Monday, 4 November 2019

మహాభారత యుద్ధం నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా


మహాభారత యుద్ధం
నాటి అస్త్రాలు నేటి మిసైల్స్ కాదా!
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_4.html
మహాభారతములో మనలో ఎక్కువమందికి తెలిసినది కౌరవులు పాండవులు యుద్ధము శ్రీకృష్ణుడు ద్రౌపది, భీష్ముడు ద్రోణుడు కుంతి, కర్ణుడు ఇట్లు కొంతమంది మాత్రమే! ఉపాఖ్యానములు కాకుండా ప్రధాన కథను పంచుకొన్న పాత్రలు 70 కనిపించుతున్నాయి నాకు. నా అంచనా తప్పు కూడా ఉండవచ్చు. ఇందులో 98 మంది దుర్యోధన సహోదరులపేర్లు చేర్చలేదు. ఖాండవమునకు సంబంధించిన పాత్రలను చేర్చలేదు. ఇంకాకూడా ఎన్నో మరచి ఉండవచ్చు. అసలు ఇన్ని పాత్రలను కలుపుకొని చిక్కుపడకుండా ఊలుదారమును అందమైన బంతిగా చుట్టినట్లు చుట్టి వ్యాసులవారు మన చేతికి ఇచ్చినారు.
అసలు భారతములో 1,20, 000 శ్లోకాలూ వ్యాసుడే వ్రాసినాడా! ఈ వ్యాసుడు వేదాలను విభజించిన వ్యక్తియేనా! పురాణేతిహాసములు ఈయన వ్రాసినవేనా! ఒక్కడు ఇన్ని రచనలు చేయ సాధ్యమా! అంటూ అనేక దేశ విదేశ చరిత్రకారులు సందేహమును వేలిబుచ్చినారు. Maxmullar  కడుపు కక్కుర్తి కొరకు క్రైస్తవ మత వ్యాప్తికి కంకణము కట్టుకొని తన సంస్కృత మిడిమిడి జ్ఞానముతో వేదములను ఆంగ్లము లోనికి తర్జుమా చేసినాడు. రాను రాను ఈ దేశము యొక్క గొప్పదనము తెలియవచ్చి యుండవచ్చు, అందుచే అతడు ఏమన్నాడంటే:
"Whatever sphere of the human mind you may select for your special study, whether it be language, or religion, or mythology, or philosophy, whether it be law or customs, primitive art or science, you have to go to India. Some of the most valuable and instructive material of the history of man are treasured up in India and India only." -- Max Mueller
 ఈ ప్రశంస చాలు మనము మన పూర్వుల గొప్పదనము గుర్తించుటకు.
మానవుని జీవన కాలము యుగయుగమునకూ మారుతుంది. దశరథుడు 13 వేల సంవత్సరములు, శ్రీరాముడు 11 వేల సంవత్సరములు జీవించినట్లు మనము వాల్మీకి రామాయణము ద్వారా తెలుసుకొంటాము. ప్రాణము అంటే ఉఛ్వాస నిశ్వాస. దానిని నియంత్రించే శక్తినిబట్టి మనిషి యొక్క ఆయుర్ధాయము ఆధారపడి ఉంటుంది. ఋషులు అట్టి మహానుభావులు. మరి వ్యాసుడు విష్ణ్వంశ సంభూతుడు. పైగా మహా ఋషి. అసలు ఆయనను చిరంజీవిగా పురాణములు ఘోషించుచున్నాయి. అసలు ద్వాపరమునకు సంబంధించిన ఆ మహానుభావుడు కలియుగములో శంకరులవారికి ప్రత్యక్షమై 16 సంవత్సరముల అదనపు ఆయుర్దాయమును తన తపఃశక్తి నుండి ధారపోయలేదా! ఇటువంటి అనేకానేక దృష్టాంతరములు చూచిన తరువాత  నాకు మహనీయులకు సాధ్యము కానిది లేదు అనిపిస్తుంది. వ్యాసుని వంటి దైవాంశతో జన్మించినవారు, అఖండ తస్సంపంనులు, ఇట్టిపనులు చేయుటలో ఆశ్చర్యము కానరాదు.
ఈ ఉపోద్ఘాతముతో మనము యుద్ధభూమిని ప్రవేశించుదాము.
మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య
18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత అన్నది ఒకసారి తెలుసుకొందాము.
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంటులు (పదాతి దళం) కలిసితే సైన్యములో దానిని ‘పత్తి' అని అంటారు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.  వాహినికి మూడు రెట్లు ‘పృతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పృతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.
ఇప్పుడు మనము చర్చించ బోయే విషయములో ముఖ్యముగా గుర్తుంచుకొనవలసినది యుద్ధము జరిగినది 18 రోజులే. హతులుకాగా మిగిలినది 15, 16 మంది మాత్రమే! వారెవరు అన్నది చివరన తెలుపుకొంటాను. 18 రోజులలో 18 అక్షౌహిణులను మట్టుబెట్టవలెనంటే బాణములతో బల్లెములతో సాధ్యమా! చూద్దాము.
మహాభారత యుద్ధము  మహాభీకరమయిన  యుద్ధము.దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధము ద్వాపరయుగ అంతమునకు ఏర్పడిన ప్రళయముగా మనము భావించవచ్చు.
దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో పాశవిక రసాయన మారణాస్త్రాలను ఉపయోగించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఆకాలములో కౌరవ పాండవులకు ఏవిధముగా లభించి వుండవచ్చు అన్నది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. సమాధానమును సాధించే ప్రయత్నమూ చేద్దాము.
వ్యాసుని హరివంశములో కొన్ని చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. తరువాతి కాలములో కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించిన నిర్దుష్ట చరిత్ర దొరుకుతుంది. ఈ రచనలకు ఆలంబనమే శ్రీకృష్ణ ద్వైపాయనుడు వ్రాసిన హరివంశము. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశ, చంద్రవంశ రాజుల చరిత్రలు వున్నాయి.
క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. వ్యాసుని వ్రాతలను నేటి కాలమానమునకు మార్చితే,  క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు మనకు తెలియవస్తూవుంది. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చినారు అని చదివినాను కానీ అందుకు తగిన ఆధారమును పొందుట నాకు అసాధ్యమైన విషయము. అయినా ఈ శీర్షికపై మన వివరణకు వచ్చిన ఇబ్బందిలేదు.
మహాభారత యుద్ధ కాలం
భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించియుండినట్లు మనకు తెలియవస్తూవున్నది. భీష్ముడు సైన్యాధిపతిగా యుద్ధము చేసినది పదిరోజులు. పదవ రోజు సాయంత్రము శిఖండిని ముందుంచుకొన్న  అర్జనునితో  యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో ఆయన అస్త్ర సన్యాసం చేయుట జరిగినది. ఇందుకు సంబంధించిన వివరములు భీష్మార్జున యుద్ధము  లో వ్రాసినాను. అంటే భీష్ముడు గతించిన 68 రోజులకు పూర్వము మహాభారత యుద్ధము ప్రారంభమైనట్లే కదా! అంటే మహాభారత సంగ్రామము సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైనదని చెప్పుకొనవచ్చును. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే ,89 లక్షలుగా  నమోదు చేసినారు.
బ్ర.శ్రీ. కోట వేంకటా చలం గారు వ్రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించినారు.
రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు లేనిదే ఇంత మారణ హోమము అంత తక్కువసమయములో జరుగ వీలులేదు అని కొందరు ప్రఖ్యాత చరిత్రకారులు ఖండితముగా చెప్పినారు.
భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతము ద్వారా మనకు తెలియవస్తూ వున్నది. ఈ నారదుడు 372 కాంతిసంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం  ఆనాడు వుండేదని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలినట్లు కొందరు ఈవిషయమీ కృషి చేసినవారు చెప్పగా విన్నాను.
వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానము శ్రీకృష్ణుని ద్వారానూ, మరెన్నో విధములుగానూ పాండవులకు, ముఖ్యముగా అర్జనునికి లభించినట్లుగా భారతము లోతుగా చదివితే మనకవగాతమౌతుంది. ఖాండవ దహన సందర్భములో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి ఇచ్చిన సుదర్శనచక్రము ఒక rotating sharp edged distence control weapon గానూ,  గాండీవమును launcher గానూ  అక్షయ బాణ తూణీరాలను missils గానూ పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ మారణాస్త్రాల వినియోగం వల్ల బుగ్గియైపోయినది.
ఈ అస్త్రాలను వినియోగించేందుకు అతి నిగూఢమైన Passwordలాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరూ, Control Button లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇంకా సమగ్రముగా పరిశోధించవలసిన అంశము.
Remote Control ద్వారా అస్త్రాల ప్రయోగం
అణ్వాస్త్రాల సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి GPS Advanced Technology తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు.
ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్న అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!
అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటున్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ అన్న Scientist, 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి PHd. పట్టా పొందుట జరిగినది. కొంత లోతుగా ఆలోచించితే ఈ అస్త్రాలన్నీ ప్రస్తుతము ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా ఉండినట్లు ఒక అంచనా.
మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల నుండి గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడినట్లు పరిశోధకులకు తెలియవస్తూ వుంది. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువులు ప్రయోగించిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేసినట్లు వ్యాసులవారు భాత్రతమునండు తెలియజేసినారు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే ప్రతిభావంతమగు ప్రతిఘటన శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి దానిని నిర్వీర్యము చేస్తుంది. కావున మహాభారత యుద్ధములో దాదాపు కోటి యోధులు మరణించినారంటే ఈ యుద్ధం Missils లేకుండా జరిగిఉన్దదనె చెప్పవలసి వస్తుంది.
ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.
క్రీస్తుకు పూర్వం భూమిపైన ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన 'అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో Epi-center (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై వారికి కనపడటం జరిగింది. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. అంటే పైన చెప్పిన కాలమునకు ఇది సరిపోతూ ఉంది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించినారు.
అస్త్రాల వివరాలు
మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబుల వంటి ఆయుధాలు ఉన్నట్లు తెలిపినారు. పది సూర్యులనుండి  ప్రసరించగల వేడిమి పుట్టించే అస్త్రాలు వున్నట్లు తెలుపటం జరిగింది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను కూడా ప్రయోగించినారని పేర్కొన్నారు. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయినాయణి అందు వ్రాయబడి ఉంది. రణభూమిలోని గుడారాల్లో భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారితే అసంఖ్యాకులగు సైనికులు పారిపోయి నదులలో మునిగి ఆ నీరు త్రాగి ప్రాణాలు కాపాడుకొన్నారు అని తెలియవస్తూ వుంది.
మహాభారతంలో ఒక్క బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. దుర్యోధనుడు మరణించిన పిదప అశ్వత్థామ ఆపని చేయబోయినాడు కానీ శ్రీకృష్ణుదు దానిని వారించి అతని నొసట ఉన్న మణిని తీసుకొని ఆతనిని, చిరంజీవి కాబట్టి, అడవులలో సంచరించుతూ ఉండమని చెప్పినాడు. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా ఆయన వ్యూహరచన అమోఘము, అనన్యసాధ్యము. తానూ పరమాత్మే యని చెప్పుకొన్న వేదవేద్యుడు.
అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం’ అన్న గీతా వాక్యమును సార్థకము చేసి, యుద్ధమున ఉపయోగించిన సమస్త అస్త్రశాస్త్రములనూ సముద్రమున ముంచనాదేశించి పునః ‘ధర్మస్థాపన’ చేసిన ఆ త్రిజగాన్వంద్యునికి సాష్టాంగ ప్రణామము మనసారా చేస్తూ శెలవు తీసుకొంటున్నాను. .
స్వస్తి

