Monday, 23 March 2020

ఉగాది (శార్వరి నామ సంవత్సరము)

ఉగాది (శార్వరి నామ సంవత్సరము)
ద్విజ కలరవము వాదిత్ర  ధ్వానము గాగ
                                నికర పిక రవాల నెలవు గాగ
ఘన పుష్ప రజమేమొ గంధంపు పొడి గాగ
                              విరివి సత్ఫలశ్రేణి విందు గాగ
తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ  
                               అరుణ పుష్పోత్కర మగ్ని గాగ
చూత శాఖములేమొ సూపార్థములు గాగ
                               స్రవ పుష్పరస మేమొ సర్పి గాగ     
సద్వన   వధూమణికిని   వసంతునకును
పాణి గ్రహణము జేయింప బయలుదేరె
చిలుక   తత్తడి   రౌతు   రాచిలుక  పైన
కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ
ద్విజ= పక్షులు (రెండు మార్లు జన్మనెత్తునవి)
వాదిత్రములు= వాద్యములు
నికరము = శ్రేష్ఠము
ఘన పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి 
విరవి = మిక్కుటమైన అతిశయించిన
ధూమ మేఘము = దట్టమైన పొగ
అరుణ పుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి
చూత శాఖములు = మామిడి కాయలు ఆకు కూరలు  (ద్వంద్వ సమాసము)
సూపార్థము = పప్పునకు వలసినవి
స్రవ పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధువు
సర్పి = నేయి
చిలుక తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు
పూదేనెన్ దనివార గ్రోలి  విలసామోదమ్ములై తుమ్మెదల్
మాధుర్యంబుగ ఝుంకృతుల్ సల్పుచున్ మత్తెక్కి నర్తించెడిన్
రోధస్యంతము పిక్కటిల్ల వనినారొహించి క్రొమ్మావులన్
తాదాత్మ్యమ్మున శారికల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్ 

ఎల్లలు లేని నానుడిని ఏర్పడ వాడుక భాష పేరుతో
వెల్లువయై జెలంగుటకు వీలును గల్గగనీక హద్దులన్
కొల్లలు గాగ నేర్పరచి కోరిన రీతిని కావ్యసంపదల్
చల్లగ కుళ్ళ జేసియును చక్కగ గాంచిరి పేరు శార్వరీ!

'భారత'మాయె భారముగ భాషను వాడుక భాష జేయగా 
దారము లేని మాలగ విదారక మయ్యెను కావ్య పుష్పముల్
సార సమస్త సంగ్రహము సాంతము గల్గినయట్టి పొత్తముల్
చేరువయయ్యెలే చెదకు చేవను గూర్చగ నేడు శార్వరీ!

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం   న్యాయేన మార్గేణ మహీం మహీశాం
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లొకాస్సమస్తా      స్సుఖినోభవంతు 

