Thursday, 15 March 2018

సంవత్సరాది లేక ఉగాది


 సంవత్సరాది లేక ఉగాది
పూర్వము అంటే మేము పిల్లవాళ్ళగా ఉన్న రోజులలో ఉగాదిని సంవత్సరాదిగా కూడా ఉచ్చరించేవారము. ఇప్పుడు ఉగాది అని మాత్రమే అంటున్నారు. పండుగ క్రొత్త సంవత్సరమునకు మొదటి రోజు చేస్తాము కాబట్టి దానిని సంవత్సరాది అని పిలిచేవారు. ఉగాది అన్నపుడు అర్థము ఇంకా లోతునకు పోతుంది. కావున ఉగాది అన్న పదము కడుంగడు సమంజసము అన్నది నా తలపు. ఈ ఉగాదిని గూర్చి కాస్త ఈ పండుగకు ముందు ముచ్చటించు కొందాము. ఉగాది శోభను వన వదూటికి వసంతునికి (మన్మథునికి) పెళ్లి జరిగే శుభాదినముగా ఊహించుకొంటూ నేను వ్రాసిన ఈ పద్యముతో చదువ ప్రారంభించండి. కఠిన పదములకు అర్థములు కూడా తెలియజేసినాను. నా ఉద్దేశ్యము తెలుగు లోతయిన భాష అని తెల్పుట. నా పాండిత్యమును వెలిబుచ్చుట కాదు.
ద్విజ కలరవము వాదిత్ర  ధ్వానము గాగ  
                              నికర పిక రవాల నెలవు గాగ
ఘన పుష్ప రజమేమొ గంధంపు పొడి గాగ
                              విరివి సత్ఫలశ్రేణి విందు గాగ
తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ 
                            అరుణ పుష్పోత్కర మగ్ని గాగ
చూత శాఖములేమొ సూపార్థములు గాగ
                          స్రవ పుష్పరస మేమొ సర్పి గాగ    
తనకు సద్వన వధూటికి దనర జమిలి
పాణిగ్రహణము కై దాను బయలుదేరె 
చిలుక   తత్తడి   రౌతు   రాచిలుక  పైన
కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ
ద్విజ= పక్షులు (రెండు మార్లు జన్మనెత్తునవి)
వాదిత్రములు= వాద్యములు
నికరము = శ్రేష్ఠము
ఘన పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి
విరవి = మిక్కుటమైన , అతిశయించిన
ధూమ మేఘము = దట్టమైన పొగ
అరుణ పుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి
చూత శాఖములు = మామిడి కాయలు ఆకు కూరలు  (ద్వంద్వ సమాసము)
సూపార్థము = పప్పునకు వలసినవి
స్రవ పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధువు
సర్పి = నేయి
జమిలి = జంట
దనర = కలుగగా 
చిలుక తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు (మన్మధుడు)

