Sunday, 14 January 2018

శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే

శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.
ఆ పండితునకు  తెలుసు , తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని. శివకేశావాభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని.
 ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం  వ్రాసి ఇచ్చినాడు. ఆ వ్యక్తి చదివి నివ్వెరపోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది.
గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో నః॥
ఆశ్చర్య పోయాడు చదవగానే.  ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి.
గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.
నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.
కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.
శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,
అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ,
రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.
మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.
అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే!" అని చెప్పి
 అతనికి దాని నర్తమును ఈ విధముగా వివరించినాడు. " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును,
 నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోన లేదు. న+ఆది, అంటే మొదటి అక్షరము తీసి చాడువుకోమ్మన్నాను,
అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."
గవీశపాత్రః ... లో గ తీసివేస్తే  వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,
  గరుడు ని చేతచేత గౌరవింపబడువాడు, అంటే గరుడుని వాహనుడైన విష్ణువు.
నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే  గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము   చేసిన వాడు, విష్ణువు.
కుమారతాతః .... 'కు' తీసివేస్తే మారతాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)
శశిఖండ మౌళి: ... '' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలిపింఛము ధరించిన వాడు కృష్ణుడు, అనగా  విష్ణువు.
లంకేశ సంపూజిత పాద పద్మ: మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .
 క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు  పూజించు పాదపద్మములు కలవాడు,  విష్ణువు.
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ,
బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .
ఇక '' తీసివేస్తే  రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .
అడిగినతడు శిగ్గుతో తలవంచుకొన్నాడు.
గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రాసాయనికాది ఏ శాస్త్రమునకైనా మహనీయులు వ్రాసిన
 రామాయణ భారత భాగవత రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము.
ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆభాషకు అనుంగు బిడ్డ అయిన ఆంధ్రము నేర్పించండి.
ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది.
 స్వస్తి

4 comments: