Saturday, 28 March 2020

జ్యోతిర్లింగముల కథ


జ్యోతిర్లింగముల కథ
https://cherukuramamohanrao.blogspot.com/2020/03/blog-post_28.html
జ్యోతిర్లింగములగూర్చి చదువుటకు ముందు ఈ ద్వాదశ తిర్లింగ స్తోత్రమును, తదుపరి ఒక్కొక్క జ్యోతిర్లింగ స్తోత్రమును చదివేది. నేర్పిచుకొంటే ఇంకా మంచిది. పిమ్మట అసలు విషయములో అడుగిడుదాము.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము

ఈ జ్యోతిర్లింగ స్తోత్రమును అనునిత్యము పఠించిన వారికి ఏడేడు జన్మల పాపములు హరించుకుపోతాయని ఫలశ్రుతి.
 సౌరాష్ట్రే సోమనాథం చశ్రీశైలే మల్లికార్జునమ్l
ఉజ్జయిన్యాం మహాకాళమ్ఓంకారమమరేశ్వరమ్  ll
ప్రజ్వాల్యాం వైద్యనాథంచడాకిన్యాం భీమశంకరమ్ l
సేతుబంధే తు రామేశంనాగేశం దారుకావనే ll
వారాణస్యాం తు విశ్వేశంత్ర్యంబకం గౌతమీ తటే l
హిమాలయే తు కేదారంఘృష్ణేశం చ శివాలయే ll
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః l
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.     ll
ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్

సంపూర్ణ స్తోత్రం:
సౌరాష్ట్రదేశ విశదే‌తి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||
శ్రీశైలశృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదా వసంతం |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుం ||
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహం సురేశం ||
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||
యామ్యే సదంగే నగరే‌తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురై యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||
సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||
యం ఢాకినీశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||
సానందమానందవనే వసంతమానందకందం హతపాపబృందం |
వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
ఇలాపురే రమ్యవిశాలకే‌స్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
జ్యోతిర్మయం ద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజో‌తి భక్త్వా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||
అసలు విషయములోనికి రేపటి సాయంకాలము నుండి వద్దాము.
జ్యోతిర్లింగముల కథ-1
శివుడు, దేవాధిదేవుడు, లోక శంకరుడు, బహు భోళాశంకరుడు, గళ క్ష్వేళ శంకరుడు, ప్రళయములో కాళ శంకరుడు. ఆయన విశ్వంకరుడు, విశ్వంభరుడు, విశ్వంధరుడు, విశ్వేశ్వరుడు, విశ్వరూపుడు.   అట్టి పరమశివుని  ఆరాధిస్తున్న భక్తులు ఆయనను లింగాకృతిలో పూజలు  చేయుట సంప్రదాయము.  ప్రతి హిందువూ జీవిత కాలంలో ఏదో ఒక రోజు  జ్యోతిర్లింగాల  గూర్చి తలంపక మానడు. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి?  పరమశివుడు  ఉత్తరా నక్షత్రాన  అవతరించినట్లు శివ పురాణంలో చెప్పబడింది.  జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నవి.  
ద్వాదశ జ్యోతిర్లింగములు ఎక్కడెక్కడున్నాయి మరియు వాని ప్రాశస్త్యమును గూర్చి, మనము పైన  శ్లోకరూపములో చెప్పుకొన్నాము. ఇప్పుడు కాస్త జ్యోతిర్లింగమును గూర్చి తెలుసుకొందాము. జ్యోతిర్లింగాలు ఆకాశ వీధుల్లో నుంచి  దర్శిస్తే   అగ్ని స్తంభాల వలె  దర్శనమిస్తాయని   పెద్దలు చెబుతారు.  లింగాకారం శివుని యొక్క పూర్ణత్వమును సూచిస్తుంది.
నాకు తెలిసిన, పెద్దలచే తెలుసుకొన్న మేరకు ఈ జ్యోతిర్లింగములను గూర్చి తెలియజేసే ప్రయత్నము చేస్తాను.
జ్యోతిర్లింగ ఆవిర్భావ కథనము: ఒకనాడు బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అన్న విషయముపై తీవ్రంగా వాదులాడుకొని తీర్పుకై పరమేశ్వరుని వద్దకు వెళ్ళినారు. స్వతహాగా అగ్నిస్వరూపుడగు పరమేశ్వరుడు జ్వాలాలింగము లేక జ్యోతిర్లింగముగా వారి ముందు సాక్షాత్కరించి, ఎవరు ఆజ్యోతి ఆది అంతమును  కనిపెడుతారో వారు అధికులు అని శివుడు తన నిర్ణయమును తెలుపుతాడు. వల్లెయని బ్రహ్మ హంస రూపములో ఊర్ధ్వ దిశన విష్ణువు వరాహ రూపమున అధో దిశన బయలుదేరుతారు. అయితే బ్రహ్మ విష్ణువుల్లో ఏ ఒక్కరూ ఆ లింగాకారముయొక్క  మొదలు-తుది, కనుగొనలేకపోతారు. విష్ణువు తన  ఓటమిని అంగీకరించగా బ్రహ్మ తాను ఆదిని చూచినట్లు అబద్ధమాడుటయే గాక, నంది మరియు కేతకీ(మొగిలి) పుష్పములతో శివుని ఆదిని బ్రహ్మ చూసినట్లు అబద్ధామాడించుతాడు. దానితో కేతకి పూజార్హత కోలుపోతుంది. తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పిన నందికి పుచ్ఛభాగమునకే పూజ అని నిర్దేశించుతాడు పరమేశ్వరుడు. బ్రహ్మకు భూలోకములో పూజార్హత ఉండదని శపించుతాడు. ఈవిషయము మనకు లింగశివపురాణముల ద్వారా తెలియవస్తుంది. 
 పైన మనము చెప్పుకొన్నట్లు జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశము యొక్క నాలుగు చేరుగులా, పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లికార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, సహ్యాద్రి పర్వత పృచ్ఛభాగముపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారాము 8. పృథ్వి 9. జలము 10. తేజస్సు 11. వాయువు 12. ఆకాశం ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్కలింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.

భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన సంస్కృతి. లక్షలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది ఉన్న మనుషులు అంతిమ శ్రేయస్సు లేదా ముక్తి కోసమే పరితపించేవారు. వారు భౌతిక శ్రేయస్సు మరియు సుఖములకు జీవితంలో అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఈ సంస్కృతిలో, ప్రకృతి  ప్రసాదించిన ప్రతి అంశమూ ముక్తి సాధనకు ఆలంబనగా తలచేవారు.
హిందూ సంప్రదాయములో  వివాహ బంధముగూడా మోక్ష సాధనకు లేక ముక్తి సాధనకు ఒక ఉపకరణమే!
ఈ ప్రకృతిలో మనకు ఒసంగబడిన ప్రతి వస్తువు, వేదముచే విధింపబడిన ప్రతి వస్తువూ ముక్తి సాధకమే! వేదమంత్రములకు, యజ్ఞ యాగాదులకు దూరమయిన వర్ణముల వారికి సూక్ష్మములో మోక్షముగా నోములు వ్రతములు, ధ్యాన శ్లోకములు, దేవాలయములు, స్వయంభూ విగ్రహములు, జ్యోతిర్లింగములు మొదలగునవెన్నో ఏర్పడినవి.  
 ఇందు జ్యోతిర్లింగములు మహా శక్తివంతములయినవి. కొన్ని తురుష్కుల దండయాత్రల ఫలితముగా ఛిన్నాభిన్నమై పోగా కొన్ని ఇప్పటికీ సజీవ శక్తితో విరాజిల్లుతున్నాయి. భక్తి మార్గమునెంచుకొన్న మానవులకు ఎంతో ప్రయోజనకరమైనవి. ఇటువంటి శక్తివంతమయిన స్వయంభూ విగ్రహముల\లింగముల సన్నిధిన మహత్తరమైన అనుభూతి కలుగుతుంది.

ఇంకొకసారి మరికొంత.......
జ్యోతిర్లింగముల కథ -2
జ్యోతిర్లింగములు పరమ శక్తవంతమైనవి. అవి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిష్ఠ చేయబడినవి. హిందూ  దేశము యొక్క ప్రథమ నామము ‘అజనాభము’. అజుడు అంటే సృష్టి స్థితి లయకర్త యగు పరమాత్ముడు. ఆయన నిరంతరుడు. ఒక ప్విరత్శ్వయెక సమయమున పుట్టినవాడు కాదు. కావున అజుడు. ఆయనకు మరణము లేదు. కాన ఆయన అమరుడు. సృష్టి కర్తయగు ఆయన నాభిప్రదేశమే ఈ దేశము. మహాపురుషులయినా, మహత్తర పుణ్యభూములయినా, మహా మేధావులయినా ఈ తల్లి శిశువులే! ఈ వాస్తవము గమనించండి. ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలే ఉన్నాయి. అవి అన్నీ ఈ భారత వర్షములోనే ఉన్నాయి. భౌగోళికంగానే కాక, ఖగోళపరంగా ఎంతో విశిష్ఠత ఉన్న కేంద్రబిందువుల్లో అవి ఉన్నాయి. ఇవి ద్వాదశ జ్యోతిరాదిత్యులకు ప్రతీకలు.  ‘ఆదిత్యో జ్యోతిరాదిత్యః’ అన్న రెండు నామములు శ్రీ మహావిష్ణు నామావళి లోనివి. లోతులకు పోయి పరిశీలించితే ఇక్కడ ఇక్కడ శివకేశవ అభేదము తెలియుట లేదా! ఎంతో మహత్తరమైన జ్ఞానం గల మహానుభావులు సాపేక్ష సూర్య గతి  ఆధారంగా ఈ ప్రాంతములను ఆదిత్య కేంద్ర బిందువులుగా నిర్ధారణ చేసినారు. ఆ ప్రకారముగా ఈ జ్యోతిర్లింగములు ఏర్పడినాయి.
కేవలము కొండలను తొలచి, బండలను మలచి విగ్రహములను సృష్టించరు. ఆమూర్తులను శక్తివంతం చేసి శాస్త్ర నిర్దేశానుసారము నియమ నిబంధనలను పాటించి, స్థాపత్యవేదానుసారము పూర్వము  పూర్తిగా విగ్రహప్రతిష్ఠలు జరిగేవి. ఈ భారత భూమిపై ఎందఱో బ్రహ్మర్షులు, రాజర్షులు, పరమ భక్తాగ్రగణ్యులగు రాజులు ఇటువంటి విగ్రహప్రతిష్ఠలు గావించి దేశమునకు వాశి, వన్నె, వాస్తును కూడా వెలయించి దేశము పరమతములకు, ఇతరదేశములవలె అంకితము కాకుండా కాపాడినారు. ఇక ఈ జ్యోతిర్లింగముల విషయమునకొస్తే వానిని ఆయా జ్యోతిర్లింగ క్షేత్రాలలో స్వయంభూ లింగాలగా  ప్రతిష్ఠాపన జరిగినట్లు చెప్పుకోనవచ్చును. చాలా అసాధారణ, అద్భుతమైన రీతిలో మానవ జీవనాన్ని పరిపుష్టం చేయడానికి జీవ శక్తులను వినియోగించే శాస్త్రమిది. మట్టిని ఆహారంగా మార్చే ప్రక్రియను వ్యవసాయ అంటాం. ఆహారాన్ని మాంసం, ఎముకలుగా రూపాంతరం చెందించే విధానాన్ని జీర్ణప్రక్రియ అంటాం. ఈ మాంసాన్ని అంటే ఈ
మాంసయుతమైన శరీరాన్ని మట్టిగా మార్చే ప్రక్రియను దహనం అంటాం. అలాగే శరీరాన్ని, ఓ రాతిని లేదా ఖాళీ స్థలాన్ని ఓ దివ్యశక్తిగా మార్చే ప్రక్రియని ప్రతిష్ఠీకరించడం లేదా ప్రతిష్ఠాపన అంటాం. ఇది పరమాద్భుతమైన శాస్త్రం. దురదృష్టవశాత్తూ, ఇప్పుడు ప్రతిష్ఠాపన అంటే అసలేమిటో మనం మరచిపోయాం. అందువల్ల ఈ పేరుతో అర్థంపర్థం లేని పరిహాసాత్మకమైన ఆలయాల నిర్మాణము పుట్టగొడుగుల్లాగా సాగిపోతున్నాయి.  దీనిని వ్యాపారంగా మార్చుకుని సొమ్ము చేసుకొనేవాళ్ళుకూడా ఉన్నారంటే అతిశయోక్తి కానేరదేమో!
నేటికి కూడా  జ్యోతిర్లింగాలు మహాశక్తివంతమైన సాధనాలు. మన  శారీరక, మానసిక వ్యవస్థను పరిపూర్ణంగా నియంత్రించుకోగలిగితే, ఈ జ్యోతిర్లింగాల సన్నిధిని మనము సదుపయోగము చేసుకొనిమన ఆధ్యాత్మికతను పెంపొందించుకోవచ్చు.  ఈ భూమి మీద ప్రతిష్ఠించిన ప్రతి లింగానికీ, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సాధన ఒకటి ఉంటుంది. అయితే, ఈ సాధన ప్రక్రియ అనేది మాత్రం ఈ రోజుల్లో పూర్తిగా మాయమైపోయింది.  అందువల్ల దేవాలయాలు ఇప్పడు చాలా కాలం కిందట చనిపోయిన వారి స్మృత్యర్థం నిర్మించిన స్మారక చిహ్నాలుగా మిగిలిపోయాయి. జ్యోతిర్లింగాల్లో కొన్ని ఇప్పుడు సజీవంగా లేవు, కాని  మిగిలిన వానిలో చాలా లింగాలు ఇప్పటికీ మహాశక్తివంతమైన సాధకాలే! 
ఇక ఒక్కొక్క జ్యోతిర్లింగము యొక్క విశేషములను నేను చూచినంత, విన్నంత  తెలుసుకొన్నంత తెలుప ప్రయత్నించుతాను.
జ్యోతిర్లింగముల కథ-3
మొదటిది గుజరాత్ లోని శ్రీ  సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 
గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణము (Pattan)వద్ద  సోమనాథ్ క్షేత్రం ఉన్నది. సముద్రతీర ప్రాంతములు అధికముగా అభివృద్ధి చెందినపుడు అవి పట్టణము అన్న పట్టాను పొందుతాయి. చెన్నపట్టణము, భీముని పట్టణము, మచిలీపట్టణము ఈ విషయమును పుష్టిచేసే  కొన్ని  ఉదాహరణలు.  ఈ  సోమనాథ క్షేత్రమునకు పౌరాణికముగా  ఎంతో  ప్రాముఖ్యత ఉన్నది. ఈ సోమనాధ జ్యోతిర్లింగక్షేత్రము, జ్యోతిర్లింగ తీర్థయాత్రలలో  తొలి తీర్దయాత్ర కేంద్రముగా  ప్రసిద్దిచెందినది.శివపురాణ కథనము ప్రకారము  చంద్రుడు దక్షప్రజాపతి యొక్క 27గురు కుమార్తెలను  వివాహం చేసుకుంటాడు. కానీ వారిలో  రోహిణి పట్ల మాత్రమే  అనురాగమును అధికముగా   చూపిస్తూ ఉంటాడు. మిగిలిన పుత్రికలను  పట్టించుకొనుటలేదని కలత చెందిన దక్షప్రజాపతి చంద్రుని కళావిహీనుడగుగాక అని  శపిస్తాడు. కలత  చెందిన చంద్రుడు  రోహిణితో సహా సోమనాథమును  చేరుకుని అచట స్పర్శ లింగాన్ని ఎంతో నిష్టతో పూజ చేస్తాడు.  తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన  చంద్రుడు తన ప్రభను దినదినమూ కోల్పోతూ వచ్చి 15 తిథులలో పూర్తిగా కోల్పోయిన పిదప తిరిగీ దిన దిన ప్రవర్ధమానమగునట్లు వరము పొంది 15వ తిథియగు పొర్ణమికి    పూర్ణ బింబమై వేలుగొందుతాడు. శివుడు చంద్రుని కోరికపై  సోమనాధునిగా  అచట నిలిచి భక్తులు కోరిన కోర్కెలను నెరవేస్తున్నాడు.  ఈ కథనము పౌరాణికమయినది అయితే  ఐతిహాసిక కథనము కూడా మనము ఎరుంగవలసినది ఉన్నది. కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగము 16సార్లు  ధ్వంసం కావించబడినప్పటికీ  తిరిగి జీర్ణోద్ధారణ పొందిన  ప్రతిభాలింగము ఈ ప్రభాసతీర లింగము. ఇపుడు కాలానుగుణముగా ఈ క్షేత్రమునకు ఏర్పడిన దురవస్థ దానిని అధిగమించిన విధానము తెలుసుకొందాము.
జ్యోతిర్లింగముల కథ-4
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రమందలి  సౌరాష్ట్రకు చెందిన వెరావల్‌ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.  పురాణప్రాశస్త్యము కలిగిన ఈ క్షేత్రము ద్వాదశ  జ్యోతిర్లింగములలో మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అనిఅంటారు.

అరేబియా సముద్రతీరమున ఈ పుణ్యక్షేత్రము వెలసిన కారణముచే. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన పీఠము పై రూపుదిద్దుకుంది. గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, 'ఓం కారము'తో అమర్చివుంటుంది. ఇది పురాణ ప్రసిద్ధమగుటచే  కాలనిర్ణయము చేయుట సులభమయిన పనికాదు. ఇప్పటికి దొరకిన చారిత్రక ఆధారముల ద్వారా పరిశీలించినచో మొదటి ఆలయము 1వ శతాబ్ధానికి చెందినదిగా తెలియవస్తూ వున్నది. ఇది శిధిలమైన తరువాత  క్రీస్తు.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు. శ. 722లో ఆఫ్ఘనులు సింధు ప్రాంతంలో బలపడి, నేటి పాకిస్తాన్ గుజరాత్ పంజాబ్ ప్రాంతాలపై కన్నుపడింది. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్‌ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్‌, బ్రోచ్‌, ఉజ్జయినీ, గుజరాత్‌ మొదలైన వాటిమీద యుద్ధానికి బయలుదేరినారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది.
సుమారు 17 సార్లు ప్రతీ ఏటా క్రీ.శ.1000-1026 మధ్యకాలంలో భారత దేశంపై గజిని దండయాత్రలు చేశాడని కొందరు చరిత్రలకారుల అభిప్రాయం. శికన్, యామిన్-ఉద్-దౌల
యీతని బిరుదములు. బుత్-శికన్ అంటే విగ్రహ విధ్వంసి అన్న బిరుదు సంపాదించినాడు. అతని మొదటి దండయాత్ర క్రీ.శ. 1001 లో జరిగింది.  
ఆతను భారత దేశము పై చేసిన 17 దండయాత్రలలో 16 సోమనాథ దేవాలయము మీదనే. దాదాపు క్రీ.శ. 800 లో ఇస్లాం ఉద్భవించితే, 971-1030 వరకు పాలించిన గజినీ, ఒక సోమనాథ దేవాలయము మీదనే 16 మార్లు దండెత్తినాడని చరిత్రకారుల అభిప్రాయము. ఇందులో ఎక్కువగా ముస్లీములు వ్రాసినవే! దీనిని ఆంగ్లేయ రచయితలు కూడా పుష్టి చేసినారు.
గజినీ మొదటి సారి దండయాత్ర చేసినది క్రీ.శ. 1000 లో. అతను మత ఛాందసుడగుటచే
ఇస్లాముకు ముందుకాలములో అల్-లత్, అల్-ఉఝ, అమన్ అన్న దేవతలను పూజించేవారని చరిత్రాధారాలవల్ల తెలియవస్తూవుంది. మొహమ్మదు తన అనుచరులతో ఆ విగ్రహములను భిన్నము చేయమన్నాడు. అప్పుడు 'అల్-ఉఝ' విగ్రహమును ఒక భక్తుడు కాపాడి సోమనాథ దేవాలయములో ఉంచినాడని అన్న ఒక పుకారును నమ్మి మొదటి దండయాత్ర సోమనాథ దేవాలయముపై సాగించినాడని ఒక ప్రచారము. దేవాలయమును ఛిన్నాభిన్నము చేయు సందర్భమున అక్కడ ఉన్న అశేష ధనరాశులనుచూసి కళ్ళు చెదిరి 16 మార్లు ఆ ఆలయముపై దండయాత్ర చేసినాడని చరిత్ర చెబుతూ వున్నది.
పరిస్థితులు ఇంత దారుణముగా ఉన్న కాలములో  6-1-1026న మహమ్మద్‌ ఘజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50 వేలమంది నేలకూలినారు. యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాండలీకులు ఇక ఘజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోవాటం జరిగింది. ఈ యుద్ధములో హమీర్‌గోపాల్‌ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టికరిపించినాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో చివరకు  తన ప్రాణములనే కోల్పోయినాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలను నిర్మించినారు. ఈ యుద్ధంలో విజయము సాధించిన ఘజనీ పోమనాథ్‌ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించినాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి పోయినాడు. అ సమయంలో పట్టన్‌ ప్రభువైన పరమదేవ్‌, ఈ మూకలపై విరుచుకు పడి  ఘజనీ సేనలను తరిమి కొట్టినాడు. ఆ తరువాత 12-13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేసినారు. ఇది నాల్గవ సారి జరిగిన ఆలయ నిర్మాణం.ముస్లిం దుండగుల అకృత్యాలవల్ల ఇదికూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని, ఈ ఆలయాన్నీ, పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించినాడు. ఆ కాలంలోనే అర్చకులకు వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కళశాలతోనూ, ముఖమండపంతోనూ శోభిల్లజేసినాడు.
జ్యోతిర్లింగముల కథ-5
ఇక 1296లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, తన మామను చంపి, రాజ్యవిస్తీర్ణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించినాడు. దారిపొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ బయలుదేరినవాడు 1299లో సామనాథ్‌ మీద పడటం సంభవించింది. ఉలుంఖాన్‌ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి, ఆ శకలాలను ఖిల్జీకి కానుకగా సమర్పించినాడు. ఆ తరువాత 1325-1331 ప్రాంతంలో జునాఘడ్‌ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగప్రతిష్ఠ చేసినాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్‌ బేగ్దా అనునాతడు ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి, ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేసినాడు.
ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము క్రీస్తుకు పూర్వము   (పాశ్చాత్యుల ప్రకారము చరిత్ర ఆరంభానికి ముందుకాలము). అది ఎందువల్ల ధ్వంసమయినదీ నాకు తెలిసిరాలేదు, రెండవసారి యాదవ రాజైన వల్లభాయి ముందు నిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీ పూ 649లో పునర్నిర్మించినాడని అంచనా. తరువాత క్రీ శ 725లో సింధూ నగర అరబ్ గవర్నర్ (రాజప్రతినిధి) జనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను పంపినాడు. క్రీ శ 815లో గుర్జర ప్రతిహరా రాజైన రెండవ నాగబటా ఈ ఆలయాన్ని మూడవమారు ఎర్ర ఇసుక రాళ్ళతో బృహత్తరంగా నిర్మింపజేసినాడని ఉహించబడుతుంది. క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినాడు. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి, అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ల చేత క్రీ. శ1026, 1042ల మధ్య ఈ ఆలయ పునర్నర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీ శ 1143-1172 ల మధ్య పునర్నిర్మించబడింది. క్రీ శ 1296 ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది. క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన చుదాసమా వంశీయుడైన మహీపాదావ చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీ శ 1326-1351 మధ్య ఈ ఆలయములో లింగ ప్రతిష్ఠ జరిగింది. క్రీ శ1375లో ఈ ఆలయం మరొకమారు గుజరాత్ సుల్తాన్ అయిన మొదటి ముజాఫర్ షాహ్ చేత కూల్చబడింది. క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్ అయిన ముహమ్మద్ చేత తిరిగి కూల్చబడింది. క్రీ శ 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీ శ 1701లో ఔరంగజేబు చేత ఈ ఆలయాన్ని మరొకమారు ధ్వంసం చేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాళ్ళను ఉపయోగించి ఔరంగజేబు మసీదును నిర్మించినాడు. తరువాత క్రీ.శ 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన ''భోన్స్‌లే, కొల్హాపూరుకు చెందిన చత్రపతి భోన్‌స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా సమష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.

గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ఎన్నోమార్లు  ధ్వంసం చేసినాడు. ఖచ్చితమయిన ఆయా తేదీలు నాకు అలభ్యములు. ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో నేలమట్టమయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయి పటేల్ దీనిని తిరిగి నిర్మింపజేశాడు. ఇక్కడి స్తూపాలు, దేవతా మూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరచినారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.
దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉంది. సమీపంలో భల్కా తీర్థం ఉంది.  ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించినాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే  దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. సోమనాథ్ శిధిలాలకు సంబంధించి సేకరించిన చిత్రములు ప్రత్యేకముగా ఆస్యగ్రంధియందుంచుతాను.
అప్పటి నెహ్రూ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్న శ్రీకే ఎమ్ మున్షి  గారు, ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టినారు, నెహ్రూ గారికి నచ్చకున్నా. 1950 అక్టోబరు మాసంలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుత మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకు  పోబడింది. 1951లో భారతప్రభుత్వ ప్రథమ రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాదు ఆలయ కుంభాభిషేకానికి కే ఎమ్ మున్షి చేత అహ్వానించబడినాడు. ఆయన తన ప్రసంగంలో " నా  దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన ఈ బృహత్తర ఆలయం పునర్నిర్మించబడడమే కాక పురాతన సోమనాధ ఆలయ పునరుద్ధణ వలన భారతీయ శిల్పకళావైభవానికి ఈ ఆలయం  ఒక తార్కాణంగా నిలిచింది. అయన సన ప్రసంగం పొడిగిస్తూ " పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తికంటే ఘనమైనది అనడానికి సోమనాధ ఆలయ పునర్నిర్మణం ఒక  ఉదాహరణ " అని ఉద్ఘాటించినాడు. ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధాన మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అఘాతాన్ని సృష్టించింది. జవహర్లా నెహ్రు దీనిని  హిందువుల ప్రతి ఘటనగా భావించగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీ గారిచేత, ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర ఫలంగా , తమకు జరిగిన అన్యాయానికి హిందువుల  ప్రతిస్పందనగా భావించబడినది. రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీల చేత పునరుద్దరించబడి దేశానికి సమర్పించిన ఈ సోమనాధ ఆలయం ఇప్పుడు సోమనాధ ఆలయ ట్రస్ట్ చేత  నిర్వహించబడుతుంది. మహారాజా రంజీత్  సింహుడు  కాశ్మీరును ఆఫ్ఘన్లనుండి విడిపించినపుడు  సోమనాథ దేవాలయమునుండి కొల్లగొట్టుకపోయిన రాజగోపురపు వెండివాకిళ్ళను, తాను శిఖ్ఖు మతస్తుడయి కూడా, పరమాత్ముడు అందరికీ ఒక్కడేనన్న నమ్మకముతో,వెనుకకు తెప్పించిన మహనీయుడు.
ఆంగ్లములో తెలియజేసిన ఆద్వానీ గారిమాటలను ఆయన పుస్తకము నుండి సేకరించినది  యథాతథముగా చదవండి.
మిగిలినది వేరొకమారు.......
ఆంగ్లములో తెలియజేసిన ఆద్వానీ గారిమాటలను ఆయన పుస్తకము నుండి సేకరించినది  యథాతథముగా చదవండి.
Munshi’s novel provides a poignant account of how Somnath was both a witness to, and a target of, foreign invasions during the medieval period. Mahmood Ghazni, a Turkish sultan of the province of Ghazni in Afghanistan, attacked India seventeen times in a span of twenty-five years between the years AD 1001-26. Somnath was a particularly coveted target for him. Muslim chronicles indicate that 50,000 Hindus died in the battle for Somnath in AD 1024. The Shiva lingam was destroyed by the sultan himself. After the battle, Mahmood and his troops are believed to have carried away vast amounts of gold and other riches stored in the temple. They are also said to have taken Hindu statues and buried them at the entrance of a mosque in Ghazni so that the faithful could trample on them. Munshi’s novel describes not only the destruction and pillage of the Somnath temple, and the betrayal by some Hindus on account of petty caste considerations, but also the heroic defense by its devotees, who would reconstruct it after each successive attack.
L.K. Advani, My Country My Life (2008). ISBN 978-81-291-1363-4
In his Pilgrimage to Freedom, Munshi wrote that after a Cabinet meeting in early 1951, Nehru called him and said, “I do not like your trying to restore Somnath. It is Hindu revivalism.” Munshi, then the Food and Agriculture Minister, wrote to the Prime Minister in reply: “Yesterday you referred to Hindu revivalism. You pointedly referred to me in the Cabinet as connected with Somnath. I am glad you did so; for I do not want to keep back any part of my views or activities I can assure you that the ‘Collective Subconscious’ of India today is happier with the scheme of reconstruction of Somnath than with many other things that we have done and are doing.”
Courtesy: Indian Express, Written by Uma Vishnu | New Delhi | Updated: December 9, 2017 2:51:07 pm
ఈ విషయములను మీ ముందుంచుటకు నేను Google Search మరియు Wikipedia పై మరియు నేను Note చేసుకొనుటకు మరచిన కొన్ని Reference పుస్తకములపై ఆధారపడినాను.
చివరిగా హైందవత్వమునకు ఊపిరులదు క్రుతనిశ్చయము కల్గిన ప్రస్తుత ప్రభుత్వము వచ్చిన తరువాత ఈ ఆది జ్యోతిర్లింగ దేవాలయము శోభాయమానమగు కళ సంతరించుకొనగల్గినది.
ఇక రెండవదగు శ్రీశైల జ్యోతిర్లింగము వైపు మరలుదాము.

రెండవ జ్యోతిర్లింగము-శ్రీమల్లికార్జున జ్యోత్రిలింగ దివ్యక్షేత్రము
శ్రీశైలశృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదా వసంతం |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుం ||
ఆంధ్రప్రదేశ్ లో ఈ పుణ్యక్షేత్రము కృష్ణానది ఒడ్డున శ్రీ శైల పర్వతం మీదఉంది. దీనిని "దక్షిణ కైలాసము” అని కూడా పిలుస్తారు. శ్రీమల్లిఖార్జునజ్యోతిర్లింగ క్షేత్రంలో  పరమశివుడు “శ్రీమల్లిఖార్జును”ని గా మరియు పార్వతి “భ్రమరాంబిక”గా కొలువై ఉన్నారు. అంతేకాకుండా    జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం  దక్షిణాన ఉన్న అత్యంత ప్రభావము కలిగిన  శైవక్షేత్రాలలో ఇది మొదటిది. అష్టాదశ శక్తిపీఠాలలో భ్రమరాంబ శక్తి పీఠము ఒకటి. కావునఈ దక్షిణ కైలాసములో ప్రధాన దేవతలు మల్లికార్జున స్వామి, భ్రమరంబికా దేవి.    
శ్రీశైలం:కర్నూలుజిల్లాలో నల్లమల  కొండలు, ప్రకృతి అందాలన్నింటినీ కొండలపైనుండు ఈ  అడవులు తమలో  దాచుకున్నవి. ఈ పర్వతారణ్య ప్రాంతంలో శివుడు పదిలంగా సముద్రపు మట్టానికి 458 మీ. ఎత్తున  వెలసియున్నాడు. ఈ ఆలయ ప్రశస్తి అనేక విధాలుగాపురాణాల్లో సైతం చెప్పబడియున్నది. 
శ్లో. మైనాకం మంధరం మేరుం శ్రీశైలం గంధమాదనమ్l
పంచశైలాపఠేన్నిత్యం మహాపాతక నాశనమ్ll 
అంటే  కేవలము స్మరణ మాత్రంగానేమహాపాతకములను నిర్మూలించ గలిగిన పంచ పర్వతములలో శ్రీశైలము ఒకటి. 
శ్లో. కేదారే హ్యుదకం పీత్వా వారణాస్యాం మృత స్తథాl
శ్రీశైలేశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతేll 
అంటే కేదార క్షేత్రంలో నీరు ద్రావినా, కాశీలోమరణించినా, శ్రీశైల శిఖరం దర్శించినా పునర్జన్మం లేదు - అనిచెప్పబడింది. ఇంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది. 
తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాలలో ఈ క్షేత్ర ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దమూలలో నాటి తమిళ శైవ గ్రంథము తేవారంలో ప్రముఖ నాయనారులగు తిరునావుక్కరసు(అప్పర్), సుందరమూర్తి నాయనార్, తిరుజ్ఞాన సంబందర్ శ్రీశైలాన్ని గురించి, మల్లికార్జనుని గురించి ఎంతగానో గానం చేసినారు. శ్రీ శైలమును తిరుప్పాపురముగా  పేర్కొన్నారు. క్రీ.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించినారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ క్షేత్రము కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగముల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు  అనుమతి తో ఆత్మకూరు తహసీలు ప్రాంతములో  కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది.
స్థల పురాణము ప్రకారము, పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావముచేత భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈ రాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. భ్రమరములకు 8 కాళ్ళుంటాయి. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
రెండవ జ్యోతిర్లింగము-శ్రీమల్లికార్జున జ్యోతిర్లింగ దివ్యక్షేత్రము-2
ఈ క్షేత్రమునకు సంబంధిన మరియొక కథ ఈ విధముగా వున్నది. కృష్ణానది తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేకలేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టుట చేత చంద్రకేతుడు రాజ్య విస్తరణ కాంక్షతో జైత్రయాత్రను కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉండిపోయినాడు. కొంతకాలము తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్రను ముగించి, తిరిగి రాజధాని చేరుకున్నాడు.
   అంతఃపురంలో ఆ సుందరాంగి ఎవరో తెలియక కన్నా కూతురిపైనే కన్నువేసినాడు రాజు.  అది చూసిన అతని భార్య ‘ఆమె మీ కూతురు చంద్రమతి అని చెప్పినా, చంద్రమతి చేతులు  జోడించి ‘నేను మీ కుమార్తెను, వదిలిపెట్టండి’ అని వేడుకున్నా, చంద్రకేతుడు కామకాంక్షతో  ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించినాడు కానీ వదిలి పెట్టలేదు. దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో  తలదాచుకుంది. ఆమె కోసం గాలించి ఉనికిని తెలుయ్సుకొన్న చంద్రకేతుడు ఆ గుహ బయటే  మాటువేసినాడు. శివ భక్తురాలైన చంద్రమతి తండ్రి నుంచి తనను కాపాడమని శివుని  ప్రార్థించుటచే. పిశాచాములను కాపు వుంచి ఆతనిని లోనికి రాకుండా చేసినాడు. కానీ  చంద్రకేతుడు మొండిగా  అక్కడే ఉండిపోవుటతో, పరమేశ్వరుడు ఆతని ఒక ఆకుపచ్చ శిలగా  మార్చగా, ఆశిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. పాతాళ గంగలో అది మనము   ఇప్పటికీ చూడవచ్చు. ఆధునికులు అది నాచు వల్ల ఆకుపచ్చగా ఉన్నది అని చెప్పుట కూడా  కద్దు. యద్భావం తద్భవతి.  
గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి, అరణ్యములో తిరుగుచుండగా, ఓ గోవు పొదుగు   నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుచున్న శివలింగమును చూసి ఆశ్చర్యపోయింది. లిగరూపములోనున్న పరమేశుని నిత్యం మల్లె పూలతో అర్చించేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు, చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన కచాబంధమునకు (కొప్పుకు)చుట్టూ అలంకరించుకొనేవాడట. అందుకే ఆ ఆలయానికి మల్లిఖార్జున స్వామి ఆలయముగా పేరొందినట్లు చెబుతారు.
శిఖర దర్శనము, ధూళి దర్శనము ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనవి.