విద్య-ఆచార్యుడు-ఆచారము.

విద్య-ఆచార్యుడు-ఆచారము.
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post.html

   ‘విద్‌’ అన్న ధాతువునకు స్థూలముగా అర్థము జ్ఞానము అని అన్వయించుకోవచ్చు. విద్య అంటే విజ్ఞానము. విద్య నేర్చుకోవటమంటే, ఈనాటి అర్థములో, విజ్ఞానాన్ని(పూర్వులు విజ్ఞానమును బ్రహ్మత్వముగా నిర్వచించినారు)  సంపాదించుట. ఒకసారి ఈ శ్లోకమును చూడండి.

విద్యాదదాతి వినయమ్‌ వినయాద్యాతి పాత్రతామ్‌l

పాత్రత్వాత్‌ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్‌ll

అని విద్యాప్రయోజనాలను ఏనాడో వివరించినారు భర్తృహరి తన సుభాషిత గ్రంథములోని నీతి శతకములో. పై విషయాన్నే ఏనుగు లక్ష్మణ కవి తానాంధ్రీకారించిన భర్తృహరి సుభాషితములలో

విద్య యొసగును వినయంబు వినయమునను

బడయు పాత్రత; పాత్రత వలని ధనము

ధనము వలనను ధర్మంబు; దానివలన

నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

అని అన్నాడు.

అనగా విద్య వలన వినయము, ఆ వినయము వలన పాత్రత (యోగ్యత), దానివలన ధనము, ధనము ధర్మాచరణమునకు మాత్రమే ఉపయోగించవలెను. ఆ ధర్మమే ఇహపర సుఖసాధానము.

వినయానికి ప్రథమ శత్రువు అహంకారమనిఅంటారు శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన తన కథామృతంలో అహంకారం యొక్క స్వరూపమేమిటోఈ విధముగా తెలుపుతాడు. మిణుగురు పురుగు సూర్యుడు అస్తమించిన వెంటనే ప్రపంచం అంతా చీకటి ఆవరించినప్పుడు, ప్రపంచానికంతటికీ తానే వెలుగునిస్తున్నానని భావిస్తుంది. ఇంతలో నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అవి ప్రకాశిస్తూ, ప్రపంచం అంతా తామే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. అంతలో చంద్రుడు వచ్చి, తన కాంతి వల్లే భూమి వెలుగుతోంది అనుకుంటాడు. సూర్యోదయం కాగానే ఇవ్వన్నీ కనుమరుగవుతాయి. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయని తెలియక, మిడి మిడి జ్ఞానంతో తామే గొప్పవాళ్ళమని అహంకారులు మిడిసిపడుతుంటారు. కానీ నిరంతరమూ ఏదో ఒకటి నేర్చుకుంటూ, తాను తెలుసుకోవలసినది జీవితాంతమూ ఉంటుందని, అసలు జీవితము చాలదని  భావించేవాడు అహంకారానికి లోనుకాడు.

