Tuesday, 7 January 2014

సుగంధి -- పంచ చామరము 

ఈ దినము 'సుగంధి' ని గూర్చి 4 మాటలు .
ఇందులో ర, జ, ర, జ, ర అన్న గణములుంటాయి.

UIU  IUI UIU  IUI  UIU

9వ అక్షరము యతి . ప్రాసనియమము కలదు.

ఈ ఛందస్సును పరమేశ్వరార్పితముగా అతి సులభమైన విధముగా వ్రాసినాను. 
చిత్తగించగలరు 

నీలకంఠ నీలకంఠ నీలకంఠ పాహిమాం 
ఫాలనేత్ర ఫాలనేత్ర ఫాలనేత్ర రక్షమాం 
కాలకాల కాలకాల కాలకాల దేహిమాం 
శూలధారి  శూలధారి శూలపాణి ధారిణం

భావము సులభ గ్రాహ్యము.

పై పద్యమునకు దాదాపుగా విలోమము 'పంచ చామర' మనే ఈ పద్యము

ఈ 'పంచ చామరమునకు' 'జ ర జ ర జ గు' అనే గణాలుంటాయి.  10 వ అక్షరము యతి. ప్రాస కలదు.

ఈ పద్యాన్ని వినాయకునకు అర్పించుచున్నాను. పద్యాన్ని చిత్తగించండి.ఇందులో చిట్టా చివరి అక్షరము 'U'. నేను 'మౌ' మూడు పాదాలలో వచ్చేటట్లు వ్రాసినాను . ప్రయత్నిచేవారు ప్రతి పాదములో వేరే వేరే గురువులను వాడుకొనవచ్చును.

నికాయమందు నివ్వటిల్ల నీదు కాంతి భాగ్యమౌ
ఆకాలమే సకాలమౌ ఘనాపదల్ అయోగమౌ
ప్రకాశమౌ ప్రగాఢ ప్రేమ ప్రాప్తి పొంద సాధ్యమౌ
నికారకారకావిదార నీలలోహితాత్మజా

నికాయం=ఇల్లు ;  నివ్వటిల్లు=వ్యాపించు, నిలుచు, వుండు
యోగము అంటే కూడిక లేక కలయిక
అయోగమౌ = కూడవు,చేరావు, కలియవు
నికార కారక=మోసగాళ్ళు, మనలను మోసగించే తలపులు, మాయామోహములు
విదార=నసింప జేయునట్టి
నీలలోహితాత్మజా = శివ మానస పుత్రుడా (విఘ్నేశ్వరుడా )
మాయమోహముల నణచివేసే ఓ శివకుమారా విఘ్నేశ్వరా! నాశరీరములో అంటే నాలో, నా మనస్సులో, నీవుండగా నామనసంతా జ్ఞానకాంతియనే భాగ్యముతో నిండిపోతుంది, నేను ఏపని చేయుటకు గూడా అకాలమన్నది వుండదు. ఎంతగొప్ప ఆపదలైనా నన్నంటవు.
చిక్కటి వెలుగుల చక్కటి ప్రేమను పొంద వీలౌతుంది.


No comments:

Post a Comment