పూదేనెన్ దనివార గ్రోలి  విలసామోదమ్ములై తుమ్మెదల్
మాధుర్యంబుగ ఝుంకృతుల్ సల్పుచున్ మత్తెక్కి నర్తించెడిన్
రోధస్యంతము పిక్కటిల్ల వనినారొహించి క్రొమ్మావులన్
తాదాత్మ్యమ్మున శారికల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్
కవిత్వమును ఇక్కడ నిల్పి కాస్త ఉగాదిని గూర్చి తెలుసుకొందాము. మొదట ఈ శ్లోకమును గమనించండి.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం   న్యాయేన మార్గేణ మహీం మహీశాం
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లొకాస్సమస్తా      స్సుఖినోభవంతు
ఇది ఉగాది నాడు తప్పక మనన చేసుకొనవలసిన శ్లోకము. న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కాంక్షించిన వారు.
మరి ఈ శ్లోకములో గో బ్రాహ్మణ జాతులు సుఖముగా వుంటే చాలని కదా చెప్పుచున్నాయి మిగత వారిని గూర్చిన ఊసు ఎత్తలేదు కాబట్టి వారందరూ ఏమయినా ఫరవాలేదా! అన్నది అందరికీ వచ్చే అనుమానము.  ఒక శ్లోకము  రెండు చిన్న పంక్తులు కలిగియుంటాయి. వాటి భావమును పదముల మాధ్యమముతో గ్రహించరాదు. అందు గల గూడార్థమును మనము గ్రహించ వలసి యున్నది. ప్రజలు కలకాలము చల్లగా పాలింపబడవలెను. న్యాయ మార్గములో రాజులు భూమిని ఏల వలెను . గోవులకు బ్రాహ్మణులకు శుభము సర్వదా సమకూరవలెను. సమస్త లోకములు సుఖముగా ఉండవలెను.
అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగుంటే ఆలోచనెందుకు అంటే గోవులకు బ్రాహ్మణులకు  ఈ శ్లోకములో ప్రత్యేకముగా పెద్ద పీట వేసినారు. పోనీ గోవులు సుఖముగా వుండవలసినదే! వానిని తల్లితో పోల్చినారు కాబట్టి. మరి బ్రాహ్మణులు ఎందుకు. మిగతా వాళ్ళు ఏమయినా ఫరవాలేదా! అన్న సందేహము నేటి పాఠక శ్రేణిలో తల ఎత్తక మానదు. గోవులు  తమ నుండి, తాము ఇవ్వగలిగిన  ప్రతి వస్తువును  పుష్కలముగా ఇవ్వగలవు. ఎప్పుడు అవి పుష్కలముగా ఉంటాయో యజ్ఞయాగాదులు నిరాఘాటముగా కొనసాగుతాయి. వానిని నిరాఘాటముగా కొనసాగించేటందుకు బ్రాహ్మణ సంతతి అవసరము. అందువల్ల యజ్ఞయాగాదులు నిరంతరాయముగా వారు జరిపితే సకాల వర్షములు కురుస్తాయి. సకాల వర్షములు కురిస్తే పంటలు బాగా పండుతాయి.  పంటలు బాగా పండితే ప్రజలు సుఖిస్తారు. వారు సుఖిస్తే లోకమంతా సుఖముగా వుంటుంది. అంతా తమతమ నిత్య విధులను కర్మలను, సక్రమముగా నిర్వహించుతూ వుంటే సమస్త లోకములూ చల్లగా వుంటాయి. మరి ఇందులో బ్రాహణ శబ్దముండుటలో అనర్థమేమి వుంది. ఈ శాంతి పాఠము ఇక్కడ ఆగలేదు . ఈ శ్లోకములు వినండి.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
ఇందులో ఏమి చెప్పబడినదో గమనించండి. సకాలమునకు వర్షములు కురవాలి. ఈ భూమి కలకాలమూ ధనధాన్య సంవృద్ధ యై వుండాలి. దేశము క్షోభరహితమై వుండాలి. సత్వ గుణసంపన్నులై  బ్రతికినంతకాలము తమ అనుష్ఠానములతో లోక కల్యాణమును అంటే సకల ప్రజల హితమును కాంక్షించే  బ్రాహ్మణులు నిర్భయముగా సంచరింతురు గాక! ఇక అదే శాంతిపాఠము లోని ఈ రెండు శ్లోకములు గూడా చూడండి.
 అపుత్రా: పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణ: |
అధనా స్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్ ||
ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. సంతు లేని వారికి సంతానము కలుగు గాక! వారికి తిరిగీ సంతు కలుగు గాక! నిర్భాగ్యులకు సౌభాగ్యము చేకూరు గాక! నూరు సంవత్సరములు సుఖముగా శుభముగా, సౌభాగ్యముతో  జీవింతురు గాక! ఈ చివరి శ్లోకము చూడండి:
సర్వేపిః సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
అందరూ సుఖముగా వుందురు గాక! ఎవ్వరికీ రోగ బాధలు లేకుండు గాక! అందరూ కలకాలము మంచిని మాత్రమే చూచెదరు గాక! ఎవరికీ దుఃఖము అన్న అనుభూతి కూడా కలగకూడదు అనేది సనాతనధర్మం యొక్క ఆశయం. అసలు సమస్త ప్రజలు సమస్త జీవ జంతువులు ‘శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే’  సుఖముగా వుండవలె నన్నారు. అని అన్నారు. ఇది వేదం వాక్యము. ఇటువంటి విశ్వహిత మతము దుర్భిణి పెట్టి వెదకినా ప్రపంచములో వేరెక్కడా దొరుకదు.
న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కలుగజేయవలేననికాంక్షించినారు .
వారు ఏర్పరచిన 'యుగాది' రాను- రాను "ఉగాది" అయిన దంటారు. సృష్ట్యాదిని యుగాది  అన్నారని అప్పటినుండి కాలమును అణిమ (మైక్రో) మహిమ (మాక్రో) ల వరకు నిర్దుష్ఠము గా విభజించిన మహనీయులు వారు.
కానీ ఇక్కడ ఒక చిన్న విషయము చెప్పు కొనవలసి వున్నది. పై మాటను యథాతథముగా గ్రహించినా కూడా ఇచట వేరొక విశ్లేషణ కూడా చెప్పుకోనవలసియుంటుంది. ఉత్+గ+ఆది=ఉగాది. ఉత్ అంటె నక్షత్రము. గ అంటె గమనము ఆది అంటె ఆరంభము. భూమి నుండి మనము చూచినప్పుడు నక్షత్రములు భ్రమించుచున్నటులనే కనపడును. దీనిని తెలుగులో సాపేక్ష చలనమని అంగ్లములో relative motion అని అంటారు. కావున నక్షత్ర మరియు గ్రహ చలనారంభమే ఉగాది అని తెలియనగును.
ఉగాది చైత్ర శుధ్ధ పాడ్యమి ఉదయంతో ప్రారంభమౌతుంది. చంద్రుడు ఆ నెలలోని పున్నమికి చిత్రా నక్షత్రమునకు దగ్గరౌతాడు కావున అది చైత్ర మాసమైంది. మనము ఆంద్ర దేశములో అమావాస్యతో అంతమయ్యే నెలను వాడుకలో ఉంచుకోన్నాము. పున్నమితో అంతమయ్యే నెలను తమ ఆచారముగా కలిగిన వారు కూడా ఉన్నారు. బహుశ ఆ కారణము చేతనే పున్నమికి చంద్రునికి దగ్గరయిన నక్షత్రము పేరుతో ఆయా నెలలు ఏర్పడియుండవచ్చును.
అసలు దీనికి ఇంకొక అన్వర్థము కూడా వున్నది. "చత్రస్యభావహ ఇతి చైత్రం " అంటారు. అంటె ఏ కాలమైనా పనికి వచ్చే గొడుగు లాగా మనలను కాపాడుతుందని ఒక అర్థమైతే అన్ని ఋతువులనూ తన గొడుగు కింద అంటే control లో వుంచుకొని ప్రజలకు వలయు విధంగా అందిస్తుందని కూడా అన్వయము.
మొదటి నెల చైత్ర మైతే  మొదటి సంవత్సరం 'ప్రభవ'. "ప్రకర్షేణ ఇతి ప్రభవః" అంటారు పెద్దలు. ప్రకర్ష అంటే 'మేలు' అని అర్థం. మన 60 సంవత్సరాల కాలమానం లో  'ప్రభవ' మొదటిదైతే  'అక్షయ' చివరిది. అంటె ఈ మేలు కలకాలం తరిగి పోకుండా కరిగి పోకుండా వుండాలని కోరుతున్నారు మన కాల వ్యవస్థ నిర్ణయించిన ఆ మహానుభావులు. అక్షయము అంటే క్షయము కానిది అనియే కదా అర్థము. అంటే కాల చక్రము తిరుగుతూనే ఉంటుంది కావున చివరి సంవత్సరము 'అక్షయమై'  కాల చక్రములోని మొదటి సంవత్సరముముగా ప్రభావ' గా ప్రభావించుతూ వుంది.
ఇది తెలుసా: ఈ 60 సంవత్సరములకూ పేర్లున్నయి. ఇది విళంబి నామ సంవత్సరము. ఈ సంవత్సరములో  పుట్టి తిరిగి 60 సంవత్సరముల తరువాతి వచ్చే దుర్ముఖి చూచిన వాళ్ళు షష్ట్యబ్ద పూర్తి జరుపుకుంటారు.
కాల విభజన ఆధారంగా ఏర్పడిన పండుగ ఉగాది కనుక కాల ప్రమాణాన్ని పన్నెండు విభాగాలుగా చేసి మనం అనుసరిస్తున్నాం. వీటినే నిమేషం, కళ, కాష్ట, ముహూర్తం, జాము, దినం, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరాలుగా ప్రాచీనులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల సముదాయాన్ని యుగంగా పేర్కొన్నారు. యుగాల విభజనను పరిశీలిస్తే నవగ్రహాలు ప్రదక్షిణం చేసే కాలాన్ని పూర్ణ సంఖ్యగా గణించి 432 కోట్ల సంవత్సరాలను ఒక కల్పముగా పేర్కొన్నారు. ఈ కల్పములో1000వ వంతును ఒక మహా యుగ మన్నారు. మహాయుగాన్ని తిరిగి నాలుగు యుగాలుగా విభజించినారు.

17, 28,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కృతయుగము గాను, 12, 96,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని త్రేతాయుగం గానూ, 8, 64,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని ద్వాపర యుగము గాను, 4,32,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కలియుగము గానూ పేర్కొన్నారు. అలాగే 7o మహాయుగాలను ఒక మన్వంతరంగా, 14 మన్వంతరాలను ఒక కల్పకంగా పేర్కొన్నారు. ఇలా విభజించిన కాల ప్రమాణంలో ఒక కల్పము కాలం బ్రహ్మకు ఒక పగలు గానూ, మరో కల్పము  రాత్రి కాలము  గాను ఉంటాయని పురాణ ప్రశస్తి. ఇలా పరిశీలిస్తే త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కృతయుగం కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కలియుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి అన్నది విజ్ఞుల వాక్కు . కృతయుగంలో నాలుగు పాదాలలోనూ, త్రేతాయుగంలో మూడు పాదాలలోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలలోనూ, కృతయుగంలో ఒక పాదంలోనూ ధర్మం నడుస్తుంది.
కృష్ణ యజుర్వేద తైత్తరీయ బ్రాహ్మణము పదవ ప్రకరణము పాఠములోని నాల్గవ అనువాకము
''యుగంభవేత్‌ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం'' అని చెబుతున్నది. దీని ప్రకారం ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా పేర్కొంటే 12యుగాలు అవుతున్నాయి.  అసలు సూర్యుడు చంద్రుడు మకర రాశి లో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి కలుస్తారు.  కలయికను యుగము అంటారు.  అందువల్ల ఈ ప్రకారముగా 60 సంవత్సరముల కాలములో 12 యుగములు వచ్చును. వేదాంగమైన జ్యోతిష్య భాష్యములో యుగంలోని సంవత్సరాలను విశదీకరిస్తూ విద్యారణ్యుడు ''సంవత్సరోసి, పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి'' అని భాష్యం చెప్పినాడు.
అంటే ప్రతి యుగంలోని ఐదు సంత్సరములను వరుసగా సంవత్సరము, పరివత్సరము, ఇద వత్సరము, అను వత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో పిలుస్తారు. ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే తదుపరి యుగానికి సంబంధించి మొదటి సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా సూర్యుని చుట్టూ బృహస్పతి భ్రమణ కాలము 12 సంవత్సరములు అది ఒక యుగము అవుతుంది. అప్పుడు ఈ వర్ష సముచ్చయమునకు 5 యుగాలు ఏర్పడుతాయి. దానినే పుష్కరము అంటారు. సూర్య చంద్ర బృహస్పతుల కలయిక 865  బృహస్పతి సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది. అట్టివి 5 గడిస్తే ఒక  కల్పము అంటారు.
మనం శ్వేతవరాహకల్పము లోని ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రథమ పాదములోని 5118వ సంవత్సరములు గడిచినవి. ఇక దుర్ముఖి నామమును గూర్చి మీరు పంచాంగము నుండి తెలుసుకొనగలరు కావున ఆ విషయమును మీకే వదలి పెట్టినాను.
ఉగాది పండుగ నాడు మనం సాంప్రదాయ సిద్ధమైన కొన్ని ఆచారాలను పాటించడం కూడా పరిపాటిగా వస్తున్నది. అందులో ఒకటి వేప పువ్వు పచ్చడి సేవించడము. వేప పువ్వు పచ్చడి సేవించడాన్ని 'నింబ కుసుమ భక్షణం'' అనే పేరుతో ''ధర్మసింధు'' వర్ణించింది.
''అబ్దాదౌ నింబ కుసుమం! శర్కరామ్ల ఘృతైద్యుతమ్‌
''భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్య దాయకమ్‌''