ఇది ఉగాది నాడు తప్పక మనన చేసుకొనవలసిన శ్లోకము. న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కాంక్షించిన వారు.
మరి ఈ శ్లోకములో గో బ్రాహ్మణ జాతులు సుఖముగా వుంటే చాలని కదా చెప్పుచున్నాయి మిగత వారిని గూర్చిన ఊసు ఎత్తలేదు కాబట్టి వారందరూ ఏమయినా ఫరవాలేదా! అన్నది అందరికీ వచ్చే అనుమానము.  ఒక శ్లోకము  రెండు చిన్న పంక్తులు కలిగియుంటాయి. వాటి భావమును పదముల మాధ్యమముతో గ్రహించరాదు. అందు గల గూడార్థమును మనము గ్రహించ వలసి యున్నది. ఇందలి గూఢార్థమును ఒకపరి పరిశీలించండి. ప్రజలు కలకాలము చల్లగా పాలింపబడవలెను. న్యాయ మార్గములో రాజులు భూమిని ఏల వలెను . గోవులకు బ్రాహ్మణులకు శుభము సర్వదా సమకూరవలెను. సమస్త లోకములు సుఖముగా ఉండవలెను.
అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగుంటే ఆలోచనెందుకు అంటే గోవులకు బ్రాహ్మణులకు  ఈ శ్లోకములో ప్రత్యేకముగా పెద్ద పీట వేసినారు. పోనీ గోవులు సుఖముగా వుండవలసినదే! వానిని తల్లితో పోల్చినారు కాబట్టి. మరి బ్రాహ్మణులు ఎందుకు. ఎందుకంటే గొ సంతతి బాగుంటే యజ్ఞ యాగాది క్రతువులకు తమ నుండి వలసిన  ప్రతి వస్తువును అవి పుష్కలముగా ఇవ్వగలవు. ఎప్పుడు అవి పుష్కలముగా ఉంటాయో యజ్ఞయాగాదులు నిరాఘాటముగా కొనసాగుతాయి. వానిని నిరాఘాటముగా కొనసాగించేటందుకు బ్రాహ్మణ సంతతి అవసరము. అందువల్ల యజ్ఞయాగాదులు నిరాఘాటముగా వారు జరిపితే సకాల వర్షములు కురుస్తాయి. సకాల వర్షములు కురిస్తే పంటలు బాగా పండుతాయి.  పంటలు బాగా పండితే ప్రజలు సుఖిస్తారు. వారు సుఖిస్తే సకల లోకం సుఖముగా వుంటుంది. అంతా తమతమ నిత్య విధులను కర్మలనుసక్రమముగా నిర్వహించుతూ వుంటే సమస్త లోకములూ చల్లగా వుంటాయి. మరి ఇందులో బ్రాహణ శబ్దముండుటలో అనర్థమేమి వుంది. ఈ శాంతి పాఠము ఇక్కడ ఆగలేదు . ఈ శ్లోకములు వినండి.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
ఇందులో ఏమి చెప్పబడినదో గమనించండి. సకాలమునకు వర్షములు కురవాలి. ఈ భూమి కలకాలమూ ధనధాన్య సంవృద్ధమై వుండాలి. దేశము క్షోభరహితమై వుండాలి. సత్వ గుణసంపన్నులై  బ్రతికినంతకాలము తమ అనుష్ఠానములతో లోక కల్యాణమును అంటే సకల ప్రజల హితమును కాంక్షించే  బ్రాహ్మణులు నిర్భయముగా సంచరింతురు గాక! ఇక అదే శాంతిపాఠము లోని ఈ రెండు శ్లోకములు గూడా చూడండి.
 అపుత్రా: పుత్రిణస్సంతుపుత్రిణస్సంతు పౌత్రిణ: | 
అధనా స్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్ ||
ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. సంతు లేని వారికి సంతానము కలుగు గాక! వారికి తిరిగీ సంతు కలుగు గాక! నిర్భాగ్యులకు సౌభాగ్యము చేకూరు గాక! నూరు సంవత్సరములు సుఖముగా శుభముగా జీవింతురు గాక! ఈ చివరి శ్లోకము చూడండి:
సర్వేపిః సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః
సర్వ్ భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ 
అందరూ సుఖముగా వుందురు గాక! ఎవ్వరికీ రోగ బాధలు లేకుండు గాక! అందరూ కలకాలము మంచిని మాత్రమే చూచెదరు గాక! ఎవరికీ దుఃఖము అన్న అనుభూతి కూడా కలగకూడదు అనేది సనాతనధర్మం యొక్క ఆశయం. అసలు వేదము, సమస్త ప్రజలు సమస్త జీవ జంతువులు ‘శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే’  సుఖముగా వుండవలె నని చెప్పినది. ఇటువంటి విశ్వహిత మతము దుర్భిణి పెట్టి వెదకినా ప్రపంచములో వేరెక్కడా దొరుకదు.

 న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కాంక్షించిన వారు. 
వారు ఏర్పరచిన 'యుగాది' రాను- రాను "ఉగాది" అయిన దంటారు. సృష్ట్యాదిని యుగాది  అన్నారని, అప్పటినుండి కాలమును అణిమ (మైక్రో) మహిమ (మాక్రో) ల వరకు నిర్దుష్ఠము గా విభజించిన మహనీయులు వారు. 

కానీ ఇక్కడ ఒక చిన్న విషయము చెప్పు కొనవలసి వున్నది. ఉత్+గ+ఆది=ఉగాది. ఉత్ అంటె నక్షత్రము. గ అంటె గమనము ఆది అంటె ఆరంభము. భూమి నుండి మనము చూచినప్పుడు నక్షత్రములు భ్రమించుచున్నటులనే కనపడును. దీనినిసంస్కృతములో సాపేక్ష చలనము అనిఅంగ్లములో relative motion అని అంటారు. కావున నక్షత్ర మరియు గ్రహ చలనారంభమే ఉగాది అని తెలియనగును. 
ఉగాది చైత్ర శుధ్ధ పాడ్యమి ఉదయంతో ప్రారంభమౌతుంది. చంద్రుడు ఆ నెలలోని పున్నమికి చిత్రా నక్షత్రమునకు దగ్గరౌతాడు కావున అది చైత్ర మాసమైంది. 

అసలు దీనికి ఇంకొక అన్వర్థము కూడా వున్నది. "ఛత్రస్యభావహ ఇతి చైత్రం" అంటారు. అంటె ఏ కాలమైనా పనికి వచ్చే గొడుగు లాగా మనలను కాపాడుతుందని ఒక అర్థమైతే అన్ని ఋతువులనూ తన గొడుగు కింద అంటే control లో వుంచుకొని ప్రజలకు వలయు విధంగా అందిస్తుందని కూడా అన్వయము. 

మొదటి నెల చైత్ర మైతే  మొదటి సంవత్సరం 'ప్రభవ'.ప్రకర్షేణ ఇతి ప్రభవః అంటారు పెద్దలు. ప్రకర్ష అంటే 'మేలు' అని అర్థం. మన 60 సంవత్సరాల కాలమానం లో  'ప్రభవ' మొదటిదైతే  'అక్షయ' చివరిది. క్షయము లేనిదే అక్షయము. అంటె ఈ మేలు కలకాలం తరిగి పోకుండా కరిగి పోకుండా వుండాలని కోరుతున్నారు మన కాల వ్యవస్థ నిర్ణయించిన ఆ మహానుభావులు. 

ఇది తెలుసా: ఈ 60 సంవత్సరములకూ పేర్లున్నయి. ఇది శార్వరి నామ సంవత్సరము. ఈ సంవత్సరములో  పుట్టి తిరిగి 60 సంవత్సరముల తరువాతి వచ్చే శార్వరిని చూచిన వారు షష్ట్యబ్ద పూర్తి జరుపుకుంటారు. 

