Wednesday, 15 February 2023

గాయత్రీ మంత్రము

 గాయత్రీ మంత్రము

https://cherukuramamohanrao.blogspot.com/2023/02/blog-post_15.html

'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదేవతా'       

గాయత్రీ మంత్రమును  గూర్చి తెలుసుకొనుటకు ముందు మంత్రము అంటే ఏమిటో తెలుసుకొందాము.

త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి.

మకారం మననం ప్రాహుః త కారః త్రాణ ఉచ్యతేI

మననః త్రాణసంయుక్తో మంత్రః ఇత్యభి ధీయతే II

అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును అని నుడివినారు. మంత్ర సాధన రెండు విధములు. 1. వయమాచారము 2. శిష్ఠాచారము. వయమాచారము మనకు వర్జితము.  శిష్ఠాచారము మనకు శిరౌధార్యము. ఇందు కొన్ని విధివిధానాలు కొన్ని కట్టుబాట్లు వుంటాయి. మంత్రమును గురు ముఖతః గ్రహించవలసి వుంటుంది. కొన్ని మంత్రములకు యజ్ఞోపవీత ధారణము తప్పనిసరి. మంత్రముల  ఉచ్చారణ నిర్డుష్ఠతను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. మంత్రమననమునకు నిషిద్ధ ప్రదేశములు  నిషిద్ధ సమయములు వుంటాయి. అనుష్ఠాత అది మరువగూడదు. వెంటనే మరి అది ఒక వర్గానికే చెల్లుతుందా లేక చెందుతుందా అంటే  కాదు అన్నదే జవాబు. యజ్ఞోపవీత ధారణ బ్రహ్మక్షత్రియ వైశ్యులకు వుంటుంది. రెడ్లు, కాపులు, కమ్మలు కూడా రాజ్యాలేలినవారే! ఒకానొక కాలములో యజ్ఞోపవీత ధారణ చేసి మంత్ర సాధనతో అభీష్ట సిద్ధి పొందినవారే! మిగిలిన వారిలో కూడా యజ్ఞోపవీతధారులు వున్నారు కానీ నేడు అందరి దారులూ మారిపొయినాయి. అందుకే దేహము సందేహములతోనిండి సతమతమౌతూ ఉన్నాము. ఎవరైతే శూద్రులుగా వర్గీకరిమ్పబడి సమాజ శ్రేయో స్సుకు తొలిసంధ్య నుండినే సమాయత్తమౌతూ ఉంటారో వారి అభ్యున్నతి చూసుకోనవలసిన బాధ్యత బ్రాహ్మణ వర్గమునకు చెందుతుంది కానీ ఆ బ్రాహ్మణులలో అత్యధిక శాతము వేదచోదిత బాధ్యతా విముక్తులయి హీనస్థితికి చేరుకొన్నారు. అందుకే నేటికీ కొందరు మహనీయులు లలితా సహస్రము, విష్ణు సహస్రనామము, కృష్ణాష్టకము, నామ రామాయణము,ఆపదుద్ధారక స్తోత్రము  కనకధారాస్తవము మున్నగు ఎన్నో స్తోత్రములను సకలజన సమాజమునకు సానురాగముతో సమర్పించినారు. ఇవి తాకరు కానీ అవే కావాలంటారు. ఒక బ్రాహ్మణుడు, మాటవరుసకు గాయత్రిని అనుష్టించుచున్నాడంటే, అది కేవలము తనకొరకు మాత్రమే కాదు సమస్త జనుల శ్రేయస్సు కోరుతూ చేస్తున్నాడు. తన అనుష్టానము మను ‘సర్వే జనాః సుఖినోభవంతు’ అనే ముగిస్తున్నాడు. అదీ ఈ వైదిక ధర్మము యొక్క గొప్పదనము.

ఇక గాయత్రీ మంత్రమును గూర్చి తెలుసుకొందాము. మంత్రమును ప్రత్యేకముగా వ్రాయుట లేదు. వివరణలో అంతా తెలుస్తుంది కాబట్టి.

న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వచనము అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము ‘గయ’ మరియు ‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉన్నది. “గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ” అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించినారు. ‘గయలు’ అనగా ప్రాణములు అని అర్థము. ‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.

'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది అని విబూదహాజనుల మాట. 

 'గయాన్ త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే  సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి.

గాయంతం త్రాయతే యస్మత్ గాయత్రీ త్యభిధీయతే" (నిరుక్తము) గానం చేసేవారిని కాపాడేది గాయత్రి. ఇక్కడ గాయంతం అనే మాట పాట పాడుట అనే అర్థంలో వాడలేదు. భక్తిశ్రద్ధలతో సుస్వరంగా ఉచ్చరించడం అన్న అర్థంలో వాడబడింది. గాయత్రిని ఈవిధంగా జపించినవారు రక్షించబడతారు. వీరేకాదు వినేవారుకూడా ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఈ మంత్రాన్ని గురించి వేదములు "గాయత్రీం ఛందసాం మాతా!” అంటూ స్తుతించినాయి. ఈ మంత్రమును జపించుటకు పూర్వము అపరమూ కూడా, ఆచరించే వ్యక్తి అనుష్ఠించే, విధులు కొన్ని వుంటాయి. అన్నీ కలిపితే అది సంధ్యావందనమౌతుంది. ఇది ప్రొద్దున మధ్యాహ్నము సాయంకాలము మూడు పూటల ఆచరించవలసియుంటుంది. ఎందుకు అన్నది తరువాత విశ్లేషించుకొందాము.

వరదాభయహస్తాలతో... సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆది శంకరులు అనంతశక్తి స్వరూపముగా అభివర్ణించినారు. ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగానూ, సాయంసంధ్యలో సరస్వతి గానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతమవుతుంది. పాలు నేయిగా పరివర్తన చెందినట్లు, పుష్పముల మధువు, మకరందముగా మారినట్లు, ప్రభాకరుడు ప్రజావాహినికి ప్రకాశమైనట్లు, గాయత్రీ మంత్రము సర్వవేద సారమై శోభిల్లుతూ వుంది.