అంటే సంవత్సరారంభమున మొదటి ఝాము నందు వేప పువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి తదితరాలను తీసుకుంటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉండును అని అర్థం. ఈ పచ్చడి తినడం వలన త్రి దోషములు (వాత, పిత్త, కఫములు) నశించి శరీర తత్త్వములో మార్పు వస్తుంది.
శాస్త్రీయంగా చూస్తే హేమంత రుతువులో శరీరంలో ఏర్పడిన కఫము వసంతంలో సూర్యుని వేడికి కరిగి శరీర మంతటా వ్యాపించి రోగాలు కలిగించును. ఈ రకంగా ఏర్పడిన రోగాలలో మశూచి ఒకటి. ఇది ఎక్కువగా వసంత రుతువులో వచ్చు వ్యాధి కాబట్టి దీనికి 'వసంత సంభవా' అనే పేరు కూడా వున్నది. శరీరానికి మేలు చేకూర్చి మశూచి రాకుండా చేసే శక్తి వేపపువ్వుకు ఉండుట వలన ఈ ఋతువునందు వేప పువ్వు తినుట ఆచారమైంది. వాస్తవానికి వసంత రుతువు పూర్తయ్యే వరకూ వేప పువ్వు తినాల్సి వుంది. కనీసం శ్రీరామనవమి వరకు తినాలి. కాలక్రమమున ఈ ఆచారం అడుగంటి ఉగాది ఒక్కరోజునే అది సూర్యోదయం తరువాతనే వేపపువ్వు పచ్చడి తీసుకుంటున్నారు. సూర్యోదయానికి ముందుగానే తలస్నాన మాచరించి వేపపువ్వు పచ్చడి తినడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
పాపపు పనులకు, భూత ప్రేత పిశాచములకు  ఆలవాలమౌ అర్ఢరాత్రి సంబరాలు మానివేసి ,రాలిపోయే కాలములో క్రొత్త సంవత్సర వేడుకలు చేసుకొనే హీన సాంప్రదాయానికి ఆనకట్ట కట్టి వసంతముతో మొదలయ్యే ఉగాదిని జరుపుకుందాము.
శుభం భూయాత్