శ్రీశైల మల్లికార్జునుని ధూళి దర్శనము చేసుకొమ్మని పురాణ వచనము. ఆ శ్లోకమును ముందే మనము చెప్పుకొన్నాము. ఇప్పుడు ధూళి దర్శన మహాత్మ్యమును గూర్చి చెప్పుకొందాము. మనము బయలుదేరిన  ప్రదేశము నుండి శ్రీశైలము వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మన శరీరము. ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతోనే ముందు శిఖర దర్శనము, పిదప గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చినట్లు అచ్చటి కాపలాదారులకు చెప్పి లోపలి వెళ్లి మట్టి కాళ్ళతోనే మోకాళ్ళపై కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడను నమ్మకముతో నాడు భక్తులు పాటించేవారు. నేటి జనసమ్మర్దమునకు అది వీలుకాని విషయము. కానీ నేటికి కూడా దూరమునున్దియే స్వామీ దర్శనము చేసుకొని సభాక్తికముగా మ్రొక్కులిడి వస్తారు భక్తులు.
ప్రదోష కాలములో అంటే అసురసంధ్య వేళలో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై నందివాహనముపై భూమండలం మీద సంచరించుతాడు. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివ స్తోత్రములు చేయు భక్తులను చూసి ఎంతగానో సంతోషించి వారి కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి.
రెండవ జ్యోతిర్లింగము-శ్రీమల్లికార్జున జ్యోతిర్లింగ దివ్యక్షేత్రము-3
చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారని అంటారు. కారణము నాకు తెలిసిరాలేదు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చుంటాడని భక్తుల నమ్మకము.  స్వామి వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామములను ప్రత్యేకంగా వ్రాసియుంచమని అమ్మవారు గణపతికి చెప్పినదట. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. ఇది ఆ క్షేత్ర సాంప్రదాయము.
ఇక శిఖర దర్శనమును గూర్చి.  శ్రీశైలంలో శిఖరేశ్వరము ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేదట. ఆ కాలములో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. ఊర్లలో శివాలయము, విష్ణ్వాలయము (రామాలయము)  తప్పకుండా ఉండేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళే అవకాశములు నాడు ఒకవిధముగా చెప్పవలెనంటే మృగ్యము. ఆ సమయములో గర్భగుడి మూసివున్నా  అర్చకుడి వద్దకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం ఆయన తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే, ప్రసవము జరగకుండానే పెద్ద ప్రాణము పోతుందేమో నని అనుకున్న గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవములు జరిగేవి. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురము మీద వున్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం కనపడాలి. అలా కనపడిన వారికి పునర్జన్మ ఉండదు. ఒకసారి శిఖరదర్శనము అయినది అయినది అని చంకలు గుద్దుకొనుచున్న భక్తులకు పరమాత్మ ఒక పరీక్ష పెట్టినాడట. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నంది కొమ్ముల నడుమనుండి శిఖరం చూసిన వారందరికీ పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని అడిగిందట. అందుకు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని అంటూ పార్వతీ దేవి చెవిలో ఎదో గుసగుసలు పోయినాడట. తరువాత ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించినాడు. అమ్మ వృద్ధ బ్రాహ్మణిరూపు దాల్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి మెట్లు ఎక్కుతున్నారు. భక్తులు నంది శృంగముల నడుమ నుండి శిఖరము కనిపించినా కనిపించకున్నా కనిపిన్క్ష్చినత్త్లుగా భావించి దిగిపోతున్నారు. ఆ సమయమున ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించినాడు. అందులో ఆయన కూరుకుపోతున్నట్లు అభినయించుతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి యగు భ్రమరాంబ ‘మా అయన దిగబడిపోతున్నాడు, రక్షించండి’ అని  ఆర్తనాదము చేయ మొదలుపెట్టింది. అది చూసిన భక్తులు గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయినారు. అపుడు ఆమె ‘ఆగండాగండి’ అంటూ ‘మీలో పాపము చేయనివారు మాత్య్రమే పైకి లాగగలరు’ అంది. అపుడు ప్రతివాడూ తాను  ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోవుట జరిగింది. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతూ వచ్చి, తానూ వేశ్యనని చెప్పుకొని, అయినా తాను  లాగుతానన్నది. అపుడు పార్వతీ దేవి ‘ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని  వెళ్ళిపోతున్నారు. పాపివి అని నీకు నీవే చెప్పుకొంటూ నా భర్తను ఎలా లాగుతావు’ అని అడిగింది. అపుడు ఆవిడ ‘శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ ‘అన్నది ఆర్యవాక్కు కాదమ్మా!’ ‘నేను ఇప్పడే శిఖర దర్శనం మనసారా చేసినాను. మోక్షం రావాలంటే జీవి పాపపున్యములకు అతీతమై ఉండవలెను కదా!, నాది ఇప్పుడు ఆ స్థితి. అందుకే నేను ఈ మహానుభావుని ఊబినుండి బయటకు లాగ సమకట్టినాను’ అన్నది. శివుడు నిజరూపమును దాల్చి,ఈమె ఒక్కతెయే  మోక్షమునకు అర్హత సాధించినద’ని తెలిపినాడు. మనకు ఈ కథనుండి తెలియవచ్చు విషయమేమిటంటే, నంది శృంగములలోంచి చూచుట కాదు, నిష్కల్మషమైన భాక్తిభావముతో కామనారహితముగా, శిఖరమును చూచినవారికే, మోక్షము లభించుతుంది. అదీ శ్రీశైల శిఖర మహాత్మ్యము.
ఇక్కడ మహాశివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము అత్యంత ప్రధానమైన వేడుకలు. ఇక్కడ ధూళి దర్శనమును ఎంతో పవిత్రముగా భావించుతారు. ధూళి దర్శనము అంటే యాత్రికుడు శ్రీశైలము చేరిన తరువాత పాద ప్రక్షాళనము చేసుకోకుండా స్వామి దర్శనము చేసుకొనుట. శివరాత్రినాటి రాత్రి స్వామివారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి- 360 మూరలగుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టటం అని అంటారు. - ఈవస్త్రాన్ని రోజుకొక మూర చొప్పున 360 రోజులు ఒకే వ్యక్తి నేస్తాడని చెబుతారు. ఈపాగా రాత్రి వేళ సరిగా లింగోద్భవ సమయానికి  ముగుస్తుంది.పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడు. ఇది నేను నా బాల్యములో నాతండ్రి అమ్మమ్మలతో రెప్పనార్పకుండా తెల్లవార్లూ మేలుకొని చూసిన మరపురాని దృశ్యము. 66, 67 సంవత్సరములకు పూర్వమే ఎక్కువ సంఖ్య అనార్ద్ర ఘటములతో (Dry Cells) వున్న కరదీపికలను (Torch Lights) ఉపయోగించి అతనిని పసిగట్ట విఫల ప్రయత్నము చేసినది నాకు ఇంకా జ్ఞాపకము. ఈ పాగానుచిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు.       
రెండవ జ్యోతిర్లింగము-శ్రీమల్లికార్జున జ్యోతిర్లింగ దివ్యక్షేత్రము-4
ఇక్కడకుఇక 3 కి.మీ. దూరంలో కృష్ణా నది ఉత్తర వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అనిఅంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకుగల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయినాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలోవున్న ' లింగాల గట్టు' వగైరాలనుదర్శించుకుని గాని మరలరు. ఆలయం చుట్టూ ప్రాకారపు గోడలు చాలఎత్తుగా ఉంటూ వివిధ గోపురాలతో  శోభిల్లుతూవుంటాయి. ప్రాకార నిర్మాణానికి వినియోగించబడినరాళ్ళు సుమారు 20 అ. వైశాల్యముతో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు,రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు- భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికిసరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా దేవి  ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగాశివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినారని ప్రతీతి. ఆది శంకరులవారి పేరు వచ్చింది కాబట్టి శ్రీశైలముతో, వారిజీవితానికి సంబంధించిన ఒకముఖ్యమగు సంఘటనను తెలియజేస్తాను. శ్రీఆది శంకరులకు శ్రీశైలము పై మక్కువ ఎక్కువ. ఒకసారి ఆయన శ్రీశైల పరిసరములలో చాలాకాలం తపస్సు చేసుకొంటూ ఉండిపొయినారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో సనాతనధర్మ ప్రచారము చేయుచున్నకాలమున వారిపై ఈర్ష్యతో కొందరు కాపాలికులు ఆయనను అంతమొందిచు ప్రయత్నములో భాగంగా ఒక కాపాలికుడు ఆయనవద్దకు వచ్చి వినయముతో "స్వామీ! మీరు బ్రహ్మ సత్యం జగన్మిధ్య, జీవొ బ్రహ్మైవ నా పరః'అని చెబుతారు అది వాస్తవమా అని అడిగినాడు. స్వాములవారు అందుకుసందేహము లేదన్నాడు. కాపాలికుడు "మరి మీకు మీరు ధరించిన శరీరముపైమక్కువేలేదా!" అని అడిగినాడు. స్వాములవారు "లేదు' అంటూనే"మరి అది నాకు ఇస్తారా" అని అడిగినాడు. స్వామీ 'నిస్సందేహముగా'అని అన్నాడు. కాపాలికుడు వెంటనే తనవద్దనున్న బలమైన కత్తిని ఆయన పైకిఎత్తినాడు. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుల ప్రధాన శిష్యుడైన పద్మపాదుడుమల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుతూ కూర్చొని ఉండినాడు. ఈశ్వరునేమనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించింది. వెంటనే అతడుఆగ్రహోదగ్రుడై శ్రీలక్షీనృసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికినఆ దొంగలనాయకునిపై  హటాత్తుగా సింహమురూపములో నరసింహము దాడి చేసి ఆ కాపాలికుని శరీరమును తునాతునకలు చేసిఅంతర్ధానమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికిఅతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించినారు.     శ్రీశైలములో, చైత్రమాసములో ' అంబ తిరునాళ 'అని గొప్ప ఉత్సవం జరుగుతుంది. ముఖ్యముగా చుట్టుప్రక్కల వున్న స్థానికులు విరివిగా ఇందులో పాలుపంచుకొంటారు. వెనుక వైపున భ్రమరాంబికాలయంతోపాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడుశ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలుజరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.శ్రీశైలము ఆంధ్రప్రదేశ్రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరాఅంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీమల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలుదాటుతూ దటమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామంఅయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.చరిత్ర:ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు,రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి చారిత్రిక ప్రసిద్ధులు సేవలు చేసిన మహాక్షేత్రమిది. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషుల పూజలందుకొన్న పుణ్యధామమిది. శ్రీశైల దేవస్థాన రక్షణకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటిపటిష్ట కట్టడము నిర్మించినారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడములుగా దేవాలయములను నిర్మించినారు. శ్రీశైలం చుట్టు ప్రక్కలదాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగినప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకానేకములు కలవు. శ్రీశైలముక్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలు.శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైనప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము.ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగాఉంటుంది.భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైనశిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయముఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈదేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవిని ఆనించి వింటే ఝమ్మనే  భ్రమరనాదం వినిపిస్తుంది. పంచ పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారిపేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములనుప్రతిష్టించినారు. ఇక్కడ మరియొక విచిత్రమగు విషయము ఏమిటంటే ముడతలు పడిన రీతిగా కనిపించే శివలింగము. దీనిని వృద్ద మల్లికార్జున లింగము అంటారు.ఇది చూచుటకు అంత అందముగా ఉండదు.  శ్రీశైలమునకు ప్రక్కనవున్న కృష్ణానది క్రింద లోయలో ప్రవహిస్తుంది. దీనిని పాతాళగంగ గా వ్యవహరించుతారు. పాతాళగంగ లో నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండ(ల) పై నాచు నిలచి సూర్యకిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది.  అందరూ దీనిని పచ్చలబండ అని వ్యవహరిస్తారు. 2004 లొ పాతాళగంగ కు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడినది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగకాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. ఇది ప్రధానఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది.శ్రీశైలం లో కొలువై వున్న సాక్షి గణపతి దేవాలయము. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంతమాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభించదు. మనము శ్రీశైలమునకు వచ్చి నట్లుసాక్ష్యము వుండాలి. అందు చేత ఈ సాక్షి గణపతిని దర్సించు కుంటే మనం శ్రీశైలానికివచ్చినట్లు ఈ గణపతి సాక్ష్యం చెపుతాడు. అందు చేత శ్రీ శైలానికి వచ్చిన వారందరు తమరాకకు సాక్షిగా ఈ సాక్షి గణపతిని దర్శించు కుంటారు. ప్రథానఆలయానికి దూరంగా వున్న ఈ ప్రదేశమునుందడియే శిఖర దర్శనము చేసుకోవాలిశ్రీశైలంమొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అనిశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని ముందే చెప్పుకొన్నాము. శ్రీశైలము వెళ్ళే దారి మధ్య లో ఒక చిన్న గుట్ట వున్నది.  ఈ గుట్ట మీద ఎటువైపుకైనా త్రిప్పగలిగే నందివిగ్రహం వున్నది. దాని కొమ్ములపైన మన కుడిచేతి బొటన, చిటికనవ్రేళ్ళ నుంచి మధ్యలోనుండి దూరంగా అస్పస్టంగా కనబడుతున్న శ్రీశైల ఆలయ గోపుర శిఖరాన్నిఅందులోనుంచి చూడాలి. గోపురము  కనబడిన వారికి  పునర్జన్మ వుండదని భక్తుల విశ్వాసము. ఈసౌకర్యము కాలి నడకన వెళ్లేవారికి, లేదా స్వంత వాహనాలపై వెళ్ళేవారికి మాత్రమె వుంటుంది. బస్సులు ఇక్కడ ఆగవు. శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగాహటకేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్యతపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ వాలునుండి క్రిందికి      దూకే సన్నని రెండు జల దారలను పాల ధార  పంచ ధార అని అంటారు. ఒకదాని నీరు చక్కెర వలె తియ్యగాను, రెండోదాని లోని నీరు పాలవలె కమ్మగానూ రుచి కలిగి వుంటాయి. శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లుదండయాత్రలనుండి కాపాడి శ్రీశైలమును రక్షించినాడు. అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండుఅంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియుచిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీకాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు. అనేకానేక ప్రత్యేకతలు
కల్గిన ఈ క్షేత్రము భవతారకము.
నాకు చేతనయినంత శ్రీశైలమును గూర్చితెలిపి అక్క మహాదేవి గుహలను గూర్చి తెలుప మరచినాను. ఆ తల్లిని క్షమాపణ వెడుతూ, మల్లికార్జునుని నా తప్పును మన్నించమంటూ  ఆమె వృత్తంతామును మీముందుంచుచున్నాను. ఈమె శ్రీశైల మల్లీశ్వరునే పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాలతో సాధించింది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరుని సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి కర్ణాటకలోని షిమోగా సమీపంలోని ఉడుతడి లో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు పార్వతీదేవి కటాక్షముతో జన్మించుటచే తల్లిదండ్రులు ఆమెకు మహాదేవి అన్న పేరుపెట్టుట జరిగింది. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశము ఆ బాలికకు జరిపినారు.
ఉడుతడిని పాలించే రాజు కౌశికుడు ఒకనాడు నగరంలో ఊరేగుతుండగా, బాల్య చాపల్యంతో రాజును మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో మహాదేవి అతని కంటబడింది. ఆ అసమాన లావణ్యవతిని చూసిన వెంటనే ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపినాడు. వారు అంగీకరించకపోవుటతో మంత్రి వారిని బెదిరించినాడు. తల్లిదండ్రుల దీనావస్థను గమనించిన మహదేవి ఒక ఉపాయ మాలోచించి, రాజు తాను విధించే మూడు షరతులకు అంగీకరిస్తే రాజును తాను వివాహమాడగలనని, భంగము వాటిల్లితే తన దారి తానూ చూసుకుంటానని తెలిపింది. రాజస్తమోగుణ పీడుతుడగు రాజు ఒక రోజు రాత్రి ఆమె పడకగదిలో ప్రవేశించి బలవంతముగా ఆ పరమ శివ భక్తురాలిని వివస్త్రను జేసి "పరమభక్తురాలివి గదా, నీకు వస్త్రం ఎందుకు?" అని అపహాస్యం చేస్తాడు. తక్షణం పరమేశ్వరానుగ్రహముతో ఆమె నిడువైన కేశాలు దట్టముగానూ పొడవుగానూ చేసి తన శరీరము మొత్తమును కప్పుకొంటుంది. రాజు స్థాణువులా నిలిచిపోగా  రాజమందిరమును వీడి  కష్టపడి కళ్యాణ పట్టణం చేరుతుంది. రాజభవనము వీడినది మొదలు ఆమె వస్త్రాలు ధరింపక జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోతుంది. ఇక రాజ్యం నుండి బయటకి వచ్చిన మహాదేవి, అప్పటికే ప్రజలను భక్తి బాటలో నడిపిస్తున్న బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు భక్తుల కోసము ఏర్పాటు చేసిన వేదికను చేరుకొని, వారిని దర్శించి, శివతత్వముపై చర్చించగా ఆమె పాండిత్యానికి ముగ్దులై అమెను అక్క అనే బిరుదునిచ్చి సత్కరించగా ఆమెఅక్కమహాదేవి అయినది. తరువాత బసవేశ్వరుని ఆజ్ఞ మేరకు అమె శ్రీశైల మల్లన్నను పతిగా భావించి ఇప్పుడున్న శ్రీశైల గుహల స్థావరము ఏర్పరచుకొంటుంది. అనతికాలంలోనే ఆమె శ్రీశైల మల్లికార్జునిలో ఐక్యమైపోతుంది.
అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో అక్కగళపితికే, కొరవంజి వచనార్ధ అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. భూమికి 200 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు గల ఇక్కడి సహజ శిలాతోరణము ఆత్యద్భుతమని చెప్పవలసి వస్తుంది.  అక్క మహాదేవి గుహలుశ్రీశైలమునకుకు సుమారు 10 కి. మీ. ల దూరం లో కలవు. ఈ గుహలు చరిత్రకు పూర్వం నాటివని తెలియజేసే ఆధారాలు కూడా కలవు.  అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగమునకు , పూజలు సల్పుచూ తపమాచరించి శివైక్యమందుటచే  ఆమె పేరు హో చిరస్తాయిగా ఈ గుహలు నిలచిపోయినాయి.
శ్రీగిరి  వాసుడా శివుడ చిన్మయ రూపుడ ఆశుతోషుడా
మూగిన బాధతో భవముమోయగలేనిమనస్సు తోడుతన్
సాగెను జీవితమ్ము దరి సాంతము జేర్చగ మల్లికార్జునా
సాగిలి మ్రొక్కెదన్ భ్రమర సాంద్రసరాగసుమూర్తితో నినున్ 

స్వస్తి.
ఇక మూడవ 3వ జ్యోతిర్లింగమయిన మహాకాళేశ్వర లింగము చూచుటకు ఉజ్జయిని వెళ్దాము.
3వ జ్యోతిర్లింగము-మహాకాళేశ్వర లింగము-ఉజ్జయిని
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహం సురేశం ||

ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ నగరము. ఇది నేటికీ ప్రముఖమే. ఇది అవంతీ, అవంతిక అన్న పేర్లతో కూడా ప్రసిద్ధము. నేటి మధ్య ప్రదేశ్ మాల్వా ప్రాంతంలో ఈ నగరము సిప్రా నదీ తీరమున గలదు. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండేది. ఉజ్జయిని భౌగోళికంగా సున్నారేఖాంశము మరియు కర్కాటక రేఖ కలిసే  ప్రదేశములో ఉంది. అందుకే ఎన్నో వేల సంవత్సరముల నుండి, మన పూర్వులు, దీనిని భూమి యొక్క నాభిగా భావించుతారు, .
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి అవంతికాl
పురీ ద్వారవతీచైవా సప్తైతే మోక్షదాయకాఃll అన్నది శాస్త్ర వచనము.
ఇక్కడ జ్యోతిర్లింగముతో సంబంధములేని ఒక విషయము చెప్పుకోవలసి వస్తుంది. పెద్దలకు, జరిపే పుణ్యకార్యములలో  ఈ శ్లోకము వస్తుంది. ఈశ్లోకములో తెలియజేసిన పుణ్యక్షేత్రములు, అయోధ్య, మధుర, మాయ(మాయాపురి), కాశీ, కంచి, అవంతిక, పూరీ, ద్వారావతీ, ఎంచితే 8 అవుతాయి. మరి సప్త అంటూ 7 కదా చెప్పినది. అంటే ఇందులో అవంతిక అని కాకుండా అవంతికాపురి అనితీసుకొంటే అప్పుడు మనకు సంఖ్య సరిపోతుంది. మరి పూరీ పేరును ఎందుకు తీసివేయవలసి వస్తుంది. ఈ విషయమును ఒకసారి చూద్దాము. ఒక పూరీ జగన్నాథ్ తప్పించితే మిగత 7 సమురతీరమునలేవు. పైగా పూరీ జగన్నాథునివలన ప్రసిద్ధి చెందినది. పైన తెలిపిన 7 ప్రదేశములు క్షేత్ర ప్రాధాన్యత కలిగినవి. అందుచే ఆ ఏడింటినీ తీసుకొనవలెనన్నది నేను మనసునకు చెప్పుకొన్న సమాధానము.
మనము తిరిగీ జ్జయిని విషయానికొస్తే ఇచట 12 ఏండ్లకు ఒక సారి కుంభమేళా జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది మూడవది. ఈ జ్యోతిర్లింగమును మహాకాళేశ్వర జ్యోతిర్లింగము అని పిలుస్తారు. రుద్ర సాగర్ అన్న సరస్సుకు దగ్గరగా, మూడు అంతస్తుల ఈఆలయము వెలసియున్నది. ఉజ్జియిని మాల్వాపీఠభూమిలో కర్కాటకరేఖపై ఉంది.
అవంతిక వైభవమీనాటిది కాదు. పాశ్చాత్య చరిత్రకారులకు అందని క్రీ.పూ మూడువేల సంవత్సరముల ముందు నుండియే అవంతిక మహోన్నత స్థానమును అలంకరించియున్నది. కాళిదాసు దీనిని తన అజరామర కావ్యములలో, అనేక విధములుగా పొగడియున్నాడు. అశోకుడు, విక్రమాదిత్యుడు, చంద్రగుప్తుడు, ఈఅవంతికకు ప్రాభవమును కల్పించినవారే. వీరందరికంటే ప్రమర వంశమునకు చెందిన విక్రమార్కుడు ఎనలేని ఖ్యాతిని ఆర్జించినాడు. సామ్రాట్ విక్రమాదిత్యుడు (101 BCE నుండి 19 AD వరకు) భారతదేశము అనగా నాటి ఉజ్జయినీ సామ్రాజ్యానికి రారాజు. ఈ అవంతిక ప్రళయకాలమా అన్నంత వరదలవల్లను మరియొకసారి ఢిల్లీ ప్రభువు ఇల్టిమష్ వల్లను నాశనం చేయబడింది. ఇది వరుసగా బ్రాహ్మణ, జైన, బౌద్ధ, సిథియన్, హైందవ, గ్రీకు, రాజ్యములకు రాజధానిగా ఉండినది. చివరకు దీనిని ముస్లిం పాలకులు హస్తగతము చేసుకొన్నారు.