ఈ మంత్రమును ఋగ్ యజుస్ సామ వేదములనుండి ఒక్కొక్క పాదము గైకోనబదినట్లు పెద్దలు చెబుతారు. మరి మూడు పాదములే అయినాయి కదా అంటే నాలుగవ పాదము అధర్వణ వేదములో వుంది. దీనికి మరొకసారి యజ్ఞోపవీత ధారణా చేయవలసి వుంటుందని శాస్త్రవచనము.

ప్రతి దినము త్రి సంధ్యలలో ఉపాసింపబడే దేవత గాయత్రీమాత. సకల వేదసార సర్వస్వమే గాయత్రీ మంత్రం. త్రిమూర్త్యాత్మక స్వరూపం గాయత్రీ తత్వం. గాయత్రి, సావిత్రి,  సరస్వతి త్రిముర్త్యాత్మక స్వరూపం. అంటే ఉదయము గాయత్రిగానూ, మధ్యాహ్నము సావిత్రిగానూ, సాయంత్రము సరస్వతిగానూ ఆదివ్యశక్తి భాసిల్లుతుంది. దేహేంద్రియములను కాపాడునది గాయత్రి. ప్రాణశక్తిని పోషించునది సావిత్రి. ప్రజ్ఞాశక్తిని ప్రకటింపజేయునది సరస్వతి. ప్రజ్ఞాశక్తి  ప్రాణశక్తిని, ప్రాణశక్తి జడమైన దేహమును చైతన్యవంతం చేస్తుంది. గాయత్రీ మంత్రోపాసన దేహ, ప్రాణ, ఆత్మ శక్తులను ప్రచోదనము చేస్తుంది.  అసలు ఈ ‘నీవు’ లో మూడు మూడు రూపాలు వున్నాయి అని పుట్టపర్తి సాయిబాబా వారు చెప్పేవారు. అవి (వారి మాటలలోనే)

********1.      The one who think you are

2.    The one others think you are

3.    The one really you are

ఇందులోని మూడవది తెలుసుకోవలేనంటే మొదటి రెండూ తెలుసుకొంటే మూడవది సాధించ వీలుపడుతుంది. దీనికి సులబహమగు మార్గమును కూడా వేదవ్యాసులవారు మనకు తెలియజేసినారు.

అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం

పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం

ఈ గాయత్రి చేయుటకు వలసిన విధివిధానములు పాతిన్చుటకు కష్టమయినవారు ఉపకారము చేయడము, అపకారము చేయకపోవడము చేస్తూ పోతే గాయత్రీ మంత్రఫలితము నిన్ను ఆవర్న్చియే వుంటుంది.నీకోసం చేసే వాళ్ళు నీకు తెలియకుండానే ఎంతోమందివున్నారు. ఇక మంత్రమును గూర్చి తెలుసుకొందాము.

ఈ మంత్రములో "ఓం" అనేది "ప్రణవము", భూః భువః సువః అనునవి  ప్రణవమంత్రపు విపులమైన వ్యాహృతులు. ఇవి దివ్యశక్తిని కలిగిన పదములు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. ప్రతి దినము త్రి సంధ్యలలో ఉపాసింపబడే దేవత గాయత్రీమాత. సకల వేదసార సర్వస్వమే గాయత్రీ మంత్రం. త్రిమూర్త్యాత్మక స్వరూపం గాయత్రీ తత్వం. గాయత్రి, సావిత్రి,  సరస్వతి అన్నది ఈ త్రిముర్త్యాత్మక స్వరూపం. అంటే ఉదయము గాయత్రిగానూ, మధ్యాహ్నము సావిత్రిగానూ, సాయంత్రము సరస్వతిగానూ ఆదివ్యశక్తి బాసిల్లుతుంది. దేహేంద్రియములను కాపాడునది గాయత్రి. ప్రాణశక్తిని పోషించునది సావిత్రి. ప్రజ్ఞాశక్తిని ప్రకటింపజేయునది సరస్వతి. ప్రజ్ఞాశక్తి  ప్రాణశక్తిని, ప్రాణశక్తి జడమైన దేహమును చైతన్యవంతం చేస్తుంది. గాయత్రీ మంత్రోపాసన దేహ, ప్రాణ, ఆత్మ శక్తులను ప్రచోదనము చేస్తుంది. సూక్ష్మస్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులను, అంటే శరీరం, మనస్సు, ప్రాణం అనే మూడు స్థితులలోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.

"తత్" నుండి మిగిలిన మంత్రాన్ని "సావిత్రి" అని అంటారు. సవిత అన్న పదమునుండి సావిత్రి వచ్చింది. సవిత అంటే ‘సూయతే అనే నేతిసవితా’ - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత.  'సవితా అనగా స్రవించుట అనే అర్థము కూడా కలదు. కనుక గాయత్రిని స్త్రీ స్వరూపముగానే  ధ్యానిస్తాము. 

మనుస్మృతి 'త్రిభ్య ఏవతు వేదేభ్యః పాదమ్ పదమదూదుహమ్” అని చెబుతుంది. అంటే గాయత్రి ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం నుండి గ్రహించబడినదన్నమాట.  సంధ్యావందనం విధిగా సకాలంలో చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చినారని చెప్పబడి ఉంది. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్రామాయణమును రచించినారు. ఇక మంత్రము ఏమి చేబుతూవుందో చూస్తాము:

    ఓం - శబ్ద బ్రహ్మము,ప్రధాన బీజాక్షరం సృష్టికి ఆధారమైన బ్రహ్మ. పరబ్రహ్మకు ప్రతీక. 
     భూ - స్థూల జగత్తు, భూలోకము, ఉత్పత్తికి ఆధారభూతమైనది.
     భువ - సూక్స్మజగత్తు, భూ స్వర్గముల మధ్య లోకము - అనంత సూర్య చంద్ర తారలలో నిండియున్న ఆకాశము అనగా విశ్వము.
     సువ - స్వర్గలోకము, కారణ జగత్తు. 
     తత్ - బ్రహ్మపదార్థము, శాశ్వ్తమైన సత్ (అంటే యావత్ సృష్టికీ మూలమైన ఆ)     

    సవితుర్ -  సూర్యునిలో నిండియున్న తేజోపుంజముల ప్రకాశము 
     వరేణ్యం - శ్రేష్టమైనది 
     భర్గ - జ్ఞానతేజస్సు (అట్టి శ్రేష్టమైన ఆ జ్ఞాన తేజస్సును)
     దేవస్య ధీమహి - దైవముగా నెంచి మేము ధ్యానించెదము,
     య:  - ఆ తేజస్సు
     న:  - మా యొక్క  
     ధియో - బుద్ధులను,
     ప్రచోదయాత్  (సర్వదా) ప్రేరేపింపజేయుగాక!  