Tuesday, 13 March 2018

కాళిదాసు – భోజుడు


భారతదేశ వినీలాకాశములో సంస్కృతము, కవిత్వము  సూర్యచంద్రులు. ఆవెలుగులే మనకు లేకపోతే భారత భూమిపై వేలుతురేలేదు. అందునా భోజకాళీదాస కథలు కవనభవన సోపానములు. చదవండి. మన సంస్కృత సంస్కృతిని తెలుసుకొండి.
కాళిదాసు – భోజుడు
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_13.html
సంస్కృతము బాల్యములో నేర్చుకొనే అవకాశము లేకపోయినవాళ్ళు, ఆ భాష ప్రాశస్త్యమును, భగవత్ సాక్షాత్కారము పొంది మహాకావ్యములను రచించిన కాళిదాసాది మహాకవుల గొప్పదనమును, అలంకార సమలంకృతమై యొప్పారు కావ్య వైచిత్రిని తెలుసుకొనవలెనంటే ఆదిగా ఆ భాషపై మక్కువను ఏర్పరచుకోవలసియుంటుంది. అట్టి జిజ్ఞాసకు ఉపాధే భోజ కాళీదాసు కథలు.ఉడుతా భక్తిగా, నేను పండితుని గాకున్నా, పాఠకులలో  ఒక తపనను కలిగించు నెపముతో అప్పుడప్పుడు భోజ కాళీదాస కథలను అందిస్తూ వస్తూవున్నాను. అందులోని ఒక భాగమే ఈ కథ.
ఒకనాడు భోజరాజు కొలువు దీరి యుండగా,ఒక సన్యాసి  వచ్చి ఆయనను ఆశీర్వదించినాడు. రాజు ఆయనతో స్వామీ! కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించినారు. నిత్య ఉపవాసాలతో కృశించి ఏమిసాధించదలచుకొన్నారు. నేను చెప్పబోవు ఈ మాట మీకు తెలియనిదికాదు .
అగ్నిహోత్రం గావాలంబం సన్యాసం పలపైత్రుకంI
దేవేరాచ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్II
కలియుగములో అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసము,సన్యాసము, తద్దినములందు మాంస వినియోగము,,కట్టుకొన్న భార్యకు సంతాన లేమి ( అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము చేసుకోనుటగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు అని విశదముగా తెలిపినారు కదా మరి మీరెందుకు పాటించుచున్నట్లు? అని అడిగినాడు.
 పైపెచ్చు “గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.” అనికూడా అన్నాడు.
అందులకా యువసన్యాసి “రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది ఏముంటుంది? ‘లోకో భిన్న రుచి’ అన్న నానుడి తమకు తెలియనిది కాదు.
ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాలుగు గుణములు పశువులలోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్య గుణము. మనుష్యులో ధర్మమనునది విశేష గుణము. ధర్మాచరణలేని మనుష్యుదు అపుడు పశువుతో సమానము కాదా! ఈ ధర్మమూ అతని వృత్తి ప్రవృత్తులబట్టి మారుతూ వుంటుంది. రాజధర్మము వేరు మరియు యిచ్ఛాపూర్వక సన్యాసమును స్వీకరించిన సన్యాసి ధర్మమూ వేరు.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవలసి యున్నది. విద్యవలననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనగలడు. తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును కూడా పొందగలడు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నరయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ అని కఠోపనిషత్తు 3-9
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగలడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషులని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతయని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి. దానిని సాధించుటయే ధ్యేయముగా నేను ఈ సన్యాసాశ్రమమును స్వీకరించినాను. నన్ను సరియగు రీతిలో అర్థము చేసుకోనగలరని నానమ్మకము. దయతో ఈ మాటను కూడా ఆలకించండి:
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహ-శాంతి:ప్రియా గేహినీ
వృత్తి: వన్యలతాఫలై: నివసనం,వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నివ్వృతి:
తేషాం యిందు కళావతంస యామినాం మొక్షేపి నో నః స్పృహాII
లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే మా ఇళ్ళు, శాంతికామిని శాంతిగామిని మా ఇల్లాలు, అడవులలో తీగెలతో,పండ్లతో సహవాసమే మా జీవన విధానము. చెట్టు పట్టలే మాకు వస్త్రాలు, సద్వచన ప్రవాహ స్నాతులము అంటే మంచి మాటలు అనుగంగా తరంగముల నోలలాడువారము , ఇటువంటి నిరంతర సుఖసౌఖ్యములు గల్గిన  మాకు నిజానికయితే స్వర్గము పై కూడా  కాంక్ష ఉండదు. బ్రహ్మైక్యమే మా ధ్యేయము అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము కావలసి వస్తే   
చెప్పండి అని విధేయతతో అడిగినాడు. అప్పుడు అతడు “రాజా! ఇంతగా సాదు సాంగత్యము పై అభిలాష చూపే మీ తీయనైన మాటలు తలదాల్చి ఒక్క కోరిక కోరుతాను.నేను సాటి సన్యాసగణముతో  కాశీయాత్రకువెళుతున్నాను. దయచేసి మీ సభలోని పండితులను భార్యా సమేతంగా మాతో పాటు యాత్రకు పంపించండి. త్రోవ పొడుగునా శ్రమ తెలియకుండా పండిత గోష్టులు జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.” అన్నాడు ఆ సన్యాసి. రాజు అందుకు వల్లే యనగా  రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క కాళిదాసు తప్ప. మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగినాడు. కాళిదాసు ఈ విధముగా బదులిచ్చినాడు.
 తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో దూర వర్తినఃI
యస్య గౌరీశ్వర: చిత్తే / తీర్థం,భోజ పరం హి సఃII
భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారుఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజునకు మనసులో ఒకప్రక్క ఎదో కినుక ఉన్నది. కానీ తెలియబరచలేదు బాహాటంగా!
కొద్దిరోజుల తర్వాత భోజరాజు బయటి దేశముల నుండి వచ్చిన పండిత సదస్సును ఏర్పాటుచేసి వారికి భూరి సంపదలను దానము చేసినాడు. కాళిదాసును మీ నుండి కూడా కవనమును వినగోరుచున్నామన, కాళిదాసు ఈ విధముగా పలికినాడు.

మేరౌ, మందర కందరాసు, హిమవత్సానౌ.మహేంద్రాచలేI
కైలాసస్య శిలా తలేషు, లయ ప్ర్రాగ్భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గణైః: వుద్గీయ మానం యశఃII
చారణులనే దివ్య గాయకుల బృందాల చేత, నీ కీర్తి గురించి  మేరు మంధర పర్వతపు గుహలలో,హిమాలయ మలయ పర్వత శిఖరాగ్రముల మీదా, సహ్యాద్రి మీదనేగాక  అనేకానేక ప్రదేశములయందు, కొనియాడబడుతున్న నీ కీర్తి వినబడినది.

అప్పుడు భోజుడు సంతోషముతో పులకరించిన శరీరము కలిగినవాడై, కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని నేను వినగలిగే వాడిని కాదు కదా! అని తలచుతూ, నిర్మొహమాటముగా మనసులోకలిగిన తన తప్పిదమును కాళిదాసు కు మనవి చేసుకొన్నాడు. ఎంతటి సౌశీల్యమో చూడండి. కవనములో ఎంతటి సౌందర్యమో చూడండి. భాష భావానికి ఎంతగా ఒదిగిపోతూవుందో  చూడండి. సంస్కృతముతో జీవితమునే సంస్కృతము చేసుకొందాము.
స్వస్తి.

