"దండం దశగుణం
భవేత్" అన్న మాటను వింటూ ఉంటాము. దండము అన్నమాటను పరిశీలించితే
శబ్ద రత్నాకరములో మనము 18 అర్థములను చూడవచ్చును.
అవి ఈ దిగువన పొందుపరచుచున్నాను.
1.
నమస్కారము, 2. రాజ దండన అనగా
రాజు విధించు శిక్ష, 3. చెట్టు బోదె, 4. కాడ, 5. కవ్వము, 6. డోలు మొదలగునవి వాయించు కొడుపు, 7.
దండు, 8. అడ్డముగా తీర్చిన వ్యూహము, 9.
గర్వము, 10. పీడనము, 11. వధము(చంపుట), 12. బార, 13. గుఱ్ఱము, 14. తోక తెగిన ఎద్దు,
15. హారమునందలి పేట, 16. కప్పము,
17. ౙత, 18. సమూహము.
ఇందులో అన్నీ లుప్తమయి రెండు మిగిలినాయి. 1.
దుడ్డుకర్ర 2. నమస్కారము. పదమును దానికి
ఉన్న వివిధమగు అర్థములలో వాడుతూ వుంటే అటు పదములూ ఇటు అర్థములూ జీవించగలుగుతాయి.
అదేవిధముగా అక్షరములు కూడా! ఒక్క ౘ, ౙ లను అక్షరామాలనుండి వెలి వేయుట వల్ల ఎంత అనర్థమో
చూడండి. నేడు నాకు ‘ౘాలు’ అని ఒక స్త్రీ పలుకవలసి వస్తే ‘నా కుచాలు’ అని
పలుకుతూవుంది. వినుటకు బాధాకరముగా లేదా! గౙ్జలు
( రెండు తొడల సందు). ‘నా గౙ్జల్లో గడ్డ కట్టింది’
అని చెప్పవలసిన చోట ‘నా గజ్జల్లో గడ్డ కట్టింది’ అని చెప్పుట వెకిలిగా లేదా! ఒక్కసారి
ఆలోచించండి. మన భాషకు పునర్వైభవము తెచ్చుటకు నడుం కట్టండి.
ఇక మిగిలిన రెండులో, నమస్కారము అన్న
అర్థమునకుగల 10 లాభాములేవో నేను వ్రాసిన ఈ క్రింది పద్యములో చూద్దాము.
దండము గౌరవించుటకు, దండము భక్తికి శక్తి ముక్తికిన్
దండము కోర్కె
దెల్పుటకు, దండము భాషణమాదియందునన్
దండము ధన్యవాదమున,
దండము విన్నప కార్యమందునన్
దండము పరిచయమ్ములను దాస్యత
యందున కూర్చు మాన్యతన్
దండము పెట్టుట వలనకూడా,
ఈవిధముగా 10 విధముల మాన్యత పెంచుతుందని మనకు అర్థమౌతూవుంది.
ఇక దండము అనగా
దుడ్డుకర్ర అన్న అర్థములో పై నానుడి యొక్క గొప్పదనము ఈ చాటు శ్లోకము ద్వారా తెలుసుకొందాము.
విశ్వామిత్రా హి పశుషు కర్దమేషు జలేషు చ l
అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం
భవేత్ ll
దీనిలోని అర్థమును గమనించండి: ఈ శ్లోకములోని
ఎత్తుగడలోనే ఒక విశేషము ఉన్నది. ‘విశ్వామిత్రా’ తో శ్లోకము ప్రారంభమౌతుంది.
మనకు వెంటనే విశ్వామిత్రునికీ దుడ్డుకర్రకు సంబంధము ఎట్లు కుదురుతుంది అని
సందేహము. ఆ ఉత్సుకతతో చదువుట ప్రారంభించుతాము. కవి యొక్క చమత్కారము అక్కడ మనకు
తెలియవస్తుంది. ప్రపంచములోని ఏ భాషకు లేని ప్రత్యేకత
సంస్కృతానికి ఉన్నది. ఈ భాషలో ఒకే అక్షరమునకు కూడా ఒక అర్థము ఉంటుంది. ఆ విధముగా
ఎన్ని అక్షరాలు ఉంటే అవి అన్నియు క్రోఢీకరించి ఏకాక్షర నిఘంటువునే ప్రసాదించినారు
మన పూర్వులు. అవధాన ప్రక్రియకు అందునా ‘నిషిద్ధాక్షరి’లో ఈ నిఘంటువు యొక్క ఉపయోగము
ఎంతగానో ఉంటుంది. ఈ నిఘంటువు సహాయముతో, ఇక ఒకసారి ఈ శ్లోకము యొక్క ప్రతిపదార్థమును
చూద్దాము.
వి - పక్షులు,
శ్వా - కుక్కలు,
అమిత్ర - మిత్రులుకానివారు(శత్రువులు),
అహి - పాములు,
పశు - పశువులు,
కర్దమేషు - బురదలో,
జలేషు - నీటిలో,
అంధే - గుడ్డితనంలో,
తమసి - చీకటిలో,
వార్ధక్యే - ముసలితనంలో
దండం – కర్ర ముఖ్యముగా దుడ్డుకర్ర
దశగుణం - 10 విధములగు ప్రయోజనములను భవేత్
- కలిగించుతుంది.
దీని భావము ఏమిటి అంటే:-
పులుగుల కుక్కల శత్రుల
పలు పాముల పసుల తరుమ పంకము నీటన్
తలువగ కృష్ణచరాంధక
పలితాళికి దండమగును బంధువు రామా!
కర్ర పక్షులను, కుక్కలను,
శత్రువులను, పాములను, పశువులను
అదుపు చేయడానికి, బురదలోను, నీటిలోను,
గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను 10 విధముల తోడుగా ఉంటుంది.ఇటువంటి శ్లోకములు పద్యములు, వివరణలు
ఉత్సాహముతో చదువుటవల్ల మన తెలుగు, సంస్కృతముల గొప్పదనము తెలుసుకోనుటయే గాక
లోకానికి తెలుపగలుగుతాము.
స్వస్తి.
దండం దశ గుణం భవేత్ లో దండం అన్న పదానికి గల పదునెనిమిది అర్థములను తెలిపి,అందు ప్రస్తుతము లోక వ్యవహారములో ఉన్న రెండు అర్థములను తెలుపడం...
ReplyDeleteచాలా చాలా బాగుందండీ..
అటుపిమ్మట దండం అంటే దుడ్డుకర్ర అని విశ్వామిత్ర అనే పదానికి దండానికి గల పది అన్వయములను తెలుపుతూ,
ఒక పద్యము,ఒక సంస్కృత శ్లోకమును ఉటంకిస్తూ చాలా చాలా అద్భుతమైన,యెంతో జ్ఞాన దాయకమైన సందేశమును అందించేరండీ...
ఇది ప్రతి ఒక్కరూ చదువ వలసిన సందేశము.
మీ బహువిధమైన పరిజ్ఞానము నాకు, జ్ఞాన వితరణకూ అనేక అభినందనలండీ రామ మోహన రావు గారూ.