గాయత్రీ మాతకు 5 ముఖములు అవి గాయత్రీ మాత ధ్యాన శ్లోకములో ఈ విధముగా తెలుపబడింది.

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః

యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం

గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం

శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే

సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త,(ముత్యము) విద్రుమ(పగడము), హేమ(బంగారు), నీల(నీలము), ధవళ(తెలుపు రంగు) వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, కపాలము, గద, అంకుశం ధరించి వరదాభయ హస్తముతో దర్శనమిస్తుంది. ఈ శ్లోకముతో అందరూ ఈమెను ధ్యానిస్తే  సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. ప్రతి రోజూ ఈ ద్జ్యాన శ్లోకము చాలు యజ్ఞోపవీతము వేసుకోనవసరము లేదని వేదము చెప్పిన వారికి. అదే వేసుకొమ్మని వేదమునందు చెప్పబడీ వీసుకొని వారికి రౌరవాది నరక ప్రాప్తి అనికూడా ధర్మశాస్త్రము చెప్పింది.

అసలు ఈ ఐదు ముఖములు వేరేమో కాదు పంచభూతములే! సూర్యుని యొక్క 5 ప్రదానాంగములే!సర్వత్ర గాత్రస్య శిరం ప్రధానం అన్నది శాస్త్ర వచనము. అంటే ఈ 5 భూతములు అంటే పృథివీ, నీరు, వెలుగు(సూర్య చంద్రాగ్నులు కలిపి, అసలు అవే అమ్మవారి మూడు కన్నులు), వాయువు, ఆకాశము. ఇక అమ్మవారు సహస్ర కమలములో కూర్చుని ఉంటుంది. ఆ సంకేతమును గూర్చి ఒక్కమాట చెప్పుకొందాము. సంస్కృతములో సహస్రము అన్మ్న పదమునకు అనంతము అన్న అర్థము కూడా వుంది. పురుష సూక్తములో ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్ర పాద్’ అని చెప్పుకొంటాము కదా! అక్కడ ఈ ‘సహస్ర’ అన్న పదమునకు అనంతము అని అర్థము. ఇక ఉదయార్కుని రంగు కమలముతో పోలిక కిరణములు రెక్కలు. ఒక కమలములో రెక్కలు పద్మము యొక్క మధ్యలో వున్నా పీఠమునకు కట్టుబడి ఉంటాయి. దీనిని సామాన్య భాషలో దుద్దు అనుట కూడా కద్దు. కావున అమ్మవారు ఈ అనంతదల పద్మ పీఠమును అధీష్టించి యుంటారు. సూర్యుని వెలుగు అణువులతో నిండియున్నది అన్నది, సూర్య కిరణములు వక్రగతిన పయనించుతాయి అన్నది నాడు వేదము నేడు Science చెప్పిన మాట. అంటే ఇవి మనలను చుట్టుముట్టి యుండుటచేతనే మన బుద్ధిని సవిత్రుడు ప్రచోదనము అంటే పురోగమింప జేస్తూ వున్నాడు.

ఈ క్రింది మాటతో ఈ వ్యాసమునకు భరత వాక్యము పలుకుచున్నాను.

ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త Dr. Howard Steingeril, ప్రపంచవ్యాప్తంగా సేకరించిన మంత్రాల అర్ధమును, వాని

 శక్తులను పరీక్షించిన పిదప గాయత్రీ మంత్రమును గూర్చి “గాయత్రి మంత్రము సెకనుకు 1,10,000 ధ్వని తరంగాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రము. ఇది ఒక ప్రత్యేకమైన ధ్వని లేదా ధ్వని తరంగాల కలిగి, నిర్దుష్ఠమగు ఆధ్యాత్మిక సామర్ధ్యములను అభివృద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నది.అని ఈ విధముగా తెలియజేసినారు, అని కొందరు వ్రాసినారు కానీ నాకు సాధక పూర్వకమైన సాక్ష్యము లభించలేదు. అదే విధంగా  1/2 MV2ను గూర్చి:

 “They also noticed that the infinite mass of galaxies moving with a velocity of 20,000 miles/second was generating a kinetic energy = 1/2 MV2 and this was balancing the total energy consumption of the cosmos. Hence they named it Pranavah, which means the body (vapu) or store house of energy (prana).” “The total kinetic energy generated by the movement of galaxies acts as umbrella and balances the total energy consumption of the cosmos. Hence it was named as the Pranavah (body of energy). This is equal to 1/2 MV2 (Mass of galaxies x velocity2).

పై రెండు విషయములకు  ఆధారపూర్వకమగు అనుబంధములు లేనందున అంతగా నమ్మవలసిన అవసరము లేదని నా మనోగత అభిప్రాయము. భవిష్యత్తులో దీనిని ఎవరైనా నిరూపించవచ్చునేమో? అంతవరకు మనము ఇటువంటి విషయములపై అవగాహన లేకుండా వ్రాయుట సబబా అన్నది నా అనుమానము. ఏది ఏమైయినా మన పూర్వుల గొప్పదనమును తెలుపుటకు ఈ ప్రయోగముల అవసరము కలుగదు. నాటి మహనీయులకు తమ యోగ శక్తితో తాము ఎరిగినది తెలుపుట తప్ప వేరేటువంటి హీనమగు ప్రయత్నమూ చేసినవారు కాదన్నదానికి వారి ఋజుప్రవర్తనే సాక్ష్యము. నేటి Scientists బహుశ భవిష్యత్తులో నిరూపించుతారేమో!

శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే’ ఓం శాంతి శాంతి శాంతిః.

స్వస్తి.

 Ramachandra Rao Bhandaru

గాయత్రి మంత్రాన్ని గురించి మీరు రాసిన వివరణాత్మక వ్యాసం ,ఆ మంత్ర ప్రాశస్త్యం పూర్తిగా తెలవక పోయినా , ఉదయం పూజలో పఠించే మాలాంటి వారు తప్పక చదవవలసిన వ్యాసం .

ఋగ్వేదం లో ,శంకరాచార్యుల వారి భాష్యం లో కూడా ఉదాహరించిన ఈ పవిత్ర గాయత్రి మంత్రం యొక్క శాస్త్రీయ దృక్పధం ను గురించి Dr Howard గారి వివరణను మీరు చక్కగా వివరించారు .

గాయత్రి మంత్రం లోని ప్రతి అక్షర ప్రాముఖ్యం చాలా బాగా వివరించారు .ధన్యవాదములు .

పై అభిప్రాయమును తెలియజేసినవారు భారతీయ రాష్ట్ర వార్డుషి (SBI) సర్వవిషయాధీశ   (Chief General Manager ) పదవినలంకరించి ప్రస్తుతము విశ్రాంత జీవితమును గడుపుచున్నారు.

 

 

Tuesday, 14 February 2023

కాలకాలుడా కావుమయ్య

 

కాలకాలుడా కావుమయ్య

https://cherukuramamohanrao.blogspot.com/2023/02/blog-post_14.html

సీసపద్యమునకు ప్రాస నియమము లేదు.   ‘ఇంద్రగణములారు ఇన గణమ్ములు రెండు’ అనుటచే సీసమునకు నాలుగు పాదములే అని తెలియవచ్చుచున్నది. అయినా ఈ క్రింది సీసములో ‘ర్ణ’ అన్న, నాశక్తికి ఒక దుష్కరమైన, ప్రాసతీసుకొని. మామూలుగా నాలుగు పంక్తులను ఎనిమిదిగా వ్రాసే సాంప్రదాయమును పాటిస్తూ, ఎనిమిది పంక్తులలోనూ ‘ర్ణ’ ను ప్రాసగా తీసుకొనుట జరిగినది. ఇది పరమేశ్వరానుగ్రహమనే నా ప్రగాఢ విశ్వాసము.

భావము: నీ కథలు అమృత తుల్యములు. మాటలకు అందని వ్యక్తిత్వము నీది. వరములిచ్చుటలో కల్పవృక్షమును మించిన వాడవు. ఆచెట్టు పర్ణఛాయలో నన్నుండనివ్వు. విధి బాధలనెడు ఉలి సమ్మెటల బారి నుండి నన్ను గట్టెక్కించు. బాల్యము లో బుద్ధి రాలేదు. యౌవ్వనము క్రొవ్వువల్ల కళ్ళు కనిపించలేదు. మృత్యువుకు చేరువైన పిదప నీ ప్రాధాన్యత తెలియవచ్చింది. అయ్యా నన్ను కాపాడు.

కర్ణామృతం బైన  కథల కారకు డీవు

వర్ణాల కందని వస్తు వీవు

వర్ణనా తీతమౌ వర భూరుహము నీవు

పర్ణ ఛాయల నీదు  బరగ నివ్వు

జీర్ణ మైతిని విధి చీర్ల సమ్మెట పోట్ల

చూర్ణమై పోనట్లు చూడుమయ్య

కీర్ణుండ జర చేత  శీర్ణుండ బ్రతుకనే

ఆర్ణవం దాటించు పూర్ణ పురుష

బాల్య మందున బుద్ధి నే బడయనైతి

యౌవ్వనపు క్రొవ్వు తోడ నిన్నరయనైతి

కాలునకు చేరువగు నెడ కలిగె బుద్ధి

కాలకాలుడ  కావుమా కరుణ తోడ



Tuesday, 7 February 2023

శ్రీ రామ రామ రామేతీ ...

 

శ్రీ రామ రామ రామేతీ ... 

https://cherukuramamohanrao.blogspot.com/2023/02/blog-post.html

శ్రీ రామ రామ రామేతీ......

ఈవిషయముమీకుతెలిసినదే!

శ్రీరామ రామ రామేతీ రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే

'ఒంనమో నారాయణాయ' అన్నఅష్టాక్షరిలో 'రా' ఐదవఅక్షరము. అదే'నమశ్శివాయ' అన్నపంచాక్షరిలో 'మ' రెండవఅక్షరము. 5x2=10 . అదే మూడు మార్లయితే  

10 x10 x 10 =1000 . కావున 'రామ' అని మూడు మార్లంటే 1000 మార్లన్నట్లవుతుంది. ఇంకొక విధంగా 'యరళవ'  లో'ర' రెండవఅక్షరము.' 'పఫబభమ'  లో 'మ' ఐదవ అక్షరము. ఈవిధముగాకూడా 5x2=10.

అంతటి మహనీయత దాగివుంది రమ్యమైన ఆ  రామ నామములో!

రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేధసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 

మనసును రమింప జేసేవాడు, సర్వదా సకల శుభములనూ సమకూర్చే వాడు, పరబ్రహ్మ స్వరూపుడు, రఘువంశ తలమానికమైనవాడు, సీతా మహా సాధ్వి పతి యైన శ్రీ రామ చంద్రునికి నమస్కారము. 

రామాయణమును అంతరార్థముతో పరిశీలించక పోతే అంతా రాద్ధాంతమే అనిపిస్తుంది.