అవంతి నగరము చాలా కాలము సుప్రసిద్ధ విద్యాపీఠముగా వెలసినది. ఇక్కడనే బలరామ కృష్ణులు సాందీపునివద్ద విద్యలు నేర్చినారు. ఇప్పటికిని సాందీపుని ఆశ్రమ స్థలము యాత్రా స్థలముగ వెలసియున్నది. ఆస్థలమునందు ఒక దేవాలయమును, రమణీయ సరోవరము ఉంది. దీనిని అంకపథ్ అని అంటారు.1835వ సం.లో ఈదేవాలయము ధ్వంసము చేసి, ఢిల్లీ ప్రభువగు ఇల్టిమష్ ఇందలి మహాకాళ విగ్రహమును తన రాజధానికి ఎత్తుకొని పోయెనట. ఆతరువాత 500 ఏండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వమున దివానుగా పనిచేయుచున్న రామచంద్రుడను పుణ్యశాలి అంతకు ముందున్న స్థలముననే ఇప్పుడు ఉన్న దేవాలయమును కట్టించెను. ఇక్కడ బ్రాహ్మణ పురోహితులను పండాలని పిలుచు చుందురు. పండ అంటే వేదశాస్త్రపురాణ పండితుడు, జ్ఞాని అని అర్థము.

శ్రీకృష్ణ పరమాత్మ అవంతికలో చదువుకొనుచున్న రోజులలో ఇదియొక జ్యోతిష్య కేంద్రముగా కూడా ప్రసిద్ధి చెంది యుండిననదని పెద్దలు చెబుతారు.ఆనాటికే హోరా విజ్ఞాన కేంద్రములలో ఒకటిగా ఉజ్జయిని పేరుగాంచియుండెనట. ఈఅవంతికను రాజధానిగా పాలించిన విక్రమాదిత్యుడు పేరునే విక్రమ శకముని ప్రసిద్ధ శకము ఏర్పడినది. యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతము ఇక్కడ ఉన్న నక్షత్రశాల 1693లో రాజా జయసింగుచే కట్టబడింది.
ఇక మహాకాళ జ్యోతిర్లింగమును గూర్చి మరొకసారి....... 
2.
ఇక మహాకాళ జ్యోతిర్లింగమును గూర్చి ఆ లింగము ఉన్న మందిరమును గూర్చి తెలుసుకుందాము. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. అనగా ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో "ఓంకారేశ్వర మహాదేవ" విగ్రహం మహాకాల విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ,ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం.మూడవ అంతస్తులో గల "నాగచంద్రేశ్వర" విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనంకోసం తెలుస్తారు. ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ తలము క్రిందుగా ఉంటుంది. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొనివున్న విశాలమైన ప్రాంగణం కలిగి యున్నది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది.ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం (పవిత్ర సమర్పణ)ఇతర ఆయయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం.
ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగము. మధ్యలో ఉండేది ఓంకార లింగము, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగము. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు.ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి కిష్టమయిన విషయములో కూడా విజయాన్ని సాధించి తీరుతాడు.

ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడుతోపాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనం ఇస్తాయి. మహాకాల్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై భాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుడ్ని ఇక్కడ మహాకాలునిగా కొలువై ఉండమని ప్రార్థించినాడనీ, బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికింతటి శోభనిస్తున్నాడనే పురాణకథలు వినిపిస్తాయి.
ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అంతవరకు కాల్చి  విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేఈ విభూతి అభిషేకము రెండు విధాలుగా ఉంటుంది. తెల్లని పల్చని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు.అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాకుండా, మొత్తము గర్భగుడి అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు.  ఆరతి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.
 రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మ హారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మ హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటంకాని, చూడటానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో, బారికేడ్లు వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి వున్న నంది మంటపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక, సమీపంలో కూర్చుని దర్శనం చేసుకొంటారు.
స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి, నేరుగా కైలాసనాధుని దర్శనము అయినంతటి ఆనందాన్ని ఇస్తుంది. బ్రహ్మ సైతం ఈ భస్మపూజ చేసినట్లు చెబుతారు. బహుశ స్మశాన విభూతితో అభిషేకము చేయుతవల్లనేమో,ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని కూడా పిలుస్తారు.. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువునుండి రక్షిస్తుంది. 12 సంవత్సరాల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి.
పూర్వము ఉజ్జయినికి అవంతి అన్నపేరు కూడా ఉన్నదని మనము చెప్పుకొన్నాము.

మిగిలిన భాగము వేరొక మారు.
3
అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి.  మొదటిది 'స్త్రీ' అన్న అర్థమయితే, రెండవది 'అక్క'. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి (ఉజ్జయిని) కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో' అమ్మవారయిన మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. ‘కాళ’ 'కాల' అను శబ్దములు లయకారకములు.  ‘కాళ’అన్న శబ్దానికి పాము అన్న అర్థము కూడా ఉన్నది. అందుకే ‘కాల సర్పము’ అన్న ప్రయోగము వాడుకలో ఉన్నది. ఇక్కడ స్వామీ, అమ్మవారు ఇరువురూ  కాళ\కాల స్వరూపులే. ఆలోచించితే కాల స్వరూపులగు గౌరీశంకరులు, భూమికి నాభియైన ఈ క్షేత్రములో 'కాల రూపులై' వెలసినారు అనిపిస్తుంది. లయము సృష్టికి పునాది. పంట అయినది అంటే మనము పంట కోతకు వచ్చింది అనే కదా అంటాము.
ఇక స్థలపురాణమునందు ఈ స్థల మహత్మ్యము ఏవిధముగా వివరింపబడినదో తెలుసుకొందాము.  స్థలపురాణమున ఇక్కడి శివలింగము స్వయంభువమయినట్లు తెలియవస్తుంది. పూర్వము ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలములలోనూ, క్రమము తప్పక శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాని పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవవాని పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయినారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో దూషణుడు అన్న ఒక రాక్షసుడు,. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించినాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణులను  చంపుటకు వారిపైకి ఉరికినాడు. అయినా వారు బెదరక ‘హర హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు  వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పోయినాయి, కానీ కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ బాలకులకు మాత్రము, ఏమాత్రమూ ముప్పు వాటిల్లలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రముచేస్తూ అలాగే ఉండిపొయినారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిసినాడు.
మరియొక కథ ఈవిధముగా ఉంది. ఒకప్పుడు, ఈ ప్రాంతాన్ని "చంద్రసేనుడు" అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. ఆయన తన జీవితమునే శివారాధనకు అంకితము చేసినవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు (శ్రీకరుడు) రాజభవనపు పరిసరములలో నడుస్తూ రాజు చేస్తున్న భగవన్నామ సంకీర్తనకు ఆకర్షితుడై ఆలయముప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తూ ఉండిపోతాడు. కానీ రాజభటులు దానిని తప్పుగా తలచి అతనిని  బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్రా నదీ సమీపంలో విడిచిపెడతారు. ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులగు, రిపుదమనుడు, సింగాదిత్యుడు, ఉజ్జయినిపై దండెత్తి తమవశము చేసుకొన నిశ్చయించుకొంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు త్రికరణ శుద్ధిగా శివారాధన తత్పరుడై, తమ రాజు, ఈగన్దమునుంది గట్టెక్కవలెనను ధృడ సంకల్పముతో శివపూజా దీక్ష పూనుతాడు.
శివుడు మహాకాలుని రూపములో అవతరించి చంద్రసేనుని  శత్రువులను సంహరించి . శివభక్తులైన శ్రీకరుడు, చంద్రసేనుల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరింఛి మహాకాలునిగా కొలువబడుతూ, లింగరూపుడై నిలుస్తాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగములో మహాకాలునిగా కాంతి రూపంలో కొలువైనాడు.  ఈ క్షేత్రంలో పరమేశ్వరుని దర్శించినవారికి మరణం, వ్యాథుల భయం నుండి విముక్తి కల్పిస్తానని తెలిపినట్లు స్థలపురాణము ద్వారా మనకు తెలియవస్తూ వున్నది.
ఉజ్జయిని మహాకాళి (గఢకాళి /గఢకాళిక : ప్రాంతీయ నామము) అష్టాదశ శక్తిపీఠాలలో ఒక ఉజ్జయిని అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి. సతీదేవి పై పెదవి ఈ ప్రాంతంలొ పడింది అని పురాణ కథనం. ఈమె మహాకాళేశ్వరుని శక్తి.
ఉజ్జయిన్యాం మహాకాళి మహాకాళేశ్వరేశ్వరి l
క్షిప్రాతీరస్థితా మాతా వాంచితార్ధప్రదాయిని ll
ఇది అమ్మవారి స్తోత్ర శ్లోకము.
అమ్మవారి గుడి ఉజ్జయిని ఊరికి ఉత్తరాన భైరవ్ గడ్/భేరుగడ్ అనే ప్రాంతంలో క్షిప్రా నది తీరాన చిన్నగుట్ట మీద ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వంమురత్నాచలము లేదా భైరవ పర్వతము అని పిలిచేవారు. స్కంధపురాణం లో మహాకాళిని రక్తదంతిక, చాముండగా వర్ణించినారు.

మిగిలినది మరొకమారు......
4
ఉజ్జయిని స్థలపురాణం :
పూర్వం ఉజ్జయిని నగరాన్ని అంధకాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతనికి ఒక ప్రత్యేక మైన వరం ఒకటి ఉంది. అది ఏమిటంటే యుద్ధరంగంలో నేలకు తాకిన అతని ప్రతి రక్తపుచుక్క నుండి అంతటి శక్తివంతమైన ఒక రాక్షసుడు పుడతాడు. మహకాళేశ్వరుడు దేవతల ప్రార్ధన మీరకు అతనితో యుధ్ధం చేస్తాడు. మహావినాయకుడు (స్థిరమన్ గణేష్) గణనాథుడై తండ్రికి సకలవిధాలా సహకరించుతాడు.  శివుడు అంధకాసురుని తో భీకరముగా యుద్ధము చేస్తూ ఆతని హృదయమును త్రిశూలముతో ఛేదిస్తాడు. అప్పుడు క్రింద పడిన ప్రతి రక్తపు బొట్టునుండి ఒక్కొక్క అంధకాసురుడు పుట్టుకొస్తాడు.  అప్పుడు జగజ్జనని మహకాళిగా ఆవిర్భవించి  అంధకాసురుని రక్తాన్ని, తన నాలుకను చాపలా భూమిపై పరచి, చుక్క రక్తము కూడా భూమిపై పడనివ్వకుండా త్రాగుతుంది . ఆ తరువాత శివుడు అంధకాసురుని త్రిశూలంతో పైకిఎత్తి తన మూడో కన్నుతో దహించబోగా వినమ్రుడై అంధకుడు ఆయన శరణు వేడుతాడు. భక్తుని మన్నించి అతని ప్రార్థనకు సంతోషించి  అతనిని  భృంగిగా మార్చి ఒక గణమునకు అధ్యక్ష పదవిని ఇస్తాడు.
ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసంలో నవరాత్రి ఉత్సవాలు చేస్తారు.
ఆషాఢ మాసంలోని మొదటి తొమ్మిది రోజులూ అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు.
అత్యంత ప్రతిభావంతమగు ఈ క్షేత్రము యొక్క ప్రభావము మాటలకు అందనిది. దర్శించి తన్మయత్వము పొందవలసినది. ఇపుడు కొన్ని ముఖ్యమైన దేవాలయములు, ప్రదేశములు కట్టడములను గూర్చి తెలియజేస్తాను. ఉజ్జయిని అంటే విజయములను సమకూర్చేది అని అర్థము. త్రిపుర అను రాక్షసుని చంపిన తరువాత శివమహారాజు అవన్తికకు ‘ఉజ్జయిని’ అన్న నామకరణము చేసినట్లు ప్రజలు చెప్పుకొంటారు. ఇక్కడ కాళిదాసు భాసుడు మరియు శూద్రకులు ఇక్కడివారే! వారి గృహములు నేటికీ ఇక్కడ వున్నట్లు చెబుతారు.
భర్తృహరి గుహలు:
ఉజ్జయిని క్రీ.శ. 10 వ శతాబ్దం నాటి భర్తృహరి గుహలు కేవలం ఉజ్జయిని పట్టణానికే కాదు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ గుహలు శిప్రా నది ఒడ్డున ఉన్నాయి. వీటిలో అడుగుపెట్టడం ఒక అద్భుతమైన అనుభవముగా చెప్పుకొనవచ్చు. ఈ గుహలలో క్రింద వెళ్లినవారికి ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టమవుతుంది కనుక జాగ్రత్తగా వెళ్ళాలి.
మంగళ్ నాథ్ ఆలయము:
 మంగళ్ నాథ్ , ఉజ్జయిని పట్టణంలో ఉన్న శివుడికి అంకితం చేయబడ్డ ఒక పవిత్ర దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించిన తరువాత పర్యాటకులు చిత్రమైన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయం ఎక్కడైతే ఉందో అక్కడ మొట్టమొదటి రేఖాంశము భూమిపై వెళ్లిందని చెపుతారు. ఈ దేవాలయం నుండి స్పష్టంగా గ్రహాలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.
కాల్ భైరవ ఆలయము:
 ఉజ్జయిని కాల్ భైరవ్ ఆలయం పురాతన హిందూ సంప్రదాయ ఆలయాల్లో ఒకటిగా భావిస్తారు. దీనిని కాల భైరవుడు శివుని ఆవిర్భావము లలో ఒకటి గా విశ్వసిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టు కింద శివలింగమును చూడవచ్చు. ఈ శివలింగము, నంది విగ్రహానికి ఎదురుగా ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో గొప్ప వేడుకను జరుప్పుకుంటారు.
హర్సిద్ధి దేవాలయం:
ఈ దేవాలయమును ఉజ్జయిని పట్టణములో ఒక ప్రత్యేకమైన దేవాలయముగా చెప్పుకోవచ్చును. ఈ దేవాలయంలో  చిత్రించబడ్డ దేవి అన్నపూర్ణ విగ్రహము, దేవి మహాలక్ష్మి మరియు దేవి సరస్వతి విగ్రహాముల మధ్యన ఉన్నది.  శివుడు తన సతి శరీరాన్ని మోసుకెళుతున్నప్పుడు, ఆమె మోచేయి ఈ స్థలంలో పడిపోయిందని చెపుతారు.
గడ్ కాళిక:
 గడ్ కాళిక, ఉజ్జయిని ప్రాంతంలో నెలకొని ఉన్న ప్రసిద్ది చెందిన మందిరము. పురాణ ప్రశస్తి కలిగిన ఈ దేవాలయములోని కాళీమాత   మహాకవి కాళిదాసునకు నాలుక మీద  బీజాక్షరములు వ్రాసినట్లు భక్తులు విశ్వసిస్తారు.
విక్రం కీర్తి మందిర్:
 ఉజ్జయిని విక్రం కీర్తి మందిర్ ని ఉజ్జయిని పట్టణంలో విక్రమార్కుని వైభవము తెలిసేట్లుగా కట్టించినారు. ది సింధియా ప్రాచ్య పరిశోధనాగారము(Oriental Institute), పురావస్తు సంగ్రహాలయం, కళానిలయము (Art Gallery) మరియు కళాప్రదర్శన భవనములు (Auditoria) విక్రమ్ కీర్తి మందిర్ ఖ్యాతిని ద్విగుణీకృతము చేస్తాయి. ఈ ప్రదర్శన శాలలో ఉన్నత శ్రేణి చిత్రాలు, రాగి రేకులు మరియు నర్మదా లోయలో కనుగొన్న శిలాజాలు ఉన్నాయి.
వేదశాల:
 1719వ సంవత్సరంలో జైపూర్ మహారాజు, సవాయ్ రాజ్ జైసింగ్ నిర్మించిన ఉజ్జయిని ప్రసిద్ధ వేధశాల. పురాతన భారతదేశంలో ఖగోళ అధ్యయనాలు కేంద్రాలలో ఉజ్జయిని ఒకటి అనేది వాస్తవం. ఉత్తర భారతదేశంలో క్యాలెండర్ ను పంచాంగ్ అంటారు మరియు దీనిని ఉజ్జయిని లెక్కల ఆధారంగా తాయారు చేసింది. ఈ వేధశాల పట్టణం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్నది మరియు ఈ ప్రయోగశాల నాలుగు స్మారక కట్టడాలను కలిగి ఉన్నది. ఈ ప్రయోగశాల, ఒక ప్లానెటోరియం మరియు ఒక టెలిస్కోప్ హౌసెస్ కలిగి ఉన్నది మరియు దీనిని పర్యాటకులకు హాట్ స్పాట్ గా భావిస్తున్నారు. నాలుగు స్మారక కట్టడాలలో మూడవది దిజ్ఞాష యంత్ర మరియు నక్షత్రాల స్థానం అని అంటారు మరియు గ్రహాలను ఈ స్మారక సహాయంతో గణిస్తారు. ' సూర్యుని ఫలకం' ఈ వేధశాలలో చాలా ప్రసిద్ధి ఎందుకంటే ఈ పరికరమును ఖగోళ మధ్యరేఖ నుండి ఖగోళ శరీరం యొక్క ఏ రకమైన ప్రసరణనైనా కనుగొనటానికి దీనిని ప్రధానంగా ఉపయోగిస్తారు.
చింతమన్ గణేశ్ ఆలయం:
ఉజ్జయిని చింతమన్ గణేష్ ఆలయం:
 ఉజ్జయిని నగరంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజూ వందల కొద్ది భక్తులు గణేశుడి ఆశీర్వచనాల కోసం ఈ ఆలయానికి వస్తూవుంటారు. చింతమన్ అంటే 'ఒత్తిడి నుండి ఉపశమనము' అని అర్థము. ఈ ఆలయంలో ఉన్న గణేశవిగ్రహము స్వయంభువమని తెలిఅవస్తూవున్నది..
సిద్ధ వట్:
సిద్ధవట్, శిప్రా నది ఒడ్డున ఉజ్జయినిలో ఉన్నది.
నాడు ఇది ఎందఱో సిద్ధులకు సమ్మశ్రయమై ఉంది ఉంటుంది. ఇదే పేరుతో కడప జిల్లాలో కూడా సిద్ధులకు ఒకానొక కాలములో నెలవైన ప్రాంతము ఉన్నది. ఉజ్జయిని లోని ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు ఇక్కడ శిప్రా నదిని తాబేలులాగా సిద్ధవట్ వద్ద చూడవచ్చు. సిద్ధవట్ ఘాట్ పోస్ట్ అంత్యక్రియ కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఈ స్థలాన్ని పురాణాలలో ప్రేత-శిలల-తీర్థ అని చెప్పబడింది. ఇక్కడి స్థానికులు ఈ స్థలంలోనే పార్వతి ప్రాయశ్చిత్తమును ఒనరించుకున్నదని నమ్ముతారు.
ఇంకా కొన్ని ప్రదేశాలను గూర్చి నేను తెలియజేయలేదు. ఉత్సాహవంతులు అచటికి వెడలిన పిదప తెలుసుకొనగలరు.
ఉజ్జయినికి అనుబంధముగా కొన్ని ఛాయా చిత్రములను వ్యాసముతో సంబంధము లేకుండా విడిగా ఒక అనుబంధముగా మీముందు ఉంచుచున్నాను.

