Tuesday, 1 December 2015

MVA KIRAN ABOUT GAYATRI

MVA KIRAN ABOUT GAYATRI

ప్ర? గాయత్రి అనునది ఛందస్సు మాత్రమె దానికి ఇంత ప్రాముఖ్యత ఆపాదిన్చవద్దు అని ఒకాయన మనవి చేసారు. 

జ|| అయ్యా !! మా ఇంటి పక్కన అమ్మాయి పేరు గాయత్రి కాబట్టి గాయత్రీ అనునది కేవలం ఒక అమ్మాయి పేరు, దైవం కాదు అన్నట్టుంది. వున్న ఎన్నో ఛందస్సులలో గాయత్రి ఛందస్సు ఒకటి. ఇదే గొప్ప ఛందస్సాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి వున్నాడు. అయినంత మాత్రాన గాయత్రి అంటే ఛందస్సు మాత్రమె అనుకోవడం అసంపూర్ణం. అందుకోసం నేడు గాయత్రి మంత్రం, ఆ మంత్రధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించుకుందాం !! 

“మననాత్ త్రాయతే ఇతి మంత్రం:“ అంటే మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును. 
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి". 
'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' - సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది. 
'గయాన్ త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). 
ప్రాణములను ఉద్ధరించే సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. 
శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. 
ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం. 
గాయత్రియే ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత 
సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. 
గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి 24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి. 
* గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం * 
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది. 

సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు. 
గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం. 
1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు. 
2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు. 
3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము. 
4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే. 
5. 24 కేశవ నామాలు 
6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు 
7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం” 
8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు. 
9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. మీకోసం ఈ లంకె ఇవ్వబడింది . దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు 
http://www.telugubhakti.com/telugupages/Vishnu/SreeRama/GayatriRamayan.htm 
10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు. 
11. మన వేనుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు. 

“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

No comments:

Post a Comment