రామాయణము మహాకావ్యము. వ్రాసిన మహనీయుడు అటు బ్రహ్మచే ఇటు నారదునిచే అంతటి మహా కావ్యమును వ్రాయ నీతడు మాత్రమే సమర్థుడు అని అనిపించుకున్న వాడు. మరి నాయకుడూ స్వయముగా పరమాత్ముడే! పరమాత్మ నాయకుడైతే పరదేవతయే నాయకురాలు. ప్రతి నాయకుడు అకుంఠిత శివపూజా తత్పరుడు. వనచరుడై భార్యా వియోగియైన రాముని సైన్యము వనచరులే. కష్టములో సుఖమును గుర్తించి మనకు మార్గ నిర్ధేశము చేసిన మహా మనీషి. ఈ మాట ఎందుకన్నానంటే ఆయన తన నేనాడు దైవముగా ప్రకటించుకొన లేదు. ఇంకొక ముఖ్యమైన విషయమును గమనించండి.

ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో "రామావతారం'' పూర్ణావతారము. జన్మబంధాలులేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి, శ్రీరామునిగా సర్వలోకాలకూ ధర్మపథావలంబకుడై ఇదీ "రామాయణం'' అని చాటి చెప్పినాడు. అంటే రాముడు నడచే దారి ఇదే అని చెప్పినాడు. ఆయనము అంటే గమనమనియే కదా అర్థము. 

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ! 

రాజా సర్వస్య లోకస్య దేవానా మఘ వానివ !

అరణ్యకాండ లోని ముప్పయ్యేడవ సర్గ లోని పదమూడవ శ్లోకమిది. 

దీనిని మారీచుడు రావణునికి చెబుతాడు. రాముని గూర్చి రావణుడు తప్పుగా మాట్లాడబోతే దానికి అంగీకరించక ఆతనికి మారీచుడు ఉపదేశము చేస్తాడు. “రాముడు వేరెవరో కాడు ఆయన మూర్తీభవించిన ధర్మము. ఒకరి జోలికి పోయి వారికి కష్టము కలిగించని సాదువు, సత్యనిష్ఠ కలిగినవాడు, అత్యంత పరాక్రమవంతుడు. దేవతలకు ఏవిధముగానైతే ఇంద్రుడు అధిపతియో అంటే ఎవరి ఆదేశము దేవతలకు శిలాశాసనమో అదే విధముగా శ్రీరామచంద్రుడు సమస్త లోకములకూ ప్రభువు.” అని చెబుతాడు. తనను చంప దలచిన శత్రువునే ప్రశంశించినాడంటే రామునికి అంతకు మించిన యోగ్యతా పత్రమును ఊహించ గలమా! ఆతడు రాముని కాలము నాటి రక్కసుడు. రాముని చే దెబ్బ తిన్న వాడు. అతనే ఆమాట అంటూ వుంటే, ఇప్పటి మిడి మిడి జ్ఞానము గలిగిన శత్రువులు చేసే దుర్వ్యాఖ్యానములు చిన్న చాకు చేత బూని సింహాన్ని ఎదుర్కొనుట లాంటిదే! ధర్మ మూర్తి అన్న మాటకు, ఇక్కడ కొంత వివరణ మీకు నేను అందిస్తాను, కాస్త ఆలకించండి. రామాయణము ఏడు కాండల ఇతిహాసము. 1. బాల కాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్య కాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరాకాండ, 6.యుద్ధకాండ, 7. ఉత్తరాకాండ.

మిగిలిన కొంత మళ్ళీ.....


శ్రీ రామ రామ రామేతి -- 2

ఇందులో మొదటి కాండ అంతా దేవతలు వస్తారు. ఆయన దేవతాధర్మము తెలిసినవాడు కాబట్టి, రెండవ కాండ అంతా మానవులు అందుకే ఆయన మానవ ధర్మ యుతముగా నడచుకొని తండ్రి మాట జవదాటక, అటు వివాహ విషయమున గానీ ఇటు వనవాస గమనమున గానీ తండ్రి మాట జవ దాటడు. అరణ్య కాండలో ఋషి ధర్మమును పాటిస్తాడు. ఎందుకంటే అక్కడ అంతా ఋషులే ! అందుకే వారి అభిమానమును అమితముగా చూరగొని ఎన్నో అద్భుత శస్త్రాస్త్రములను మరియు వారి ఆశీర్వాదములను, అనుగ్రహమును అందుకుంటాడు. తరువాతది కిష్కింధ కాండ. ఇందులో అందరూ వానరులే. వానర ధర్మము నెరిగిన వాడు కాబట్టి అటు వాలిని చంపుట లో కానీ, సుగ్రీవునితో మైత్రి సల్పుటలో గానీ, హనుమంతుని ఆత్మీయునిగా తలచుటలో గానీ, కామము చె కళ్ళు కప్పబడి నపుడు సుగ్రీవుని లక్ష్మణుని ద్వారా నిగ్రహించుటలోగానీ వానర ధర్మము ననుసరించియే నడచుకుంటాడు. ఇక సుందరాకాండ. సుందరాకాండ లో తన వలె రాక్షస ధర్మమును సంపూర్ణముగా ఎరిగిన హనుమంతుడు లంకకు పోవు విధముగా ఏర్పాటు చేస్తాడు తన కుశాగ్ర బుద్ధితో శ్రీ రాముడు! ఇక యుద్ధ కాండలో యుద్ధ ధర్మము సంపూర్ణముగా తెలిసినవాడు కావున రెండవ రోజు యుద్ధములో విగత శస్త్రాస్తుడైన రావణుని ఆయుధ సమేతుడై ఆవలి రోజు రమ్మని చెబుతాడు. మిగిలినది ఉత్తర కాండ. ఇందులో రాజ ధర్మమును, బాంధవ్య ధర్మమును ఎంతగా ఎరిగిన వాడో అన్నది మనము శ్రీరాముని యందు చూస్తాము. లోకాపవాదముచేత రాజుగా గర్భవతి యైన సీతను రాజ ధర్మము ననుసరించి బహిష్కరించ వలసి వచ్చినపుడు ఒక భర్తగా, ఒక కాబోయే తండ్రిగా యోచించి ఆమెను వాల్మీకి ఋష్యాశ్రమమునకు దగ్గరగా దిగ విడువమంటాడు లక్ష్మణుని. ఏమిటి కారణము. అది సుందర వనము. అందు వాల్మీకి ఋషి వాటిక. ఒకవైపు ప్రకృతి రామణీయకము మరొకవైపు