ఇక  నాలుగవ జ్యోతిర్లింగమగు ఓంకారేశ్వర్ వైపు అడుగు వేద్దాము. 
శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రము
నాలుగవ జ్యోతిర్లింగము-ఓంకారము
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే ||
ఓంకారము ఈ పుణ్యస్థలము పేరయితే అమరేశ్వరుడు ఇచట వెలసిన జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగముల వరుసలో ఇది నాలుగవది. 'ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ' అన్నది వేద వాక్కు. అటువంటి ఈ ఓంకార స్థానమునందు ద్వాదశ జ్యోతిర్లింగములలో నాలుగవ లింగమగు అమరేశ్వర జ్యోతిర్లింగము ఇచట వెలిసినది. ఈ లింగ దర్శనము సమస్త పాపహారకము.
 ఈ మహిమాన్విత క్షేత్రముయోక్క విశిష్ఠత మనము వాయుపురాణ (శివ పురాణం), స్కంద పురాణ ములలో విస్తృతముగా గోచరిస్తుంది. ఓంకారములో 64 పుణ్యతీర్థములు ఉన్నాయని తెలియవస్తూ వుంది. ఇక్కడ 33 కోట్ల దేవతలూ విరాజమానమయి ఉంటారని  చెబుతారు. ఇక్కడ 108 శివలింగములు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. 84 యోజనముల విస్తీర్ణము (1యోజనము=8 మైళ్ళు) కలిగిన నర్మదా నడియోక్క విరాట్ స్వరూపముగా దీనిని భావించుతారు. ఈ క్షేత్రము మధ్య ప్రదేశ్ లోని ఇందోర్ కు 77 కి.మీ. దూరములో ఉంది. నర్మదానదికి ఉత్తర తటము పైనున్న ఎకైక లింగము ఇది. పరమేశ్వరుడు మూడులోకజ్ములను ప్రతిదినమూ పర్యటించి ఇక్కడ విశ్రమించుతాడని ప్రతీతి. ఇక్కడ పరమేశ్వరుని శయన దర్శనము ఆ సమయమున హారతి ఇచ్చుట ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత.
ఓంకారము ప్రముఖముగా మూడు పురముల క్రింద విభజింప బడినది. అవి 1. బ్రహ్మపురి 2. విష్ణుపురి 3. శివపురి.
చరిత్ర ప్రకారం, ఓంకారేశ్వర్ పాలన భిల్ పాలకుల క్రింద ఉండినది. ఆ తరువాత, ధార్ యొక్క పర్మార్ రాజవంశం దాటి, మాల్వా సుల్తాన్ మరియు గ్వాలియర్ యొక్క సింధియా కుటుంబం 1826 లో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. చివరి భిల్ పాలకుడు, నాథూ భిల్, ఇక్కడి ప్రముఖ పూజారి దరియావ్ గోసేన్‌తో వివాదం కలిగి ఉండినాడు, గోసేన్ జైపూర్ రాజుకు రాసిన లేఖ ద్వారా, నాథూ భిల్‌ను ప్రతిఘటించుటకు సహాయం కోరినాడు. రాజు తన సోదరుడిని మరియు మాల్వాలోని ఝాలర్ పటన్‌కు చెందిన సుబేదార్ భారత్ సింగ్ చౌహాన్‌ను అందుకు గానూ పంపినాడు.
భరత్ సింగ్ నాథూ భిల్ యొక్క ఏకైక కుమార్తెను వివాహం చేసుకోవడంతో ఈ వివాదం చివరికి ముగిసింది. ఇతర రాజ్‌పుత్ర యోధులు కూడా భిల్ అమ్మాయిలను వివాహం చేసుకుని క్రీ.శ 1185 లో మంధటాలో స్థిరపడ్డారు. వారి వారసులను భిలాలా అంటారు. భరత్ సింగ్ వారసులు ఓంకారేశ్వర్ ను చాలా కాలం పాలించినారు.
ఓంకారేశ్వరము,హిందీలో ओंकारेश्वर అంటారు. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్ లో  మార్తక్కా నుండి సుమారు 12 మైళ్లు అనగా  20 కి.మీ.దూరములో ఉంది. ఓంకారేశ్వరము నర్మదా తీరమునందు ఉన్నది. ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి’ అన్నవి మన సంస్కృతిలో గణుతికెక్కినవి. అందుచే ఈ నది భరతభూమి పైగల 7 నదులలో ఒక పవిత్రమైన నది. ఇప్పుడు ప్రపంచంలో రెండుకొండల మధ్య నర్మదా నదికి అతిపెద్ద ఆనకట్ట ఇక్కడ ఉన్నట్లు తెలియవస్తూవుంది. ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘ఓం’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు .ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది .
ఇది నర్మదా నదిలో మాంధాతపురి అని ఒక ద్వీపము ఉన్నది. మాంధాతపురిని శివపురి అంటారు. ఇది ఓంకార రూపములో ఉన్నట్లు చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. అందు ఓంకారేశ్వర లింగము రెండు అమరేశ్వర లింగము ఉన్నవి.
ఆది శంకరులవారు ఈ విధముగా తెలియజేసినారు.
కావేరికా నార్మద్యోః పవిత్ర సమాగమే సజ్జన తారణాయl
సదివ మాంధాత త్రిపురే వసంతం ఓంకారమీశం శివేక మీడేll
(జగద్గురు ఆదిశంకరాచార్య విరచితము)

కావేరీ(కర్ణాటకలోని కొడగు జిల్లాయండుగల బ్రహ్మగిరి పర్వత సమూహములో గల తలకావేరి లో ఉద్భవించే కావేరి కాదు) నర్మదా నదుల పవిత్ర సంగమమందున, సజ్జన భవతారణమునకై, మాంధాత నిర్మితమగు ఈ త్రిపురములలోని శివ ఓంకారేశ్వరుడు స్వయంభువ జ్యోతిర్లింగ స్వరూపుడై  విలసిల్లుచున్నాడు. ఈ నర్మదా నదికి అనుదినము దీప ఆరతి ఎంతో వైభవముగా గావించుతారు.  
మిగిలినది మరొక సారి..........

2
ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్లదూరములో ఓంకారేశ్వరము ఉన్నది. ఇక్కడి శివ లింగము ‘బాణలింగము’. నర్మదానదిలో లభించిన బాణలింగము అత్యుత్తమమైనదని శివపురాణం చెబుతుంది. అన్ని నదులూ  తూర్పు  దిశగా ప్రవహించి సముద్రము లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషము. ఉజ్జైన్ దేవాలయం లో క్రింద శ్రీ మహా కాలేశ్వరుడు ,పైన ఓంకారేశ్వరుడు ఉంటారు.ఇక్కడ ఓంకారేశ్వర్ లో కింద ఓంకారేశ్వరుడు ,పైన మహా కాళేశ్వరుడు ఉండుట విశేషము. గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది .కింద ఓంకారేశ్వరుడు ,మొదటి అంతస్తులో మహా కాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయాలలో శివుడు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. నర్మదానది, నర్మద, కావేరి లేక కావేరిక అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి లేకమాంధాత్రు పురి అని పిలుస్తారని ముందే చెప్పుకొన్నాము. ఓంకారేశ్వర జ్యోతిర్లింగము మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి నదిని పావనము చేస్తుందని భావిస్తారు .
ఇప్పుడు ఆ ప్రాంతానికి మాంధాతృపురి అన్న పేరు ఎట్లు వచ్చిందో చూస్తాము. సూర్య వంశానికి మాంధాత మూల పురుషుడు. ఆయన ఈపర్వతము పైననే  శివుని గూర్చి ఘోరతపస్సు చేసి ప్రసన్నము చేసుకొన్నాడు. లింగాకృతిలో అక్కడే నిలిచిపోవునట్లు స్వామి అనుగ్రహమును పొంది, అక్కడ ఆయనకు ఆలయం నిర్మించినాడు. ప్రణవ రూపములో భాసిల్లుచున్న ఆ శివపురి పై ఓంకారేశ్వర్ దేవాలయము.దేవనాగరి లిపిలో,  ప్రణవములోని అర్ధచంద్ర మాత్రలోని బిందువై సూర్య భగవానుడిలాగా భాసిల్లుతోంది.  దగ్గరలో విష్ణుపురి బ్రహ్మ పురి కొండలున్నాయి. వాటి మధ్య నుండి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం(దక్షిణ కర్నాటకములోని గోకర్ణము కాదు.) లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్యపర్వతం వద్దకు వచ్చి  వింధ్యుని ఆతిధ్యార్చనలు స్వీకరించి సంతుష్టుడైయున్న తరుణములో, గర్వముచేత కప్పబడిన బుద్ధికలవాడగు వింధ్యుడు తాను రత్న మణిమయసంపన్నుడనని గర్వముగా మహర్షితో అన్నాడు. అప్పుడు నారదుడు, నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే. మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించియున్నాయి. అక్కడి మనిమానిక్య రాశులు లెక్కకు మిక్కుటములన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు, మహర్షితో మారు మాటాడక, శివుని గూర్చి ఆరు మాసములు అక్కడే ఘోర తపస్సు చేసినాడు. భోలాశంకరుడు ప్రత్యక్షమయిన వెంటనే, తనలోని మద మాత్సర్యములు నశించుటచే,ప్రశాంత మనస్కుడైన వింధ్యుడు తన మూపుపై శాశ్వతముగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడని ప్రణవాకృతిలోనూ, అమలేశ్వరుడని లేక మమలేశ్వరుడని (అమలేశ్వర శబ్ద రూపాంతరము మామలేశ్వర) పార్థివాకృతిలోనూ రెండు పేర్లతో ఈ జ్యోతిర్లింగ రూపములలో అర్చింపబడుచున్నాడు.
మిగతది వేరొకమారు....... 
3
ఈ ఓంకార క్షేత్రము లోనే ఆది శంకరాచార్యులవారు  ఉపనిషత్తులకు భాష్యం వ్రాయుట జరిగినదని కథనము. ఈయన తమ గురువు గారగు గోవింద భగవత్ పాదులతో కూడి నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించినారు. ఇక్కడి గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనము చేసుకొంటే పునర్జన్మము ఉండదని భక్తుల విశ్వాసము. అందరూ గర్భాలయములోన శివునికి అభిషేకము చేయవచ్చు.
మామలేశ్వర జ్యోత్రిర్లింగము-అమలేశ్వరము వాడుకలో రూపాంతరము చెందినది.
నర్మదా నదీ తీరంలో శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము పేరుతో ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంది. ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకము.  అభిషేకము మనమే చేసుకోవచ్చు. స్వామి వెనుక పార్వతీదేవి విగ్రహము ఉంటుంది. స్కాంద పురాణము   కాశీ ఖండము ప్రకారము, ఒకప్పుడు వరగర్వంతో వింధ్య పర్వతము  మేరువు కన్నా ఎత్తు కావలెనని పెరిగి పోవుటచే సూర్యుడు గానిని దాటలేక పోయినాడట. తత్కారణముగా దక్షిణ భాగము అంధకారబంధురమైపోయినది. అప్పుడు దేవతలు విష్ణువును ప్రార్థించినారు. విష్ణువు పరమశివుని అనుమతితో, వింధ్యుని గర్వమును అణచుటకు అగస్త్యమహర్షికి  మాత్రమే సాధ్యమని తలచి, కాశీనుండి తన బసను దక్షిణాపథమునకు మార్చుకోమ్మన్నాడు మహర్షిని. తత్కారణముగా వింధ్యుని గర్వాపహరణ ఘట్టమునకు నాంది పలికినారు. సరేనన్న మహర్షి కాశీ విశ్వనాదుడిని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు .శిష్యుడు నతమస్తకుడై గురువునకు నమస్కరించగా తాను దక్షిణ దేశానికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి వచ్చే దాకా అలాగే ఉండి పొమ్మని  ఆదేశించినాడు. అప్పటి  నుండి అలాగే వింధ్య పర్వతము ఉండిపోయి ఉత్తర దక్షిణాపథముల రాకపోకలకు అంతరాయము లేకుండా చేయబడినది.
ఈ మహాక్షేత్రమును చేరుటకు వాయుమార్గామయితే ఇందౌర్ లో దిగి బస్సు లేక టాక్సీ లో పోవచ్చు. రైలు మార్గమయితే ఖండ్వా లో దిగి బస్సు లేక టాక్సీ లో పోవచ్చు. మొర్తక్క బస్టాండ్ లో దిగవలసి వస్తుంది. అచట భక్తుల సౌలభ్యమునకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. దేవస్థానము వారి కార్యాలయములో మనకు కావలసిన అన్ని వివరములను తెలుసుకొనవచ్చును.
శీఘ్రమేవ ఓంకారేశ్వర దర్శన ప్రాప్తిరస్తు.
స్వస్తి.

ఇక 5వ జ్యోతిర్లింగమైన పర్లి వైద్యనాథస్వామిని గూర్చి తెలుసుకొందాము.

5-శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగము
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||

ఈ మహాక్షేత్రము అసలు పేరు ప్రజ్వలిక అని తెలియవస్తూవున్నది. అంటే ఈ పేరు 

జ్వాల అంటే జ్యోతిర్లింగ స్థావరమును తెలియజేస్తూ వున్నది. రానురానూ 

నానుడిలోబడి ఈ క్షేత్రము పరళి అయి తదుపరి పర్లి అయినట్లు తెలియవస్తూ వుంది. 

ఈ లింగము రావణ గర్వము సర్వమును ఖర్వము చేసినది. వివరములలోకి 

రానురానూ వెళ్దాము.

ఈ పుణ్యక్షేత్రము హైదరాబాద్ కు 362 కి.మీ. దూరంలో వుంది . ఇది హైదరాబాద్  

మన్మాడ్ రైలు మార్గంలో వస్తుంది. వైద్యనాథస్వామి ఆలయము పర్లి రైల్వే స్టేషన్ కు 2 

కి,మీ. దూరములో వున్నది. వైథ్యనాథుని ఆలయం రోడ్డు కన్న ఎత్తులో వుండుటచే  

దాదాపు 50మెట్లు ఎక్కి దేవాలయమును చేరవలసియుంటుంది.

ఈ క్షేత్రమునకు, కాంతిపురమని, మధ్యరేఖ అని, వైజయంతి అని, జయంతి క్షేత్రం 

అని కూడ పేర్లు వున్నవి. ఇక్కడ శంకరుడు పార్వతీ సమేతుడు. శివపార్వతులు 

జంటగా ఉండటంవలన ఈపర్లి ని అపూర్వకాశి అని కూడ పిలుస్తారు .ఈక్షేత్రానికి 

కాశీకి ఉన్నంత మహత్తు ఉండుటచే ఈ క్షేత్రానికి వస్తే కాశీకి వచ్చి నట్లని 

భావించుతారు భక్తులు .

ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయము ఎతైనప్రదేశముపయి రాతితో నిర్మించిన 

ఆలయము. ఈ మందిరమునకు నలువైపుల బలమయిన ఎతైన గోడలు వున్నాయి. 

మందిరము బయట ఒక పెద్ద దీపపు స్తంభము వున్నది. మహద్వారము వద్ద 

అద్వితీయమైన పురాతన మైన స్తంభాకృతి గల  ఓకే కట్టడము వున్నది. ఈ కట్టడము 

యొక్క మందిరంలో,  చైత్ర  ఆశ్వయుజ మాసాలలో సూర్యొదయ వేళ సూర్యుని 

కిరణాలు శివలింగము పై నేరుగా పడతాయి. ఆలయ పాంగణము సువిశాలమైనది .

ఇక్కడ వుండే తీర్థ కుండము పాపవినాశినిగా తలుస్తారు. ఈ తీర్థమున స్నానము 

పాప విదారకము. చేయలేనివారు తీర్తజలమును శిరస్సుపై ప్రక్షాళన చేసుకొనుట 

వినా మార్గము లేదు. ప్రధాన ఆలయమునకు వామభాగమున ఆదిశంకరాచార్యుల 

వారి మందిరము వున్నది. ద్వజస్తంభమునకు వెనుకవైపున మూడు నందులు గల 

మండపము వున్నది. ఈనందులు చూడముచ్చటగా వుంటాయి. అక్కడనే నాగనాథ 

మందిరము, కాస్త నడచితే  వీరభద్ర మందిరము దర్శనమిస్తుంది. అక్కడ 

సోమనాథుడు, విశ్వనాథుడు కొలువైయున్నారు. వైద్యనాథుని గర్భాలయము 

బయట విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. విఘ్నేశ్వరునికి కుడివైపు భాగంలో 

తులజా భవాని, రేణుకాదేవి దర్శనమిస్తారు. మందిరంలో, గర్భగుడి దానికి ముందు 

విశాలమయిన పడసాల (Hall అనుకోవచ్చు) వున్నాయి. అచటి నుండియే 

భగవద్దర్శనము చేసుకొనవచ్చును. మనము గర్భగుడిలోనికి వెళ్తూవుంటే కుడిచేతి 

వైపున అమ్మవారు వుంటారు . ఇక్కడి అమ్మవారి పేరు జయదుర్గాత్రిపుర సుందరీదేవి. 

ఆష్టాదశ శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. అంటే ఇది కూడా శ్రీశైలము వంటి క్షేత్రము 

అన్నమాట. ఇచట సతీదేవి హృదయము పడినట్లు పురాణవచనము. అమ్మవారి 

దర్శనానంతరము విశాలమగు గర్భాలయములోనికి ప్రవేశించుతారు. ఈ 

ఆలయంలో సుమారు నాలుగడుగులు వున్న పాణివట్టముపై రెండు అడుగుల 

ఎత్తులో జ్యోతిర్లింగం వున్నది .ఈజ్యోతిర్లింగానికి వెనక గోడలో వున్న గూడులో 

పార్వతీదేవి అమ్మవారు వున్నారు. గర్భాలయంలోనికి అడుగు పెట్టిన తక్షణము 

తన్మయతకు గురియౌతాము. ఈశివలింగమును అందరూ స్పృశించవచ్చు . 

శివలింగమునకు తల ఆనించి స్పృశించుట ఒక అనిర్వచనీయమైన అనుభూతి. 

గర్భగుడికి నాలుగు వైపులా వెలిగే దీపాలను నందా దీపాలు అంటారు.

ఇంకా ఆలయ పాంగణంలోనే ద్వాదశ జ్యోతిర్లింగములు దర్శనమిస్తాయి.  ఈ 

ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఆలయ ప్రాంగణంలోనే కుబే రీశ్వరుడు, నారసింహుడు

దత్తా త్రేయుడు దర్శనమిస్తారు.

వైద్యనాథ క్షేత్రంలో జరిగే వైద్యనాథ పూజ ,రుద్రాభిషేక మంత్రోచ్చరణలతో పరళి 

పరిసరాలు ప్రతిధ్వనిస్తాయి. ప్రతి సోమవారం రాత్రి పల్లకి లో స్వామివారి ఊరేగింపు 

కన్నులపండువుగా జరుగుతుంది. ఆరోజు భక్తజన సమ్మర్దము ఎక్కవగా వుంటుంది .

వైద్యనాథక్షేత్రం శివక్షేత్రమే కాదు, అది హరిహర క్షేత్రమని కూడా చెప్పవచ్చును. 

ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహమును కూడా మనము దర్శించవచ్చు. శివుని ఉత్సవాలతో పాటు 

కృష్ణుడి ఉత్సవాలు కూడా ఇచట నిర్వహిస్తారు. శివ విష్ణువుల సంగమ క్షేత్రం 

ఈవైద్యనాథ క్షేత్రం. ఇక్కడ మరియొక విశేషమేమిటంటే శివుడిని తుసీదళములతో

విష్ణువుని బిల్వపత్రములతో పూజిస్తారు. శాస్త్ర వచనము ప్రకారము శివునికి 

తులసీదళ పూజ, విష్ణువుకు బిల్వదళ పూజ నిషిద్ధములు.

సత్యవంతుని భార్య సావిత్రి తన భర్తను శివానుగ్రహముతో బ్రతికించుకున్న 

పుణ్యక్షేత్రముగా దీనిని కొనియాడుతారు.  ఈజ్యోతిర్లింగమును పూజించటచే 

దీర్ఘకాలిక శారీరక మానసిక రుగ్మతలు తొలగి భక్తుల జీవితము 

సుఖమయమవుతుందని అంటారు. ఇది సత్యమని కూడా ఎందఱో నొక్కి 

వక్కాణించుతారు. పర్లివైద్యనాథ్ లో వుండుటకు గుడి ప్రాంగణంలోనే, దేవాలయ 

కమిటీ వారి వసతిగృహము వున్నది.