వినయసంపన్నమైన విద్యే మనిషికి అలంకారం అని తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రుల పట్లా, గురువులు, పెద్దల పట్లా వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ, వారి అనుభవాల సారం తాను గ్రహిస్తూ, తన వివేకాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు.

విద్య గొప్పతనాన్ని తెలిపే ఈ శాస్త్ర వాక్యమును చూడండి.

నచోర హార్యం నచ రాజ హార్యం

న భ్రాతృ భాజ్యం నచ భార కారీ

వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం

విద్యా ధనం సర్వ ధన ప్రధానం

 చోరులచే దొంగిలింప బడలేనిది, రాజులచే ఆక్రమింపబడలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది, ఎంత సంపాదించినా భారము కానిది, దానిని పదుగురికీ పంచేకొద్దీ ఇంకా పెంచేదీ అయినటువంటి విద్యాదానము అన్నివిధములగు సంపదలకూ ప్రధానము. అంతేగాక భర్తృహరి సంస్కృత భాషలో వివరించిన విద్యాప్రయోజనాలను తెలుగు భాషలో ఏనుగులక్ష్మణకవి

విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్

విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్

విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,

విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే?

విద్య పరులకు కనిపించని పెన్నిధి, విద్య ఎనలేని గౌరవమును ఆర్జించి పెట్టేది, ఇహపర భోగములకు ఆలంబనమైనది, విదేశములలో గుర్తింపు తెచ్చేది, విద్య అన్నది మన బాగును వెంట వుండి చూస్య్కొనే విశిష్టమగు దైవసమానము, ఈ భువిలో విద్యకు సాటి ధనము లేదు, పైపెచ్చు  విద్య రాజ సన్మానములను లభింప జేస్తుంది.  అట్టి విద్య లేని వానిని మనిషిగా జమ కట్టగలమా! అసలు ఈ భర్తృహరి సుభాషితములను తెనుంగు జేసిన ఎలకూచి బాలసరస్వతి అన్న కవి 'విద్య లేనివాడు వింత పశువు' అన్నాడు.

అటువంటి విద్యనేర్చుకోవటానికి ప్రాచీన కాలంలో గురుకులాలుండేవి. ఊరికి దూరంగా జనావాసంలేని చోట వనాల లో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన గురుకు లాలలో విద్యార్థులు చేరి, గురుశుశ్రూష గావించి విద్య నేర్చుకునే వారు. తరతమ బేధాలు లేకుండా అంతా గురుపుత్రుల వలె మెలగి సేవచేస్తూ విద్యాసముపార్జన గావించేవారు. అందుకే ఆనాడు విద్య నేర్పు వ్యక్తిని గురువనేవారు. నేర్చుకునే వ్యక్తిని శిష్యుడు అనేవారు. గురుశిష్యులకు పితా పుత్ర సంబంధం ఉండేది. గురువుకు శిష్యుల పట్ల పుత్రవాత్సల్యం ఉండేది. శిష్యులకు గురువు పట్ల పితృభావన ఉండేది. ఈ విద్య విద్యార్థికి బ్రతుకును ఫలవంతంగా సాగించటానికి ఉపయోగపడేది. విద్య నేర్చుకొనేవారికి జ్ఞానసముపార్జనే పరమావధి. ఆ జ్ఞానాన్ని అవసరమైన మేరకు జీవనాన్ని గడుపుకోవటానికే వినియోగించేవారు. ఈ విద్యను నేర్చుకునే విధానంలో నాలుగు భాగాలుగా వినియోగించుకునేవారు.

ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।

పాదం సబ్రహ్మచారిభ్యః, పాదం కాలక్రమేణ చ ॥

ఇది శాస్త్ర వచనము. ఆచార్యుడు లేదా గురువు వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది  నాలుగవ వంతు మాత్రమే. మరియొక  నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు. మరి యొక, నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారుల అనగా తన సహా పాఠకుల' నుండి చర్చలద్వారా నేర్చుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలోని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల, పరిశోధనల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు. అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు. అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అన్న వాస్తవాన్ని ఈ శ్లోకము తెలియజేస్తూవుంది. దీనికి 1. తొలగింపులు(Deletions),2. మార్పులు(Modifications), 3. సవరణలు (Corrections) అవసరము. ఈ విధానమును చిత్తశుద్ధితో ఆచరించితే మనము చైతన్య వంతులమగుతయే గాక దేశమునే చైతన్యవంతము చేయవచ్చును.

