అమాయక ఏకాదశి
అమాయక ఏకాదశి ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారేమో, నా ఉద్దేశ్యము అమాయకుడు పాటించిన ఏకాదశి, అని అన్వయించుకొండి. యీతని కథ ఒకసారయినా చదవండి.
అనగా అనగా ఒక గ్రామము. ఆ గ్రామములో ఒక ఉమ్మడి
కుటుంబము. ఆ ఉమ్మడి కుటుంబము యొక్క సభ్యుడే మన కథా నాయకుడు. పేరు హరిదాసు.
ఇంటికి సంబంధించిన అతిచిన్న పనిని ఆయఇంటి ఒక పసిబాలుడైనా
చేస్తాడు కానీ మన హరిదాసు ఆమాత్రము పనికూడా చేయడు. చదు వుకోకున్నా తోచిన మాటలు పాటలు
పాటలున జేసి సంగీతము నేర్వకున్నా తోచిన రాగాలు కట్టి ఆ విష్ణుని గూర్చి పాడుట
మాత్రమే ఆతడు చేసే పని. ఆతనితో విసిగివేసారిన ఇంటి పెద్దలు ఆతనిని ఏదయినా ఆశ్రమము
చేరి వాళ్ళు పెట్టేది తింటూ తనదైన రీతిలో కాలము గడుపుకొమ్మన్నారు. చేసేది లేక
ఆశ్రమాల వేటలో పడి నాడు మన హరిదాసు.
చివరకు హరిదాసుకు నచ్చిన ఒక ఆశ్రమము కనిపించింది.
స్వతహాగా తిండిపోతయిన అతడు ఆ ఆశ్రమములో ఉండే గురుశిష్యులు పుష్టిగా ఉండటం చూసి అదే
తనకు సరియయిన గూడని నిర్ధారించుకోన్నాడు. ఎట్లయితేనేం గురువు కరుణతో గూటిలో చేరిపోయినాడు.
చేరిన రోజు శుక్ల ద్వాదశి. షడ్రసోపేతమైన భోజనము చేసినాడు.
ఇంటికంటే ఇదే మేలనుకొన్నాడు. ,కళ్ళు మూసి తెరచే ,లోపలే 15 రోజులు గడచిపోయినాయి.
బహు,ళ ఏకాదశి వచ్చింది. పెట్టిందితినడము, గురుబోధ వినడము, నోటికి వచ్చిన పాట అనడముతో
అప్పటివరకూ జరిగిపోయింది. హరిదాసు, లేచినాడు కానీ పోయిలో పోయిలో పిల్లి,లేవ లేదు.
హరిదాసు కడుపును ఆకలి పెనుభూతమై ఆవరించింది. దాసు గురువువద్దకు జేరి కారణమడిగినాడు. ఎకాదశి ఉపావాస దినము కాబట్టి వంటవండరు
ఉండదు అన్నాడు ఆయన. అది లేకుండా నేనుండలేను
అన్నాడు దాసు. దయ దలచిన గురువు ఒక మనిషికి తగిన
బియ్యము పప్పు ఉప్పు మొదలైనవి ఇవ్వమని ఖాద్యసామాగ్రి సంరక్షకునికి చెప్పి ఇప్పించి ఆశ్రమమునకు కొంత దూరములో ఉన్న
మైదానమునకు పోయి వండుకొని తినమన్నాడు.
దాసు గురువు చెప్పిన విధముగానే, మొదటి సారి చేస్తున్నా , కష్టపడి వంట చేసినాడు. అన్నము
అడుగు అంటింది అంటే మాడింది. పప్పు కూరలలో ఉప్పు కారము సరిగా వేసియుండడు. వంట
ముగిసినవెంటనే దేవుడు గుర్తుకొచ్చినాడు. పాటను కూడా ఈవిధముగా వెంటనే అందుకొన్నాడు:
నీల గగన
ఘన శ్యామా, వినుమా
మనసా మ్రొక్కితి కనుమా
నా నైవేద్యము గొనుమా
దరిని జేరి ఇక తినుమా
భక్తిపారవశ్యముతో హరిదాసు పాడిన ఆ పాటకు
సమ్మోహితుడై ఆరగింప వచ్చినాడు నిజంగానే ఆ పరమాత్ముడు.
హరిదాసు ఆవిధముగా ఊహించుకోలేదు. రోజూ ఆశ్రమములో
తాను పాడిన పాటకు బదులుగా ఏవో మంత్రాలూ
చెప్పి దేవునికి,వండిన పదార్థములు చూపి తామే
తింటారు. తనకు మంత్రాలు రావు కాబట్టి పాట పాడి ముగించి తిందామనుకొన్నాడు. కానీ
ఇక్కడ దేవుడే వచ్చి అంతా తిని తిని బాగుంది అన్న ఖితాబునిచ్చి వెళ్ళిపోయినాడు.