సాదు వర్తనము, సచ్ఛీలము, నిరాడంబరము, మానసిక నియంత్రణము, మరియు బోధనానుకూలమైన వాతావరణము. అందుకే కుశీలవులు తండ్రిని మించిన తనయులై ఆరితేరినారు. ప్రతి కాండ లోనూ శ్రీరామ చంద్రుని ధర్మ స్వరూపము మనకు ద్యోతకమౌతూ వున్నది. పై పెచ్చు రావణ సంహారానంతరము స్త్నాతయై దివ్య వస్త్రాభారనాలక్రుతయై వచ్చిన సీతను ఇంత కాలము నీవు పర పురుషుని పంచలో వున్నావు. నీ పరపురుష వ్యామోహము వుంటే సుగ్రీవునో విభీషణునో వివాహము ఆడమంటాడు. ఎందుకో తెలుసా? ఆమె, స్వర్ణమృగార్థము రాముడు వెడలి మారీచుని మోసమునకు గురియైనపుడు వెంటనే రాముని సహాయమునకు పొమ్మంటుంది సీత లక్ష్మణుని. ఆయన వద్దని వారించుట చె ఆమె నానా దుర్భాష లాడుతుంది ఆయనను. అది గుర్తుంచుకున్న రాముడు ఆత్మీయుల ములుకుల వంటి పలుకులు ఎంత గాయము చేస్తాయో సోదాహరణముగా ఆమెకు తెలియజేస్తాడు.

ఇంకొక కోణమును చూద్దాము.

శ్రీరమ సీతగాగ, నిజసేవకబృందము వీరవైష్ణవా

చార జనంబుగాగ, విరజానది గౌతమి గాగ, వికుంఠము

న్నారయ భద్ర శైల శిఖరాగ్రము గాగ, వసించు చేతనో

ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ! కరుణాపయోనిధీ! 

తాను శ్రీరామ భ్రుత్యుడై తనకు శ్రీరామునే భ్రుత్యునిగా చేసుకున్న కంచెర్ల గోపన్న అనబడు రామదాసు చెప్పిన మాట ఇది. భక్తుడైన గోపన్న చెప్పినా తానెక్కడా పరమాత్ముడినని చెప్పుకొనని తత్త్వము శ్రీరామ చంద్రునిది. ఆయన భగవంతుడన్నది భక్తులకు అనుభవములోనికి రావలసినదే కానీ తానెక్కడా ఆయనప్రకటించుకోడు. తాను మానవ మాత్రుడుడినని మనకు నిముసనిముసమూ జ్ఞాపకము చేస్తాడు. ఆయనకు తండ్రి మాటే శిరౌధార్యము. అది మానవ ధర్మమూ. మరి రాముడు ధర్మ విగ్రహకుడు కదా! విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి . వసిష్ఠుడు బ్రహ్మ ఋషి. రాముని అవతార ప్రయోజనము తెలిసిన మహనీయులు వారు. అందుకే రాక్షస దౌష్ట్యమును అరికట్టి యజ్ఞ క్రతువును కాపాడుటకు రాముని కోరుతాడు విశ్వామిత్రుడు. కేవలము 

పుత్రవాత్సల్య పరుడైన సాధారణ మానవుడగు దశరథునికి నచ్చ జెప్పు నపుడు కావాలంటే తన గురువు, బ్రహ్మర్షి అయిన వసిష్ఠుని సలహా తీసుకోమ్మంటాడు విశ్వామిత్రుడు. వసిష్ఠుడు విశ్వామిత్రుని ప్రశంసించుతూ రాముని పంపమంటాడు. దశరథుడు రాముని అనుమతించిన తరువాతనే రాముడు విశ్వామిత్రునితో కదలుతాడు. 

పుత్రా ధర్మమును చూడండి. తాటకిని విశ్వామిత్రుడు చంపమన్నపుడు గూడా ఆయన ఆమె స్త్రీ యని తలంపక విల్లు ఎక్కు పెట్టె లోపల విశ్వామిత్రుడు “ రామా ఆమె స్త్రీ యని సంశయింపక విల్లెక్కు పెట్ట మంటాడు. అందుకు రాముడు విశ్వామిత్రునికి తన తండ్రి మాట గుర్తు చేస్తాడు. ఆయన తో రాముడు ఈ విధముగా అంటాడు “ ఋషివరేణ్యా మా తండ్రి మమ్ము మీతో పంపునపుడే మీరు చెప్పినట్లు నడచుకొమ్మన్నారు. వారి యాజ్ఞ మీ వాక్కు నాకు శిరౌధార్యమంటాడు రాముడు. రాముని గుణ మెరిగిన వాడు కావున యాగ సంరక్షణము ముగిసిన పిదప సీతా స్వయంవర విషయమును తెలుపక మిథిలలో జనకుడు నిర్వహించే మహాయజ్ఞమునకు పోదామని బయలుదేరా దీస్తాడు. గుర్వాజ్ఞ మేరకు రామ లక్ష్మణులు ఆయనతో బయలుదేరుతారు. మిథిల చేరిన పిదప జనకునితో “ మా రామునికి మీ శివ ధనుస్సు చూప”మంటాడు విశ్వామిత్రుడు. ఆయన దానిని చూపించినపుడు వేరేమీ చెప్పకుండా చూడమంటే చూసి ఎక్కుపెట్ట మన్నపుడు దానిని అవలీలగా ఎత్తి ఎక్కు పెట్ట ప్రయత్నించుతాడు.

తక్కినదితరువాత........