కాల విభజన ఆధారంగా ఏర్పడిన పండుగ ఉగాది కనుక కాల ప్రమాణాన్ని పన్నెండు విభాగాలుగా చేసి మనం అనుసరిస్తున్నాం. వీటినే నిమేషం,
 కళ, కాష్ట, ముహూర్తం, జాము, దినం, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరాలుగా ప్రాచీనులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల సముదాయాన్ని యుగంగా పేర్కొన్నారు. యుగాల విభజనను పరిశీలిస్తే నవగ్రహాలు ప్రదక్షిణం చేసే కాలాన్ని పూర్ణ సంఖ్యగా గణించి 432 కోట్ల సంవత్సరాలను ఒక కల్పముగా పేర్కొన్నారు. ఈ కల్పములో1000వ వంతును ఒక మహా యుగ మన్నారు. మహాయుగాన్ని తిరిగి నాలుగు యుగాలుగా విభజించారు.
17, 28,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కృతయుగము గాను
12, 96,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని త్రేతాయుగం గానూ
8, 64,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని ద్వాపర యుగము గాను, 4,32,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కలియుగము గానూ పేర్కొన్నారు. అలాగే 7o మహాయుగాలను ఒక మన్వంతరంగా, 14 మన్వంతరాలను ఒక కల్పకంగా పేర్కొన్నారు. ఇలా విభజించిన కాల ప్రమాణంలో ఒక కల్పము కాలం బ్రహ్మకు ఒక పగలు గానూ, మరో కల్పము  రాత్రి కాలము  గాను ఉంటాయని పురాణ ప్రశస్తి. ఇలా పరిశీలిస్తే త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కృతయుగం కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కలియుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి అన్నది విజ్ఞుల వాక్కు . కృతయుగంలో నాలుగు పాదాలలోనూ, త్రేతాయుగంలో మూడు పాదాలలోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలలోనూ, కలియుగంలో ఒక పాదంలోనూ ధర్మం నడుస్తుంది.
కృష్ణ యజుర్వేద తైత్తరీయ బ్రాహ్మణము పదవ ప్రకరణము పాఠములోని నాల్గవ అనువాకము
''యుగంభవేత్‌ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం'' అని చెబుతున్నది. దీని ప్రకారం ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా పేర్కొంటే 12యుగాలు అవుతున్నాయి.  అసలు సూర్యుడు చంద్రుడు మకర రాశి లో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి కలుస్తారు.  కలయికను యుగము అంటారు.  అందువల్ల ఈ ప్రకారముగా 60 సంవత్సరముల కాలములో 12 యుగములు వచ్చును. వేదాంగమైన జ్యోతిష్య భాష్యములో యుగంలోని సంవత్సరాలను విశదీకరిస్తూ విద్యారణ్యుడు
''సంవత్సరోసి, పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి'' అని భాష్యం చెప్పినాడు.
అంటే ప్రతి యుగంలోని ఐదు సంత్సరములను వరుసగా వత్సరము, పరివత్సరము, ఇద వత్సరము, అను వత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో పిలుస్తారు. ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే తదుపరి యుగానికి సంబంధించి మొదటి సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా సూర్యుని చుట్టూ బృహస్పతి భ్రమణ కాలము 12 సంవత్సరములు అది ఒక యుగము అవుతుంది. అప్పుడు ఈ వర్ష సముచ్చయమునకు 5 యుగాలు ఏర్పడుతాయి.
దానినే పుష్కరము అంటారు. సూర్య చంద్ర బృహస్పతుల కలయిక 865  బృహస్పతి సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది. అట్టివి 5 గడిస్తే ఒక  కల్పము అంటారు.



మనం శ్వేతవరాహకల్పము లోని ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రథమ పాదములోని 5118వ సంవత్సరములు గడిచినవి. ఇక దుర్ముఖి నామమును గూర్చి మీరు పంచాంగము నుండి తెలుసుకొనగలరు కావున ఆ విషయమును మీకే వదలి పెట్టినాను.

ఉగాది పండుగ నాడు మనం సాంప్రదాయ సిద్ధమైన కొన్ని ఆచారాలను పాటించడం కూడా పరిపాటిగా వస్తున్నది. అందులో ఒకటి వేప పువ్వు పచ్చడి సేవించడము. వేప పువ్వు పచ్చడి సేవించడాన్ని 'నింబ కుసుమ భక్షణం'' అనే పేరుతో ''ధర్మసింధు'' వర్ణించింది.
''అబ్దాదౌ నింబ కుసుమం! శర్కరామ్ల ఘృతైద్యుతమ్‌
''భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్య దాయకమ్‌''
అంటే సంవత్సరారంభమున మొదటి ఝాము నందు వేప పువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి తదితరాలను తీసుకుంటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉండును అని అర్థం. ఈ పచ్చడి తినడం వలన త్రి దోషములు (వాత, పిత్త, కఫములు) నశించి శరీర తత్త్వములో మార్పు వస్తుంది.
శాస్త్రీయంగా చూస్తే హేమంత రుతువులో శరీరంలో ఏర్పడిన కఫము వసంతంలో సూర్యుని వేడికి కరిగి శరీర మంతటా వ్యాపించి రోగాలు కలిగించును. ఈ రకంగా ఏర్పడిన రోగాలలో మశూచి ఒకటి. ఇది ఎక్కువగా వసంత రుతువులో వచ్చు వ్యాధి కాబట్టి దీనికి 'వసంత సంభవా' అనే పేరు కూడా వున్నది. శరీరానికి మేలు చేకూర్చి మశూచి రాకుండా చేసే శక్తి వేపపువ్వుకు ఉండుట వలన ఈ ఋతువునందు వేప పువ్వు తినుట ఆచారమైంది. వాస్తవానికి వసంత రుతువు పూర్తయ్యే వరకూ వేప పువ్వు తినాల్సి వుంది. కనీసం శ్రీరామనవమి వరకు తినాలి. కాలక్రమమున ఈ ఆచారం అడుగంటి ఉగాది ఒక్కరోజునే అది సూర్యోదయం తరువాతనే వేపపువ్వు పచ్చడి తీసుకుంటున్నారు. సూర్యోదయానికి ముందుగానే తలస్నాన మాచరించి వేపపువ్వు పచ్చడి తినడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

పాపపు పనులకుభూత ప్రేత పిశాచములకు  ఆలవాలమౌ అర్ఢరాత్రి సంబరాలు మానివేసి ,రాలిపోయే కాలములో క్రొత్త సంవత్సర వేడుకలు చేసుకొనే హీన సాంప్రదాయానికి ఆనకట్ట కట్టి వసంతముతో మొదలయ్యే ఉగాదిని జరుపుకుందాము. 
స్వస్తి.

Wednesday, 18 March 2020

డాక్టర్ సతీష్ పట్కి కొల్హాపూర్


డాక్టర్ సతీష్ పట్కి  కొల్హాపూర్
పద్మవ్యూహము, సుభద్ర కడుపులో అభిమన్యుడు ఉన్నపుడు, అర్జునుడు, గర్భవతియై పడుకొని ఉన్న సుభద్రతో పద్మవ్యూహ ప్రవేశ నిర్గమనముల గూర్చి ముచ్చటించుచుండినాడన్న విషయము మనకు తెలిసినదే! ఆమె నిదురపోవుటచే, అర్జునుడు నిర్గమనమును గూర్చి తెలుపుట నిలిపివేసినాడు. ఇది కూడా మనకు తెలిసినదే! అదే విధముగా గర్భవతి యగు హిరణ్యకశిపుని భార్య  లీలావతి నారదుని ఆశ్రయములో ఉన్నపుడు, గర్భస్త శిశువగు ప్రహ్లాదుడు కూడా నారదుడు చెప్పే విష్ణు లీలా విలాసమును విని పరమ విష్ణు భక్తుడైపోతాడు.
కానీ గర్భస్త శిశువు వినుట ఏమిటి అది గుర్తుంచుకొని యువకునిగా ఉన్నపుడు పద్మవ్యూహమున ప్రవేశించుట ఏమిటి అని నేటికీ ఎందరో అల్పజ్ఞాన సంపన్నులు, అపూర్వ (పూర్వము అంటే తూర్పు అని ఒక అర్థము, అపూర్వము అంటే పూర్వమునకు వ్యతిరేకము అంటే పశ్చిమము, Europians) విజ్ఞాన బాధితులు, నేటికీ ఎగతాళి చేస్తూ వుంటారు.
కానీ భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారిచే సత్కరింపబడిన డాక్టర్ సతీష్ పట్కి గారు తెలిపిన ఈ వాస్తవమును గమనించండి. ఈయన స్త్రీ గర్భధారణా విషయిక నిపుణులు. ఇల్లాలు గర్భమును దాల్చి 16 వారములు దాటినా తరువాత గర్భస్థ శిశువుకు, తల్లి ఆలకించే అంటే శ్రద్ధతో వినే విషయాలు గుర్తుగా ఉండిపోతాయి. ఆవిధముగా అభిమన్యుడు పద్మవ్యూహ భేదనమునకు ఉపక్రమించినాడు.
మన పూర్వులగు ఋషులు, జుట్టు గడ్డాలకు ప్రాదాన్యతనిచ్చి పెంచుకోలేదు. వారి దృష్టిలో శరీరము ఒక ఉపాధి మాత్రమే. వారి యావజ్జీవిత కాలమూ మానవ కళ్యాణమునకు పాటుపడిన మహనీయులు. వారిమాట మనకు వరహాల మూట అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని భారతీయ బహుశాస్త్ర విజ్ఞానమును గూర్చి తెలుసుకొండి. వారు పాశ్చాత్యులవలె, స్వార్తపరత్వముతో, డబ్బుపై యావతో, Patents కొరకు పాటుపడిన వారు కాదు. ఆ మహనీయుల బాటలో నడచి భారత జాతీయ కేతనము ఎవరికీ అందని ఎత్తులో రేపరేపలాడనీయండి.
స్వస్తి.