నిజానికి ఇపుడు పాఠశాలలు, కళాశాలలలో నేర్పించే విద్య విద్యయే కాదు. దానివల్ల కలిగే ఉపయోగమూ లేదు. స్థానిక కళాశాలలో లక్షలు కట్టి చదివి B.Tech పట్టా తెచ్చుకొంటారు,ఏ Bank లోనో గుమస్తాగా చేరిపోతారు. అదే IIT లో పుచ్చుకొన్న B.Tech పట్టా ఎంతో విలువైనది. దానిని పుచ్చుకొన్నవాళ్ళు ధనార్జన కొరకు తమ మేధస్సును విదేశాలకమ్ముకొంటారు. రెండూ దేశ ప్రగతికి నష్టమే. ప్రభుత్వము వేల కోట్ల డబ్బును చదువుకు వెచ్చించుతూవుంది. ఎక్కువ భాగము బూడిదలో పోసిన పన్నీరే! దీనికి ఒక ముఖ్యమైన కారణము మనము మన సాంప్రదాయము నుండి ఎంతో దూరము పయనించి ఈరోజు మనమలవరచుకొన్న ఎంగిలి సంప్రదాయమే మనదిగా భావించుచున్నాము.

కాస్త ఓపికతో మన సంస్కృతి అంటే ఏమిటో స్తాళీ పులాకముగా పరిశీలించుదాము. మనకు నిజానికి సంస్కృతి 4 విధములుగా లభ్యమౌతూవుంది. 1. మన దేశీయ ఆచార వ్యవహారాలూ, 2. మన దైవచింతనా విధానములు, 3. మన సారస్వతము, 4. మన వివిధ శాస్త్రవిజ్ఞానము (Scientific and technological Knowledge).

మన ఆచార వ్యవహారములను తిరిగీ మూడు భాగములుగా విభజించవచ్చును. 1. సదాచారము, 2. దురాచారము, 3. అనాచారము.

1.     సదాచారము: ఇది సర్వదా పాటించదగినది. మరి మనము, మన అవసరములకొరకు అనేకమయిన ఊళ్లు, పట్టణాలు తిరుగుతూ ఉంటాము కదా! అప్పుడెట్లు? అంటే దానికి కూడా పెద్దలు ఒక వెసలుబాటును తెలియబరచినారు.

స్వగ్రామే పూర్ణమాచారం అన్యగ్రామే తదర్థకంl

పట్టణేషుచ తత్పాదం యాత్రే బాల సమాచరేత్ll

తనవయిన నిత్య దినచర్య కలిగిన వ్యక్తి తన స్వంత ఊరిలోనున్నా, లేదు మాటవరుసకు తన అత్త గారి యింటికి వెళ్ళినా, లేక అంతే ముఖ్యమైన బంధువుల ఇంటికి వెళ్ళినా తన ఆచారమును పూర్తిగా పాటించే అవకాశముంటుంది. అదే పరాయి ఊరికి పోయినపుడు తన ఆచారములలోని అర్ధ భాగము పాటించితే చాలును. అదే నగరాలకు, పట్టణాలకు పోతే మనదయిన రీతిలో నడచుకొను అవకాశము బాగా తగ్గిపోతుంది. అప్పుడు 1\4 వంతు ఆచారము పాటించితే చాలు. ఇక యాత్రలు అంటే ఏవిదేశాలకో పోతే పిల్లలవలె కట్టుబాట్లు లేకుండా ఉండవచ్చును. కానీ, స్వదేశస్థుల వలె కాకుండా, విదేశమునే స్వదేశముగా భావించిన వారు తమ ఆచారముల కాపాడుకొనుటకు ప్రయత్నము చేయుచున్నారు. ఇది సంతోషించదగ్గ విషయము. అసలు ఏ పరిస్థితులలో కూడా ఆచారము పాటించవలసిందే అన్న నైష్ఠికులు కొందరు ఉంటారు. దానికి కూడా శాస్త్రము సమాధ్జానము చెప్పినది.

తాతస్య కూపోయం ఇతి బ్రువాణ కాపురుషః క్షారజాలం పిబతి.

తండ్రి త్రవ్వించిన బావియని తనయులు అందలి ఉప్పునీరు త్రాగ గలరా! అంటే ఇక్కడ పరిశీలన అవసరము. కావున మన ఆచారమునకు పరిశీలన, చిత్తశుద్ధి కూడా అవసరమే!

ఈ పరిశీలనకు సహకరించేవాడే ఆచార్యుడు.