శ్రీరామ రామ రామేతి -- 3

దానిని పరమాత్మ అంటే శివకేశావాభేదము కలిగినవాడు ఎత్త గలడు లేకుంటే జగన్మాత ఎత్తగలదు. మహేశ్వరుని ధనుస్సు నెత్తుట, అది ఎవరికీ సాధ్యము ? శక్తి స్వరూపిణి యైన జానకికి పరమాత్మ యైన రామునికి, స్వంతదారుడైన శివునికి. అసలు రాముడు శివుడు అంతా పరమాత్మే. రాముడు కళ్యాణ గుణ ధాముడు శివుడు ఎవరు? కళ్యాణ స్వరూపుడు. అంతా ఒకటే. రాముడు విష్ణువు అవతారమని మనకు తెలుసు, శివాయ విష్ణు రూపాయ అని కూడా మనకు తెలుసు. కావున ఆ ధనుస్సును రాముడు అవలీలగా ఎత్తగలడని మనకు ముందే తెలుసు.

అది సీతా కల్యాణము సీతారామ కల్యాణమునకన్నా సీతా కళ్యాణమనుట సముచితము. ఎందుకంటే

పతిం విశ్వశ్వాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పారాయణం

ఆ పరమాత్మయే విశ్వపతి. ఆయనే విశ్వాత్మ. ఇక సృష్టి లోని చరాచర జీవరాశి యంతా స్త్రీ రూపమే! ఇందులో ఆడ మగ తేడా లేదు. అంటే ఆయన బ్రహ్మము. మనము జీవుడు. జీవబ్రహ్మైక్యమే కల్యాణము.

రాముడు కేవలము నరునిగా భాసిల్లితే తప్ప అసలుకు నరజాతి ప్రతిష్ఠ నిలబడదు. అందుకే ఈ తంతు అంతా. విశ్వామిత్రుని పాత్ర సీతా కళ్యాణముతో ముగుస్తుంది. ఆయన నేరుగా రామునికి సీతను పెళ్లియాడుటకు గానూ విల్లునెక్కుపెట్టమంటే తండ్రి యనుమతి కావాలంటాడు. అందుకే ఈ పనిని ఎంతో గుంభనముగా జరిపినాడు. శివుని విల్లు విరిచిన తరువాత వీర్య శుల్క యైన సీతను పెళ్లి యాడమని జనకుడు అంటే తండ్రి యనుమతి కావాలంటాడు రాముడు.

సీత అయోనిజ. అందువల్ల జనకునికీ అయోమయము. అందుకే ఆయన శివధనుస్సును ఎక్కు పెట్టిన వానికి సీతను వధువుగా ఇస్తాననుట.

ఆశరీరవాణి నాగేటిచాలు తగిలి పైకి లేచిన ఈవిడ నీ యొక్క ధర్మ సుత

అని చెప్పింది. ఆమె ఏ పెట్టెలో నుండీనో బయటకు రాలేదు. అశరీర వాణి

తెలుపుటచే ఆమె ఆ తండ్రికి కూతురు అయినది. కన్న తండ్రి కి కూతురు, మేనమామకు కోడలు ఎడమ తొడ పై కూర్చునుట శాస్త్ర సమ్మతము. ఎడమ తొడపై మాత్రము భార్యకు తప్ప ఎవరికీ అధికారము ఉండదు. రామ కర్ణామృతము లో శంకరులవారు ఈ విషయాన్నే శ్లోక రూపములో ప్రస్ఫుటము చేస్తారు. ఆవిధముగా లోక కళ్యాణమునకై సీతా కల్యాణము జరిగినది. ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ అప్పటి మిధిలా నగరమని చెబుతారు.

మరి దానికి షరతేమిటి.

మహేశ్వరుని ధనుస్సు నెత్తుట. అది ఎవరికీ సాధ్యము ? శక్తి స్వరూపిణి యైన జానకికి పరమాత్మ యైన రామునికి, స్వంతదారుడైన శివునికి. అసలు రాముడు శివుడు అంతా పరమాత్మే. రాముడు కళ్యాణ గుణ ధాముడు శివుడు ఎవరు? కళ్యాణ స్వరూపుడు. అంతా ఒకటే.

సీతా మహాసాధ్వి వాల్మీకి మహర్షితో ధర్మ స్వరూపుడైన తన భర్త చరిత్ర చెప్పించి వారిని వర్తమానమున రుజువర్తనులైన బాలకులుగా భవిష్యత్తున

అత్యుత్తమమైన పాలకులుగా తీర్చి దిద్దింది.

సీతా రాములు అభిన్న మూర్తులు. సీత సర్వదా నిత్యానపాయిని( = కలకాలమూ తోడుగా వుండేది)

రామాయణమును అంతరార్థముతో పరిశీలించక పోతే అంతా రాద్ధాంతమే అనిపిస్తుంది.

శ్రీరాముడు పునర్వసు నాలుగవ పాదము శ్రీ రామ చంద్రునిది. అది కటక లేక కర్కాటక లగ్నమౌతుంది. ఆయన జన్మ సమయమున బృహస్పతి చంద్రునితో కలిసి యుండినాడు. ఆ సమయములో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండుట జరిగింది. శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. అంటే ఆయనది పునర్వసు నాలుగవ పాదము.

60 సంవత్సరముల కాలము

చారిత్రక ఆధారాలను బట్టి భద్రాచలంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు లో ఈ పట్టాభిషేకం నిర్వహించినట్లు చెబుతున్నారు. పంతొమ్మిది వందల ఎనబై ఏడులో, అంటే ప్రభవాది 60 సంవత్సరములు గడిచిన పిదప, ఈ మహత్కార్యాన్ని అప్పటి నిర్వాహకులు చేపట్టినారు. మళ్ళీ ఆ వేడులకు రావాలంటే అరవై సంవత్సరాలు కావాలి. అందుకని మహా పండితులు, అర్చకులు అంతా కలిసి ఆలోచించి పన్నెండు ఏళ్ళకు ఒకసారి పుష్కర సామ్రాజ్య పటాభిషేకం చేయాలని నిర్ణయించి ఆ విధముగా జరుపు చున్నారు. ఈ నిర్ణయం తరువాత పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం తొలిసారిగా పంతొమ్మిది వందల తోబైతోమ్మిది లో జరిగింది. పన్నెండేళ్ళ అనంతరం మళ్ళీ 2011 న, నవమి నాడు కల్యాణం అయిన తరువాత దశమి నాడు ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపినారు. మళ్ళీ 2023 లో జరుపుతారు.