పాపం దాసుకు విధిలేని పరిస్థితిలో అది బలవంతపు ఉపవాసము అయ్యింది. ఈడుపు కాళ్ళు ఏడుపు ముఖంతో ఆశ్రమము
చేరుకొన్నాడు దాసు. జరిగినది గురువుతో చెప్పి తలా మోకాళ్ళకు ఆనించి
కూర్చుండిపోయినాడు ఆరోజుకు. గురువు కూడా, వీనికి
ఇచ్చింది చాలక ఈమాదిరి చెబుతున్నాడని తలచి
ఊరకుండిపోయినాడు.
మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఈసారి హరిదాసు
ఇద్దరికి తగినంత ఇవ్వమన్నాడు. గురువు ఎందుకు అంటే నాకూ హరికి అని సమాధానము
చెప్పినాడు. గురువు వీనికి ఇచ్చిన స్వయంపాకము
చాలనందువల్ల అడుగుతున్నాడని తలచి
ఆవిధముగానే ఇచ్చిపంపినాడు. దాసు యధావిధిగా వంటచేసి పాట అందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, వినుమా
మనసా మ్రొక్కితి కనుమా
నా నైవేద్యము గొనుమా
దరిని జేరి ఇక తినుమా
ఈసారి విష్ణువు లక్ష్మీసమేతుడై వచ్చి చేసినది
ఆరగించిపోయినాడు. మనవానికి ఈసారీ కడుపు ఖాళీ అయిపోయింది . వెళ్లి విషయము
గురువుతోచెప్పి కాళ్ళు కడుపులు పెట్టుకొని పడుకొన్నాడు. గురువుకు సందేహమైతే
కలిగింది కానీ మిన్నకున్నాడు.
మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఈసారి హరిదాసు
ముగ్గురికి తగినంత ఇవ్వమన్నాడు. గురువు ఎందుకు అంటే నాకూ హరికి లక్ష్మికి అని
సమాధానము చెప్పినాడు. గురువుకు సందేహమైతే ఉంది కానీ చూద్దాము ఈసారి ఏమంటాడో వెళ్లివచ్చిన తరువాత
అని తలచి ఆవిధముగానే ఇచ్చిపంపినాడు. దాసు యధావిధిగా
వంటచేసి పాట అందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, ఇదిగో
నా
నైవేద్యము గొనుమా
రమా సహితముగ జనుమా
ఈ నైవేద్యము తినుమా
ఈసారి విష్ణువు లక్ష్మీసమేతుడై గరుత్మంతునిపై
వచ్చి చేసినది ఆరగించిపోయినాడు. మనవానికి ఈసారీ కడుపు ఖాళీ అయిపోయింది . వెళ్లి
విషయము గురువుతోచెప్పి కళ్ళు మూసుకొని
పడుకొన్నాడు. గురువుకు సందేహము
ప్రబలమయ్యింది.
మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఈసారి దాసు ఐదుగురికి
తగినంత ఇవ్వమన్నాడు. గురువు ఎందుకు అంటే నాకూ హరికి లక్ష్మికి గరుత్మంతునికి
కాకుండా ఇంకా ఎవరో ఒక క్రొత్త వ్యక్తినిపిలుచుక వస్తాడు అని సమాధానము చెప్పినాడు.
గురువుకు సందేహము ప్రబలమయ్యింది కానీ
ఈఒక్కసారి చూద్దాము ఏమంటాడో వెళ్లివచ్చిన తరువాత అని తలచి, అడిగిన విధముగానే ఇచ్చిపంపినాడు. దాసు
యధావిధిగా వంటచేసి పాట అందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, వినుమా
నా
నైవేద్యము గొనుమా
గరుడ సేవగొని లక్ష్మి తోడ నిటు జనుమా
నైవేద్యము నిక ఆరగించుమాa
ఈసారి విష్ణువు లక్ష్మీసమేతుడై గరుత్మంతునిపై
వస్తూ నారద తుంబురలతో సహావచ్చినాడు. చేసినది మొత్తం ఆరగించిపోయినాడు. మనవానికి
ఈసారీ కూడా మనవాని నోటిలో వెలక్కాయ పడింది. వెళ్లి విషయము గురువుతోచెప్పి కళ్ళు
మూసుకొని ఒక మూలకు కూర్చున్నాడు. గురువు
ఈసారి సందేహము తీర్చుకొని తీరవలెనని నిశ్చయించుకున్నాడు.
మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఈసారి దాసు గురువు వద్దకువెళ్ళి
“మొత్తము ఉన్న తిండి సామాగ్రి అంతా ఇవ్వమన్నాడు. గరువు మొదలే హరిదాసును పరీక్షింప
దలచినాడు కాబట్టి సామాగ్రి అంతా ఇచ్చి అతనిని పంపి తాను ముఖ్యమైన శంష్యులను
తీసుకొని నెమ్మదిగా బయలుదేరినాడు.