Sunday, 15 March 2020

జగద్గురు శంకర ప్రణీత గుర్వష్టకం


జగద్గురు శంకర ప్రణీత గుర్వష్టకం
శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||
అందమైన శరీరము , సుందరియగు భార్య , గొప్ప కీర్తి , మేరుపర్వత సమాన ధనము ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో ఏమి ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||
భార్య , ధనము , పుత్రులు , పౌత్రులు , ఇల్లు , బంధువులు మొదలైనవి ఎన్ని ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో
ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||
ఆరు అంగములు గల వేదములు , శాస్త్రములు , కవిత్వ ప్రసూనములగు గద్య-పద్యములను రచించగల శక్తి ముఖమునందున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||
విదేశములలో మాన్యత్వము లభించినది , స్వదేశమున ధన్యత సమకూరినది, నాకన్నా సదాచార సంపన్నుడు వేరొకడు లేడు ఐ తలపోయువాడయినా గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
క్షమామండలే భూపభూపాలబృందైః
సదా సేవితం యస్య పాదారవిందమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||
భూమండలమునందలి రాజులందరిచే సేవింపబడు పాదపద్మములు కలవాడైననూ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో
ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||
తాను చేయు దానముల ప్రభావము వలన ఈ జగత్తు సర్వమూ కీర్తి వ్యాపించి యుండవచ్చు. గురువు అనుగ్రహము వలన ప్రపంచమందలి సమస్త వస్తువులు చేతికి వచ్చి యుండవచ్చు. కానీ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||
భోగమునందు, యోగమునందు, శ్రేష్ఠమైన ఆశ్వములయందుకాంతాకనకముల యందు అమితమగు ఆసక్తితో సంపాదిన్చియున్ననూ, గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||
 అరణ్య నివాసమునందు కానీ, స్వగృహనివాసమునందు కానీ, అర్ఘ్యాది కార్యములందునూ ఆసక్తి లేనివాడై,  అమూల్యమైన పరమేశ్వర సన్నిధానమును కోరుచున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము లేనియెడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||
సన్యాసి-రాజు-బ్రహ్మచారి-గృహస్థుడు మొదలగు వారిలో ఎవరు ఈ గుర్వష్టకమును పఠించిననూ, గురూపదేశముల మనసును మగ్నము  చేయుచో పరబ్రహ్మమును పొందును.
ఇతి శ్రీ శంకరాచార్య కృత గుర్వష్టకం సంపూర్ణం.
స్వస్తి.

Wednesday, 4 March 2020

అగ్నివృష

పటేశ్వరము-అగ్నివృష.
చత్వారి శృంగా త్రయో అస్య పాద ద్వే శీర్షే అస్ప్తహస్తసో అస్యl
త్రిధా బద్ధోవృషభో రోరతి మహో దేవో మర్త్యాన్ అవివేషll
(ఋగ్వేదము 4.58.3)
పటేశ్వరము మహారాష్ట్రములో ఉన్నది. అందలి
అర్చావిగ్రహమే ‘అగ్నివృష’. నాలుగు కొమ్ములు, మూడు పాదములు, రెండు తలలు, ఏదు చేతులు, మూడువిధములుగా బంధింపబడి యున్న వృషభ రూపుడగు అగ్నివృషుడు, లేక అగ్ని వృషభుడు అనబడు దేవతా మూర్తి మానవకళ్యానమునకై భూమిపై అవతరించినాడు. అగ్నికి 'సప్తజిహ్వుడు' సర్వభక్షకుడు' హుతవాహుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. సందర్భానుసారముగా వేదములలో ఆయన వర్ణనలు జరుగుతాయి అంతే కానీ కలకాలమూ అదే రూపములో ఉంటాడని కాదు. ఏ దేవత అయినాకూడా, వారికీ పైమాటలు అన్వయించుతాయి. వేద వర్ణనలు అక్షర సత్యములు.
కానీ సంస్కృతములోని ఆవర్ణనలనవగాహన చేసుకొని శిలకు విగ్రహరూపమును సంతరింపజేయుటకు ఇటు పరమేశ్వరానుగ్రహమో, అటు పరమేశ్వర అవతరణమో జరిగితేగాని సాధ్యము కాదు. అంతటి మహాత్తరశిల్పము ఇది.
వృషము నాన్నా వృషభము అన్నా నందిరూపమే!
‘యథా యథాహి ధర్మస్య .....’ అన్న గీతావాక్యమును అనుసరించి, గోటితో పోయేదానికి గోద్దలేన్డుకన్నట్లు ఆయా పనులు నెరవేర్చుటకు ఆయా దేవతలను భూమిపై, పరమాత్మ, అవతరింప జేస్తాడు.
స్వస్తి.                            