రాముడు పుట్టిన తిథి నవమియైనా కల్యాణము కూడా అదే రోజు చేయుట అనూచానముగా వస్తూవున్న ఆచారము. ఆ రోజు సీతమ్మకు అత్త గారింటి తాళి అమ్మ గారింటి తాళి కాకుండా రామదాసుడైన భక్తాగ్రేసరుడు గోపన్న చేయించిన తాళి కూడా మూడవదిగా కట్టుట భద్రాచలమున ఆచారము.

క్రొత్త దంపతులను సీతా రాములవలె ఉండమని ఆశీర్వదిస్తారు కదా మరి వారి మాదిరి కష్టాలు పడమని అర్థమా అని అడిగే వారు గూడా ఉండవచ్చును. వారు అడవులకు పోయినా, అన్యుల వద్ద ఉండవలసి వచ్చినా అన్యోన్యత చెక్కు చెదరలేదు. గర్భవతి యైన సీతను వాల్మీకి ఋష్యాశ్రమము చేర్చినా సీతకు రామునిపై గల అవ్యాజ ప్రేమ చెక్కు చెదరలేదు. అందుకే ఆమె తన పుత్రులకు ఉదాత్తమైన రామ కథను వాల్మీకి చేత నేర్పించింది.

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

స్వస్తి.

Wednesday, 14 December 2022

వినాశ కాలే విపరీత బుద్ధి

https://cherukuramamohanrao.blogspot.com/2022/12/blog-post_14.html

పైన తెలిపిన ఈ మాటను పదే పదే వింటూ ఉంటాము. కానీ ఈ అర్ధపాదము యొక్క పూర్తి పాఠము మనలో చాలామందికి తెలియకపోవచ్చును. రామాయణములో ఈ మాటను అరణ్య కాండలో వాల్మీకి తన అభిప్రాయముగా రామానుజుడగు లక్ష్మణునితో చెప్పించుతాడు.

भूतपूर्वं कदापि वार्ता हेम्नः कुरज्ञ्गः कदापि दृष्टः         

तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीत बुद्धिः ।।

 న భూతపూర్వం న కదాపి వార్తా హేమ్నః కురఙ్గః న కదాపి దృష్టః ।

తథాపి తృష్ణా రఘునన్దనస్య వినాశకాలే విపరీతబుద్ధిః ॥

న భూత పూర్వం = ఇంతకు మునుపెన్నడూ జరగలేదు, న కదా అపి వార్తా = ఎప్పుడూ కూడా వినలేదు, హేమ్నః = బంగారపు, కురఙ్గః = లేడి, న కదా అపి దృష్టః = ఎప్పుడూ కూడా చూడ లేదు,

తథా అపి = అయినప్పటికీ,  తృష్ణా = కోరికచేత, రఘునన్దనస్య = రఘునందనుడికి – రాముడికి, వినాశకాలే = వినాశన కాలమందు, విపరీత బుద్ధిః = విపరీతమైన ఆలోచన పుట్టింది,

ప్రత్యామ్నాయ శ్లోకం, అదే అర్థముతో

निर्मितः केन दृष्टपूर्वः श्रूयते हेममयः कुरङ्गः

तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः

న నిర్మితః కేన న దృష్టపూర్వః న శ్రూయతే హేమమయః కురంగః ।

తథాపి తృష్ణా రఘునన్దనస్య వినాశకాలే విపరీతబుద్ధిః ॥

బంగారు లేడి ఇంతకు మునుపెన్నడూ లేదు, ఎప్పుడూ కూడా వినలేదు, ఎప్పుడూ చూడను కూడా లేదు. అయినప్పటికీ దానిని పొందాలనే కాంక్ష, భార్య అడిగినదానిని తీసుకొచ్చి ఇవ్వాలనే తపన, ఆమెని సంతృప్తి పరచాలనే కోరిక, శ్రీ రామచంద్రుని అంతటి వానిని, రాజ్యాధికారాన్ని చేపట్టి ఉండి ఉండవలసిన వ్యక్తిని, వశిష్ఠ విశ్వామిత్రుల వంటి మహర్షుల వద్ద విద్యనభ్యసించిన వానిని అజ్ఞానాంధకారం చుట్టి ముట్టి వేసింది. తన స్వాభావికమైన తెలివితేటలని ఉపయోగం లేకుండా చేసింది.

శ్రీ రాముని అంతటి వానిని, భార్య అడిగిన దానిని తీసుకు వచ్చి ఇచ్చి ఆమెని సంతృప్తి పరచాలనే కోరిక లేదా ఆశ అనే ఒక్క విషయం ఆతని విచక్షణని కోల్పోయేట్టుగా చేసింది.

బంగరు లేడి మానసికమగు సుందర, సుఖద సుమధుర, ఆనంద సంతోషముల ప్రతీక. బంగారు మానవుల ధనసంపదల ప్రతీక. నిజానికి ధన సంపదల్సయండు సంతోషము మృగ్యము. అందకే కనక మృగము భూమిపై మనకు కనిపించదు.

ఇది సీతా మాతకు కూడా వర్తించుతుంది. బహుశ సీతా రాములకు రావణుని వినాశమునకే ఈ విపరీత బుద్ధి కల్గినదేమో! అసలు ఈ వాక్యము వాలికి కూడా అన్వయమౌతుంది. కైకేయికి కూడా అన్వయమౌతుంది. దశరథుని పోగొట్టుకొన్నది కదా!

అంతటి వారికే తప్పలేదనే విషయం వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో చెప్పిన ఈ శ్లోకంలోని ఈ వాక్యం వినాశ కాలే విపరీత బుద్ధిః అనేది లోకంలో ఒక నానుడిగా మారింది.

స్వస్తి.