద్దాము.
 భావము: తల్లీ! భయంకరమైన జరామృత్యువులను సరకు చేయని సుధ అంటే  అమృతమును త్రావి కూడా బ్రహ్మేంద్రాది దేవత లందరూ కల్పాంతమున మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన పరమేశ్వరుడు కాలకూటము భుజించి కూడా మృత్యువునకు మృత్యువై నిలచియున్నాడు. దానికి కారణము నీ కర్ణాభరణములగు తాటంకములే కానీ అన్యథా కాదు.
మనము పైన చెప్పుకొన్న తాళి తాటంకముల బలమే ఈశ్వరుని రక్షగా, మహా ప్రళయములో కూడా నిలిచి క్ష్వేళ అనగా హాలాహలము నుండి ఇసుమంత ఆపద కూడా పొందనీయక కాపాడుతూ వుంది.
కాళిదాసు ఒక శ్లోకంలో “తాళీ పలాశ తాటంకామ్” అని వాడినారు. తాళ, తాళి అంటే తాడిచెట్టు. పలాసమంటే మోదుగ చెట్టు అన్న ప్రసిద్ధార్థము ఉండగా, పచ్చియాకు అన్న అర్థం కూడా ఉన్నది. కాబట్టి తాళీ పలాశమంటే పచ్చి తాటియాకు అని అర్థము.
కాలము మారి తాళమును తాళముతో బంధించి బంగారునాకు తాళము వేయుచున్నాము. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవన విధానమును వదులుకొని బంగారు వెనుక పరిగెత్తుచున్నాము.
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం

విపద్యన్తే విశ్వే విధి-శతమఖాద్యాదివిషదః |
కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జననితాటఙ్క మహిమా || 28 ||

జగద్గురు ఆదిశంకరులవారు పైనాలుగు పాదముల ఈ శ్లోకములో చిన్ని బుర్ర కలిగిన అపండితుడనైన  నాతో ఇంత వ్రాయించినాడు. మరి పాండితీ మేరువులైతే ఎంత గొప్పగా చెప్పే వారో కదా!
స్వస్తి.