Monday, 24 February 2020

మాంగళ్య బలం


మాంగళ్య బలము
ఏ పాత చలన చిత్రానికో ఇప్పుడు సమీక్ష రాస్తూవున్నానని అనుకోవద్దు. పెళ్ళయిన స్త్రీకి మాంగళ్యము యొక్క ఆవశ్యకత ఏమిటి అన్నది తెలుపుట నా ఉద్దేశ్యము.
ఈ వ్యాసములో వివాహ విధివిధానాలను గూర్చి మాట్లాడబోవుట లేదు. మాంగళ్య గరిమను గూర్చి మాత్రమే నాకు తెలిసిన మేరకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను. అందుకు సంబంధిన కొన్ని విషయములను మాత్రము ప్రస్తావించుతాను. అసలు విషయము తెలియజేయుటకు ముందు, మారిపోతున్న లేక మాశిపోతున్న సామాజిక సాంప్రదాయాన్ని గూర్చి నాలుగు మాటలు తెలియజేస్తాను.
మేము యౌవ్వన దశలో ఉన్న కాలములో వివాహిత  తాళిబొట్టు, స్త్రీ యొక్క  భర్త జీవితమో లేక ఆమె జీవితమో ముగిసేవరకు, స్త్రీ గళము నుండి విడివడేది కాదు. ఆతరువాత రాత్రి సమయములో పడుకొనే సమయములో తీసి పక్కన ఉంచేవారు.
ఏనాటి అగ్రహారమొ
మానాటికి మాన్యమాయె మాపని దీరన్
మీనాటి కండ్రిగాయెను
నానాటికి తీసి కట్టు నాగంభోట్టూ !
తాళిబొట్టు మొదట తల్లడిల్లెను రాత్రి
దిండు క్రింద జేరి దిగులు పడుచు
తుదకు లాకరెక్కి దూరమై పోయెరా
రామ మొహనుక్తి రమ్య సూక్తి !

అన్నట్టు ఏకంగా Locker లోకి చేర్చివేసినారు ఆధునిక నారీమణులు, నవసమాజ శిరోమణులు. ఒకవేళ అర్దాంతరంగా భర్త పోవుట తటస్థిస్తే ఒక కొత్తవాదన తెరమీదికి తెచ్చి
మంగళ సూత్రమొకటే కదా భర్తతో బాటూ వచ్చింది మిగతవి ముందునుండినే ఉన్నాయి కాబట్టి అవి అట్లే ఉంచుకోనుటలో తప్పేముంది అని అన్నారు, అన్నది ఆచరించుతూ వున్నారు. వారి అభిమతము వారిది. కాదని, వారిని ఎవరూ తప్పు పట్టలేరు. ఇక్కడ ఒక్క మాట తప్పక చెప్పుకోవలసి వస్తుంది. నాడు భార్య భర్త అన్నది ఒక అనిర్వచనీయ సంబంధం, Switch Light చందం, ఆత్మీయతా బంధం, ఇగిరిపోని చందన గంధము. నిజమయిన మమతానురాగాలతో వర్ధిల్లిన జంటలో భర్త పోతే ఆ స్మృతులు ఆ ఇల్లాలిని వీడ తరమా! అది నిజమైతే ఈ ఆడంబరము అవసరమా! నీతి నియమాలు విలసిల్లె సభ్య సమాజములో తాళి ఉన్నా, వైధవ్యము వచ్చినా ఆ స్త్రీని అసహ్య దృష్టితో పూర్వాతి పూర్వము చూచేవారు కాకపోగా, వారి యెడల ఎంతో గౌరవముగా మెలిగేవారు. నేడు అటువంటి వాతావరణము సమాజములో, ఎక్కడో తప్ప, ఇంకా నెలకొని వుందని చెప్పగలమా!
నేటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే వైదిక ధర్మానుచరులగు సోదరీమణుల నవీనత నడినెత్తికెక్కి నాట్యము చేస్తుండగా,  మంగళసూత్రాన్ని మరచిపోయినారు. అంతేకాక నేటి సినిమాలు టీవీలు తాళి గౌరవమును దిగజార్చిదానిని ఒక ఆట వస్తువుగా చేసివేసినారు.
పతికన్న అతివకు పైపూత మెరుగాయె
పనికిమాలిన డాబు బహుళమాయె
ఇంటిలోపల వంట వంటికి బరువాయె
స్విగ్గి భోజనములు చేరువాయె
అమ్మగారింటితో అధిక బంధమ్మాయె
అత్త మామల పొత్తు అణగి పోయె
తలువ సిజేరియన్ తలమానికమ్మాయె
సహజమౌ కానుపు సమసిపోయె
మట్టియలు గాజులొక్కటై మట్టి కరచె
బట్టబయలాయె బాడీకి బట్టలేక
బొట్టు కట్టుయు మరి తాళిబొట్టు చూడ
మాడిపోయిన అట్టయ్యె మగువకిలను



ఈరోజులలో భర్తకంటే దేహ సౌందర్యానికి ప్రాధాన్యమిచ్చే, ఆచారాలకన్నా పాశ్చాత్య నాగరికతకు ప్రాధాన్యమిచ్చే, భర్త అభిష్టానికన్నా పరుల పొగడ్తలకొరకు ఎదురుచూసే మహా సాధ్విమణులు చాలామంది మనకు దర్శనమిస్తారు ముఖ్యముగా విద్యాధికులలో ఇలాంటి అనాగరికత చాల ఎక్కువగా కనబడుచున్నది. కొంతమంది భర్తలుకూడా తమకు ఇష్టములేకపోయిన గొడవలెందుకులే అని సర్దుకుని బ్రతుకుతున్నారు మగడు కట్టిన తాళి ఎగతాళిగా మారినా ఇంకా నల్లపూసలుమాత్రం ధరిస్తున్నారు ఫేషనుకోసం!

మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ ఫేస్బుక్ ఫోటోలు కూడా, ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది సక్రమమైన విధానమే అయితే మనపూర్వీకులు దీనినే అమలు పరచియుండేవారు. వారు చేసే ప్రతి పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సే తమ లక్ష్యముగా ఉంచుకొంటారు.
మాంగళ్య గరిమను గూర్చి క్షీరసాగరమధన సందర్భంలో పార్వతీ దేవి తన మాగళ్యము పై ఎంత నమ్మకను ఉంచుకొంటుందో చూడండి.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగటమన్నది  మాత పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగళ్య గరిమయట.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాl
కంఠే బాధ్నాని సుభగే త్వం జీవ శరదాంశతంll
ఇక్కడ సుభగ అన్న మాటకు ఒక పెద్ద వేదపండితుని నుండి తెలుసుకొన్న అర్థమును మీ ముందుంచుతాను.
ఆయన ‘భ’ అన్న మాటకు అభివృద్ధి అన్న అర్థమును చెప్పి దానిని సమర్థించినాడు. నభము అంటే ఆకాశము. దానికి అభివ్ర్ద్ది లేదు కదా! శుభము అంటే సు+భ ము అని. మరి శుభకార్యము ఎదయినాకూడా అభివృద్ధికే కదా దోహదము చేస్తుంది. భాగము అనగా స్త్రీ యొక్క ఉత్పత్తి స్థానము. ‘భ’ అంటే అభివృద్ధి ‘గ’ అంటే గామించుట అనగా ముందునకు సాగుట. మరి సంతానము అభివృద్ధిని తెస్తుంది మరియు వశమును పురోగామిమ్పజేస్తుంది.
సు+భగా శుభకరమైన శ్రేయస్కరమైన పురోభివృద్ధి కలిగించుదానా! అని అక్కడ సంబోధింపబడింది. మూడక్షరాల ఆ పదములో ఎంత అర్థము దాగియున్నదో చూడండి. ఇప్పుడు శ్లోకార్థము చూద్దాము.
ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.


భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాతకులు మనదేశాముపై దండయాత్రలు చేసినా  మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అంటే కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించినారో చూడండి. అందుకే ఆడపిల్ల పుడితే బాల్యంలోనే మాంగల్య తంతు జరిపించేవారు అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కానీ నా ఆలోచన వేరొక విధముగా ఉన్నది.
'అష్టవర్షాత్‌ భవేత్‌ కన్యాపుత్రవత్‌ పాలితామయా
ఇదానీం తవ దాస్యామ దత్తాం స్నేహేనపాలయం'
పూర్వము అమ్మాయికి 8 ఏళ్ల వయసులో,  రజస్వల కాకమునుపే వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయికి 4 సంవత్సరముల మొదలు 8 తేడా ఉండేది. అప్పటికి అమ్మాయి రజస్వల అయివుండేది కాదు. అందుచేత ఇరువురు ఆటపాటలలో కాలము గడిపేవారు. అందుచే ఇరువురినడుమ అనురాగము పెరిగేది. అమ్మాయి రజస్వల అయినవెంటనే అమ్మగారింట్లో ఉండిపోయేది. అటుపిమ్మట పునః సంధానము చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపేవారు. ఇరువురి నడుమ ముందే అనుబంధము ఏర్పడుతచే ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి ముదిరిన తరువాత పెళ్ళిళ్ళు చేస్తూ వున్నారు.లోతుగా ఆలోచించే అమ్మాయి తల్లిదండ్రులకు ఇందులోని అనర్థము అర్థము కాగలదు. 
మిగతది రేపు.....
మాంగళ్య బలం(చివరి భాగము)
భారతావనిలో పిండారీలుథగ్గులు వంటి కిరాతకులు మనదేశముపై దండయాత్రలు చేసినా  మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అంటే కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని ఎంతగా గౌరవించినారో చూడండి. రత్నగర్భ యగు ఈదేశమును కొల్లగొట్ట తలువని విదేశస్థులు లేరు. తరువాతి కాలములో వచ్చిన మ్లేచ్ఛులు. తురుష్కులు, యూరోపియనులు స్త్రీలను ఆటవస్తువుగా చూసినారు. అందుకే ఆడపిల్ల పుడితే బాల్యంలోనే మాంగల్య తంతు జరిపించేవారు అని పెద్దలు చెబుతూ ఉంటారు.
కానీ నా ఆలోచన వేరొక విధముగా ఉన్నది.
పూర్వము అమ్మాయికి 8 ఏళ్ల వయసులో,  రజస్వల కాకమునుపే వివాహాలు జరిగేవి. అమ్మాయికి అబ్బాయికి సంవత్సరముల మొదలు 8 తేడా ఉండేది. అప్పటికి అమ్మాయి రజస్వల అయివుండేది కాదు. అందుచేత ఇరువురు ఆటపాటలలో కాలము గడిపేవారు. అందుచే ఇరువురినడుమ అనురాగము పెరిగేది. అమ్మాయి రజస్వల అయినవెంటనే అమ్మగారింట్లో ఉండిపోయేది. అటుపిమ్మట పునః సంధానము చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపేవారు. ఇరువురి నడుమ ముందే అనుబంధము ఏర్పడుతచే ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి ముదిరిన తరువాత పెళ్ళిళ్ళు చేస్తూ వున్నారు.లోతుగా ఆలోచించే అమ్మాయి తల్లిదండ్రులకు ఇందులోని అనర్థము అర్థము కాగలదు.