జీవిత పరమార్ధము

జీవిత పరమార్థము
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post.html
జీవిత పరమార్థమును గూర్చి తెల్పే శ్లోక రత్నములను, కొన్ని మా అమ్మమ్మ గారి వల్లను మిగతా అన్నీ మా పిన్నమ్మ( నాభార్యకు మేనమామ భార్య శ్రీమతి రాజ్యలక్షుమ్మ) గారి ద్వారానూ తెలుసుకొన్నవి తెలియజేసుకొంటున్నాను. వారు దంపతులు ఇరువురూ మద్రాసులో తెలుగుపండితులుగా పనిచేసి విశ్రాంతి పొందినవారు. నేడు భువిపై ముగ్గురూ లేకపోయినా ఈ రచన వారి పేరున సమర్పించుకొంటున్నాను.
జీవిత పరమార్ధము
మన జనని సంస్కృతము. ఆ తల్లి ఆయువు ఎంతకాలము అన్నది మన ఎరుకకు అందనిది. అసలు ఈ భూమిపై మానవ జన్మకు వేదిక భారతదేశమను పేరుతో వెలసిన ఈ పుణ్యభూమి. అప్పటినుండి సంస్కారము అన్నది అటు భాషలోనూ ఇటు జనజీవనములోనూ చోటుచేసుకొని తనను తానూ విస్తృతపరచుకొంటూ వస్తూనే వుంది. అందువల్లనే మన పూర్వులు అసమాన ప్రతిభావంతులైనారు. వారు అనేకానేక శాస్త్రములందు ప్రవీణులగుటయేగాక, మనకొరకు ధార్మిక జీవనమునకు వలయు సద్బోధ అనేకములగు నీతుల మూలముగా అలతి పదములతో సంస్కృతమున మనకు అందించినారు. నా శక్తిమేరకు నేను ఆ సంస్కృత సాహిత్య సముద్రమునుండి ఒక అనర్ఘ రత్నమును వెలికి తీసి మీముందుంచుతున్నాను.  
బంధవిముక్తుడయి  ఏకాకిగా ఏకాగ్రతతో తపమాచరించు ఒక తాపసి ఒకనాడు ఏమరిపాటున తన ఆశ్రమవాసియగు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి మోక్షానికి వెళ్లవలసిన వాడు, ఋణగ్రస్తుడై ఉండిపోవటంతో అతనికే పుత్రునిగా జన్మిస్తాడు.
ఒకానొక సందర్భములో ఆ బాలుని జాతకమును చూసిన వ్యక్తి ఆతని తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుండి మీరు ఎచిన్న వస్తును ఉదారముగా పొందినా అతను మీకు దక్కడు అని చెబుతాడు. నాటినుండీ ఆతని మాతాపితరులు  జాగ్రత్తగా ఆతనినుండి ఏమీ ఆశించకుండా పెంచుతారు. ఆ బాలుడు మాత్రము గతస్మృతి కలిగినవాడై వారి ఋణం తీర్చే ప్రయత్నము చేస్తూనే ఉంటాడు.
బాలుడు యువకుడైన పిదప నాతనిని తండ్రి రాజుగారి కొలువునకు తీసుకుపోయి ఉద్యోగమును తన పుత్రునికొరకు అర్థించుతాడు. రాజు ఆతనికి రాత్రి వేళల  గస్తీ తిరిగే ఉద్యోగమునిస్తాడు. ప్రతి ఝామునకు ఒకసారి ఆ యువకుడు పురజనుల కొరకు పరహితార్థమతుడై జాగ్రత్త సుమా అంటూ జీవితమునకు అత్యంత ముఖ్యమయిన జ్ఞాన బోధ చేస్తూవస్తాడు.
రాచకార్యాలలో మునిగితేలే రాజునకు రాత్రి సమయములందు నిదుర పట్టక ఈ క్రొత్త గస్తీ ఉద్యోగి చెప్పే నీతి వాక్యములను ఆలకించుతాడు. ఇతడు సామాన్యుడు కాడన్న విషయమును  గుర్తించి,  స్వయముగా అతని  ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్ని హితోక్తులను విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ చెబుతూ, పళ్లెములో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందించి నమస్కరిస్తాడు. దానిని అందుకొన్న ఆయువకుడు అసంకల్పితముగానే తన తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహమున  నియమము మరచినది ఆ ధనమును అందుకొంటుంది. వెంటనే అతడు తనువును త్యజించి ముక్తి పొందుతాడు. అంతులేని ఖేదమునకు గురియైన ఆ దంపతులకు రాజు వారి కుమారుని గొప్పదనమును గూర్చి చెబుతూ ఆయన ఏ మహాయోగియో అయివుంటాడని తెలియబరచి ఆయన చెప్పిన నీతి వాక్యములను వారికి ప్రబోధించుతాడు.
కథకు అంతరాయము కలిగించకూడదని ముందు కథజెప్పి తదుపరి ఆ శ్లోకములను భావార్థసహితముగా అందించుచున్నాను.

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః |
  అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృతా||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిథ్యయే. ఈ వాస్తవమును గ్రహించి సావధాన చిత్తుడవై ఉండుము.
2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృతా ||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, సంసారము అన్నియును దుఃఖ హేతువులే! కావున సావధాన చిత్తుడవై ఉండుము.
3. శ్లో|| కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారేణ తస్మాత్ జాగృత జాగృతా II
 :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు అన్నవి మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున సావధాన చిత్తుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృతా II
తా:-జీవజంతు సముదాయమున ఒకరమైన మనము  ఎల్లప్పుడూ మంచి చెడ్డ అన్న తారతమ్యమును అనుసరించక కర్మాసక్తులమై జీవిన్చుచున్నాము. తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తించుటలేనేలేదు. కావున సావధాన చిత్తుడవై ఉండుము.
5. శ్లో|| సంపదః స్వప్నసంకాశాః యౌవనం కుసుమోపమమ్|
      విద్యుత్ చంచలమాయుష్యం తస్మాత్ జాగృత జాగృతా ||
తా:- మన సంపదలన్నియు ఒక కలలవంటివి అంటే అన్నీ తాత్కాలికములే!, యౌవనము ఒక పూవు వలె స్వల్ప కాలము మాత్రమే వికసితమై ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున సావధాన చిత్తుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృతా II