ఆచినోతిచ శాస్త్రార్థాన్ శిష్యాన్ సాధయతే సుధీ

స్వయం ఆచరతీచైవ సహా ఆచార్య ఇతిస్మృతాం

ఎంతటి గోప్పమాటో చూడండి. తండ్రి త్రవ్వించిన బావియని రోజూ అందలి ఉప్పునీరు త్రాగాలేము కదా! కాబట్టి సమంజసతకు చిత్తశుద్ధిని చేర్చి, విశ్లేషించి, వితర్కించి ఒక ఆచారమును మనము అవలంబించవలసియుంటుంది. పాతదని త్రోసివేయనూ అక్కర లేదు, క్రొత్తదని అక్కున చేర్చుకోనూ అక్కరలేదు. నా అనుభవమే చెబుతున్నాను. ఒక 50 సంవత్సరాల క్రితము నా మిత్రుడగు ఒక ఆధునిక Doctor తో మాట్లాడు సమయములో ఆరోగ్యమును గూర్చిణ చర్చ వస్తే సూర్య నమస్కారములు ఆరోగ్యమునకు చాలామంచిది అన్నాను. అప్పుడు ఆయన ఒక చిరునవ్వుతో ఆమాటను కొట్టివేసినాడు. నేను కూడా అటుపిమ్మట ఆ ప్రస్తాపన తేలేదు.

కానీ ఈనాడు  Indian Institute of Medical sciences అత్యుత్తమ ఆరోగ్య సాధనగా, అంటే ఈ సాధనాలకు రారాజుగా ‘సూర్య నమస్కారము’ను నిర్ణయించినారు.

ఒక మంత్రమును వేద సదస్సులో వింటున్నామనుకొండి. అది మరీ మంద్రస్థాయి లోనో మరీ తారాస్తాయిలోనో ఉచ్చరించక మధ్యమ స్థాయిలో ఉచ్చరించుతుంటారు. మనకు అర్థము కాకపోయినా ఆ ఉచ్చారణలోని లయకు తన్మయులమౌతూ ఉంటాము. నిజానికి ఈ వినికిడికి భక్తి భావము మాత్రమే కారణము కాకపోవచ్చును. మన మెదడులో ఊరుచున్న 24 విధములగు వినాళ రసములు (Harmones) స్రవించి మెదడునందలి తరంగములు 13.8 cycles\second గా ఉండునట్లు నియంత్రింప బడుతుంది. అది మన గుండె కొట్టుకొను వేగమును 68+or- గా నియంత్రించుతుంది. దీనిని Neuro linguistic effect అంటారు. ఆవేదమంత్రము వినునపుడు శరీరములో జీవరసాయన క్రియలు (Biochemical) సంభవించుతాయి. యోగమును అనుసరించేవారు దీనిని ‘β’Level Meditation కు చెందుతుంది అంటారు. ఈ తరంగములు 8.3 కు వస్తే దానిని ‘α’ Level Meditation అంటారు. అదే 4 కు వస్తే దానిని ‘Θ’ Level Meditation అంటారు. 10 నిముసముల ‘Θ’ Level Meditation 10 గంటల నిదురకు సమానము.  ఈ వేదమంత్ర శ్రవణము రక్తపు వత్తిడి (Blood Pressure)ని నియంత్రించుటయే కాక మెదడు తరంగములను 3 వద్దకు తెస్తాయి. ఈ విషయమును నేటి సైంటిస్టులు కూడా బలపరచినారు. అందుకే వేదమంత్రపఠనము జరుగునపుడు మౌనము పాటించవలయునన్నది మన పెద్దలు ఏర్పరచిన ఆచారము.

తల ఉత్తరమువైపు పెట్టుకోకూడదన్నది మన పెద్దలు చెప్పిన ఆచారము. శరీరమునకు తల ఉత్తరధృవము. మరి తల ఉత్తరమువైపు ఉంచితే ‘అభిన్న ధృవములు వికర్షణ చెందుతాయని నేటి Science చేబుతూవుందికదా! కావున తూర్పునకు గానీ పడమరకు గానీ తలయుంచి పడుకొనుట

శ్రేష్ఠము. అధమము దక్షిణము వైపు తల ఉంచడము. ఉత్తరమున మాత్రము ఉంచరాదన్నది మన పూర్వాచారము.

భూమిపై ఏదయినా చాప, పట్టా, పీట లాంటివి వేసుకొని కూర్చొనుట ఆచారము. నేటి సైన్సు దానిని కూడా బలపరుచుతూ వుంది. కూర్చునుటకు అవి వాడుట చేత శరీరములోని Bio-Static Electricity నేరుగా భూమిని అంటదు. అవి Non-Conductors కాబట్టి.

23% పరుపు పై నుండి తటాలున లేచుటవల్ల హృద్రోగములు వస్తూ వున్నాయి అన్నది 1993 లో WHO ద్రువపరచిన మాట.

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

రాత్రి నిదురించిన వ్యక్తి ఉదయము పడకపైనుండి లేచినవెంటనే దిగ్గున లేయకూడదు. అట్లు లేయుట అనేక హృద్రోగములకు కారణము కావచ్చును. అందుకే మనము ప్రక్కలకు తిరిగి నెమ్మదిగా నిదురలేచి పరుపుపైనే కూర్చుని, ఈ క్రింది శ్లోకమును చెప్పుకొని క్రిందికి దిగమన్నారు.

కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతిl

కరమూలె స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనంll

ఇక మన ఆచారమగు మొదట చెప్పిన ‘సముద్ర వసనే దేవీ’ శ్లోకాన్ని తాను వినియుండకపోయినా Fritj of Capra అన్న Scientist పై శ్లోకమును ఎంత బలపరచుచున్నాడో చూడండి.

The Bio-Static electricity in your body that you gained by rolling on the bed should not get defused by keeping your legs on the carpet or some such thing other than the floor. This may lead to arthritis over a period of 25 years or so.

Fritj of Capra:

Berkley University Theoretical Physics Head of the Department and

A sitting scientist of 17 US Universities in US. He is the author of several books, including The Tao of Physics (1975), The Turning Point (1982), Uncommon Wisdom (1988), ‘The Web of Life (1996)’, The Hidden Connections (2002) and The Systems View of Life (2014).

 

Where the ultramodern physics has come to an abrupt end then starts the ancient Indian Upanishadic philosophy. -Einstein

మరి పాశ్చాత్యులు ఇంతగా మెచ్చుకొంటూ వున్నా మన గొంగడి మాత్రము వేసిన చోటే వుంది.

ఈ సందర్భములో ఈశావాస్యోపనిషత్ లోని ఈ శ్లోక సారమును తెలుసుకొందాము.

.

ఈశావాస్యోపనిషత్ లోని ఈ మొదటి శ్లోకమును చూడండి.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్

తేనత్యక్తేన భుంజీథాః మాగృథః కస్యస్విద్ధనం

ఏవేవయితే మన ఇంద్రియానుభూతులద్వారా కలవు అని తలచుతూ ఉన్నామో వానియందంతా ఆపరమేశుడు వసించుచున్నాడు.

జగత్యాం జగత్: భూమి ఒక ఇరుసుపై తన కక్ష్యలో తిరుగుతూ వున్నదని మనకు తెలుసు.;

జగత్ అన్న పదమునకు అర్థమేమిటంటే ‘పునః పునః గచ్చతి ఇతి జగత్’ ‘ప్రకర్షేణ  గచ్ఛతి ఇతి జగత్’. పరివర్తన అంటే పరిభ్రమించుతూ వుంటుంది కావున ఇది జగత్

ఈ పరిభ్రమించే జగత్తులో పరివేష్టితమైయున్న పదార్థమే జగత్తు. అంటే ఏదయితే తన అక్షముచుట్టూ పరిభ్రమించుతూ వుందో  అందులోవుందేదే జగత్తు. ఆజగత్తునిండా వ్యాపితమైయున్నవాడు భగవంతుడు.

అసలు గణిత శాస్త్ర పరముగా ఈ శ్లోకమును విశ్లేషించుట అత్యంత సలభము, సుకరము. పూర్ణము అన్న మాటకు Zero అన్న అర్థమును Infinity అన్న అర్థమును చెప్పుకోవచ్చు. ఈ శ్లోకము ఏమి చెప్పుచున్నదంటే సున్నా నుండి సున్నా తీసివేసినా, కూడినా సున్నాయే వస్తుంది. సున్నాను సున్నాతో హెచ్చవేసినా, భాగించినా సున్నాయే వస్తుంది. అదేవిధముగా అనంతము (Infinity) నుండి అనంతము తీసివేసినా, కూడినా అనంతమే వస్తుంది. అనంతమును అనంతముతో హెచ్చవేసినా, భాగించినా అనంతమే వస్తుంది ఇది చాలు పరమాత్మ తత్వము తెలుసుకొనుటకు.

ఇంకొక ఆచారము చూద్దాము.

అరుణ ప్రశ్న లో ఈ విధముగా వున్నది.

'నాప్సో మూత్ర పురీషం కుర్యాత్ న నిష్ఠిరేత్ తద్ వ్రతం

జీవనమునకు ప్రవహించు జలము ఉన్నచోట మూత్రపురీషములు చేయకూడదు. అలాగే ఉమ్ముట చీదుట చేయరాదు. మరి నేడు నెత్తిన నోరుపెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నది ఇదేకదా!

ఈ శ్లోకమును చూడండి.

భూమిరాపోనలోవాయుః ఖమ్మనో బుద్ధిరేవచ

అహంకారమితీయమ్మే భిన్నాః ప్రకృతిరష్టద

పంచాభూతములకు తోడూ, మనసు, బుద్ధి, అహంకారము అన్న ఈ 8 ప్రకృతి గుణములు. ఏది అతిశయించినా మానవునికి అది ప్రళయమే!