మంగళసూత్రంలో ముత్యంపగడం ధరింపజేసే సాంప్రదాయం మనదిఎందుకంటేముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యంసౌందర్యంమనస్సుశాంతిఆనందములకుఅన్యోన్యదాంపత్యములకు కారకుడుశారీరకంగా నేత్రములుక్రొవ్వుగ్రంథులుసిరలుధమనులుస్తనములుస్త్రీల గుహ్యావయములునరములుఇంద్రియములుగర్భధారణప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపంకలహాలుమూర్ఖత్వంసామర్ధ్యమురోగముఋణపీడలుఅగ్నివిద్యుత్భయములుపరదూషణకామవాంఛలుదీర్ఘసౌమాంగల్యముదృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరమురక్తస్రావముగర్భస్రావముఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజగ్రహ కక్ష్య లోనికి వస్తుంది. స్త్రీకి ఆ రోజు రుతుసమయము ఆసంనమౌతుంది. ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనము కావాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదుదానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.
అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

ముత్యంపగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీరములోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగాభౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలనుదోషాలను తొలగిస్తాయని
అనుభవజ్ఞులయిన పెద్దలు చెప్పిన మాట.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యంపగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.
తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని, బాల్యము నుండియే తమ బాలికలకు మన సంస్కృతి కి తగిన కట్టుబట్టలు, వేష భూషలు సిగ్గు బిడియము నేర్పించి సంస్కారవంతులగు ఉపాధ్యాయులు గల పాఠశాలలకు పంపితే విద్యతో బాటుగా వినయము, సమయానుకూలమగు బిడియము, ధైర్యము, చతుర సంభాషణము, ఆట, పాట అన్నీ నేర్చుకొంటారు. ‘స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం, సాహసం షడ్గుణం’ అన్నారు పెద్దలు. పాశ్చాత్య అనుకరణలకు ఇకనైనా తలయొగ్గకుండా మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. ఈ రోజు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించకపోతే, వారు, వారి పిల్లలకు నేర్పించుటకు ఏమీ వుండదు.అందుకే  మన ధర్మము యొక్క విశిష్ఠతను పిల్లలకు, అర్ధమయ్యే వరకు తెలియపరుద్దాం. ప్రతిఒక్కరూ మీ మీ కుటుంబముల నుండియే నాంది పలకండి. 
చినుకు చినుకు చేరి చిన్న కాలువయౌను
కాల్వలెల్ల కలియ కలుగు నదులు
కలసియట్టి నదులు కడలియౌ గమనించు
రామమోహనుక్తి రమ్య సూక్తి
ప్రేమవివావాహాల కన్ననుతల్లిదండ్రులుఅనురూపుడైన వరుని నిర్ణయించి ధారాదత్తముగ వివాహమొనర్చు విథియే "ఏకక్రియాద్వ్యర్థకరీబభూవ" యను విధి ప్రకారము ఈ లోకమున కీర్తికరము పరలోకమున ముక్తి ప్రదమని పెద్దలవలన శాస్త్రధర్మముల ననుసరించియు గుర్తించిన వారు గనుక భారతీయులైన సనాతన ధర్మ పరాయణులెల్లరు సత్సాంప్రదాయముగ భావించిన వారై తమ పుత్రులకు పుత్రికలకుకులానుక్రమముగ నీ ధర్మమును విధిగ ననుసరించుచున్నారు.
కన్యాదానంతు సర్వేషాందానానాముత్తమం స్మృతం" అను రీతిని తమకులమునకు సాంప్రదాయమునకు జెందిన వరునకు యథాశక్తిని అలంకరించిన కన్యను దానము అనగా బ్రాహ్మవివాహ రూపమైనధారాదత్తముగ యధా శాస్త్రానుసారము వివాహము చేసినచో సమస్త దానములకన్నా నీ కన్యాదానముత్తమోత్తమమైనదిగా రాణించగలదు.
ధర్మార్థ కామ మోక్షదాం దారాః సంప్రాప్తి హేతః
పరీక్ష్యన్తే ప్రయత్నేన పూర్వమేవ కరగ్రహాత్‌"
అను ధర్మాన్ని పురష్కరించుకొని ధర్మము అర్థము కామము మోక్షణము అను నాల్గు పురుషార్థములకు కారణభూతురాలుగ నేర్పడి వంశమునకు కీర్తిప్రతష్ఠతీను వంశాభివృద్థిని చేకూర్చదగు సమర్థురాలుగ మున్ముందు కాదగియున్నదిగాన కన్యను సర్వవిథములా పరిశీలించివివాహమునకు తగిన కన్యకయని నిర్ణయించుకొనిన యనంతరమే వివాహము నిశ్చయించుకోవలయును.
వివాహములలో ఆలస్యము జరుగుకొద్దీ మామిడి పళ్ళకొరకు మామిడి తోటకు కాపు బండ్లలో బజారుకు వెళ్ళినతరువాత పోవడము వంటిది. అప్పుడు ఆ తోటలో పనికి వచ్చే పళ్ళను, పట్టుమని, పది కూడా చూడలేము.

స్వస్తి.