తా:- విత్తము, చిత్తము, జీవితము అన్నియు క్షణభంగురములు. మన పాశములను గమనింపక పాశవికముగా మన ప్రాణములను తన పాశముతో హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రమూ దయ జూపడు. కావున సావధాన చిత్తుడవై ఉండుము.
7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవఃI
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్రః కా పరివేదనII
తా:- మనుషులకు వారివారి  కర్మానుసారము జీవితకాలము ఉంటుంది. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? కర్మలు మూడు విధములు. 1. ప్రారబ్ధము 2. సంచితము 3. ఆగామి . అత్యంత క్లుప్తముగా చెప్పవలసివస్తే పోయిన జన్మలో మిగిలిన కర్మ ఏదయితే ఈ జన్మకు చేరవేయబడినదో (Carry Over) అది ప్రారబ్ధము. ఏదయితే ఈజన్మకీజన్మలోనే అనుభవించుతున్నామో అది సంచితము. ఏ కర్మ ఫలితమును అనుభవించుట కొరకు వేరొక జన్మనెత్తి దానిని అనుభవించుటకు ఈ కర్మల నాచారించుచున్నామో అది ఆగామి కర్మ. ఎంతటి గొప్ప విశ్లేషణయో చూడండి. శ్లోకము అల్పము అర్థమనల్పము.
8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయాఃI
      ఋణక్షయే క్షయం యాంతి తత్రః కా పరివేదనII
తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర మరియు నివాస లాభములు గల్గును. ఆ ఋణము తీరగనే అవియన్నియును సమసిపోవును. దానికై దుఃఖించుట ఎందులకు?
9. శ్లో|| పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||
తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన తరువాత జీవులు  మరణించుట సహజము. దానికై దుఃఖించుట ఎందులకు?
10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||
తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటొక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||
తా – ప్రవహించుచున్న నదిలో మొద్దులు తేలుచూ, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు? ఇదే మాటను వాల్మీకి మహర్షి రామాయణములో ఈ విధముగా చెబుతాడు. నేనెందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆదికవి ఆదికావ్యములోనే ఎంత అనుభవ పూర్వకమైన సంస్కారవంతమయిన వాగ్ధాటిని కనబరచినాడో గమనించమని తెల్పుటకు.
యథా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవేI
సమేత్యపి వ్యపేయేతాం కాలమాసాధ్య కంచనII
మహా సముద్రములో రెండు దుంగలు ఒకదానితో ఒకటి జతకూడి కొట్టుకొని పోవుచూ విడిపోవుచున్నవి. కాలమునకు అసాధ్యమయినది ఏదీలేదు.
ఇటువంటి అద్వితీయ వాజ్ఞ్మయము కల్గిన మన సంస్కృతమును ఎంత త్రుణీకరించినామో  ఎంత నిరాదరించుచున్నామో ఒకసారి సింహావలోకనము చేసుకొంటే తిరిగీ ఆ భాషను పునరుద్ధరించి మనము ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారము కాగలము.
స్వస్తి.

Saturday, 10 February 2018

భార్యా భర్తల అనుబంధం


భార్యా భర్తల అనుబంధం
మూడు ముళ్ళకెపుడు ముసలితనము రాదు
పెరుగుచుండు ప్రేమ తరుగ బోదు

పెనము దోశపిండి ప్రేమతత్వము చూడు
రామమోహనుక్తి రమ్య సూక్తి
భార్య భర్తల అనుబంధము పెనము దోశపిండికి ఉన్న సంబంధము వంటిది. ఎన్ని వందల సంవత్సరములు గడిచినా, పెనము ఎంత వేడెక్కినా పెనమునకు పిండికి వున్న అనుబంధము తీరదు.
వయసు అందుకు ప్రతిబంధకము కాదు.