ఇపుడు ఇచ్చటి స్థలపురాణమును గూర్చి తెలుసుకొందాము.

ఆ వివరములు మరొకమారు.......


2.
త్రేతాయుగంలో రావణాసురుని తల్లి కైకసి ప్రతి రోజూ సముద్రతీరమున ఇసుకతో 

సైకతలింగమును చేసి పూజించు సమయములో  సముద్రపు అలలు ఆలింగాన్ని 

ముంచి కొట్టుకుని పోవునట్లు చేసేవి. అందుకామె విచారపడవలసి వస్తూ 

ఉండేది.ఆమె బాధ పడుతూ వుండటాన్ని చూసిన రావణుడు కారణమడుగగా ఆమె 

యదార్థమును చెప్పింది. దానికి రావణుడు ఆమాత్రపు విషయానికి దిగులుపడ 

వలదని తెలిపి పరమేశ్వరుని మెప్పించి ఆయన ఆత్మలింగమే తెస్తానని తపస్సునకై 

హిమాలయమునకు బయలుదేరుతాడు. ఎంతకాలము గడచినా శివుడు ప్రత్యక్షం 

కాకపోవుటచే, చివరిగా  తన ఒకొక్క తలను ఖండించి శివునికి సమర్పించ  

మెుదలిడుతాడు. చివరగా పదియవ తలను ఖండించబూనగా శివుడు ప్రత్యక్షమై 

అతనిని తిరిగీ దశకంఠుని జేసి వరము కోరుకొమ్మంటాడు. అప్పుడు శివుని 

ఆత్మలింగమును,  యివ్వమని కోరుతాడు రావణాసురుడు. సరేనన్న భోళాశంకరుడు 

ఆత్మలింగాన్ని రావణాసురుడి కిచ్చి “రావణా ఇది గొప్పమహిమ గలది, సర్వాభీష్ట 

ప్రదాయిని, దీనిని నీవు లంకను చేరువరకు భూమిపైనుంచక తీసుకుపొమ్ము” అని 

చెబుతాడు, “మార్గ మధ్యములో యెక్కడను భూమి పై పెట్టరాదు, ఒకవేళ  పెట్టినచో 

అది అక్కడనే ప్రతిష్టించబడుతుంది .జాగ్రత్తసుమా” అని చెప్పి అంతర్ధానమౌతాడు.

రావణుడు ఆ లింగమును చేతులలో పెట్టుకుని లంకకు ప్రయాణమౌతాడు. ఈ 

విషయము తెలిసిన దేవతలు ఎంతో భయపడుతారు. వారు విష్ణుమూర్తి తో

బ్రహ్మతోగణేశుని వద్దకు వెళ్లి దుర్మార్గమగు ప్రవృత్తి కలిగిన రావణుడు యెట్టి 

వరములు లేకుండానే ప్రజలను ,మునులను దేవతలను ఎంతగానో బాధిస్తున్నాడు. 

ఇక ఈ శివుని ఆత్మలింగమును లంకకు తీసుకు వెళ్లితే అతని ఆగడములకు అంతు 

వుండదు కాబట్టి రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకొని వెళ్ళకుండ చూడమని 

వేడుకుంటారు. ఈ పర్లి ప్రాంతము చేరు సమయమునకు సాయంత్రం అగుటచే  

రావణుడు సంధ్యావందనము చేయు తలంపుతో రెండు చేతులలో వున్న 

ఆత్మలింగాన్ని  యెవరి చేతులలో నైనా పెట్టితాను సంధ్యవార్చు కుందామనే 

ఉద్దేశ్యంతో అటు నిటు చూడసాగినాడు. విఘ్నేశ్వరుడు గోపబాలక రూపంలో 

ముందే అక్కడ ఉండుటచే రావణునికి ఆయన కనిపించినాడు. రావణుడు ఆ 

గోపబాలుని చేతిలో శివలింగమును వుంచి తాను సంద్యావందనము చేసి 

వచ్చువరకు దానిని భూమిమీద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకొమ్మని చెబుతాడు. 

అందుకు ఒప్పకున్న బాల వినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని అప్పటికి 

రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని క్రింద పెట్టి తన దారిన తాను పోతానని 

చెబుతాడు . వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని షరతుకు ఒప్పకుని 

నదిలోకి దిగుతాడు. రావణుడు సంధ్యావందనమున నిమగ్నుడైయున్న 

సమయమున వినాయకుడు ఈ లింగము క్షణక్షణము బరువైపోతున్నది దీనిని నేను 

మెూయలేక పోతున్నాను వేగంగా రావయ్యా అంటూ అరవటం మెుదలు పెట్టాడు. 

రావణుడు అతురతగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడు దగ్గరకు వస్తున్న కొలదీ 

బరువును అతి కష్టంమీద మెూస్తునట్లు నటిస్తూ 3సార్లు రావణా  అని పిలిచి 

ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టినాడు వినాయకుడు .

రావణాసురుడు శివలింగాన్ని భూమిమీద చూసి, దానిని తిరిగి తన చేతిలోనికి 

తీసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి మూర్ఛిల్లుతాడు. లింగము పెకలించుటకు 

చేసిన ప్రయత్నము వలన కలిగిన గాయాలను పరమేశ్వరుడు మాన్పించి ఆతనికి 

స్వస్థత చేకూర్చుతాడు. ఇక పెకలించబూనుట వృధాప్రయాసయని గ్రహించిన 

రావణుడు ఖిన్న వదనుడై తిరిగి లంకకు వెళ్ళిపోతాడు.  తర్వాత బ్రహ్మది 

దేవతలందరూ అక్కడికి వచ్చి ఆజ్యోతిర్లింగానికి అభిషేకాది అర్చనలు చేస్తారు. 

రావణుని గాయములు మాన్పి , స్వస్తత చేకూర్చిన కారణంగా ఈ జ్యోతిర్లింగానికి 

వైద్యనాథ జ్యోతిర్లింగమని పేరు వచ్చింది . అసలా లింగము భూమిపైనుంచిన 

ప్రదేశము చితాభూమి. అచట ఉన్న ఆ లింగాన్ని దర్శించడానికి దేవతలు, మునులు, 

ఋషులు అక్కడికి చేరి పరమశివుని పూజించి ఆయన అనుగ్రహమునకు 

పాత్రులవుతారు .


భూలోక వాసులు తమ కర్మఫలం వల్ల అనేక ధీర్ఘవ్యాధులకు గురి అయి 

బాధపడుతున్నారు.మీదర్శన భాగ్యంతో వారి రోగాలు మాయమగునట్లు 

అనుగ్రహించమని వారందరు పరమేశ్వరుని ప్రార్ధింపగా వారి కోరికను మన్నించి 

పరమేశ్వరుడు వైద్యనాధుడిగా అక్కడే స్థిరపడినాడు.


మరొకమారు మరికొంత.....

3.

దేవదానవులఅమృతమధన ప్రయత్నంలో 14 రత్నాలు బయటపడినాయట.వాటిలో 

ధన్వంతరి ,అమృతము, రత్నరాసులు ఉండినాయట.అమృతం పొందాలని దానవులు 

పరుగెత్తి వచ్చినారు కానీ, విష్ణుమూర్తి అమృతాన్ని, ధన్వంతరినీ పరమేశ్వరుని 

లింగమూర్తి లో దాచినాడట. దానవులు లింగాన్ని స్పృశించబోతే అందునుండి 

జ్వాలలు చెలరేగ నారంభించినాయి. దేవతలు లింగాన్ని ముట్టుకున్నప్పుడు 

అమృతము బయటకు వచ్చిందట . ఈ లింగంలో ధన్వంతరీ, అమృతం దాగి 

వుండటంవలన ఈవైధ్యనాథేశ్వరుడిని అమృతేశ్వరుడనీ, ధన్వంతరి అని కూడ 

పిలుస్తారు. లింగమున అగ్ని ప్రజ్వరిల్లుటచే ఆ ప్రాంతమునకు ప్రజ్వల అన్న పేరు 

వచ్చింది. అదే రాను రానూ  పరళీ  ఆపై పర్లి అయ్యింది. ఆ ప్రాంతమున ఉన్న 

కొండలలో, నదుల తీరాలలో అడవులలో ఆయుర్వేద వైద్యానికి ఉపయెూగ పడే 

మూలికలు ఎన్నో లభిస్తాయి. అందువలన కూడ ఈప్రాంతానికి వైద్యనాథ్ అనే పేరు 

వచ్చింది అని చెబుతారు. ఆలయంలోను, బయట ప్రాంతాలలోను దొంగలభయం 

ఎక్కువగా వుంటుందని చాల జాగ్రత్తగా వుండాలని అక్కడి స్థానికులు 

చెబుతూవుంటారు.

కొందరు జార్ఘండ్ లోని ధియోగర్ లోని జ్యోతిర్లింగాన్ని కూడా వైద్యనాథ్ 

జ్వోతిర్లింగంగా భావిస్తారు, కొందరు దక్షిణ  కర్నాటకయందలి గోకర్ణము లోని 

మహాబలేశ్వర లింగమును జ్యోతిర్లింగముగా భావించుతారు గానీ ఇది, జ్యోతిర్లింగ 

క్షేత్రముగా గాక ఆత్మలింగ క్షేత్రముగా మిక్కిలి ప్రసిద్దిగాంచినది. వైద్యనాథ లింగము 

వైదీశ్వరన్ కొయిల్ తమిళ్ నాడులో కూడా ఉన్నది కానీ ఇది జ్యోతిర్లింగముగా 

చెప్పబడలేదు.

ఇక 6వ జ్యోతిర్లింగమయిన భీమశంకరమును గూర్చి తెలుసుకొందాము.


స్వస్తి.

6-భీమశంకర జ్యోతిర్లింగము-1వ భాగము


యం ఢాకినీశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |

సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగము పేరుతో  వెలసియున్నది. భీముడను రాక్షసుని కారణముగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఈ మహేశ్వరలింగము  భీమశంకర జ్యోతిర్లింగముగా ప్రసిద్ధిచెందినది. భీమశంకర క్షేత్రము సహ్యాద్రి పర్వత సానువులలో మహారాష్ట్రములోని పూణేకు 127 కి.మీ. దూరములోనూ,  ముంబాయికి 200 కి.మీ. దూరంలోనూ, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. అందువల్ల ఢాకిన్యాం భీమశంకరం అన్నారు పెద్దలు. ఆ కొండపై భాగమున పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగముగా వెలసినాడు. కృష్ణా నది యొక్క ఉపనది అయిన భీమానది పుట్టినదిఇక్కడే! అది శివలింగమునకు చేరువలో, శివలింగమునాకు  ప్రక్క నుండి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలగు భూత సమూహములతో సేవించబడుతూ ఉంటాడని పురాణవచనం.

యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశనైశ్చ

సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నమామి

భీమశంకరమును గూర్చి తెలుసుకొనుటకు పూర్వము ఆ జ్యోతిర్లింగము వెలసిన సహ్యాద్రి పర్వతశ్రేణి ప్రాశస్త్యము తెలుసుకొందాము. ఈ దిగువ తెలియజేయుచున్న విషయము బ్రహ్మ పురాణము లోని 21వ అధ్యాయము లోని జంబూద్వీపవర్ణనము నుండి గ్రహింపబడినది.

రోమహర్షణ ఉవాచ -

ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణ |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః || 1

నవయోజనసాహస్రో విస్తారశ్చ ద్విజో త్తమాః!|

కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్‌ || 2

సూతుడిట్లనియె-

సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షముగలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి.

మహేంద్రో మలయః సహ్యః శు క్తిమా న్నృక్ష పర్వతః |

వింధ్యశ్చ పారియాత్రశ్ఛ సప్తాత్ర కులపర్వతాః|| 3

అతః సంప్రాప్యతే స్వర్గో ముక్తి మస్మా త్ర్పయాతి వై |

తిర్యక్త్వం నరకం చాపి యాం త్యతః పురుషాః ద్విజాః ll 4

ఇతః స్వర్గంచ మోక్షంచ మధ్యే చాంతే చ గచ్ఛతి |

న ఖల్వన్యత్ర మార్త్యానాం కర్మభూమౌ విదీయతే || 5

ఇందు మహేంద్రము-మలయము-సహ్యము-శుక్తిమంతము-ఋక్షము-వింధ్యము-పారియాత్రము లను సప్తకులపర్వతములున్నవి. భారతపర్షము నుండియే స్వర్గమోక్షముల జీవులు పొందుదురు. పశుపక్ష్యాది జన్మములను నరకమునుగూడ నిటనుండియే పొందుదురు. ఆవాంతరకర్మఫలము స్వర్గము పర్యవసానమందాత్యంతికఫలమైన మోక్షముగూడ ఇటనుండియే మానవుడు పొందును. ఈ భూమండలమందిక్కడనే కర్మానష్ఠానము విధింపబడినది. అందుచేతనే దీనికి కర్మభూమియను పేరు సార్ధకము.

ఇక్కడ మనకు సప్త కుల పర్వతములలో సహ్య పర్వతము కనిపించుచున్నది. ఈ సప్త కులపర్వత దర్శనము మోక్షదాయకము, అంటే ఈ పర్వతమునందుగల ఆలయములు మోక్షప్రదాయకములు. ఈ సహ్యాద్రియందు5 జ్యోతిర్లింగములు వెలసియున్నవి. అవి  భీమశంకరము, త్ర్యంబకేశ్వరము, ఘృష్ణేశ్వరము, నాగేశ్వరము, పర్లి వైద్యనాథము ఈ అయిదు జ్యోతిర్లింగములు సహ్యాద్రికి సంబంధించినవే! అంటే ఈ పర్వత ప్రదేశము ఎంతటి పుణ్యభూయియో మనకు తెలియవస్తూవున్నది.

పైన కనబరచిన బ్రహ్మపురాణ అంతర్గత జంబుద్వీప వర్ణనలో, ఈ భూమికి కర్మ భూమియని మరియు హిమవన్నగమునకు దక్షిణము అంతయు 9వేల యోజనములు కలిగిన ఈ భూభాగము ఇప్పుడు మనచే ‘హిందూ మహా సముద్ర’మని పిలువబడే మహా సముద్రము వరకు వ్యాపించి యున్నదని త్వేలియవస్తూ వున్నది. మరియిండు ఆర్య ద్రేఆవిడ విభేదములేవీ? మనమంతా భారత వాసులము భారతీయులము అన్నదిన్ గుర్తించితే చాలు.

మరియొక విషయము,

భారతస్యాస్య వర్షస్య నవభేదా న్నిశామయ |

ఇంద్రద్వీపః క సేరుశ్చ తామ్రపర్ణో గభస్తిమాన్‌ || 6

నాగద్వీప స్తథా సౌమ్యో గంధర్వ స్త్వథ వారుణః |

అయం తు సవమస్తేషాం ద్వీపః సాగరసంవృతః || 7

యోజనానాం సహస్రం చ ద్వీపో7యం దక్షిణో త్తరాత్‌ |

పూర్వే కిరాతా స్తిష్ఠంతి పశ్చిమే యవనాః స్ధతాః || 8

బ్రహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భాగశః |

ఇజ్యాయుద్ధ వణిజ్యాది వృత్తిమంతో వ్యవస్థతాః || 9

భారతవర్షమున తొమ్మిది ద్వీప విభాగ మయులున్నవి. ఇంద్రద్వీపము, కశేరుపు (కశేతుమంతమని కూడయందురు) తామ్ర పర్ణము, గభస్తిమంతయు, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఈ భారత ఖండ మందు తొమ్మిదవది. సముద్రసంవృతము ఇది దక్షిణదిశనుండి యుత్తరదిక్కుకు వేయియోజనములు.

తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు నుందురు. యజన యాజనములు. యుద్ధము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు. ఇక్కడ చూడండి ఎవరు ఏవృత్తి చేయుచుందురు అని తప్పించి హెచ్చుతగ్గులను ఎచటనూ సూచించలేదు. ఇది కాకుండా మన చుట్టూ ఎవరెవరు ఉన్నారని చెబుతూ అంతర్లీనముగా వారికేవ్వరికీ నాటికే ఈ భరతవర్షమున ఉన్న నాగరికత లేదు అనికూడా తెలుపబడినది. కావున ఈ దేశమున పుట్టినందుకు గర్వించుదాం. ఆ తల్లి కీర్తి బావుటాను హిమాలయము పై పునఃప్రతిష్ఠ చేద్దాం!

ఇప్పుడు నాలుగు మాటలు శివమహిమ్నాస్తోత్రమును గూర్చి చెప్పవలసి యున్నది. ఎందుకంటే దీని రచయిత పుష్పదంతుడను గంధర్వుడు తన పూర్వ జన్మలో భీమశంకరుని భక్తుడు. 'మహిమ్నః’ అన్న పదముతో శ్లోకము మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రమని అంటారు. పాశ్చాత్య చరిత్రకారులు, ఈ స్తోత్రాన్ని గ్రహిలుడు అనే కవి రచించినట్లు చెబుతారు. ఈ కవి క్రీ.శ.9 వ శతాబ్దం కంటే ఖచ్చితంగా ముందరివాడే. ఎందుకంటే, 9-10 శతాబ్దాల నాటికి ఈ స్తోత్రం బాగా ప్రసిద్ధమైపోయింది. ఈ స్తోత్రం చెక్కి ఉన్న క్రీ.శ.1063 నాటి శిలా ఫలకం ఒకటి దొరికింది. కానీ దీనిని తానే రచించినట్లు పుష్పదంతుడు అన్న గంధర్వుడు స్వయముగా స్తోత్రము చివరిలో చెప్పుకొన్నాడు. భీమశంకరుని మదిన ఎంచి కఠోర తపస్సుతో ఈ స్తోత్రము ఆయన వ్రాసినట్లుగా చెబుతారు. ఆయన వృత్తాంతము ఈవిధముగా ఉన్నది.

ఒకానొక కాలంలో కాశీలో గోవిందభట్టు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఒకరోజు ఆయన ఇంటికి అతిథిగా వచ్చిన ఒక సాధువును ఆ బ్రాహ్మణుని కుమారులు గేలి చేసి అవమానించినారట. సాధువుకు కోపం వచ్చి ఇలాంటి ఇంటి అతిథ్యం నాకు వద్దని వెళ్ళిపోయినాడట. ఈ బ్రాహ్మణుడు తన కుమారులను ఇంటి నుంచి బహిష్కరించినాడట.  అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన బ్రాహ్మణ కుమారులలో ఓకడు, తన తప్పుకు పశ్చాతాపపడి భీమశంకరుని యొక్క సహ్యాద్రి పర్వతమున  తపస్సు చేసి, శివుని మెప్పించి, మనణానంతరం కైలాసమునకు అరుగునట్లు వరము పొంది,  శివుని ఆజ్ఞ ప్రకారము గురువులవద్ద  శాస్త్రాధ్యయనం చేస్తుండగా, ఒకరోజున యాదృచ్ఛికముగా ఆ దేశపు రాకుమారి అతడిని ఒక ఉద్యాన వనంలో చూసి మోహిస్తుంది. చేతిలో ఉన్న పుష్పాన్ని తన దంతానికి తాకించి, ఆ సైగ ద్వారా పుష్పదంతమనే చోటగల ఆలయానికి రమ్మని రహస్య సందేశం పంపుతుంది. బ్రహ్మణ కుమారుడు ఆమెను కలసి, ఆమె కోరిక మేర ఆమెను పెళ్ళాడి, ఆ దేశానికి రాజవుతాడు. మరణానంతరం కైలాసం చేరుకుంటాడు.