తాను చేరవలసిన స్థలము చేరుకొని వండకుండానే
విష్ణువును ఒకేసారి మొత్తము పరివారముతో రమ్మని పాటనందుకొన్నాడు.
నీల గగన ఘన శ్యామా, వినుమా
నా
నైవేద్యము గొనుమా
సపరివారముగ జనుమా
వంట చేసుకొని తినుమా
దాసు కోరినట్లే, ఆశ్చర్యమును అణచుకొని పరివారముతో
వచ్చినాడు. రండురండని దాసు పరివారసమేతుడైన విష్ణువునాహ్వానించి, నేను ఒక్కడినీ
మీకు వండి వడ్డించలేను. మీరే ఉన్న వస్తువులతో కావలసినది చేసుకొని, మీరు తిని నాకూ
ఇంత పెట్టండి అన్నాడు.
మహావిష్ణువు దాసు యొక్క అమలిన భక్తికి అచ్చరువంది
తనపరివారముతో తగినవిధముగా నడచుకొని తరువాతి రోజు సూర్యోదయమునకల్లావంట ముగిసే
విధముగా చూడమని చెప్పి లక్ష్మీ సహితుడై తాను హరిదాసుతో కూర్చొని ఎన్నో పాటలు పాడించుకొన్నాడు.
తానెన్నో కబుర్లు చెబుతూ తెల్లవారజేసినాడు.
తట్లోహరిదాసుకు అప్పటికి కాని అర్థము కాలేదు,
తనతో ఏకాదశి అంతా పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగనీకుండా మహావిష్ణువు జాగారము
చేయించినాడని.తాను కాల కృత్యములను తీర్చుకొని విష్ణువు ప్రక్కనే వేసిన అరటియాకు
చెంత కూర్చుని భోజనమునకు సిద్ధమయినాడు. పరివార సభ్యులు వడ్డించగా సుష్టుగ
తిన్నాడు.
ఇదంతా ముందురోజే వచ్చి శిష్యగణముతో రహస్యముగా కూర్చున్న
గురువుకు, దాసు పాటలు పాడింది, భోజనము చేసిందీ తప్ప ఏమీ తెలియలేదు.
శిష్యుని తాదాత్మ్యమును తదేక భక్తిని, తన్మయతను,
అన్నింటినీ మించి ఆతని అమాయక అచంచల భక్తిని చూసి అతని ముందు మోకరిల్లినాడు.
ఆశ్చర్యంగా “నీవు వంట చేయకుండానే నీ విస్తట్లో షడ్రసోపేతమగు ఆహారము పరాత్పరుని
అనుగ్రహము లేకుండా చేరదు. పైగా ఏకాదశి నాడు తిండి నిద్రలేకండా హరిగుణగానము చేస్తూ
ఉండిపోయినావు. నాకు అర్థము కానినిన్ను ది ఏమిటంటే నీవు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు
వినిపించింది. ఎవరితోన్నది నాకు అర్థముకాలేదు. చెప్పగలవా” అని అడిగినాడు. అప్పుడు
హరిదాసు తన ప్రక్కన చూపించి ఇదిగో లక్ష్మీ సమేతుడౌ ఈశ్రీహరి సన్నిధిలోనే మాటలతో
పాటలతో గడిపినాను” అన్నాడు.
అప్పుడు గురువు “నేనెంత మంద భాగ్యుడను, ఒక మహా
భక్తుని నాకు శిష్యునిగా చేసుకొన్నానే, నా పూజలో ఎన్నెన్ని లోపములుండినాయో ఏమో
అందుకే ఎదుట ఉండికూడా ఆ లక్ష్మీనారాయణుడు నకగుపించలేదు. అప్పుడిక ఈ కన్నులతో
నాకేమి పని” అని కన్నులు పొడుచుకోబోయినాడు. అప్పుడు హరిదాసు ఆయనను ఆపి పరమాతముని
సతీసమేతముగా కనిపింప వేడుకొన్నాడు. అప్పుడు గురువు “స్వామీ నిన్ను చూచిన కన్నులతో
ఇతరము చూడను, నీలో ఐక్యము గావించుకో” అని అభ్యర్థించినాడు. భక్త జన వాంఛిత ఫల
దాతయైన పరాత్పరుడు తథాస్తు అని హరిదాసు వంక తిరిగి “నీవు నీ అచంచల భక్తి భావమును
నీ గీతముల ద్వారా లోకమును ప్రభావితము చేసి ధర్మనిరతులుగా పరివర్తనము గావించి తగిన
సమయమున నా సాయుజ్యము చేరెదవు” అని వరమొసంగి మహాలక్ష్మీ యుతుడై పరివార సహితముగా
అంతర్ధానమందినాడు.
స్వస్తి.
No comments:
Post a Comment