Sunday, 4 February 2018

మధుర మీనాక్షి -- కలెక్టరు పీటరు

మధుర మీనాక్షి -- కలెక్టరు పీటరు
మథుర (తమిళ్ నాడు) పట్టణానికి1812 మరియు 1828 మధ్య కాలములో రోస్స్ పీటర్ అన్న ఆంగ్లేయుడు కలెక్టరుగా ఉండినాడు. తానూ స్వర్తహాగా క్రైస్తవుడైనా మన సాంప్రదాయమునకు, ఆచారవ్యవహారములకు, దేవతారాధనమునకు ఎంతో ప్రాముఖ్యత నిచ్చుటయేగాక మీనాక్షి అమ్మవారి పై భక్తి విశ్వాసములు గలిగియుండినాడు.
తన బంగాళా నుండి ఆఫీసుకు పోవు మార్గ మధ్యములో మీనాక్షి అమ్మవారి ఆలయము వుండేది. సూటు బూటు వేసుకొని గుర్రముపై ప్రతిరోజూ ఆఫీసుకు పోయే పీటర్ గారు అమ్మవారి గుడికి  కొంచెము ముఇందుగానే దిగి తన బూట్లు మేజోళ్ళు విప్పి అవి గుఱ్ఱము యొక్క జీనునకు తగిలించి పాదచారియై పోయేవాడు. తిరిగీ ఇంటికి వచ్చుసమయములో కూడా అదేవిధముగా ప్రవర్తించేవాడు.
ఒకరోజు రాత్రి కుంభవృష్టి కురుస్తూ వుండినది. మంచి నిద్రలో వున్న పీటరుగారికి కాలి మువ్వల శబ్దము వినవచ్చింది. కాసింతసేపు కలయేమోననుకొని కదల లేదు. కొంతసేపు తరువాత పీటర్ పీటర్ అని పిలిచినట్లయినది. ఆతడు లేచి చూస్తే ఒక అమ్మాయి వీపు కనిపిస్తూవుంది. కాలి గజ్జెలు కనిపించుతున్నాయిగానీ ఆమె చెప్పులు వేసుకొని లేదు. ఆతడు లేచి ఆమెను చూడదలచాగా అక్కడినుండి ఆమె పరుగు తీసింది. ముందు వెనుక యోచించకుండా ఆమె వెంతబదినాడు ఆయన. ఇద్దరూ ఇల్లు దాటినారు. ఫెళఫెళ శబ్దము వెనుక వినిపిస్తే తిరిగి చూసినాడు ఆ కలెక్టరు. తన నివాస గృహము నేలమట్టమయిపోయింది. ముందుకు చూస్తే ఆ అమ్మాయి కానరాలేదు. ఇది అమ్మవారి మహాత్మ్యమేనని పీటరు గారికి అర్థమయిపోయింది.
మీనాక్షికి మనసారా కృతజ్ఞత చెప్పుకొన్నాడు. అచంచల మీనాక్షీ మాతృ సేవానురక్తుడైన అతను తన జ్ఞాపకార్థము అమ్మకు నవరత్నములచే పొదిగిన బంగారు పాదరక్షలను చేయించి వానిపై, అమ్మా పాదదాసునిగా తన పేరు పోదిగించుకొన్నాడు. ఆ రక్షలను పీటర్ పాదుకం (పీటర్ ఇచ్చిన పాదుకలు) అని అంటారు.
నేటికీ ఆ రక్షలను చైత్రమాసపు వేడుకలలో అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అవి అలంకరించుతారు. అమ్మను నమ్మిన అతనికి, మతము అడ్డము రాకపోగా , ఆ భక్తుని ఆ తల్లి కాపాడింది.  ఈ పురాతనమైన దేవాలయాలో విగ్రహ ప్రతిష్ఠ స్థాపత్య ఆగమము ప్రకారము వేదపండితులు చేస్తారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ విగ్రహములో దైవశక్తి పుష్కలముగా వుంటుంది. ఈ విగ్రహములు నేడు వీధివీధికీ వుండే దేవాలయముల వలె కాదు.  అందుకే మన పూర్వులు తీర్థయాత్రాలను ఏర్పరచినది. కావున హృదయకుహరములో మనము నమ్మిన దైవమును తలచుకొంటే చాలు దైవము మనకు అండ దండగా ఉండుట జరుగుతుంది.

స్వస్తి.

Saturday, 3 February 2018

చమత్కార శ్లోకము

చమత్కార శ్లోకము
 లక్ష్మీ దేవికీ, పార్వతీదేవి కీ మధ్య సాగిన ఈ సరస సంభాషణను సాదరముగా చదవండి.
శ్లోll భిక్షార్థీ ప్రయాతః సుతను?బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?
జానే బృందావనాన్తే,క్వ చ స మృగ శిశు:? నైవ జానే వరాహం
బాలే,కశ్చిన్న దృష్ట:? జరట వృష పతి:?గోపా ఏవాస్య వేత్తా
లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కాన్యయో త్రాయతాం వః
లక్ష్మీ దేవి చుట్టపు చూపుగా కైలాసానికి వెళ్ళిందట. పార్వతి ఆమెను సాదరముగా తోడుకోనివచ్చి ఉచితాసీనురాలిని చేసి కుశలప్రశ్నలు అడిగింది. పిచ్చాపాటి మాట్లాడుకోన్నతరువాట సరసము శ్రుతిమించి లక్ష్మీదేవి  ఎగతాళిగా పార్వతీ నీ భర్త భిక్ష మడుక్కునేందుకు ఎక్కడికి వెళ్ళినాడు?పార్వతి గడుసుగా బలిచక్రవర్తి యాగానికి వెళ్ళాడు సుందరీ అన్నది.
ఈ రోజు మీ తైతక్కలు ఎక్కడ ? అన్నది  లక్ష్మి , పార్వతి వెంటనే బృందావన ప్రాంతం లో అనుకుంటాను అన్నది. మీ అందాల మృగ శిశువు (వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు కదా!) ఎక్కడ?అన్నది లక్ష్మి ఎగతాళిగా, అందుకు పార్వతి ఈ వరాహాల (విష్ణువు వరాహావతారం) సంగతి నాకేం తెలుస్తుంది అన్నది.  మీ ముసలి ఎద్దు ఏదీ  కనపడదే? అన్నది లక్ష్మి. ఎద్దులూ,ఆవుల విషయం  ఆవులు కాచే వాడికే తెలియాలి. ఇలా ఎకసక్కాలాడుకునే లక్ష్మీ,పార్వాతులు మిమ్మల్ని కాపాడుదురు గాక.

ఎంత సుందరమైన భాష ఎంత సుందరమైన భావము. ఇంతటి గొప్ప భాషను చేయి జార్చుకొన్నందుకు మనము సిగ్గుపడవలెనేమో!