అక్కడ ఓసారి పార్వతీపరమేశ్వరుల రహస్య సంభాషణలు వినే ప్రయత్నం చేసి, పార్వతీదేవి ఆగ్రహానికి గురై మరలా మానవజన్మను ఎత్తవలసి వస్తుంది. వరరుచి అనే వ్యాకరణవేత్తగా పుట్టి, ఆ తరువాత జన్మలో తిరిగీ పుష్పదంతుడను పేరుతో గంధర్వునిగా జన్మించినాడట. ఏ జన్మను ఎత్తినప్పటికీ శివభక్తిని వదల్లేదు. గంధర్వునిగా అదృశ్యరూపంలో వెళ్ళి, ఒక రాజుగారి తోటలో పూలన్నీ తన శివపూజకు కోసి తెచ్చుకునేవాడట. ఒకనాడు ఆ తోటలో శివపూజ నిర్మాల్యమును తొక్కుటచే, తనశక్తులు  కోల్పోగా. రాజభటులు శిక్షిస్తారని భయముకలిగి, ఆశువుగా  ఈ శివమహిమ్నస్తోత్రం గానం చేసి శివుని మెప్పించి, తిరిగి కైలాసంలో శివపార్వతులను చేరుకొన్నాడట.

మహేశాత్ నాపరో దేవః మహిమ్నః నా పరో స్తుతిఃl

అఘోరాత్ నా పరో మంత్రః తత్త్వం గురో పరమ్ll

మహేశ్వరుని మించిన దేవుడు లేడు. మహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి లేదు. అఘోర మంత్రాన్నిమించిన మంత్రము లేదు. గురువును మించిన పరతత్త్వం లేదు అనే శ్లోకం ద్వారా మనకు ఈ స్తోత్రము యొక్క ఔచిత్యము తెలియవస్తూవుంది.

మిగిలినది మరొకమారు....... 

6-భీమశంకర జ్యోతిర్లింగము-2వ భాగము

నిరీశ్వరవాదులు తర్కానికి అతీతుడివైన నీ మహిమలు తెలుసుకోలేక కుతర్కంలో

ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ లోకంలో ఎంతో వైచిత్రీ,

భిన్నత్వం కనిపిస్తాయి. అధిష్ఠాతవు నువ్వు లేకపోతే, ఈ భువనాలన్నింటినీ ఎవరు 

నిర్మిస్తారు? ఏ పరికరంతో నిర్మిస్తారు? మందబుద్ధులకు మాత్రమే ఈశ్వరుడున్నాడా

లేడా? అన్న అనుమానాలు కలుగుతాయి అంటుంది ఈ స్తోత్రం. సరళంగా

సుందరంగా రచించబడిన ఈ స్తోత్రంలో దీర్ఘమైన సమాసాలు, కష్టమైన 

పదాలేమాత్రము  కనిపించవు. ఇందులో శివమహిమలు, తత్త్వమూ అనేక విధాలుగా 

వర్ణించబడింది. ప్రతీశ్లోకంలో శబ్దగాంభీర్యం, అర్థగౌరవం చెట్టాపట్టాలుగా 

నడుస్తుంటాయి. మహాచార్యులు శ్రీ మధుసూదన సరస్వతి శివ మహిమ్న స్తోత్రానికి 

వ్యాఖ్యానము రచించినారు.

ఈ శివమహిమ్న స్తోత్రం శివభక్తులందరూ తప్పక చదవ వలసిన స్తోత్రం.

'మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ

స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |

అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్

మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః 1

మీ గొప్పతనం' గురించి తెలియకపోయినప్పుడు నిన్ను స్తుతించడం అనాలోచితం 

అయితే, బ్రహ్మ మరియు ఇతరుల ప్రశంసలు కూడా సరిపోవు. వారి మేధో శక్తుల 

ప్రకారం వారు మిమ్మల్ని స్తుతించేటప్పుడు వారెవరూ  నిందార్హులుకాకపోతే, నిన్ను 

స్తుతించుటకు నేను చేసిన ప్రయత్నమూ కూడా నిందార్హము కాదు.

ఇక తిరిగీ అసలు విషయానికొద్దాము.

స్థల పురాణము

పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఒక పర్వత శిఖరం 

మీద నివసిస్తూ ఉండేవాడు. ఆ పర్వతము సహ్యాద్రిలోని భాగమా లేక 

కామారూపదేశము లోనిదా అన్నది ఒక వివాదాంశము. ఆ అసురుడు ఒకనాడు 

తల్లిని “అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా 

ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో 

“నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ 

తండ్రి. పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు 

సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. 

అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు 

అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయినారు. తపస్సంపన్నుడైన 

వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేసినాడు. నేను దిక్కులేని దానినై బిక్కు 

బిక్కుమంటూ కాలమును గడుపుచుండినాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన 

కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి 

మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని 

చెప్పింది.

తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయినాడు. తన వంశాన్ని నాశనం 

చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం 

కట్టుకున్నాడు. దేవతలను మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టినాడు. బ్రహ్మదేవుని 

గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసినాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ 

రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించినాడు. 

వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి 

దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన 

భక్తులను మహార్షులను బాధించినాడు. ఇక్కడ కామరూపదేశము ప్రస్తాపన వస్తుంది.

ఆ కాలంలో కామరూప దేశాన్ని(అస్సాం) సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. 

ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై 

దండెత్తి అతనిని కారాగారంలో బంధించినాడు. శివభక్తుడైన సుదక్షిణుడు 

కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి 

మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ 

బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు 

మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో 

నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని 

తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు 

తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే 

ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా 

జగదీశ్వరుని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” 

అన్నాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని 

ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా 

కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ 

కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయినాడు. అంతలో శివలింగం నుండి శివుడు 

ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని 

పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించినాడు.

పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది. 

భీమాసురుడు తన తప్పు తెలుసుకొని తనపెరుతో జ్యోతిర్లింగమై నిలువమని 

చెప్పినాడని, దేవతలు స్వామి ముందు నిలిచి, భీషణమగు పోరాటముచేసి  అలసిన 

పరమేశ్వరుని, తన ఉగ్రరూపమును ఉపసంహరించుకొనమని ప్రార్థించుతూ అచట 

జ్యోతిర్లింగముగా వెలయమన్నారని, అచటి స్థలపురాణము.  ఇదే విషయము 

శివపురాణమున విశదముగా చెప్పబడినది.

ఇత్యేవం ప్రార్థితశ్శంభుర్లోకానాం హితకారకః |

తత్రై వాస్థితవాన్‌ ప్రీత్యా స్వతంత్రో భక్తవత్సలః || 54

ఇతి శ్రీ శివమహాపురాణ, కోటిరుద్రసంహితాయాం భీమేశ్వర జ్యోతిర్లింగమాహాత్మ్య 

వర్ణనం నామ ఏకవింశో2 ధ్యాయః

లోకములకు హితమును చేయువాడు, స్వతంత్రుడు, భక్తవత్సలుడు అగు శంభుడు 

ఈ విధముగా ప్రార్థించబడినవాడై ప్రీతితో అక్కడనే స్థిరముగానుండెను.  

శివపురాణములో కోటిరుద్రసంహితయందు భీమేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యమును 

వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది.

ఈ మాటచే కామరూపదేశమున వెలసిన జ్యోతిర్లింగము భీమేశ్వరలింగముగా 

గుర్తింపబడినది. అయినా జ్యోతిర్లింగ స్తోత్రములో ఈ క్షేత్రము యొక్క ప్రస్తాపన 

లేకపోవుట మరియు డాకినీ భీమశంకరము ఉండుటచే అదే స్థిరమయిపోయినది.

      భీముని తదనంతరము, త్రిపురాసురులతో భీషణమగు సంగ్రామమును గావించ 

వలసి వచ్చుటచే, వారిని నిర్జించి అలసిన మహాదేవుని స్వేదము నదీ రూపమున 

ప్రవహించుటచే ఈ నదికి భీమా నదిగా గుర్తింపు వచ్చింది అని ఒక స్థలపురాణగాథ. 

స్వాయంభువుడైన భీమేశ్వరునికి సహ్యాద్రి రథమట.  అందుచే దీనిని రథాచలమని 

కూడా అంటారు. 

వేరొక కథ ఈ విధముగా వున్నది.

అది మరొకమారు........


 6-భీమశంకర జ్యోతిర్లింగము-3వ భాగము

సహ్యాద్రి పర్వత శ్రేణిలోని అడవులలో  భాతీరావు లకాధర (చెట్లు

నరికేవాడు)అనునాతడు నివసించేవాడు. ఒకసారి అతను తన గొడ్డలితో ఒక

చెట్టును కొట్టినంతనే, భూమి నుండి రక్తం ప్రవహించడం ప్రారంభమైంది.

భాతిరావు భయపడి పారిపోయినాడు. విషయము తెలిసి ఆ ఆశ్చర్యమును

చూచుటకు అక్కడ ఒక గుంపు గుమిగూడింది. ఎవరో ఒక పాడి ఆవును తెచ్చి

అక్కడ నిలిపినారు. ఆవు పొదుగు నుండి వచ్చిన పాలు భూమి పై

ప్రవహించుటతో రక్తస్రావము ఆగిపోయింది. అందరినీ

ఆశ్చర్యపరుస్తూ,  మెరుస్తున్న శంకరుని జ్యోతిర్లింగ భూమి నుండి

ఉద్భవించింది. ప్రజలు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి, ఆలయంలో

జ్యోతిర్లింగమును ఏర్పాటు చేశారు. ఈ ఆలయమే భీమా శంకర ఆలయముగా

పిలువబడినది..

భీమశంకర దేవాలయమును 13 వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీష్వాల

దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రిక ఆధారాలనుసారం

తెలుస్తూ ఉన్నది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే

ఎంతోభక్తి భావం కలగుతుంది. గుడి లోపల చిన్నగా వున్న ఆ శివలింగాన్ని

వెండి కవచముతో అలంకరించుతారు.

 

క్రీ.శ.1437 లో చిమన్జీ అంతజీ నాయక్ అను నతను స్వామి ముందుర

ఉన్నసభా మండపాన్ని నిర్మించినాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక

నూతిని తవ్వించినాడు. ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కుడా

వుంది.ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో

ఆలయాలు పర్వత శిఖరాల పైన వుంటాయి. కాని లోయలో ఉండే అతి కొద్ది

ఆలయాల్లో భీమాశంకర్ లేక భీమశంకర్  ఒకటి. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రముల

వలెనే భీమాశంకర్ గర్భ గుడి కూడా కిందికి ఉంటుంది. సులువైన మెట్ల

మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్లాలి. ఆధునుకీకరణలో భాగంగా ఈ మార్గం

గుండా కర్రతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్థంభముల ఆధారముతో, పైన కూడా

ప్లాస్టిక్ రేకుల కప్పుతో కూడిన సుందరమైన స్వాగత ద్వారం ఎంతో

రమణీయముగా మనలను ఆకర్షిస్తుంది.

యాత్రా మార్గము

ముంబై, పుణె, ఔరంగాబాద్, అహమదాగర్ల నుండి అనే విధములైన వాహన

సౌకర్యములు ఉన్నాయి. ముంబై, పుణె ల నుండి బస్ సౌకర్యములున్నాయి.

124 కి.మీ. దూరములో ఉండే పుణె రైల్వే సౌకర్యముకూడా అందుబాటులో

ఉన్న నగరము. 200 కి.మీ.ల దూరములోని ముంబై, రైల్వేతోబాటు

విమానసౌకర్యము కూడా కలిగియున్నది. భీమాశంకర్ కి దగ్గరి రైలు ప్రదేశం

కజ్రత్. కజ్రత్ కు రైలులో వెళ్లి అక్కడినుండి బస్సులో 40 కి.మీ. ప్రయాణం చేసి

భీమాశంకర్ జ్యోతిర్లింగం వెలసిన ఖండాస్ చేరుకోగలరు.భీమ్‌శంకర్‌ చిన్న

కుగ్రామము. ఇచ్చట కొన్ని సత్రములు కట్టినారు. పర్వ దినములలో వసతి

దొరకుట కష్టము. చిన్న భోజనం హోటల్‌, కాఫీ హోటళ్లు ఉన్నాయి.NH50 డారి

గుండా పూణే నుండి63 కి.మీ. దూరం పయనంచి అక్కడ నుండి 59 km

SH112, SH54 ద్వారా భీమాశంకర్ కు కొనవచ్చు. ఈ 59 కిమీలో ఎటువంటి

సెల్ ఫోన్ పని చేయదు కానీ GPS పనిచేస్తుంది

పర్యాటకము

పూర్తిగా అడవి, కొండలలోని ఈ ప్రాంతములోని ఆలయం ప్రకృతి

సౌందర్యమునకు మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనపడే కామరూప దేశపు

రక్షణ గోడలు, అనేక రకములైన వృక్ష జాతులతో నయనాందకారకముగా

ఉంటుంది. దగ్గర్లో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ

నిలయంలో గల పెద్ద సైజు ఉడుతలు, Trekkingకు గల అనేక అవకాశములతో

ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఐతే అనువైన కాలము

ఆగస్టు, ఫిబ్రవరి నెలలు. వేసవిలో, వర్షాకాలములో అక్కడి వాతావరణము

యాత్రలకు అనుకూలముగా ఉండదు.. ఖంఢాస్ నుండి రెండు నడక మార్గాలు

కలవు. ఈ మార్గాల ద్వారా సుమారు ఆరు గంటలు సమయం పడుతుంది.

శారీరకంగా దృఢంగా లేనివారికీ, వర్షాకాలం, వేసవి కాలంలో నడక మార్గం

అత్యంత క్లిష్టమైనది. ఖంఢాస్ నుండి రవాణా సదుపాయం ఉండదు. కనీసం

5-10 మంది ఉంటేనే నడక మార్గం వైపు వెళ్లాలి.

ఈశ్వరుని దేవాలయములు సమతలములో ఉన్నవి చాలాతక్కువ. అట్లు వున్నా

ఏ మహా పుణ్యతీర్థమునో ఆనుకొని ఆయన ఆలయము వెలసియుంటుంది.

ఎక్కువభాగాములు కొండలే! తనవద్దకు వచ్చేవారు కష్టపడి నడచుటచేత

ఏకాగ్రత స్వామిపై ఏర్పడుతుంది. దానితో భక్త సులభుడగు భోళాశంకరుడు

వారిని అనుగ్రహిస్తాడు.

ఇక తరువాతిదగు 7వ లింగమగు రామేశ్వరలింగమునకు దారి తీస్తాము.

భీమశంకరమును గూర్చి తెలుపుటకు నేను కాస్త ఎక్కువగా శ్రమించినా ఆ

పరమేశ్వరుని దయతో చక్కగా పూర్తి చేయగలిగినానని భావించుతాను.

తప్పులు దొరలియుంటే మనసా క్షమించ ప్రార్థన.

స్వస్తి.

ఇక 7వ జ్యోతిర్లింగమగు రామేశ్వరమునకు పయనిద్దాము.

 

 

Monday, 23 March 2020

ఉగాది (శార్వరి నామ సంవత్సరము)

ఉగాది (శార్వరి నామ సంవత్సరము)
ద్విజ కలరవము వాదిత్ర  ధ్వానము గాగ
                                నికర పిక రవాల నెలవు గాగ
ఘన పుష్ప రజమేమొ గంధంపు పొడి గాగ
                              విరివి సత్ఫలశ్రేణి విందు గాగ
తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ  
                               అరుణ పుష్పోత్కర మగ్ని గాగ
చూత శాఖములేమొ సూపార్థములు గాగ
                               స్రవ పుష్పరస మేమొ సర్పి గాగ     
సద్వన   వధూమణికిని   వసంతునకును
పాణి గ్రహణము జేయింప బయలుదేరె
చిలుక   తత్తడి   రౌతు   రాచిలుక  పైన
కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ
ద్విజ= పక్షులు (రెండు మార్లు జన్మనెత్తునవి)
వాదిత్రములు= వాద్యములు
నికరము = శ్రేష్ఠము
ఘన పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి 
విరవి = మిక్కుటమైన అతిశయించిన
ధూమ మేఘము = దట్టమైన పొగ
అరుణ పుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి
చూత శాఖములు = మామిడి కాయలు ఆకు కూరలు  (ద్వంద్వ సమాసము)
సూపార్థము = పప్పునకు వలసినవి
స్రవ పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధువు
సర్పి = నేయి
చిలుక తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు
పూదేనెన్ దనివార గ్రోలి  విలసామోదమ్ములై తుమ్మెదల్
మాధుర్యంబుగ ఝుంకృతుల్ సల్పుచున్ మత్తెక్కి నర్తించెడిన్
రోధస్యంతము పిక్కటిల్ల వనినారొహించి క్రొమ్మావులన్
తాదాత్మ్యమ్మున శారికల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్ 

ఎల్లలు లేని నానుడిని ఏర్పడ వాడుక భాష పేరుతో
వెల్లువయై జెలంగుటకు వీలును గల్గగనీక హద్దులన్
కొల్లలు గాగ నేర్పరచి కోరిన రీతిని కావ్యసంపదల్
చల్లగ కుళ్ళ జేసియును చక్కగ గాంచిరి పేరు శార్వరీ!

'భారత'మాయె భారముగ భాషను వాడుక భాష జేయగా 
దారము లేని మాలగ విదారక మయ్యెను కావ్య పుష్పముల్
సార సమస్త సంగ్రహము సాంతము గల్గినయట్టి పొత్తముల్
చేరువయయ్యెలే చెదకు చేవను గూర్చగ నేడు శార్వరీ!