అత్యుత్తమమైన అతి సాధారణ ఆచారాలు మరచినాము. 1. బియ్యపు పిండితో ముగ్గు పెట్టుట- భూత తర్పణము అంటే చీమల వంటి జీవులకు ఆహారమును అనునిత్యము ఒసంగుట. ఆవు ప్దెఅ కలిపినా నీటితో కళ్ళాపి చల్లడము-అనారోగ్య హేతువులైన క్రిమికీటకములను ఇంటిలోనికి చేరనీయకుండుట

పంచ(ధోవతి) కట్టుకొనుట- నడుము క్రిందినుండి పాదములవరకు గాలి ప్రసరించి ఆయా అంగములను ఆరోగ్యముగా నుంచుట. ఇటువంటివన్నీ సదాచారములు. దోగాడే పిల్లల శరీరమును శీతోష్ణ స్థితి అనుకూలముగా బట్టలు వేయుటకు బదులు బిగుతు బట్టలు వేసి, అది చాలదని diapers బంధించి యుంచుట మొదలయినవి అనాచారములు. బొట్టు, మెట్టెలు, గాజులు, తాళి, పాపిట, జడ ఇవన్నీ వదిలి పెళ్ళయిన స్త్రీలేర్పరచుకొన్న కొత్త దురాచారము. ఆచారములను ఇట్లు 3 తెగలుగా విభజింపవచ్చును.

చివరిగా ఒక్కమాట చెప్పి ఈ వ్యాసమును ముగించుతాను. ఒక ఆధునిక పండితుడు వేదములకు తెలుగులో భాష్యము వ్రాసినాడు. అది సాయన భాష్యమంత సమగ్రమా కాదా అన్నది ప్రక్కనుంచితే నేడది హిందువులకన్నా హైదవేతరులు మన ధర్మమును తప్పు పట్టుటకు బహుళముగా ఉపయోగపడుచున్నది. వ్రాయుసమయమును ఆయన ఈ పరిణామమును ఊహించియున్డక పోవచ్చు. పాండిత్యము చూపించుట గొప్పదనము కాదు అది సంఘమునకు ఎంతవరకూ శ్రేయోదాయకము అన్నది గుర్తుంచుకొనవలసిన విషయము. వేదార్థమును గ్రహించుట అంత సులభము కాదు అన్న విషయము సులభముగా అర్థమగుటకు ఈ విషయము తెలుపుచున్నాను.  .

అధర్వణ వేదము 12వ కాండలో

మాతా భూమిః పుత్రోహం పృథివ్యా అని చెప్పబడినది.

ఈ భూమి మనకు తల్లి. మనమంతా ఆమె సంతానమే! ఈ మాట మనము భూమిని ఎంతగా అరాధించవలెనో తెలియ జేస్తూ వున్నది. ఆమె వసువువులను ధరించి వసుంధర అయినది. మరి వానిని స్వార్థబుద్ధితో అతిగా త్రవ్వి వెలికి దీసి అమ్ముకొని వేలకోట్లు సంపాదిన్చుచున్నామే మరి చివరిరోజు ఈ సంపదను వెంట తీసుకొని పోగలమా! అటువంటప్పుడు ఎందుకు ఈ తపన.

సువర్ణము అన్న మాటకు బంగారము అన్న లౌకికమైన అర్థము ఉన్నాకూడా నిజానికి అది  వేదము లో సు+వర్ణము అన్న మాట వస్తుంది. సువర్ణము అనగా అత్యంత శ్రేష్ఠమైన వర్ణము అనగా అక్షరము. అదే ‘ఓంకారము’. ఓంకారమే  సువర్ణము. అది తెలుసుకోలేక బంగారము వెంట పరుగు పెడుతూ ఉన్నాము. ఈ మాట ఎందుకు చెప్పినానంటే ఒక్కొక్కసారి వేదములో ఉపయోగించిన ఒక్కొక్క పదము ఎన్నో అర్థములు కలిగియుంటుంది. సాధారణ మానవులము. మనము వేదభావమును ఆకళింపు చేసుకోలేము. మామిడి కాయ అతిపులుపుగా వుంటుంది. దానితో చేసిన పప్పు, పచ్చడి లొట్టలు వేసుకొంటూ తింటాము. అంతగా మామిడి కాయను తినలేము కదా! అందుకే మనకు పురాణ శాస్త్ర ఇతిహాసములను మన పెద్దలు మనకు అందజేసినది. అర్థము చేసుకొంటే మనకూ, మన భావితరాలకూ మంచిది.

అదే విధముగా ఇంకొక మాట చూద్దాము. వరాహము అంటే కేవలము సూకరము, పంది అన్నది మాత్రమే అర్థము కాదు. దానిని వర+ అహముగా విడదీయవచ్చు. వర అంటే వరించదగినది. అహము అంటే ‘నాది’ అని అర్థము అన్న విషయము మనకు తెలిసినదే! అంటే నాదిగా తీసుకొనవలసినది. 'నాది' అని స్వంతము చేసుకోవలసిన క్షేత్రములో నాటవలసిన ఓంకారము అన్న బీజము అని అర్థము చేసుకొంటే జగమంతా సౌభాగ్యమే!     

స్వస్తి.