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం   న్యాయేన మార్గేణ మహీం మహీశాం
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లొకాస్సమస్తా      స్సుఖినోభవంతు 

ఇది ఉగాది నాడు తప్పక మనన చేసుకొనవలసిన శ్లోకము. న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కాంక్షించిన వారు.
మరి ఈ శ్లోకములో గో బ్రాహ్మణ జాతులు సుఖముగా వుంటే చాలని కదా చెప్పుచున్నాయి మిగత వారిని గూర్చిన ఊసు ఎత్తలేదు కాబట్టి వారందరూ ఏమయినా ఫరవాలేదా! అన్నది అందరికీ వచ్చే అనుమానము.  ఒక శ్లోకము  రెండు చిన్న పంక్తులు కలిగియుంటాయి. వాటి భావమును పదముల మాధ్యమముతో గ్రహించరాదు. అందు గల గూడార్థమును మనము గ్రహించ వలసి యున్నది. ఇందలి గూఢార్థమును ఒకపరి పరిశీలించండి. ప్రజలు కలకాలము చల్లగా పాలింపబడవలెను. న్యాయ మార్గములో రాజులు భూమిని ఏల వలెను . గోవులకు బ్రాహ్మణులకు శుభము సర్వదా సమకూరవలెను. సమస్త లోకములు సుఖముగా ఉండవలెను.
అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగుంటే ఆలోచనెందుకు అంటే గోవులకు బ్రాహ్మణులకు  ఈ శ్లోకములో ప్రత్యేకముగా పెద్ద పీట వేసినారు. పోనీ గోవులు సుఖముగా వుండవలసినదే! వానిని తల్లితో పోల్చినారు కాబట్టి. మరి బ్రాహ్మణులు ఎందుకు. ఎందుకంటే గొ సంతతి బాగుంటే యజ్ఞ యాగాది క్రతువులకు తమ నుండి వలసిన  ప్రతి వస్తువును అవి పుష్కలముగా ఇవ్వగలవు. ఎప్పుడు అవి పుష్కలముగా ఉంటాయో యజ్ఞయాగాదులు నిరాఘాటముగా కొనసాగుతాయి. వానిని నిరాఘాటముగా కొనసాగించేటందుకు బ్రాహ్మణ సంతతి అవసరము. అందువల్ల యజ్ఞయాగాదులు నిరాఘాటముగా వారు జరిపితే సకాల వర్షములు కురుస్తాయి. సకాల వర్షములు కురిస్తే పంటలు బాగా పండుతాయి.  పంటలు బాగా పండితే ప్రజలు సుఖిస్తారు. వారు సుఖిస్తే సకల లోకం సుఖముగా వుంటుంది. అంతా తమతమ నిత్య విధులను కర్మలనుసక్రమముగా నిర్వహించుతూ వుంటే సమస్త లోకములూ చల్లగా వుంటాయి. మరి ఇందులో బ్రాహణ శబ్దముండుటలో అనర్థమేమి వుంది. ఈ శాంతి పాఠము ఇక్కడ ఆగలేదు . ఈ శ్లోకములు వినండి.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
ఇందులో ఏమి చెప్పబడినదో గమనించండి. సకాలమునకు వర్షములు కురవాలి. ఈ భూమి కలకాలమూ ధనధాన్య సంవృద్ధమై వుండాలి. దేశము క్షోభరహితమై వుండాలి. సత్వ గుణసంపన్నులై  బ్రతికినంతకాలము తమ అనుష్ఠానములతో లోక కల్యాణమును అంటే సకల ప్రజల హితమును కాంక్షించే  బ్రాహ్మణులు నిర్భయముగా సంచరింతురు గాక! ఇక అదే శాంతిపాఠము లోని ఈ రెండు శ్లోకములు గూడా చూడండి.
 అపుత్రా: పుత్రిణస్సంతుపుత్రిణస్సంతు పౌత్రిణ: | 
అధనా స్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్ ||
ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. సంతు లేని వారికి సంతానము కలుగు గాక! వారికి తిరిగీ సంతు కలుగు గాక! నిర్భాగ్యులకు సౌభాగ్యము చేకూరు గాక! నూరు సంవత్సరములు సుఖముగా శుభముగా జీవింతురు గాక! ఈ చివరి శ్లోకము చూడండి:
సర్వేపిః సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః
సర్వ్ భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ 
అందరూ సుఖముగా వుందురు గాక! ఎవ్వరికీ రోగ బాధలు లేకుండు గాక! అందరూ కలకాలము మంచిని మాత్రమే చూచెదరు గాక! ఎవరికీ దుఃఖము అన్న అనుభూతి కూడా కలగకూడదు అనేది సనాతనధర్మం యొక్క ఆశయం. అసలు వేదము, సమస్త ప్రజలు సమస్త జీవ జంతువులు ‘శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే’  సుఖముగా వుండవలె నని చెప్పినది. ఇటువంటి విశ్వహిత మతము దుర్భిణి పెట్టి వెదకినా ప్రపంచములో వేరెక్కడా దొరుకదు.

 న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కాంక్షించిన వారు. 
వారు ఏర్పరచిన 'యుగాది' రాను- రాను "ఉగాది" అయిన దంటారు. సృష్ట్యాదిని యుగాది  అన్నారని, అప్పటినుండి కాలమును అణిమ (మైక్రో) మహిమ (మాక్రో) ల వరకు నిర్దుష్ఠము గా విభజించిన మహనీయులు వారు. 

కానీ ఇక్కడ ఒక చిన్న విషయము చెప్పు కొనవలసి వున్నది. ఉత్+గ+ఆది=ఉగాది. ఉత్ అంటె నక్షత్రము. గ అంటె గమనము ఆది అంటె ఆరంభము. భూమి నుండి మనము చూచినప్పుడు నక్షత్రములు భ్రమించుచున్నటులనే కనపడును. దీనినిసంస్కృతములో సాపేక్ష చలనము అనిఅంగ్లములో relative motion అని అంటారు. కావున నక్షత్ర మరియు గ్రహ చలనారంభమే ఉగాది అని తెలియనగును. 
ఉగాది చైత్ర శుధ్ధ పాడ్యమి ఉదయంతో ప్రారంభమౌతుంది. చంద్రుడు ఆ నెలలోని పున్నమికి చిత్రా నక్షత్రమునకు దగ్గరౌతాడు కావున అది చైత్ర మాసమైంది. 

అసలు దీనికి ఇంకొక అన్వర్థము కూడా వున్నది. "ఛత్రస్యభావహ ఇతి చైత్రం" అంటారు. అంటె ఏ కాలమైనా పనికి వచ్చే గొడుగు లాగా మనలను కాపాడుతుందని ఒక అర్థమైతే అన్ని ఋతువులనూ తన గొడుగు కింద అంటే control లో వుంచుకొని ప్రజలకు వలయు విధంగా అందిస్తుందని కూడా అన్వయము. 

మొదటి నెల చైత్ర మైతే  మొదటి సంవత్సరం 'ప్రభవ'.ప్రకర్షేణ ఇతి ప్రభవః అంటారు పెద్దలు. ప్రకర్ష అంటే 'మేలు' అని అర్థం. మన 60 సంవత్సరాల కాలమానం లో  'ప్రభవ' మొదటిదైతే  'అక్షయ' చివరిది. క్షయము లేనిదే అక్షయము. అంటె ఈ మేలు కలకాలం తరిగి పోకుండా కరిగి పోకుండా వుండాలని కోరుతున్నారు మన కాల వ్యవస్థ నిర్ణయించిన ఆ మహానుభావులు. 

ఇది తెలుసా: ఈ 60 సంవత్సరములకూ పేర్లున్నయి. ఇది శార్వరి నామ సంవత్సరము. ఈ సంవత్సరములో  పుట్టి తిరిగి 60 సంవత్సరముల తరువాతి వచ్చే శార్వరిని చూచిన వారు షష్ట్యబ్ద పూర్తి జరుపుకుంటారు. 

కాల విభజన ఆధారంగా ఏర్పడిన పండుగ ఉగాది కనుక కాల ప్రమాణాన్ని పన్నెండు విభాగాలుగా చేసి మనం అనుసరిస్తున్నాం. వీటినే నిమేషం,
 కళ, కాష్ట, ముహూర్తం, జాము, దినం, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరాలుగా ప్రాచీనులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల సముదాయాన్ని యుగంగా పేర్కొన్నారు. యుగాల విభజనను పరిశీలిస్తే నవగ్రహాలు ప్రదక్షిణం చేసే కాలాన్ని పూర్ణ సంఖ్యగా గణించి 432 కోట్ల సంవత్సరాలను ఒక కల్పముగా పేర్కొన్నారు. ఈ కల్పములో1000వ వంతును ఒక మహా యుగ మన్నారు. మహాయుగాన్ని తిరిగి నాలుగు యుగాలుగా విభజించారు.
17, 28,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కృతయుగము గాను
12, 96,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని త్రేతాయుగం గానూ
8, 64,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని ద్వాపర యుగము గాను, 4,32,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కలియుగము గానూ పేర్కొన్నారు. అలాగే 7o మహాయుగాలను ఒక మన్వంతరంగా, 14 మన్వంతరాలను ఒక కల్పకంగా పేర్కొన్నారు. ఇలా విభజించిన కాల ప్రమాణంలో ఒక కల్పము కాలం బ్రహ్మకు ఒక పగలు గానూ, మరో కల్పము  రాత్రి కాలము  గాను ఉంటాయని పురాణ ప్రశస్తి. ఇలా పరిశీలిస్తే త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కృతయుగం కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కలియుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి అన్నది విజ్ఞుల వాక్కు . కృతయుగంలో నాలుగు పాదాలలోనూ, త్రేతాయుగంలో మూడు పాదాలలోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలలోనూ, కలియుగంలో ఒక పాదంలోనూ ధర్మం నడుస్తుంది.
కృష్ణ యజుర్వేద తైత్తరీయ బ్రాహ్మణము పదవ ప్రకరణము పాఠములోని నాల్గవ అనువాకము
''యుగంభవేత్‌ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం'' అని చెబుతున్నది. దీని ప్రకారం ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా పేర్కొంటే 12యుగాలు అవుతున్నాయి.  అసలు సూర్యుడు చంద్రుడు మకర రాశి లో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి కలుస్తారు.  కలయికను యుగము అంటారు.  అందువల్ల ఈ ప్రకారముగా 60 సంవత్సరముల కాలములో 12 యుగములు వచ్చును. వేదాంగమైన జ్యోతిష్య భాష్యములో యుగంలోని సంవత్సరాలను విశదీకరిస్తూ విద్యారణ్యుడు
''సంవత్సరోసి, పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి'' అని భాష్యం చెప్పినాడు.
అంటే ప్రతి యుగంలోని ఐదు సంత్సరములను వరుసగా వత్సరము, పరివత్సరము, ఇద వత్సరము, అను వత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో పిలుస్తారు. ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే తదుపరి యుగానికి సంబంధించి మొదటి సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా సూర్యుని చుట్టూ బృహస్పతి భ్రమణ కాలము 12 సంవత్సరములు అది ఒక యుగము అవుతుంది. అప్పుడు ఈ వర్ష సముచ్చయమునకు 5 యుగాలు ఏర్పడుతాయి.
దానినే పుష్కరము అంటారు. సూర్య చంద్ర బృహస్పతుల కలయిక 865  బృహస్పతి సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది. అట్టివి 5 గడిస్తే ఒక  కల్పము అంటారు.



మనం శ్వేతవరాహకల్పము లోని ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రథమ పాదములోని 5118వ సంవత్సరములు గడిచినవి. ఇక దుర్ముఖి నామమును గూర్చి మీరు పంచాంగము నుండి తెలుసుకొనగలరు కావున ఆ విషయమును మీకే వదలి పెట్టినాను.

ఉగాది పండుగ నాడు మనం సాంప్రదాయ సిద్ధమైన కొన్ని ఆచారాలను పాటించడం కూడా పరిపాటిగా వస్తున్నది. అందులో ఒకటి వేప పువ్వు పచ్చడి సేవించడము. వేప పువ్వు పచ్చడి సేవించడాన్ని 'నింబ కుసుమ భక్షణం'' అనే పేరుతో ''ధర్మసింధు'' వర్ణించింది.
''అబ్దాదౌ నింబ కుసుమం! శర్కరామ్ల ఘృతైద్యుతమ్‌
''భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్య దాయకమ్‌''
అంటే సంవత్సరారంభమున మొదటి ఝాము నందు వేప పువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి తదితరాలను తీసుకుంటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉండును అని అర్థం. ఈ పచ్చడి తినడం వలన త్రి దోషములు (వాత, పిత్త, కఫములు) నశించి శరీర తత్త్వములో మార్పు వస్తుంది.
శాస్త్రీయంగా చూస్తే హేమంత రుతువులో శరీరంలో ఏర్పడిన కఫము వసంతంలో సూర్యుని వేడికి కరిగి శరీర మంతటా వ్యాపించి రోగాలు కలిగించును. ఈ రకంగా ఏర్పడిన రోగాలలో మశూచి ఒకటి. ఇది ఎక్కువగా వసంత రుతువులో వచ్చు వ్యాధి కాబట్టి దీనికి 'వసంత సంభవా' అనే పేరు కూడా వున్నది. శరీరానికి మేలు చేకూర్చి మశూచి రాకుండా చేసే శక్తి వేపపువ్వుకు ఉండుట వలన ఈ ఋతువునందు వేప పువ్వు తినుట ఆచారమైంది. వాస్తవానికి వసంత రుతువు పూర్తయ్యే వరకూ వేప పువ్వు తినాల్సి వుంది. కనీసం శ్రీరామనవమి వరకు తినాలి. కాలక్రమమున ఈ ఆచారం అడుగంటి ఉగాది ఒక్కరోజునే అది సూర్యోదయం తరువాతనే వేపపువ్వు పచ్చడి తీసుకుంటున్నారు. సూర్యోదయానికి ముందుగానే తలస్నాన మాచరించి వేపపువ్వు పచ్చడి తినడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

పాపపు పనులకుభూత ప్రేత పిశాచములకు  ఆలవాలమౌ అర్ఢరాత్రి సంబరాలు మానివేసి ,రాలిపోయే కాలములో క్రొత్త సంవత్సర వేడుకలు చేసుకొనే హీన సాంప్రదాయానికి ఆనకట్ట కట్టి వసంతముతో మొదలయ్యే ఉగాదిని జరుపుకుందాము. 
స్వస్తి.

Wednesday, 18 March 2020

డాక్టర్ సతీష్ పట్కి కొల్హాపూర్


డాక్టర్ సతీష్ పట్కి  కొల్హాపూర్
పద్మవ్యూహము, సుభద్ర కడుపులో అభిమన్యుడు ఉన్నపుడు, అర్జునుడు, గర్భవతియై పడుకొని ఉన్న సుభద్రతో పద్మవ్యూహ ప్రవేశ నిర్గమనముల గూర్చి ముచ్చటించుచుండినాడన్న విషయము మనకు తెలిసినదే! ఆమె నిదురపోవుటచే, అర్జునుడు నిర్గమనమును గూర్చి తెలుపుట నిలిపివేసినాడు. ఇది కూడా మనకు తెలిసినదే! అదే విధముగా గర్భవతి యగు హిరణ్యకశిపుని భార్య  లీలావతి నారదుని ఆశ్రయములో ఉన్నపుడు, గర్భస్త శిశువగు ప్రహ్లాదుడు కూడా నారదుడు చెప్పే విష్ణు లీలా విలాసమును విని పరమ విష్ణు భక్తుడైపోతాడు.
కానీ గర్భస్త శిశువు వినుట ఏమిటి అది గుర్తుంచుకొని యువకునిగా ఉన్నపుడు పద్మవ్యూహమున ప్రవేశించుట ఏమిటి అని నేటికీ ఎందరో అల్పజ్ఞాన సంపన్నులు, అపూర్వ (పూర్వము అంటే తూర్పు అని ఒక అర్థము, అపూర్వము అంటే పూర్వమునకు వ్యతిరేకము అంటే పశ్చిమము, Europians) విజ్ఞాన బాధితులు, నేటికీ ఎగతాళి చేస్తూ వుంటారు.
కానీ భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారిచే సత్కరింపబడిన డాక్టర్ సతీష్ పట్కి గారు తెలిపిన ఈ వాస్తవమును గమనించండి. ఈయన స్త్రీ గర్భధారణా విషయిక నిపుణులు. ఇల్లాలు గర్భమును దాల్చి 16 వారములు దాటినా తరువాత గర్భస్థ శిశువుకు, తల్లి ఆలకించే అంటే శ్రద్ధతో వినే విషయాలు గుర్తుగా ఉండిపోతాయి. ఆవిధముగా అభిమన్యుడు పద్మవ్యూహ భేదనమునకు ఉపక్రమించినాడు.
మన పూర్వులగు ఋషులు, జుట్టు గడ్డాలకు ప్రాదాన్యతనిచ్చి పెంచుకోలేదు. వారి దృష్టిలో శరీరము ఒక ఉపాధి మాత్రమే. వారి యావజ్జీవిత కాలమూ మానవ కళ్యాణమునకు పాటుపడిన మహనీయులు. వారిమాట మనకు వరహాల మూట అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని భారతీయ బహుశాస్త్ర విజ్ఞానమును గూర్చి తెలుసుకొండి. వారు పాశ్చాత్యులవలె, స్వార్తపరత్వముతో, డబ్బుపై యావతో, Patents కొరకు పాటుపడిన వారు కాదు. ఆ మహనీయుల బాటలో నడచి భారత జాతీయ కేతనము ఎవరికీ అందని ఎత్తులో రేపరేపలాడనీయండి.
స్వస్తి.

Sunday, 15 March 2020

జగద్గురు శంకర ప్రణీత గుర్వష్టకం


జగద్గురు శంకర ప్రణీత గుర్వష్టకం
శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||
అందమైన శరీరము , సుందరియగు భార్య , గొప్ప కీర్తి , మేరుపర్వత సమాన ధనము ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో ఏమి ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||
భార్య , ధనము , పుత్రులు , పౌత్రులు , ఇల్లు , బంధువులు మొదలైనవి ఎన్ని ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో
ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||
ఆరు అంగములు గల వేదములు , శాస్త్రములు , కవిత్వ ప్రసూనములగు గద్య-పద్యములను రచించగల శక్తి ముఖమునందున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||
విదేశములలో మాన్యత్వము లభించినది , స్వదేశమున ధన్యత సమకూరినది, నాకన్నా సదాచార సంపన్నుడు వేరొకడు లేడు ఐ తలపోయువాడయినా గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
క్షమామండలే భూపభూపాలబృందైః
సదా సేవితం యస్య పాదారవిందమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||
భూమండలమునందలి రాజులందరిచే సేవింపబడు పాదపద్మములు కలవాడైననూ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో
ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||
తాను చేయు దానముల ప్రభావము వలన ఈ జగత్తు సర్వమూ కీర్తి వ్యాపించి యుండవచ్చు. గురువు అనుగ్రహము వలన ప్రపంచమందలి సమస్త వస్తువులు చేతికి వచ్చి యుండవచ్చు. కానీ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||
భోగమునందు, యోగమునందు, శ్రేష్ఠమైన ఆశ్వములయందుకాంతాకనకముల యందు అమితమగు ఆసక్తితో సంపాదిన్చియున్ననూ, గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||
 అరణ్య నివాసమునందు కానీ, స్వగృహనివాసమునందు కానీ, అర్ఘ్యాది కార్యములందునూ ఆసక్తి లేనివాడై,  అమూల్యమైన పరమేశ్వర సన్నిధానమును కోరుచున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము లేనియెడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||
సన్యాసి-రాజు-బ్రహ్మచారి-గృహస్థుడు మొదలగు వారిలో ఎవరు ఈ గుర్వష్టకమును పఠించిననూ, గురూపదేశముల మనసును మగ్నము  చేయుచో పరబ్రహ్మమును పొందును.
ఇతి శ్రీ శంకరాచార్య కృత గుర్వష్టకం సంపూర్ణం.
స్వస్తి.

Wednesday, 4 March 2020

అగ్నివృష

పటేశ్వరము-అగ్నివృష.
చత్వారి శృంగా త్రయో అస్య పాద ద్వే శీర్షే అస్ప్తహస్తసో అస్యl
త్రిధా బద్ధోవృషభో రోరతి మహో దేవో మర్త్యాన్ అవివేషll
(ఋగ్వేదము 4.58.3)
పటేశ్వరము మహారాష్ట్రములో ఉన్నది. అందలి
అర్చావిగ్రహమే ‘అగ్నివృష’. నాలుగు కొమ్ములు, మూడు పాదములు, రెండు తలలు, ఏదు చేతులు, మూడువిధములుగా బంధింపబడి యున్న వృషభ రూపుడగు అగ్నివృషుడు, లేక అగ్ని వృషభుడు అనబడు దేవతా మూర్తి మానవకళ్యానమునకై భూమిపై అవతరించినాడు. అగ్నికి 'సప్తజిహ్వుడు' సర్వభక్షకుడు' హుతవాహుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. సందర్భానుసారముగా వేదములలో ఆయన వర్ణనలు జరుగుతాయి అంతే కానీ కలకాలమూ అదే రూపములో ఉంటాడని కాదు. ఏ దేవత అయినాకూడా, వారికీ పైమాటలు అన్వయించుతాయి. వేద వర్ణనలు అక్షర సత్యములు.
కానీ సంస్కృతములోని ఆవర్ణనలనవగాహన చేసుకొని శిలకు విగ్రహరూపమును సంతరింపజేయుటకు ఇటు పరమేశ్వరానుగ్రహమో, అటు పరమేశ్వర అవతరణమో జరిగితేగాని సాధ్యము కాదు. అంతటి మహాత్తరశిల్పము ఇది.
వృషము నాన్నా వృషభము అన్నా నందిరూపమే!
‘యథా యథాహి ధర్మస్య .....’ అన్న గీతావాక్యమును అనుసరించి, గోటితో పోయేదానికి గోద్దలేన్డుకన్నట్లు ఆయా పనులు నెరవేర్చుటకు ఆయా దేవతలను భూమిపై, పరమాత్మ, అవతరింప జేస్తాడు.
స్వస్తి.